కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

యూదా మతవాదుల వల్ల కొందరు క్రైస్తవులు సత్యారాధననుండి తొలగిపోతున్నారని అపొస్తలుడైన పౌలు తెలుసుకొని, “గలతీయలోనున్న సంఘములకు” శక్తివంతమైన సందేశమున్న ఒక పత్రిక రాశాడు. (గల. 1:2) సా.శ. 50-52 మధ్యకాలంలో రాసిన ఈ పత్రికలో ఆయన సూటియైన ఉపదేశాన్నిస్తూ శక్తివంతమైన హెచ్చరికను ఇచ్చాడు.

సుమారు పది సంవత్సరాల తర్వాత ఆయన రోమాలో ‘క్రీస్తుయేసు ఖైదీగా’ ఉన్నప్పుడు చక్కని సలహాలనిస్తూ, ప్రేమపూర్వకంగా ప్రోత్సహిస్తూ ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు పత్రికలు రాశాడు. (ఎఫె. 3:1) గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు రాసిన పత్రికలను నేడు మనం శ్రద్ధగా చదవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.​—⁠హెబ్రీ. 4:12.

‘నీతిమంతులుగా’ ఎలా ‘తీర్చబడతారు’?

(గల. 1:16:18)

యూదా మతవాదులు కుయుక్తితో పౌలు అపొస్తలత్వాన్ని సవాలుచేసేందుకు ప్రయత్నించారు కాబట్టి ఆయన ఈ పత్రికలో తన గురించి కొన్ని వివరాలు ఇచ్చి తనను తాను సమర్థించుకున్నాడు. (గల. 1:11; 2:14) “మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసమువలననేగాని ధర్మశాస్త్రసంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడు” అని చెప్పి పౌలు వారి అబద్ధ బోధలను తిప్పికొట్టాడు.​—⁠గల. 2:16.

క్రీస్తు, ‘ధర్మశాస్త్రమునకు లోబడియున్న వారిని విమోచించి’ వారు క్రైస్తవ స్వాతంత్ర్యాన్ని అనుభవించేలా స్వతంత్రులను చేశాడు అని పౌలు చెప్పాడు. “మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడిక్రింద చిక్కు కొనకుడి” అని గలతీయులను గట్టిగా హెచ్చరించాడు.​—⁠గల. 4:4, 5; 5:1.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

3:16-18, 28, 29​—⁠అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన ఇప్పటికీ అమల్లోవుందా? ఉంది. దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను కొట్టివేసి దాని స్థానంలో ధర్మశాస్త్ర నిబంధనను చేయలేదు. అది మరో నిబంధన మాత్రమే. కాబట్టి ధర్మశాస్త్ర నిబంధన ‘కొట్టివేయబడిన’ తర్వాత కూడా అది అమలులో ఉంది. (ఎఫె. 2:14) దానిలోని వాగ్దానాలు అబ్రాహాము నిజ ‘సంతానంలో’ ప్రథమ భాగమైన క్రీస్తుయేసుకు, ఆయనతోపాటు ‘క్రీస్తు సంబంధులకు’ వర్తిస్తాయి.

6:2​—⁠“క్రీస్తు నియమము [‘శాసనము,’ NW]”లో ఏమేమి ఇమిడివున్నాయి? యేసు బోధించినవి, ఆజ్ఞాపించినవన్నీ దానిలో ఇమిడివున్నాయి. ముఖ్యంగా “ఒకరి నొకరు ప్రేమింపవలెను” అనే ఆజ్ఞ కూడా ఉంది.

6:8​—⁠మనం ఎలా ‘ఆత్మనుబట్టి విత్తుతాం’? దేవుని పరిశుద్ధాత్మ మనమీద పనిచేసేలా జీవించడం ద్వారా మనం ఆత్మనుబట్టి విత్తుతాం. అంతేకాకుండా పరిశుద్ధాత్మ పని​చేసేలా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో మనం హృదయపూర్వకంగా పాల్గొనడం ద్వారా కూడా అత్మనుబట్టి విత్తుతాం.

మనకు పాఠాలు:

1:6-9. సంఘంలో సమస్యలు తలెత్తినప్పుడు వాటిని పరిష్కరించడానికి క్రైస్తవ పెద్దలు త్వరగా చర్యలు తీసుకోవాలి. వారు తర్కాన్ని, లేఖనాలను ఉపయోగిస్తూ తప్పుడు వాదనలను వెంటనే త్రిప్పికొట్టాలి.

2:20. దేవుడు మనలో ప్రతీ ఒక్కరికీ విమోచన క్రయధనం అనే బహుమానాన్ని ఇచ్చాడు. ప్రతీ ఒక్కరం దానిని వ్యక్తిగత బహుమానంగా పరిగణించడాన్ని నేర్చుకోవాలి.​—⁠యోహా. 3:16.

5:7-9. ‘సత్యమునకు విధేయులు కాకుండా’ చెడు సహవాసం ‘మనల్ని అడ్డగించవచ్చు’. మనం అలాంటి సహవాసానికి దూరంగా ఉండడం మంచిది.

6:1, 2, 5. పొరపాటున ఏదో ఒక తప్పు చేయడం​వల్ల మనం కష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లయితే, ఆ భారాన్ని మోయడానికి ‘ఆత్మ సంబంధులైన వారు’ లేదా ఆధ్యాత్మిక అర్హతలున్నవారు సహాయం చేయవచ్చు. అయితే, ఆధ్యాత్మిక బాధ్యతల బరువును మనమే మోయాలి.

‘సమస్తమును క్రీస్తునందు సమకూర్చడం’

(ఎఫె. 1:1—6:24)

ఎఫెసీయులకు రాసిన పత్రికలో క్రైస్తవ ఐక్యతను నొక్కిచెబుతూ “కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి . . . పరలోకములో ఉన్నవేగాని, భూమిమీద ఉన్నవేగాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చ[డం]” గురించి పౌలు మాట్లాడాడు. మనమందరమూ ‘విశ్వాసవిషయంలో ఏకత్వముపొందేందుకు’ క్రీస్తు ‘మనుష్యుల్లో ఈవులను’ అనుగ్రహించాడు.​—⁠ఎఫె. 1:8-10; 4:8, 11-13.

దేవుణ్ణి మహిమపరుస్తూ ఐక్యతకు తోడ్పడాలంటే క్రైస్తవులు “నవీనస్వభావమును ధరించుకొని” ‘క్రీస్తు​నందలి భయముతో ఒకనికొకడు లోబడియుండాలి.’ అంతేకాక, వారు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొని ‘అపవాది తంత్రములను ఎదిరించాలి’.​—⁠ఎఫె. 4:24; 5:21; 6:11.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:4-7​—⁠అభిషిక్త క్రైస్తవులు జన్మించడానికి ఎంతో​కాలంముందే క్రీస్తుతోపాటు పరిపాలించేందుకు ఎలా నిర్ణయించబడ్డారు? వారు ఒక గుంపుగా, లేదా తరగతిగా నిర్ణయించబడ్డారే కానీ ఫలానీ వ్యక్తులు పరిపాలిస్తారని నిర్ణయించబడలేదు. మొదటి తల్లిదండ్రులు పాపాన్ని తమ సంతానానికి సంక్రమింపజేయకముందే ఆ గుంపు నిర్ణయించ​బడింది. పాపభరిత మానవులు పుట్టకముందే చెప్పబడిన ఆదికాండము 3:15లోని ప్రవచనం ప్రకారం క్రీస్తుతోపాటు ఆయన అనుచరులు కొందరు పరలోకంలో పరిపాలిస్తారన్నది కూడా దేవుని సంకల్పం.​—⁠గల. 3:16, 29.

2:2​—⁠లౌకికాత్మ ఎలా వాయువులా ఉంది, అది తన శక్తిని ఎలా చూపిస్తుంది? మనం పీల్చుకునే గాలి అన్నిచోట్లా ఉన్నట్లే “లౌకికాత్మ” అంటే స్వతంత్ర వైఖరి, అవిధేయత లోకమంతటా ఉన్నాయి. (1 కొరిం. 2:12) లోకంలోని ప్రజలను ఎడతెగక ప్రలోభపెట్టడం ద్వారా అది తన శక్తిని చూపిస్తుంది.

2:7​—⁠అభిషిక్త క్రైస్తవులు ఇంకా భూమిమీద ఉండగా “పరలోకమందు” ఉండడం ఎలా సాధ్యం? ఇక్కడ చెప్పబడిన ‘పరలోకం’ వారికి వాగ్దానం చేయబడిన పరలోక వారసత్వాన్ని సూచించడం లేదు. బదులుగా, ‘వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడడం’ వల్ల వారు ఆధ్యాత్మికంగా ఉన్నతస్థానానికి చేరుకోవడాన్ని అది సూచిస్తుంది.​—⁠ఎఫె. 1:13, 14.

మనకు పాఠాలు:

4:8, 11-15. యేసుక్రీస్తు “చెరను చెరగా కొనిపోయాడు” అంటే క్రైస్తవ సంఘాన్ని కట్టేందుకు ప్రజలను ఈవులుగా ఉపయోగించుకోవడానికి వారిని సాతాను అధీనంలోనుండి విడిపించాడు. మనపై నాయకులుగా ఉన్న​వారికి లోబడుతూ సంఘ ఏర్పాట్లన్నింటికీ సహకరించడం ద్వారా మనం ‘ప్రేమ గలిగి క్రీస్తువలె ఉండుటకు, అన్ని విషయములలో ఎదుగగలుగుతాం.’​—⁠హెబ్రీ. 13:7, 17.

5:22-24, 33. ఒక భార్య భర్తకు లోబడడంతోపాటు భయాన్ని అంటే గౌరవాన్ని కనపర్చాలి. ఆమె ‘మృదువైన గుణములను’ కనపర్చడం ద్వారా, ఇతరులకు ఆయనపట్ల గౌరవం కలిగేలా ఆయన గురించి మంచిగా మాట్లాడడం ద్వారా, ఆయన నిర్ణయాలు విజయవంతం అయ్యేలా సహాయపడడం ద్వారా అలా చేయగలదు.​—⁠1 పేతు. 3:3, 4; తీతు 2:3-5.

5:25, 28, 29. భర్త తననుతాను ‘పోషించుకున్నట్లే’ తన భార్యను కూడా పోషిస్తూ, భావోద్రేకపరంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేయాలి. అంతేకాక, ఆమెతో తగినంత సమయం గడుపుతూ, మాటల్లోనూ చేతల్లోనూ మృదువుగా వ్యవహరిస్తూ చక్కగా చూసుకోవాలి.

6:10-13. దుష్టాత్మలను ఎదిరించడానికి మనం హృదయ​పూర్వకంగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి.

‘క్రమముగా నడుచుకోండి’

(ఫిలి. 1:1—4:23)

ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు ప్రేమ గురించి నొక్కిచెప్పాడు. “మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెనని . . . ప్రార్థించుచున్నాను” అని ఆయన రాశాడు. అతినమ్మకం అనే ఉరిని తప్పించుకోవడానికి సహాయంచేస్తూ ఆయన వారినిలా ప్రోత్సహించాడు: “భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి.”​—⁠ఫిలి. 1:9; 2:12.

పరిణతిచెందిన వారు “దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే” పరిగెత్తాలని పౌలు ప్రోత్సహించాడు. “ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము” అని కూడా చెప్పాడు.​—⁠ఫిలి. 3:14-16.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:23​—⁠ఏ ‘రెంటి’ మధ్య పౌలు నలిగిపోయాడు, ఆయన ఏమి కోరుకున్నాడు? పౌలు తాను అప్పుడున్న పరిస్థితులనుబట్టి జీవం, మరణం అనే రెండిటి మధ్య నలిగిపోయాడు. (ఫిలి. 1:21) తాను ఏది ఎన్నుకుంటాడో చెప్పకుండా ఏది కోరుకుంటున్నాడో చెప్పాడు. ఆయన “వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని” కోరుకున్నాడు. (ఫిలి. 3:20, 21; 1 థెస్స. 4:16) క్రీస్తు ప్రత్యక్షతా కాలంలో యెహోవా తన కోసం సిద్ధంచేసిన బహుమానాన్ని ఆయన పొందినప్పుడు ఆ కోరిక నెరవేరింది.​—⁠మత్త. 24:3.

2:12, 13​—⁠మనం “ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును” దేవుడు ఎలా సహాయంచేస్తాడు? ఆయన సేవలో సాధ్యమైనంత చేయాలనే కోరిక మన హృదయాల్లో, మనసుల్లో పెరిగేలా యెహోవా పరిశుద్ధాత్మ దోహదపడుతుంది. కాబట్టి మనం ‘సొంతరక్షణను కొనసాగించుకోవడానికి’ ప్రయత్నిస్తుండగా యెహోవా మనకు తప్పక సహాయం చేస్తాడు.

మనకు పాఠాలు:

4:14-16. ఫిలిప్పీయుల ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోయినా ఉదారంగా ఇవ్వడంలో వారు చక్కని మాదిరి​నుంచారు.​—⁠2 కొరిం. 8:1-6.

2:5-11. యేసు ఉదాహరణ చూపిస్తున్నట్లు వినయం ఒక బలహీనత కాదుగానీ నైతిక స్థైర్యం ఉందనడానికి ఒక రుజువు. అంతేకాక, యెహోవా వినయస్థులను ఘనపరుస్తాడు.​—⁠సామె. 22:4.

3:13. పౌలు ఇక్కడ “వెనుక ఉన్నవి” అని ప్రస్తావించిన విషయాలు బహుశా లాభదాయక ఉద్యోగం, గొప్ప ఇంట్లో ఉండే భద్రత, లేదా గతంలో చేసిన పాపాలు అయ్యుండవచ్చు. ఆ పాపాల విషయంలో మనం ఇప్పటికే పశ్చాత్తాపపడి ‘కడుగబడి పరిశుద్ధపరచబడి’ ఉండవచ్చు. (1 కొరిం. 6:11) వీటిని మనం మరచిపోవాలి అంటే వాటి గురించి ఇక ఆలోచించకుండా ‘ముందున్న వాటికొరకై వేగిరపడాలి.’

‘విశ్వాసమందు స్థిరపరచబడాలి’

(కొలొ. 1:1—4:18)

కొలొస్సయులకు రాసిన తన పత్రికలో పౌలు అబద్ధ బోధకుల తప్పుడు అభిప్రాయాలను బహిర్గతం చేశాడు. ధర్మశాస్త్ర నియమాలను పాటించడంవల్ల రక్షణ కలుగదుగానీ ‘విశ్వాసమందు నిలిచివుంటేనే’ రక్షణ కలుగుతుందని ఆయన తర్కించాడు. పౌలు కొలొస్సయులను ఇలా ప్రోత్సహించాడు: “ఆయనయందు [క్రీస్తుయందు] వేరు​పారినవారై, విశ్వాసమందు స్థిరపరచబడుచు, ఆయనయందుండి నడుచుకొనుడి.” అలా స్థిరపడిన తర్వాత వారేమి చేయాలి?​—⁠కొలొ. 1:23; 2:6, 7.

“వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి” అని ఆయన రాశాడు. “మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు [యెహోవా] నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి” అని అపొస్తలుడు వారికి చెప్పాడు. సంఘము వెలుపల ఉన్నవారిపట్ల ‘జ్ఞానముతో నడుచుకోమని’ కూడా చెప్పాడు.​—⁠కొలొ. 3:14, 15, 23; 4:5.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:8​—⁠ఏ “లోకసంబంధమైన మూలపాఠములు”కు దూరంగా ఉండాలని పౌలు హెచ్చరించాడు? ఇవి సాతాను లోకంలోని అంశాలు అంటే లోకంలో ఉన్న అన్నింటినీ నడిపించే, ప్రేరేపించే మూలసూత్రాలు. (1 యోహా. 2:16) దీనిలో తత్వజ్ఞానం, ధనాపేక్ష, అబద్ధమతాలు కూడా ఉన్నాయి.

4:16​—⁠లవొదికయులకు రాసిన పత్రిక బైబిల్లో ఎందుకు చేర్చబడలేదు? బహుశా దానిలోని సమాచారం మన కాలానికి అవసరం లేదనే ఉద్దేశంతో అది చేర్చబడివుండదు. లేదా ప్రామాణిక పట్టికలోని వేరే పత్రికల్లో ఉన్న విషయాలే దీనిలో కూడా ఉండివుంటాయి.

మనకు పాఠాలు:

1:2, 20. దేవుడు కృపతో అనుగ్రహించిన విమోచనా క్రయధనం మనలో అపరాధ భావాలు లేకుండా చేసి మనశ్శాంతినిస్తుంది.

2:18, 23. ఇతరుల మెప్పును పొందాలనే ఉద్దేశంతో లోక సంపదలను త్యజించడం లేక శరీరాన్ని శిక్షించుకోవడం వంటివి చేస్తూ ‘అతి వినయాన్ని’ ప్రదర్శించేవారు నిజానికి ‘మనస్సు వలన ఊరక ఉప్పొంగుతున్నారని’ చెప్పవచ్చు.