కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని పేరు ఎలా ఉచ్చరించాలో తెలియనప్పుడు దానిని ఎందుకు ఉపయోగించాలి?

దేవుని పేరు ఎలా ఉచ్చరించాలో తెలియనప్పుడు దానిని ఎందుకు ఉపయోగించాలి?

మా పాఠకుల ప్రశ్న

దేవుని పేరు ఎలా ఉచ్చరించాలో తెలియనప్పుడు దానిని ఎందుకు ఉపయోగించాలి?

ప్రాచీన హీబ్రూ భాషలో దేవుని పేరు ఎలా ఉచ్ఛరించ​బడేదో ఇప్పుడు ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. అయితే, గమనార్హ మైన విధంగా దేవుని పేరు బైబిలులో దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. యేసు భూమ్మీదున్నప్పుడు దేవుని పేరు తెలియ​జేశాడు, ఆ పేరు పరిశుద్ధపర్చబడాలని ప్రార్థించమని ఆయన తన శిష్యులకు ఉపదేశించాడు. (మత్తయి 6:9, 10; యోహాను 17:6) కాబట్టి ఒక విషయం మాత్రం నిశ్చయం, అదేమిటంటే దేవుని పేరును ఉపయోగించడం క్రైస్తవులు విశ్వాసం కలిగివుండడానికి చాలా ప్రాముఖ్యం. ఆ పేరు మొదట్లో ఎలా ఉచ్చరించబడేదో ఇప్పుడెందుకు ఖచ్చితంగా తెలియడం లేదు? దానికి రెండు ముఖ్య కారణాలున్నాయి.

మొదటిది, దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం, దేవుని పేరును ఉచ్చరించడం తప్పు అనే ఒక మూఢ నమ్మకం యూదుల్లో ఏర్పడింది. ఒక పాఠకుడు బైబిలు చదువుతున్నప్పుడు దేవుని పేరు కనబడితే దానికి ప్రత్యామ్నాయంగా “ప్రభువు” అని చదివేవాడు. ఈ విధంగా, దేవుని పేరు అనేక శతాబ్దాలు ఉపయోగించబడకుండా ఉండేసరికి దాని ఉచ్చారణ మరుగున పడిపోయింది.

రెండవదిగా, ప్రాచీన హీబ్రూ భాష అచ్చులు లేకుండా వ్రాయబడేది, అంటే ఆంగ్లంలోనూ ఇతర భాషల్లోనూ సంక్షిప్త రూపాలు ఉన్నట్లుగా వ్రాయబడేది. వ్రాయబడిన దానిని చదువుతున్నప్పుడు పాఠకుడు అక్కడ లేని అచ్చులను చేర్చుకుంటూ చదువుతాడు. కొంతకాలానికి, హీబ్రూ పదాల ఉచ్చారణ పూర్తిగా మర్చిపోకుండా ఉండడానికి ఒక విధానం ప్రవేశపెట్టబడింది. హీబ్రూ బైబిల్లోని ప్రతీ పదానికి అచ్చుల గుర్తులు చేర్చబడ్డాయి. అయితే, దేవుని పేరుకు ప్రత్యామ్నాయ పదాన్ని ఉచ్చరించాలని పాఠకుడికి గుర్తుచేయడానికి “ప్రభువు” కోసం ఉపయోగించబడే అచ్చు గుర్తులు చేర్చబడేవి, లేదా ఏమీ చేర్చకుండా విడిచిపెట్టబడేది.

దానితో, యహ్‌వహ్‌ అనే నాలుగు హల్లులున్న పదం మాత్రమే మిగిలింది, దానిని ఒక నిఘంటువు ఇలా నిర్వచించింది, “సాధారణంగా యహ్‌వహ్‌ లేదా జహ్‌వహ్‌ అని వ్రాయబడే నాలుగు హీబ్రూ అక్షరాలు బైబిల్లో దేవుని పేరుగా ఏర్పడ్డాయి.” జహ్‌వహ్‌కు అచ్చు గుర్తులు, అచ్చు శబ్దాలు చేర్చబడినప్పుడు తెలుగులో సుపరిచితమైన, విస్తృతంగా అంగీకరించబడిన “యెహోవా” అనే రూపం ఎలా ఏర్పడుతుందో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.

అయితే, కొంతమంది పండితులు “యావే” అనే ఉచ్ఛారణను సిఫారసు చేస్తారు. అది ఆదిమ ఉచ్చారణకు దగ్గరగా ఉందా? ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. నిజానికి, ఈ ఉచ్ఛారణను ఉపయోగించకపోవడానికి కారణాలను ఇతర పండితులు పేర్కొన్నారు. ఆధునిక భాషలో మాట్లాడేటప్పుడు బైబిలు పేర్లు ఆదిమ హీబ్రూ భాషలోని పేర్లలా ఎంతమాత్రం ఉండవు, అయితే దీనికెవరూ అభ్యంతరం చెప్పడంలేదు. ఎందుకంటే ఈ పేర్లు మన భాషలో భాగమైపోయి, సులువుగా గుర్తించదగినవిధంగా తయారయ్యాయి. యెహోవా అనే పేరు విషయంలో కూడా అలాగే జరిగింది.

మొదటి శతాబ్దపు క్రైస్తవులు దేవుని పేరు పెట్టబడిన ప్రజలుగా పిలువబడ్డారు. ఆ పేరును వారు ఇతరులకు ప్రకటించి, ఆ పేరున ప్రార్థించమని వారిని ప్రోత్సహించారు. (అపొస్తలుల కార్యములు 2:21; 15:14; రోమీయులు 10:13-15) మనం ఏ భాషలో మాట్లాడినా, ఆయన పేరును ఉపయోగించడం, దాని ప్రాముఖ్యతను గుర్తించడం, అది దేనికి ప్రాతినిథ్యం వహిస్తుందో దానికి అనుగుణంగా జీవించడం, దేవుడు ప్రాముఖ్యమైన విషయాలుగా పరిగణిస్తాడు. (w 08 8/1)