కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘లౌకికాత్మను’ ఎదిరించండి

‘లౌకికాత్మను’ ఎదిరించండి

‘లౌకికాత్మను’ ఎదిరించండి

“మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము.”​—⁠1 కొరిం. 2:⁠12.

బ్రిటీష్‌ ప్రభుత్వం 1911లో బొగ్గుగనుల్లో పనిచేసేవారి ప్రాణరక్షణ కోసం ఒక చట్టం ప్రవేశపెట్టింది. ఆ చట్టం ప్రకారం ప్రతీ గనిలో రెండు క్యానరీ పిట్టలను (పసుప్పచ్చ ఈకలుండే పిట్టలను) ఉంచాలి. ఎందుకని? ఒకవేళ గనిలో మంటలు రేగితే, రక్షణా సిబ్బంది ఈ పిట్టలను తీసుకుని గనిలోకి వెళ్లేవారు. కార్బన్‌ మోనాక్సైడ్‌లాంటి ప్రాణాంతక వాయువుల ప్రభావం ఆ చిన్న పిట్టలపై వెంటనే కనిపిస్తుంది. గాలి కలుషితమైతే ఆ పిట్టలు గిలగిలా కొట్టుకుంటాయి, కొన్నిసార్లైతే అవి కూర్చున్న చోటనుండి కింద పడిపోతాయి. ఆ మొదటి హెచ్చరికా సూచనను గుర్తించడం ఎంతో ప్రాముఖ్యం. కార్బన్‌ మోనాక్సైడ్‌ రంగూ, వాసనా లేని వాయువు. దానిని పీల్చినప్పుడు శరీరంలో ఎర్ర రక్త కణాలు ప్రాణవాయువును సరఫరా చేయవు, దాంతో మనిషి చనిపోతాడు. రక్షణా సిబ్బంది ఆ ప్రమాదాన్ని గుర్తించకపోతే వారు స్పృహ తప్పి, ఆ విషవాయువును పీల్చామని తెలియకుండానే చనిపోవచ్చు.

2 క్రైస్తవులమైన మనం కూడా ఆధ్యాత్మికంగా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ఏ విధంగా? యేసు తన శిష్యులకు లోకమంతటా సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు వారిని సాతాను అధీనంలో ఉన్న, లౌకికాత్మ ప్రబలంగా ఉన్న ప్రమాదకరమైన లోకంలోకి పంపిస్తున్నానని ఆయనకు తెలుసు. (మత్త. 10:​16; 1 యోహా. 5:​19) యేసు తన శిష్యుల గురించి ఎంతగా కలవరపడ్డాడంటే చనిపోయే ముందు రోజు రాత్రి తన తండ్రికి ఇలా ప్రార్థించాడు: “నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించు​చున్నాను.”​—⁠యోహా. 17:⁠15.

3 మరణానికి నడిపించే ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకునే ప్రమాదం గురించి యేసు శిష్యులను హెచ్చరించాడు. మనం ఈ ప్రస్తుత విధానం అంతమయ్యే కాలంలో జీవిస్తున్నాం కాబట్టి ఆయన తన శిష్యులను ప్రోత్సహిస్తూ అన్న ఈ మాటలు మనకు ఎంతో ప్రాముఖ్యం: “మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును . . . మెలకువగా ఉండుడి.” (లూకా 21:34-36) అయితే, సంతోషకరమైన విషయం ఏమిటంటే, వారు నేర్చుకున్న విషయాలను గుర్తుతెచ్చుకోవడానికి, జీవిస్తున్న కాలాల ప్రాముఖ్యతను గుర్తించి ధైర్యంగా ఉండేందుకు సహాయం చేయడానికి తండ్రి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడని యేసు వాగ్దానం చేశాడు.​—⁠యోహా. 14:⁠26.

4 మరి మన విషయమేమిటి? దేవుడు మనకు కూడ పరిశుద్ధాత్మను ఇస్తాడా? దానిని పొందాలంటే మనమేమి చేయాలి? లౌకికాత్మ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది? మనం దానిని సమర్థంగా ఎలా ఎదిరించగలం?​—⁠1 కొరింథీయులు 2:⁠12 చదవండి.

పరిశుద్ధాత్మా లేక లౌకికాత్మా?

5 పరిశుద్ధాత్మను దేవుడు కేవలం మొదటి శతాబ్ద క్రైస్తవులకే అనుగ్రహించలేదు. మనకు కూడా ఇస్తాడు. దేవుని పరిశుద్ధాత్మ మనకు సరైనది చేసేందుకేకాక ఆయన సేవలో కొనసాగడానికి కావాల్సిన బలాన్నిస్తుంది. (రోమా. 12:​11; ఫిలి. 4:​13) అది ‘ఆత్మ ఫలానికి’ సంబంధించిన ప్రేమ, దయ, మంచితనంలాంటి కోమలమైన లక్షణాలను మనలో వృద్ధిచేస్తుంది. (గల. 5:​22) అయితే, పరిశుద్ధాత్మ సహాయం వద్దనుకునేవారికి యెహోవా దేవుడు దానిని బలవంతంగా ఇవ్వడు.

6 కాబట్టి ‘పరిశుద్ధాత్మ పొందాలంటే నేను ఏమి చేయాలి’ అని మనం ఆలోచించడం సముచితం. మనం ఏమేమి చేయాలో బైబిలు చెబుతోంది. ప్రాముఖ్యమైన, సులభమైన ఒక మార్గం ఏమిటంటే, దేవుణ్ణి కోరడమే. (లూకా 11:⁠13 చదవండి.) దైవ ప్రేరేపిత వాక్యాన్ని అధ్యయనం చేసి, అన్వయించుకోవడం కూడ సహాయకరంగా ఉంటుంది. (2 తిమో. 3:​16) కానీ బైబిలు చదివినంత మాత్రాన దేవుడు పరిశుద్ధాత్మనివ్వడు. కానీ యథార్థ క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేసినప్పుడు దానిలోని భావాలను, దృక్పథాలను గ్రహించగలుగుతాడు. యెహోవా దేవుడు యేసును తన ప్రతినిధిగా నియమించాడనేకాక ఆయన ద్వారానే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నాడని మనం అంగీకరించడం కూడ ప్రాముఖ్యం. (కొలొ. 2:⁠6) అందుకే మనం యేసును, ఆయన బోధలను అనుసరించాలనుకుంటాం. (1 పేతు. 2:​21) మనం ఎంతగా క్రీస్తులా ఉండడానికి ప్రయత్నిస్తే అంతగా పరిశుద్ధాత్మను పొందుతాం.

7 పరిశుద్ధాత్మకు భిన్నంగా లౌకికాత్మ, ప్రజలు సాతాను లక్షణాలను కనబరచాలని ప్రేరేపిస్తుంది. (ఎఫెసీయులు 2:1-3 చదవండి.) లౌకికాత్మ ఎన్నో విధాలుగా పనిచేస్తుంది. దేవుని ప్రమాణాలను వ్యతిరేకించేలా అది ప్రజలను ప్రేరేపిస్తుందని నేడు మన చుట్టూ చూస్తేనే తెలుస్తుంది. అది ‘శరీరాశను నేత్రాశను జీవపుడంబాన్ని’ పురికొల్పుతోంది. (1 యోహా. 2:​16) అది జారత్వం, విగ్రహారాధన, అభిచారం, ఈర్ష్య, క్రోధం, త్రాగుబోతుతనంవంటి శరీర కార్యాలను ప్రోత్సహిస్తోంది. (గల. 5:19-21) అపవిత్రమైన మతభ్రష్ట బోధనలను కూడ ప్రేరేపిస్తుంది. (2 తిమో. 2:14-18) లౌకికాత్మ తనను ప్రభావితం చేయడానికి ఒక వ్యక్తి ఎంతగా అనుమతిస్తే అతడు అంతగా సాతానులా తయారౌతాడు.

8 మనం లోక ప్రభావాల నుండి తప్పించుకోలేం. తనను పరిశుద్ధాత్మ నడిపించడానికి అనుమతించాలో లేదా లౌకికాత్మ నడిపించడానికి అనుమతించాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు లౌకికాత్మచేత నడిపించబడుతున్నవారు దాని ప్రభావం నుండి బయటపడి తనను పరిశుద్ధాత్మ నడిపించేందుకు అనుమతించాలి. అయితే మరోలా కూడ జరగవచ్చు. కొంతకాలంపాటు పరిశుద్ధాత్మచేత నడిపించబడినవారు ఆ తర్వాత లౌకికాత్మ ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది. (ఫిలి. 3:​18, 19) ఈ లౌకికాత్మను మనం ఎలా ఎదిరించవచ్చో మనం ఇప్పుడు పరిశీలిద్దాం.

ముందుగా కనిపించే ప్రమాద సూచనలను గుర్తించండి

9 మొదటి పేరాలో ప్రస్తావించబడిన బొగ్గు గనుల్లోని కార్మికులు విషవాయువును మొదట్లోనే పసిగట్టడానికి క్యానరీ పిట్టలను తీసుకెళ్లేవారు. పిట్ట కూర్చున్న చోట నుండి పడిపోతే తమ ప్రాణాలను రక్షించుకోవడానికి సత్వర చర్యలు తీసుకోవాలని వారు గ్రహించేవాళ్లు. ఈ విషయాన్ని మన క్రైస్తవ జీవితానికి అన్వయించి చూస్తే, మనల్ని లౌకికాత్మ ప్రభావితం చేస్తోందని ముందుగా చూపించే కొన్ని ప్రమాద సూచనలేమిటి?

10 మనం దేవుని వాక్యంలోని సత్యాలు నేర్చుకుని, మన జీవితాలను యెహోవాకు సమర్పించుకున్న కొత్తలో బహుశా బైబిలును ఎంతో ఆసక్తితో చదివుండొచ్చు! యెహోవాకు తరచూ మనస్ఫూర్తిగా ప్రార్థించివుండొచ్చు! ఎడారిలో నీటి చెలమలా ప్రతీ కూటం సేదదీర్పునిచ్చేదిగా ఉందని భావించి వాటికి వెళ్లడానికి ఇష్టపడివుండొచ్చు. అవన్నీ చేయడం ద్వారా మనం లౌకికాత్మ ప్రభావం నుండి బయటపడి, దాని ప్రభావానికి దూరంగా ఉండగలిగాం.

11 మనం నేటికీ రోజూ బైబిలును చదవడానికి ప్రయత్నిస్తున్నామా? (కీర్త. 1:⁠2) మనం ఇప్పుడు కూడ తరచూ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నామా? కూటాలంటే మనకిప్పటికీ ఇష్టమేనా? వారంలో జరిగే కూటాలన్నిటికీ హాజరవుతున్నామా? (కీర్త. 84:​10) ఆ మంచి అలవాట్లలో ఏవైనా తప్పిపోయాయా? నిజమే, సమయాన్ని శక్తిని హరించివేసే బాధ్యతలు మనకు ఎన్నో ఉండొచ్చు. వాటివల్ల ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో క్రమంగా పాల్గొనడం మనకు కష్టమౌతుండవచ్చు. కానీ ఈ మధ్య కాలంలో మనకున్న మంచి అలవాట్లలో కొన్ని తప్పిపోతుంటే మనం లౌకికాత్మ ప్రభావానికి లొంగిపోతున్నామేమో ఆలోచించాలి. తిరిగి అవే మంచి అలవాట్లను అలవర్చుకునేందుకు గట్టి ప్రయత్నం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా?

హృదయం మందగించకుండా చూసుకోండి

12 లౌకికాత్మను ఎదిరించడానికి మనమింకా ఏమి చేయవచ్చు? యేసు కొన్ని ప్రమాదాల గురించి చెప్పిన తర్వాతే తన శిష్యులకు “మెలకువగా ఉండుడి” అని హెచ్చరించాడు. “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి” అని ఆయన చెప్పాడు.​—⁠లూకా 21:​34, 35.

13 ఆ హెచ్చరిక గురించి కాస్త ఆలోచించండి. యేసు తినడం, తాగడం తప్పని చెప్పాడా? లేదు. సొలొమోను రాసిన ఈ మాటలు ఆయనకు తెలిసేవుంటాయి: “సంతోషముగా నుండుటకంటెను తమ బ్రదుకును సుఖముగా వెళ్లబుచ్చుటకంటెను, శ్రేష్ఠమైనదేదియు నరులకు లేదని నేను తెలిసికొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమువలన సుఖమనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలిసికొంటిని.” (ప్రసం. 3:​12, 13) అయినా, మితిమీరి తిని, త్రాగడాన్ని లౌకికాత్మ ప్రేరేపిస్తుందని యేసుకు తెలుసు.

14 తిండిబోతుతనంవల్ల, త్రాగుబోతుతనంవల్ల ఎదురయ్యే ప్రమాదాల విషయంలో లౌకికాత్మ మన ఆలోచనలను కలుషితం చేసిందో లేదో ఎలా తెలుసుకోవచ్చు? ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి: ‘తిండిబోతుతనం గురించి బైబిల్లోగాని సాహిత్యాల్లోగాని ఇవ్వబడిన ఉపదేశాన్ని చదివినప్పుడు నేనెలా స్పందిస్తాను? అది నాకు అవసరం లేదనో అది మరీ కఠినమైనదనో నేను తోసిపుచ్చుతానా? లేక నేను చేసేదాన్ని సమర్థించుకోవడానికి సాకులు చెబుతానా? * ఒకవేళ నాకు మద్యం తీసుకునే అలవాటు ఉంటే, దానిని మితంగా తీసుకునే విషయంలో, “మత్తతులము”గా అస్సలు ఉండకూడదనే విషయంలో ఇవ్వబడే సలహాలను నేనెలా దృష్టిస్తాను? అలాంటి సలహాలు నాకు అన్వయించవు అని అనుకుని వాటిని పెడచెవిన పెడతానా? త్రాగుడు విషయంలో నన్ను ఎవరైనా ఏదైనా అంటే నేను వెంటనే సమర్థించుకుంటానా, లేక కోప్పడతానా? వాటి విషయంలో బైబిలు ఉపదేశాన్ని అంతగా పట్టించుకోవద్దని ఇతరులకు చెబుతానా?’ అవును, ఒక వ్యక్తి వైఖరినిబట్టి ఆయన లౌకికాత్మకు లొంగిపోతున్నాడా లేదా అనేది చెప్పగలుగుతాం.​—⁠రోమీయులు 13:11-14 పోల్చండి.

చింతల్లో మునిగిపోకండి

15 లౌకికాత్మను ఎదిరించడానికి చింతలను అధిగమించడం కూడ చాలా ప్రాముఖ్యం. అపరిపూర్ణులముగా మనం చిన్నచిన్న విషయాల గురించి కూడ ఆందోళనపడతామని యేసుకు తెలుసు. అందుకే ఆయన ప్రేమతో తన శిష్యులకు, “చింతింపకుడి” అని హెచ్చరించాడు. (మత్త. 6:​25) దేవుణ్ణి సంతోషపెట్టడం, క్రైస్తవులముగా మనకుండే బాధ్యతలను నెరవేర్చడం, కుటుంబ పోషణ వంటి ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం చింతించడం సహజమే. (1 కొరిం. 7:32-34) మరి యేసు ఇచ్చిన హెచ్చరిక నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

16 లౌకికాత్మ జీవపుడంబాన్ని లేదా ధనాన్నిబట్టి గర్వపడడాన్ని ప్రేరేపిస్తుంది. దానివల్ల చాలామంది అనవసర ఆందోళనకు గురౌతున్నారు. డబ్బుంటే భద్రత ఉంటుందనీ, ఒక వ్యక్తికున్న క్రైస్తవ లక్షణాలనుబట్టి కాకుండా డబ్బును బట్టి ఆయన విలువను అంచనావేయవచ్చని ఈ లోకం మనల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. దానిని నమ్మి మోసపోయినవారు డబ్బు సంపాదించడానికి ముప్పుతిప్పలు పడుతూ ఎప్పటికప్పుడు పెద్దపెద్దవైన సరికొత్త అత్యాధునిక వస్తువులు తెచ్చుకోవాలని తాపత్రయపడి ఆందోళనపడతారు. (సామె. 18:​11) వస్తుసంపద విషయంలో అలాంటి తప్పుడు అభిప్రాయం ఉంటే ఒక వ్యక్తి ఆందోళనకు గురై ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడు.​—⁠మత్తయి 13:​18, 22 చదవండి.

17 “ఆయన [దేవుని] రాజ్యమును నీతిని మొదట వెదకుడి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తే మనం చింతల్లో మునిగిపోము. మనమలా చేస్తే దేవుడు మన అవసరాలను తీరుస్తాడని యేసు హామీనిచ్చాడు. (మత్త. 6:​33) మనకు ఆయన మాటలపై నమ్మకం ఉందని ఎలా చూపించవచ్చు? అలా చేయడానికి ఒక మార్గం ఏమిటంటే, ఆర్థిక విషయాల్లో దేవుని ప్రమాణాలకు కట్టిబడివుండడం ద్వారా దేవుని నీతిని మొదట వెతకడమే. ఉదాహరణకు, మనం తప్పుడు ఆదాయ వివరాలను ఇవ్వం, వ్యాపార విషయాల్లో చిన్నచిన్న అబద్ధాలైనా చెప్పం. ఆర్థిక వ్యవహారాల్లో నిజాయితీగా ఉండడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ అప్పులు చెల్లించే విషయంలో మనం ‘అవునంటే అవును’ అనేలా ప్రవర్తిస్తాం. (మత్త. 5:​37; కీర్త. 37:​21) నిజాయితీగా ఉండే ఒక వ్యక్తి ధనవంతుడైపోడు కానీ ఆయనకు దేవుని అనుగ్రహం ఉంటుంది, నిర్మలమైన మనస్సాక్షి ఉంటుంది, ఆందోళన ఎంతగానో తగ్గుతుంది.

18 రాజ్యాన్ని మొదట వెదకడం అంటే మన జీవితాల్లో వేటికి ప్రాముఖ్యతనివ్వాలో తెలుసుకోవాలి. యేసు విషయాన్నే తీసుకోండి. కొన్నిసార్లు ఆయన నాణ్యమైన బట్టలు వేసుకున్నాడు. (యోహా. 19:​23) స్నేహితులతో కలిసి భోజనం చేశాడు, ద్రాక్షారసాన్ని సేవించాడు. (మత్త. 11:​18, 19) అయితే, ఆయన జీవితంలో వస్తుసంపదకు, వినోదానికి ప్రాముఖ్యతనివ్వలేదు. అవి కేవలం ఆహారంలోని ఉప్పు, మసాలాల్లాగే ఉండేవి. యెహోవా చిత్తం చేయడాన్నే ఆయన ఆహారంగా పరిగణించాడు. (యోహా. 4:34-36) యేసును అనుకరించడంవల్ల మన జీవితం ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది! అణచివేతకు గురైన ప్రజలకు లేఖనాల నుండి ఓదార్పునిచ్చే చక్కని అవకాశం మనకుంటుంది. సంఘ సభ్యుల ప్రేమా సహకారాలను మనం పొందుతాం. యెహోవా హృదయాన్ని సంతోషపెడతాం. జీవితంలో సరైన విషయాలకు ప్రాముఖ్యతనిచ్చినప్పుడు సంపదలకు, సుఖాలకు మనం బానిసలం కాము. బదులుగా యెహోవా సేవలో మనమే వాటిని ఉపయోగించుకుంటాం. దేవుని రాజ్యానికి సంబంధించిన పనిలో మనమెంత చురుగ్గా పనిచేస్తే మనపై లౌకికాత్మ ప్రభావం అంత తక్కువగా ఉంటుంది.

“ఆత్మానుసారమైన మనస్సు” కలిగివుండండి

19 మనం సాధారణంగా ఏదైనా పని చేయకముందు ఆలోచిస్తాం. కానీ అనేకమంది తాము అనాలోచితంగా పనులు చేశామంటారు. అయితే అవి తరచూ శరీరానుసారంగా ఆలోచించి చేసినవే. అందుకే అపొస్తలుడైన పౌలు మన ఆలోచనా విధానాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేశాడు. “శరీరానుసారులు శరీరవిషయములమీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మవిషయములమీద మనస్సు నుంతురు” అని ఆయన రాశాడు.​—⁠రోమా. 8:⁠5.

20 మన ఆలోచనలను తద్వారా మన చర్యలను లౌకికాత్మ ప్రభావితం చేయకుండా ఎలా జాగ్రత్తపడగలం? ఈ లోక సిద్ధాంతాలను ఆమడ దూరంలో ఉంచడానికి ప్రయత్నిస్తూ చెడ్డ విషయాల గురించి ఆలోచించకుండా మనసుని కాపాడుకోవాలి. ఉదాహరణకు, వినోదాన్ని ఎన్నుకుంటున్నప్పుడు అనైతికతను లేదా దౌర్జన్యాన్ని ఎక్కువగా ప్రోత్సహించే కార్యక్రమాలవల్ల మన మనసు చెడిపోకుండా చూసుకోవాలి. మనసు చెడుగా ఉన్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ పనిచేయదని మనం గుర్తిస్తాం. (కీర్త. 11:⁠5; 2 కొరిం. 6:15-18) అంతేకాకుండా క్రమంగా బైబిలును చదువుతూ, ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ కూటాలకు హాజరవుతూ ఉండడం ద్వారా దేవుని పరిశుద్ధాత్మ మనపై పనిచేసేందుకు అనుమతిస్తాం. క్రైస్తవ ప్రకటనా పనిలో క్రమంగా పాల్గొనడం ద్వారా మనం పరిశుద్ధాత్మతో కలిసి పనిచేస్తాం.

21 మనం లౌకికాత్మను, అది ప్రేరేపించే శరీరాశలను ఎదిరించాలి. కానీ మనం చేసే ఏ ప్రయత్నమైనా ప్రయోజనకరమే, ఎందుకంటే పౌలు చెబుతున్నట్లు, “ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది.”​—⁠రోమా. 8:⁠6.

[అధస్సూచి]

^ పేరా 19 అతిగా తినాలనే కోరిక మనసులోనే పుడుతుంది. తిండిబోతులు అత్యాశతో అతిగా తింటారు. కాబట్టి ఒకరు చూడడానికి ఎలా ఉన్నారనే దాన్నిబట్టికాదు గానీ ఆహారం విషయంలో వారికున్న వైఖరినిబట్టే వారు తిండిబోతులా కాదా అన్నది చెప్పగలం. కొందరు మామూలుగా లేదా సన్నగా ఉన్నా వారు తిండిబోతులై ఉండొచ్చు. కొన్నిసార్లు, స్థూలకాయులు ఏదో అనారోగ్యం వల్లనో జన్యుకారణాల వల్లనో లావుగా ఉండొచ్చు. కాబట్టి ఒక వ్యక్తి బరువు ఎంతున్నా సరే ఆయన తిండి విషయంలో ఎంత అత్యాశతో ప్రవర్తిస్తున్నాడన్నదే మనం చూడాలి.​—⁠కావలికోట నవంబరు 1, 2004లోని “పాఠకుల ప్రశ్నలు” చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

• పరిశుద్ధాత్మను పొందడానికి మనం ఏమి చేయాలి?

• లౌకికాత్మ మనల్ని ఏయే విషయాల్లో ప్రభావితం చేయగలదు?

• మనం లౌకికాత్మను ఎలా ఎదిరించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1, 2. (ఎ) గతంలో బ్రిటన్‌లోని బొగ్గుగనుల్లో క్యానరీ పిట్టలను ఎందుకు ఉంచేవారు? (బి) క్రైస్తవులు ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు?

3, 4. యేసు తన శిష్యులను దేని గురించి హెచ్చరించాడు, ఆ హెచ్చరికలు మనకెందుకు ప్రాముఖ్యం?

5, 6. పరిశుద్ధాత్మ మనకు ఎలా సహాయం చేస్తుంది? దానిని పొందడానికి మనం ఏమి చేయాలి?

7. లౌకికాత్మ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది?

8. మనమందరం దేని విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి?

9-11. మనం లౌకికాత్మకు లొంగిపోతున్నామని చూపించే కొన్ని ప్రమాద సూచనలేమిటి?

12. యేసు తన శిష్యులను ఏమని హెచ్చరించాడు, ఎందుకు?

13, 14. తినడం, త్రాగడం విషయంలో మనం ఎలాంటి ప్రశ్నల గురించి ఆలోచించడం మంచిది?

15. మానవులకున్న ఏ నైజం విషయంలో యేసు హెచ్చరించాడు?

16. లౌకికాత్మ చాలామందిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?

17. మనం ఎలా చింతల్లో మునిగిపోకుండా ఉండగలం?

18. యేసు మనకోసం ఎలాంటి చక్కని మాదిరినుంచాడు, ఆయనను అనుకరించడంవల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?

19-21. మనం “ఆత్మానుసారమైన మనస్సును” ఎలా కలిగివుండవచ్చు, ఎందుకు కలిగివుండాలి?

[21వ పేజీలోని చిత్రం]

ఉద్యోగానికి, స్కూలుకు వెళ్లేముందు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించండి

[23వ పేజీలోని చిత్రాలు]

మనం చెడు విషయాల గురించి ఆలోచించకూడదు, వ్యాపార వ్యవహారాల్లో నిజాయితీగా ఉండాలి, తిని త్రాగే విషయాల్లో మితంగా ఉండాలి