కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సంతవీధుల్లో సాక్ష్యమివ్వడం

సంతవీధుల్లో సాక్ష్యమివ్వడం

సంతవీధుల్లో సాక్ష్యమివ్వడం

అపొస్తలుడైన పౌలు ఏథెన్సులో ఉన్నప్పుడు యేసు గురించిన సువార్త ప్రకటించడానికి ప్రతీరోజు సంతవీధులకు వెళ్తుండేవాడు. (అపొ. 17:​17) ఏథెన్సులోని ప్రజలు రోజులో ఎక్కువభాగం అక్కడే గడిపేవారు కాబట్టి పౌలు సంతవీధులను ఎంచుకున్నాడు.

దాదాపు 2,000 సంవత్సరాల తర్వాత కూడా యెహోవా ప్రజలు సంతవీధుల్లో ప్రజలను కలుసుకుని దేవుని రాజ్య సందేశాన్ని ప్రకటిస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే అక్కడ మనకు ఎంతోమంది ప్రజలు కలుస్తారు. నేడు సంతవీధులంటే ఏ మార్కెట్టో, షాపింగ్‌ సెంటరో అని చెప్పుకోవచ్చు. అక్కడి యజమాని అనుమతి తీసుకుని కొందరు సాక్షులు బల్లపై మన ప్రచురణలను ప్రదర్శించారు.

ఉదాహరణకు, అమెరికాలోని న్యూ జెర్సీలో సహోదరులు ఒక షాపింగ్‌ సెంటర్‌లో అలాగే మన ప్రచురణలను ప్రదర్శించారు. అక్కడ “కుటుంబ విలువలను ఎలా కాపాడుకోవాలి” అనే అంశానికి సంబంధించిన పుస్తకాలనే పెట్టారు. ఏమి జరిగిందో మీరూహించగలరా? వారు ఒకే రోజులో ఆరు భాషల్లో 153 పుస్తకాలను ఇవ్వగలిగారు.

వారి దగ్గరికి వచ్చిన ఒక స్త్రీ మన సహోదరి చెప్పిన విషయాలను ఎంతో జాగ్రత్తగా విన్నది. వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో దేవునికి స్థానమివ్వడం ఎంతో ప్రాముఖ్యమని ఆమె ఒప్పుకుంది. గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి (ఆంగ్లం), కుటుంబ సంతోషానికిగల రహస్యము, యువత అడిగే ప్రశ్నలు​—⁠ఆచరణాత్మకమైన సమాధానాలు (ఆంగ్లం) అనే పుస్తకాలు తీసుకుంది.

మధ్యాహ్నం, ఒక వ్యక్తి పక్కనే ఉన్న మరో దుకాణానికి వెళ్తూ మన ప్రచురణలు చూసి ఆగాడు. యువత అడిగే ప్రశ్నలు అనే పుస్తకంపై ఆయన కళ్లుపడ్డాయి. ఆయన కుతూహలంతో ఆ పుస్తకాన్ని చూస్తున్నాడని గమనించిన మన సహోదరి, “మీకు వీటిలో ఏదైనా పుస్తకం నచ్చిందా” అని అడిగింది. అవునంటూ తలూపి యువత అడిగే ప్రశ్నలు (ఆంగ్లం) అనే పుస్తకాన్ని చూపించాడు. ఆయన చెయ్యిచాపి దాన్ని తీసుకోబోయేలోపే సహోదరి దానిని ఆయనకు అందించింది. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆయన చెప్పాడు. పెద్దపిల్లలిద్దరూ టీనేజర్లు. తాను వారానికొకసారి వారితో కూర్చొని మాట్లాడతానని మాటల మధ్యలో చెప్పాడు. ఆ పుస్తకంలో ఏముందో తెరిచి చూస్తూ దాన్ని తాము కుటుంబమంతా కలిసి చర్చించుకోవడానికి అదెంతో బాగుంటుందని చెప్పాడు. ఆ సహోదరి ఆయనకు కుటుంబ సంతోషానికిగల రహస్యము అనే పుస్తకాన్ని కూడ చూపించి భార్యాభర్తలిద్దరూ కుటుంబానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆ పుస్తకంలోని సలహాలు ఎంతో సహాయపడతాయని చెప్పింది. కృతజ్ఞతలు చెప్పి, ఆయన ఆ పుస్తకాన్ని కూడ తీసుకుని విరాళమిచ్చాడు. సాక్షులు వారింటికి రావడం ఇష్టమేనా అని అడిగినప్పుడు దానికాయన ఒప్పుకున్నాడు.

అలా షాపింగ్‌ సెంటరులో ప్రకటించడం గురించి ఆ సహోదరులకు ఎలా అనిపించింది? “ఇలా ప్రకటించడం నాకెంతో నచ్చింది. అదో మరువరాని అనుభవంగా మిగిలిపోయింది” అని ఒక సహోదరి అన్నది. “భూదిగంతముల వరకు సువార్త ప్రకటించబడుతుంది అని యెహోవా దేవుడు చెప్పాడు. నేడు న్యూ జెర్సీలోని ​పేరామస్‌ ప్రాంతంలోనే వివిధ భాషలు మాట్లాడేవారికి సువార్త అందింది. ఇందులో పాల్గొన్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అక్కడ ప్రకటనా పనిలో పాల్గొన్నవారందరూ ఎంతో సంతోషించారు. సాయంత్రమైనా మాలో ఎవ్వరికీ అక్కడినుండి వెళ్లాలనిపించలేదు” అని మరో సహోదరి అన్నది.

మీరు సువార్త ప్రకటించడానికి వివిధ పద్ధతులను ఉపయోగించగలరేమో ఆలోచించండి. మనం ముఖ్యంగా ఇంటింటి పరిచర్యను చేస్తామన్నది నిజమే. (అపొ. 20:​20) అయితే మార్కెట్టులో, షాపింగ్‌ సెంటరులో కూడా ప్రకటించడం గురించి ఆలోచించి చూడండి.