కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు “హస్తనిక్షేపణము” లేదా చేతులు తలమీదుంచడం గురించి మాట్లాడాడు. ఆయన అక్కడ పెద్దల నియామకం గురించి ప్రస్తావించాడా లేదా మరో విషయాన్ని ప్రస్తావించాడా?​—హెబ్రీ. 6:⁠2.

పౌలు దేని గురించి మాట్లాడాడో మనం ఖచ్చితంగా నిర్ధారించలేకపోయినప్పటికీ, బహుశా ఇక్కడ ఆయన తలమీద చేతులుంచి ఆత్మ వరాలు ఇవ్వడం గురించి ప్రస్తావిస్తుండవచ్చు.

బైబిలు కొన్నిసార్లు, దైవపరిపాలనా నియామకాల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు తలమీద చేతులుంచడం గురించి మాట్లాడుతోంది. యెహోషువను తన వారసునిగా నియమించినప్పుడు మోషే ఆయన ‘తలమీద చేతులుంచాడు.’ (ద్వితీ. 34:⁠9) క్రైస్తవ సంఘంలో కొంతమంది అర్హతగల పురుషులను తలమీద చేతులుంచి నియమించేవారు. (అపొ. 6:⁠6; 1 తిమో. 4:​14) తొందరపడి ఒక వ్యక్తి తలమీద చేతులుంచకూడదని పౌలు సలహా ఇచ్చాడు.​—⁠1 తిమో. 5:⁠22.

అయితే, పౌలు “నిర్జీవక్రియలను విడిచి, మారుమనస్సు పొందుటయు, దేవునియందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్తనిక్షేపణము” లాంటి కొన్ని మూలోపదేశాలు లేదా ప్రాథమిక విషయాల గురించి చెప్పాడు. ఆ తర్వాత “మూలోపదేశము మాని, సంపూర్ణులమగుటకు సాగిపోదము” అని హెబ్రీ క్రైస్తవులను ప్రోత్సహించాడు. (హెబ్రీ. 6:​1, 2) క్రైస్తవులు, సంఘ పెద్దగా నియమించబడడం అనే ప్రాథమిక లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలని దానర్థమా? కాదు. క్రైస్తవ పెద్దగా సేవచేయడం ప్రాముఖ్యమైన ఆధిక్యత. అది క్రైస్తవ పురుషులు చేరుకోవాల్సిన లక్ష్యం. ఒకరు సంఘ పెద్దగా నియమించబడితే ఆయన బాధ్యతలను తేలిగ్గా తీసుకోకుండా దానిని గొప్ప ఆధిక్యతగా భావించాలి.​—⁠1 తిమో. 3:⁠1.

కానీ తలపై చేతులుంచడం అనే మాట మరో సందర్భంలో కూడా ఉపయోగించబడింది. మొదటి శతాబ్దంలో, యెహోవా దేవుడు సహజ ఇశ్రాయేలీయుల్ని తిరస్కరించి అభిషిక్త క్రైస్తవ సంఘమైన ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా స్వీకరించాడు. (మత్త. 21:​43; అపొ. 15:​14; గల. 6:​16) భాషలు మాట్లాడడం వంటి అద్భుతమైన ఆత్మవరాలను ఇవ్వడం ద్వారా వారిని తన ప్రజలుగా స్వీకరించానని చూపించాడు. (1 కొరిం. 12:4-11) కొర్నేలీ అతని ఇంటివారు విశ్వాసులైనప్పుడు ‘భాషల్లో మాటలాడారు.’ దీన్నిబట్టి వారు పరిశుద్ధాత్మను పొందారని చెప్పవచ్చు.​—⁠అపొ. 10:44-46.

కొన్నిసార్లు, తలపై చేతులుంచడం ద్వారా అద్భుతవరాలను అనుగ్రహించేవారు. ఫిలిప్పు సమరయ ప్రాంతంలో ప్రకటించినప్పుడు అనేకులు బాప్తిస్మం తీసుకున్నారు. పరిపాలక సభ అపొస్తలులైన పేతురు, యోహానులను అక్కడికి పంపించింది. ఎందుకు? “పేతురును యోహానును వారిమీద [కొత్తగా బాప్తిస్మంతీసుకున్న వారిమీద] చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి” అని మనం చదువుతాం. వారు ఆత్మ వరాలను పొందారని ఈ వచనం చెబుతుండవచ్చు. ఆత్మవరాలు పొందడంవల్ల వారు చేసిన క్రియలు అందరూ చూడగలిగారు. ఇతరులు చూశారని గతంలో గారడీలు చేసిన సీమోను విషయంలో జరిగిన సంఘటనుబట్టి తెలుస్తుంది. అపొస్తలులు ఇతరుల తలపై చేతులుంచి వారు అద్భుతాలు చేయగలిగేలా పరిశుద్ధాత్మను అనుగ్రహించగలుగుతున్నారని గమనించిన సీమోను ఆ సామర్థ్యాన్ని దురాశతో కొనాలనుకున్నాడు. (అపొ. 8:5-20) ఆ తర్వాత ఎఫెసులో పన్నెండుమంది బాప్తిస్మం తీసుకున్నారు. “పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిరి” అని చదువుతాం.​—⁠అపొ. 19:1-7; 2 తిమోతి 1:6 పోల్చండి.

కాబట్టి హెబ్రీయులకు 6:2లో పౌలు కొత్తగా విశ్వాసులైన వారికి ఆత్మ వరాలను ఇచ్చేందుకు తలపై చేతులుంచడం గురించి ప్రస్తావిస్తుండవచ్చు.