కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

థెస్సలొనీకయులకు, తిమోతికి రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

థెస్సలొనీకయులకు, తిమోతికి రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

థెస్సలొనీకయులకు, తిమోతికి రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

అపొస్తలుడైన పౌలు థెస్సలొనీకయకు వెళ్లినప్పుడు అక్కడొక కొత్త సంఘం స్థాపించబడింది. అప్పటినుండి అది వ్యతిరేకత ఎదుర్కొంటూనే ఉంది. అందుకే, 20వ పడిలో ఉన్న తిమోతి అక్కడి నుండి మంచి వార్తను తీసుకొచ్చినప్పుడు పౌలు ఆ సంఘాన్ని మెచ్చుకుంటూ, ప్రోత్సహిస్తూ ఒక ఉత్తరం రాశాడు. బహుశా సా.శ. 50వ సంవత్సరం చివర్లో రాయబడిన ఈ పత్రిక పౌలు రాసిన ప్రేరేపిత పత్రికల్లో మొదటిది. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన థెస్సలొనీకయలోని క్రైస్తవులకు రెండవ పత్రికను కూడ రాశాడు. ఈ పత్రికలో కొందరికున్న తప్పుడు అభిప్రాయాన్ని సరిదిద్దుతూ, సహోదరులను విశ్వాసంలో స్థిరంగా ఉండమని ప్రోత్సహించాడు.

సుమారు పది సంవత్సరాల తర్వాత పౌలు మాసిదోనియలో, తిమోతి ఎఫెసులో ఉన్నారు. తిమోతి ఎఫెసులోనే ఉండి అక్కడున్న సహోదరులను సంఘంలోని అబద్ధ బోధకుల ప్రభావం నుండి కాపాడమని ప్రోత్సహిస్తూ పౌలు ఆయనకు లేఖ రాశాడు. సా.శ. 64లో రోము తగలబడిన తర్వాత క్రైస్తవులు ఎంతగానో హింసించబడ్డారు. ఆ సమయంలోనే పౌలు తిమోతికి రెండవ పత్రిక రాశాడు. ఆయన రాసిన ప్రేరేపిత పత్రికల్లో అది ఆఖరిది. పౌలు రాసిన ఈ నాలుగు పత్రికల్లో ఆయనిచ్చిన ప్రోత్సాహం నుండి, ఉపదేశం నుండి మనం కూడ ప్రయోజనం పొందవచ్చు.​—⁠హెబ్రీ. 4:⁠12.

‘మెలకువగా ఉండండి’

(1 థెస్స. 1:1​—⁠5:⁠28)

థెస్సలొనీకయులు ‘విశ్వాసంతో పని చేస్తున్నందుకు, ప్రేమతో ప్రయాసపడుతున్నందుకు, ఓర్పు చూపిస్తున్నందుకు’ పౌలు వారిని మెచ్చుకున్నాడు. తనకు “నిరీక్షణయైనను ఆనందమైనను అతిశయకిరీటమైనను” వారే అని ఆయన చెప్పాడు.​—⁠1 థెస్స. 1:⁠2; 2:⁠19.

పునరుత్థాన నిరీక్షణతో ఒకరినొకరు ఓదార్చుకోమని అక్కడి క్రైస్తవులను ప్రోత్సహించిన తర్వాత పౌలు ఇలా అన్నాడు: “రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చును.” వారు మత్తులు కాకుండా ‘మెలకువగా’ ఉండాలని ఆయన వారిని ఉపదేశించాడు.​—⁠1 థెస్స. 4:16-18; 5:​2, 6.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

4:​15-​17​​—⁠‘ప్రభువును ఎదుర్కోవడానికి’ ఎవరు ‘మేఘాలమీద ఆకాశమండలానికి కొనిపోబడతారు’? అదెలా జరుగుతుంది? క్రీస్తు తన ప్రత్యక్షతా కాలంలో రాజుగా పరిపాలిస్తున్నప్పుడు బ్రతికివున్న అభిషిక్త క్రైస్తవులే అలా కొనిపోబడతారు. వారు అదృశ్యమైన పరలోకంలో యేసు ‘ప్రభువును ఎదుర్కొంటారు.’ కానీ అలా జరగడానికి ముందు వారు చనిపోయి ఆత్మప్రాణులుగా పునరుత్థానం చేయబడాలి. (రోమా. 6:3-5; 1 కొరిం. 15:​35, 44) క్రీస్తు ప్రత్యక్షతా కాలం ఇప్పటికే మొదలైంది కాబట్టి ఇప్పుడు చనిపోయే అభిషిక్త క్రైస్తవులు మృతులుగా ఉండిపోరు. వారు ‘కొనిపోబడతారు’ అంటే రెప్పపాటున పునరుత్థానం చేయబడతారు.​—⁠1 కొరిం. 15:​51, 52.

5:​23​​—⁠సహోదరుల ‘ఆత్మ, జీవము, శరీరము కాపాడబడాలని’ పౌలు ఎందుకు ప్రార్థించాడు? పౌలు ఇక్కడ థెస్సలొనీకలోని వారేకాక మిగతా అభిషిక్త క్రైస్తవులందరి ఆత్మ, జీవం, శరీరం గురించి మాట్లాడాడు. కేవలం సంఘం కాపాడబడాలని ప్రార్థించే బదులు సంఘపు “ఆత్మ” అంటే సంఘ సభ్యుల ఆలోచనా విధానం ఎప్పటికీ మంచిగా ఉండాలని పౌలు ప్రార్థించాడు. అంతేకాక ఆయన సంఘపు “జీవము” అంటే దాని ఉనికి కోసం, దాని “శరీరము” అంటే అభిషిక్త క్రైస్తవులందరి కోసం ప్రార్థించాడు. (1 కొరిం. 12:​12, 13) పౌలుకు అభిషిక్త క్రైస్తవులపట్ల ఎంత శ్రద్ధ ఉందో ఈ ప్రార్థనలో కనిపిస్తుంది.

మనకు పాఠాలు:

1:​3, 7; 2:​13; 4:​1-​12; 5:​15. ఎవరైనా మార్పులు చేసుకునేలా సరిదిద్దాలంటే వారిని మెచ్చుకుంటూ, ఇంకాస్త కృషి చేయమని ప్రోత్సహించాలి.

4:​1, 9, 10. యెహోవా ఆరాధకులు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూనే ఉండాలి.

5:​1-3, 8, 20, 21. యెహోవా దినం సమీపిస్తుండగా మనం “మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచమును, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణమును” ధరించుకోవాలి. అంతేకాదు, దేవుని ప్రవచన వాక్యమైన బైబిల్లోని విషయాల గురించి లోతుగా ఆలోచించాలి.

‘నిలకడగా ఉండండి’

(2 థెస్స. 1:1​—⁠3:⁠18)

పౌలు మొదటి పత్రికలో రాసిన విషయాలను సంఘంలోని కొందరు వక్రీకరిస్తూ ‘ప్రభువు దినము’ వెంటనే రాబోతోందని వాదించారు. ఆ తప్పుడు అభిప్రాయాన్ని సరిదిద్దడానికి పౌలు దానికన్నా “మొదట” ఏమి సంభవించాలో వివరించాడు.​—⁠2 థెస్స. 2:1-3.

“నిలుకడగా ఉండి . . . మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి” అని పౌలు వారిని ప్రోత్సహించాడు. “అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెను” అని కూడ ఆజ్ఞాపించాడు.​—⁠2 థెస్స. 2:​15; 3:⁠6.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:​3 (అధస్సూచి) , 8​​—⁠“ధర్మవిరుద్ధ పురుషుడు” లేక “ధర్మవిరోధి” ఎవరు? అతడు ఎలా నాశనం చేయబడతాడు? క్రైస్తవ మత సామ్రాజ్యంలోని మతాధికారులందరినీ కలిపి ధర్మవిరుద్ధ పురుషుడు అని చెప్పవచ్చు. దుష్టులపై దేవుని తీర్పులను ప్రకటించి, వాటిని అమలుచేయాలని ఆజ్ఞాపించే అధికారం ‘వాక్యానికి’ అంటే దేవుని ముఖ్య ప్రతినిధి అయిన యేసుక్రీస్తుకు ఉంది. (యోహా. 1:⁠1) కాబట్టి యేసు తన “నోటియూపిరిచేత [నోటి మాటచేత]” ఆ ధర్మవిరోధిని నాశనం చేస్తాడని చెప్పవచ్చు.

2:​13, 14​​—⁠అభిషిక్త క్రైస్తవులు ఏ భావంలో ‘రక్షణపొందడానికి ఆదినుండి ఏర్పర్చబడ్డారు’? స్త్రీ సంతానం సాతాను తల చితకదొక్కాలని సంకల్పించినప్పుడే యెహోవా ఇంతమంది అభిషిక్త క్రైస్తవులుగా ఉంటారని నిర్ణయించాడు. (ఆది. 3:​15) వారు ఎలా ఉండాలో, ఏ పని చేయాలో, ఎలాంటి శ్రమలను ఎదుర్కొంటారో కూడ యెహోవా చెప్పాడు.

మనకు పాఠాలు:

1:​6-9. యెహోవా దుష్టులను మాత్రమే శిక్షిస్తాడు.

3:​8-​12. మన అవసరాలు తీర్చుకోవడానికి, పరిచర్యలో పాల్గొనడానికి అవసరమైన డబ్బు కోసం మనం పని చేయాలి. యెహోవా దినం సమీపించిందనే సాకుతో పని చేయడం మానకూడదు. మనం పని చేయకుండా ఉంటే సోమరిపోతులుగా మారవచ్చు. అంతేకాదు ‘పరులజోలికి పోయేవారిగా’ తయారవుతాం.​—⁠1 పేతు. 4:⁠15.

‘నీకు అప్పగించబడినదానిని కాపాడుకో’

(1 తిమోతి 1:1​—⁠6:⁠21)

‘విశ్వాసము, మంచి మనస్సాక్షి కలిగినవాడై . . . మంచి పోరాటము’ పోరాడాలని పౌలు తిమోతికి ఉపదేశించాడు. ఆ తర్వాత సంఘంలో బాధ్యతలు అప్పగించబడేవారికి ఏ అర్హతలుండాలో చెప్పాడు. అంతేకాదు తిమోతి ‘అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలని’ కూడ చెప్పాడు.​—⁠1 తిమో. 1:​18, 19; 3:1-10, 12, 13; 4:⁠7.

‘వృద్ధుని గద్దించవద్దని’ పౌలు రాశాడు. “నీకు అప్పగింపబడినదానిని కాపాడి, అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము” అని తిమోతిని ఉపదేశించాడు.​—⁠1 తిమో. 5:⁠1; 6:⁠20.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​18; 4:​14​​—⁠తిమోతి గురించి ఎలాంటిప్రవచనములుచెప్పబడ్డాయి? పౌలు తన రెండవ మిషనరీ యాత్రలో లుస్త్రకు వెళ్లినప్పుడు, సంఘంలో తిమోతి చేపట్టబోయే బాధ్యతల గురించి పరిశుద్ధాత్మ సహాయంతో కొన్ని ప్రవచనాలు చెప్పివుండవచ్చు. (అపొ. 16:​1, 2) ఆ ‘ప్రవచనాలను’ బట్టే సంఘంలోని పెద్దలు యువకుడైన తిమోతిపై “హస్తనిక్షేపణము” చేసి అంటే తలపై చేతులుంచి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.

2:15​​—⁠ఒక స్త్రీ ఎలా ‘శిశుప్రసూతి ద్వారా రక్షించబడుతుంది’? పిల్లలను కని, వారి ఆలనాపాలనా చూసుకుంటూ, ఇంటి పనులను చేసుకునే స్త్రీ బద్ధకస్థురాలిగా, ‘అనరాని మాటలు మాట్లాడేదానిగా వదరుబోతుగా, పరులజోలికి పోయేదానిగా’ మారకుండా ‘రక్షించబడే’ అవకాశం ఉంది.​​—⁠1 తిమో. 5:​11-15.

3:16​​—⁠దైవభక్తి గురించిన మర్మము ఏమిటి? మానవులు యెహోవా సర్వాధిపత్యానికి పూర్తి విధేయత చూపించగలరా లేదా అన్న విషయం ఎంతో కాలం మర్మంగా ఉండిపోయింది. యేసు మరణంవరకు దేవునికి యథార్థంగా ఉండి దానికి జవాబిచ్చాడు.

6:​15, 16​​—⁠ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయి​—⁠యెహోవా దేవునికా లేక యేసుక్రీస్తుకా? ఆ మాటలు యేసుక్రీస్తు ప్రత్యక్షత గురించి వర్ణిస్తున్నాయి కాబట్టి అవి ఆయనకే వర్తిస్తాయి. (1 తిమో. 6:​14) రాజులుగా, ప్రభువులుగా పరిపాలించే మానవులతో పోలిస్తే యేసు మాత్రమే “అద్వితీయుడునగు సర్వాధిపతి.” ఆయనొక్కడే మరణంలేనివాడు. (దాని. 7:​14; రోమా. 6:​8, 9) ఆయన పరలోకానికి ఆరోహణమైనప్పటినుండి భూమ్మీద ఏ మానవుడూ ‘ఆయనను చూడలేడు.’

మనకు పాఠాలు:

4:​15. మనం ఇటీవల క్రైస్తవులమైనా లేక ఎప్పటినుండో క్రైస్తవులముగా ఉన్నా ప్రగతి సాధించడానికి, యెహోవాతో మనకున్న సంబంధాన్ని బలపర్చుకోవడానికి కృషి చేస్తూ ఉండాలి.

6:⁠2. తోటి విశ్వాసి దగ్గర పనిచేస్తూ ఉంటే, వారిని ఏ విధంగానూ స్వార్థం కోసం ఉపయోగించుకోకూడదు. సాక్షికాని వ్యక్తికి చేసేదానికన్నా మరింత ఇష్టపూర్వకంగా మనం మన సహోదరునికి సేవచేయాలి.

‘ప్రకటించుము, ప్రయాసపడుము’

(2 తిమో. 1:1​—⁠4:⁠22)

రాబోయే కష్టకాలాలను ఎదుర్కొనేందుకు తిమోతిని సిద్ధంచేయడానికి పౌలు ఆయనకిలా రాశాడు: “దేవుడు మనకు శక్తియు ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమునుగల ఆత్మనే యిచ్చెను గాని పిరికితనముగల ఆత్మ నియ్యలేదు.” అంతేకాక ఈ సలహానిచ్చాడు: “ప్రభువుయొక్క దాసుడు . . . జగడమాడక అందరి యెడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను” ఉండాలి.​—⁠2 తిమో. 1:⁠7; 2:⁠26.

‘నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవాటియందు నిలుకడగా ఉండుము’ అని పౌలు తిమోతిని ప్రోత్సహించాడు. అప్పుడు మతభ్రష్ట బోధలు వ్యాపిస్తుండడంతో ఆయన యువకుడైన పైవిచారణకర్తకు ఇలా ఉపదేశించాడు: ‘వాక్యమును ప్రకటించుము; ప్రయాసపడుము; ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము.’​—⁠2 తిమో. 3:​14; 4:⁠2.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​13​​—⁠“హితవాక్యప్రమాణము” అంటే ఏమిటి? “ప్రభువైన యేసుక్రీస్తుయొక్క” నిజమైన క్రైస్తవ బోధలే ఆ ‘హితవాక్యములు.’ (1 తిమో. 6:⁠3) యేసు దేవుని వాక్యం ప్రకారంగానే పనులు చేశాడు, బోధించాడు. కాబట్టి ‘హితవాక్యములు’ అన్న పదం బైబిలు బోధలన్నిటికి కూడ వర్తిస్తుంది. ఆ బోధలు యెహోవా మననుండి ఏమి కోరుతున్నాడో తెలుసుకునేందుకు సహాయపడతాయి. మనం బైబిలు నుండి నేర్చుకున్న విషయాలను పాటించడం ద్వారా ఆ ప్రమాణానికి అనుగుణంగా నడుచుకుంటాం.

4:​13​​—⁠పౌలు ఏ “చర్మపు కాగితములు” తీసుకురమ్మన్నాడు? ఆయన రోమాలో ఖైదీగా ఉన్నప్పుడు అధ్యయనం చేయడానికి బహుశా హెబ్రీ లేఖనాలున్న చర్మ కాగితపు పుస్తకాలను తెమ్మని అడిగివుంటాడు. వాటిలో కొన్ని పపైరస్‌తో, మరికొన్ని చర్మంతో చేయబడి ఉండవచ్చు.

మనకు పాఠాలు:

1:⁠5; 3:​15. తిమోతికి చిన్నప్పటినుండే ఇంట్లో పరిశుద్ధ లేఖనాల నుండి శిక్షణ దొరికింది కాబట్టే ఆయన క్రీస్తుయేసుపై విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసంతోనే ఆయన అన్ని పనులు చేశాడు. తల్లిదండ్రులు దేవుని విషయంలో, తమ పిల్లల విషయంలో బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తున్నామో లేదో ఆలోచించడం ఎంత ప్రాముఖ్యం!

1:​16-​18. తోటి సహోదరులు కష్టాల్లో ఉన్నప్పుడు, హింసను ఎదుర్కొంటున్నప్పుడు లేదా జైల్లో వేయబడినప్పుడు మనం వారి కోసం ప్రార్థిస్తూ, చేతనైనంత సహాయం చేద్దాం.​—⁠సామె. 3:​27; 1 థెస్స. 5:⁠25.

2:​22. క్రైస్తవులు, ముఖ్యంగా యువకులు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు సమయం లేనంతగా శారీరక వ్యాయామం, క్రీడలు, సంగీతం, వినోదం, హాబీలు, విహారయాత్రలు, పనికిరాని మాటలు మాట్లాడడం వంటి విషయాల్లో మునిగిపోకూడదు.

[31వ పేజీలోని చిత్రం]

అపొస్తలుడైన పౌలు రాసిన ప్రేరేపిత పత్రికల్లో ఏది ఆఖరిది?