కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని మందనుండి తప్పిపోయినవారికి సహాయం చేయండి

దేవుని మందనుండి తప్పిపోయినవారికి సహాయం చేయండి

దేవుని మందనుండి తప్పిపోయినవారికి సహాయం చేయండి

“మీరు నాతో కూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినది.” —లూకా 15:6.

యెహోవా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుకు “గొప్ప కాపరి” అనే పేరుంది. (హెబ్రీ. 13:20) ఆయన వస్తాడనీ, ఇశ్రాయేలులోని “నశించిన గొఱ్ఱెల”ను వెతికే కాపరి ఆయనేననీ లేఖనాలు ప్రవచించాయి. (మత్త. 2:1-6; 15:24) ఒక కాపరి తన గొర్రెలను కాపాడేందుకు తన ప్రాణాన్ని ఇవ్వడానికైనా వెనకాడడు. అలాగే యేసు కూడా తన బలి నుండి ప్రయోజనం పొందే గొర్రెల్లాంటి ప్రజల కోసం తన ప్రాణాన్ని విమోచనా క్రయధనంగా అర్పించడానికి వెనకాడలేదు.—యోహా. 10:11, 15; 1 యోహా. 2:1, 2.

2 విచారకరంగా, యేసు విమోచనా క్రయధనంపట్ల కృతజ్ఞత ఉన్నట్లు చూపించిన దేవుని సమర్పిత సేవకుల్లో కొందరు ఇప్పుడు క్రైస్తవ సంఘంతో సహవసించడంలేదు. నిరుత్సాహం, ఆరోగ్య సమస్యలు, మరితర కారణాలనుబట్టి ఉత్సాహం సన్నగిల్లి వారు నిష్క్రియులయ్యారు. అయితే, వారు దేవుని మందలో ఉంటేనే 23వ కీర్తనలో దావీదు వర్ణించిన సమాధానాన్ని, సంతోషాన్ని పొందుతారు. ఉదాహరణకు, “యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు” అని ఆయన పాడాడు. (కీర్త. 23:⁠1) దేవుని మందలో ఉండేవారికి ఆధ్యాత్మికంగా ఎలాంటి కొరతా ఉండదు కానీ తప్పిపోయిన​వారి విషయంలో మాత్రం అలాకాదు. అలాంటప్పుడు, వారికి ఎవరు సహాయం చేయవచ్చు? ఎలా సహాయం చేయవచ్చు? మందలోకి తిరిగి రావాలంటే మనం ఏమి చేయాలి?

ఎవరు సహాయం చేయవచ్చు?

3 దేవుని మంద నుండి తప్పిపోయినవారిని కాపాడేందుకు ఎంతో కృషి చేయాలి. (కీర్త. 100:⁠3) యేసు దాన్ని ఇలా ఉదాహరించాడు: “ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన యెడల తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా? వాడు దాని కనుగొనిన యెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించునంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు.” (మత్త. 18:​11-14) మందను నుండి తప్పిపోయిన గొర్రెల్లాంటివారికి ఎవరు సహాయం చేయవచ్చు?

4 క్రైస్తవ పెద్దలు తప్పిపోయిన గొర్రెలకు సహాయం చేయాల్సివచ్చినప్పుడు దేవుని మందలో ఉన్నవారందరూ ఆయనకు సమర్పించుకున్న క్రైస్తవులే అని గుర్తుంచుకోవాలి. అవును, వారు నిజంగా ‘దేవునికి’ అమూల్యమైన ‘మందలోని గొర్రెలే.’ (కీర్త. 79:​13, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ప్రియమైన దేవుని గొర్రెలపట్ల వాత్సల్యాన్ని కనబరచాలి. అంటే ప్రేమగల కాపరులు వారిపట్ల శ్రద్ధ కనబరచాలి. అలాంటివారిని కాపరులు స్నేహపూర్వకంగా సందర్శిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. కాపరి వారిని ప్రేమతో ప్రోత్సహిస్తే వారి విశ్వాసం, మందలోకి తిరిగి చేరాలనే వారి కోరిక బలపడుతుంది.​—⁠1 కొరిం. 8:⁠1.

5 తప్పిపోయిన గొర్రెలను వెదకి వారికి సహాయం చేయడానికి కాపరులు ప్రయత్నించాలి. మందను కాసే బాధ్యత వారికుందని అపొస్తలుడైన పౌలు ప్రాచీన ఎఫెసులోని క్రైస్తవ పెద్దలకు గుర్తుచేశాడు. “దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా ఉండుడి” అని వారికి రాశాడు. (అపొ. 20:​28) అపొస్తలుడైన పేతురు కూడా అభిషిక్త పెద్దలను, “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి” అని ప్రోత్సహించాడు.​—⁠1 పేతు. 5:​1-3.

6 క్రైస్తవ కాపరులు “మంచి కాపరిని” అనుకరించాలి. (యోహా. 10:​11) యేసు, దేవుని గొర్రెలపట్ల ఎంతో శ్రద్ధ చూపించాడు. “నా గొఱ్ఱె పిల్లలను మేపుము” అని సీమోను పేతురుకు చెప్పడం ద్వారా వారిపట్ల శ్రద్ధచూపించడం ఎంత ప్రాముఖ్యమో ఆయన నొక్కిచెప్పాడు. (యోహాను 21:​15-17 చదవండి.) అపవాది దేవుని సమర్పిత సేవకుల యథార్థతను పాడుచేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కాబట్టి నేడు గొర్రెలపట్ల అలాంటి శ్రద్ధ చూపించడం ఎంతో అవసరం. సాతాను యెహోవా గొర్రెల బలహీనతలను ఆసరాగా తీసుకొని వారితో పాపం చేయించేలా వారిపై లోక ప్రలోభాలను ప్రయోగిస్తాడు. (1 యోహా. 2:​15-17; 5:​19) నిష్క్రియా స్థితిలో ఉన్నవారు సులువుగా సాతాను ఉచ్చులో చిక్కుకునే ప్రమాదముంది కాబట్టి, “ఆత్మానుసారముగా నడుచుకొనుడి” అనే హెచ్చరికను లక్ష్యపెట్టేందుకు వారికి సహాయం అవసరం. (గల. 5:​16-21, 25) అలాంటివారికి సహాయం చేయాలంటే మనం దేవుని నిర్దేశం కోసం, ఆయన పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించి, ఆయన వాక్యాన్ని నైపుణ్యంగా ఉపయోగించాలి.​—⁠సామె. 3:​5, 6; లూకా 11:​13; హెబ్రీ. 4:⁠12.

7 ప్రాచీన ఇశ్రాయేలులో కాపరి పెద్ద కొంకి కర్రతో లేదా కోలకర్రతో తన మందను తోలేవాడు. గొర్రెలు దొడ్డిలోకి వస్తున్నప్పుడూ బయటికి వెళ్తున్నప్పుడూ కాపరి ద్వారం దగ్గర నుంచొని పట్టుకున్న ‘కోలకర్ర క్రింద’ నుండి వెళ్లేవి. అలా వెళ్లడంవల్ల కాపరి వాటిని లెక్కపెట్టగలిగేవాడు. (లేవీ. 27:​32; మీకా 2:​12; 7:​14) క్రైస్తవ కాపరి కూడ తన కాపుదలలో ఉన్న దేవుని మంద గురించి బాగా తెలుసుకోవాలి. అంతేకాదు, ప్రతీ ఒక్కరి బాగోగులు కూడ ఆయనకు తెలుసుండాలి. (సామెతలు 27:⁠23 పోల్చండి.) కాబట్టి, పెద్దల సభలో పెద్దలు అనేక ఇతర విషయాలే కాక కాపరి సందర్శనానికి కూడ తమ చర్చల్లో ప్రాముఖ్యతనిస్తారు. తప్పిపోయిన గొర్రెలకు సహాయం చేయడానికి ఏమి చేయాలో కూడ చర్చిస్తారు. తన గొర్రెలను వెదకి వాటికి అవసరమైన సహాయాన్నిస్తానని యెహోవా స్వయంగా చెప్పాడు. (యెహె. 34:​11) కాబట్టి, తప్పిపోయిన గొర్రె మందలోకి వచ్చేలా సహాయం చేసేందుకు పెద్దలు ఆయనలాగే చర్యలు తీసుకున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు.

8 అనారోగ్యంగా ఉన్న తోటి విశ్వాసులను కాపరి సందర్శించినప్పుడు వారు ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతారు. ఆధ్యాత్మికంగా అనారోగ్యంతో ఉన్నవారిపట్ల కాపరి వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించినప్పుడు కూడ వారు ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని పొందుతారు. వారితో కలిసి లేఖనాలు చదవడం ద్వారా, ఒక ఆర్టికల్‌ను, కూటంలోని ముఖ్యాంశాలను చర్చించడం ద్వారా, కలిసి ప్రార్థించడం ద్వారా పెద్దలు వారిని ప్రోత్సహించవచ్చు. వారు కూటాలకు తిరిగి రావడం మొదలుపెడితే సంఘ సభ్యులు ఎంతో సంతోషిస్తారని పెద్దలు వారికి చెప్పవచ్చు. (2 కొరిం. 1:​3-7; యాకో. 5:​13-15) వారి ఇంటికి వెళ్లినా, ఫోను చేసినా, లేదా ఓ ఉత్తరం రాసినా కూడ వారు ఎంతో ప్రోత్సాహాన్ని పొందుతారు. మందను నుండి తప్పిపోయిన గొర్రెకు వ్యక్తిగతంగా సహాయం చేసినప్పుడు కనికరంగల కాపరి కూడ ఎంతో ఆనందిస్తాడు.

సమైక్య కృషి

9 ఈ అపాయకరమైన కాలాల్లో మనకు అసలు తీరికుండదు కాబట్టి, తోటి క్రైస్తవుడు సంఘం నుండి కొట్టుకొనిపోవడం మనం గమనించకపోవచ్చు. (హెబ్రీ. 2:⁠1) కానీ యెహోవా తన గొర్రెలను ఎంతో విలువైనవిగా ఎంచుతున్నాడు. మానవ శరీరంలో ప్రతీ అవయవం ఎంత విలువైనదో మందలోని ప్రతీ ఒక్కరూ అంతే విలువైనవారు. కాబట్టి, మనమందరం మన సహోదరుల గురించి ఆలోచించి వారిపట్ల నిజమైన శ్రద్ధ కనబరచాలి. (1 కొరిం. 12:​24) మీరలా చేస్తున్నారా?

10 తప్పిపోయిన గొర్రెలను వెదకి వారికి సహాయం చేసే బాధ్యత ముఖ్యంగా పెద్దలదే అయినా, వారు మాత్రమే శ్రద్ధ కనబరిస్తే సరిపోదు. ఇతరులూ ఆ కాపరులకు సహాయం చేయాలి. మందంలోకి తిరిగివచ్చేందుకు సహాయం అవసరమైన మన సహోదరసహోదరీలకు మనమూ ప్రోత్సాహాన్ని, ఆధ్యాత్మిక సహాయాన్ని ఇవ్వవచ్చు. మనం అలా ఇవ్వాలి కూడ. అయితే, మనం వారికెలా సహాయం చేయవచ్చు?

11 కొన్ని సందర్భాల్లో పెద్దలు, సహాయాన్ని కోరే నిష్క్రియులతో బైబిలు అధ్యయనం చేయమని అనుభవజ్ఞులైన ప్రచారకులను కోరవచ్చు. ఇలాంటి ఏర్పాట్లు, ‘మొదట వారికున్న ప్రేమ’ తిరిగి కలిగేలా దోహదపడతాయి. (ప్రక. 2:​1, 4) వారు ఇంతకాలం కూటాలకు హాజరవ్వకపోవడం వల్ల వినలేకపోయిన సమాచారాన్ని వారితో చర్చిస్తే వారి విశ్వాసం బలపడుతుంది.

12 కొంత ఆధ్యాత్మిక సహాయం అవసరమైన తోటి విశ్వాసితో బైబిలు అధ్యయనం చేయమని పెద్దలు మిమ్మల్ని కోరితే యెహోవా మిమ్మల్ని నిర్దేశించాలనీ, మీ ప్రయత్నాలను ఆశీర్వదించాలనీ ప్రార్థించండి. ‘మీ పనుల భారము యెహోవామీద ఉంచితే మీ ఉద్దేశములు’ తప్పక ‘సఫలమౌతాయి.’ (సామె. 16:⁠3) ఆధ్యాత్మిక సహాయం అవసరమైనవారితో చర్చించాల్సిన బైబిలు లేఖనాల గురించి, విశ్వాసాన్ని బలపర్చే విషయాల గురించి ధ్యానించండి. అపొస్తలుడైన పౌలు ఉంచిన చక్కని మాదిరి గురించి ఆలోచించండి. (రోమీయులు 1:​11, 12 చదవండి.) రోమాలోని క్రైస్తవుల విశ్వాసం స్థిరపడేలా వారికి ఆత్మసంబంధమైన కృపావరమేదైనా ఇచ్చేందుకు వారిని కలుసుకోవాలని పౌలు ఎంతగానో కోరుకున్నాడు. పరస్పర ప్రోత్సాహం పొందాలని కూడా ఆయన ఆశించాడు. దేవుని మంద నుండి తప్పిపోయిన గొర్రెల్లాంటి​వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనం కూడ ఆయనలాగే ఆలోచించాలి కదా?

13 వారితో అధ్యయనం చేస్తున్నప్పుడు “మీరు సత్యాన్ని ఎలా తెలుసుకున్నారు?” అని అడగవచ్చు. వారు గతంలో యెహోవా సేవలో పొందిన ఆనందాలను గుర్తుచేసుకునేలా వారికి సహాయం చేసి, కూటాల్లో, ప్రకటనా పనిలో, సమావేశాల్లో వారికి ఎదురైన మంచి అనుభవాలను చెప్పమని ప్రోత్సహించండి. ఒకప్పుడు మీరు వారితో కలిసి యెహోవా సేవలో సంతోషంగా గడిపిన సందర్భాలను గుర్తుచేయండి. యెహోవాకు దగ్గరవడంవల్ల మీరు ఎంత ఆనందాన్ని పొందుతున్నారో వివరించండి. (యాకో. 4:⁠8) దేవుడు మనల్ని తన ప్రజలుగా పరిగణించి శ్రద్ధ చూపిస్తున్నందుకు, ప్రాముఖ్యంగా శ్రమల్లో ఓదార్పును, నిరీక్షణను ఇస్తూ శ్రద్ధ చూపిస్తున్నందుకు మీకు ఆయనపట్ల ఎంత కృతజ్ఞత ఉందో తెలియజేయండి.​—⁠రోమా. 15:⁠4; 2 కొరిం. 1:​3, 4.

14 నిష్క్రియులైన సహోదరులు సంఘంతో చురుకుగా సహవసించినప్పుడు పొందిన కొన్ని ఆశీర్వాదాలను వారికి గుర్తుచేస్తే బాగుంటుంది. ఉదాహరణకు, దేవుని వాక్యం గురించి, ఆయన ఉద్దేశాల గురించి వారు మరింత తెలుసుకోగలిగారు. (సామె. 4:​18) వారు ‘ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు’ పాపం చేయాలనే శోధనలను సులభంగా ఎదిరించగలిగారు. (గల. 5:​22-26) దానివల్ల నిర్మలమైన మనస్సాక్షితో యెహోవాకు ప్రార్థించగలిగారు, ‘హృదయములకు తలంపులకు కావలివుండే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని’ అనుభవించగలిగారు. (ఫిలి. 4:​6, 7) ఈ విషయాలను గుర్తుంచుకొని వారిపట్ల నిజమైన శ్రద్ధ కనబరచండి. మందలోకి తిరిగి చేరేలా మీ ఆధ్యాత్మిక సహోదరుణ్ణి/సహోదరిని ప్రేమపూర్వకంగా ప్రోత్సహించేందుకు మీరు చేయగలిగినదంతా చేయండి.​—⁠ఫిలిప్పీయులు 2:4 చదవండి.

15 మీరు కాపరి సందర్శనం చేస్తున్న పెద్ద అయితే, దేవుని వాక్య సత్యాన్ని మొదటిసారి తెలుసుకున్నప్పుడు వారికి ఎలా అనిపించిందో గుర్తుచేసుకోమని నిష్క్రియులైన దంపతులను మీరు ప్రోత్సహించవచ్చు. అప్పుడు వారు విన్న విషయాలు సరైనవిగా, సంతృప్తినిచ్చేవిగా అద్భుతమైనవిగా అనిపించివుంటాయి. వారికి ఆధ్యాత్మిక అంధకారం నుండి బయటికి వచ్చినట్లు అనిపించివుంటుంది. (యోహా. 8:​32) యెహోవా గురించి, ఆయన ప్రేమ గురించి, అద్భుతమైన ఆయన ఉద్దేశాల గురించి తెలుసుకున్నందుకు వారు ఆయనకు ఎంతో కృతజ్ఞత తెలియజేసివుంటారు! (లూకా 24:⁠32 పోల్చండి.) సమర్పిత క్రైస్తవులు దేవునితో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగివుంటారనీ, వారికి ప్రార్థించే అద్భుతమైన అవకాశం ఉంటుందనీ గుర్తుచేయండి. ‘శ్రీమంతుడగు దేవుడైన’ యెహోవా ‘అప్పగించిన మహిమగల సువార్తకు’ మళ్లీ స్పందించమని నిష్క్రియులైన సహోదరులను హృదయపూర్వకంగా ప్రోత్సహించండి.​—⁠1 తిమో. 1:⁠8.

వారిపట్ల ప్రేమ కనబరుస్తూ ఉండండి

16 పై సలహాలను పాటించడంవల్ల ప్రయోజనముందా? ఉంది. ఉదాహరణకు, 12 ఏళ్ల వయసులో రాజ్య ప్రచారకుడైన ఒక యౌవనస్థుడు 15 ఏళ్లకు నిష్క్రియుడయ్యాడు. అయితే, ఆయన మళ్లీ చురుకైన రాజ్య ప్రచారకుడై దాదాపు 30 ఏళ్లుగా పూర్తికాల సేవ చేస్తున్నాడు. క్రైస్తవ పెద్ద సహాయం చేయడంవల్లే ఆయన మళ్లీ పరిచర్యలో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టాడు. ఆ పెద్ద చేసిన సహాయాన్ని ఆయనెప్పటికీ మరచిపోలేడు.

17 క్రైస్తవులకు ప్రేమ ఉంది కాబట్టే వారు నిష్క్రియులైనవారికి సంఘంలోకి తిరిగివచ్చేలా సహాయం చేస్తారు. యేసు తన శిష్యులతో ఇలా చెప్పాడు: “మీరు ఒకరి నొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.” (యోహా. 13:​34, 35) ప్రేమనుబట్టే నిజక్రైస్తవులను గుర్తించవచ్చు. బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులు నిష్క్రియులైతే వారిపట్ల ప్రేమ చూపించవద్దా? తప్పక చూపించాలి. అయితే, మనం వారికి సహాయం చేస్తున్నప్పుడు అనేక క్రైస్తవ లక్షణాలను కనబరచాల్సి ఉంటుంది.

18 దేవుని మంద నుండి తప్పిపోయిన వారికి మీరు సహాయం చేయాలనుకుంటే ఎలాంటి లక్షణాలను చూపించాలి? ప్రేమతోపాటు మీరు కనికరం, దయ, సాత్వికం, ధీర్ఘశాంతం చూపించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు, మీరు క్షమాగుణాన్ని కూడ చూపించాలి. “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి” అని పౌలు రాశాడు.​—⁠కొలొ. 3:​12-14.

19 కొందరు దేవుని మంద నుండి ఎందుకు తప్పిపోతున్నారో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకుంటాం. తిరిగివచ్చినవారు సంఘంలో తమకు ఎలాంటి ఆహ్వానం దొరుకుతుందని ఎదురుచూడవచ్చో కూడ అది వివరిస్తుంది. ఈ విషయాల గురించి ఆలోచిస్తూ తర్వాతి ఆర్టికల్‌ను అధ్యయనం చేస్తుండగా సంఘం నుండి తప్పిపోయినవారు తిరిగి మందలోకి చేరడానికి మీరు చేసే ఎలాంటి ప్రయత్నమైనా ప్రయోజనకరమైనది అనే నమ్మకంతో ఉండండి. నేటి లోకంలో, అనేకమంది ధనార్జన కోసం తమ జీవితాల్నే ధారపోస్తారు. అయితే లోకంలో ఉన్న డబ్బంతటి కన్నా జీవితం ఎంతో విలువైనది. తప్పిపోయిన గొర్రె గురించిన ఉపమానంలో యేసు ఆ విషయాన్ని నొక్కిచెప్పాడు. (మత్త. 18:​11-14) యెహోవాకు ప్రియమైన తప్పిపోయిన గొర్రెల్లాంటి​వారు మందలోకి తిరిగివచ్చేలా మీరు ఆలస్యం చేయకుండా ఇప్పుడే హృదయపూర్వకంగా ప్రయత్నిస్తుండగా ఆ విషయాన్ని గుర్తుంచుకోండి.

మీరెలా జవాబిస్తారు?

• మందనుండి తప్పిపోయిన గొర్రెల్లాంటివారి విషయంలో క్రైస్తవ కాపరులకు ఏ బాధ్యత ఉంది?

• ఇప్పుడు సంఘంతో చురుకుగా సహవసించనివారికి మీరెలా సహాయం చేయవచ్చు?

• మంద నుండి తప్పిపోయినవారికి సహాయం చేసేందుకు మీరు ఎలాంటి లక్షణాలు చూపించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసు ప్రేమగల కాపరి అని ఎలా చూపించాడు?

2. ఏయే కారణాలనుబట్టి కొందరు క్రైస్తవులు నిష్క్రియులౌతారు?

3. దేవుని మంద నుండి తప్పిపోయినవారిని కాపాడేందుకు ఏమి చేయాలనే విషయాన్ని యేసు ఎలా ఉదాహరించాడు?

4, 5. దేవుని మందను పెద్దలు ఎలా చూడాలి?

6. కాపరులు నేడు దేవుని గొర్రెలపట్ల ఎందుకు మరింత శ్రద్ధ కనబర్చాలి?

7. తమ కాపుదలలోవున్న గొర్రెల్లాంటివారిని కాసే విషయానికి పెద్దలు ఎంత ప్రాముఖ్యతనిస్తారు?

8. మందలోని గొర్రెలపట్ల పెద్దలు ఏయే విధాలుగా శ్రద్ధ చూపించవచ్చు?

9, 10. మంద నుండి తప్పిపోయినవారిపట్ల పెద్దలు మాత్రమే శ్రద్ధ కనబరిస్తే ఎందుకు సరిపోదు?

11, 12. నిష్క్రియులైన తోటి విశ్వాసులకు సహాయం చేసే ఎలాంటి సదవకాశం మీకు లభించవచ్చు?

13. నిష్క్రియులైన సహోదరులతో వేటి గురించి మాట్లాడవచ్చు?

14, 15. నిష్క్రియులైన సహోదరులు ఒకప్పుడు అనుభవించిన ఏ ఆశీర్వాదాలను వారికి గుర్తుచేస్తే బాగుంటుంది?

16. ఆధ్యాత్మిక సహాయం చేసేందుకు కృషిచేయడంవల్ల ఎంతో ప్రయోజనముందని చూపించే ఒక ఉదాహరణ చెప్పండి.

17, 18. దేవుని మంద నుండి తప్పిపోయినవారికి సహాయం చేయాలంటే మీరు ఏ లక్షణాలు చూపించాలి?

19. మందలోకి తిరిగి వచ్చేలా గొర్రెల్లాంటి ప్రజలకు సహాయం చేసేందుకు కృషి చేయడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?

[10వ పేజీలోని చిత్రం]

క్రై స్తవ కాపరులు దేవుని మంద నుండి తప్పిపోయినవారికి ప్రేమతో సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు