కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆరోగ్య సంరక్షణ విషయంలో లేఖనాల నిర్దేశాన్ని పాటిస్తూ ఉండండి

ఆరోగ్య సంరక్షణ విషయంలో లేఖనాల నిర్దేశాన్ని పాటిస్తూ ఉండండి

ఆరోగ్య సంరక్షణ విషయంలో లేఖనాల నిర్దేశాన్ని పాటిస్తూ ఉండండి

“నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును [యెహోవాను] ప్రేమింపవలెను.”​—⁠మార్కు 12:⁠30.

మానవులు అనారోగ్యంపాలై చనిపోవాలనే ఉద్దేశంతో యెహోవా దేవుడు వారిని సృష్టించలేదు. ఆయన ఆదాముహవ్వలను ఏదెను తోటలో లేదా ఆహ్లాదకరమైన పరదైసులో ఉంచాడు. వారు 70 లేక 80 సంవత్సరాలు మాత్రమే కాదుగాని నిరంతరం దాన్ని ‘సేద్యపరచి కాయాలనే’ ఉద్దేశంతో వారిని అక్కడ ఉంచాడు. (ఆది. 2:​8, 15; కీర్త. 90:​10) ఆ మొదటి మానవ జంట యెహోవాకు నమ్మకంగా ఉంటూ, ప్రేమతో ఆయన సర్వాధిపత్యానికి లోబడి ఉంటే వారెప్పటికీ అనారోగ్యం పాలయ్యేవారు కాదు, బలహీనులయ్యేవారూ కాదు, చివరకు మరణించి ఉండేవారూ కాదు.

2 అపరిపూర్ణ మానవులకు వృద్ధా​ప్యంలో వచ్చే “దుర్దినముల” గురించి ప్రసంగి 12వ అధ్యాయం స్పష్టంగా వివరిస్తోంది. (ప్రసంగి 12:​1-7 చదవండి.) వృద్ధాప్యంలో తెల్లని జుట్టు, “బాదము వృక్షము” పూతలా ఉంటుంది. “బలిష్ఠుల”తో పోల్చబడిన కాళ్లు వంగి, వణుకుతాయి. వెలుతురు కోసం కిటికీలో నుండి చూసేవారికి ఏమీ కనపించదు అంటే చూపు మందగిస్తుంది. ‘విసరువారు కొద్దిమంది యగుటచేత పని’ ఆగిపోతుంది అంటే కొన్ని పళ్లు ఊడిపోతాయి.

3 మానవుల కాళ్లు వణకాలని, చూపు మందగించాలని, పళ్లు ఊడిపోవాలని దేవుడు ఉద్దేశించలేదు. దేవుని కుమారుడు తన మెస్సీయ రాజ్యంలో ఆదాము ద్వారా వచ్చిన మరణమేకాక ‘అపవాది క్రియలు’ అన్నింటినీ తీసివేస్తాడు. “అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను” అని అపొస్తలుడైన యోహాను రాశాడు.​—⁠1 యోహా. 3:⁠8.

కొంతమేర శ్రద్ధ కలిగివుండడం తప్పుకాదు

4 పాపభరితులైన మానవులకు సాధారణంగా అనారోగ్యం, వృద్ధాప్యం వస్తాయి. యెహోవా సేవకుల్లో కొంతమంది కూడా వాటితో బాధపడుతున్నారు. కాబట్టి మన ఆరోగ్యం విషయంలో కొంతమేర శ్రద్ధ తీసుకోవడం తప్పుకాదు. అలా శ్రద్ధ తీసుకోవడం మంచిది కూడా. మనం “పూర్ణబలముతో” యెహోవాను సేవించాలని కోరుకోవడం లేదా? (మార్కు 12:​30) ఆరోగ్యంగా ఉండడానికి సాధ్యమైనంతవరకూ ప్రయత్నించడంలో తప్పులేదు. అయితే వృద్ధాప్యం త్వరగా రాకుండా చూసుకోవడానికి లేదా వ్యాధులన్నింటినీ తప్పించుకోవడానికి మనం చేయగలిగింది చాలా తక్కువనే విషయాన్ని గ్రహించాలి.

5 యెహోవాకు నమ్మకంగా ఉన్న అనేకులు ఆరోగ్య సమస్యలతో పోరాడాల్సివచ్చింది. వారిలో ఎపఫ్రొదితు ఒకరు. (ఫిలి. 2:​25-27) అపొస్తలుడైన పౌలుకి నమ్మకమైన సహచరునిగా ఉన్న తిమోతి తరచూ కడుపు జబ్బుతో బాధపడేవాడు. అందుకే పౌలు “ద్రాక్షారసము కొంచెము” పుచ్చుకోమని ఆయనకు సలహా ఇచ్చాడు. (1 తిమో. 5:​23) పౌలుకు కూడా “శరీరములో ఒక ముల్లు” ఉండేది. అప్పట్లో చికిత్సలేని కంటి జబ్బుతో లేదా వేరే శారీరక సమస్యతో ఆయన బాధపడివుండవచ్చు. (2 కొరిం. 12:⁠7; గల. 4:​15; 6:​11) తనకు ‘శరీరములో ఉన్న ముల్లు’ గురించి ఆయన యెహోవాను తీవ్రంగా వేడుకున్నాడు. (2 కొరింథీయులకు 12:​8-10 చదవండి.) పౌలు ‘శరీరములో ఉన్న ముల్లును’ దేవుడు అద్భుతరీతిలో తీసివేయలేదు. కానీ దానిని ఓర్చుకునేందుకు బలాన్నిచ్చాడు. యెహోవా శక్తి ఇచ్చాడు కాబట్టే పౌలు ఆ బలహీనతను అధిగమించగలిగాడు. దీనినుండి మనం ఒక చక్కని పాఠం నేర్చుకోవచ్చు.

ఆరోగ్యం విషయంలో అతిగా చింతించకండి

6 యెహోవాసాక్షులు వైద్య సహాయాన్ని, వివిధ రకాల చికిత్సా విధానాలను అంగీకరిస్తారని మీకు తెలుసు. మన తేజరిల్లు! పత్రికలో ఆరోగ్యానికి సంబంధించిన ఆర్టికల్స్‌ ఎన్నో వస్తుంటాయి. మనం ఏ చికిత్సా విధానాన్నీ సిఫారసు చేయం. కానీ వైద్యులు ఇచ్చే సహాయసహకారాలపట్ల మెప్పు చూపిస్తాం. ఇప్పుడు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండడం సాధ్యంకాదని మనకు తెలుసు. కాబట్టి ఆరోగ్యం విషయంలో అదే పనిగా ఆలోచించడం లేదా అతిగా చింతించడం మంచిది కాదు. “నిరీక్షణలేని” వారు మరో జీవితం లేదనుకుని, జబ్బులు నయమవ్వడానికి ఎలాంటి చికిత్సా విధానాలనైనా ఎంచుకుంటారు. అయితే మనమలా ఆలోచించకూడదు. (ఎఫె. 2:​2, 12) దేవునికి యథార్థంగా ఉంటే మనం ‘వాస్తవమైన జీవమును సంపాదించుకొంటామని’ అంటే ఆయన వాగ్దానం చేసిన నూతన విధానంలో నిత్యజీవం పొందుతామని మనకు నమ్మకం ఉంది. కాబట్టి మన ప్రస్తుత జీవితాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో యెహోవా అనుగ్రహాన్ని కోల్పోకూడదనే తీర్మానంతో ఉందాం.​—⁠1 తిమో. 6:​12, 18, 19; 2 పేతు. 3:⁠13.

7 ఆరోగ్యం విషయంలో అతిగా చింతించకుండా ఉండడానికి మరో కారణం కూడా ఉంది. మనం ఆరోగ్యం గురించి అతిగా ఆలోచిస్తే స్వార్థపరులముగా తయారయ్యే ప్రమాదముంది. పౌలు దీని గురించి ముందే హెచ్చరిస్తూ ఫిలిప్పీయులతో, “మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను” అని చెప్పాడు. (ఫిలి. 2:⁠4) మన ఆరోగ్యం విషయంలో కొంతమేర శ్రద్ధ తీసుకోవడం తప్పుకాదు. కానీ మన సహోదరులపట్ల, “రాజ్య సువార్తను” ప్రకటించే ప్రజల​పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మన ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండగలుగుతాం.​—⁠మత్త. 24:⁠14.

8 క్రైస్తవులు ఆరోగ్యం విషయంలో అతిగా చింతిస్తూ యెహోవా సేవను నిర్లక్ష్యం చేసే ప్రమాదముంది. అంతేకాక, చికిత్సా విధానాలు, ఆహార అలవాట్లు, ఆహార పదార్థాల విషయంలో మనకున్న అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి ప్రయత్నిస్తాం. ఈ విషయంలో పౌలు మాటల్లోవున్న సూత్రాన్ని మనం పాటించాలి. ఆయన ఇలా అన్నాడు: ‘క్రీస్తు దినమునకు నిష్కపటులును నిర్దోషులును కావడానికి మీరు శ్రేష్ఠమైన [“మరింత ప్రాముఖ్యమైన,” NW] కార్యములను వివేచించండి.’​—⁠ఫిలి. 1:​9-11.

దేనికి మరింత ప్రాముఖ్యతనివ్వాలి?

9 మరింత ప్రాముఖ్యమైనవి ఏవో తెలుసుకుంటే ఇతరులకు ఆధ్యాత్మిక స్వస్థత చేకూర్చే పనిలో మనం చురుకుగా పాల్గొంటాం. దేవుని వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, బోధించడం ద్వారా వారికి స్వస్థత చేకూరుతుంది. ఆనందాన్నిచ్చే ఈ పనిలో పాల్గొనడంవల్ల మనకూ మన బోధ వినేవారికీ ప్రయోజనం ఉంటుంది. (సామె. 17:​22; 1 తిమో. 4:​15, 16) కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో తీవ్ర అనారోగ్య పరిస్థితులను సహించిన మన సహోదరసహోదరీల అనుభవాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. వారు ఎలా సహించగలిగారో కొన్నిసార్లు వాటిలో వివరించబడుతుంది. యెహోవా గురించి, ఆయన వాగ్దానం చేసిన అద్భుతమైన ఆశీర్వాదాల గురించి ఇతరులు తెలుసుకునేలా సహాయం చేయడం ద్వారా కొంతకాలంపాటు తమ సమస్యలను ఎలా మరిచిపోగలిగారో కూడ వివరించబడుతుంది. *

10 చికిత్సా విధానాన్ని ఎన్నుకొనే విషయంలో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వయోజనుడైన ప్రతీ క్రైస్తవుడు “తన బరువు తానే భరించుకొన​వలెను.” (గల. 6:⁠5) మనం తీసుకునే నిర్ణయం విషయంలో యెహోవాకు ఎంతో శ్రద్ధవుంది. బైబిలు సూత్రాలపట్ల గౌరవంతో మనం ఎలాగైతే ‘రక్తాన్ని విసర్జిస్తామో’ అలాగే దేవునివాక్యం పట్ల ప్రగాఢ గౌరవంతో బైబిలు సూత్రాలను ఉల్లంఘించే లేదా యెహోవాతో మన సంబంధాన్ని పాడుచేసే చికిత్సా విధానాలను మనం అంగీకరించం. (అపొ. 15:​20) కొన్ని రోగనిర్ధారణా పద్ధతులు, చికిత్సా విధానాలు అభిచారానికి సంబంధమున్నట్లు కనిపిస్తాయి. మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు ‘మానవాతీత శక్తులను’ ఆశ్రయించినప్పుడు లేదా అభిచార క్రియలకు పాల్పడినప్పుడు యెహోవా దాన్ని ఖండించాడు. ఆయన ఇలా అన్నాడు: “మీ నైవేద్యము వ్యర్థము అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతిదినమును సమాజకూట ప్రకటనమును జరుగుచున్నవి పాపులగుంపుకూడిన [‘మానవాతీత శక్తులను ఆశ్రయిస్తున్న,’ NW] ఉత్సవసమాజమును నే నోర్చజాలను.” (యెష. 1:​13) మన ఆరోగ్యం సరిగా లేనప్పుడు దేవునితో మనకున్న సంబంధాన్ని పాడుచేసే, మన ప్రార్థనలకు అడ్డుతగిలే వేటినైనా చేయకూడదని మనం కోరుకుంటాం.​—⁠విలా. 3:⁠44.

“స్వస్థబుద్ధి”తో ఉండడం చాలా అవసరం

11 మన ఆరోగ్యం బాగోలేకపోతే యెహోవా అద్భుతంగా బాగుచేయాలని మనం ఆశించలేం కానీ చికిత్సా విధానాన్ని ఎన్నుకునే విషయంలో జ్ఞానం ఇవ్వమని ప్రార్థించ​వచ్చు. అలాంటి సమయాల్లో, లేఖన సూత్రాలకు అనుగుణంగా, మంచి వివేచనతో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. పరిస్థితి విషమించినప్పుడు సామెతలు 15:⁠22 చెబుతున్నట్లు సాధ్యమైతే ఒకరికన్నా ఎక్కువమంది వైద్యులను సంప్రదించడం మంచిది. ఆ లేఖనంలో ఇలా ఉంది: “ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును. ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.” అపొస్తలుడైన పౌలు, “లోకములో స్వస్థబుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెను” అని తోటి విశ్వాసులను ప్రోత్సహించాడు.​—⁠తీతు 2:⁠13.

12 నేడు అనేకమంది ఆరోగ్య పరిస్థితి యేసు కాలంలో అనారోగ్యంతో బాధపడిన ఒక స్త్రీ పరిస్థితిలాగే ఉంది. మార్కు 5:​25, 26లో ఆమె గురించి ఇలా చెప్పబడింది: “పండ్రెండేండ్లనుండి రక్తస్రావ రోగము కలిగిన యొక స్త్రీ యుండెను. ఆమె అనేక వైద్యులచేత ఎన్నో తిప్పలుపడి తనకు కలిగినదంతయు వ్యయము చేసికొని, యెంతమాత్రమును ప్రయోజనములేక మరింత సంకటపడెను.” యేసు ఆమెను బాగుచేసి, కనికరంతో వ్యవహరించాడు. (మార్కు 5:​27-34) కొందరు క్రైస్తవులు ఎలాగైనా వ్యాధి నయం చేసుకోవాలనే ఉద్దేశంతో సత్యారాధనకు సంబంధించిన సూత్రాలను ఉల్లంఘించే రోగనిర్ధారణా పద్ధతులను, చికిత్సలను ఎంపికచేసుకున్నారు.

13 మనల్ని సత్యారాధన నుండి పక్కదారి పట్టించడానికి సాతాను ఏమి చేయడానికైనా వెనుకాడడు. కొందరిని పక్కదారి పట్టించడానికి అతడు ఎలాగైతే లైంగిక దుర్నీతిని, ధన వ్యామోహాన్ని ఉపయోగిస్తాడో అలాగే ఇతరులు తమ యథార్థతను విడిచిపెట్టేలా మానవాతీత శక్తులతో, అభిచారంతో సంబంధమున్న అనుచిత చికిత్సావిధానాలను ఉపయోగిస్తాడు. “దుష్టునినుండి,” “సమస్తమైన దుర్నీతి​నుండి” మనల్ని కాపాడమని యెహోవాకు ప్రార్థిస్తాం. కాబట్టి అభిచారంతో, మానవాతీత శక్తులతో కాస్త సంబంధం ఉన్నట్లు కనిపించినా, అలాంటి చికిత్సా విధానాలను ఎంపిక చేసుకుని సాతాను చేతుల్లో చిక్కుకోకూడదు.​—⁠మత్త. 6:​13; తీతు 2:⁠14.

14 ఇశ్రాయేలీయులు శకునాలు, సోదె చెప్పడం, ఇంద్రజాలం వంటివాటికి దూరంగా ఉండాలని యెహోవా ఆజ్ఞాపించాడు. (ద్వితీ. 18:​10-12) ‘అభిచారం’ ‘శరీర​కార్యాల్లో’ ఒకటని పౌలు చెప్పాడు. (గల. 5:​19, 20) అంతేకాదు, యెహోవా తీసుకురాబోయే నూతన విధానంలో ‘మాంత్రికులు’ ఉండరు. (ప్రక. 21:⁠8) వీటినిబట్టి చూస్తే అభిచారంతో కాస్త సంబంధం ఉన్నట్లు కనిపించే వేటినైనా యెహోవా అసహ్యించుకుంటాడని స్పష్టమౌతోంది.

“మీ సహనమును సకల జనులకు తెలియబడనియ్యుడి”

15 కాబట్టి కొన్ని రోగనిర్ధారణా పద్ధతులు, చికిత్సా విధానాల విషయంలో ఏ సందేహం కలిగినా వాటికి దూరంగా ఉండడం మంచిది. అయితే, ఫలాని చికిత్స ఎలా రోగాన్ని నయం చేస్తుందో వివరించలేనంత మాత్రాన దానికి అభిచారంతో సంబంధం ఉందని దానర్థంకాదు. చికిత్స విషయంలో లేఖన నిర్దేశాన్ని పాటించాలంటే మనకు దైవిక జ్ఞానం, వివేచన అవసరం. “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును . . . లెస్సయైన జ్ఞానమును వివేచనను భద్రము చేసికొనుము . . . అవి నీకు జీవముగా” ఉండును అనే హెచ్చరిక సామెతల పుస్తకం 3వ అధ్యాయంలో ఇవ్వబడింది.​—⁠సామె. 3:​5, 6, 21, 22.

16 మనం సాధ్యమైనంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. అయితే, అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధపడుతున్నప్పుడు మనం ఎంపిక చేసుకునే చికిత్సా విధానంవల్ల దేవుని అనుగ్రహాన్ని కోల్పోకుండా జాగ్రత్త​పడాలి. ఇతర విషయాల్లోలాగే ఆరోగ్యం విషయంలో కూడ మనం బైబిలు సూత్రాలకు అనుగుణంగా జీవిస్తూ, ‘మన సహనాన్ని సకల జనులకు తెలియనివ్వాలి.’ (ఫిలి. 4:⁠5) పరిపాలక సభ మొదటి శతాబ్దపు క్రైస్తవులకు రాసిన అతి ప్రాముఖ్యమైన ఉత్తరంలో వారిని విగ్రహారాధనకు, రక్తానికి, వ్యభిచారానికి దూరంగా ఉండమని ఉపదేశించింది. ఆ ఉత్తరంలో, “వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు” అని హామీనిచ్చింది. (అపొ. 15:​28, 29) వారికెలా మేలు జరుగుతుంది?

పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఎదురుచూస్తూ తగినంత శ్రద్ధ తీసుకోండి

17 మనలో ప్రతీ ఒక్కరం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘రక్తం విషయంలో, వ్యభిచారం విషయంలో బైబిలు సూత్రాలను ఖచ్చితంగా పాటించడంవల్ల నేనెంత ప్రయోజనం పొందానో గ్రహించానా?’ “శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా” చేసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మనకు జరిగిన మేలు గురించి కూడ ఆలోచించండి. (2 కొరిం. 7:⁠1) శుభ్రత విషయంలో బైబిలు సూత్రాలను పాటించడం ద్వారా మనం అనేక రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చు. మనల్ని శారీరకంగా, ఆధ్యాత్మికంగా మలినం చేసే పొగాకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండడం వల్ల మనం ఎంతో ప్రయోజనం పొందుతాం. మితంగా తినడంవల్ల, త్రాగడంవల్ల ఆరోగ్యానికి జరిగే మేలు గురించి కూడ ఆలోచించండి. (సామెతలు 23:​20; తీతు 2:​2, 3 చదవండి.) విశ్రాంతి వ్యాయామాలు మన ఆరోగ్యానికి ఎంత మంచి చేసినా మనం లేఖన నిర్దేశాన్ని పాటించడంవల్లనే శారీరకంగా, ఆధ్యాత్మికంగా మరింత ప్రయోజనం పొందుతున్నాం.

18 అన్నింటికన్నా ముఖ్యంగా, మన ఆధ్యాత్మిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటూ, ‘ఇప్పటి జీవానికి,’ నూతనలోకంలో ‘రాబోవు జీవానికి’ మూలమైన మన పరలోకపు తండ్రితో మనకున్న మంచి సంబంధాన్ని బలపర్చుకోవాలి. (1 తిమో. 4:⁠8; కీర్త. 36:⁠9) దేవుడు నూతనలోకంలో యేసు విమోచన క్రయధన బలి ఆధారంగా పాపాలను క్షమించి పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక, భౌతిక స్వస్థత చేకూరుస్తాడు. దేవుని గొర్రెపిల్లయైన యేసుక్రీస్తు మనల్ని ‘జీవజలముల బుగ్గలయొద్దకును నడిపిస్తాడు.’ అప్పుడు దేవుడు మన కన్నీటిని తుడిచేస్తాడు. (ప్రక. 7:​14-17; 22:​1, 2) అప్పుడు “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు” అనే సంతోషకరమైన ప్రవచన నెరవేర్పును కూడ మనం కళ్లారా చూస్తాం.​—⁠యెష. 33:⁠24.

19 మన విడుదల సమీపించిందనే నమ్మకం కుదిరింది. యెహోవా అనారోగ్యాన్ని, మరణాన్ని తీసివేసే రోజు కోసం మనం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం. అప్పటి​వరకు, మన ప్రేమగల తండ్రి మన గురించి “చింతించుచున్నాడు” కాబట్టి అనారోగ్యాన్ని సహించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడన్న అభయం మనకుంది. (1 పేతు. 5:⁠7) కాబట్టి మన ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుందాం. అయితే ఈ విషయంలో మనమెల్లప్పుడూ దైవప్రేరిత వాక్యంలోని స్పష్టమైన నిర్దేశాలనే పాటిద్దాం!

[అధస్సూచి]

^ పేరా 14 కావలికోట సెప్టెంబరు 1, 2003, 17వ పేజీలో ఉన్న బాక్సులో అలాంటి ఆర్టికల్స్‌ శీర్షికలు కొన్ని ఇవ్వబడ్డాయి.

పునఃసమీక్ష

• అనారోగ్యానికి ఎవరు కారణం? పాపంవల్ల వచ్చిన పరిణామాలను ఎవరు తీసివేస్తారు?

• ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడంలో తప్పులేకపోయినా ఏమి చేయకుండా ఉంటే మంచిది?

• మనం ఎలాంటి చికిత్సావిధానాన్ని ఎంపిక చేసుకుంటామనే విషయంలో యెహోవాకు ఎందుకు శ్రద్ధవుంది?

• ఆరోగ్యం విషయంలో బైబిలు సూత్రాలను పాటించడంవల్ల మనమెలా ప్రయోజనం పొందవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. దేవుడు ఏ ఉద్దేశంతో మానవులను సృష్టించాడు?

2, 3. (ఎ) ప్రసంగి పుస్తకంలో వృద్ధాప్యం ఎలా వర్ణించబడింది? (బి) ఆదాము ద్వారా వచ్చిన మరణానికి ఎవరు కారణం, దానివల్ల వచ్చిన పరిణామాలు ఎలా తీసివేయబడతాయి?

4. యెహోవా సేవకులు తమ ఆరోగ్యం విషయంలో ఎందుకు కొంతమేరకు శ్రద్ధ కలిగివుంటారు? అదే సమయంలో వారు ఏ విషయం గ్రహిస్తారు?

5. నమ్మకమైన దేవుని సేవకులు అనారోగ్యంతో పోరాడిన తీరునుండి మనమేమి నేర్చుకోవచ్చు?

6, 7. మన ఆరోగ్యం విషయంలో మనం ఎందుకు అతిగా చింతించకూడదు?

8. మనం ఆరోగ్యం విషయంలో అతిగా చింతిస్తే ఏమి జరిగే ప్రమాదముంది?

9. మనం ఏ ప్రాముఖ్యమైన పనిని నిర్లక్ష్యం చేయకూడదు? అది ఎందుకు ప్రాముఖ్యమైనది?

10. మనం ఏ చికిత్సా విధానాన్ని ఎన్నుకుంటున్నామన్నది ఎందుకు ప్రాముఖ్యం?

11, 12. చికిత్సా విధానాలను ఎంపికచేసుకుంటున్నప్పుడు మనం ఎలా ‘స్వస్థబుద్ధితో’ ప్రవర్తించాలి?

13, 14. (ఎ) చికిత్సా విధానాలను ఎంపిక చేసుకుంటున్నప్పుడు మనం యథార్థతను విడిచిపెట్టేలా చేయడానికి సాతాను మనల్ని ఎలా శోధించవచ్చు? (బి) అభిచారంతో కాస్త సంబంధం ఉన్నట్లు కనిపించే వేటినుండైనా మనం ఎందుకు దూరంగా ఉండాలి?

15, 16. చికిత్సా విధానాలను ఎంపిక చేసుకునే విషయంలో జ్ఞానం ఎందుకు అవసరం? మొదటి శతాబ్దపు పరిపాలక సభ ఎలాంటి చక్కని ఉపదేశాన్ని ఇచ్చింది?

17. బైబిలు సూత్రాలను పాటించడంవల్ల మనం శారీరకంగా ఎలా ప్రయోజనం పొందుతున్నాం?

18. మనం దేనికి ప్రాముఖ్యతనివ్వాలి? ఆరోగ్యానికి సంబంధించిన ఏ ప్రవచన నెరవేర్పు కోసం మనం ఎదురుచూడవచ్చు?

19. మనం ఆరోగ్యం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటుండగా యెహోవా మనకు ఏ అభయాన్ని ఇస్తున్నాడు?

[23వ పేజీలోని చిత్రం]

మానవులు అనారోగ్యంపాలై చనిపోవాలనే ఉద్దేశంతో దేవుడు వారిని సృష్టించలేదు

[25వ పేజీలోని చిత్రం]

ఆరోగ్య సమస్యలున్నా యెహోవా ప్రజలు పరిచర్యలో ఆనందం పొందుతారు