కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నారు?

మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నారు?

మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నారు?

ఫిలిప్పీన్స్‌లోని ఓ నగరంలో ఎప్పుడూ తప్పతాగి గొడవపడుతూ ఉండే ఒక వ్యక్తి గురించి పోలీసు అధికారి మన పయినీరు సహోదరునితో మాట్లాడుతూ, “ఇతణ్ణి మీరెలా మార్చారు?” అని అడిగాడు. తన బల్లమీదున్న పేపర్ల దొంతరను చూపిస్తూ, “ఇవి ఏమిటో తెలుసా? ఇతని మీదున్న కేసులు. ఈయన ఈ నగరంలో చేసిన గొడవలు అన్నీఇన్నీ కావు. ఇతణ్ణి మార్చి మాకొక పెద్ద తలనొప్పిని తగ్గించారు” అన్నాడు. ఆ వ్యక్తి అంతగా మారడానికి కారణమేమిటి? దేవుని వాక్యమైన బైబిల్లోని ప్రేరేపిత సందేశమే దానికి కారణం.

‘మునుపటి ప్రవర్తనానుసారమైన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోండి’ అని అపొస్తలుడైన పౌలు ఇచ్చిన సలహా ఎంతో ప్రాముఖ్యమైందని చాలామంది గ్రహించారు. (ఎఫె. 4:​22-24) మనం చేసుకునే మార్పులు చిన్నవైనా, పెద్దవైనా మనం క్రైస్తవులముగా మారాలంటే తప్పకుండా నవీన స్వభావాన్ని అలవర్చుకోవాలి.

అయితే మార్పులు చేసుకోవడం, బాప్తిస్మం తీసుకునేందుకు అర్హులవడమనేది నవీన స్వభావాన్ని అలవర్చుకోవడంలో మొదటి మెట్టు మాత్రమే. బాప్తిస్మం తీసుకునే సమయానికి మనం వడ్రంగి ఇంకా పూర్తిగా తయారు​చేయని చెక్కబొమ్మలా ఉంటాం. ఆయన ఎలాంటి బొమ్మను తయారుచేయాలనుకుంటున్నాడో తెలుస్తుంది. కానీ అది చూడముచ్చటగా ఉండాలంటే మరిన్ని మెరుగులు దిద్దాలి. బాప్తిస్మం తీసుకునే సమయానికి, దేవుని సేవకులముగా ఉండేందుకు అవసరమైన కనీస లక్షణాలు మనలో ఉంటాయి. అయితే మనమింకా మార్పులు చేసుకుంటూ నవీన స్వభావానికి మెరుగులు దిద్దుకుంటూ ఉండాలి.

అలా మార్పులు చేసుకుంటూ ఉండాల్సిన అవసరముందని పౌలు కూడ గ్రహించాడు. “మేలు చేయాలని ఇష్టమున్న నాలో చెడు ఉంది” అని ఆయన ఒప్పుకున్నాడు. (రోమా. 7:​21, పవిత్ర గ్రంథము, వ్యాఖ్యాన సహితము) తానెలాంటివాడో, తానెలాంటి వ్యక్తిగా మారాలనుకుంటున్నాడో పౌలుకు బాగా తెలుసు. మరి మన విషయమేమిటి? మనమిలా ప్రశ్నించుకోవాలి: ‘నాలో ఎలాంటి లక్షణాలున్నాయి? నేనెలాంటి వ్యక్తిని? నేనెలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నాను?’

నాలో ఎలాంటి లక్షణాలున్నాయి?

గోడలు పెచ్చులూడి పగుళ్లు వచ్చిన పాత ఇంటికి మరమ్మత్తులు చేస్తున్నప్పుడు, బయట రంగువేస్తే సరిపోదు. నిర్మాణ లోపాల్ని చూసీచూడనట్లు ఊరుకుంటే ఆ తర్వాత పెద్ద నష్టమే జరుగుతుంది. అదేవిధంగా, పైకి నీతిమంతులుగా కనిపిస్తే సరిపోదు. మన వ్యక్తిత్వాన్ని నిశితంగా పరిశీలించుకొని, లోపాలను గుర్తించాలి. లేకపోతే పాత లక్షణాలు మళ్లీ కనిపిస్తాయి. కాబట్టి మనం స్వీయ పరీక్ష తప్పనిసరిగా చేసుకోవాలి. (2 కొరిం. 13:⁠5) మనలోని చెడు లక్షణాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. అలా సరిదిద్దుకునేందుకు యెహోవా మనకు కావల్సిన సహాయాన్ని ఇచ్చాడు.

“దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది” అని పౌలు రాశాడు. (హెబ్రీ. 4:​12) దేవుని వాక్యమైన బైబిల్లోని సందేశం మన జీవితాలను ఎంతగానో మార్చ​గలదు. అది మన అంతరంగంలోకి, అలంకారార్థంగా చెప్పాలంటే మన ఎముకల్లోని మూలుగలోకి చొచ్చుకుపోగలదు. మనం బయటకు ఒకలా కనిపించొచ్చు లేదా మన గురించి మనకు కొన్ని అభిప్రాయాలుండొచ్చు. అయితే మన తలంపుల్ని, ఆలోచనల్ని గుర్తించేందుకు బైబిలు మనకు సహాయం చేసి నిజంగా మనమెలాంటివారమో చూపిస్తుంది. మనలోని లోపాలేమిటో గుర్తించేందుకు దేవుని వాక్యం మనకు నిజంగానే ఎంతో సహాయం చేస్తుంది.

కొన్నిసార్లు, పాత ఇంటిని మరమ్మత్తు చేస్తునప్పుడు కేవలం పాడైన చోట్ల బాగుచేస్తే సరిపోదు. అలా పాడవడానికి కారణమేమిటో తెలుసుకుంటే ఆ సమస్య మళ్లీ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతాం. అదేవిధంగా, మనలోని చెడు లక్షణాలను గుర్తించడమే కాదు, అవి ఎందుకు వచ్చాయో గుర్తిస్తే మన బలహీనతలను తగ్గించుకోగలుగుతాం. వివిధ కారణాలనుబట్టి మన వ్యక్తిత్వం మారుతుంది. సామాజిక హోదా, ఆర్థిక పరిస్థితి, పరిసరాలు, సంస్కృతి, తల్లిదండ్రులు, స్నేహితులు, మతం వంటివి మన వ్యక్తిత్వాన్ని మార్చగలవు. చివరకు టీవీ కార్యక్రమాలు, సినిమాలే కాక, ఇతర రకాలైన వినోదం కూడ మనపై ప్రభావం చూపిస్తాయి. మన వ్యక్తిత్వం చెడ్డగా మారడానికి కారణమేమిటో గుర్తించగలిగితే దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించగలుగుతాం.

స్వీయ పరీక్ష చేసుకున్న తర్వాత, ‘నేనింతే’ అని మనం అనుకోవచ్చు. అయితే, మనమలా అనుకోకూడదు. కొరింథు సంఘంలో ఉన్నవారికి ఒకప్పుడు చెడు అలవాట్లుండేవి. వారిలో కొందరు జారులుగా, సలింగ​సంయోగులుగా, తాగుబోతులుగా ఉండేవారు. అలాంటివారి గురించి మాట్లాడుతూ పౌలు ఇలా అన్నాడు: ‘మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, మన దేవుని ఆత్మయందు మీరు కడుగబడ్డారు.’ (1 కొరిం. 6:​9-11) యెహోవా పరిశుద్ధాత్మ సహాయంతో వారిలాగే మనమూ అవసరమైన మార్పులు చేసుకోగలుగుతాం.

ఫిలిప్పీన్స్‌లో ఉంటున్న మార్కోస్‌ విషయాన్నే తీసుకోండి. * తన గతం గురించి చెబుతూ మార్కోస్‌, “మా తల్లిదండ్రులు ఎప్పుడూ వాదులాడుకునేవారు. అందుకే నేను 19 ఏళ్లకే తిరగబడే వ్యక్తిగా మారాను” అని అన్నాడు. అతడు జూదగానిగా, దొంగగా, బందిపోటుగా పేరు తెచ్చుకున్నాడు. అతను, ఇంకొందరు కలిసి విమానాన్ని హైజాక్‌ చేయాలని పథకం కూడ వేశారు, కానీ అది ఫలించలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మార్కోస్‌లో మార్పు రాలేదు. చివరకు అతను జూదంలో తనకున్నదంతా పోగొట్టుకున్నాడు. యెహోవాసాక్షులు అతని భార్యతో బైబిలు అధ్యయనం చేసేవారు. కొంతకాలానికి అతను కూడ అధ్యయనానికి కూర్చోవడం మొదలుపెట్టాడు. మొదట్లో, తనకు సాక్షినయ్యే అర్హత లేదని అనుకున్నాడు. కానీ తాను నేర్చుకున్న విషయాలను పాటిస్తూ, కూటాలకు హాజరవడంవల్ల అతను తన పాత అలవాట్లను మానుకోగలిగాడు. బాప్తిస్మం తీసుకుని ఇప్పుడు క్రమంగా బోధనా పనిలో పాల్గొంటూ ఇతరులు కూడా తమ జీవితాలను ఎలా మార్చుకోవచ్చో వివరిస్తున్నాడు.

మీరు ఎలాంటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నారు?

క్రైస్తవ లక్షణాలను మెరుగుపర్చుకునేందుకు మనం ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిరావచ్చు? పౌలు క్రైస్తవులకు, “మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీన​స్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించు[డి]” అని ఉపదేశించాడు. “జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొ[నుడి]” అని కూడ చెప్పాడు.​—⁠కొలొ. 3:​8-10.

కాబట్టి పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని అలవర్చుకోవడానికి మనం ఎక్కువగా కృషిచేయాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటే మనం ఏ లక్షణాలను అలవర్చుకోవాలి? “మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి” అని పౌలు చెప్పాడు. (కొలొ. 3:​12-14) ఈ లక్షణాలను అలవర్చుకోవడానికి మనం తీవ్రంగా కృషిచేస్తే ‘యెహోవాకు, మనుష్యులకు మరింత ఇష్టులముగా’ ఉండగలుగుతాం. (1 సమూ. 2:​26, NW) యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఏ మానవుడూ కనపర్చనంతగా దైవిక లక్షణాలను కనబరిచాడు. “దేవునిపోలి” నడిచేవారిగా మనం క్రీస్తు మాదిరిని అధ్యయనం చేసి, అనుకరించడం ద్వారా మరింతగా క్రీస్తులా తయారవుతాం.​—⁠ఎఫె. 5:​1, 2.

బైబిల్లోని వ్యక్తుల గురించి అధ్యయనం చేసి, వారిలోని మంచి లక్షణాలు, చెడు లక్షణాల గురించి తెలుసుకున్నప్పుడు కూడ మనమెలాంటి మార్పులు చేసుకోవాలో గ్రహిస్తాం. ఉదాహరణకు, పితరుడైన యాకోబు కుమారుడు యోసేపు గురించి ఆలోచించండి. ఆయనకెంతో అన్యాయం జరిగినా ఇతరుల గురించి చెడుగా ఆలోచించకుండా హృదయ సౌందర్యాన్ని కాపాడుకున్నాడు. (ఆది. 45:​1-15) దానికి భిన్నంగా, దావీదు కుమారుడు అబ్షాలోము ప్రజలపట్ల తనకు ఎంతో శ్రద్ధవున్నట్లు నటించాడు, అందగాడని ప్రశంసలు అందుకున్నాడు. కానీ నిజానికి అతను విశ్వాసఘాతకుడు, హంతకుడు. (2 సమూ. 13:​28, 29; 14:​25; 15:​1-12) మంచివారిగా నటించినంత మాత్రాన, పైకి అందంగా కనిపించినంత మాత్రాన అందరూ ఆ వ్యక్తిని ఇష్టపడరు.

వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోవడం సాధ్యమే

మన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకొని దేవుని దృష్టిలో అందంగా ఉండాలంటే మన అంతరంగ స్వభావమెలా ఉందో పరిశీలించుకోవాలి. (1 పేతు. 3:​3, 4) మన వ్యక్తిత్వంలో మార్పులు చేసుకోవాలంటే మనలోని చెడు లక్షణాలను గుర్తించి, అవి మనకు ఎలా వచ్చాయో తెలుసుకోవాలి. దైవిక లక్షణాలను అలవర్చుకోవాలి. మన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా?

యెహోవా సహాయంతో మనం ఖచ్చితంగా అవసరమైన మార్పులు చేసుకోగలం. కీర్తనకర్తలాగే మనం కూడ, “దేవా, నాయందు శుద్ధహృదయము కలుగ​జేయుము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము” అని ప్రార్థించవచ్చు. (కీర్త. 51:​10) మనకు పరిశుద్ధాత్మనివ్వమని దేవుణ్ణి వేడుకోవచ్చు. పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించాలనే మన కోరిక బలపడుతుంది. అవును యెహోవాకు మనం ఇష్టులముగా ఉండడం సాధ్యమే!

[అధస్సూచి]

^ పేరా 11 అసలు పేరు కాదు.

[4వ పేజీలోని చిత్రం]

తుఫాను తాకిడికి గురైన ఈ ఇంటికి బయట రంగువేస్తే సరిపోతుందా?

[5వ పేజీలోని చిత్రం]

మీరు కూడ క్రీస్తులాంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్నారా?