కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యాకోబు, పేతురు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

యాకోబు, పేతురు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

యాకోబు, పేతురు రాసిన పత్రికల్లోని ముఖ్యాంశాలు

శిష్యుడైన యాకోబు సా.శ. 33లో పెంతెకొస్తు పండుగ జరిగిన దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత ఒక పత్రిక రాశాడు. ఆయన దాన్ని ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు చెందిన ‘పండ్రెండు గోత్రాలను’ ఉద్దేశించి రాశాడు. యాకోబు యేసు సహోదరుడు. (యాకో. 1:⁠1) వారు విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, శోధనలు ఎదురైనప్పుడు సహించాలని ప్రోత్సహించడానికే ఆయన దానిని రాశాడు. సంఘాల్లోని కలవరభరిత పరిస్థితులను సరిచేయడానికి ఆయన ఆ పత్రికలో ఉపదేశాన్నిచ్చాడు.

సా.శ. 64లో రోమా చక్రవర్తి నీరో క్రైస్తవులను క్రూరంగా హింసించడం మొదలుపెట్టాడు. దానికి కొంతకాలం ముందు అపొస్తలుడైన పేతురు, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని ప్రోత్సహిస్తూ క్రైస్తవులకు మొదటి పత్రిక రాశాడు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన రెండవ పత్రిక కూడ రాశాడు. ఈ పత్రికలో, దేవుని వాక్యాన్ని లక్ష్యపెట్టమని తన తోటి విశ్వాసులను ప్రోత్సహిస్తూ, యెహోవా దినం సమీపిస్తుందని హెచ్చరించాడు. నేడు మనం కూడా యాకోబు, పేతురు రాసిన పత్రికలను శ్రద్ధగా అధ్యయనం చేస్తే ప్రయోజనం పొందుతాం.​—⁠హెబ్రీ. 4:⁠12.

‘విశ్వాసంతో అడిగితే’ దేవుడు జ్ఞానాన్ని స్తాడు

(యాకో. 1:1​—⁠5:⁠20)

“శోధన సహించువాడు ధన్యుడు” ఎందుకంటే ‘అతడు శోధనకు నిలిచినవాడైతే’ ‘జీవకిరీటము పొందుతాడు’ అని యాకోబు చెప్పాడు. “విశ్వాసముతో” అడిగేవారికి యెహోవా దేవుడు కష్టాలను సహించేందుకు జ్ఞానాన్నిస్తాడు.​—⁠యాకో. 1:​5-8, 12.

సంఘంలో ‘బోధకులయ్యేవారికి’ కూడా విశ్వాసం, జ్ఞానం అవసరం. నాలుక ‘చిన్న అవయవమే’ అయినప్పటికీ ‘సర్వశరీరానికి మాలిన్యము కలుగజేస్తుంది’ అని చెప్పాడు. ఒక వ్యక్తికి లోకస్థుల లక్షణాలుంటే దేవునితో అతనికున్న సంబంధం పాడవుతుందని హెచ్చరించాడు. దేవునితో తమకున్న సంబంధాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నవారు తిరిగి దాన్ని మెరుగుపర్చుకోవడానికి ఏమి చేయాలో కూడా చెప్పాడు.​—⁠యాకో. 3:​1, 5, 6; 5:​14, 15.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:​13​​—⁠‘కనికరం’ ఎలా ‘తీర్పును మించి అతిశయిస్తుంది’? మనం దేవునికి లెక్క అప్పగించే సమయంలో, దేవుడు మనం ఇతరులకు కనికరం చూపించామో లేదో గమనించి, తన కుమారుని విమోచనా క్రయధనం ఆధారంగా మన పాపాలను క్షమిస్తాడు. (రోమా. 14:​11, 12) మన జీవితాల్లో మరింత కనికరాన్ని చూపించడానికి ఇదొక మంచి కారణం కాదా?

4:5​—⁠యాకోబు ఇక్కడ ఏ వచనాన్ని ప్రస్తావిస్తున్నాడు? యాకోబు ప్రత్యేకంగా ఏ వచనాన్నీ ప్రస్తావించడంలేదు. అయితే, ఆయన బహుశా ఆదికాండము 6:⁠5; 8:​21; సామెతలు 21:​10; గలతీయులు 5:⁠17 వంటి వచనాల్లో ఉన్న సారాంశం ఆధారంగా ఈ ప్రేరేపిత మాటలను రాసి ఉండవచ్చు.

5:​20​—⁠“పాపిని వాని తప్పుమార్గమునుండి మళ్లించువాడు” ఎవరిని మరణం నుండి రక్షిస్తాడు? క్రైస్తవుడు ఒక పాపిని తప్పు మార్గం నుండి తప్పిస్తే, పశ్చాత్తాపపడిన ఆ పాపిని ఆధ్యాత్మిక మరణం నుండి రక్షిస్తాడు. అలా పాపిని నిత్య నాశనం నుండి కాపాడే అవకాశం ఉంది. అంతేకాక, పాపికి ఇలా సహాయంచేసే క్రైస్తవుడు ‘[అతను చేసిన] అనేక పాపములను కప్పివేస్తాడు.’

మనకు పాఠాలు:

1:​14, 15. చెడు కోరికల నుండే పాపం పుడుతుంది. కాబట్టి మనం చెడు విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ చెడు కోరికలను పెంచుకోకూడదు. బదులుగా మంచి విషయాల గురించి ‘ధ్యానిస్తూ’ వాటిని మన మనసుల్లో, హృదయాల్లో నింపుకోవాలి.​—⁠ఫిలి. 4:⁠8.

2:​8, 9. ‘పక్షపాతం’ అనే లక్షణం ప్రేమ చూపించాలనే ‘ప్రాముఖ్యమైన ఆజ్ఞకు’ విరుద్ధం. కాబట్టి క్రైస్తవులు పక్షపాతం చూపించరు.

2:​14-​26. మోషే ధర్మశాస్త్రానుసారమైన ‘క్రియల’ ద్వారా, లేక క్రైస్తవులముగా మన బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మనకు ‘రక్షణ కలుగదు’ గానీ ‘విశ్వాసం ద్వారానే రక్షణ’ కలుగుతుంది. దేవునిపై విశ్వాసం ఉందని చెప్పుకుంటే సరిపోదు. (ఎఫె. 2:​8, 9; యోహా. 3:​16) దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి.

3:​13-​17. “పైనుండి వచ్చు జ్ఞానము” ‘భూసంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానము వంటిది’ కాదు. మనం ‘దాచబడిన ధనం కోసం వెదికినట్లు దైవిక జ్ఞానం కోసం’ వెదకాలి.​—⁠సామె. 2:​1-5.

3:​18. ఈ లేఖనం పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితములో “సమాధానం చేకూర్చేవారు సమాధానంతో విత్తినదానివల్ల నీతిన్యాయాల ఫలం కలుగుతుంది” అని అనువదించబడింది. “సమాధానం చేకూర్చేవారు సమాధానంతో” రాజ్య సువార్త విత్తనాలను ‘విత్తాలి.’ మనం గర్విష్ఠులముగా, గొడవలకు దిగేవారిగా, తిరుగుబాటుదారులముగా ఉండకుండా సమాధానపరులముగా ఉండడం ప్రాముఖ్యం.

‘విశ్వాసంలో స్థిరంగా ఉండండి’

(1 పేతు. 1:1​—⁠5:⁠14)

పేతురు తోటి విశ్వాసులకు పరలోకంలో ‘జీవించే నిరీక్షణ’ గురించి గుర్తుచేశాడు. వారు ఒక ‘ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజకసమూహంగా, పరిశుద్ధజనంగా’ ఉన్నారని చెప్పాడు. విధేయత చూపించే విషయంలో నిర్దిష్ట ఉపదేశాన్ని ఇచ్చిన తర్వాత, వారందరూ “ఏకమనస్కులై యొకరి సుఖదుఃఖములయందు ఒకరు పాలుపడి, సహోదర​ప్రేమ గలవారును, కరుణాచిత్తులును, వినయమనస్కులునై” ఉండాలని ప్రోత్సహించాడు.​—⁠1 పేతు. 1:​3, 4; 2:⁠9; 3:⁠8.

‘[యూదా మత విధానపు] అంతం సమీపించింది’ కాబట్టి సహోదరులు “స్వస్థ బుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుటకు మెలకువగా” ఉండాలని పేతురు వారికి ఉపదేశించాడు. అంతేకాక, “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి . . . విశ్వాసమందు స్థిరులై వానిని [సాతానును] ఎదిరించుడి” అని వారిని ప్రోత్సహించాడు.​—⁠1 పేతు. 4:⁠7; 5:​8, 9.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

3:​19-​22​—⁠బాప్తిస్మం మనల్ని ఎలా రక్షిస్తుంది? రక్షించబడాలనుకునేవారు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి. అయితే, రక్షణ పొందడానికి బాప్తిస్మం తీసుకోవడం మాత్రమే సరిపోదు. ‘యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగానే’ రక్షణ కలుగుతుంది. యేసు తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి, పునరుత్థానం చేయబడి, ‘దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడనీ,’ ఆయనకు సజీవుల మీద, మృతులమీద అధికారం ఇవ్వబడిందనీ, వీటివల్లనే రక్షణ కలుగుతుందని బాప్తిస్మం తీసుకునే వ్యక్తి విశ్వసించాలి. అలాంటి విశ్వాసంతో తీసుకునే బాప్తిస్మం, ‘ఎనిమిది మంది నీటిద్వారా రక్షణ​పొందడానికి’ సాదృశ్యంగా ఉంది.

4:​6​—⁠‘మృతులకు’ ‘సువార్త ప్రకటించబడింది.’ ఇక్కడ ప్రస్తావించబడిన మృతులెవరు? ఈ మృతులు, సువార్త వినక ముందు దేవునితో సంబంధం లేనివారు అంటే ‘అపరాధముల​చేత, పాపములచేత చచ్చినవారు.’ (ఎఫె. 2:⁠1) అయితే, సువార్తను నమ్మిన తర్వాత వారు ఆధ్యాత్మికంగా ‘బ్రతికించ​బడ్డారు.’

మనకు పాఠాలు:

1:⁠7. మన విశ్వాసం బలంగా ఉండాలంటే మనం శోధనలచేత పరీక్షించబడాలి. అలాంటి బలమైన విశ్వాసముంటేనే మన ప్రాణాన్ని ‘రక్షించుకుంటాం.’ (హెబ్రీ. 10:​39) విశ్వాస సంబంధ పరీక్షలు ఎదురైనప్పుడు మనం వెనుదీయకూడదు.

1:​10-​12. అభిషిక్త క్రైస్తవుల సంఘం గురించి పూర్వం దేవుని ప్రవక్తలు రాసిన లోతైన ఆధ్యాత్మిక సత్యాలను దేవదూతలు తొంగిచూడాలని అనుకుంటున్నారు అంటే పరిశీలించి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే, యెహోవా దేవుడు సంఘంపై అనుగ్రహం చూపించడం మొదలుపెట్టిన తర్వాతే ఆ సత్యాలు స్పష్టమయ్యాయి. (ఎఫె. 3:​8-10) మనం కూడ దేవదూతల్లాగే “దేవుని మర్మములను” పరీశీలించడానికి ప్రయత్నించవద్దా?​—⁠1 కొరిం. 2:⁠10.

2:​21. మన మాదిరికర్తయైన యేసుక్రీస్తులాగే మనం కూడ యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించడం కోసం బాధలనుభవించడానికి, చివరికి మరణించడానికైనా సిద్ధంగా ఉండాలి.

5:​6, 7. మన చింతనంతటినీ యెహోవాపై వేసినప్పుడు, రేపటి గురించి అనవసరంగా ఆలోచించకుండా మనం సత్యారాధనకు ప్రాముఖ్యతను ఇవ్వడానికి ఆయన సహాయం చేస్తాడు.​—⁠1 పేతు. 5:​6, 7.

‘యెహోవా దినము వచ్చును’

(2 పేతు. 1:​1​—⁠3:⁠18)

“ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి” అని పేతురు రాశాడు. మనం ఆ ప్రవచన వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తే “అబద్ధబోధకుల” నుండి, తప్పుదారి పట్టించే వ్యక్తుల నుండి తప్పించుకోగలుగుతాం.​—⁠2 పేతు. 1:​21; 2:​1-3.

“అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు” వస్తారని పేతురు హెచ్చరించాడు. కానీ “ప్రభువు [యెహోవా] దినము దొంగవచ్చినట్లు” వస్తుంది. ‘దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షిస్తూ’ ఉండేవారి కోసం చక్కని సలహాలనిస్తూ పేతురు తాను రాసిన రెండవ పత్రికను ముగించాడు.​—⁠2 పేతు. 3:​3, 10-12.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1:​19​—⁠“తెల్లవారి వేకువచుక్క” ఎవరు? ఆయనెప్పుడు ఉదయిస్తాడు? ఆయన ఉదయించాడని మనకెలా తెలుస్తుంది? రాజ్యాధికారంలో ఉన్న యేసుక్రీస్తే ఆ “తెల్లవారి వేకువచుక్క.” (ప్రక. 22:​16) యేసు 1914లో సర్వలోకం ముందు మెస్సీయ రాజుగా ఉదయించి ఒక కొత్త యుగానికి నాంది పలికాడు. యేసు రాజ్యాధికారంలో ఉన్నప్పుడు ఆయనకెంత మహిమ ఉంటుందో రూపాంతరం ద్వారా తెలిసింది. అంతేకాదు దేవుని ప్రవచన వాక్యం సత్యమని అది నిరూపించింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివితే మన హృదయాల్లో వెలుగు నిండి వేకువచుక్క ఉదయించాడని గ్రహిస్తాం.

2:4​—⁠“కటిక చీకటిగల బిలము” అంటే ఏమిటి? తిరుగుబాటుదారులైన దూతలు ఎప్పుడు దానిలోకి తోయబడ్డారు? “కటిక చీకటిగల బిలము” అంటే మానవులు కాకుండ ఆత్మప్రాణులు మాత్రమే ఉండే ఖైదులాంటి స్థితి. దేవుని అద్భుతమైన ఉద్దేశాలను అర్థంచేసుకోలేని మానసిక అంధకార పరిస్థితి. వారికెలాంటి నిరీక్షణా ఉండదు. దేవుడు తిరుగుబాటుదారులైన దేవదూతలను నోవహు కాలంలో దానిలోకి తోసివేశాడు. చివరకు వాళ్లు నాశనం చేయబడేంతవరకు ఆ స్థితిలోనే ఉంటారు.

3:​17​—⁠“ముందుగా తెలిసికొనియున్న” సంగతులు అని పేతురు అన్న మాటలకు అర్థమేమిటి? భవిష్యత్తుకు సంబంధించి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తనకు, ఇతర బైబిలు రచయితలకు తెలిపిన సంగతుల గురించి పేతురు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు వాళ్లకు అపరిమిత జ్ఞానాన్ని ఇవ్వలేదు కాబట్టి మొదటి శతాబ్ద క్రైస్తవులు భవిష్యత్తు గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయారు. భవిష్యత్తులో ఏమి జరుగనుందో చూఛాయగా తెలిసింది కానీ పూర్తిగా తెలియలేదు.

మనకు పాఠాలు:

1:​2, 5-​7. మనం విశ్వాసం, సహనం, దైవభక్తి లాంటి లక్షణాలను పెంపొందించుకోవడానికి కృషి చేస్తే, “దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైన అనుభవజ్ఞానము” సంపాదించుకోగలుగుతాం. అంతేకాదు, ఆ జ్ఞానం విషయంలో ‘సోమరులముగా నిష్ఫలులముగా కాకుండా’ ఉండగలుగుతాం.​—⁠2 పేతు. 1:⁠8.

1:​12-​15. సంఘ కూటాల్లో, వ్యక్తిగత అధ్యయనంలో, బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు మనకి ఎన్నో విషయాలు జ్ఞాపకం చేయబడతాయి. ‘సత్యమందు స్థిరంగా’ ఉండాలంటే ఎప్పటికప్పుడు అలాంటి జ్ఞాపికలు మనకు అవసరం.

2:⁠2. మన ప్రవర్తన వల్ల యెహోవాకు, ఆయన సంస్థకు ఎలాంటి చెడ్డపేరు రాకుండా జాగ్రత్తపడాలి.​—⁠రోమా. 2:⁠24.

2:​4-​9. గతంలో యెహోవా తన సేవకుల కోసం ఎన్నో కార్యాలు చేశాడు కాబట్టి, “భక్తులను శోధనలోనుండి తప్పించుటకును, దుర్ణీతిపరులను . . . శిక్షలో ఉంచబడిన​వారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు [యెహోవా] సమర్థుడు” అని మనం నమ్మవచ్చు.

2:​9-​13. ‘మహాత్ముల్లో’ అంటే క్రైస్తవ పెద్దల్లో కూడ లోపాలుంటాయి. వాళ్లూ కొన్నిసార్లు తప్పులు చేస్తుంటారు కానీ మనం వారి గురించి దూషణకరంగా మాట్లాడకూడదు.​—⁠హెబ్రీ. 13:​7, 17.

3:​2-4, 12. “పరిశుద్ధ ప్రవక్తలచేత పూర్వమందు పలుక​బడిన మాటలను, ప్రభువైన రక్షకుడు . . . ఇచ్చిన ఆజ్ఞను” మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనం యెహోవా దినం బహు దగ్గర్లో ఉందనే విషయాన్ని మనసులో ఉంచుకోగలుగుతాం.

3:​11-​14. ‘దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షిస్తున్న’ మనం (1) శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా “పరిశుద్ధమైన ప్రవర్తనతో” ఉండాలి. (2) మనకు “భక్తి” ఉందని చూపించే పనులను అంటే రాజ్య సువార్తను ప్రకటించడం, శిష్యులను చేయడం వంటి పనులను ఎక్కువగా చేయాలి. (3) లోక మాలిన్యం మనకు అంటకుండా మన వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను ‘నిష్కళంకంగా’ ఉంచుకోవాలి. (4) అన్ని పనులు మంచి ఉద్దేశంతో చేస్తూ “నిందారహితులుగా” ఉండాలి. (5) దేవునితో, క్రైస్తవ సహోదరులతో, తోటి మానవులతో ‘శాంతియుతంగా’ ఉండాలి.