కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోహాను, యూదా పత్రికల్లోని ముఖ్యాంశాలు

యోహాను, యూదా పత్రికల్లోని ముఖ్యాంశాలు

యెహోవా వాక్యము సజీవమైనది

యోహాను, యూదా పత్రికల్లోని ముఖ్యాంశాలు

ప్రేరేపిత లేఖనాలన్నిటిలో అపొస్తలుడైన యోహాను రాసిన ఈ మూడు పత్రికలు చివరివి. వాటిని ఆయన బహుశా సా.శ. 98లో ఎఫెసు నుండి రాశాడు. వెలుగులో నడవమనీ, మతభ్రష్టత్వానికి దూరంగా ఉండమనీ మొదటి రెండు పత్రికలు క్రైస్తవులను ప్రోత్సహిస్తున్నాయి. యోహాను మూడవ పత్రికలో, సత్యాన్ని అనుసరించమని చెప్పడమేకాక క్రైస్తవులు ఒకరికొకరు సహకరించుకోవాలని కూడ ప్రోత్సహిస్తున్నాడు.

బహుశా సా.శ. 65లో పాలస్తీనా ప్రాంతంనుండి రాసిన పత్రికలో యేసు తోబుట్టువు అయిన యూదా సంఘంలో చొరబడిన దుష్టుల గురించి తోటి క్రైస్తవులను హెచ్చరించడమే కాక వారి చెడు ప్రభావాలనుండి దూరంగా ఉండే విషయంలో సలహానిచ్చాడు. యోహాను రాసిన మూడు పత్రికల్లో, యూదా పత్రికలో ఉన్న సందేశాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అడ్డంకులు ఎదురైనా బలమైన విశ్వాసంతో ఉండగలుగుతాం.​—⁠హెబ్రీ. 4:⁠12.

విశ్వాసంతో, వెలుగులో, ప్రేమలో నడుస్తూ ఉండండి

(1 యోహా. 1:1–​5:​21)

క్రీస్తు సహవారసులైనవారందరినీ ఉద్దేశించి యోహాను తన మొదటి పత్రిక రాశాడు. మతభ్రష్టత్వానికి దూరంగా ఉంటూ, సత్యం కోసం, నీతి కోసం స్థిరంగా ఉండేందుకు క్రైస్తవులకు సహాయం చేసే మంచి సలహా దానిలో ఉంది. వారు విశ్వాసంతో, వెలుగులో, ప్రేమలో నడుస్తూ ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పాడు.

“ఆయన [దేవుడు] వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల, మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము” అని యోహాను రాశాడు. ప్రేమ దేవుని నుండి వస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ ‘ఒకరిపట్ల ఒకరం ప్రేమను చూపించాలి’ అని ఆయన చెప్పాడు. ‘దేవునిపట్ల మనకున్న ప్రేమతో’ మనం ‘ఆయన ఆజ్ఞలను గైకొంటాం.’ అయితే, యెహోవా దేవునిపట్ల, ఆయన వాక్యంపట్ల, ఆయన కుమారునిపట్ల ‘మనకున్న విశ్వాసంతో’ లోకాన్ని జయిస్తాం.​—⁠1 యోహా. 1:⁠7; 4:⁠7; 5:​3, 4.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

2:​7, 8​​—⁠యోహాను ఏ ఆజ్ఞను “పూర్వపు” ఆజ్ఞ, “క్రొత్త” ఆజ్ఞ అని పేర్కొన్నాడు? స్వయంత్యాగపూరితమైన సహోదర ప్రేమ చూపించే విషయంలో ఇవ్వబడిన ఆజ్ఞ గురించి యోహాను మాట్లాడుతున్నాడు. (యోహా. 13:​34) యోహాను తన మొదటి ప్రేరేపిత పత్రికను రాయడానికి దాదాపు 60 సంవత్సరాల క్రితం యేసు ఈ ఆజ్ఞను ఇచ్చాడు కాబట్టి యోహాను దీనిని “పూర్వపు” ఆజ్ఞ అని అంటున్నాడు. అలా విశ్వాసులైనవారికి “మొదటి నుండి” ఆ ఆజ్ఞ ఉందని చెప్పవచ్చు. ఆ ఆజ్ఞ కొత్తది కూడ. ఎందుకంటే ఈ ఆజ్ఞ ప్రకారం ‘తనను​తాను ప్రేమించుకున్నట్లే పొరుగువారిని ప్రేమిస్తే సరిపోదు.’ ఆ ప్రేమ నిస్వార్థంగా చూపించాలి.​—⁠లేవీ. 19:​18; యోహా. 15:​12, 13.

3:2​​—⁠అభిషిక్త క్రైస్తవులకు ఏది “ప్రత్యక్షపరచబడలేదు,” “ఆయన యున్నట్లుగానే” వారు ఎవర్ని చూస్తారు? వారు ఆత్మ శరీరులుగా పరలోకానికి పునరుత్థానం చేయబడినప్పుడు ఎలా ఉంటారో వారికింకా ప్రత్యక్షపరచబడలేదు. (ఫిలి. 3:​20, 21) అయితే ‘దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే’ అంటే ‘ఆత్మ’ రూపంలో వారు ‘ఆయనను చూస్తారు కాబట్టి ఆయనను పోలివుంటారు.’​—⁠2 కొరిం. 3:​17, 18.

5:​5-8​​—⁠“యేసు దేవుని కుమారుడని” నీళ్లు, రక్తము, ఆత్మ ఎలా సాక్ష్యమిచ్చాయి? యేసు నీళ్లలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు తన కుమారుణ్ణి ఇష్టపడుతున్నానని యెహోవాయే స్వయంగా చెప్పాడు. ఆ విధంగా నీళ్లు సాక్ష్యమిచ్చాయి. (మత్త. 3:​17) ‘అందరి కోసం విమోచన క్రయధనంగా’ అర్పించబడిన యేసు రక్తం లేక జీవం కూడ యేసు దేవుని కుమారుడని సాక్ష్యం ఇచ్చింది. (1 తిమో. 2:​5, 6) బాప్తిస్మం సమయంలో యేసు దేవుని కుమారుడని పరిశుద్దాత్మ సాక్ష్యమిచ్చింది. దాని సహాయంతో “ఆయన మేలు చేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.”​—⁠యోహా. 1:​29-34; అపొ. 10:⁠38.

మనకు పాఠాలు:

2:​9-​11; 3:​15. ఏ కారణంగానైనా లేదా ఎవరి ప్రోద్భలంతోనైనా ఒక క్రైస్తవుడు తన సహోదర ప్రేమను నాశనం చేసుకుంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని ఆధ్యాత్మిక అంధకారంలో నడుస్తున్నాడని అర్థం.

‘సత్యాన్ని అనుసరించి నడుస్తూ’ ఉండండి

(2 యోహా. 1–​13)

“పెద్దనైన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకు” అనే మాటలతో యోహాను తన రెండవ పత్రికను ప్రారంభించాడు. ‘ఆమె పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట చూసి’ ఆయన చాలా సంతోషించాడు.​—⁠2 యోహా. 1, 4.

ప్రేమను అలవర్చుకోమని ప్రోత్సహించిన తర్వాత యోహాను ఇలా రాశాడు: “మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ.” అంతేకాక ఆయన ‘వంచకులు, క్రీస్తు విరోధుల’ గురించి కూడ హెచ్చరించాడు.​—⁠2 యోహా. 5-8.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

1, 13​​—⁠‘ఏర్పరచబడిన అమ్మ’ ఎవరు? కైరియా అని పిలవబడే స్త్రీ గురించి యోహాను ప్రస్తావిస్తుండవచ్చు. గ్రీకులో దానికి “అమ్మ” అని అర్థముంది. లేదా క్రైస్తవులను హింసించేవారిని తికమక పెట్టేందుకు అలంకారికంగా ఒక సంఘాన్ని అలా పిలిచివుండవచ్చు. అదే నిజమైతే, సంఘ సభ్యులు ఆమె పిల్లలౌతారు. ‘ఆమె సహోదరి పిల్లలు’ మరో సంఘ సభ్యులౌతారు.

మనకు పాఠాలు:

2, 4. మనం రక్షించబడాలంటే ‘సత్యాన్ని’ అంటే బైబిల్లోని క్రైస్తవ బోధలన్నిటినీ తెలుసుకొని, వాటిని పాటించడం చాలా అవసరం.​—⁠3 యోహా. 2, 4.

8-​11. ‘తండ్రియైన దేవుని, యేసుక్రీస్తు కృప, కనికరము, సమాధానాన్నీ’ ప్రేమగల తోటి విశ్వాసుల సహవాసాన్నీ కోల్పోకూడదంటే మనం ‘క్రీస్తు బోధలో నిలిచివుండని వారికి’ దూరంగా ఉంటూ మన ఆధ్యాత్మిక స్థితి విషయంలో ‘జాగ్రత్తపడాలి.’​—⁠2 యోహా. 3.

‘సత్యమునకు సహాయకులవ్వండి’

(3 యోహా. 1–​14)

యోహాను తన మూడవ పత్రికను గాయు అనే స్నేహితునికి రాశాడు. “నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు” అని ఆయన రాశాడు.​—⁠3 యోహా. 4.

వేరే సంఘాల సహోదరులకు ‘విశ్వాసికి తగినట్టుగా [“నమ్మకంగా,” NW]’ సహాయం చేస్తున్నందుకు యోహాను గాయును మెచ్చుకున్నాడు. ఆయన “మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము” అని చెప్పాడు.​—⁠3 యోహా. 5-8.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

11​​—⁠కొందరు ఎందుకు చెడుకార్యాలు చేస్తారు? ఆధ్యాత్మికత లేకపోవడంవల్ల కొంతమంది దేవుణ్ణి తెలుసుకోరు, ఆయన లక్షణాలను గ్రహించలేరు. వారు తమ కళ్లతో దేవుణ్ణి చూడలేరు కాబట్టి దేవుడు తమను చూడనట్లే ప్రవర్తిస్తారు.​—⁠యెహె. 9:⁠9.

14​​—⁠యోహాను ఎవర్ని “స్నేహితులు” అని పిలుస్తున్నాడు? ఒకరితోనొకరు దగ్గరి సంబంధాన్ని కలిగివుండేవారి గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడడంలేదు. తోటి విశ్వాసుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన “స్నేహితులు” అనే పదాన్ని ఉపయోగించాడు.

మనకు పాఠాలు:

4. యౌవనులు ‘సత్యాన్ని అనుసరించి నడుస్తుండడాన్ని’ చూసి సంఘంలోని ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన సహోదరసహోదరీలు ఎంతో సంతోషిస్తారు. తమ పిల్లలను యెహోవాను సేవించేవారిగా తీర్చిదిద్ద​గలిగినప్పుడు తల్లిదండ్రులు కూడ చెప్పలేనంత సంతోషాన్ని పొందుతారు.

5-8. ప్రయాణ పైవిచారణకర్తలు, మిషనరీలు, బెతెల్‌ గృహాల్లో సేవచేస్తున్నవారు, పయినీరు సేవచేస్తున్నవారు తమ సహోదరులపట్ల, యెహోవాపట్ల ప్రేమతో వారికోసం ప్రయాసపడి పనిచేస్తారు. వారి విశ్వాసాన్ని అనుకరించాలి. ప్రేమతో మనం చేసే సహాయాన్ని పొందేందుకు వారు అర్హులు.

9-​12. ఇతరుల గురించి చెడ్డమాటలు మాట్లాడిన దియొత్రెఫేను అనుసరించే బదులు నమ్మకస్థుడైన దేమేత్రియ మాదిరిని మనం అనుసరించాలి.

‘దేవుని ప్రేమలో నిలిచివుండండి’

(యూదా 1–​25)

సంఘంలోకి చొరబడినవారిని ‘దురాశలచొప్పున నడుచుకొనుచు సణుగువారని, తమ గతిని గురించి నిందించువారని’ యూదా వర్ణించాడు. వారు ‘డంబమైన మాటలు పలుకుచూ, తమ లాభం కోసం మనుష్యులను కొనియాడతారు.’​—⁠యూదా 4, 15.

చెడు ప్రభావాల నుండి క్రైస్తవులు ఎలా దూరంగా ఉండవచ్చు? “ప్రియులారా,” “మన ప్రభువైన యేసుక్రీస్తు, అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి” అని యూదా రాశాడు. అంతేకాక, ‘దేవుని ప్రేమలో నిలిచివుండండి’ అని కూడ చెప్పాడు.​—⁠యూదా 17-21.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

3, 4​​—⁠“బోధ నిమిత్తము [‘విశ్వాస సత్యాల కోసం,’ పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం] పోరాడవలెను” అని క్రైస్తవులను యూదా ఎందుకు ప్రోత్సహించాడు? ‘భక్తిహీనులు సంఘంలో రహస్యంగా చొరబడ్డారు’ కాబట్టి ఆయనలా ప్రోత్సహించాడు. వారు “దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగప[రిచారు].”

20, 21​​—⁠మనం ఎలా ‘దేవుని ప్రేమలో నిలిచివుండవచ్చు’? మనం మూడు విధాలుగా దేవుని ప్రేమలో నిలిచివుండొచ్చు: (1) దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా ప్రకటనా పనిలో ఉత్సాహంగా పాల్గొంటూ ‘అతిపరిశుద్ధ విశ్వాసాన్ని’ బలపరచుకోవడం ద్వారా, (2) ‘పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయడం ద్వారా లేదా దాని నడిపింపుకు అనుగుణంగా ప్రార్థించడం ద్వారా, (3) నిత్యజీవానికి మార్గాన్ని తెరిచిన యేసుక్రీస్తు విమోచన క్రయధనంపట్ల విశ్వాసముంచడం ద్వారా మనం ఆయన ప్రేమలో నిలిచివుండవచ్చు.​—⁠యూదా 20, 21.

మనకు పాఠాలు:

5-7. యెహోవా తీర్పులను దుష్టులు తప్పించుకోగలుగుతారా? మనకు హెచ్చరికగా ఉన్న మూడు ఉదాహరణలను యూదా ఈ వచనాల్లో పేర్కొన్నాడు. ఆ ఉదాహరణలనుబట్టి దుష్టులు తప్పించుకోవడం అసాధ్యమని చెప్పవచ్చు.

8-​10. ప్రధానదూతయైన మిఖాయేలు ఉదాహరణను అనుకరించి మనం యెహోవా నియమించినవారిని గౌరవించాలి.

12. నీళ్లలోవున్న దొంగమెట్టలవల్ల లేదా రాళ్లదిబ్బలవల్ల ఎలాగైతే ఓడలకు, ఈతగాళ్లకు ప్రమాదముందో అలాగే ప్రేమున్నట్లు నటించే మతభ్రష్టులవల్ల మన విశ్వాసానికి ప్రమాదముంది. అబద్ధ బోధకులు ఉదార​స్వభావులుగా కన్పించవచ్చు. అయినా వారు ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం నీళ్లులేని మేఘాల్లాంటివారు. అలాంటి​వారు కాయలు రాలి ఫలములు లేని చెట్లలాంటివారు. వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లలాగే వారు నాశనం చేయ​బడతారు. కాబట్టి, మతభ్రష్టులకు దూరంగా ఉండడం తెలివైన పని.

22, 23. నిజక్రైస్తవులు చెడును అసహ్యించుకుంటారు. సందేహపడే’ కొందరిని నిత్యనాశనం నుండి తప్పించేందుకు సంఘంలోని పరిణతిగలవారు ముఖ్యంగా నియమిత పైవిచారణకర్తలు వారికి కావాల్సిన ఆధ్యాత్మిక సహాయాన్ని చేస్తారు.

[28వ పేజీలోని చిత్రాలు]

“యేసు దేవుని కుమారుడని” నీళ్లు, ఆత్మ, రక్తము సాక్ష్యమిచ్చాయి