కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వర్షం—అది చేసే మేలుకు కృతజ్ఞత చూపించండి

వర్షం—అది చేసే మేలుకు కృతజ్ఞత చూపించండి

వర్షం​—⁠అది చేసే మేలుకు కృతజ్ఞత చూపించండి

వర్షం! అదే లేకపోతే మన పరిస్థితేంటి? వర్షాలు మరీ ఎక్కువ పడితే వరదలు ముంచుకొస్తాయన్న మాట నిజమే. చలీ, వర్షాలూ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని ప్రజలు దాన్ని అంతగా ఇష్టపడకపోవచ్చు. (ఎజ్రా 10:⁠9) సంవత్సరంలో ఎక్కువకాలం ఎండలు మండిపోయే ప్రాంతాల్లో ఉండే కోట్లాదిమంది పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి చోట్ల లేక లేక వర్షం పడిందంటే, అక్కడి వాళ్ళకి పండుగే!

అపొస్తలుడైన పౌలు మిషనరీ సేవ చేసిన ఆసియా మైనరులాంటి (ఇప్పుడు టర్కీ) మధ్యప్రాచ్య దేశాల్లో వాతావరణం అలాగే ఉండేది. పౌలు అక్కడున్నప్పుడు అప్పటి లుకయోనియులుతో, ‘[దేవుడు] ఆకాశమునుండి మీకు వర్షాన్ని, ఫలవంతమైన రుతువులను దయచేస్తూ, ఆహారాన్ని అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, మేలుచేయడంచేత తన గురించి సాక్ష్యములేకుండా చేయలేదు’ అని అన్నాడు. (అపొస్తలుల కార్యములు 14:17) గమనించండి, పౌలు ఇక్కడ ముందు వర్షం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వర్షం లేనిదే మొక్కలు పెరగవు, ‘ఫలవంతమైన రుతువులు’ ఉండవు.

వర్షం గురించి బైబిలు ఎన్నో విషయాలు చెబుతోంది. హెబ్రీ, గ్రీకు భాషా బైబిళ్లలో వర్షానికి సంబంధించిన పదాలు దాదాపు వందసార్లు కనిపిస్తాయి. వర్షం అనే అద్భుతమైన ఈ వరం గురించి మీకింకా తెలుసుకోవాలని ఉందా? బైబిలు సైన్సు విషయాలను కూడా ఎంత సరిగ్గా చెబుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా?

బైబిలు వర్షం గురించి ఏమి చెబుతోంది?

వర్షం పడాలంటే తప్పనిసరిగా ఏది ఉండాలో యేసుక్రీస్తు చెప్పాడు. అసలది లేకపోతే వర్షమే పడదు. “పరలోకమందున్న మీ తండ్రి” “చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు” అని యేసు చెప్పాడు. (మత్తయి 5:​44, 45) ఆయన వర్షం గురించి మాట్లాడే ముందు, సూర్యుని గురించి చెప్పాడని గమనించారా? ఆయన ముందుగా సూర్యుని గురించి మాట్లాడడం సరైనదే ఎందుకంటే భూమ్మీద మొక్కలు పెరగడానికి అవసరమైన శక్తి సూర్యునినుంచే వస్తుంది. అలాగే సూర్యునివల్లే నీటిచక్రం నడుస్తుంది. అవును సూర్యరశ్మివల్లే ప్రతీ యేటా దాదాపు 4,00,000 క్యూబిక్‌ కి.మీ. సముద్రపు నీరు స్వచ్ఛమైన ఆవిరిగా పైకివెళ్తుంది. సూర్యుణ్ణి సృష్టించింది యెహోవా దేవుడే కాబట్టి ఆయనను, ‘భూమి నుండి నీళ్లు తీసుకొని వర్షం కురిపించేవాడు’ అని పిలవడం సబబే.

నీటి చక్రాన్ని వివరిస్తూ, “దేవుడు భూమి నుండి నీళ్లు తీసుకొని, దాన్ని వర్షంగా మారుస్తాడు. ఆయన మేఘాన్ని చేసి వాటి నీళ్లను కుమ్మరిస్తాడు. మనుష్యుల మీద అధిక వర్షం కురుస్తుంది” అని బైబిలు చెప్తోంది. (యోబు 36:​26-28, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) వైజ్ఞానికంగా నిజాలని తేలిన ఈ మాటలను కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు. అప్పటినుండి మనిషి ఆ నీటి చక్రాన్ని అర్థంచేసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. అయినా, “చినుకులు ఎలా ఏర్పడతాయో ఇప్పటికీ ఖచ్చితంగా చెప్పలేం” అని 2003వ సంవత్సరపు వాటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ పాఠ్యపుస్తకం చెబుతోంది.

కంటికి కనిపించనంత చిన్న రేణువుచుట్టూ నీటి బిందువు ఏర్పడుతుందన్నది మాత్రం శాస్త్రజ్ఞులకు తెలుసు. అలాంటి లక్షల నీటి బిందువులు కలిస్తేనే ఒక చినుకు తయారవుతుంది. ఇది అంత తేలిగ్గా జరిగిపోయే ప్రక్రియ కాదు. దానికి కొన్ని గంటల సమయం పడుతుంది! “మేఘాల్లోని నీటి బిందువులు చినుకులుగా ఎలా ఏర్పడతాయనడానికి శాస్త్రజ్ఞులు ఎన్నో సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఆ ప్రక్రియ అసలు ఎలా జరుగుతుందో అర్థంచేసుకోవడానికి వారెంతో సమయం వెచ్చిస్తున్నారు” అని హైడ్రాలజీ ఇన్‌ ప్రాక్టీస్‌ అనే పాఠ్యపుస్తకం చెబుతోంది.

ఇంత అద్భుతమైన ఏర్పాటు చేసిన మన సృష్టికర్త తన భక్తుడైన యోబుకు తన స్థానమేంటో తెలియజేస్తూ ఇలా అడిగాడు, ‘వర్షానికి తండ్రి ఉన్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు? అంతరింద్రియములలో [‘మేఘములో,’ అధస్సూచి] జ్ఞానముంచినవాడెవడు? జ్ఞానంచేత మేఘాలను వివరింపగలవాడెవడు? ఆకాశపు కలశములలోని వర్షాన్ని కుమ్మరించువాడెవడు?’ (యోబు 38:​28, 36, 37) ఈ ప్రశ్నలడిగి దాదాపు 3,500 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా ఇప్పటికీ వాటి జవాబుల కోసం శాస్త్రవేత్తలు తలలుబాదుకుంటున్నారు.

నీటిచక్రం ఎలా నడుస్తుంది?

గ్రీకు తత్త్వవేత్తలు, నదుల్లోని నీరు వర్షంవల్ల రాలేదు కాని, సముద్రంలో నీరే ఏదోరకంగా భూమి అడుగునుండి వెళ్లి కొండల అంచుకు చేరుకుంటుందనీ, అక్కడ అదే నీరు స్వచ్ఛమైన నీరుగామారి నదుల్లోకి వచ్చి చేరుతుందనీ బోధించేవారు. సొలొమోను కూడా అదే నమ్మేవాడని బైబిలు గురించి వ్యాఖ్యానించిన ఓ పుస్తకం అంటోంది. సొలొమోను దేవుని ప్రేరణతో, “నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుటలేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును” అని రాసిన మాటల్ని గమనించండి. (ప్రసంగి 1:⁠7) అంటే సముద్రపు నీరే ఎలాగో కొండల్లోంచి అంచుకు చేరి అక్కడ నుండి నదుల్లోకి పారుతుందని సొలొమోను ఉద్దేశమా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు, సొలొమోను దేశస్థులు నీటిచక్రం గురించి అసలు ఏమి నమ్మేవారో చూద్దాం. వాళ్ళకు తప్పుడు నమ్మకాలుండేవా?

సొలొమోను చనిపోయి వందేళ్ళైనా గడవకముందే, దేవుని ప్రవక్తయైన ఏలీయా వర్షం ఏ దిక్కు నుండి వస్తుందో తనకు తెలుసని చూపించాడు. ఆయన రోజుల్లో మూడున్నర సంవత్సరాలపాటు ఇశ్రాయేలు దేశమంతా వర్షాలు పడక, కరువు తాండవించింది. (యాకోబు 5:17) తన ప్రజలు తనను కాదని కనానీయుల వానదేవుడైన బయలును ఆరాధించినందుకు యెహోవా దేవునికి కోపం వచ్చింది. అందుకే ఆయన వారిమీదకు ఈ విపత్తును తీసుకొచ్చాడు. ఏలీయా సహాయంతో ఇశ్రాయేలీయులు తమ తప్పు తెలుసుకున్నారు, అందుకే ఆయన దేవుణ్ణి వర్షం కురిపించమని వేడుకున్నాడు. తను ప్రార్థన చేస్తున్నప్పుడు “సముద్రమువైపు చూడుము” అని తన సహాయకునికి చెప్పాడు. ఆయన చూసి వచ్చి ఏలీయాతో “మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నది” అని చెప్పినప్పుడు దేవుడు తన విన్నపాన్ని విన్నాడని ఏలీయాకు అర్థమయ్యింది. కొద్దిసేపట్లోనే ‘ఆకాశము మేఘాలతో గాలివానతో కారు కమ్మింది; మోపైన వాన కురిసింది.’ (1 రాజులు 18:​43-45) అలా ఏలీయా తనకు నీటిచక్రం గురించి కొంతవరకు తెలుసని చూపించాడు. పశ్చిమానున్న సముద్రంపై మబ్బులు ఏర్పడతాయని, అవి గాలికి తూర్పువైపునున్న వాగ్దాన దేశంపైకి కదిలివెళ్లి వర్షం కురుస్తుందని ఆయనకు తెలుసు. ఇప్పటికీ అక్కడ వర్షం కురవడానికి కారణం అదే.

ఏలీయా అలా వర్షం కోసం ప్రార్థించిన దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఆమోసు అనే వినయస్థుడైన రైతు, నీటిచక్రానికి కావాల్సిన నీరు ఎక్కడనుండి వస్తుందో వివరిస్తూ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాడు. పేదలను అణచివేస్తూ, అబద్ధ దేవుళ్ళను ఆరాధిస్తున్న ఇశ్రాయేలీయులకు తన తీర్పును ప్రకటించడానికి దేవుడు ఆమోసును పంపించాడు. వాళ్లు దేవుని చేతుల్లో నాశనమవకూడదంటే వారు ‘యెహోవాను ఆశ్రయించాలి,’ ‘అప్పుడు వాళ్లు బ్రదుకుతారు,’ అని ఆయన చెప్పాడు. సమస్తాన్ని సృష్టించినవాడు, “సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు” యెహోవాయే కాబట్టి ఆయన్ని మాత్రమే ఆరాధించాలని ఆమోసు వివరించాడు. (ఆమోసు 5:​6, 8) ఆమోసు మరోసారి అద్భుతమైన నీటిచక్రం గురించి, నీటిచక్రంలో నీరు ఎక్కడినుండి ఎక్కడికి వెళ్తుందనేదాని గురించి చెప్పాడు. (ఆమోసు 9:⁠6) అలా ఆమోసు భూమిపై వర్షం కురవాలంటే సముద్రాలు ప్రాముఖ్యం అని చూపించాడు.

ఆ విషయాన్ని 1687లో ఎడ్మండ్‌ హాల్లీ శాస్త్రీయంగా రుజువుచేశాడు. అయితే, ఇతరులు దాన్ని వెంటనే ఒప్పుకోలేదు. “18వ శాతాబ్దం తొలినాళ్ళ వరకు, భూమిలో ప్రసరణా వ్యవస్థ ఒకటుందని అంటే సముద్రపు నీళ్ళు కొండల్లోంచి పైకి వెళ్ళి అక్కడనుండి కిందకు పారతాయని నమ్మేవారు” అని ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా ఆన్‌లైన్‌ చెబుతోంది. ఇప్పుడైతే నీటిచక్రం ఎలా నడుస్తుందో అందరికీ తెలుసు. అదింకా ఇలా చెబుతోంది: “సముద్రంలోని నీరు ఆవిరై, ఆకాశంలో మేఘాలుగా ఏర్పడతాయి. మబ్బుల్లో నీరు చినుకులై వర్షంగా నేలమీద పడుతుంది. అలా ఆ నీరు నదుల్లో చేరి చివరకు సముద్రంలో కలుస్తుంది.” వీటన్నిటినిబట్టి చూస్తుంటే, సొలొమోను ప్రసంగి 1:7లో నీటిచక్రం గురించి రాసిన మాటలు, నీళ్ళు మేఘాలై వర్షంగా మారడం గురించే చెబుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

ఇదంతా తెలుసుకున్న తర్వాత మీరేమి చేస్తారు?

నీటిచక్రం గురించి వివిధ బైబిలు రచయితలు ఎంతో స్పష్టంగా, సరిగ్గా రాశారని మనం గమనించాం కదా! మనుష్యులను సృష్టించిన యెహోవా దేవుడే బైబిలును రాయించాడు అనడానికి ఉన్న అనేక తిరుగులేని రుజువుల్లో ఇదొక్కటి. (2 తిమోతి 3:​16, 17) నిజమే, మనిషి విచక్షణారహితంగా భూమిని పాడుచేయడంవల్ల వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుని కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి వల్లా, కొన్నిప్రాంతాల్లో అనావృష్టి వల్లా ప్రజలు బాధపడుతున్నారు. కానీ, నీటిచక్రాన్ని ఏర్పాటుచేసిన యెహోవా దేవుడు తానే జోక్యంచేసుకుని ‘భూమిని నశింపజేసేవారిని నశింపజేస్తాను’ అని చాలాకాలం క్రితమే హామీ ఇచ్చాడు.​—⁠ప్రకటన 11:⁠18.

ఆ రోజు వచ్చేంతవరకు, వర్షంలాంటి అద్భుతమైన వరాలిచ్చినందుకు మీరు దేవునికి కృతజ్ఞత ఎలా చూపిస్తారు? మీకు నిజంగా ఆ ఆలోచనే ఉంటే, ఆయన రాయించిన బైబిలును చదివి, దానిలో నేర్చుకున్న విషయాలను పాటించాలి. అలా చేస్తేనే మీరు దేవుని కొత్త లోకంలోకి వెళ్ళి, దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నిటినీ ఎల్లకాలం అనుభవించగలుగుతారు. ఎందుకంటే వర్షాన్నిచ్చిన యెహోవా దేవుడే ‘శ్రేష్ఠమైన ప్రతీ ఈవిని, సంపూర్ణమైన ప్రతీ వరాన్ని’ ఇస్తాడు.​—⁠యాకోబు 1:17. (w09 1/1)

[26, 27వ పేజీలోని డయాగ్రామ్‌/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మేఘాలు ఏర్పడ్డం

వర్షం మొక్కల భాష్పోత్సేకం ఆవిరవడం

వర్షపు నీరు

భూగర్భ జలాలు

[26వ పేజీలోని చిత్రాలు]

ఏలీయా ప్రార్థిస్తుండగా ఆయన సహాయకుడు “సముద్రము వైపు” చూశాడు