కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

భూమిని దేవుడు మాత్రమే కాపాడగలడు!

భూమిని దేవుడు మాత్రమే కాపాడగలడు!

భూమిని దేవుడు మాత్రమే కాపాడగలడు!

“నీలి, తెలుపు రంగుల్లో మెరుస్తున్న రత్నం.” అంతరిక్షంలో అలుముకొనివున్న చీకట్లో మన భూమి అలా కనిపించిందని వ్యోమగామి ఎడ్గార్‌ మిచెల్‌ చెప్పాడు.

భూమిని మానవ నివాసానికి అనువుగా తయారుచేయడానికి దేవుడు ఎంతో శ్రమపడ్డాడు. ఆయన దాన్ని సృష్టించినప్పుడు దేవదూతలు “జయధ్వనులు” చేశారు. (యోబు 38:⁠7) ఈ గ్రహం గురించిన అద్భుతాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మనమూ అలాగే జయధ్వనులు చేస్తాం. భూమిపై జీవమనుగడకు దోహదపడే ఎన్నో సంక్లిష్టమైన వ్యవస్థలు పర్యావరణంలో ఉన్నాయి. అందరికీ తెలిసినట్లే, పచ్చని మొక్కలు ఆహారాన్ని తయారుచేసుకోవడానికి సూర్యకాంతిని, గాలిలోని బొగ్గుపులుసు వాయువును, నేల నుండి నీటిని ఉపయోగించుకుంటాయి. ఈ ప్రక్రియవల్ల మన మనుగడకు తప్పనిసరైన ప్రాణవాయువు వాతావరణంలోకి విడుదలౌతుంది.

భూమిని చూసుకునే బాధ్యతను దేవుడు మనిషికిచ్చాడని బైబిలు చెబుతోంది. (ఆదికాండము 1:28; 2:15) భూపర్యావరణం సమతుల్యంగా ఉండాలంటే మనిషికి సరైన దృక్పథం ఉండాలి. నిజానికి మనిషి తన గృహమైన భూమిని ప్రేమించాలి. దాన్ని చక్కగా కాపాడుకోవాలనే కోరిక మనిషికి ఉండాలి. కానీ దేవుడు మనిషికి సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వాతంత్ర్యం ఇచ్చాడు, కాబట్టి అతను కావాలంటే భూమిని పాడుచేయాలనుకోవచ్చు లేదా కాపాడాలనుకోవచ్చు. కానీ అతడు దాన్ని పాడుచేయాలనే అనుకున్నాడు. మనిషి అజాగ్రత్త దురాశలతో భూమిని నాశనం చేశాడు.

మనిషి తెచ్చిన కొన్ని సమస్యలు: (1) అడవుల నరకివేతవల్ల భూమి బొగ్గుపులుసు వాయువును ఎక్కువగా గ్రహించడంలేదు, దాంతో వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. (2) క్రిమిసంహారకాలను విపరీతంగా వాడడంవల్ల పరాగ సంపర్కంతో సహా పర్యావరణంలో ప్రాముఖ్యమైన పాత్ర నిర్వహించే కీటకాలు నాశనమైపోతున్నాయి. (3) చేపలు ఎక్కువగా పట్టడం వల్లేకాదు, సముద్రాలు, నదులు కలుషితమైపోవడం వల్ల కూడా చేపల సంఖ్య విపరీతంగా తగ్గిపోతోంది. (4) భూమి సహజ వనరులను దురాశతో దుర్వినియోగం చేయడం వల్ల భవిష్యత్‌ తరాలకు ఏమీ మిగలకుండా పోవడమేకాక భూ ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. హిమనదులు ఆవిరైపోవడం, ఆర్కిటిక్‌ అంటార్కిటిక్‌ ప్రాంతాల్లో ఉన్న మంచుకొండలు కరిగిపోవడం వంటివి భూ ఉష్ణోగ్రత పెరుగుతుందనడానికి రుజువులని కొంతమంది పర్యావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

మనుషులను బాధించడానికి భూమి ప్రకృతివైపరీత్యాలను ఎక్కువచేసి మనమీద పగతీర్చుకుంటుందని కొందరంటారు. దేవుడు మనకు భూమిని ఉచితంగా ఇచ్చాడు. మనం అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు. (ఆదికాండము 1:​26-29) అయితే ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను చూస్తుంటే అందమైన తమ భూ గృహాన్ని కాపాడుకోవడం చాలామందికి ఇష్టంలేదని తెలుస్తుంది. మనిషి స్వార్థకోరికలు తీర్చుకోవడంలో, సొంత పనుల్లో మునిగితేలుతున్నాడు. ప్రకటన 11:18లో ముందే చెప్పబడినట్లు, మానవులు ‘భూమిని నాశనంజేస్తూ’ మంచి కిరాయిదారులం కామని నిరూపించుకుంటున్నారు.

భూమిపై జీవమనుగడకు దోహదపడే పర్యావరణ వ్యవస్థలను సర్వశక్తిగల దేవుడు యెహోవా ఏర్పాటుచేశాడు. ఆయనే ఈ భూమిపైనున్న చెడ్డ కిరాయిదారులను “వెళ్ళగొట్టే” సమయం వచ్చిందని ప్రకటించాడని బైబిలు ప్రవచనం చూపిస్తోంది. (జెఫన్యా 1:14; ప్రకటన 19:​11-15) మనిషి భూమిని పూర్తిగా నాశనం చేయకముందే దేవుడు చర్య తీసుకుంటాడు. అది మనం అనుకునేదానికన్నా ముందే జరుగుతుంది. * (మత్తయి 24:44) నిజమే, భూమిని దేవుడు మాత్రమే కాపాడగలడు! (w09 1/1)

[అధస్సూచి]

^ పేరా 7 ఇప్పుడు మనం అంతానికి ఎంత దగ్గర్లో ఉన్నామో తెలుసుకోవడానికి యెహోవాసాక్షులు ప్రచురించిన అప్రమత్తంగా ఉండండి! అనే బ్రోషుర్‌ చూడండి.