కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎప్పుడూ సరైనది చేసే న్యాయాధిపతి

ఎప్పుడూ సరైనది చేసే న్యాయాధిపతి

దేవునికి దగ్గరవ్వండి

ఎప్పుడూ సరైనది చేసే న్యాయాధిపతి

ఆదికాండము 18:22-32

న్యాయం. ధర్మం. నిష్పక్షపాతం. అలాంటి అత్యుత్తమ లక్షణాలు మిమ్మల్ని ఆకట్టుకోవా? మనకెప్పుడూ న్యాయం జరగాలనే ఆశిస్తాం. కానీ విచారకరంగా లోకమంతా అన్యాయంతో నిండిపోయింది. అయితే, యెహోవా దేవుడు ఒక్కడే మనం నమ్మగల న్యాయాధిపతి. ఆయనెప్పుడూ సరైనదే చేస్తాడు. యెహోవాకు అబ్రాహాముకు మధ్య జరిగిన సంభాషణలో ఇది స్పష్టమవుతుంది, దీన్ని మనం ఆదికాండము 18:22-32లో చదువుతాం. *

సొదొమ గొమొఱ్ఱాలలోని పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామనుకుంటున్నానని యెహోవా అబ్రాహాముతో చెప్పినప్పుడు, ఆయన తన అన్న కుమారుడైన లోతుకు, అక్కడ ఎవరైనా నీతిమంతులుంటే వారికి ఏమి జరుగుతుందోనని భయపడ్డాడు. అబ్రాహాము యెహోవాను ఇలా ప్రాధేయపడ్డాడు: ‘దుష్టులతోపాటు నీతిమంతులను నాశనం చేస్తావా? ఆ పట్టణములో ఒకవేళ యాభైమంది నీతిమంతులుంటే దానిలోవున్న యాభైమంది నీతిమంతుల కోసం ఆ స్థలాన్ని నాశనం చేయకుండా కాపాడవా?’ (23, 24 వచనాలు) కేవలం 50 మంది నీతిమంతులున్నా ఆ నగరాలను నాశనం చేయనని దేవుడు చెప్పాడు. అప్పుడు అబ్రాహాము యెహోవాను ఇంకా ఐదుసార్లు, చివరికి ఆ సంఖ్య పదికి చేరుకునేంతవరకు వేడుకున్నాడు. అబ్రాహాము అలా వేడుకున్న ప్రతీసారి, ఆయన చెప్పినంత మంది నీతిమంతులుంటే దేవుడు ఆ నగరాలను నాశనం చేయనని చెప్తూ వచ్చాడు.

అబ్రాహాము దేవునితో వాదిస్తున్నాడా? కానేకాదు! ఒకవేళ ఆయన అలా వాదిస్తే అహంకారాన్ని చూపించినట్లయ్యేది. అబ్రాహాము గౌరవాన్నిస్తూ వినయంతో మాట్లాడాడు. తాను ‘ధూళి, బూడిదె’ వంటివాడినని అన్నాడు. (27వ వచనం) అంతేగాక, అబ్రాహాము మాటలు యెహోవా న్యాయవంతుడనే నమ్మకం ఆయనకుందని చూపించాయి. దేవుడు ‘దుష్టులతోపాటు నీతిమంతులను’ నాశనం చేయడనే విషయాన్ని అబ్రాహాము రెండుసార్లు ప్రస్తావించాడు. నమ్మకస్థుడైన ఆ పూర్వీకుడు, ‘సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు న్యాయం చేస్తాడు’ అనే దృఢమైన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.—25వ వచనం.

అబ్రాహాము అలా మాట్లాడడం సరైనదేనా? ఒక రకంగా అవుననీ మరో రకంగా కాదనీ చెప్పవచ్చు. సొదొమ గొమొఱ్ఱా నగరాల్లో కనీసం పదిమంది నీతిమంతులున్నారని ఆయన సూచించడం తప్పు. అయితే, దేవుడు “దుష్టులతో కూడ నీతిమంతులను” నాశనం చేయడని ఆయన అనడం మాత్రం సరైనదే. ఆ తర్వాత దేవుడు, దుష్టత్వంలో కూరుకుపోయిన ఆ రెండు నగరాలను నాశనం చేసినప్పుడు నీతిమంతుడైన లోతు, ఆయన ఇద్దరు కూతుర్లు దేవదూతల సహాయంతో తప్పించుకున్నారు.—2 పేతురు 2:7-9.

ఈ వృత్తాంతం నుండి యోహోవా గురించి మనమేమి నేర్చుకోవచ్చు? ఆ నగరాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దామనుకుంటున్నానని యెహోవా అబ్రాహాముతో చెప్పడం ద్వారా దాని గురించి అబ్రాహాము ఏమనుకుంటున్నాడో చెప్పమని ఆయన ఆహ్వానించాడు. ఆ తర్వాత, తన స్నేహితుడైన అబ్రాహాము తనకు ఆందోళన కలిగిస్తున్న విషయాల గురించి చెప్పినప్పుడు దేవుడు ఓపిగ్గా విన్నాడు. (యెషయా 41:8) యెహోవా వినయం గల దేవుడని, భూమ్మీదున్న తన సేవకులను చిన్నచూపు చూడకుండా వారిని గౌరవిస్తాడని ఈ వృత్తాంతం ఎంత చక్కగా చూపిస్తోంది! కాబట్టి, ఎప్పుడూ సరైనది చేసే న్యాయాధిపతి అయిన యెహోవాను మనం పూర్తిగా నమ్మడానికి ఎన్నో కారణాలున్నాయి. (w09 1/1)

[అధస్సూచి]

^ పేరా 4 ఆ సందర్భంలో, ఒక దేవదూత ద్వారా యెహోవా ఆయనతో మాట్లాడాడు. మరో ఉదాహరణ కోసం, ఆదికాండము 16:7-11, 13 వచనాలు చూడండి.

[14వ పేజీలోని చిత్రం]

సొదొమ గొమొఱ్ఱాల గురించి అబ్రాహాము యెహోవాను వేడుకున్నాడు