కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మా పాఠకుల ప్రశ్న

కొన్ని ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబివ్వడు?

కొన్ని ప్రార్థనలకు దేవుడు ఎందుకు జవాబివ్వడు?

మనం దేవునికి ఎప్పుడైనా ప్రార్థించవచ్చు. ఎలాగైతే ఒక ప్రేమగల తండ్రి తన పిల్లలు తనతో స్వేచ్ఛగా మాట్లాడాలని కోరుకుంటాడో అలాగే యెహోవా దేవుడు కూడా మన ప్రార్థనలను వినాలని కోరుకుంటాడు. అయితే, జ్ఞానంగల ఒక తండ్రి తన పిల్లలు అడిగే కొన్నిటిని ఇవ్వకపోవడానికి సరైన కారణాలే ఉంటాయి, అలాగే దేవునికి కూడా మనమడిగే కొన్నిటిని ఇవ్వకపోవడానికి సరైన కారణాలున్నాయి. దేవుడు ఆ కారణాలను రహస్యంగా ఉంచాడా లేక వాటి గురించి బైబిల్లో ఏమైనా తెలియజేశాడా?

అపొస్తలుడైన యోహాను ఇలా వివరిస్తున్నాడు, ‘ఆయననుబట్టి మనకున్న ధైర్యమేమిటంటే, ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడన్నదే.’ (1 యోహాను 5:14) మనం అడిగేవి దేవుని చిత్తానుసారంగా ఉండాలి. కొంతమంది దేవుని చిత్తానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నవాటిని, అంటే లాటరీలో గెలవాలనో పందెం నెగ్గాలనో అడుగుతారు. మరి కొంతమంది దురుద్దేశాలతో ప్రార్థిస్తారు. ప్రార్థన చేసే అవకాశాన్ని ఇలా దుర్వినియోగం చేయడం గురించి హెచ్చరిస్తూ శిష్యుడైన యాకోబు ఇలా అన్నాడు, ‘మీరు ఆశిస్తున్నారు గాని మీకు దొరకడంలేదు. మీరడిగినా మీ భోగముల కోసం వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతారు కాబట్టి మీకేమి దొరకడంలేదు.’—యాకోబు 4:2, 3.

ఉదాహరణకు, ఫుట్‌బాల్‌ ఆడుతున్న రెండు జట్లు, ఎవరికి వాళ్లు తాము గెలవాలని దేవునికి ప్రార్థిస్తున్నారని అనుకుందాం. పరస్పర విరుద్ధమైన అలాంటి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడని ఆశించడం సరైనది కాదు. మన కాలంలో జరుగుతున్న యుద్ధాల్లో, మేము గెలవాలంటే మేము గెలవాలని ఇరు వర్గాలవారు చేసే ప్రార్థనలకు కూడా దేవుడు జవాబివ్వడని మనకు అర్థమౌతుంది.

దేవుని నియమాలను పాటించనివారు చేసే ప్రార్థనలకు దేవుడు జవాబివ్వడు. ఒక సందర్భంలో, వేషధారణతో తనను ఆరాధించేవారితో యెహోవా ఇలా అనక తప్పలేదు: ‘మీరు ఎంత ప్రార్థనచేసినా నేను వినను. మీ చేతులు రక్తంతో నిండివున్నాయి.’ (యెషయా 1:15) బైబిలు ఇలా చెప్తోంది: “ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని ప్రార్థన హేయము.”—సామెతలు 28:9.

మరోవైపున యెహోవా, తన చిత్తానుసారంగా తనను సేవించడానికి శాయశక్తులా కృషి చేస్తున్న తన ఆరాధకుల యథార్థమైన ప్రార్థనలు ఎల్లప్పుడూ వింటాడు. అలాగని వారడిగే ప్రతీదాన్ని యెహోవా వారికిస్తాడని దానర్థమా? కాదు. దీని విషయంలో కొన్ని బైబిలు ఉదాహరణలు పరిశీలించండి.

మోషేకు దేవునితో ఎవ్వరికీ లేనంత దగ్గరి సంబంధం ఉంది. అయినా ఆయన కూడా ‘దేవుని చిత్తానుసారంగా’ అడగాల్సిందే. అలా అడిగే బదులు దేవుడు చెప్పినదానికి విరుద్ధంగా, మోషే కనానులోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వమని కోరుతూ, ‘అద్దరికి వెళ్లి యొర్దాను అవతలనున్న మంచి దేశమును చూచునట్లు దయచేయుము’ అని దేవున్ని బ్రతిమాలాడు. కానీ మోషే చేసిన తప్పు వల్ల ఆయన ఆ దేశంలోకి ప్రవేశించలేడని దేవుడు అంతకుముందే ఆయనకు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మోషే అడిగినదానికి ఒప్పుకునే బదులు, ‘చాలు! ఇక ఈ సంగతి గురించి నాతో మాటలాడకు’ అని యెహోవా ఆయనతో అన్నాడు.—ద్వితీయోపదేశకాండము 3:25, 26; 32:51.

అపొస్తలుడైన పౌలు తన ‘శరీరంలోని ముల్లును’ తీసివేయమని ప్రార్థించాడు. (2 కొరింథీయులు 12:7) ఈ ‘ముల్లు,’ ఆయనకున్న కంటి జబ్బో లేక వ్యతిరేకుల నుండి, ‘కపట సహోదరుల’ నుండి ఎదురైన హింసో అయ్యుండవచ్చు. (2 కొరింథీయులు 11:26; గలతీయులు 4:14, 15) ‘అది నాయొద్దనుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నాను’ అని పౌలు రాశాడు. అయితే, పౌలు ఆయనను బాధించే వేదనకరమైన ఆ ‘ముల్లు’ ఉన్నా ప్రకటనా పనిలో కొనసాగితే అది తనపై పౌలుకున్న నమ్మకాన్ని చూపిస్తుందనీ తన శక్తి రుజువవుతుందనీ దేవునికి తెలుసు. కాబట్టి పౌలు అడిగినదాన్ని ఇచ్చే బదులు, దేవుడు ఆయనకిలా చెప్పాడు, “బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది.”—2 కొరింథీయులు 12:8, 9.

నిజమే, మనం అడిగే ఫలానా దాన్ని మనకివ్వాలా వద్దా అనే విషయం మనకన్నా దేవునికే బాగా తెలుసు. అంతేకాదు, బైబిల్లో రాసిపెట్టబడిన తన ప్రేమపూర్వక సంకల్పాలకు అనుగుణంగా యెహోవా, మనమడిగేవాటిలో మనకు ఏవి మంచివో వాటిని ఎల్లప్పుడూ ఇస్తాడు. (w09 1/1)