కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని ప్రేమకు అతిగొప్ప నిదర్శనం

దేవుని ప్రేమకు అతిగొప్ప నిదర్శనం

దేవునికి దగ్గరవ్వండి

దేవుని ప్రేమకు అతిగొప్ప నిదర్శనం

ఆదికాండము 22:1-18

అబ్రాహాము దేవుణ్ణి ప్రేమించాడు. నమ్మకస్థుడైన ఆ పూర్వీకుడు తనకు వృద్ధాప్యంలో పుట్టిన ఇస్సాకును కూడా ప్రేమించాడు. కానీ ఇస్సాకుకు బహుశా 25 ఏళ్ళున్నప్పుడు, అబ్రాహాముకు ఒక పరీక్ష ఎదురైంది. అదేంటంటే, ఆయన కొడుకుని బలిమ్మని దేవుడు ఆయన్ని అడిగాడు. దేవుడు అడిగిందివ్వాలంటే ఆయన, ఒక తండ్రికి తన కొడుకుపట్ల సహజంగా ఉండే ప్రేమను అణచుకుని ప్రవర్తించాలి. అయితే కథ చివర్లో ఇస్సాకు చనిపోలేదు. అబ్రాహాము ఇస్సాకును బలివ్వబోతుండగా, దేవుడు ఒక దూత ద్వారా మాట్లాడి ఆయనను ఆపాడు. ఆదికాండము 22:1-18లో ఉన్న ఈ బైబిలు కథ దేవునికి మనపట్ల ఎంత ప్రేమ ఉందో చాలా ఏళ్ల క్రితమే చూపించింది.

‘దేవుడు అబ్రాహామును పరిశోధించాడు’ అని 1వ వచనం చెబుతుంది. అబ్రాహాము విశ్వాసమున్న వ్యక్తి. అయితే ఈ సందర్భంలో ఆయన విశ్వాసం ఎప్పుడూ లేనంతగా పరీక్షించబడింది. దేవుడు ఆయనతో, ‘నీకు ఒక్కడే అయిన నీ కుమారుణ్ణి, అంటే నువ్వు ప్రేమించే ఇస్సాకును తీసికొని, నేను నీతో చెప్పే పర్వతాలలో ఒకదానిమీద దహనబలిగా అర్పించు’ అని చెప్పాడు. (2వ వచనం) తన సేవకులు ఎంతవరకు సహించగలరో ఆయనకు తెలుసు. అంతకన్నా పెద్ద పరీక్షలు వాళ్ళకు రానివ్వడు. కాబట్టి ఈ పరీక్ష పెట్టినప్పుడు దేవునికి అబ్రాహాముపై ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది.​—⁠1 కొరింథీయులు 10:⁠13.

అబ్రాహాము వెంటనే విధేయత చూపించాడు. ‘తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడైన ఇస్సాకును, వెంటబెట్టుకొని దహనబలి కోసం కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లాడు’ అని బైబిలు చెబుతోంది. (3వ వచనం) అబ్రాహాము ఈ పరీక్ష గురించి ఎవరికీ చెప్పలేదనిపిస్తోంది.

ఆయన మూడురోజులు ప్రయాణించాడు. కాబట్టి దీర్ఘంగా ఆలోచించుకోవడానికి ఆయనకెంతో సమయం దొరికివుంటుంది. అయినా అబ్రాహాము తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆయనకెంత విశ్వాసముందో ఆయన మాటల్లో తెలుస్తుంది. దేవుడు చెప్పిన పర్వతం దూరంలో కనిపించగానే ఆయన తన సేవకులతో ‘మీరు ఇక్కడనే ఉండండి; నేనూ ఈ చిన్నవాడు అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీ దగ్గరికి వస్తాము’ అని చెప్పాడు. బలి అర్పించడానికి గొర్రె ఏదని ఇస్సాకు అడిగినప్పుడు ‘దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూసుకుంటాడు’ అని అబ్రాహాము చెప్పాడు. (5, 8 వచనాలు) అబ్రాహాము తన కుమారునితోపాటు తిరిగి వస్తానని అనుకున్నాడు. ఆయన ఎందుకలా అనుకున్నాడు? ఎందుకంటే ‘దేవుడు మృతులను [ఇస్సాకును] సహితం లేపడానికి శక్తిమంతుడని’ అబ్రాహాము నమ్మాడు.​—⁠హెబ్రీయులు 11:​17-19.

పర్వతంపైకి చేరుకున్న తర్వాత, అబ్రాహాము ‘తన కుమారుణ్ణి వధించడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకోగానే’ ఒక దూత ఆయనను ఆపాడు. అబ్రాహాము “తన కుమారునికి మారుగా” బలి అర్పించడానికి దేవుడు ఒక పొట్టేలును పొదల్లో చిక్కుకునేలా చేశాడు. (10-13 వచనాలు) దేవుని దృష్టిలో అబ్రాహాము ఇస్సాకును నిజంగా బలి అర్పించినట్టే లెక్క. (హెబ్రీయులు 11:17) ఎందుకంటే, ‘ఏదైనా ఒక పని చేయడానికి ఇష్టపడితే దేవుడు ఆ పని చేసేసినట్టే పరిగణిస్తాడు’ అని ఒక పండితుడు వివరించాడు.

యెహోవాకు అబ్రాహాముపై ఉన్న నమ్మకం వమ్ముకాలేదు. అంతేకాక యెహోవాపై అబ్రాహాము ఉంచిన నమ్మకానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఎందుకంటే, అబ్రాహాము ద్వారా జనాంగాలన్నీ ఆశీర్వదించబడతాయని తాను చేసిన నిబంధనను మరోసారి గుర్తుచేయడమే కాకుండా, దేవుడు అబ్రాహామును ఇంకెక్కువగా ఆశీర్వదించాడు.​—⁠15-18 వచనాలు.

అబ్రాహాము తన కొడుకును దేవుడు బలివ్వకుండా ఆపాడు. కానీ ఆయన తన కుమారుణ్ణి బలిగా అర్పించడానికి వెనుకాడలేదు. ఇస్సాకును బలి అర్పించడానికి అబ్రాహాము ముందుకు రావడం, దేవుడు మన పాపాల కోసం తన అద్వితీయ కుమారుణ్ణి బలి అర్పిస్తాడు అనడానికి సూచనగా ఉంది. (యోహాను 3:16) క్రీస్తును బలిగా ఇవ్వడం యెహోవాకు మనపై ప్రేమ ఉందనడానికి అతిగొప్ప నిదర్శనం. దేవుడు మనకోసం అంతటి త్యాగం చేశాడు కాబట్టి, ‘దేవునికి సంతోషం కలిగించడానికి నేనెలాంటి త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను?’ అని మనల్నిమనం ప్రశ్నించుకోవాలి. (w09 2/1)