కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు నేర్పించండి

యోషీయా మంచి పనులే చేయాలని అనుకున్నాడు

యోషీయా మంచి పనులే చేయాలని అనుకున్నాడు

పిల్లలూ, మీరేమంటారు మంచి పనులు చేయడం కష్టమా? *—అవును, కష్టమే అని మీరంటారా? చాలామంది అలాగే అంటారు. అంతెందుకు పెద్దవాళ్ళకు కూడా ఒక పని మంచిదని తెలిసినా దాన్ని చేయడం కష్టంగా అనిపిస్తుంది. యోషీయాకు మంచి పనులు చేయడం చాలా కష్టమయ్యింది. ఎందుకో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకీ ఆయనెవరో మీకు తెలుసా?​​—⁠

యూదా దేశాన్ని ఆమోను అనే రాజు పరిపాలించేవాడు, ఆయన కొడుకే యోషీయా. యోషీయా పుట్టే సమయానికి ఆమోనుకు పదహారేళ్ళు మాత్రమే. వాళ్ళ నాన్న మనష్షే రాజులాగే ఆమోను కూడా చాలా చెడ్డవాడు. మనష్షే రాజు చాలా సంవత్సరాలు ఎన్నో చెడ్డ పనులు చేశాడు. కానీ ఆ తరువాత ఏమైందో తెలుసా? అష్షూరు రాజు ఆయన్ని యుద్ధంలో ఓడించి ఎక్కడో దూరానున్న బబులోనుకు బందీగా తీసుకెళ్ళాడు. అక్కడ జైల్లో ఉన్నప్పుడు మనష్షే రాజు దేవునికి ప్రార్థనచేసి నన్ను క్షమించు అని అడిగాడు. యెహోవా ప్రార్థన విని ఆయన్ని క్షమించాడు.

జైలు నుంచి బయటకొచ్చాక ఆయన యెరూషలేముకు తిరిగొచ్చేసి మళ్ళీ రాజయ్యాడు. ఆయన తనవల్ల జరిగిన చెడ్డ పనులన్నిటినీ సరిచేసి వచ్చీరావడంతోనే మంచి పనులు చేయడం మొదలుపెట్టాడు. యెహోవా దేవుడిని ఆరాధించేలా ప్రజలకు సహాయం చేశాడు. అయితే వాళ్ళ కొడుకు ఆమోను ఆయనలా మంచి పనులు చేయలేదు. అది చూసి మనష్షే రాజు చాలా బాధపడి ఉంటాడు. బహుశా ఆ సమయంలోనే యోషీయా పుట్టివుంటాడు. తాతామనవళ్ళు ఎంతకాలం కలిసున్నారో బైబిలు చెప్పట్లేదు. మరి యోషీయాకు వాళ్ళ తాత, యెహోవా గురించి నేర్పించడానికి ప్రయత్నించివుంటాడా?​​—⁠

యోషీయాకు ఆరేళ్ళున్నప్పుడే వాళ్ళ తాత చచ్చిపోయాడు. తర్వాత యోషీయా వాళ్ళ నాన్న ఆమోను రాజు అయ్యాడు. ఆయన రెండేళ్ళు మాత్రమే రాజుగా ఉన్నాడు, ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళ సేవకులే అతన్ని చంపేశారు. అప్పుడు యోషీయా యూదా దేశానికి రాజయ్యాడు. అప్పుడాయనకు ఎనిమిదేళ్ళే. (2 దినవృత్తాంతములు 33వ అధ్యాయం) ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసా? యోషీయా వాళ్ళ నాన్న ఆమోనులాగా చెడ్డపనులు చేశాడా లేక మంచిగా మారిన వాళ్ళ తాతలా మంచిపనులు చేశాడా?​​—⁠

యోషీయా చిన్న పిల్లవాడే అయినా యోహోవా సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకే వాళ్ళ నాన్న స్నేహితులు చెప్పిన మాటలను వినలేదు. యెహోవాను ప్రేమించేవారు చెప్పినదాన్నే విన్నాడు. యోషీయాకు అప్పటికింకా ఎనిమిదేళ్ళే అయినా, దేవుడిని ప్రేమించేవారు చెప్పేదే వినాలి, అదే మంచిది అని ఆయనకు తెలుసు. (2 దినవృత్తాంతములు 34:​1, 2) యోషీయాకు ఎవరు మంచి విషయాలు నేర్పించేవారో మీకు తెలుసా? ఆయన ఎవరిని చూసి మంచి పనులు చేయడం నేర్చుకున్నాడు? వాళ్ళ గురించి మీకు కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉందా?—

యోషీయా జెఫన్యా ప్రవక్తను చూసి ఎంతో నేర్చుకున్నాడు. జెఫన్యా బహుశా మనష్షే వాళ్ళ నాన్న అంటే మంచి రాజు హిజ్కియా వంశంలో పుట్టివుంటాడు. యోషీయా జెఫన్యా బంధువులే. యోషీయా రాజైన కొత్తలో జెఫన్యా తన పేరుతో ఒక బైబిలు పుస్తకాన్ని రాశాడు. మంచి పనులు చేయకపోతే వాళ్ళకి కష్టాలు వస్తాయని ఆయన తన పుస్తకంలో రాశాడు. యోషీయా తప్పకుండా ఆ పుస్తకంలోని హెచ్చరికలను శ్రద్ధగా చదివుంటాడు.

యిర్మీయా కూడా ఆయనకు స్నేహితుడే. యిర్మీయా గురించి బహుశా మీరు వినేవుంటారు. ఇద్దరి ఇళ్ళు దగ్గర దగ్గరే ఉండేవి, వాళిద్దరూ చిన్నప్పటి నుండే యెహోవాను సేవించాలని కోరుకున్నారు. యెహోవా యిర్మీయాతో ఆయన పేరుమీదే బైబిల్లో ఒక పుస్తకాన్ని రాయించాడు. యోషీయా యుద్ధంలో చనిపోతే యిర్మీయా చాలా బాధపడ్డాడు. యోషీయా కోసం బాధతో “ప్రలాపవాక్యము” అనే పాట కూడా రాశాడు. (2 దినవృత్తాంతములు 35:25) యెహోవా దేవునికి నమ్మకంగా ఉండాలని వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ప్రోత్సహించుకునివుంటారు.

యోషీయా గురించి చదివి మీరేమి నేర్చుకున్నారు?​​—⁠ మీనాన్న కూడా యోషీయా వాళ్ళ నాన్నలాగే యెహోవాను సేవించడా? అలాగైతే దేవుని గురించి మీకు ఎవరు నేర్పిస్తారు? మీ అమ్మగానీ, తాతమామ్మలుగానీ, చుట్టాల్లో ఎవరైనాగానీ మీకు నేర్పించొచ్చు. లేదా, మీ అమ్మకి ఇష్టమైతే యెహోవా సేవకుల్లో ఎవరైనా ఒకరి దగ్గర మీరు బైబిలు గురించి నేర్చుకోవచ్చు.

యోషీయా ఎవరి దగ్గర నేర్చుకున్నప్పటికీ, చిన్న వయసులోనే యెహోవాను ఆరాధించే వారితో స్నేహం చేయాలని అర్థంచేసుకున్నాడు. మీరు కూడా యోషీయాలాగే మంచి పనులే చేయాలనుకుంటారని మా ఆశ. (w09 2/1)

^ పేరా 3 మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.