కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వారు ‘గొర్రెపిల్లను వెంబడిస్తూనే ఉంటారు’

వారు ‘గొర్రెపిల్లను వెంబడిస్తూనే ఉంటారు’

వారు ‘గొర్రెపిల్లను వెంబడిస్తూనే ఉంటారు’

“వీరు . . . గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడింతురు.”​—⁠ప్రక. 14:⁠4.

అప్పటికి యేసు తన పరిచర్యను ఆరంభించి దాదాపు రెండున్నర ఏళ్లు గడిచాయి. ఆయన ‘కపెర్నహూములోని సమాజమందిరంలో బోధిస్తున్నాడు.’ ఆయన మాటలకు విభ్రాంతిచెంది, “ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి, మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు.” తనను వదిలిపెట్టి వెళ్లాలనుకుంటున్నారా అని తన పన్నెండుమంది అపొస్తలులను అడిగినప్పుడు సీమోను పేతురు, “ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నాము” అని జవాబిచ్చాడు. (యోహా. 6:​47, 59, 60, 66-69) యేసు నిజమైన శిష్యులు ఆయనను వెంబడించడం మానుకోలేదు. పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత కూడా వారు ఆయన నిర్దేశానికి లోబడుతూనే ఉన్నారు.​—⁠అపొ. 16:​7-10.

2 మన కాలంలోని అభిషిక్త క్రైస్తవుల గురించి ఏమి చెప్పవచ్చు? తన ‘రాకడకూ, యుగసమాప్తికి సంబంధించిన సూచనను’ వివరిస్తూ యేసు తాను చెప్పిన ప్రవచనంలో భూమ్మీదున్న ఆత్మాభిషిక్త అనుచరుల గుంపును “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” లేదా ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ అని పిలిచాడు. (మత్త. 24:​3, 45; లూకా 12:42) ‘గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడిస్తుందనే’ మంచి పేరు ఒక గుంపుగా దాసుని తరగతికి ఉంది. (ప్రకటన 14:​4, 5 చదవండి.) ఆ తరగతివారు ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన “మహా బబులోను” నమ్మకాలతో, ఆచారాలతో తమను తాము అపవిత్రపరచుకోకుండా ఉండడం ద్వారా ఆధ్యాత్మికంగా స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉంటారు. (ప్రక. 17:⁠5) సిద్ధాంతపరమైన ఏ అబద్ధము ‘వీరి నోట కనబడదు.’ వీరు “అనింద్యులు”గా ఉంటారు అంటే సాతాను లోకానికి సంబంధించిన ఏ కళంకం తమకు అంటకుండా కాపాడుకుంటారు. (యోహా. 15:19) భవిష్యత్తులో భూమ్మీదున్న మిగతా అభిషిక్తులు గొర్రెపిల్లను పరలోకంవరకు ‘అనుసరిస్తారు.’​—⁠యోహా. 13:​36, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

3 యేసు “తన యింటివారికి” అంటే దాసుని తరగతిలోని వివిధ సభ్యులకు “తగినవేళ అన్నము పెట్టుటకు” నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి నియమించాడు. అంతేకాక, ఆయన ఈ దాసుణ్ణి “తన యావదాస్తిమీద” నియమించాడు. (మత్త. 24:​45-47) ఈ ‘ఆస్తి’లో రోజురోజుకీ పెరుగుతున్న ‘వేరేగొర్రెలకు’ చెందిన ‘గొప్పసమూహపువారు’ కూడ ఉన్నారు. (ప్రక. 7:9; యోహా. 10:16) అలాంటప్పుడు అభిషిక్త క్రైస్తవుల్లోని, ‘వేరేగొర్రెల్లోని’ ప్రతీ ఒక్కరూ తమమీద నియమించబడిన దాసునిమీద నమ్మకముంచొద్దా? దాసుని తరగతిని నమ్మేందుకు మనకు ఎన్నో కారణాలున్నాయి. వాటిలో రెండు ప్రాముఖ్యమైన కారణాలు: (1) యెహోవా దాసుని తరగతిమీద నమ్మకముంచాడు. (2) వారిమీద యేసు కూడ నమ్మకముంచాడు. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునిమీద అటు యెహోవా దేవునికి, ఇటు యేసుక్రీస్తుకు పూర్తి నమ్మకముందని చూపించే రుజువులను మనమిప్పుడు చూద్దాం.

యెహోవా దాసుని తరగతమీద నమ్మకముంచాడు

4 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు తగినవేళ బలమైన ఆధ్యాత్మిక ఆహారం ఎలా అందించగలుగుతున్నాడో చూడండి. “నీకు ఉపదేశము చేసెదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను” అని యెహోవా చెబుతున్నాడు. అంతేకాక, “నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పెదను” అని కూడా చెప్పాడు. (కీర్త. 32:⁠8) దీన్నిబట్టి, యెహోవాయే దాసుని తరగతిని నడిపిస్తున్నాడని తెలుస్తుంది. కాబట్టి, ఆ తరగతి మనకు లేఖనాల నుండి ఇచ్చే పరిజ్ఞానాన్ని, అవగాహనను, నిర్దేశాన్ని పూర్తిగా నమ్మవచ్చు.

5 యెహోవా తన పరిశుద్ధాత్మను కూడ దాసుని తరగతికి అనుగ్రహిస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ కనిపించకపోయినా అది పనిచేస్తుందనడానికి రుజువులు కనిపిస్తాయి. యెహోవా దేవుని గురించి, ఆయన కుమారుని గురించి, రాజ్యం గురించి ప్రపంచవ్యాప్తంగా సాక్ష్యమిచ్చే విషయంలో నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు సాధించిన ఫలితాల గురించి ఒక్కసారి ఆలోచించండి. యెహోవా ఆరాధకులు 230 కన్నా ఎక్కువ దేశాల్లో, ద్వీపాల్లో రాజ్య సందేశాన్ని చురుగ్గా ప్రకటిస్తున్నారు. దేవుని ఆత్మ దాసుని తరగతికి శక్తిని అనుగ్రహిస్తుందనడానికి అవి తిరుగులేని రుజువులు కావా? (అపొస్తలుల కార్యములు 1:8 చదవండి.) ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవా ప్రజలకు తగినవేళ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి దాసుని తరగతి ఎన్నో ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంది. ఆ నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుచేస్తున్నప్పుడు దాసుని తరగతి ప్రేమా, సాత్వికంతోపాటు ఆత్మఫలంలోని మరికొన్ని లక్షణాలను కనబరుస్తారు.​—⁠గల. 5:​22, 23.

6 నమ్మకమైన దాసుని తరగతిని యెహోవా ఎంతగా నమ్ముతున్నాడో అర్థంచేసుకోవడానికి వారికి చేయబడిన వాగ్దానం గురించి ఆలోచించండి. “బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది” అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 కొరిం. 15:​51-53) దేవుణ్ణి నమ్మకంగా సేవించి క్షయమైన శరీరంతో మరణించే క్రీస్తు అభిషిక్త అనుచరులు నిత్య జీవితాన్ని అనుభవించే ఆత్మీయ ప్రాణులకన్నా శ్రేష్ఠమైన రీతిలో పునరుత్థానం చేయబడతారు. వారికి అమర్త్యత ఇవ్వబడుతుంది అంటే నాశనంకాకుండా నిత్యమూ జీవించే అవకాశం వారికి ఉంటుంది. అంతేకాక, వారికి అక్షయత అంటే కుళ్లిపోయే అవకాశంలేని, సజీవంగా ఉండేందుకు ఒకరిపై ఆధారపడాల్సిన అవసరంలేని శరీరాలు వారికి అనుగ్రహించబడతాయి. పునరుత్థానం చేయబడిన ఈ అభిషిక్తులు తలలమీద సువర్ణ కిరీటాలు పెట్టుకొని సింహాసనాలమీద కూర్చొని ఉన్నట్లు ప్రకటన 4:4 వర్ణిస్తోంది. మహిమగల రాజులుగా పరిపాలించే అవకాశం వారికి ఇవ్వబడుతుంది. యెహోవాకు వారిమీద నమ్మకముందనడానికి ఇవే కాక ఎన్నో రుజువులున్నాయి.

7 “గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది; ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనియున్నది; . . . ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మలములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు” అని ప్రకటన 19:​6-8 వచనాలు చెబుతున్నాయి. యెహోవా తన కుమారునికి పెండ్లికుమార్తెగా ఉండేందుకు అభిషిక్త క్రైస్తవులను ఎంపికచేశాడు. అక్షయత, అమర్త్యత, రాచరిక మహిమ, ‘గొర్రెపిల్లతో వివాహం,’ ఇలా వారికి ఎన్నో గొప్ప బహుమానాలు అనుగ్రహించబడ్డాయి! “గొఱ్ఱెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడించే” అభిషిక్తులపై దేవునికి ఎంతో నమ్మకముందనడానికి ఇవి అత్యంత గొప్ప రుజువులు.

యేసు కూడ దాసుణ్ణి నమ్ముతున్నాడు

8 యేసు తన ఆత్మాభిషిక్త అనుచరులను పూర్తిగా నమ్ముతున్నాడనడానికి ఏ రుజువులున్నాయి? భూజీవితంలోని చివరి రోజున యేసు నమ్మకస్థులైన తన 11 మంది అపొస్తలులకు ఓ వాగ్దానం చేశాడు. “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను” అని ఆయన వారితో అన్నాడు. (లూకా 22:​28-30) ఆయన అప్పుడు పదకొండు మందితో చేసిన నిబంధన 1,44,000 అభిషిక్త క్రైస్తవులకు కూడ వర్తిస్తుంది. (లూకా 12:32; ప్రక. 5:​9, 10; 14:⁠1) వారిమీద ఆయనకు నమ్మకం లేకపోతే తనతో పరిపాలించే విధంగా వారితో నిబంధన చేసుకుంటాడా?

9 అంతేకాక, యేసుక్రీస్తు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి “తన యావదాస్తిమీద” అంటే భూమ్మీద రాజ్యానికి సంబంధించిన వాటన్నిటిమీద నియమించాడు. (మత్త. 24:47) యెహోవాసాక్షుల ప్రపంచ ప్రధానకార్యాలయంలోని, వివిధ దేశాల బ్రాంచి కార్యాలయాల్లోని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమావేశ హాళ్లలోని, రాజ్య మందిరాల్లోని వసతులతోపాటు సువార్త ప్రకటనా పని, శిష్యులను చేసే పని వంటివి కూడ రాజ్య సంబంధమైన ఆస్తులే. ఒక వ్యక్తిమీద నమ్మకంలేకపోతే ఎవరైనా తమకు చెందిన విలువైన వస్తువులను కాపాడమని, ఉపయోగించమని వారికి చెబుతారా?

10 పునరుత్థానం చేయబడిన యేసు పరలోకానికి ఆరోహణమయ్యే కొద్దికాలం ముందు నమ్మకమైన తన శిష్యులకు కనిపించి వారికి ఇలా వాగ్దానం చేశాడు: “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నాను.” (మత్త. 28:20) యేసు తన మాటను నిలుపుకున్నాడా? 15 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70,000 సంఘాలు ఉండేవి. ఇప్పుడు అవి 1,00,000కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే మనం 40కన్నా ఎక్కువ శాతం అభివృద్ధిని చూశాం. కొత్తగా బాప్తిస్మం తీసుకున్న వారి విషయమేమిటి? గత 15 సంవత్సరాల్లో దాదాపు 45,00,000 మంది బాప్తిస్మం తీసుకున్నారు. అంటే ప్రతీరోజు 800 కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. సంఘ కూటాల్లో క్రీస్తు తన అభిషిక్త అనుచరులను నిర్దేశిస్తూ శిష్యులను చేసే పనిలో ఆయన వారికి మద్దతు ఇస్తున్నాడనడానికి ఈ అద్భుతమైన అభివృద్ధే స్పష్టమైన రుజువు.

ఈ సేవకుడు నమ్మకమైనవాడు, బుద్ధిమంతుడు

11 యెహోవా దేవుడు, యేసుక్రీస్తులు నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుణ్ణి పూర్తిగా నమ్ముతున్నారు కాబట్టి మనమూ ఆ దాసుణ్ణి పూర్తిగా నమ్మవద్దా? దాసుని తరగతి తమకు ఇవ్వబడిన పనిని నమ్మకంగా నిర్వర్తించింది. ఉదాహరణకు, కావలికోట పత్రిక దాదాపు గత 130 సంవత్సరాలుగా ప్రచురించబడుతూనే ఉంది. యెహోవాసాక్షుల కూటాలు, సమావేశాలు మన విశ్వాసాన్ని బలపరుస్తూనే ఉన్నాయి.

12 నమ్మకమైన దాసుడు బుద్ధిమంతుడు కూడ. ఎందుకంటే, ఆ దాసుడు గర్వంతో ప్రవర్తించకుండా, యెహోవా నుండి స్పష్టమైన నిర్దేశం వచ్చేంతవరకు వేచివుంటాడు. అదే సమయంలో ఆయన నిర్దేశానికి లోబడివుంటాడు. ఉదాహరణకు, ఒక ప్రక్క అబద్ధ మతనాయకులు ఈ లోక ప్రజల స్వార్థపూరిత, భక్తిహీన ప్రవర్తనను మౌనంగా లేదా బాహాటంగా ఆమోదిస్తుంటే, మరో ప్రక్క దాసుడు మాత్రం సాతాను దుష్టవిధానంలోని ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నాడు. యెహోవా దేవుడు, యేసుక్రీస్తులు దాసుణ్ణి ఆశీర్వదిస్తున్నారు కాబట్టే అతడు సమయోచితమైన, జ్ఞానయుక్తమైన హెచ్చరికలను ఇవ్వగలుగుతున్నాడు. అందుకే, దాసుని తరగతిని మనం పూర్తిగా నమ్మవచ్చు. అయితే, నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుణ్ణి మనం నమ్ముతున్నామని ఎలా చూపించవచ్చు?

అభిషిక్తులు గొర్రెపిల్లను వెంబడిస్తుండగా వారితో ‘కూడా వెళ్లండి’

13 “పదేసిమంది” ‘ఒక యూదుని’ దగ్గరికి వెళ్లి, “మేము మీతోకూడ వత్తుము” అని అంటారని జెకర్యా పుస్తకం చెబుతోంది. (జెక. 8:23) వారు ఆ ‘యూదుణ్ణి’ ఆ తర్వాత “మీతో” అని సంభోదించారు కాబట్టి, ఆయన కొంతమంది ప్రజలను సూచిస్తున్నాడు. మన కాలంలో ఆయన “దేవుని ఇశ్రాయేలు”లో భాగమైన ఆత్మాభిషిక్త క్రైస్తవుల శేషాన్ని సూచిస్తున్నాడు. (గల. 6:16) “అన్యజనులలో పదేసిమంది,” వేరేగొర్రెలకు చెందిన గొప్పసమూహాన్ని సూచిస్తున్నారు. యేసు ఎక్కడికి వెళ్తే అక్కడికి అభిషిక్త క్రైస్తవులు ఆయనను వెంబడించినట్లే, గొప్పసమూహపువారు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని వెంబడి ‘వెళ్తారు’ లేదా వారిని అనుసరిస్తారు. ‘పరలోకసంబంధమైన పిలుపులో పాలుపొందినవారి’ సహచరులమని చెప్పుకునేందుకు గొప్పసమూహపువారు ఎన్నడూ సిగ్గుపడకూడదు. (హెబ్రీ. 3:⁠1) అభిషిక్త క్రైస్తవులను “సహోదరులు” అని పిలవడానికి యేసు సిగ్గుపడలేదు.​—⁠హెబ్రీ. 2:⁠11.

14 తన సహోదరులకు మద్దతునిస్తే తనకు మద్దతునిస్తున్నట్లు యేసుక్రీస్తు భావిస్తాడు. (మత్తయి 25:40 చదవండి.) అలాగైతే, భూనిరీక్షణగలవారు ఆయన ఆత్మాభిషిక్త క్రైస్తవులకు ఏ విధంగా మద్దతునివ్వవచ్చు? ముఖ్యంగా, రాజ్య ప్రకటనా పనిలో వారికి సహాయం చేయడం ద్వారా అలా చేయవచ్చు. (మత్త. 24:14; యోహా. 14:12) గత కొన్ని దశాబ్దాలుగా భూమ్మీద అభిషిక్త క్రైస్తవుల సంఖ్య తగ్గుతుంటే వేరేగొర్రెల సంఖ్య పెరుగుతోంది. భూనిరీక్షణగలవారు సాక్ష్యపుపనిలో పాల్గొంటూ, వీలైతే పూర్తికాల సువార్తికులుగా సేవచేస్తారు. అలా శిష్యులను చేయమని ఇవ్వబడిన ఆజ్ఞను పాటించడంలో ఆత్మాభిషిక్త క్రైస్తవులకు సహాయం చేస్తున్నారు. (మత్త. 28:​19, 20) అనేక విధాలుగా ఆర్థిక విరాళాలు ఇవ్వడం ద్వారా కూడ వారు ఈ పనికి మద్దతునిస్తున్నారు.

15 బైబిలు సాహిత్యాల ద్వారా క్రైస్తవ కూటాలు, సమావేశాల ద్వారా నమ్మకమైన దాసుడు ఇచ్చే సమయోచితమైన ఆధ్యాత్మిక ఆహారం విషయంలో క్రైస్తవులముగా మనలో ప్రతీ ఒక్కరికీ ఎలాంటి అభిప్రాయముంది? మనం కృతజ్ఞతతో దానిని ఆరగించి నేర్చుకున్నవాటిని అన్వయించుకునేందుకు సిద్ధంగా ఉన్నామా? దాసుని తరగతి సంస్థాగత మార్పులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మనం ఎలా స్పందిస్తాం? దాసుని తరగతి నిర్దేశానికి మనం ఇష్టపూర్వకంగా లోబడడం ద్వారా యెహోవా ఏర్పాటు పట్ల మనకు విశ్వాసముందని చూపిస్తాం.​—⁠యాకో. 3:⁠17.

16 “నా గొఱ్ఱెలు నా స్వరము వినును, నేను వాటి నెరుగుదును, అవి నన్ను వెంబడించును” అని యేసు చెప్పాడు. (యోహా. 10:27) అభిషిక్త క్రైస్తవుల విషయంలో ఇది నిజం. అయితే, వారి వెంబడి ‘వెళ్లే’ వారి విషయమేమిటి? వారు యేసు చెప్పేది వినాలి. ఆయన సహోదరులు చెప్పేది కూడ వినాలి. ఎందుకంటే, దేవుని ప్రజల ఆధ్యాత్మిక బాగోగులను చూసుకునే ప్రాముఖ్యమైన బాధ్యత అభిషిక్త క్రైస్తవులకు అప్పగించబడింది. క్రీస్తు సహోదరులు చెప్పేది వినాలంటే ఏమి చేయాలి?

17 నేడు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసునికి పరిపాలక సభ ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆ పరిపాలక సభ భూవ్యాప్తంగా రాజ్యప్రకటనా పనికి నాయకత్వం వహిస్తూ, దాన్ని వ్యవస్థీకరిస్తోంది. ఈ పరిపాలక సభలో అనుభవజ్ఞులైన, ఆత్మాభిషిక్త పెద్దలు ఉన్నారు. ప్రత్యేకంగా వారిని మనపై ఉన్న ‘నాయకులు’ అని పిలవవచ్చు. (హెబ్రీ. 13:⁠7) ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1,00,000 కన్నా ఎక్కువ సంఘాల్లోని దాదాపు 70,00,000 మంది రాజ్య ప్రచారకుల ఆధ్యాత్మిక బాగోగులను చూసుకునే బాధ్యత ఈ అభిషిక్త పైవిచారణకర్తలకు ఉంది కాబట్టి, వారు ‘ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై ఉంటారు’ అంటే ఆయన సేవలో ఎంతో చేయాల్సి ఉంటుంది. (1 కొరిం. 15:58) మనం దాసుని తరగతి చెప్పేది వినాలంటే దానికి ప్రాతినిధ్యం వహించే పరిపాలక సభకు పూర్తి సహకారాన్ని ఇవ్వాలి.

దాసుడు చెప్పేది వినేవారు ఆశీర్వదించబడతారు

18 నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి నియమించబడినప్పటి నుండి అది ‘నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు అనేకులను త్రిప్పుతూ’ వచ్చింది. (దాని. 12:⁠3) వారిలో ఈ దుష్ట విధాన నాశనాన్ని తప్పించుకునే అవకాశమున్నవారు ఉన్నారు. దేవుని ముందు నీతిమంతులుగా ఉండడం ఎంత గొప్ప ఆశీర్వాదం!

19 భవిష్యత్తులో, ‘[1,44,000 మందితో కూడిన] నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధపట్టణము తన భర్తకొరకు అలంకరింపబడిన పెండ్లికుమార్తెవలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగి’ వచ్చినప్పుడు, దాసుడు చెప్పినవాటిని విన్నవారు ఎలాంటి ఆశీర్వాదాలను అనుభవిస్తారు? “ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను” అని బైబిలు చెబుతోంది. (ప్రక. 21:​2-4) కాబట్టి, క్రీస్తు స్వరాన్ని వినడానికి, ఆయన నమ్మకమైన ఆత్మాభిషిక్త సహోదరులు చెప్పేవాటిని వినడానికి మనకు ఎన్నో కారణాలున్నాయి.

మీరేమి నేర్చుకున్నారు?

• యెహోవా నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి నమ్ముతున్నాడని ఏవి రుజువు చేస్తున్నాయి?

• దాసుని తరగతిని యేసుక్రీస్తు పూర్తిగా నమ్ముతున్నాడని ఏది చూపిస్తోంది?

• మనం నమ్మకమైన గృహనిర్వాహకునిపై ఎందుకు నమ్మకముంచాలి?

• మనం దాసుణ్ణి నమ్ముతున్నామని ఎలా చూపించవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

1. యేసును అనుసరించే విషయంలో ఆయన నిజమైన శిష్యులకు ఏమి అనిపించింది?

2. (ఎ) “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” లేదా ‘నమ్మకమైన గృహనిర్వాహకుడు’ ఎవరు? (బి) ‘గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్ల ఆయనను వెంబడిస్తుందనే’ మంచి పేరు దాసుడు ఎలా సంపాదించుకున్నాడు?

3. మనం దాసుని తరగతిమీద నమ్మకముంచడం ఎందుకు ప్రాముఖ్యం?

4. నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు అందించే ఆధ్యాత్మిక ఆహారం విషయంలో మనం ఎందుకు నమ్మకముంచవచ్చు?

5. దేవుని పరిశుద్ధాత్మ దాసుని తరగతికి శక్తిని అనుగ్రహిస్తుందని ఏది రుజువుచేస్తోంది?

6, 7. యెహోవా నమ్మకమైన దాసుణ్ణి ఎంతగా నమ్ముతున్నాడు?

8. యేసు తన ఆత్మాభిషిక్త అనుచరులమీద నమ్మకముందని ఎలా చూపించాడు?

9. క్రీస్తు ‘యావదాస్తిలో’ ఏమేమి ఉన్నాయి?

10. యేసుక్రీస్తు తన అభిషిక్త అనుచరులతో ఉన్నాడని ఏది రుజువుచేస్తోంది?

11, 12. దాసుడు నమ్మకమైనవాడని, బుద్ధిమంతుడని ఎలా నిరూపించుకున్నాడు?

13. జెకర్యా ప్రవచనం ప్రకారం, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని పట్ల మనకున్న నమ్మకాన్ని ఎలా చూపించవచ్చు?

14. క్రీస్తు సహోదరులకు నమ్మకంగా ఎలా మద్దతునివ్వవచ్చు?

15. దాసుని తరగతి ఇచ్చే సమయోచితమైన ఆధ్యాత్మిక ఆహారం విషయంలో, సంస్థాగత మార్పులకు సంబంధించి తీసుకునే నిర్ణయాల విషయంలో ప్రతీ క్రైస్తవుడు ఎలా స్పందించాలి?

16. క్రైస్తవులందరూ క్రీస్తు సహోదరులు చెప్పేది ఎందుకు వినాలి?

17. దాసుని తరగతి చెప్పేది వినాలంటే ఏమి చేయాలి?

18, 19. (ఎ) నమ్మకమైనవాడును, బుద్ధిమంతుడునైన దాసుడు చెప్పేది వినేవారు ఎలా ఆశీర్వదించబడతారు? (బి) మనం ఏ కృతనిశ్చయంతో ఉండాలి?

[25వ పేజీలోని చిత్రం]

తన కుమారుని పెండ్లి కుమార్తెగా ఉండేందుకు యెహోవా ఎవరిని ఎంపికచేశాడో మీకు తెలుసా?

[26వ పేజీలోని చిత్రాలు]

యేసుక్రీస్తు తన ‘ఆస్తుల’ మీద నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి నియమించాడు

[27వ పేజీలోని చిత్రం]

మనం సాక్ష్యపు పనిలో భాగం వహించడం ద్వారా ఆత్మాభిషిక్త క్రైస్తవులకు మద్దతునిస్తాం