కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మనుషులకు కాక దేవునికి భయపడడానికి అయిదు కారణాలు

మనుషులకు కాక దేవునికి భయపడడానికి అయిదు కారణాలు

మనుషులకు కాక దేవునికి భయపడడానికి అయిదు కారణాలు

ఆ యువకుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆయన ఊహించనిది జరిగింది. ఇద్దరు యెహోవాసాక్షులతో మాట్లాడినప్పుడు ఆయనకు కొత్త విషయాలు తెలిశాయి. దేవుడు బాధలను ఎందుకు అనుమతిస్తున్నాడనే విషయాన్ని తెలుసుకోవాలని ఆయన ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాడు, ఇప్పుడు ఆయన ప్రశ్నకు బైబిల్లో స్పష్టమైన జవాబు దొరికింది. బైబిల్లో ఇంత విలువైన, ఇంత సంతోషాన్ని కల్గించే సమాచారం ఉందని ఆయనకు అప్పటివరకు తెలీదు.

వచ్చినవాళ్లు వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఇంటి ఓనరు కోపంగా ఆయన రూమ్‌లోకి దూసుకొచ్చి, “వాళ్లెవరు?” అని అడిగింది.

దానికి ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఏమీ మాట్లాడలేకపోయాడు.

“వాళ్లెవరో నాకు తెలుసు, ఇంకోసారి వాళ్లను రానిచ్చావంటే నువ్వు ఇంకో ఇల్లు వెతుక్కోవాల్సివుంటుంది” అంటూ మండిపడింది.

ఆమె తలుపు ధడాల్న వేసుకుంటూ వెళ్లిపోయింది.

వ్యతిరేకత వస్తుందని క్రీస్తు నిజ అనుచరులకు తెలుసు

ఆ యువకుడికి జరిగింది అసాధారణ విషయమేమీ కాదు. దేవుని వాక్యమైన బైబిలు ఇలా చెప్తోంది: ‘క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రతకాలని ఉద్దేశించే వాళ్లంతా హింస పొందుతారు.’ (2 తిమోతి 3:12) నిజ క్రైస్తవులకు ఎన్నడూ ప్రజాదరణ లభించలేదు. ఎందుకు? అపొస్తలుడైన యోహాను తన తోటి క్రైస్తవులతో ఇలా అన్నాడు: ‘మనం దేవుని సంబంధులమనీ లోకమంతా దుష్టునియందున్నదనీ ఎరుగుదుము.’ అంతేకాదు, అపవాదియైన సాతాను ‘ఎవరిని మ్రింగాలా అని వెతుకుతూ తిరుగుతున్న గర్జించే సింహం’ అని కూడా వర్ణించబడ్డాడు. (1 యోహాను 5:19; 1 పేతురు 5:8) సాతాను ఎంతో నైపుణ్యంగా ఉపయోగించే ఆయుధాల్లో ఒకటి, మనుషులకు భయపడడం.

ఎన్నో మంచి పనులు చేసిన, ఏ పాపం చేయని యేసుక్రీస్తును కూడా ప్రజలు ఎగతాళి చేశారు, హింసించారు. “వాళ్లు నిష్కారణంగా నన్ను ద్వేషించారు” అని ఆయన అన్నాడు. (యోహాను 15:25, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఆయన చనిపోవడానికి ముందు రాత్రి, ఈ మాటలతో తన శిష్యులను సిద్ధం చేశాడు: “ప్రపంచం మిమ్మల్ని ద్వేషిస్తే, ఆ ప్రపంచం మీకన్నా ముందు నన్ను ద్వేషించిందన్న విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ‘యజమాని కంటే సేవకుడు గొప్ప కాదు’ అని నేను చెప్పిన మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. వాళ్లు నన్నే హింసించారు. కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు.”—యోహాను 15:18, 20, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ఈ హెచ్చరికకు భయపడి చాలామంది సత్యారాధకులు అయ్యేందుకు వెనుకాడారు. ఒక సందర్భంలో యేసు కోసం వెతుకుతున్న వాళ్ల గురించి బైబిలు ఇలా చెప్తోంది: ‘యూదులకు భయపడి ఆయన గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు.’ (యోహాను 7:13; 12:42) ఆ కాలంలోని మతనాయకులు, క్రీస్తుపై విశ్వాసముంచితే సమాజమందిరం నుండి వెలివేస్తామని ప్రజలను బెదిరించారు. అందుకే, మనుషులకు భయపడి చాలామంది క్రైస్తవులుగా మారలేదు.—అపొస్తలుల కార్యములు 5:13.

ఆ తర్వాత, నిజక్రైస్తవ సంఘం స్థాపించబడ్డాక యెరూషలేములోవున్న సంఘంపైకి “గొప్ప హింస” వచ్చిందని బైబిలు చెప్తోంది. (అపొస్తలుల కార్యములు 8:1) నిజానికి, రోమా సామ్రజ్యమంతటా నిజ క్రైస్తవులు హింసను ఎదుర్కొన్నారు. “అన్ని ప్రాంతాల వాళ్లు ఈ మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు” అని రోమాలోని ప్రధానాధికారులు అపొస్తలుడైన పౌలుతో అన్నారు. (అపొస్తలుల కార్యములు 28:22, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అవును, నిజ క్రైస్తవులు అంతటా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.

నేడు కూడా చాలామంది క్రీస్తు నిజ అనుచరులుగా మారకుండా చేయడానికి సాతాను మనుషుల భయాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాడు. యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేస్తున్న నిజాయితీగల ప్రజలు తోటి విద్యార్థుల నుండి, తోటి ఉద్యోగస్థుల నుండి, ఇరుగుపొరుగువాళ్ల నుండి, స్నేహితుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. సమాజంలో తమకు గౌరవం ఉండదని, స్నేహితులను కోల్పాతామని, అవసరాల్లో ఇతరులు తమకు సహాయం చేయరేమోనని వాళ్లు భయపడవచ్చు. కొన్ని గ్రామాల్లోనైతే పంట కోయడానికి, పశువులను కాపాడడానికి పొరుగువాళ్ళు సహాయం చేయరేమోనని రైతులు భయపడతారు. అయితే, అలాంటి భయాలు ఎన్నో ఉన్నా లక్షలాదిమంది యేసుక్రీస్తును అనుకరిస్తూ దేవునిపై నమ్మకముంచాలని, ఆయన వాక్యాన్ని పాటించాలని నిర్ణయించుకున్నారు. అలా చేసినందుకు యెహోవా వాళ్లను ఆశీర్వదించాడు.

మనుషులకు కాక దేవునికి ఎందుకు భయపడాలి?

మనుషులకు కాదుగానీ దేవునికి భయపడాలని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది. అది ఇలా చెప్తోంది: “యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము.” (కీర్తన 111:10) ఇది, దేవుడు మనల్ని ఏదో చేస్తాడనే భయం కాదుగానీ మన ప్రాణదాతకు ఇష్టంలేనివి చేయకూడదనే సరైన భయం. దేవునిపట్ల ‘భయం’ ప్రేమతో ముడిపడివుంది. అయితే, మనం మనుషులకు కాక దేవునికి ఎందుకు భయపడాలి? దీనికి, ఐదు కారణాలను పరిశీలిద్దాం.

యెహోవాయే సర్వశక్తిమంతుడు. యెహోవా ఏ మానవునికన్నా కూడా అత్యంత శక్తిగలవాడు. మనం దేవునిపట్ల సరైన భయం కల్గివుంటే సర్వశక్తిగల దేవునివైపు ఉంటాం, ఆయన దృష్టిలో ‘జనములు చేదనుండి జారు బిందువుల్లాంటివారు.’ (యెషయా 40:15) దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి తనపట్ల యథార్థంగావున్న ప్రజలకు ‘విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధాన్నైనా’ నాశనంచేసే సామర్థ్యం ఆయనకుంది. (యెషయా 54:17) నిత్యజీవం పొందడానికి ఎవరు అర్హులో దేవుడే నిర్ణయిస్తాడు కాబట్టి ఆయన గురించి, ఆయన చిత్తం చేయడం గురించి తెలుసుకోకుండా ఆపడానికి దేన్నీ మనం అనుమతించకపోవడం జ్ఞానయుక్తం.—ప్రకటన 14:6, 7

దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని కాపాడతాడు. “మనుషులకు భయపడడం మూలంగా మనుషులు ఉరిలో చిక్కుకుంటారు. యెహోవామీద నమ్మకం ఉంచేవారికి సంరక్షణ ఉంటుంది” అని బైబిల్లోని సామెతలు 29:25 (పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) చెప్తోంది. మనుషులకు భయపడడం ఒక ఉరిలాంటిది. అది, దేవునిపై మనకున్న విశ్వాసాన్ని బాహాటంగా చూపించకుండా చేస్తుంది. మనల్ని రక్షించే సామర్థ్యం తనకుందని చెప్తూ దేవుడు ఇలా అభయమిస్తున్నాడు: ‘భయపడకు నేను నీ దేవుణ్ణి. దిగులుపడకు నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేసేవాడిని నేనే. నీతి అనే నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుంటాను.’—యెషయా 41:9, 10.

దేవుడు తనకు దగ్గరయ్యేవాళ్లను ప్రేమిస్తాడు. అపొస్తలుడైన పౌలు అభయాన్నిచ్చే ఈ మాటలు రాశాడు: ‘మరణమైనా జీవమైనా దేవదూతలైనా ప్రధానులైనా ఉన్నవైనా రాబోయేవైనా అధికారులైనా ఎత్తయినా లోతైనా సృష్టింపబడిన మరి ఏదైనా, మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాపనేరవని లేదా వేరుచేయలేవని రూఢిగా నమ్ముతున్నాను.’ (రోమీయులు 8:37-39) మనం దేవునిపై నమ్మకముంచి ఆయనకు విధేయత చూపించడం నేర్చుకుంటే, విశ్వసర్వాధిపతియైన దేవుని శాశ్వత ప్రేమను పొందవచ్చు. అదెంత గొప్ప అవకాశం!

దేవుడు మనకోసం చేసినవాటన్నిటిని ఎంతో విలువైనవిగా ఎంచుతాం. యెహోవాయే మన సృష్టికర్త, ఆయనే జీవానికి మూలం. అంతేగాక ఆయన, జీవించివుండడానికి అవసరమైన వాటితోపాటు జీవితాన్ని ఆనందభరితంగా, ఆసక్తికరంగా చేసేవాటిని కూడా మనకిచ్చాడు. నిజానికి, ప్రతీ మంచి బహుమతి ఇచ్చేది ఆయనే. (యాకోబు 1:17) దేవుని కృపను విలువైనదిగా ఎంచిన దావీదు అనే విశ్వాసంగల వ్యక్తి ఇలా రాశాడు: ‘యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మాయెడల నీకున్న తలంపులను వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి.’—కీర్తన 40:5.

మనల్ని వ్యతిరేకించేవాళ్లలో కొంతమంది మారవచ్చు. మీరు రాజీపడకుండా ఉంటూ దేవున్ని ఘనపర్చాలనీ ఆయనను ప్రేమించాలనీ దృఢంగా నిశ్చయించుకోవడం ద్వారా మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్లకు సహాయం చేయవచ్చు. యేసు కుటుంబీకులనే తీసుకోండి. వాళ్ళు మొదట్లో ఆయనపై విశ్వాసం ఉంచలేదుగానీ ‘ఆయనకు మతి చలించింది’ అన్నారు. (మార్కు 3:21; యోహాను 7:5) కొంతకాలానికి యేసు చనిపోయి, తిరిగి లేపబడిన తర్వాత వాళ్లలో చాలామంది విశ్వాసులుగా మారారు. అంతేకాక, యేసు సహోదరులైన యాకోబు, యూదాలు లేఖనాల్లోని కొన్నిభాగాలను రాశారు. నిజక్రైస్తవులను ఎంతో క్రూరంగా హింసించిన సౌలు అనే వ్యక్తి కూడా ఆ తర్వాత అపొస్తలుడైన పౌలుగా మారాడు. కాబట్టి, ఇప్పుడు మనల్ని వ్యతిరేకిస్తున్నవాళ్ళలోని కొంతమంది మనం ధైర్యంగా విశ్వాసాన్ని కాపాడుకోవడం చూసి బైబిల్లోని సత్యాన్ని మనం తెలుసుకున్నామని గ్రహించవచ్చు.—1 తిమోతి 1:12, 13.

ఉదాహరణకు, ఆఫ్రికాలోని ఎబిరాష్‌ అనే ఓ స్త్రీ, దేవుని గురించిన సత్యం తెలుసుకోవాలని ఎంతో ప్రార్థించేది. యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, మతనాయకులు ఆమెను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెతోపాటు బైబిలు అధ్యయనం చేయడం ప్రారంభించిన కొంతమంది బంధువులు మనుషులకు భయపడి అధ్యయనం ఆపేశారు. కానీ ఆమె బలంకోసం, ధైర్యంకోసం దేవున్ని వేడుకొని, ఒక యెహోవాసాక్షిగా బాప్తిస్మం తీసుకుంది. దాని ఫలితమేమిటి? బైబిలు అధ్యయనం ఆపేసిన ఆమె బంధువుల్లో ఎనిమిదిమంది ధైర్యం తెచ్చుకొని అధ్యయనం మళ్లీ ప్రారంభించి ఆధ్యాత్మికంగా మంచి ప్రగతి సాధిస్తున్నారు.

మీరు మనుషులకు భయపడకుండా ఉండొచ్చు

మనుషులకు భయపడకుండా ఉండాలంటే దేవునిపట్ల మీకున్న ప్రేమను బలపర్చుకునేందుకు మీరు చేయగల్గినదంతా చేయండి. బైబిలు అధ్యయనం చేయడం ద్వారా, “ప్రభువు [యెహోవా] నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు?” అని చెప్తున్న హెబ్రీయులు 13:6 వంటి లేఖనాలను ధ్యానించడం ద్వారా అలా బలపర్చుకోవచ్చు. మనుషులకు కాక దేవునికి భయపడడం సరైనది, జ్ఞానయుక్తమైనది అనడానికిగల కారణాలను మర్చిపోకండి.

బైబిలు నుండి నేర్చుకున్నవి పాటించడంవల్ల వచ్చే అనేక ఆశీర్వాదాలను కూడా మనసులో ఉంచుకోండి. జీవితానికి సంబంధించిన ప్రాముఖ్యమైన ప్రశ్నలకు మీరు సంతృప్తికరమైన జవాబులు తెలుసుకోవచ్చు. జీవితంలో మీకు వచ్చే కష్టాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. ఆందోళన కల్గించే నేటి పరిస్థితుల్లో కూడా మీరు భవిష్యత్తుమీద మంచి ఆశతో జీవించవచ్చు. మీరు ఏ సమయంలోనైనా సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థించవచ్చు.

అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: ‘లోకము, దాని ఆశ గతించిపోతున్నాయి గాని, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు.’ (1 యోహాను 2:17) స్థిరంగా ఉంటూ దేవునిపట్ల భయంతో జీవించాల్సిన సమయం ఇదే. మనుషులకు భయపడి మీ విశ్వాసాన్ని వదులుకునే బదులు, దేవుడు చెప్తున్న దీన్ని చేయడానికి కృషి చేయవచ్చు: ‘నా కుమారుడా, జ్ఞానం సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. అప్పుడు నన్ను నిందించేవానితో నేను ధైర్యంగా మాట్లాడతాను.’ (సామెతలు 27:11) అదెంత గొప్ప అవకాశం!

‘వినయానికి, యెహోవామీది భయభక్తులకు ప్రతిఫలంగా ఐశ్వర్యం, గౌరవం, జీవం చేకూరతాయి.’ కాబట్టి, దేవుడు తనకు భయపడేవారికి ఇచ్చేదాన్ని ఏ మానవుడూ ఇవ్వలేడని గుర్తుంచుకోండి.—సామెతలు 22:4, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం. (w09 3/1)

[30వ పేజీలోని చిత్రం]

ఎబిరాష్‌ చూపించిన ధైర్యంవల్ల ఆమె బంధువుల్లో ఎనిమిదిమంది మళ్లీ బైబిలు అధ్యయనం ప్రారంభించారు