కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నీతిమంతులు దేవుణ్ణి నిత్యం స్తుతిస్తారు

నీతిమంతులు దేవుణ్ణి నిత్యం స్తుతిస్తారు

నీతిమంతులు దేవుణ్ణి నిత్యం స్తుతిస్తారు

“నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. . . . వాని నీతి నిత్యము నిలుచును.”​—⁠కీర్త. 112:​6, 9.

దేవుడు నీతిమంతులుగా పరిగణించే మానవులంతా ఎంత అద్భుతమైన భవిష్యత్తును అనుభవించనున్నారు! యెహోవాకున్న చక్కని లక్షణాల గురించి మరింత ఎక్కువ తెలుసుకునే అవకాశాన్ని వారు నిత్యం ఆస్వాదిస్తారు. దేవుని కార్యాల గురించి తెలుసుకునేకొద్దీ వారి హృదయాలు స్తుతితో ఉప్పొంగుతాయి. అలాంటి అద్భుతమైన భవిష్యత్తును అనుభవించాలంటే ‘నీతిని’ కనబరచడం చాలా అవసరం. ఆ లక్షణం గురించే 112వ కీర్తనలో నొక్కిచెప్పబడింది. అయితే, పరిశుద్ధుడూ నీతిమంతుడూ అయిన యెహోవా దేవుడు పాపులైన మానవులను నీతిమంతులుగా ఎలా ఎంచగలడు? సరైనది చేయడానికి ఎంత ప్రయత్నించినా మనం పొరపాట్లు చేస్తుంటాం. కొన్నిసార్లు గంభీరమైన తప్పులు కూడా చేస్తాం.​—⁠రోమా. 3:23; యాకో. 3:⁠2.

2 అందుకే యెహోవా ప్రేమతో ఒక పరిపూర్ణ పరిష్కారాన్ని ఇచ్చాడు. ఎలా? మొదటిగా, దేవుడు పరిపూర్ణ మానవునిగా జన్మించేలా పరలోకంలోవున్న తన ప్రియ కుమారుడి జీవాన్ని అద్భుతరీతిలో ఒక కన్యక గర్భంలోకి మార్చాడు. (లూకా 1:​30-35) అంతేకాక, శత్రువుల చేతిలో యేసు మరణించిన తర్వాత యెహోవా మరో గొప్ప అద్భుతం చేశాడు. దేవుడు యేసును మహిమగల ఆత్మ ప్రాణిగా పునరుత్థానం చేశాడు.​—⁠1 పేతు. 3:⁠18.

3 మానవునిగా రాకముందు యేసుకు లేనిదాన్ని అంటే ఎన్నడూ నాశనంకాని జీవాన్ని యెహోవా ఆయనకు ఇచ్చాడు. (హెబ్రీ. 7:​15-17, 27, 28) తీవ్రమైన పరీక్షలు ఎదురైనా యేసు పరిపూర్ణ యథార్థతను చూపించాడు కాబట్టి యెహోవా దాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అలా యథార్థతను చూపించడం ద్వారా, మానవులు ప్రగాఢమైన ప్రేమతో కాదుగానీ స్వార్థంతోనే దేవుణ్ణి సేవిస్తారనే సాతాను అబద్ధానికి ఒక ఉత్తమమైన, సంపూర్ణమైన జవాబు చెప్పే అవకాశం యేసు తన తండ్రికి ఇచ్చాడు.​—⁠సామె. 27:⁠11.

4 పరలోకంలో యేసు ఇంకా ఎన్నో కార్యాలు చేశాడు. ‘తన స్వరక్తపు’ విలువను తీసుకొని ఆయన ‘దేవుని సముఖములోకి ప్రవేశించాడు.’ ‘మన పాపపరిహారార్థ బలిగా’ యేసు అర్పించిన అమూల్యమైన అర్పణను మన ప్రేమగల పరలోకపు తండ్రి దయతో స్వీకరించాడు. అందుకే మనం ‘శుద్ధిచేయబడిన మనస్సాక్షితో జీవముగల దేవునికి పరిశుద్ధ సేవను’ చేయగలుగుతున్నాం. “యెహోవాను స్తుతించుడి” అని 112వ కీర్తనలోవున్న ప్రారంభపు మాటలతో ఏకీభవించడానికి మనకు ఎంత మంచి కారణం ఉంది!​—⁠హెబ్రీ. 9:​12-14, 24; 1 యోహా. 2:​2, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

5 దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాలంటే యేసు చిందించిన రక్తంపై ఎల్లప్పుడూ విశ్వాసముంచాలి. మనల్ని అంతగా ప్రేమించినందుకు యెహోవాకు మనం ప్రతీరోజు కృతజ్ఞతలు తెలియజేయాలి. (యోహా. 3:16) అంతేకాక, మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ నేర్చుకున్నదానికి అనుగుణంగా జీవించడానికి శాయశక్తులా కృషిచేయాలి. దేవుని ఎదుట నిర్మలమైన మనస్సాక్షితో ఉండాలనుకునే వారందరికి కావాల్సిన చక్కని ఉపదేశం 112వ కీర్తనలో ఉంది. ఈ కీర్తనలోని మాటలకు 111వ కీర్తనలోని మాటలతో సంబంధం ఉంది. ఈ రెండు కీర్తనలు “యెహోవాను స్తుతించుడి” లేక “అల్లెలూయా” అన్న మాటలతో ప్రారంభమౌతాయి. హెబ్రీ మూలభాషలో, ఈ మాట తర్వాత 22 వాక్యాలున్నాయి. వాటిలో ప్రతీ వాక్యం హెబ్రీ అక్షరమాలలోని 22 అక్షరాల్లో ఒకదానితో ప్రారంభమౌతుంది. *

సంతోషంగా ఉండడానికిగల కారణం

6“యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు.” (కీర్త. 112:​1, 2) ఇక్కడ కీర్తనకర్త “భయభక్తులుగలవాడు” అని ఒక వ్యక్తి గురించి చెబుతూ ఆ తర్వాత రెండవ వచనం చివర్లో “యథార్థవంతులు” అనే బహువచనాన్ని ఉపయోగించాడన్నది గమనించండి. కాబట్టి 112వ కీర్తన అనేకమందివున్న ఒక గుంపును సూచిస్తుంది. ఆసక్తికరంగా అపొస్తలుడైన పౌలు దైవ ప్రేరణతో కీర్తన 112:9లోని మాటలను మొదటి శతాబ్దంలోని క్రైస్తవులకు అన్వయించాడు. (2 కొరింథీయులు 9:​8, 9 చదవండి.) నేడు భూమ్మీదున్న క్రీస్తు అనుచరులు ఎలా సంతోషంగా ఉండగలరో ఈ కీర్తన ఎంత చక్కగా వివరిస్తోంది!

7కీర్తన 112:1లో చెప్పబడినట్లుగా, “యెహోవాయందు భయభక్తులు” కనబరిచే నిజ క్రైస్తవులు ఎంతో సంతోషిస్తారు. దేవునికి ఇష్టంలేనివి ఎక్కడచేస్తామోనన్న భయం వారికుంటుంది కాబట్టి వారు సాతాను అధీనంలోవున్న లౌకికాత్మను ఎదిరిస్తారు. అంతేకాక, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఆయన ఆజ్ఞలకు లోబడడంలో వారు ‘అధిక ఆనందం’ పొందుతారు. భూవ్యాప్తంగా రాజ్యసువార్త ప్రకటించాలనే ఆజ్ఞకు కూడ వారు లోబడతారు. రాబోయే దేవుని తీర్పు దినం గురించి దుష్టులను హెచ్చరిస్తూ అన్ని దేశాల ప్రజలను శిష్యులనుగా చేసేందుకు వారు కృషి చేస్తారు.​—⁠యెహె. 3:​17, 18; మత్త. 28:​19, 20.

8 దేవుని సేవకులు ఆ ఆజ్ఞలకు లోబడుతున్నారు కాబట్టే, నేడు ప్రపంచవ్యాప్తంగా వారు దాదాపు డెబ్భై లక్షలమంది ఉన్నారు. వారు నేడు ‘భూమ్మీద బలవంతులయ్యారనే’ వాస్తవాన్ని ఎవరు కాదనగలరు? (యోహా. 10:16; ప్రక. 7:​9, 14) దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చినప్పుడు వారు ఇంకా ఎంత గొప్పగా ‘దీవించబడతారు’! ‘నీతి నివసించే’ ఓ “క్రొత్త భూమి” స్థాపించబడేలా భూమ్మీద నిరంతరం జీవించే అవకాశమున్నవారు ఒక గుంపుగా రాబోయే ‘మహాశ్రమల’ నుండి రక్షించబడతారు. కొంతకాలానికి, హార్‌మెగిద్దోనును తప్పించుకునేవారు మరింత ఎక్కువగా ‘దీవించబడతారు.’ పునరుత్థానం చేయబడిన లక్షలాదిమందిని తిరిగి ఆహ్వానించడానికి వారు సిద్ధంగా ఉంటారు. అది ఎంత పులకరింపజేసే అవకాశం! చివరకు, దేవుని ఆజ్ఞలకు లోబడడంలో ‘అధిక ఆనందం పొందేవారు’ పరిపూర్ణతకు చేరుకొని ‘దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును’ నిత్యం అనుభవిస్తారు.​—⁠2 పేతు. 3:13; రోమా. 8:​20, 21.

సంపదలను జ్ఞానయుక్తంగా ఉపయోగిస్తారు

9“కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.” (కీర్త. 112:​3, 4) బైబిలు కాలాల్లో, కొంతమంది దేవుని సేవకులు ధనికులుగా పేరుపొందారు. అయితే, దేవుని ఆమోదమున్న సేవకులు వస్తుపరంగా ధనికులు కాకపోయినా మరో భావంలో నిజంగానే ధనికులౌతారు. వాస్తవానికి యేసు కాలంలో ఉన్నట్లే, ఇప్పుడు కూడ దేవుని ముందు తమనుతాము తగ్గించుకునేవారు పేదవారై ఉండొచ్చు, ఇతరులు వారిని హీనంగా చూస్తుండొచ్చు. (లూకా 4:18; 7:22; యోహా. 7:49) కానీ, ఒక వ్యక్తి వస్తుపరంగా ధనికుడైనా పేదవాడైనా, ఆధ్యాత్మికంగా ధనవంతుడిగా ఉండగలడు.​—⁠మత్త. 6:20; 1 తిమో. 6:​18, 19; యాకోబు 2:5 చదవండి.

10 అభిషిక్త క్రైస్తవులు, వారి సహచరులు తమ ఆధ్యాత్మిక సంపదలను తమ దగ్గరే ఉంచుకోరు. బదులుగా, వారు సాతాను అంధకార లోకంలో ‘యథార్థవంతులకు వెలుగు పుట్టిస్తారు.’ దేవుని అమూల్యమైన జ్ఞానవివేచనల నుండి ఇతరులు ప్రయోజనం పొందేలా సహాయం చేయడం ద్వారా వారు వెలుగును ప్రసరిస్తారు. రాజ్య ప్రకటనా పనిని ఆపేయాలని వ్యతిరేకులు ఎంత ప్రయత్నించినా ప్రకటనా పని మాత్రం ఆగిపోలేదు. అయితే, ఈ నీతియుక్తమైన పనివల్ల వచ్చే ఫలితాలు ‘నిత్యం నిలుస్తాయి.’ దేవుని సేవకులు తమకు పరీక్షలు ఎదురైనా నీతిమంతులుగా ఉంటే, నిరంతరం జీవిస్తారనే అంటే ‘నిత్యం నిలుస్తారనే’ అభయంతో ఉండవచ్చు.

11 దేవుని ప్రజలైన అభిషిక్త క్రైస్తవులూ ‘గొప్పసమూహంలోని’ వారూ ఇతరుల కోసం తమ వస్తుసంపదలను ఉదారంగా ఉపయోగించారు. కీర్తన 112:9 ఇలా చెబుతోంది: “వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును.” నేడు నిజ క్రైస్తవులు తమ తోటి విశ్వాసులకు, కొన్నిసార్లు అవసరంలోవున్న తమ పొరుగువారికి కూడ వస్తుపరమైన సహాయాన్ని చేస్తుంటారు. అంతేకాక, విపత్తులు సంభవించినప్పుడు సహాయక చర్యల్లో చేయూతనిచ్చేందుకు తమ వస్తుసంపదలను వారు ఉపయోగిస్తారు. యేసు చెప్పినట్లుగా అది కూడా వారికి సంతోషాన్నిస్తుంది.​—⁠అపొస్తలుల కార్యములు 20:35; 2 కొరింథీయులు 9:7 చదవండి.

12 అంతేకాక, 172 భాషల్లో ఈ పత్రికను ప్రచురించడానికయ్యే ఖర్చు గురించి ఒక్కసారి ఆలోచించండి. వాటిలో పేదవారు మాట్లాడే భాషలు చాలా ఉన్నాయి. ఇదే పత్రిక బధిరుల కోసం సంజ్ఞా భాషలో, అంధుల కోసం బ్రెయిల్‌ లిపిలో అందుబాటులో ఉందన్న విషయాన్ని కూడా ఆలోచించండి.

దయగలవాడు, న్యాయవంతుడు

13“ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది. (కీర్త. 112:5ఎ, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఇతరులకు సహాయం చేసేవారందరూ దయగలవారు కాదని మీరు గమనించేవుంటారు. ఇతరులకన్నా తమ దగ్గర ఎక్కువ ఉందని చూపించుకోవడానికి కొంతమంది ఇతరులకు ఇస్తుంటారు లేదా ఏదో చేయాలి కదా అన్నట్లు అయిష్టంగా సహాయం చేస్తుంటారు. మనల్ని చిన్నచూపు చూసేవారి నుండి లేదా మనల్ని ఓ పెద్ద సమస్యగా చూసేవారి నుండి సహాయం తీసుకోవడానికి మనం ఇష్టపడం. కానీ, దయగల వారి దగ్గర సహాయాన్ని తీసుకోవడానికి మనం ఇష్టపడతాం. దయతో సంతోషంగా ఇచ్చే విషయంలో యెహోవాయే అత్యుత్తమ మాదిరి. (1 తిమో. 1:​8-11; యాకో. 1:​5, 17) యేసు దయగల తన తండ్రి మాదిరిని పరిపూర్ణంగా అనుకరించాడు. (మార్కు 1:​40-42) కాబట్టి, దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండేందుకు మనం ఇతరులకు సంతోషంగా, ఉదారంగా సహాయం చేస్తాం. ప్రాముఖ్యంగా, పరిచర్యలో యెహోవా గురించి తెలుసుకునేందుకు ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు ఆ లక్షణాలను కనబరుస్తాం.

14“తన కార్యములనెల్ల న్యాయబుద్ధితో నిర్వహించును. (కీర్త. 112:5బి, పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదం) బైబిల్లో ప్రవచించబడినట్లుగానే, యెహోవా న్యాయాన్ని అనుకరిస్తూ నమ్మకమైన గృహనిర్వాహకుడు తన యజమాని ఆస్తులను జాగ్రత్తగా చూసుకుంటాడు. (లూకా 12:​42-44 చదవండి.) కొన్నిసార్లు గంభీరమైన పాపం చేసేవారిని విచారించాల్సివచ్చే పెద్దలకు గృహనిర్వాహకుడు ఇచ్చే లేఖనాధారిత నిర్దేశంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సంఘాలు, మిషనరీ గృహాలు, బెతెల్‌ గృహాలు ఎలా పనిచేయాలనే దాని గురించి ఆ గృహనిర్వాహకుడు ఇచ్చే లేఖనాధారిత నిర్దేశంలో కూడ ఆయన ఎంత న్యాయంగా పనులను చేస్తున్నాడో స్పష్టమౌతుంది. కేవలం సంఘ పెద్దలు మాత్రమే కాదు, క్రైస్తవులందరూ వ్యాపార సంబంధమైన విషయాలతోపాటు తోటివారితో, అవిశ్వాసులతో న్యాయంగా వ్యవహరించాలని యెహోవా కోరుతున్నాడు.​—⁠మీకా 6:​8, 11 చదవండి.

నీతిమంతులు పొందే ఆశీర్వాదాలు

15“అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.” (కీర్త. 112:​6-8) యుద్ధాలు, తీవ్రవాదం, విజృంభిస్తున్న పాత రోగాలతో పాటు కొత్త రోగాలు, నేరం, పేదరికం, నాశనకరమైన కాలుష్యం లాంటి దుర్వార్తలు చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు వింటున్నాం. దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నవారు చెడు పరిణామాలను తప్పించుకోలేరు కానీ, ఆ దుర్వార్తలు వారిని భయభ్రాంతులకు గురిచేయవు. బదులుగా, దేవుని నీతియుక్తమైన నూతనలోకం అతి త్వరలో రానుందని వారికి తెలుసు కాబట్టి వారు భవిష్యత్తు విషయంలో ధైర్యంగా ఉంటారు. అందుకే, వారి హృదయాలు ‘స్థిరంగా’ ఉంటాయి. వారు యెహోవా సహాయాన్ని కోరతారు కాబట్టి, విపత్తులు వచ్చినా వాటిని చక్కగా ఎదుర్కోగలుగుతారు. ఆయన నీతిమంతులను ఎన్నడూ ‘కదలనీయడు,’ అంటే వారికి కావాల్సిన సహాయం చేస్తూ విపత్తులను సహించడానికి శక్తినిస్తాడు.​—⁠ఫిలి. 4:⁠13.

16 నీతిమంతులైన దేవుని సేవకులు వ్యతిరేకుల అబద్ధ ప్రచారాన్ని, ద్వేషాన్ని కూడ సహించాల్సివుంటుంది. అయినా, అవి నిజక్రైస్తవుల ప్రకటనా పనిని గతంలో ఆపలేకపోయాయి, భవిష్యత్తులో కూడా ఆపలేవు. దేవుని సేవకులు దేవుడు తమకు ఇచ్చిన పనిలో అంటే రాజ్యసువార్తను ప్రకటించి, అనుకూలంగా స్పందించేవారిని శిష్యులుగా చేసే పనిలో స్థిరంగా, భయపడకుండా ముందుకు సాగుతున్నారు. అంతం సమీపిస్తుండగా నీతిమంతులు మరింత వ్యతిరేకతను ఎదుర్కొంటారనడంలో సందేహం లేదు. మాగోగువాడైన గోగు పాత్రలో అపవాదియైన సాతాను వారిమీద ప్రపంచవ్యాప్తంగా దాడి చేసినప్పుడు వ్యతిరేకుల ద్వేషం తారాస్థాయికి చేరుకుంటుంది. చివరకు మనం మన ‘శత్రువుల’ ఘోర పరాజయాన్ని కన్నులారా చూస్తాం. అప్పుడు యెహోవా నామం సంపూర్ణంగా పరిశుద్ధపర్చబడడాన్ని చూడడం ఎంత చక్కని అనుభూతి!​—⁠యెహె. 38:​18, 22, 23.

‘ఘనత పొంది హెచ్చింపబడతారు’

17 అపవాది నుండి, అతని లోకం నుండి ఏ వ్యతిరేకత లేకుండా ఐక్యంగా యెహోవాను స్తుతించడం ఎంత సంతోషాన్నిస్తుంది! దేవుని ఎదుట నీతిమంతులుగావుండే వారందరు అలాంటి సంతోషాన్ని నిత్యం అనుభవిస్తూనే ఉంటారు. నీతిమంతుని “కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును” అని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి వారు ఎన్నడూ ఓటమిని రుచి చూడరు. (కీర్త. 112:⁠9) యెహోవా సర్వాధిపత్యానికి వ్యతిరేకంగావున్న వారందరి ఓటమిని చూసి నీతిమంతుడు విజయగానాలు చేస్తాడు.

18“భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.” (కీర్త. 112:10) దేవుని ప్రజల్ని వ్యతిరేకిస్తూ ఉండేవారు తమ సొంత అసూయా ద్వేషాలతో త్వరలోనే ‘క్షీణించి పోతారు.’ మన ప్రకటనా పనిని ఆపుచేయాలనే వారి కోరిక రాబోయే ‘మహాశ్రమల్లో’ వారితోపాటే అంతమైపోతుంది.​—⁠మత్త. 24:⁠21.

19 ఆ గొప్ప విజయాన్ని సంతోషంగా చూసేవారిలో మీరూ ఉంటారా? ఒకవేళ అనారోగ్యంవల్లనో వృద్ధాప్యంవల్లనో సాతాను విధానాంతానికి ముందే మీరు మరణిస్తే, పునరుత్థానము చేయబడే ‘నీతిమంతుల్లో’ మీరూ ఉంటారా? (అపొ. 24:​14, 15) యేసు విమోచన క్రయధనంపై విశ్వాసం ఉంచుతూ, 112వ కీర్తనలో ప్రస్తావించబడిన ‘నీతిమంతునిలా’ యెహోవాను అనుకరిస్తే ఆ ప్రశ్నలకు అవుననే జవాబు చెబుతారు. (ఎఫెసీయులు 5:​1, 2 చదవండి.) యెహోవా నీతిమంతులనూ వారి నీతి క్రియలనూ ఎన్నడూ మరచిపోడు. వారాయన ‘జ్ఞాపకములో ఉంటారు.’ యెహోవా వారిని ప్రేమిస్తూ నిత్యమూ జ్ఞాపకం ఉంచుకుంటాడు.​—⁠కీర్త. 112:​3, 6, 9.

[అధస్సూచి]

^ పేరా 7 అవి కూర్చబడిన విధానాన్నిబట్టి, వాటిలో ఉన్న సమాచారాన్నిబట్టి ఆ రెండు కీర్తనలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉందని తెలుస్తుంది. కీర్తన 111:​3, 4ను 112:​3, 4తో పోల్చిచూస్తే 111వ కీర్తనలో స్తుతించబడిన దేవుని లక్షణాలను 112వ కీర్తనలోని దైవభయంగల ‘వ్యక్తి’ అనుకరించాడని మనం అర్థం చేసుకోవచ్చు.

ధ్యానించాల్సిన ప్రశ్నలు

• మనం ‘అల్లెలూయా’ అని అనడానికున్న కొన్ని కారణాలు ఏమిటి?

• ఆధునిక కాలంలో ఏ అభివృద్ధిని చూసి నిజ క్రైస్తవులు ఎంతో సంతోషిస్తున్నారు?

• ఎలాంటి దాతను యెహోవా ఇష్టపడతాడు?

[అధ్యయన ప్రశ్నలు]

1. (ఎ) దేవుడు నీతిమంతులుగా పరిగణించేవారు ఎలాంటి సంతోషకరమైన భవిష్యత్తు అనుభవించనున్నారు? (బి) అయితే ఏ ప్రశ్న తలెత్తుతుంది?

2. యెహోవా ప్రేమతో ఏ రెండు అద్భుతాలు చేశాడు?

3. తన కుమారునికి పరలోక జీవాన్ని బహుమానంగా ఇచ్చేందుకు దేవుడు ఎందుకు ఇష్టపడ్డాడు?

4. (ఎ) యేసు పరలోకానికి తిరిగి వెళ్లిన తర్వాత మన కోసం ఏమి చేశాడు? అప్పుడు యెహోవా ఏమి చేశాడు? (బి) యెహోవా, యేసు మీకోసం చేసిన దాన్నిబట్టి మీకేమనిపిస్తుంది?

5. (ఎ) దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచాలంటే మనమేమి చేయాలి? (బి) 111వ, 112వ కీర్తనలు ఎలా కూర్చబడ్డాయి?

6. 112వ కీర్తనలో ప్రస్తావించబడిన “భయభక్తులుగలవాడు” ఎలా ఆశీర్వదించబడతాడు?

7. దేవుని సేవకులకు ఎందుకు దైవభయం ఉండాలి? దేవుని ఆజ్ఞల విషయంలో మీకు ఎలాంటి అభిప్రాయం ఉండాలి?

8. (ఎ) నేడు దేవుని సమర్పిత సేవకులు ప్రకటనా పని విషయంలో చూపించిన ఉత్సాహానికి ఎలా ఆశీర్వదించబడ్డారు? (బి) భూమ్మీద నిరంతరం జీవించే అవకాశమున్నవారు భవిష్యత్తులో ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు?

9, 10. నిజ క్రైస్తవులు తమ ఆధ్యాత్మిక సంపదలను ఎలా ఉపయోగించారు? వారి నీతి ఎలా నిత్యం నిలుస్తుంది?

11, 12. దేవుని ప్రజలు తమ వస్తుసంపదలను ఏయే విధాలుగా ఉపయోగిస్తున్నారు?

13. దయతో ఇచ్చే విషయంలో ఎవరెవరు అత్యుత్తమ మాదిరిని ఉంచారు? మనం వారిని ఎలా అనుకరించవచ్చు?

14. ఏయే విధాలుగా ‘మన కార్యాల్లో న్యాయాన్ని’ కనబర్చవచ్చు?

15, 16. (ఎ) ప్రపంచంలోని దుర్వార్తలు విన్నప్పుడు నీతిమంతులు ఎలా స్పందిస్తారు? (బి) దేవుని సేవకులు ఏ పనిలో కొనసాగాలనే కృతనిశ్చయంతో ఉన్నారు?

17. నీతిమంతుడు ఎలా ‘ఘనత పొంది హెచ్చింపబడతాడు’?

18. కీర్తన 112లోని ముగింపు మాటలు ఎలా నెరవేరతాయి?

19. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?

[25వ పేజీలోని చిత్రం]

దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలంటే యేసు చిందించిన రక్తంపై విశ్వాసముంచాలి

[26వ పేజీలోని చిత్రాలు]

ఇష్టపూర్వకంగా ఇవ్వబడే విరాళాలు సహాయక చర్యలకు, బైబిలు సాహిత్యాలను పంచిపెట్టడానికి ఉపయోగపడతాయి