కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ పిల్లలకు నేర్పించండి

యోవాషు చెడు సహవాసంవల్ల యెహోవాను విడిచిపెట్టాడు

యోవాషు చెడు సహవాసంవల్ల యెహోవాను విడిచిపెట్టాడు

దేవుని ఆలయంవున్న యెరూషలేము నగరంలో అప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. ఆ రోజుల్లోనే అహజ్యా రాజు చంపబడ్డాడు. ఆ తర్వాత అహజ్యా తల్లి అయిన అతల్యా చేసిన పనిని మనం అస్సలు ఊహించలేం. అహజ్యా కుమారులను అంటే తన సొంత మనవళ్లను చంపించింది! ఎందుకో తెలుసా?— * ఎందుకంటే, వాళ్లకు బదులు తనే పరిపాలించాలని అలా చేసింది.

అయితే, అతల్యా మనవళ్లలో ఒకరైన యోవాషు కాపాడబడ్డాడు. ఆ విషయం అతల్యాకు తెలీదు. యోవాషు ఎలా కాపాడబడ్డాడో మీకు తెలుసుకోవాలని ఉందా?— ఆయన మేనత్త యెహోషెబ ఆయనను యెహోవా ఆలయంలో దాచిపెట్టింది. ఆమె భర్త యెహోయాదా ప్రధాన యాజకుడు కాబట్టి ఆమె అలా చేయగలిగింది. వాళ్లిద్దరూ కలిసి యోవాషును సురక్షితంగా ఉంచగలిగారు.

ఆరు సంవత్సరాలపాటు యోవాషు ఆలయంలోనే రహస్యంగా ఉంచబడ్డాడు. అక్కడే ఆయనకు యెహోవా గురించి, ఆయన నియమాల గురించి నేర్పించారు. చివరకు, యోవాషుకు ఏడేండ్లు వచ్చినప్పుడు యెహోయాదా ఆయనను రాజును చేశాడు. యెహోయాదా యోవాషును ఎలా రాజును చేశాడో, దుష్టరాణియైన అతల్యాకు అంటే యోవాషు నానమ్మకు ఏమి జరిగిందో తెలుసుకోవాలనుందా?—

ఒకరోజు యెహోయాదా, ఆ కాలంలో యెరూషలేములోని రాజుల దగ్గర ఉండే రాజదేహ సంరక్షకులమీది శతాధిపతులను రహస్యంగా పిలిపించాడు. అహజ్యా రాజు కుమారుడిని తను, తన భార్య ఎలా కాపాడారో వాళ్లకు వివరించాడు. ఆ తర్వాత ఆయన యోవాషును వాళ్లకు చూపించినప్పుడు, రాజయ్యే హక్కు ఆయనకే ఉందని వాళ్లు గ్రహించారు. వాళ్లంతా కలిసి ఒక పథకం వేశారు.

యెహోయాదా యోవాషును బయటికి తీసుకొచ్చి అతన్ని రాజుగా చేశాడు. అప్పుడు, ప్రజలు “చప్పట్లు కొట్టి—రాజు చిరంజీవియగును గాకని చాటించిరి.” యోవాషును కాపాడ్డానికి రాజదేహ సంరక్షకులు అతని చుట్టూ నిలబడ్డారు. అయితే, అతల్యా ఆ సందడిని గమనించి బయటికి వచ్చి, ద్రోహం చేస్తున్నారంటూ గట్టిగా అరిచింది. కానీ, యెహోయాదా ఆజ్ఞ ఇవ్వడంతో, రాజదేహ సంరక్షకులు అతల్యాను చంపేశారు.—2 రాజులు 11:1-16.

యెహోయాదా బ్రతికున్నంతకాలం యోవాషు ఆయన మాట విని సరైనదే చేశాడు. అంతేకాదు, ఆయన తాత యెహోరాము, తండ్రి అహజ్యా పట్టించుకోని దేవాలయాన్ని మరమ్మత్తు చేయడానికి ప్రజలు విరాళాలిచ్చేలా చూశాడు. అయితే, ప్రధాన యాజకుడైన యెహోయాదా చనిపోయిన తర్వాత యోవాషు మంచి పనులు చేయడంలో కొనసాగాడా?— చూద్దాం.—2 రాజులు 12:1-16.

అప్పటికి యోవాషుకు దాదాపు 40 ఏండ్లు. ఆయన యెహోవా సేవకులతో స్నేహం చేయాల్సిందిపోయి అబద్ధ దేవుళ్లను ఆరాధించేవాళ్లతో స్నేహం చేశాడు. ఆ సమయంలో యెహోయాదా కుమారుడైన జెకర్యా యెహోవా యాజకునిగా సేవచేస్తున్నాడు. యోవాషు చేస్తున్న చెడు పనుల గురించి విన్నప్పుడు జెకర్యా ఏమి చేశాడని మీరనుకుంటున్నారు?—

జెకర్యా యోవాషుతో, ప్రజలతో ఇలా అన్నాడు: “మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడు.” ఆ మాటలు యోవాషుకు ఎంతో కోపం తెప్పించాయి. దాంతో ఆయన, జెకర్యాను రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు హంతకుల చేతిలోనుండి కాపాడబడ్డ యోవాషు ఇప్పుడు తనే స్వయంగా జెకర్యాను చంపించాడు!—2 దినవృత్తాంతములు 24:1-3, 15-22.

ఈ వృత్తాంతం నుండి మనం నేర్చుకోగల పాఠాలు ఏమైనా ఉన్నాయా?—ద్వేషానికి, క్రూరత్వానికి పేరుమోసిన అతల్యాలా ఉండాలని మనం ఎప్పుడూ కోరుకోము. బదులుగా, యేసు బోధించినట్లు మనం మన తోటి ఆరాధకులను, ఆఖరికి మన శత్రువులను కూడా ప్రేమించాలి. (మత్తయి 5:44; యోహాను 13:34, 35) యోవాషు మంచి చేయడం మొదలుపెట్టి దాన్ని కొనసాగించలేదు. ఆయనలా కాకుండా, మనం మంచిని చేయడం మొదలుపెడితే దాన్ని కొనసాగించాలి. అంటే మనమెప్పటికీ యెహోవాను ప్రేమించేవారితో, మనల్ని యెహోవా సేవ చేయమని ప్రోత్సహించేవారితో స్నేహం చేయాలి. (w09 4/1)

^ పేరా 3 మీరు చిన్నపిల్లలతో కలిసి చదువుతుంటే, గీత దగ్గర ఆగి అక్కడున్న ప్రశ్నకు జవాబు చెప్పమని అడగండి.