కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడిందా?

మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడిందా?

మా పాఠకుల ప్రశ్న

మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడిందా?

మనం చనిపోయే రోజును విధి నిర్ణయిస్తుందని లేదా మనం చనిపోవాల్సిన సమయాన్ని దేవుడు ముందే నిర్ణయిస్తాడని కొంతమంది అంటారు. అంతేకాదు, జీవితంలో జరిగే కీలకమైన సంఘటనలను మనం నియంత్రించలేమని వాళ్లనుకుంటారు. మీరు కూడా అలాగే అనుకుంటున్నారా?

ఒకసారి ఆలోచించండి: ‘మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడివుంటే, మన జీవితంలో మనం చేసేవాటి ఫలితాన్ని దేవుడు ముందే రాసిపెట్టివుంటే ఇక మనం ప్రార్థించాల్సిన అవసరమేమిటి? మన జీవిత గమ్యం ముందే నిర్ణయించబడివుంటే మనం సురక్షితంగా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవడం దేనికి? వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్‌ పెట్టుకోవడం దేనికి? ఆ మాటకొస్తే, తాగి వాహనం నడపకూడదనే రూలు పాటించడం దేనికి?’

అలాంటి నిర్లక్షమైన ప్రవర్తనను బైబిలు ఏమాత్రం సమర్థించట్లేదు. ప్రతీది ముందుగానే నిర్ణయించబడుతుందని బైబిలు చెప్పట్లేదు కానీ, ఇశ్రాయేలీయులు భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆజ్ఞాపించింది. ఉదాహరణకు, ఇంటి పైకప్పు చుట్టూ పిట్టగోడ కట్టాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించబడింది. ఎవరైనా ఇంటి పైకప్పు మీదినుండి పడి చనిపోకుండా అలా కట్టాలి. ఎవరైనా ఇంటి పైకప్పు మీదినుండి పడి చనిపోవాలని దేవుడు రాసిపెడితే, ఆయన అలాంటి ఆజ్ఞ ఎందుకు ఇస్తాడు?—ద్వితీయోపదేశకాండము 22:8.

ప్రకృతి విపత్తులవల్ల లేదా దుర్ఘటనలవల్ల చనిపోయేవారి విషయమేమిటి? వాళ్లు “ఫలానా రోజు చనిపోవాలని” ముందే నిర్ణయించబడివుందా? లేదు. బైబిలు రాయడానికి దేవుడు ప్రేరేపించిన సొలొమోను రాజు ఇలా రాశాడు: ‘ఇవన్నీ అదృష్టవశముచేత [“అనూహ్యంగా”, NW] కాలవశము చేత అందరికీ కలుగుతున్నాయి’ (ప్రసంగి 9:11) కాబట్టి, ఎంతటి అసాధారణ పరిస్థితులైనా, దుర్ఘటనలైనా అవి ముందుగా నిర్ణయించబడినవి కావు.

అయితే, ఈ విషయం, ‘ప్రతిదానికీ సమయం కలదు. ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు. పుట్టడానికి, చావడానికి సమయం కలదు’ అని అంతకుముందు సొలొమోను చెప్పినదానికి విరుద్ధంగా ఉందని కొంతమంది అనుకుంటారు. (ప్రసంగి 3:1, 2) అయితే, దేవుడే అన్ని నిర్ణయిస్తాడనే ఆలోచనను సొలొమోను సమర్థించాడా? ఆయన చెప్పిన మాటలను నిశితంగా పరిశీలిద్దాం.

చావుపుట్టుకలు ముందే నిర్ణయించబడ్డాయని సొలొమోను చెప్పలేదు. కానీ, మనుషులు పుడతారు, చనిపోతారు, ఇది సాధారణంగా జరిగేదేనని ఆయన చెప్పాడు. మనిషి జీవితంలో ఒడిదుడుకులు సహజం. ‘ఏడ్చుటకు, నవ్వుటకు సమయం కలదు’ అని ఆయన అన్నాడు. ‘ఆకాశం కింద జరిగే ప్రతి ప్రయత్నానికి,’ అంటే తరచూ జరిగే సంఘటనలు, అనుకోకుండా ఎదురయ్యే దుర్ఘటనలు జీవితంలో సహజమేనని సొలొమోను చెప్పాడు. (ప్రసంగి 3:1-8; 9:11, 12) కాబట్టి, సృష్టికర్తను మర్చిపోయేంతగా రోజువారీ పనుల్లో నిమగ్నమైపోకూడదని ఆయన చెప్పాడు.—ప్రసంగి 12:1, 13.

మన సృష్టికర్తకు చావుపుట్టుకలపై అధికారంవున్నా ఆయన మన భవిష్యత్తును ముందే నిర్ణయించడు. బదులుగా, చనిపోకుండా జీవించే అవకాశాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడని బైబిలు బోధిస్తోంది. అయితే, అలాంటి జీవితాన్ని పొందడానికి చేయాల్సినవాటిని మనం చేసితీరాలని దేవుడు ఒత్తిడి చేయడు. కానీ, ‘ఇష్టమున్నవాళ్లు ఉచితంగా లభించే జీవజలాన్ని తాగవచ్చు’ అని ఆయన వాక్యం చెప్తోంది.—ప్రకటన 22:17, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

అవును, ‘జీవజలాన్ని’ తాగాలని మనం కోరుకోవాలి. కాబట్టి, మన భవిష్యత్తు ముందే నిర్ణయించబడలేదని స్పష్టమవుతోంది. మన భవిష్యత్తు మనం తీసుకునే నిర్ణయాలపై, మన దృక్పథాలపై, మనం చేసే పనులపై ఆధారపడివుంటుంది. (w09 4/1)