కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా జ్ఞానం గురించి సృష్టి నుండి తెలుసుకోవచ్చు

యెహోవా జ్ఞానం గురించి సృష్టి నుండి తెలుసుకోవచ్చు

యెహోవా జ్ఞానం గురించి సృష్టి నుండి తెలుసుకోవచ్చు

“ఆయన అదృశ్యలక్షణములు . . . సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.”​—⁠రోమా. 1:⁠20.

చాలామంది “జ్ఞానం” అనే పదాన్ని తమకు తోచిన విధంగా ఉపయోగిస్తుంటారు. ఎంతో జ్ఞానం సంపాదించుకున్న వ్యక్తిని జ్ఞాని అని కొందరు పిలుస్తారు. అయితే, అసలు మనం ఎందుకు జీవిస్తున్నామనే దాని గురించి లోకంలో మేధావులని పిలవబడేవారు నమ్మదగిన మార్గనిర్దేశాన్ని ఇవ్వలేకపోతున్నారు. అందుకే, వారిని అనుసరించే వారు ‘గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొనిపోవుచు అలలచేత ఎగురగొట్టబడినట్లు ఉన్నారు.’​—⁠ఎఫె. 4:⁠14.

2 యెహోవా నుండి వచ్చే నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకున్న ప్రజల పరిస్థితి ఎంత భిన్నంగా ఉంది! యెహోవా “అద్వితీయ జ్ఞానవంతుడు” అని బైబిలు చెబుతోంది. (రోమా. 16:25) విశ్వంలోని సృష్టి అంతటి గురించి, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి ఆయనకు పూర్తిగా తెలుసు. విశ్వంలోని భౌతిక నియమాలను ఆధారం చేసుకొని మానవులు పరిశోధనలు చేస్తారు. అయితే, ఆ నియమాలన్నింటినీ ఏర్పర్చింది యెహోవాయే కాబట్టి, మానవులు కనిపెట్టినవాటిని చూసి ఆయన ముగ్ధుడు కాడు. ఎంతో శ్రేష్ఠమైనదిగా చాలామంది పరిగణించే మానవుల ఆలోచనను చూసి ఆయన ఆశ్చర్యపోడు. ఎందుకంటే, “ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెఱ్ఱితనమే.”​—⁠1 కొరిం. 3:⁠19.

3 యెహోవా తన సేవకులకు ‘జ్ఞానమిస్తాడని’ బైబిలు చెబుతోంది. (సామె. 2:⁠6) దేవుని నుండి వచ్చే జ్ఞానం మానవ తత్వజ్ఞానంలా అస్పష్టంగా ఉండదు. బదులుగా, ఖచ్చితమైన జ్ఞానంతో, అవగాహనతో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అది మనకు సహాయం చేస్తుంది. (యాకోబు 3:17 చదవండి.) అపొస్తలుడైన పౌలు యెహోవా జ్ఞానాన్నిబట్టి ముగ్ధుడయ్యాడు. ఆయనిలా రాశాడు: “ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము; ఆయన తీర్పులు శోధింప నెంతో అశక్యములు; ఆయన మార్గము లెంతో అగమ్యములు.” (రోమా. 11:33) యెహోవా సర్వజ్ఞాని కాబట్టి మనం సరైన విధంగా జీవించడానికి కావాల్సిన నడిపింపు ఆయన నియమాల్లో దొరుకుతుందని నమ్ముతున్నాం. అన్నిటికిపైగా, సంతోషంగా ఉండడానికి మనకేమి అవసరమో యెహోవాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు.​—⁠సామె. 3:​5, 6

“ప్రధానశిల్పి” అయిన యేసు

4 యెహోవా జ్ఞానంతోపాటు ఆయనకున్న ఇతర సాటిలేని లక్షణాలు, ఆయన చేసిన సృష్టి కార్యాల్లో కనిపిస్తాయి. (రోమీయులు 1:20 చదవండి.) ఆయన సృష్టి కార్యాల్లోని పెద్దవాటి నుండి చిన్నవాటి వరకు ప్రతీది ఆయన లక్షణాలను తెలియజేస్తోంది. మనం విశ్వమంతటిలో ఎటూ చూసినా అత్యంత జ్ఞానవంతుడైన, ప్రేమగల సృష్టికర్త ఉన్నాడనడానికి ఎన్నో రుజువులను కనుగొంటాం. ఆయన సృష్టించిన వాటిని గమనించినప్పుడు మనం ఆయన గురించి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.​—⁠కీర్త. 19:1; యెష. 40:⁠26.

5 యెహోవా “భూమ్యాకాశములను” సృష్టించినప్పుడు ఆయన ఒంటరిగా లేడు. (ఆది. 1:⁠1) ఈ భౌతిక విశ్వం సృష్టింపబడడానికి ఎంతో కాలం ముందే, దేవుడు ఒక ఆత్మ ప్రాణిని సృష్టించి, ఆ ప్రాణి ద్వారానే “సర్వమును” సృష్టించాడని బైబిలు చెబుతోంది. ఆ ఆత్మ ప్రాణి దేవుని అద్వితీయ కుమారుడు, ‘సర్వసృష్టికి ఆదిసంభూతుడు.’ ఆ కుమారుడే ఆ తర్వాత మానవుడిగా యేసు అనే పేరుతో భూమ్మీద జీవించాడు. (కొలొ. 1:​15-17) యెహోవాకు ఉన్నట్లే యేసుకూ జ్ఞానం ఉంది. వాస్తవానికి, సామెతలు 8వ అధ్యాయంలో యేసు జ్ఞానస్వరూపిగా వర్ణించబడ్డాడు. అదే అధ్యాయంలో ఆయన “ప్రధానశిల్పి” అని కూడా చెప్పబడింది.​—⁠సామె. 8:​12, 22-31.

6 భౌతిక సృష్టిని పరిశీలించినప్పుడు యెహోవా జ్ఞానం గురించీ ఆయన ప్రధానశిల్పి అయిన యేసు జ్ఞానం గురించీ తెలుసుకుంటాం. సృష్టిని చూసి మనం అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. అయితే, మనం ఇప్పుడు సామెతలు 30:​24-28 వచనాల్లో ‘మిక్కిలి జ్ఞానముగలవిగా (“సహజసిద్ధమైన జ్ఞానంగలవిగా,” NW)’ ప్రస్తావించబడిన సృష్టిలోని నాలుగు జీవుల ఉదాహరణలను చూద్దాం. *

కష్టపడి పని చేసే విషయంలో పాఠం

7 మనం ఆ జీవులు సృష్టింపబడిన తీరును, అవి చేసే పనులను గమనించినప్పుడు ‘భూమ్మీద ఉన్న చిన్న’ జీవుల నుండి కూడా పాఠాలు నేర్చుకోవచ్చని గుర్తిస్తాం. ఉదాహరణకు, చీమకున్న సహజసిద్ధమైన జ్ఞానం గురించి ఆలోచించండి.​—⁠సామెతలు 30:​24, 25 చదవండి.

8 మానవుల జనాభాకన్నా చీమల సంఖ్య 2,00,000 రెట్లు ఎక్కువని కొందరు పరిశోధకులు నమ్ముతున్నారు. అవి భూమ్మీదా, భూమి లోపలా కష్టపడి పనిచేస్తుంటాయి. చీమలు కాలనీలుగా ఏర్పడతాయి. అనేక కాలనీల్లో రాణి చీమలు, మగ చీమలు, బానిస చీమలు అనే మూడు రకాల చీమలు ఉంటాయి. ఆ మూడు రకాల చీమలు తమ తమ శైలిలో కాలనీ అవసరాలు చూసుకుంటాయి. ఆకులను కత్తిరించే చీమగా పిలవబడే ఓ దక్షిణ అమెరికా చీమను నైపుణ్యంగల తోటమాలి అని పిలవొచ్చు. ఈ చిన్న జీవి బూజు తోటను సాగుచేస్తుంది. ఆ తోటల్లో ఎక్కువ దిగుబడి వచ్చేలా వాటికి ఎరువులేస్తూ, ఆ బూజును వేరేచోట నాటుతూ అవసరమైనప్పుడు దాన్ని కత్తిరిస్తుంది. ఈ నైపుణ్యంగల “తోటమాలి” కాలనీ ఆహార అవసరాలకు అనుగుణంగా కష్టపడుతుందని పరిశోధకులు కనుగొన్నారు. *

9 చీమల నుండి ఓ పాఠం నేర్చుకోవచ్చు. అదేమిటంటే, మనం మంచి ఫలితాలు సాధించాలనుకుంటే కష్టపడి పనిచేయాలి. బైబిలు ఇలా చెబుతోంది: “సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును.” (సామె. 6:​6-8) యెహోవా, ఆయన ప్రధానశిల్పి అయిన యేసు కష్టపడి పని చేస్తారు. ‘నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నాను’ అని యేసు చెప్పాడు.​—⁠యోహా. 5:⁠17.

10 దేవుణ్ణి, యేసును అనుకరించేవారిగా మనం కూడా కష్టపడి పని చేయాలి. దేవుని సేవలో మనకు ఎలాంటి బాధ్యత లేదా పని అప్పగించబడినా “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులునై” ఉండాలి. (1 కొరిం. 15:58) కాబట్టి, రోమాలోని క్రైస్తవులకు పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మనం పాటించాలి. ఆయనిలా అన్నాడు: “ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.” (రోమా. 12:11) దేవుని చిత్తం చేయడానికి మనం పడే ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకంటే బైబిలు ఇలా అభయమిస్తోంది: “మీరు చేసిన కార్యమును, మీరు తన నామమునుబట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.”​—⁠హెబ్రీ. 6:⁠10.

ఆధ్యాత్మిక హాని నుండి రక్షణ

11 మరో చిన్న ప్రాణియైన చిన్నకుందేలు (రాక్‌ బ్యాడ్జర్‌) నుండి మనం ఓ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు. (సామెతలు 30:26 చదవండి.) దీనికి చిన్నగా ఉండే గుండ్రని చెవులు, చిన్న కాళ్లు ఉంటాయి. ఇది కొండ ప్రాంతాల్లో జీవిస్తుంది. తీక్షణమైన కంటి చూపుతో అది ప్రమాదాలను పసిగట్టగలుగుతుంది. అది గుట్టల్లో ఉండే రంధ్రాల్లో, పగుల్లో నివసిస్తుంది కాబట్టి, అది సులభంగా శత్రువుల నుండి తప్పించుకుంటుంది. గుంపుగా ఒక దగ్గర ఉంటూ వర్ధిల్లేలా చిన్నకుందేళ్లు సృష్టించబడ్డాయి. అలా వాటికి శత్రువుల నుండి రక్షణా, చలికాలంలో వెచ్చదనమూ లభిస్తాయి. *

12 చిన్నకుందేలు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? మొదటిగా, ఆ జీవి ప్రమాదాన్ని కొనితెచ్చుకోదని గమనించండి. బదులుగా, అది తీక్షణమైన కంటిచూపుతో దూరం నుండే శత్రువులను పసిగట్టి రక్షణ కోసం గుట్టల్లో ఉండే రంధ్రాల్లోకి, పగుల్లోకి దూరుతుంది. అలాగే, సాతాను లోకంలో పొంచివున్న ప్రమాదాలను పసిగట్టేలా మనం కూడా మన ఆధ్యాత్మిక చూపును తీక్షణంగా ఉంచుకోవాలి లేదా ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండాలి. అపొస్తలుడైన పేతురు క్రైస్తవులను ఇలా హెచ్చరించాడు: “నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.” (1 పేతు. 5:⁠8) యేసు భూమ్మీద ఉన్నప్పుడు ఆయన మెలకువగా ఉంటూ తన యథార్థతను పాడుచేసేందుకు సాతాను చేసిన ప్రయత్నాలన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. (మత్త. 4:​1-11) యేసు తన అనుచరులకు ఎంత చక్కని మాదిరిని ఉంచాడు!

13 యెహోవా మనకోసం ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కాపుదల నుండి ప్రయోజనం పొందడం ద్వారా మనం మెలకువగా ఉండవచ్చు. దేవుని వాక్యం అధ్యయనం చేయడాన్ని, కూటాలకు హాజరుకావడాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. (లూకా 4:4; హెబ్రీ. 10:​24, 25) చిన్నకుందేలు ఏ విధంగానైతే తన గుంపుకు దగ్గరగా ఉంటే వర్ధిల్లుతుందో అలాగే, మనం సంఘంలోని తోటి క్రైస్తవులకు దగ్గరగా ఉంటే ‘ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణ పొందుతాం.’ (రోమా. 1:11) యెహోవా ఇచ్చే కాపుదల నుండి ప్రయోజనం పొందడం ద్వారా మనం కీర్తనకర్త అయిన దావీదు చెప్పిన ఈ మాటలతో ఏకీభవిస్తాం: “యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు నేను ఆశ్రయించియున్న నా దుర్గము.”​—⁠కీర్త. 18:⁠2.

వ్యతిరేకత ఉన్నా పట్టుదల చూపించండి

14 మిడత నుండి కూడా మనం పాఠం నేర్చుకోవచ్చు. కేవలం ఐదు సెంటీమీటర్ల పొడవు ఉండే మిడతను చూస్తే మనకు ఆశ్చర్యం కలగకపోవచ్చు గానీ మిడతల దండును చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. (సామెతలు 30:27 చదవండి.) మిడతలు విపరీతమైన ఆకలిగల జీవులుగా పేరుగాంచాయి. పట్టుదలతో దూసుకెళ్లే ఒక మిడతల దండు, చేతికొచ్చిన పంటను క్షణాల్లో కాజేయగలదు. సమీపిస్తున్న మిడతల దండుతోపాటు కీటకాల దండు చేసే శబ్దాలు రథాల ధ్వనిలా, కొయ్యకాలు అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధ్వనిలా ఉంటుందని బైబిలు చెబుతోంది. (యోవే. 2:​3, 5) కొందరు మంటలు పెట్టి సమీపిస్తున్న మిడతల దండును ఆపే ప్రయత్నం చేశారు. కానీ, మంటలు కూడా వాటిని ఆపలేకపోయాయి. ఎందుకు? ఎందుకంటే, సాధారణంగా చచ్చిపోయిన మిడతలు మంటల్లో పడినప్పుడు మంటలు ఆరిపోతాయి. దాంతో దండులోని మిగతా మిడతలు యథేచ్ఛగా ముందుకు దూసుకుపోతాయి. వాటికి రాజుగానీ నాయకుడుగానీ లేకపోయినా చక్కగా వ్యవస్థీకరించబడిన సైన్యంలా ముందుకు దూసుకెళ్తూ ఎలాంటి ఆటంకానైనా అధిగమిస్తాయి. *​—⁠యోవే. 2:25.

15 యోవేలు, యెహోవా సేవకుల కార్యకలాపాలను మిడతలు చేసే పనులతో పోల్చాడు. ఆయనిలా రాశాడు: “బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.”​—⁠యోవే. 2:​7, 8.

16 మనకాలంలోని దేవుని రాజ్య ప్రచారకులను ఈ ప్రవచనం ఎంత చక్కగా వర్ణిస్తోంది! వ్యతిరేకత అనే “గోడలు” వారి ప్రకటనా పనిని అడ్డుకోలేకపోయాయి. వారు యేసును అనుకరిస్తారు. అనేకులు తనను తిరస్కరించినా యేసు దేవుని చిత్తాన్ని పట్టుదలతో చేశాడు. (యెష. 53:⁠3) నిజమే, కొందరు క్రైస్తవులు తమ విశ్వాసాన్నిబట్టి హతసాక్షులుగా చంపబడడం ద్వారా ‘ఆయుధములమీద పడ్డారు.’ అయినా, ప్రకటనా పని కొనసాగుతూనే ఉంది. రాజ్యప్రచారకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిజానికి, హింస తరచూ సువార్త వ్యాప్తి చెందడానికే దోహదపడింది. అంతకుముందు సువార్త వినే అవకాశం దొరకని వాళ్లు కూడా హింసవల్ల రాజ్యసందేశాన్ని వినగలిగారు. (అపొ. 8:​1, 4) పరిచర్యలో ప్రజలు ఆసక్తి చూపించనప్పుడు, వ్యతిరేకత ఎదురైనప్పుడు మీరు కూడా మిడతల్లా పట్టుదల చూపించారా?​—⁠హెబ్రీ. 10:⁠39.

‘మంచి దానిని హత్తుకొని ఉండండి’

17 చిన్న బల్లిని (గెకో లిజర్డ్‌ను) చూస్తే దానిమీద గురుత్వాకర్షణ శక్తి పనిచేయదని మనకు అనిపించవచ్చు. నూతనలోక అనువాదంలో సామెతలు 30:28 ఇలా అనువదించబడింది: ‘గెకో బల్లి తన చేతులతో గోడను పట్టుకుంటుంది. అది రాజుల గృహాల్లో నివసిస్తుంది.’ ఈ జీవి గోడల మీద పాకగలుగుతుంది, చివరకు నున్నటి ఇంటి పైకప్పును అంటిపెట్టుకొని కింద పడకుండా వేగంగా పాకగలదు. దాని సామర్థ్యాన్ని చూసి శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు. దాని సామర్థ్యం వెనుకున్న రహస్యం ఏమిటి? ఉపరితలానికీ కాళ్లకూ మధ్యవున్న గాలిని ఖాళీ చేసే సామర్థ్యం దానికి ఉండడం వల్లనో లేదా దాని కాళ్లకు ఏదో జిగట పదార్థం ఉండడంవల్లనో అది అలా పాకదు. కానీ, దాని మెత్తటి వేళ్లకు ఉబ్బెత్తుగా ఉండే చిన్న చిన్న ప్యాడ్స్‌ ఉంటాయి. వాటికి వేలాది సంఖ్యలో బయటకు పొడుచుకువచ్చిన వెంట్రుకల్లాంటి సన్నని నూగు ఉంటుంది. వీటిలో ప్రతీదానికి సాసర్‌ ఆకారంలో ఉండే అంచులున్న వందలాది ఫిలమెంట్లు ఉంటాయి. గెకో బల్లి శరీర బరువు కంటే అధిక బరువును మోసే అంతరానుక బలం ఆ ఫిలమెంట్లకు ఉంటుంది. ఆ బలంవల్లే అది నున్నని గాజు ఉపరితలముమీద కూడా తలక్రిందులుగా పాకగలుగుతుంది. గెకో బల్లికి ఉన్న సామర్థ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన పరిశోధకులు, ఆ సామర్థ్యానికి వెనుకున్న సూత్రాలను ఆధారం చేసుకొని వస్తువులను తయారు చేస్తే అవి బలంగా అతుక్కుపోయే జిగురు పదార్థంలా పనికొస్తాయని చెబుతున్నారు. *

18 గెకో బల్లి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? బైబిలు మనల్ని ఇలా హెచ్చరిస్తోంది: “చెడ్డదాని నసహ్యించు కొని మంచిదానిని హత్తుకొని యుండుడి.” (రోమా. 12:⁠9) సాతాను లోకంలో ప్రబలంగా ఉన్న చెడు ప్రభావాలవల్ల మనం దైవిక సూత్రాలమీద పట్టుకోల్పోయే అవకాశముంది. ఉదాహరణకు, పాఠశాలలో గానీ, ఉద్యోగ స్థలంలో గానీ దైవిక సూత్రాలకు విరుద్ధమైన ఏదో విధమైన వినోదం మూలంగా గానీ మనం దేవుని నియమాలను పాటించనివారితో సహవసిస్తే సరైనది చేయాలనే కృతనిశ్చయాన్ని మనం కోల్పోయే అవకాశముంది. మీకు అలా జరగకుండా చూసుకోండి! దేవుని వాక్యం మనల్ని ఇలా హెచ్చరిస్తోంది: “నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు.” (సామె. 3:⁠7) అలా అనుకునే బదులు, ప్రాచీన కాలంలో మోషే దేవుని ప్రజలకు ఇచ్చిన జ్ఞానయుక్తమైన ఈ ఉపదేశాన్ని అనుసరించాలి: ‘నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకోవాలి.’ (ద్వితీ. 10:20) యెహోవాకు హత్తుకోవడం ద్వారా మనం యేసును అనుకరిస్తాం. ఆయన గురించి ఇలా చెప్పబడింది: “నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి.”​—⁠హెబ్రీ. 1:⁠9.

సృష్టి నుండి నేర్చుకోగల పాఠాలు

19 మనం ఇంతవరకు చూసినట్లు, యెహోవా లక్షణాలు ఆయన సృష్టిలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాక, మనం వాటి నుండి అమూల్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. మనం యెహోవా కార్యాలను ఎంత ఎక్కువగా పరిశీలిస్తే అంత ఎక్కువగా ఆయనకున్న జ్ఞానాన్నిబట్టి ముగ్ధులమౌతాం. దైవిక జ్ఞానాన్ని పరిశీలిస్తే మనం ఇప్పుడు మరింత సంతోషంగా ఉంటాం, మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. (ప్రసం. 7:12) నిజమే, సామెతలు 3:​13, 18 వచనాల్లో ఇవ్వబడిన అభయం ఎంత సత్యమో మనం వ్యక్తిగతంగా చవిచూస్తాం. అక్కడిలా ఉంది: “జ్ఞానము సంపాదించినవాడు ధన్యుడు. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. దాని నవలంబించువారికి అది జీవవృక్షము. దాని పట్టుకొనువారందరు ధన్యులు.”

[అధస్సూచీలు]

^ పేరా 9 ముఖ్యంగా యౌవనస్థులు, పిల్లలు ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన అథఃస్సూచిలోని రెఫరెన్సులను పరిశోధించి సంఘంలో కావలికోట అధ్యయనం జరుగుతున్నప్పుడు తమ వ్యాఖ్యానాల్లో వాటిని చేర్చవచ్చు.

^ పేరా 12 ఆకులను కత్తిరించే చీమ (leaf-cutting ant) గురించిన మరింత సమాచారం కోసం తేజరిల్లు! (ఆంగ్లం) మార్చి 22, 1997వ సంచికలోని 31వ పేజీ, మే 22, 2002వ సంచికలోని 31వ పేజీ చూడండి.

^ పేరా 16 చిన్నకుందేలు (రాక్‌ బ్యాడ్జర్‌) గురించిన మరింత సమాచారం కోసం తేజరిల్లు! మార్చి 8, 1992, 28-29 పేజీలు చూడండి.

^ పేరా 20 మిడతల గురించిన మరింత సమాచారం కోసం తేజరిల్లు! (ఆంగ్లం) అక్టోబరు 22, 1976, 11వ పేజీని చూడండి.

^ పేరా 24 గెకో బల్లి (గెకో లిజర్డ్‌) గురించిన మరింత సమాచారం కోసం తేజరిల్లు! (ఆంగ్లం) ఏప్రిల్‌ 2008, 26వ పేజీ చూడండి.

మీకు జ్ఞాపకమున్నాయా?

ఈ కింది జీవుల నుండి మనం ఏ పాఠాలు నేర్చుకుంటాం?

• చీమ

• చిన్నకుందేలు

• మిడత

• గెకొ బల్లి

[అధ్యయన ప్రశ్నలు]

1. లోక జ్ఞానంవల్ల నేడు చాలామంది పరిస్థితి ఎలా ఉంది?

2, 3. (ఎ) యెహోవా “అద్వితీయ జ్ఞానవంతుడు” అని ఎందుకు చెప్పవచ్చు? (బి) దేవుని జ్ఞానం లోక జ్ఞానానికి ఎలా భిన్నంగా ఉంది?

4. మనం యెహోవా జ్ఞానం గురించి తెలుసుకునే ఒక విధానం ఏమిటి?

5, 6. (ఎ) సృష్టి కార్యాలను చేస్తున్నప్పుడు యెహోవాతోపాటు ఎవరు పాల్గొన్నారు? (బి) మనం ఏమి పరిశీలించబోతున్నాం? ఎందుకు?

7, 8. చీమను గురించిన ఏ వాస్తవాలు మిమ్మల్ని ముగ్ధులను చేస్తున్నాయి?

9, 10. కష్టపడి పని చేసే విషయంలో మనం చీమను ఎలా అనుకరించవచ్చు?

11. చిన్న కుందేలుకు (రాక్‌ బ్యాడ్జర్‌కు) ఉన్న కొన్ని సహజ లక్షణాలు ఏమిటి?

12, 13. చిన్నకుందేలు నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?

14. ఒక మిడతను చూసి మనకు ఆశ్చర్యం కలగకపోవచ్చు గానీ మిడతల దండు విషయంలో ఏమి చెప్పవచ్చు?

15, 16. మన కాలంలోని రాజ్య ప్రచారకులు ఎలా ఓ మిడతల దండులా ఉన్నారు?

17. నున్నని ఉపరితలాలకు గెకో బల్లి కాళ్లు ఎందుకు అంటిపెట్టుకొని ఉండగలవు?

18. మనం ఎల్లప్పుడూ ‘మంచిదానిని హత్తుకొని ఉండాలంటే’ ఏమి చేయాలి?

19. (ఎ) సృష్టిలో యెహోవాకున్న ఏ లక్షణాలను మీరు గమనించారు? (బి) దైవిక జ్ఞానం నుండి మనం ఏ విధంగా ప్రయోజనం పొందవచ్చు?

[16వ పేజీలోని చిత్రం]

ఆకులను కత్తిరించే చీమలా మీరూ కష్టపడి పనిచేస్తున్నారా?

[17వ పేజీలోని చిత్రాలు]

చిన్నకుందేలు తన గుంపుతో ఉండడంవల్ల సురక్షితంగా ఉంటుంది, మీరూ అలాగే చేస్తున్నారా?

[18వ పేజీలోని చిత్రాలు]

మిడతల్లా క్రైస్తవ ప్రచారకులు పట్టుదల కనబరుస్తారు

[18వ పేజీలోని చిత్రం]

గెకో బల్లి ఉపరితలానికి అంటిపెట్టుకొని ఉన్నట్లే, క్రైస్తవులు మంచి దానిని హత్తుకొని ఉంటారు

[చిత్రసౌజన్యం]

Stockbyte/Getty Images