కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యెహోవా దినం సమీపించింది’ కాబట్టి పరిణతి సాధించేందుకు కృషి చేయండి

‘యెహోవా దినం సమీపించింది’ కాబట్టి పరిణతి సాధించేందుకు కృషి చేయండి

‘యెహోవా దినం సమీపించింది’ కాబట్టి పరిణతి సాధించేందుకు కృషి చేయండి

‘పరిణతి సాధించేందుకు కృషి చేద్దాం.’—హెబ్రీ. 6:1, NW.

1, 2. మొదటి శతాబ్దంలో యెరూషలేము, యూదయ ప్రాంతాల్లోని క్రైస్తవులకు ‘కొండలకు పారిపోవడానికి’ ఎలాంటి అవకాశం దొరికింది?

యేసు భూమ్మీదున్నప్పుడు శిష్యులు, “ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి?” అని ఆయనను అడిగారు. వారు అడిగిన ప్రశ్నకు జవాబుగా యేసు ఒక ప్రవచనం చెప్పాడు. దాని తొలి నెరవేర్పు మొదటి శతాబ్దంలో జరిగింది. అంతం సమీపంలో ఉందని చూపించే ఓ అసాధారణ సంఘటన జరుగుతుందని యేసు వారికి చెప్పాడు. ఆ సంఘటన జరగడం చూసినప్పుడు “యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను” అని ఆయన వారిని ఆదేశించాడు. (మత్త. 24:1-3, 15-22) యేసు శిష్యులు ఆ సంఘటనను గుర్తించి ఆయనిచ్చిన ఆదేశాలను పాటించారా?

2 దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత, అంటే సా.శ. 61లో, అపొస్తలుడైన పౌలు యెరూషలేము, దాని చుట్టు పక్క ప్రాంతాల్లో నివసిస్తున్న హెబ్రీ క్రైస్తవుల ఆలోచనను సరిదిద్దే శక్తివంతమైన సందేశమున్న పత్రికను రాశాడు. ఆ కాలపు ‘మహాశ్రమల’ ప్రారంభాన్ని తెలియజేసే సూచన కేవలం ఐదు సంవత్సరాల తర్వాత జరగనున్నట్లు పౌలుకు, ఆయన తోటి విశ్వాసులకు తెలియదు. (మత్త. 24:21) సా.శ. 66లో సెస్టియస్‌ గ్యాలస్‌ తన రోమా సైన్యంతో యెరూషలేముపై దాడి చేసినప్పుడు దాదాపు విజయానికి చేరువయ్యాడు. కానీ, అనూహ్యరీతిలో ఆయన తన సైన్యంతో వెనుదిరిగాడు. దాంతో ప్రమాదంలో ఉన్న క్రైస్తవులకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే అవకాశం దొరికింది.

3. హెబ్రీ క్రైస్తవులకు పౌలు ఏ ఉపదేశాన్నిచ్చాడు? ఎందుకు?

3 యేసు చెప్పిన విధంగానే ఆ సంఘటన జరుగుతుందని గుర్తించి ఆ క్రైస్తవులు పారిపోవాలి. అయితే, కొందరు ‘వినే విషయంలో మందులయ్యారు.’ వారు ఆధ్యాత్మికంగా “పాలు” తాగే స్థితిలోవున్న శిశువుల్లా ఉన్నారు. (హెబ్రీయులు 5:11-13 చదవండి.) ఎన్నో సంవత్సరాలుగా సత్యంలో ఉన్నవారు కూడా ‘జీవముగల దేవుణ్ణి విడిచిపెడుతున్నారు’ అని చూపించే సూచనలు కనిపించాయి. (హెబ్రీ. 3:12) ఆ విపత్కర ‘దినం సమీపిస్తున్న’ సమయంలో కొందరు క్రైస్తవ కూటాలకు వెళ్లడం అలవాటుగా ‘మానుకునేవారు.’ (హెబ్రీ. 10:24, 25) అందుకే, పౌలు వారికి సమయోచితమైన ఈ ఉపదేశాన్నిచ్చాడు: ‘క్రీస్తును గురించిన మూలోపదేశమును మానుకున్నాం కాబట్టి పరిణతి సాధించేందుకు కృషి చేద్దాం.’—హెబ్రీ. 6:1, NW.

4. బైబిలు ప్రవచనాల నెరవేర్పును గుర్తించి యెహోవాతో బలమైన సంబంధాన్ని పెంపొందించుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? దానికి మనం ఏమి చేయాలి?

4 యేసు ప్రవచనానికి సంబంధించిన చివరి నెరవేర్పు జరిగే కాలంలో మనం జీవిస్తున్నాం. సాతాను దుష్ట విధానమంతా నాశనం చేయబడే దినం అంటే ‘యెహోవా మహా దినం సమీపించింది.’ (జెఫ. 1:14) మునుపటికన్నా మరింత ఎక్కువగా ఇప్పుడు, మనం బైబిలు ప్రవచనాల నెరవేర్పును గుర్తించి యెహోవాతో బలమైన సంబంధాన్ని పెంపొందించుకోవాలి. (1 పేతు. 5:8) మనం అలా చేస్తున్నామా? క్రైస్తవ పరిణతి సాధిస్తే కాలప్రవాహంలో మనమెక్కడ ఉన్నామనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోగలుగుతాం.

క్రైస్తవ పరిణతి అంటే ఏమిటి?

5, 6. (ఎ) క్రైస్తవ పరిణతి సాధించాలంటే ఏమి చేయాలి? (బి) దాని కోసం మనం ఏ రెండు రంగాల్లో కృషిచేయాలి?

5 పౌలు హెబ్రీ క్రైస్తవులను పరిణతి సాధించమని ప్రోత్సహించడమేకాక క్రైస్తవ పరిణతి సాధించాలంటే ఏమి చేయాలో కూడా చెప్పాడు. (హెబ్రీయులు 5:14 చదవండి.) “వయసు వచ్చిన వారు” అంటే పరిణతి చెందినవారు కేవలం పాలు తాగడంతోనే సరిపెట్టుకోరు గానీ “బలమైన ఆహారము” కూడా తీసుకుంటారు. అందుకే, వారికి సత్యానికి సంబంధించిన ‘మూలపాఠాలే’ కాక ‘మర్మాలు’ అంటే లోతైన విషయాలు కూడ తెలుసు. (1 కొరిం. 2:10) అంతేకాక, వారు తమకు తెలిసిన విషయాలను అన్వయించుకోవడంవల్ల తమ జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకుంటారు. అలా వారు తప్పొప్పులను గుర్తించగలుగుతారు. అంతేకాక నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడు సంబంధిత లేఖన సూత్రాలను గుర్తించి, వాటిని ఎలా అన్వయించుకోవచ్చో తెలుసుకోగలుగుతారు.

6 “మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను” అని పౌలు రాశాడు. (హెబ్రీ. 2:1) మనకు తెలియకుండానే విశ్వాసాన్ని విడిచిపెట్టి కొట్టుకొనిపోయే ప్రమాదముంది. అలాంటి పరిస్థితి మనకు రాకూడదంటే మనం బైబిలు సత్యాలను ‘మరి విశేష జాగ్రత్తతో’ పరిశీలించాలి. అందుకే మనలో ప్రతీ ఒక్కరం ఇలా ఆలోచించాలి: ‘నేను ఇంకా మూలపాఠాలనే పరిశీలిస్తున్నానా? సత్యంలో పూర్తిగా లీనమైపోకుండా ఏదో చేయాలి కదా అని యాంత్రికంగా క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొంటున్నానా? నేను సత్యంలో అసలు ఎలా ప్రగతి సాధించగలను?’ మనం పరిణతి సాధించాలంటే కనీసం రెండు రంగాల్లో కృషిచేయాలి. దేవుని వాక్యంతో సుపరిచితులం కావాలి. విధేయతను నేర్చుకోవాలి.

దేవుని వాక్యంతో సుపరిచితులవ్వండి

7. దేవుని వాక్యంతో సుపరిచితులం కావడంవల్ల మనం ఎలా ప్రయోజనం పొందుతాం?

7 “పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్యవిషయములో అనుభవములేనివాడై యున్నాడు” అని పౌలు రాశాడు. (హెబ్రీ. 5:13) మనం పరిణతి సాధించాలంటే దేవుని వాక్యంతో అంటే ఆయన మనకు ఇచ్చిన సందేశంతో సుపరిచితులం కావాలి. ఆ సందేశం ఆయన వాక్యమైన బైబిల్లో ఉంది కాబట్టి మనం లేఖనాలను, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ప్రచురణలను చక్కగా అధ్యయనం చేయాలి. (మత్త. 24:45-47) మనం అలా అధ్యయనం చేస్తే దేవుని ఆలోచనా విధానాన్ని తెలుసుకొని మన జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోగలుగుతాం. క్రైస్తవురాలైన ఆర్కడ్‌ ఉదాహరణను తీసుకోండి. * ఆమె ఇలా అంటోంది: “క్రమంగా బైబిలు చదవమని ఇవ్వబడిన ప్రోత్సాహం నా జీవితాన్నే మార్చేసింది. బైబిలును పూర్తి చేయడానికి నాకు రెండేళ్లు పట్టింది. అయితే, బైబిలు చదువుతున్నప్పుడు మొదటిసారిగా సృష్టకర్త గురించి తెలుసుకుంటున్నట్లు అనిపించింది. ఆయన మార్గాల గురించి, ఆయన ఇష్టాయిష్టాల గురించి, ఆయన అపార శక్తి, జ్ఞానం గురించి నేను తెలుసుకున్నాను. నేను కొన్నిసార్లు కష్టపరిస్థితులను ఎదుర్కొన్నా, ప్రతీరోజు బైబిలును చదవడంవల్లనే వాటిని ధైర్యంగా అధిగమించగలిగాను.”

8. దేవుని వాక్యం మనపై ఎలాంటి ప్రభావం చూపించగలదు?

8 దేవుని వాక్యాన్ని క్రమంగా చదివితే దానిలోని సమాచారం మనపై ‘బలం’ లేక ప్రభావం చూపిస్తుంది. (హెబ్రీయులు 4:12 చదవండి.) దానివల్ల మన వ్యక్తిత్వం మలచబడి, యెహోవాకు మరింత ఇష్టులమౌతాం. బైబిలును చదివి, ధ్యానించడానికి మీరు మరింత సమయం కేటాయించాల్సిన అవసరముందా?

9, 10. దేవుని వాక్యంతో సుపరిచితులమవ్వాలంటే ఏమి చేయాలి? ఉదహరించండి.

9 బైబిలుతో సుపరిచితులమవ్వాలంటే అది ఏమి చెబుతుందో తెలుసుకుంటే సరిపోదు. పౌలు కాలంలో ఆధ్యాత్మికంగా శిశువులైనవారికి దేవుని ప్రేరేపిత వాక్యంలోని కొన్ని విషయాలు తెలిసేవుంటాయి. అయితే, వాటి నుండి ప్రయోజనం పొందేలా వారు తాము నేర్చుకున్నవాటిని అన్వయించుకోలేదు. తమ జీవితాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేలా దానిలోని సందేశాన్ని పాటించలేదు కాబట్టి దేవుని వాక్యంతో వారు సుపరిచితులు కాలేదు.

10 దేవుని వాక్యంతో సుపరిచితులమవ్వాలంటే దానిలోని విషయాలను తెలుసుకోవాలి. అంతేకాక, తెలుసుకున్నవాటిని పాటించాలి. ఇదెలా చేయవచ్చో కైల్‌ అనే సహోదరి అనుభవం నుండి తెలుసుకోవచ్చు. ఓ విషయంలో ఆమెకూ ఆమె తోటి ఉద్యోగస్థురాలికీ మధ్య వాగ్వివాదం జరిగింది. అయితే, సమస్యను పరిష్కరించుకునేందుకు కైల్‌ ఏమి చేసింది? ఆమె ఇలా వివరిస్తోంది: “‘శక్యమైతే అందరితో సమాధానంగా ఉండండి’ అని రోమా 12:18లో చెప్పబడిన మాటలు నాకు గుర్తొచ్చాయి. కాబట్టి, పని తర్వాత తనతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాను.” వారు మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకోగలిగారు. కైల్‌ తీసుకున్న చొరవను చూసి ఆమె తోటి ఉద్యోగస్థురాలు ముగ్ధురాలైంది. “బైబిలు సూత్రాలను పాటిస్తే ఎల్లప్పుడూ మంచే జరుగుతుందని నేను తెలుసుకున్నాను” అని కైల్‌ చెబుతోంది.

విధేయతను నేర్చుకోండి

11. కష్ట పరిస్థితుల్లో విధేయత చూపించడం సులభంకాదని ఏ ఉదాహరణ చూపిస్తోంది?

11 లేఖనాల నుండి నేర్చుకున్న విషయాలను అన్వయించుకోవడం కష్టంగానే అనిపించవచ్చు. ప్రాముఖ్యంగా, పరిస్థితులు కష్టంగా ఉన్నప్పుడు అలా అనిపించవచ్చు. ఉదాహరణకు, యెహోవా ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలీయులను విడిపించిన కొంతకాలానికి, వారు ‘మోషేతో వాదిస్తూ యెహోవాను శోధిస్తూ’ వచ్చారు. ఎందుకు? తాగడానికి నీళ్లు లేవని వారలా చేశారు. (నిర్గ. 17:1-4) దేవునితో నిబంధన చేసుకొని, “యెహోవా చెప్పిన మాటలన్నిటి” ప్రకారం చేస్తామని ఒప్పుకొని రెండు నెలలైనా పూర్తికాకముందే వారు విగ్రహారాధన చేసి దేవుని నియమాన్ని ఉల్లంఘించారు. (నిర్గ. 24:3, 12-18; 32:1, 2, 7-9) మోషే హోరేబు కొండవద్ద నిర్దేశించబడుతున్నప్పుడు చాలా రోజులపాటు ఆయన వారి మధ్య లేకపోవడంవల్ల భయపడి వారలా చేశారా? గతంలో మోషే చేతికర్రను పైకెత్తి పట్టుకోవడంవల్ల వారు అమాలేకీయులతో జరిగిన యుద్ధంలో గెలిచారు. అమాలేకీయులు తమపై మళ్లీ దాడిచేయొచ్చనీ మోషే తమతో లేడు కాబట్టి తాము నిస్సహాయ స్థితిలో ఉన్నామనీ వారు అనుకున్నారా? (నిర్గ. 17:8-16) వారలా అనుకొనివుంటారు. ఏదేమైనా, వారు యెహోవాకు ‘లోబడలేదు.’ (అపొ. 7:39-41) వాగ్దానదేశంలోకి ప్రవేశించడానికి భయపడిన ఇశ్రాయేలీయులు ‘అవిధేయులయ్యారు.’ వారిలా అవిధేయులు కాకుండా ఉండేందుకు ‘జాగ్రత్తపడమని’ లేదా శాయశక్తులా కృషిచేయమని పౌలు క్రైస్తవులను ప్రోత్సహించాడు.—హెబ్రీ. 4:3, 11.

12. యేసు విధేయతను ఎలా నేర్చుకున్నాడు? దాని నుండి ఆయన ఎలాంటి ప్రయోజనం పొందాడు?

12 పరిణతి సాధించాలంటే మనం యెహోవాకు విధేయత చూపించేందుకు శాయశక్తులా కృషిచేయాలి. శ్రమలవల్ల విధేయత నేర్చుకోవచ్చని యేసుక్రీస్తు జీవితాన్ని పరిశీలిస్తే మనకు అర్థమౌతుంది. (హెబ్రీయులు 5:8, 9 చదవండి.) ఆయన భూమ్మీదకు రాకముందు తన తండ్రికి విధేయత చూపించాడు. అయితే, భూమ్మీద తన తండ్రి చిత్తం చేయడంలో భాగంగా ఆయన శారీరక, మానసిక బాధలను అనుభవించాడు. తీవ్ర పరిస్థితుల్లోనూ విధేయత చూపించడం ద్వారా యెహోవా ఆయన కోసం ఉద్దేశించిన కొత్త స్థానానికి అంటే రాజుగా ప్రధానయాజకునిగా ఘనపర్చబడేందుకు ‘సంపూర్ణసిద్ధిపొందాడు.’

13. మనం విధేయత నేర్చుకున్నామో లేదో దేన్నిబట్టి తెలుస్తుంది?

13 మన విషయమేమిటి? వేదనకరమైన సమస్యలు ఎదురైనా యెహోవాకు విధేయులముగా ఉండాలనే కృతనిశ్చయంతో మనం ఉన్నామా? (1 పేతురు 1:6, 7 చదవండి.) నైతికత, నిజాయితీ, సరైన సంభాషణ, లేఖనాలను చదివి అధ్యయనం చేయడం, కూటాలకు హాజరుకావడం, ప్రకటనా పనిలో పాల్గొనడం వంటి విషయాల్లో దేవుని నిర్దేశం స్పష్టంగా ఉంది. (యెహో. 1:8; మత్త. 28:19, 20; ఎఫె. 4:25, 27, 28 29; 5:3-5; హెబ్రీ. 10:24, 25) కష్టపరిస్థితుల్లోనూ ఆ విషయాల్లో మనం యెహోవాకు విధేయత చూపిస్తున్నామా? వాటిలో విధేయులముగా ఉంటే పరిణతి సాధించామని చూపిస్తాం.

క్రైస్తవ పరిణతి సాధించడం ఎందుకు ప్రయోజనకరం?

14. పరిణతి సాధించడంవల్ల మనం ఆధ్యాత్మిక హాని నుండి ఎలా రక్షించబడతామో ఉదహరించండి.

14 నైతికంగా ‘సిగ్గుమాలిన’ పరిస్థితిలోవున్న లోకంలో తప్పొప్పులను గుర్తించేలా జ్ఞానేంద్రియాలను సరైన విధంగా సాధకం చేసుకుంటే ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మిక హాని నుండి తనను తాను రక్షించుకోగలుగుతాడు. (ఎఫె. 4:19) ఉదాహరణకు, జేమ్స్‌ అనే సహోదరునికి క్రమంగా బైబిలు సాహిత్యాలు చదివే అలవాటుంది. ఆయన వాటిని ఎంతో ఇష్టంగా చదివేవాడు. అయితే, ఆయన ఓ ఉద్యోగంలో చేరాడు. అక్కడ తోటి పనివారంతా మహిళలే. ఆయనిలా అన్నాడు: “వారిలో చాలామంది నైతికంగా దిగజారిన స్థితిలోవున్నా ఓ ఉద్యోగిని మాత్రం గౌరవంగా ప్రవర్తిస్తున్నట్లు నాకు కనిపించింది. బైబిలు సత్యాలపట్ల ఆసక్తి కూడ చూపించింది. అయితే, ఒక రోజు పని స్థలంలో మేమిద్దరమే ఉన్నప్పుడు ఆమె నా మీదకు వచ్చింది. మొదట తాను జోక్‌ చేస్తుందని అనుకున్నాను. కానీ, ఆమెను అదుపు చేయడం చాలా కష్టమైంది. వెంటనే కావలికోటలో వచ్చిన ఓ సహోదరుని అనుభవం జ్ఞాపకం చేసుకున్నాను. ఆ సహోదరుడు కూడా తన ఉద్యోగ స్థలంలో ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. ఆ ఆర్టికల్‌లోనే యోసేపు, పోతిఫరు భార్య ఉదాహరణ ఇవ్వబడింది. * ఆ విషయాలను గుర్తుచేసుకొని నేను వెంటనే ఆమెను నెట్టేశాను. అప్పుడు ఆమె అక్కడ నుండి పారిపోయింది.” (ఆది. 39:7-12) ఎలాంటి తప్పు జరగనందుకూ మంచి మనస్సాక్షిని కాపాడుకున్నందుకూ జేమ్స్‌ ఎంతో సంతోషించాడు.—1 తిమో. 1:5.

15. పరిణతి సాధిస్తే మనం మన హృదయాన్ని ఎలా కాపాడుకోగలుగుతాం?

15 పరిణతి సాధించడంవల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. మన హృదయాన్ని కాపాడుకొని ‘నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుండా’ ఉండగలుగుతాం. (హెబ్రీయులు 13:9 చదవండి.) ఆధ్యాత్మిక ప్రగతి సాధించేందుకు కృషి చేయడంవల్ల, మనం “శ్రేష్ఠమైన కార్యముల” గురించే ఆలోచించగలుగుతాం. (ఫిలి. 1:9-11) అలా చేస్తే దేవునిపట్ల, మన మేలు కోసం ఆయన చేసిన ఏర్పాట్లన్నిటిపట్ల మన కృతజ్ఞత పెరుగుతుంది. (రోమా. 3:24) ‘బుద్ధి విషయమై పెద్దవాడైన’ అంటే అవగాహనలో పరిణతి సాధించిన ఓ క్రైస్తవుడు అలాంటి కృతజ్ఞతను పెంచుకొని యెహోవాతో దగ్గరి సంబంధాన్ని కలిగివుంటాడు.—1 కొరిం. 14:20.

16. ఒక సహోదరి ఎలా తన ‘హృదయాన్ని స్థిరపరచుకోగలిగింది’?

16 బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొంతకాలంవరకు ఇతరులు ఏమనుకుంటారోననే భయంతోనే క్రైస్తవ కార్యకలాపాల్లో పాల్గొనేదాన్నని లోవిస్‌ అనే సహోదరి ఒప్పుకుంటోంది. ఆమె ఇలా అంది: “నేను ఏ తప్పు చేయలేదు కానీ, అప్పట్లో యెహోవాను సేవించాలనే బలమైన కోరిక నాలో లోపించింది. యెహోవా సేవలో చేయగలిగినదంతా చేస్తున్నానని నాకు అనిపించాలంటే నా జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సివుందని నేను గ్రహించాను. నిండు హృదయంతో ఆయనను ఆరాధించడానికి తగిన చర్యలు తీసుకోవడమే నా జీవితంలో చేసుకోవాల్సిన పెద్ద మార్పు అని గుర్తించాను.” ఆ విషయాల్లో కృషి చేయడం ద్వారా ఆమె తన ‘హృదయాన్ని స్థిరపరచుకుంది.’ దానివల్ల ఆమె, వేదనభరితమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కోగలిగింది. (యాకో. 5:8) “ఆ సమస్యను తాళుకోవడం కష్టమైనా యెహోవాకు మరింత చేరువయ్యాను” అని లోవిస్‌ చెప్పింది.

‘హృదయపూర్వకంగా విధేయత చూపించండి’

17. మొదటి శతాబ్దంలోని వారికి విధేయత ఎందుకు అవసరమైంది?

17 ‘పరిణతి సాధించండి’ అని పౌలు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించడంవల్ల యెరూషలేము, యూదయ ప్రాంతాల్లోవున్న మొదటి శతాబ్దపు క్రైస్తవులు తమ ప్రాణాలను దక్కించుకోగలిగారు. ఎప్పుడు ‘కొండలకు పారిపోవాలనే’ దాని గురించి యేసు ఇచ్చిన సూచనను పౌలు ఉపదేశానికి విధేయులైనవారు గుర్తించగలిగారు. ‘నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలబడడాన్ని’ అంటే రోమా సైన్యాలు యెరూషలేమును చుట్టుముట్టడాన్ని చూసినప్పుడు పారిపోవాల్సిన సమయం వచ్చిందని వారు గుర్తించారు. (మత్త. 24:15, 16) క్రైస్తవ చరిత్రకారుడైన యూసేబియస్‌ ప్రకారం, యేసు ఇచ్చిన ప్రవచనార్థక హెచ్చరికను విన్న క్రైస్తవులు యెరూషలేము పట్టణం నాశనం చేయబడడానికి ముందే అక్కడి నుండి పారిపోయి గిలాదు పర్వత ప్రాంతంలోవున్న పెల్లా అనే పట్టణంలో స్థిరపడ్డారు. అలా, వారు యెరూషలేము చరిత్రలో జరిగిన ఘోర విపత్తును తప్పించుకున్నారు.

18, 19. (ఎ) మనం ఇప్పుడు విధేయత చూపించడం ఎందుకు చాలా ప్రాముఖ్యం? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి పరిశీలిస్తాం?

18 కనీవినీ ఎరుగని స్థాయిలో ఉండే ‘మహాశ్రమల’ గురించి యేసు చెప్పిన ప్రవచనానికి సంబంధించిన గొప్ప నెరవేర్పు సమీపంలో ఉంది. కాబట్టి, పరిణతి సాధించడంవల్ల మనం కనబరిచే విధేయత మన ప్రాణాలను కూడా కాపాడుతుంది. (మత్త. 24:21) భవిష్యత్తులో ‘నమ్మకమైన గృహనిర్వాహకుని’ నుండి వచ్చే ఎలాంటి అత్యవసరమైన సూచనలకైనా మనం విధేయత చూపిస్తామా? (లూకా 12:42) ‘హృదయపూర్వకంగా విధేయత’ చూపించడాన్ని నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యం!—రోమా. 6:17.

19 మనం పరిణతి సాధించాలంటే మన జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవాలి. దేవుని వాక్యంతో సుపరిచితులం కావడానికి, విధేయత నేర్చుకోవడానికి కృషిచేయడం ద్వారా మనం అలా సాధకం చేసుకోవచ్చు. క్రైస్తవ పరిణతి సాధిస్తుండగా యౌవనస్థులు ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటారు. అలాంటి సవాళ్లను ఎలా అధిగమించవచ్చో తర్వాతి ఆర్టికల్‌ వివరిస్తుంది.

[అధస్సూచీలు]

^ పేరా 7 కొన్ని పేర్లను మార్చాం.

^ పేరా 14 కావలికోట అక్టోబరు 1, 1999 సంచికలోని “తప్పు చేయడానికి తిరస్కరించేంత ధైర్యం కలిగివుండటం” అనే ఆర్టికల్‌ చూడండి.

మీరేమి నేర్చుకున్నారు?

• క్రైస్తవ పరిణతి అంటే ఏమిటి? మనం దాన్ని ఎలా సాధించవచ్చు?

• దేవుని వాక్యంతో సుపరిచితులం కావడంవల్ల ఎలా పరిణతి సాధించగలం?

• మనం విధేయతను ఎలా నేర్చుకోవచ్చు?

• పరిణతి సాధించడంవల్ల ఏయే విధాలుగా మనం ప్రయోజనం పొందుతాం?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రం]

బైబిలు ఉపదేశాన్ని అన్వయించుకుంటే పరిణతితో సమస్యలను అధిగమించగలుగుతాం

[12, 13వ పేజీలోని చిత్రం]

తొలి క్రైస్తవులు యేసు ఉపదేశాన్ని అనుసరించడంవల్ల తమ ప్రాణాలను దక్కించుకోగలిగారు