కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మౌనము వహించుటకొక సమయము”

“మౌనము వహించుటకొక సమయము”

“మౌనము వహించుటకొక సమయము”

“మాట వెండి, మౌనము బంగారం.” ఇది, ప్రాచ్య దేశాలకు చెందినదని చెప్పబడే ఒక పాత సామెత. దానివంటి ఒక తెలుగు సామెత, “మౌనంకంటే బలమైనది లేదు” అని చెబుతోంది. అలాగే ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన జ్ఞానవంతుడైన సొలొమోను రాజు ఇలా రాశాడు, “లోకములో ప్రతికార్యమునకును అనువైన సమయము ఒకటి కలదు . . . మౌనము వహించుటకొక సమయము, మాటలాడుటకొక సమయము కలదు.”—ప్రసం. 3:1, 7 పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము.

అయితే మాటలాడడం కంటే మౌనముగా ఉండడం ఎప్పుడు తగినది? “మౌనముగా ఉండడం,” “ఊరకుండడం” అనే పదాలు బైబిల్లో వంద కంటే ఎక్కువసార్లు కనిపిస్తాయి. ఈ పదాలు ఉపయోగించబడిన సందర్భం, జీవితంలోని కనీసం మూడు అంశాల్లో మౌనముగా ఉండడంలోని ఔచిత్యాన్ని తెలియజేస్తుంది. గౌరవానికి గుర్తుగా, జ్ఞానవివేచనలకు నిదర్శనంగా, ధ్యానానికి సహాయకంగా ఉండే మౌనాన్ని మనం మరింత నిశితంగా పరిశీలిద్దాం.

గౌరవానికి గుర్తు

మౌనంగా ఉండడం గౌరవం లేదా మర్యాద చూపించడాన్ని సూచిస్తుంది. “యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక” అని హబక్కూకు ప్రవక్త చెప్పాడు. (హబ. 2:20) సత్యారాధకులు “యెహోవా అనుగ్రహించు రక్షణకొరకు ఓపికతో [‘మౌనముగా,’ NW] కనిపెట్టుట మంచిది.” (విలా. 3:26) కీర్తనకర్త ఇలా పాడాడు, “యెహోవా యెదుట మౌనముగానుండి ఆయనకొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమున వర్ధిల్లువాని చూచి వ్యసనపడకుము.”—కీర్త. 37:7.

మాటలు ఉపయోగించకుండా మనం యెహోవాను స్తుతించగలమా? సృష్టిలోని అందాలను చూసినప్పుడు మనం కొన్నిసార్లు అమితాశ్చర్యానికి లోనై నోటమాటరాకుండా ఉండిపోమా? అలాంటి మహిమాన్విత సృష్టి గురించి ఆలోచించడం మన హృదయాల్లో సృష్టికర్తను స్తుతించడమే కాదా? కీర్తనకర్తయైన దావీదు తాను రాసిన స్తుతిగీతాల్లో ఒకదాన్ని ఇలా ప్రారంభించాడు, “దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే. నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది.”—కీర్త. 65:1.

యెహోవా మన గౌరవాన్ని పొందడానికి అర్హుడైనట్లుగానే ఆయన మాటలు కూడా గౌరవార్హమైనవే. ఉదాహరణకు, దేవుని ప్రవక్తయైన మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి చివరిసారిగా మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న ప్రతీ ఒక్కరికీ ఆయన, యాజకులు ఇలా ఉద్బోధించారు, ‘మీరు ఊరకుండి మీ దేవుడైన యెహోవా మాట వినుడి.’ ఇశ్రాయేలీయులు దేవుని ధర్మశాస్త్రం చదవబడడాన్ని వినేందుకు సమకూడినప్పుడు వారి పిల్లలు కూడా శ్రద్ధగా వినాలి. “పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి . . . నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను” అని మోషే చెప్పాడు.—ద్వితీ. 27:9, 10; 31:11, 12.

మన కాలాల్లో యెహోవా ఆరాధకులు, పెద్ద పెద్ద సమావేశాలతో సహా క్రైస్తవ కూటాల్లో ఇవ్వబడే ఉపదేశాన్ని గౌరవపూర్వకంగా వినడం ఎంత సముచితమైనదో కదా! ప్రసంగీకులు ప్రాముఖ్యమైన బైబిలు సత్యాలను తెలియజేస్తున్నప్పుడు మనం అనవసరంగా ఒకరితో ఒకరం మాట్లాడుకోవడం దేవుని వాక్యం పట్ల, ఆయన సంస్థ పట్ల అగౌరవాన్ని చూపించదా? కార్యక్రమం జరుగుతున్నప్పుడు మౌనముగా ఉండి, వినాలి.

ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అవతలి వ్యక్తి చెప్పేదాన్ని శ్రద్ధగా వినడం ద్వారా ఆ వ్యక్తిపట్ల గౌరవాన్ని చూపించాలి. ఉదాహరణకు, పితరుడైన యోబు తనను నిందిస్తున్నవాళ్ళతో ఇలా అన్నాడు, “నాకుపదేశము చేయుడి, నేను మౌనినై యుండెదను.” వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు యోబు మౌనముగా వినడానికి ఇష్టపడ్డాడు. ఆయన మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు, “నేను మాటలాడెదను, నా జోలికి రాక మౌనులైయుండుడి” అని విజ్ఞప్తి చేశాడు.—యోబు 6:24; 13:13.

జ్ఞానవివేచనలకు నిదర్శనం

బైబిలు ఇలా చెబుతోంది, “తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.” “వివేకియైనవాడు మౌనముగా నుండును.” (సామె. 10:19; 11:12) యేసు మౌనముగా ఉండడం ద్వారా జ్ఞానవివేచనలను ఎంత రమ్యంగా ప్రదర్శించాడో పరిశీలించండి. తనపై కోపంతోవున్న తన శత్రువులతో మాట్లాడడంలో ప్రయోజనమేమీలేదని గ్రహించినప్పుడు “యేసు ఊరకుండెను.” (మత్త. 26:62) ఆ తర్వాత పిలాతు ఎదుట విచారణ చేయబడుతున్నప్పుడు యేసు “ప్రత్యుత్తరమేమియు ఇయ్యలేదు.” ఆయన వివేచనతో, అందరికీ తెలిసేలా తాను చేసిన క్రియలే తన గురించి తెలియజేయడానికి అనుమతించాడు.—మత్త. 27:11-14.

మనం కూడా, ప్రాముఖ్యంగా ఇతరులు మనలను రెచ్చగొడుతున్నప్పుడు మౌనముగా ఉండడం జ్ఞానయుక్తమైనది. ఒక సామెత ఇలా చెబుతోంది, “దీర్ఘశాంతముగలవాడు మహా వివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును.” (సామె. 14:29) ఏదైనా కష్టతరమైన పరిస్థితుల్లో అనాలోచితంగా జవాబిస్తే దానిగురించి ఆ తర్వాత ఎంతో విచారించవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మన మాటలు మూర్ఖంగా అనిపిస్తాయి, ఫలితంగా మనకు మనశ్శాంతి లేకుండా పోతుంది.

దుష్టుల మధ్య ఉన్నప్పుడు మనం మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండడం వివేకవంతమైనది. పరిచర్య చేస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా అపహసిస్తే మౌనముగా ఉంటేనే వాళ్ళకు సరైన సమాధానం ఇచ్చినట్లవుతుంది. అంతేగాక మన తోటి విద్యార్థులు గానీ, తోటి పనివాళ్ళు గానీ అశ్లీలమైన జోకులు చెప్పినప్పుడు, అసభ్య పదజాలాన్ని ఉపయోగించినప్పుడు, వాటిని ఆమోదిస్తున్నట్లుగా సూచించకుండా ఉండేందుకుగాను మౌనముగా ఉండడం కొన్నిసార్లు జ్ఞానయుక్తమైనది కాదా? (ఎఫె. 5:3) “భక్తిహీనులు నా యెదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును” అని కీర్తనకర్త రాశాడు.—కీర్త. 39:1.

“వివేకియైనవాడు” నమ్మకద్రోహం చేయడు. (సామె. 11:12) నిజ క్రైస్తవుడు ఆంతరంగిక విషయాలను ఇతరులకు వెల్లడి చేయకుండా జాగ్రత్త వహిస్తాడు. ప్రాముఖ్యంగా క్రైస్తవ పెద్దలు ఈ విషయంలో జాగ్రత్త వహిస్తూ, సంఘ సభ్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకోవాలి.

మౌనానికి భాష లేకపోయినా అది మంచి ప్రభావాన్ని చూపించగలదు. పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన సిడ్నీ స్మిత్‌ అనే ఆంగ్ల రచయిత తన సమకాలీనుల్లో ఒకరి గురించి ఇలా రాశాడు, “ఆయన అప్పుడప్పుడూ మౌనముగా ఉండిపోతాడు, అందుకే ఆయనతో సంభాషించడం ఎంతో బావుంటుంది.” నిజానికి ఇద్దరు స్నేహితుల మధ్య రోజూ జరిగే సంభాషణలో ఇద్దరూ మాట్లాడాలి. బాగా వినేవ్యక్తే చక్కగా సంభాషించగలుగుతాడు.

సొలొమోను ఇలా హెచ్చరించాడు “విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.” (సామె. 10:19) కాబట్టి ఎంత తక్కువగా మాట్లాడితే, బుద్ధిహీనమైన మాటలు మాట్లాడే అవకాశం అంత తక్కువగా ఉంటుంది. నిజానికి, “ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన యెడల జ్ఞాని అని యెంచబడును. అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని యెంచబడును.” (సామె. 17:28) కాబట్టి “పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము” అని మనం ప్రార్థనలో యెహోవాను అడుగుదాం.—కీర్త. 141:3.

ధ్యానానికి సహాయకం

నీతి మార్గాన్ని అనుసరించే వ్యక్తి, ‘యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానిస్తాడు [“లోగొంతుకతో చదువుతాడు,” NW]’ అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. (కీర్త. 1:2) పవిత్ర గ్రంథము వ్యాఖ్యాన సహితంలో ఆ వచనం ఇలా ఉంది, ‘అతడు యెహోవా ఇచ్చిన ఉపదేశంలో ఆనందిస్తూ, దాన్ని రాత్రింబగళ్ళు ధ్యానిస్తాడు.’ అలా ధ్యానించడానికి ఎలాంటి పరిస్థితులు దోహదపడతాయి?

పితరుడైన అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ‘సాయంకాలమున పొలములో ధ్యానించడానికి వెళ్ళాడు.’ (ఆది. 24:63) ఆయన ధ్యానించడానికి ప్రశాంతమైన సమయాన్ని, స్థలాన్ని ఎంపిక చేసుకున్నాడు. దావీదు రాజు రాత్రిజాములలో ధ్యానించేవాడు. (కీర్త. 63:4) పరిపూర్ణ మానవుడైన యేసు, జనసమూహాల కోలాహలానికి దూరంగా పర్వతాలు, ఎడారులు, ఇతర ఏకాంత ప్రదేశాల్లో ప్రశాంతంగా ధ్యానించడానికి తీవ్రంగా కృషిచేశాడు.—మత్త. 14:23; లూకా 4:42; 5:16.

మౌనముగా ఉండడం వల్ల చేకూరే ప్రయోజనాలను మనం కాదనలేము. మౌనముగా ఉండడం మనల్ని మనం పరిశీలించుకోవడానికి తగిన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది, అది ఒక వ్యక్తిగా మనం మెరుగుపడడానికి ఎంతో ఆవశ్యకం. మౌనముగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన సమయాల్లో ధ్యానించడం మనలో వినమ్రత, అణకువ ఉత్పన్నమయ్యేలా చేయగలదు, అంతేగాక జీవితంలో నిజంగా ప్రాముఖ్యమైన వాటిపట్ల మెప్పును పెంచగలదు.

మౌనముగా ఉండడం ప్రయోజనకరమైనదే అయినా “మాటలాడుటకొక సమయము కలదు.” (ప్రసం. 3:7 పవిత్ర గ్రంథము, క్యాతలిక్‌ అనువాదము) సత్యారాధకులు నేడు దేవుని రాజ్యసువార్తను “లోకమందంతట” ప్రకటిస్తున్నారు. (మత్త. 24:14) ఆరాధకుల సంఖ్య పెరిగేకొద్దీ ఆనందంతో వాళ్ళుచేసే శబ్ద తీవ్రత కూడా అంతకంతకూ అధికమవుతోంది. (మీకా 2:12) అందుకే మనం కూడా రాజ్యసువార్త ఆసక్తితో ప్రకటిస్తూ దేవుని అద్భుతకార్యాల గురించి మాట్లాడదాం. ఈ ప్రాముఖ్యమైన పనిలో మనం భాగం వహిస్తుండగా, కొన్నిసార్లు మౌనము బంగారమేనని మనం గ్రహిస్తున్నామని చూపించేలా మన జీవన విధానం ఉండాలి.

[3వ పేజీలోని చిత్రం]

మన క్రైస్తవ కూటాల్లో మనం విని, నేర్చుకోవాలి

[4వ పేజీలోని చిత్రం]

పరిచర్య చేస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా దూషిస్తే మౌనముగా ఉండడమే సరైన సమాధానం కావచ్చు

[5వ పేజీలోని చిత్రం]

మౌనముగా ఉండడం ధ్యానించడానికి ఎంతో ఆవశ్యకం