కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సత్యారాధన పట్ల ఆసక్తి చూపించండి!

సత్యారాధన పట్ల ఆసక్తి చూపించండి!

సత్యారాధన పట్ల ఆసక్తి చూపించండి!

“నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించును.”—యోహా. 2:17.

1, 2. సా.శ. 30వ సంవత్సరంలో యేసు దేవాలయంలో ఏమి చేశాడు? ఆయన ఎందుకు అలా చేశాడు?

ఈ సంఘటనను ఊహించుకోండి. అది సా.శ. 30వ సంవత్సరం. యూదులు పస్కాపండుగ జరుపుకుంటున్నారు. అప్పటికి యేసు భూమ్మీద తన పరిచర్యను మొదలుపెట్టి ఆరు నెలలైంది. ఇప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్తున్నాడు. అక్కడ ఆయన అన్యుల ఆవరణములో, “ఎడ్లను గొఱ్ఱెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట” చూస్తాడు. తాళ్లతో చేసిన కొరడాతో ఆయన పశువులన్నిటినీ తోలేస్తాడు. దాంతో వ్యాపారులు కూడ బయటికి వెళ్లాల్సివస్తుంది. అంతేకాక యేసు రూకలు మార్చేవారి రూకలు కూడా చల్లేసి, వారి బల్లలను పడద్రోస్తాడు. పావురాలను అక్కడి నుండి తీసుకుపొమ్మని వాటిని అమ్మేవారికి ఆజ్ఞాపిస్తాడు.—యోహా. 2:13-16.

2 యేసు చేసినదాన్నిబట్టి ఆయనకు దేవాలయమంటే ఎంతో ఆసక్తివుందని తెలుస్తుంది. “నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి” అని ఆ వర్తకులకు ఆయన ఆజ్ఞాపిస్తాడు. జరిగినదంతా చూస్తున్న ఆయన శిష్యులు, “నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది” అని శతాబ్దాల క్రితం కీర్తనకర్త దావీదు రాసిన మాటలను గుర్తుచేసుకుంటారు.—యోహా. 2:16, 17; కీర్త. 69:9.

3. (ఎ) ఆసక్తి అంటే ఏమిటి? (బి) మనం ఏమని ప్రశ్నించుకోవాలి?

3 దేవుని ఇంటి విషయంలో ఆయనకు శ్రద్ధాసక్తులు ఉన్నాయి కాబట్టే ఆయనలా చేశాడు. “ఏదైనా ఒక పనిని మనస్ఫూర్తిగా చేయాలనే కోరిక, ఉత్సాహమే” ఆసక్తి. 21వ శతాబ్దంలో డెబ్భై లక్షలకన్నా ఎక్కువమంది సాక్షులు దేవుని ఇంటి విషయంలో అలాంటి కోరికే చూపిస్తున్నారు. ‘యెహోవా ఇంటి విషయంలో నా ఉత్సాహాన్ని ఎలా పెంచుకోవాలి?’ అని మనలో ప్రతీ ఒక్కరం ప్రశ్నించుకోవాలి. అలా ఎందుకు పెంచుకోవాలో తెలుసుకునేందుకు, మొదటిగా మన కాలంలో దేవుని ఇల్లు ఏమిటో చూద్దాం. ఆ తర్వాత, యెహోవా ఇంటిపట్ల ఆసక్తి చూపించిన నమ్మకస్థులైన దేవుని సేవకుల ఉదాహరణలను పరిశీలిద్దాం. “మనకు బోధ కలుగు నిమిత్తము” రాయబడిన వారి ఉదాహరణలు మరింత ఆసక్తి చూపించడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి.—రోమా. 15:4.

పూర్వకాలాల్లో, ఇప్పుడు దేవుని గృహం ఏది?

4. సొలొమోను కట్టించిన ఆలయం ఏయే విధాలుగా ఉపయోగించబడింది?

4 ప్రాచీన ఇశ్రాయేలులో, యెరూషలేము దేవాలయమే దేవుని గృహంగా ఉండేది. యెహోవా అక్షరాలా అక్కడ ఉండేవాడని కాదు. ఎందుకంటే, “ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?” అని ఆయన చెప్పాడు. (యెష. 66:1) అయినా, సొలొమోను తన పరిపాలనలో కట్టించిన ఆ ఆలయం యెహోవా ఆరాధనకు కేంద్రబిందువైంది. అక్కడికి వచ్చి ప్రజలు ప్రార్థనలు చేసేవారు.—1 రాజు. 8:27-30.

5. సొలొమోను దేవాలయానికి ఇప్పుడున్న ఏ ఏర్పాటు ముంగుర్తుగా ఉంది?

5 మన కాలంలో దేవుని గృహం యెరూషలేములోనో మరోచోటనో నిర్మించబడిన ఓ రాతికట్టడం కాదు. బదులుగా, అది క్రీస్తు విమోచన క్రయధన బలి ఆధారంగా దేవుణ్ణి ఆరాధించేందుకు చేయబడిన ఏర్పాటు. భూమ్మీదున్న నమ్మకస్థులైన దేవుని సేవకులందరూ యెహోవాను ఆరాధించేందుకు ఈ ఆధ్యాత్మిక ఆలయంలోకి వస్తారు.—యెష. 60:4, 8, 13; అపొ. 17:24; హెబ్రీ. 8:5; 9:24.

6. ఏ యూదా రాజులు సత్యారాధనపట్ల ఎంతో ఆసక్తి చూపించారు?

6 సా.శ.పూ. 997లో ఇశ్రాయేలు రెండు రాజ్యాలుగా విడిపోయిన తర్వాత దక్షిణభాగంలో ఉన్న యూదాను పంతొమ్మిదిమంది రాజులు పరిపాలించారు. వారిలో నలుగురు రాజులు అంటే ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, యోషీయాలు సత్యారాధనపట్ల ఎంతో ఆసక్తిని చూపించారు. వారి ఉదాహరణల నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు?

నిండు హృదయంతో సేవచేసి ఆశీర్వాదాలు పొందారు

7, 8. (ఎ) యెహోవా మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఆయనను ఎలా ఆరాధించాలి? (బి) ఆసా రాజు ఉదాహరణలో మనకు ఏ హెచ్చరిక ఉంది?

7 ఆసా రాజుగా ఉన్నప్పుడు, ప్రజలు తనకు నమ్మకంగా ఉండేలా వారికి కావాల్సిన నిర్దేశాలను ఇచ్చేందుకు యెహోవా ప్రవక్తలను పంపించాడు. ఉదాహరణకు, ఓదేదు కుమారుడైన అజర్యా ప్రవక్త మాటలను ఆసా విన్నాడని బైబిలు చెబుతోంది. (2 దినవృత్తాంతములు 15:1-8 చదవండి.) ఆసా చేసిన మార్పులవల్ల యూదా ప్రజలతోపాటు, ఇశ్రాయేలు రాజ్యంలోని అనేకమంది ఒకే తాటి మీదకు వచ్చారు. వారందరూ యెరూషలేములో ఏర్పాటు చేయబడిన పెద్ద సమావేశానికి వచ్చారు. యెహోవాను నమ్మకంగా ఆరాధించాలనే తమ కృతనిశ్చయాన్ని వారందరూ తెలియజేశారు. “వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణముచేసిరి. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతోషించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను” అని బైబిలు చెబుతోంది. (2 దిన. 15:9-15) యెహోవాను మనం నిండుహృదయంతో ఆరాధిస్తే ఆయన వారిని ఆశీర్వదించినట్లే మనల్నీ ఆశీర్వదిస్తాడు.—మార్కు 12:30.

8 విచారకరంగా, కొంతకాలం తర్వాత దీర్ఘదర్శియైన హనానీ తనను సరిదిద్దినందుకు ఆసా కోపగించుకున్నాడు. (2 దిన. 16:7-10) యెహోవా క్రైస్తవ పెద్దలను ఉపయోగించి మనకు సలహా గానీ నిర్దేశం గానీ ఇచ్చినప్పుడు మనం ఎలా స్పందిస్తున్నాం? కోపగించుకోకుండా వారు చెప్పింది విని, వెంటనే పాటిస్తున్నామా?

9. యెహోషాపాతుకు, యూదావారికి ఎవరి నుండి ప్రమాదం ఎదురైంది? అప్పుడు వారేమి చేశారు?

9 సా.శ.పూ. పదవ శతాబ్దంలో యెహోషాపాతు యూదాను పరిపాలించాడు. అప్పుడు ఆయనకూ యూదావారికీ అమ్మోనీయుల, మోయాబీయుల, శేయీరు మన్యవాసుల సంకీర్ణ దళాల నుండి ప్రమాదం ఎదురైంది. యెహోషాపాతుకు భయమేసినా ఆయన ఏమి చేశాడు? భార్యాపిల్లలతోసహా యూదాలోని పురుషులు ఆయనతోపాటు ప్రార్థించేందుకు యెహోవా ఇంట్లో సమకూడారు. (2 దినవృత్తాంతములు 20:3-6 చదవండి.) దేవాలయ ప్రతిష్ఠాపన జరిగినప్పుడు సొలొమోను చెప్పినట్లే, యెహోషాపాతు యెహోవాను ఇలా వేడుకున్నాడు: “మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు.” (2 దిన. 20:12, 13) యెహోషాపాతు “సమాజములో” అలా ప్రార్థించిన తర్వాత, యెహోవా ఆత్మ ప్రేరణతో లేవీయుడైన యహజీయేలు ప్రజలను ఓదార్చి వారిలో ధైర్యాన్ని నింపే మాటలు చెప్పాడు.—2 దినవృత్తాంతములు 20:14-17 చదవండి.

10. (ఎ) యెహోషాపాతుకు, యూదావారికి కావాల్సిన నిర్దేశాన్ని యెహోవా ఎలా ఇచ్చాడు? (బి) మన కాలంలో యెహోవా ఇస్తున్న నిర్దేశానికి మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?

10 ఆ రోజు యహజీయేలు ద్వారా యెహోషాపాతుకు, యూదావారికి కావాల్సిన నిర్దేశాన్ని యెహోవా ఇచ్చాడు. మన కాలంలో నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతి ద్వారా మనకు కావాల్సిన ఓదార్పును, నిర్దేశాన్ని యెహోవా ఇస్తున్నాడు. కాబట్టి, కాపరి పనిచేసేందుకు, “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” నిర్దేశాలను అమలుపరిచేందుకు కష్టపడి పనిచేస్తున్న సంఘ పెద్దలకు ఎప్పుడూ సహకరిస్తూ వారిని గౌరవించాలి.—మత్త. 24:45; 1 థెస్స. 5:12, 13.

11, 12. యెహోషాపాతుకు, యూదావారికి జరిగినదాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

11 యెహోషాపాతు, ఆయన ప్రజలు యెహోవా నిర్దేశం కోసం సమకూడినట్లే మనమూ సంఘ కూటాలను నిర్లక్ష్యం చేయకుండా క్రమంగా మన సహోదరసహోదరీలతో సమకూడదాం. తీవ్ర సమస్యలతో సతమతమౌతూ ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఎదురైనప్పుడు మనం యెహోషాపాతు, యూదావారు ఉంచిన మంచి మాదిరిని అనుసరిద్దాం. వారిలాగే మనం కూడా పూర్తి నమ్మకంతో యెహోవాకు ప్రార్థిద్దాం. (సామె. 3:5, 6; ఫిలి. 4:6, 7) మనం సహోదరుల నుండి వేరుచేయబడినా ఒంటరివారం కామని యెహోవాకు విన్నవించుకుంటే మనం ‘లోకమందున్న సహోదరత్వంలో’ భాగంగానే ఉన్నామని మనకు అనిపిస్తుంది.—1 పేతు. 5:9, NW.

12 యెహోషాపాతు, ఆయన ప్రజలు యహజీయేలు ద్వారా యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని అనుసరించారు. వారు అనుసరించినప్పుడు ఏమైంది? ఆ తర్వాత జరిగిన యుద్ధంలో వారు విజయం సాధించి “ఉత్సవముతో” యెరూషలేములోని “యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచు” వచ్చారు. (2 దిన. 20:27, 28) వారిలాగే మనమూ యెహోవా తన సంస్థ ద్వారా ఇచ్చే నిర్దేశాన్ని గౌరవించి మన సహోదరులతో కలిసి ఆయనను స్తుతించాలి.

కూటాలు జరిగే స్థలాలను బాగా చూసుకోండి

13. హిజ్కియా తన పరిపాలన ఆరంభంలో ఏ పనిని మొదలుపెట్టాడు?

13 హిజ్కియా తన పరిపాలనలోని మొదటి నెలలో యెహోవా ఆలయాన్ని తెరిపించి దాన్ని బాగుచేయించి యెహోవా ఆరాధనపట్ల తనకు ఎంత ఆసక్తి ఉందో చూపించాడు. ఆయన దేవుని గృహాన్ని పవిత్రపరిచే పనిని యాజకులకు, లేవీయులకు అప్పగించాడు. వారు ఆ పనిని 16 రోజుల్లో పూర్తిచేశారు. (2 దినవృత్తాంతములు 29:16-18 చదవండి.) వారు చేసిన కృషి మనం కూటాలు జరుపుకునే స్థలాలను చక్కగా ఉంచేందుకు చేయబడే నిర్వహణ పనిని, మరమ్మత్తులను గుర్తుచేస్తుంది. ఆ పనులు యెహోవా ఆరాధనపట్ల మనకు ఆసక్తి ఉందని చూపిస్తుంది. అలాంటి పనుల్లో పాల్గొనే సహోదరసహోదరీల ఉత్సాహాన్ని చూసినవారు ముగ్ధులయ్యారని చూపించే ఉదాహరణలు మీరు వినేవుంటారు. ఆ సహోదరసహోదరీలు చేసిన కృషి యెహోవాను ఎంతో ఘనపరుస్తుంది.

14, 15. ఈ రోజుల్లో ఏ పని యెహోవాను ఎంతో ఘనపరుస్తోంది? ఉదాహరణలు చెప్పండి.

14 ఉత్తర ఇంగ్లండ్‌లోని ఒక నగరంలో సహోదరులు రాజ్యమందిరానికి మరమ్మత్తు చేయాలనుకున్నారు. అప్పుడు పక్కింటాయన దాన్ని వ్యతిరేకించాడు. అయినా అక్కడి సహోదరులు ఆయనపట్ల దయతో వ్యవహరించారు. రాజ్యమందిరానికీ, ఆయన ఇంటికీ మధ్యవున్న గోడకు మరమ్మత్తులు చేయాల్సివుందని వారు గుర్తించి, డబ్బులు ఏమీ తీసుకోకుండానే ఆ పని పూర్తిచేస్తామని ఆయనకు చెప్పారు. సహోదరులు రిపేరు పని మాత్రమే కాదు, గోడలో చాలాభాగాన్ని తిరిగి కట్టారు. వారు ఆయనతో ఎంత చక్కగా ప్రవర్తించారంటే ఆ వ్యక్తి మనసు మారింది. ఇప్పుడు ఆయన రాజ్యమందిరాన్ని కనిపెట్టుకొని ఉంటున్నాడు.

15 యెహోవా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా నిర్మాణపనుల్లో పాల్గొంటున్నారు. పూర్తికాల అంతర్జాతీయ సేవకులతో కలిసి రాజ్యమందిరాలతోపాటు, సమావేశ స్థలాలను, బెతెల్‌ గృహాలను నిర్మించేందుకు స్థానిక సహోదరులు ఇష్టపూర్వకంగా ముందుకు వస్తున్నారు. సామ్‌, ఆయన భార్య రూత్‌ నిర్మాణ పనుల్లో చేయూతనివ్వడానికి యూరప్‌, ఆఫ్రికా ఖండాల్లోని అనేక దేశాలకు వెళ్లారు. అంతేకాక, వారెక్కడికి వెళ్లినా, స్థానిక సంఘంలోని సహోదరులతో కలిసి పనిచేస్తారు. దేశదేశాలకు వెళ్లి అలాంటి పనుల్లో పాల్గొనడానికి తనను ఏది ప్రోత్సహించిందో వివరించాడు. “మా దేశంలో, వేరే దేశాల్లో సేవచేసిన బెతెల్‌ సభ్యులు నన్ను ఈ విషయంలో ప్రోత్సహించారు. వారి ఆసక్తిని, ఆనందాన్ని చూసి యెహోవాకు ఈ విధంగా సేవచేయాలని నేను అనుకున్నాను” అని ఆయన చెప్పాడు.

దేవుని నిర్దేశాలకు లోబడండి

16, 17. ఏ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో దేవుని ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు? దాని ఫలితమేమిటి?

16 హిజ్కియా ఆలయ మరమ్మత్తులనే కాక, యెహోవా ఆజ్ఞ ప్రకారం పస్కా పండుగను ఆచరించడాన్ని తిరిగి ఆరంభించాడు. (2 దినవృత్తాంతములు 30:1, 4, 5 చదవండి.) హిజ్కియా, యెరూషలేమువాసులతో కలిసి ఉత్తర రాజ్యవాసులతోపాటు ఇశ్రాయేలు జనాంగానంతటినీ ఆహ్వానించాడు. అంచెవాండ్రు లేదా దూతలు దేశమంతటా ఆ ఆహ్వానాన్ని అందించారు.—2 దిన. 30:6-9.

17 గత కొన్ని సంవత్సరాల్లో మనం కూడ అలాంటి పనే చేశాం. ఆకర్షణీయమైన ఆహ్వానపత్రికలను ఇచ్చి, మనతో కలిసి యేసు ఆజ్ఞాపించినట్లు ప్రభువు రాత్రి భోజనాన్ని ఆచరించమని మన ప్రాంతంలోని ప్రజలను ఆహ్వానించాం. (లూకా 22:19, 20) సేవాకూటాల్లో మనకు ఇవ్వబడిన నిర్దేశాలను పాటించి మనం ఉత్సాహంగా వాటిని అందించాం. యెహోవా మన కృషిని ఎంతగా ఆశీర్వదించాడు! అంతెందుకు, గత సంవత్సరంలోనే దాదాపు డెబ్భై లక్షలమందిమి ఆ ఆహ్వాన పత్రికలను పంచిపెడితే, 1,77,90,631 మంది దానికి హాజరయ్యారు!

18. మీరు సత్యారాధనపట్ల ఆసక్తి చూపించడం ఎందుకు ప్రాముఖ్యం?

18 హిజ్కియా గురించి బైబిల్లో ఇలా చెప్పబడింది: “అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు; అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వికులైన రాజులలోను అతనితో సమమైనవాడు ఒకడునులేడు. అతడు యెహోవాతో హత్తుకొని, ఆయనను వెంబడించుటలో వెనుకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను.” (2 రాజు. 18:5, 6) మనమూ ఆయనలాగే చేద్దాం. మనకూ దేవుని ఇంటిపట్ల ఆసక్తి ఉన్నట్లయితే నిత్యజీవాన్ని మనసులో ఉంచుకొని ‘యెహోవాను హత్తుకొని’ ఉండగలుగుతాం.—ద్వితీ. 30:16.

నిర్దేశాలను వెంటనే పాటించండి

19. జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో సహోదరులు ఉత్సాహంగా ఎలాంటి కృషి చేస్తారు?

19 యోషీయా కూడ తన పరిపాలనలో పస్కా పండుగ ఆచరించడానికి ఎన్నో ఏర్పాట్లు చేశాడు. (2 రాజు. 23:21-23; 2 దిన. 35:1-19) జిల్లా సమావేశాలు, మరితర సమావేశాలతోపాటు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేందుకు మనమూ ఏర్పాట్లు చేసుకుంటాం. కొన్ని దేశాల్లో మన సహోదరులు తమ ప్రాణాలను కూడ లెక్కచేయకుండా క్రీస్తు మరణ జ్ఞాపకార్థానికి హాజరౌతారు. ఉత్సాహంగల పెద్దలు సంఘంలో ప్రతీ ఒక్కరూ హాజరయ్యేలా చూస్తారు. దానికి హాజరయ్యేలా వృద్ధులకు, అనారోగ్యంతో ఉన్నవారికి వారు సహాయం చేస్తారు.

20. (ఎ) యోషీయా రాజు పరిపాలనలో ఏమి జరిగింది? అప్పుడు ఆయన ఏమి చేశాడు? (బి) మనం ఏ పాఠాన్ని గుర్తుంచుకోవాలి?

20 యోషీయా రాజు ఆలయాన్ని బాగుచేయిస్తున్నప్పుడు “మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము” యాజకుడైన హిల్కీయాకు కనబడింది. ఆయన దాన్ని రాజు దగ్గర శాస్త్రిగా పనిచేస్తున్న షాఫానుకు ఇస్తే, షాఫాను దాన్ని యోషీయాకు చదివి వినిపించాడు. (2 దినవృత్తాంతములు 34:14-18 చదవండి.) దాన్ని విన్న తర్వాత రాజు ఏమి చేశాడు? ఆయన బాధతో వెంటనే తన వస్త్రాలను చింపుకొని యెహోవా దగ్గర విచారించమని తన మనుష్యులకు చెప్పాడు. యూదాలో జరుగుతున్న కొన్ని మతాచారాలను ఖండిస్తున్నానని దేవుడు హుల్దా అనే ప్రవక్త్రిని ద్వారా తెలియజేశాడు. అయినా, విగ్రహారాధనను తీసివేయడానికి యోషీయా చేసిన కృషిని యెహోవా గమనించాడు. యెహోవా ఆ జనాంగమంతటిమీద విపత్తులు వస్తాయని ప్రవచించినా, యోషీయామీద మాత్రం తన అనుగ్రహాన్ని చూపించాడు. (2 దిన. 34:19-28) మనం దీని నుండి ఏమి నేర్చుకోవచ్చు? మనమూ యోషీయాలాగే ఉండాలని తప్పకుండా కోరుకుంటాం. ఆరాధనలో మతభ్రష్టత్వాన్ని అనుమతించి, అవిశ్వాసులుగా మారితే ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో జాగ్రత్తగా గుర్తుంచుకొని యెహోవా నిర్దేశాన్ని వెంటనే పాటించాలి. యోషీయా విషయంలో జరిగినట్లే సత్యారాధనపట్ల మనకున్న ఆసక్తిని యెహోవా అనుగ్రహంతో చూస్తాడనే నమ్మకంతో మనం ఉండొచ్చు.

21, 22. (ఎ) యెహోవా ఇంటి విషయంలో మనం ఎందుకు ఉత్సాహం చూపించాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి తెలుసుకుంటాం?

21 ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, యోషీయా అనే ఆ నలుగురు యూదా రాజులు దేవుని ఇంటిపట్ల, ఆరాధనపట్ల ఆసక్తి చూపించే విషయంలో మంచి మాదిరిని ఉంచారు. మనం కూడ అలాంటి ఆసక్తితో యెహోవా మీద నమ్మకముంచి ఆయనను ఆరాధించడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. దేవుని నిర్దేశాలకు లోబడాలి. సంఘం, పెద్దలు ప్రేమతో మనల్ని సరిదిద్దినప్పుడు దాన్ని స్వీకరించాలి. అలా చేయడం తెలివైన పని. దానివల్ల మనం సంతోషంగా ఉంటాం.

22 తర్వాతి ఆర్టికల్‌లో, ప్రకటనా పనిలో మనం ఎలా ఆసక్తి చూపించాలో తెలుసుకుంటాం. అలాగే యౌవనస్థులు మన ప్రేమగల తండ్రిని ఉత్సాహంగా ఆరాధించేలా ఆ ఆర్టికల్‌ ప్రోత్సహిస్తుంది. సాతాను మనల్ని భ్రష్టుపట్టించడానికి ఎక్కువగా దేన్ని ఉపయోగిస్తున్నాడు, దాని నుండి మనం ఎలా దూరంగా ఉండవచ్చో కూడ వివరిస్తుంది. “నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది” అని స్వయాన యెహోవా కుమారుడైన యేసు గురించి బైబిలు చెబుతోంది. యెహోవా మనకు పదేపదే గుర్తుచేస్తున్న విషయాలను ఆసక్తితో పాటిస్తే యేసు మాదిరిని అనుసరించగలుగుతాం.—కీర్త. 69:9; 119:111, 129; 1 పేతు. 2:21.

మీకు గుర్తున్నాయా?

• యెహోవా ఆశీర్వదించాలంటే మనం ఎలా సేవచేయాలి?

• యెహోవాపట్ల మనకు నమ్మకముందని ఎలా చూపించవచ్చు?

• మనకు ఆసక్తి ఉంటే దేవుని నిర్దేశాలను ఎందుకు పాటిస్తాం?

[అధ్యయన ప్రశ్నలు]

[9వ పేజీలోని చిత్రాలు]

ఆసా, యెహోషాపాతు, హిజ్కియా, యోషీయాలు యెహోవా ఇంటిపట్ల ఎలా ఆసక్తిని చూపించారు?