కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నేను ఎంత విరాళం ఇవ్వాలి?

నేను ఎంత విరాళం ఇవ్వాలి?

మా పాఠకుల ప్రశ్న

నేను ఎంత విరాళం ఇవ్వాలి?

“దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.” (2 కొరింథీయులు 9:7) ఈ మాటలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందికి తెలుసు. అయితే, చర్చీలకు వెళ్లే కొందరు తమ శక్తికిమించి విరాళమివ్వాల్సిన బాధ్యత తమకుందనుకుంటారు. నిజానికి, కొన్ని మతశాఖలు తమ సభ్యులు ఖచ్చితంగా ఇంత విరాళమివ్వాలని చెబుతాయి. దానిని దశమ భాగం ఇవ్వడమంటారు అంటే ఒక వ్యక్తి రాబడిలో పది శాతం చర్చీకి ఇవ్వాలి.

అలా మనం ఖచ్చితంగా ఇంత విరాళమివ్వాలని బైబిలు నిజంగా చెబుతోందా? ‘నేను ఎంత విరాళం ఇవ్వాలి?’ అని మీరు ఆలోచిస్తుండవచ్చు.

పూర్వకాలంలో స్వచ్ఛంద విరాళాలు, వాటికి సంబంధించిన నియమాలు

ఇశ్రాయేలు జనాంగం ఎంత విరాళం ఇవ్వాలో వివరిస్తూ దేవుడు వారికి ఇచ్చిన స్పష్టమైన నియమాలు బైబిల్లో ఉన్నాయి. (లేవీయకాండము 27:30-32; సంఖ్యాకాండము 18:21, 24; ద్వితీయోపదేశకాండము 12:4-7, 11, 17, 18; 14:22-27) ఇవి ఇవ్వడం వారికి భారమేమి కాదు. ఆ జనాంగం ఈ నియమాలు పాటిస్తే, వారికి ‘సమృద్ధిగా మేలు కలుగుతుందని’ యెహోవా వాగ్దానం చేశాడు.—ద్వితీయోపదేశకాండము 28:1, 2, 11, 12.

ఇతర సందర్భాల్లో, ఇశ్రాయేలీయులు ఎంత ఎక్కువైనా, ఎంత తక్కువైనా వారికి నచ్చినంత విరాళం స్వచ్ఛందంగా ఇవ్వొచ్చు. ఉదాహరణకు, దావీదు రాజు యెహోవాకు ఆలయం నిర్మించాలని అనుకున్నప్పుడు, ప్రజలు “పదివేల మణుగుల బంగారము” విరాళంగా ఇచ్చారు. a (1 దినవృత్తాంతములు 29:7) యేసు భూమ్మీద ఉన్నప్పుడు దీనికి భిన్నమైన పరిస్థితిని గమనించాడు. దేవాలయపు కానుక పెట్టెలో ‘ఒక బీద విధవరాలు రెండు కాసులు’ వేయడం ఆయన చూశాడు. ఆమె వేసిన ఆ కాసుల విలువెంత? అది ఒక రోజు కూలిలో 64వ వంతు. అయినప్పటికీ, ఆమె వేసిన దానిని దేవుడు అంగీకరిస్తాడని యేసు అన్నాడు.—లూకా 21:1-4.

క్రైస్తవులు ఖచ్చితంగా ఇంతని ఇవ్వాలా?

క్రైస్తవులు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం కింద లేరు. కాబట్టి దేవునికి ఖచ్చితంగా ఇంత విరాళమివ్వాలనే నియమం వారికి లేదు. అయితే నిజ క్రైస్తవ సంఘంలో ఇవ్వడమనేది ఎంతో ఆనందాన్నిస్తుంది. “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసుక్రీస్తే చెప్పాడు.—అపొస్తలుల కార్యములు 20:35.

యెహోవాసాక్షులు తాము ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ప్రకటనా పనికోసం స్వచ్ఛందంగా విరాళాలిస్తారు. ఈ విరాళాలు, మీరిప్పుడు చదువుతున్న పత్రికలాంటి ప్రచురణలు ముద్రించడానికి, వారి ఆరాధనా స్థలాలైన రాజ్యమందిరాలు నిర్మించడానికి, వాటికి మరమ్మతులు చేయడానికి ఉపయోగించబడతాయి. ఈ విరాళాలు జీతాలు ఇవ్వడానికి ససేమిరా ఉపయోగించబడవు. శిష్యులను చేసే పనిలో పూర్తికాలం సేవచేయడానికి ముందుకొచ్చిన కొందరికి మాత్రం వారి ప్రయాణ ఖర్చుల కోసం, ఇతర వ్యక్తిగత ఖర్చుల కోసం కొంత డబ్బు ఇవ్వబడుతుంది. అయితే తమకు అలా డబ్బు ఇవ్వాల్సిందేనని ఎవరూ పట్టుబట్టరు. నిజానికి, యెహోవాసాక్షుల్లో ఎక్కువమందికి ప్రకటనా పని చేస్తున్నందుకు ఎలాంటి ఆర్థిక సహాయమూ లభించదు. వారిలో ఎక్కువశాతం మంది, గుడారాలు కుట్టే పనిచేసిన పౌలులాగే తమ పోషణార్థం ఉద్యోగాలు చేసుకుంటున్నారు.—2 కొరింథీయులు 11:9; 1 థెస్సలొనీకయులు 2:9.

యెహోవాసాక్షులు చేస్తున్న పనికి ఎవరైనా విరాళమివ్వాలనుకుంటే, ఎంత ఇవ్వాలి? అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”—2 కొరింథీయులు 8:12; 9:7. (w09 08/01)

[అధస్సూచి]

a 2008లో సగటున ఒక గ్రాము బంగారం ధర దాదాపు 1,500 రూపాయలు, ఈ లెక్కన ఆ బంగారం విలువ దాదాపు 479 కోట్ల 48 లక్షల 55 వేల అమెరికన్‌ డాలర్లు (23,000 కోట్లకంటే ఎక్కువ రూపాయలు).