కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’

‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’

‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’

“నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.”—యూదా 20, 21.

1, 2. యెహోవా మన పట్ల ఎలా ప్రేమను చూపించాడు? మనం ఏమి చేసినా యెహోవా మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడని ఎందుకు అనుకోకూడదు?

యెహోవా దేవుడు మనపట్ల లెక్కలేనన్ని విధాలుగా ప్రేమను చూపించాడు. అయితే నిస్సందేహంగా, విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేయడమే యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని అనడానికి అన్నిటికన్నా గొప్ప రుజువు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మన కోసం మరణించేలా తన ప్రియమైన కుమారుణ్ణి ఈ భూమ్మీదికి పంపించాడు. (యోహా. 3:16) మనం నిత్యం జీవించాలనీ ఆయన ప్రేమ వల్ల వచ్చే ప్రయోజనాలను మనం నిత్యమూ అనుభవించాలనీ కోరుకుంటున్నాడు కాబట్టే ఆయన ఆ ఏర్పాటు చేశాడు.

2 మనం ఏమి చేసినా యెహోవా మాత్రం మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడని అనుకోవచ్చా? లేదు. ఎందుకంటే మనం యూదా 20, 21 వచనాల్లో, “నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి” అని ఉపదేశించబడ్డాం. ఇక్కడ ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే మాట మనం కూడా చేయాల్సింది ఏదో ఉందని సూచిస్తోంది. అలాగైతే దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే ఏమి చేయాలి?

మనం దేవుని ప్రేమలో ఎలా నిలిచి ఉండవచ్చు?

3. తన తండ్రి ప్రేమలో నిలిచివుండాలంటే తాను ఏమి చేయాల్సివుందని యేసు చెప్పాడు?

3 తన భూజీవితంలోని చివరి రాత్రి యేసు చెప్పిన మాటల్లో ఆ ప్రశ్నకు జవాబును మనం కనుగొంటాం. “నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు” అని ఆయన అన్నాడు. (యోహా. 15:10) ఈ వచనాన్నిబట్టి మనం ఏమి చెప్పవచ్చు? తన తండ్రితో మంచి సంబంధం కాపాడుకోవాలంటే యెహోవా ఆజ్ఞలు పాటించాలనే విషయం యేసుకు తెలుసని మనం చెప్పవచ్చు. యెహోవా ఆజ్ఞలు పాటించడం దేవుని పరిపూర్ణ కుమారునికే అంత అవసరమైనప్పుడు అవి మనకు ఇంకెంత అవసరమో ఆలోచించండి.

4, 5. (ఎ) మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా చూపించవచ్చు? (బి) యెహోవా ఆజ్ఞలను తిరస్కరించడానికి ఏ కారణమూ లేదని ఎందుకు చెప్పవచ్చు?

4 ముఖ్యంగా, యెహోవాకు విధేయులముగా ఉండడం ద్వారా మనం ఆయనను ప్రేమిస్తున్నామని చూపిస్తాం. “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని అపొస్తలుడైన యోహాను చెప్పాడు. (1 యోహా. 5:3) సాధారణంగా, ఇతరులకు లోబడడానికి చాలామంది ఇష్టపడరు. అయితే, “ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అనే మాటలను గమనించండి. మనకు సాధ్యంకానివి చేయమని యెహోవా మనల్ని కోరడంలేదు.

5 ఉదాహరణకు, శక్తికి మించిన బరువును ఎత్తమని మీరు మీ ప్రాణ స్నేహితునికి చెబుతారా? చెప్పరు కదా. యెహోవా మనకన్నా ఎంతో దయగలవాడు, మన పరిమితులను బాగా అర్థం చేసుకోగలడు. యెహోవా, ‘మనం మంటివారమని జ్ఞాపకము చేసుకొంటున్నాడు’ అని బైబిలు హామీనిస్తోంది. (కీర్త. 103:14) మన శక్తికి మించినది చేయమని ఆయన ఎన్నడూ కోరడు. అంతేకాక, మనం యెహోవా ఆజ్ఞలను తిరస్కరించేందుకు మనకు ఏ కారణమూ లేదు. కాబట్టి, వాటిని తిరస్కరించే బదులు విధేయతను చూపిస్తాం. ఎందుకంటే అలా విధేయతను చూపించడం ద్వారా మన పరలోకపు తండ్రిని నిజంగా ప్రేమిస్తున్నామనీ ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని కోరుకుంటున్నామనీ చూపించే చక్కటి అవకాశం మనకు లభిస్తుంది.

యెహోవా ఇచ్చిన ప్రత్యేక వరం

6, 7. (ఎ) మనస్సాక్షి అంటే ఏమిటి? (బి) దేవుని ప్రేమలో నిలిచివుండేలా మనస్సాక్షి ఎలా సహాయం చేస్తుందో ఉదాహరించండి.

6 అనేక సమస్యలతో నిండివున్న ఈ లోకంలో మనం దేవునికి విధేయత చూపిస్తూ అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాలను యెహోవా ఇష్టపడతాడో లేదో ఎలా తెలుసుకోవచ్చు? విధేయత చూపించే విషయంలో మనకు సహాయం చేయడానికి యెహోవా మనస్సాక్షి అనే వరాన్ని ఇచ్చాడు. అసలు మనస్సాక్షి అంటే ఏమిటి? మన పనులను, ఆలోచనలను, నిర్ణయాలను విశ్లేషించుకునే సామర్థ్యమే మనస్సాక్షి. అది న్యాయమూర్తిలా మనలో పనిచేస్తుంది. దానివల్ల మనం జీవితంలో తీసుకోవాల్సిన నిర్ణయాలూ, లేక మనం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు మంచివో కావో తేల్చుకోగలుగుతాం.—రోమీయులకు 2:14, 15 చదవండి.

7 మన మనస్సాక్షి మనకు ఏయే విధాలుగా సహాయం చేస్తుంది? దీనిని అర్థం చేసుకునేందుకు ఒక ఉదాహరణ చూద్దాం. ఓ యాత్రికుడు కారడవిలో వెళ్తున్నాడనుకుందాం. ఆ అడవిలో అనువైన బాటగానీ, రోడ్డు గానీ, దారి చూపించే గుర్తులుగానీ లేవు. అయినా క్షేమంగా తన గమ్యాన్ని చేరుకుంటాడు. ఎలా? ఆయన దగ్గర దిక్సూచి అనే చిన్న పరికరం ఉంది. ఈ పరికరం నాలుగు దిక్కులను చూపిస్తుంటుంది. దానిలో అయస్కాంతపు ముల్లు ఎప్పుడూ ఉత్తర దిక్కును చూపిస్తుంటుంది. ఆ దిక్సూచే లేకపోతే ఎటువెళ్లాలో ఆ యాత్రికునికి దిక్కుతోచదు. అలాగే మానవులకు మనస్సాక్షే లేకపోతే నైతికతకు, నడవడికి, నీతికి సంబంధించిన విషయాల్లో ఏమి చేయాలో దిక్కుతోచదు.

8, 9. (ఎ) మన మనస్సాక్షికి ఉన్న ఏ పరిమితులను మన మనసులో ఉంచుకోవాలి? (బి) మన మనస్సాక్షివల్ల మనకు ప్రయోజనం ఉండాలంటే మనం ఏమి చేయాలి?

8 అయితే, దిక్సూచికున్నట్లే మన మనస్సాక్షికి పరిమితులు ఉన్నాయి. ఆ యాత్రికుడు దిక్సూచి దగ్గరగా అయస్కాంతాన్ని పెడితే ఆ అయస్కాంత ముల్లు ఉత్తర దిక్కు నుండి పక్కకు మళ్లుతుంది. అలాగే మన సొంత కోరికలకే మనం అధిక ప్రాధాన్యతనిస్తే ఏమౌతుంది? మన స్వార్థ కోరికలు మన మనస్సాక్షిని తప్పుదారిపట్టించవచ్చు. అందుకే, “హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది” అని బైబిలు మనల్ని హెచ్చరిస్తోంది. (యిర్మీ. 17:9; సామె. 4:23) అంతేకాక, యాత్రికుని దగ్గర ఖచ్చితమైన, నమ్మదగిన మ్యాపు లేకపోతే ఆయన దగ్గర దిక్సూచి ఉన్నా పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. అలాగే దేవుని వాక్యమైన బైబిల్లోని ఖచ్చితమైన, స్థిరమైన నిర్దేశాలను నమ్మకపోతే మన మనస్సాక్షి వల్ల పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చు. (కీర్త. 119:105) విచారకరంగా, లోకంలోని చాలామంది తమ కోరికలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వారు దేవుని వాక్య ప్రమాణాలను అంతగా పట్టించుకోరు. (ఎఫెసీయులకు 4:17-19 చదవండి.) అందుకే మనస్సాక్షివున్నా చాలామంది ఘోరమైన పనులను చేస్తుంటారు.—1 తిమో. 4:3.

9 మనం వారిలా ఎన్నడూ కాకూడదన్న కృతనిశ్చయంతో ఉండాలి. మనస్సాక్షి వల్ల మనకు మంచి ప్రయోజనం ఉండాలంటే, దేవుని వాక్య ప్రకారం దానికి శిక్షణనిస్తూ ఉందాం. మన స్వార్థపూరిత కోరికలకు లొంగిపోయే బదులు బైబిలు శిక్షిత మనస్సాక్షికి లోబడాలి. అదే సమయంలో, మనం మన ప్రియ సహోదరసహోదరీల మనస్సాక్షిని గౌరవించడానికి ప్రయత్నించాలి. మనకు తప్పనిపించని కొన్ని విషయాలు మన సహోదరుని తప్పనిపించవచ్చు. కాబట్టి, వారి మనస్సాక్షిని అభ్యంతరపెట్టకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ శాయశక్తులా కృషిచేస్తాం.—1 కొరిం. 8:12; 2 కొరిం. 4:2; 1 పేతు. 3:15, 16.

10. మనం ఏ మూడు విషయాలను ఇప్పుడు చర్చిస్తాం?

10 విధేయులముగా ఉండడం ద్వారా యెహోవాపట్ల మనకున్న ప్రేమను మన జీవితంలో మూడు విధాలుగా ఎలా చూపించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ మూడింటిలోనూ మనం మన మనస్సాక్షిని ఉపయోగించాలి. అయితే మన మనస్సాక్షి సరిగా పనిచేయాలంటే ప్రవర్తన విషయంలో దేవుని వాక్యం బోధిస్తున్న ప్రమాణాల ప్రకారంగా అది నిర్దేశించబడాలి. మనం యెహోవాకు విధేయులమని, ఆయనను ప్రేమిస్తున్నామని (1) యెహోవా ప్రేమిస్తున్నవారిని ప్రేమించడం ద్వారా, (2) అధికారాన్ని గౌరవించడం ద్వారా, (3) దేవుని దృష్టిలో పరిశుద్ధంగా ఉండడానికి కృషి చేయడం ద్వారా చూపిస్తాం.

యెహోవా ప్రేమిస్తున్నవారిని ప్రేమించండి

11. యెహోవా ప్రేమిస్తున్నవారిని మనం ఎందుకు ప్రేమించాలి?

11 మొదటిగా, మనం యెహోవా ప్రేమిస్తున్నవారిని ప్రేమించాలి. సహవాసం విషయానికొస్తే ప్రజలు స్పంజిల్లాంటివారు. మన చుట్టూవున్న వాళ్లనుండి మనమెంతో నేర్చుకుంటాం. అపరిపూర్ణ మానవులకు సహవాసం వల్ల వచ్చే ప్రమాదాలు, దానివల్ల వచ్చే ప్రయోజనాలు మన సృష్టికర్తకు బాగా తెలుసు. అందుకే ఆయన, “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును” అనే మంచి సలహానిచ్చాడు. (సామె. 13:20; 1 కొరిం. 15:33) మనలో ఎవరమూ ‘చెడిపోవాలని’ కోరుకోం. అందరం ‘జ్ఞానవంతులం’ కావాలనుకుంటాం. యెహోవా జ్ఞానానికి అంతులేదు, ఆయనను మరింత జ్ఞానవంతుణ్ణి చేయడం అసాధ్యం. అంతేకాక, ఎవరూ ఆయనను పాడుచేయలేరు. అయినా స్నేహితులను ఎన్నుకునే విషయంలో ఆయన మనకు ఒక మంచి మాదిరినుంచాడు. యెహోవా ఎవరిని తన స్నేహితులుగా ఎన్నుకున్నాడో చూడండి.

12. యెహోవా ఎలాంటి స్నేహితులను ఎన్నుకుంటాడు?

12 యెహోవా పితరుడైన అబ్రాహామును ‘నా స్నేహితుడు’ అని పిలిచాడు. (యెష. 41:8) విశ్వాసాన్ని, నీతిని, విధేయతను చూపించడంలో అబ్రాహాము చక్కని మాదిరిని ఉంచాడు. (యాకో. 2:21-23) యెహోవా అలాంటివారినే స్నేహితులుగా ఎన్నుకుంటాడు. ఇప్పుడు కూడా ఆయన అలాంటి వారితోనే స్నేహం చేస్తున్నాడు. యెహోవాయే అలాంటివారిని స్నేహితులుగా ఎన్నుకుంటున్నప్పుడు, జ్ఞానుల సహవాసం చేసి జ్ఞానాన్ని సంపాదించుకునేలా మనం మంచి స్నేహితులను ఎన్నుకోవడం ఇంకెంత అవసరం!

13. మంచి స్నేహితులను ఎలా ఎన్నుకోవచ్చు?

13 ఈ విషయంలో మీరు మంచి నిర్ణయాన్ని ఎలా తీసుకోవచ్చు? అలా తీసుకునేందుకు బైబిలు ఉదాహరణలు మనకు సహాయం చేస్తాయి. రూతుకూ నయోమికీ, దావీదుకూ యోనాతానుకూ, తిమోతికీ పౌలుకూ మధ్య ఉన్న స్నేహం గురించి ఆలోచించండి. (రూతు 1:16, 17; 1 సమూ. 23:16-18; ఫిలి. 2:19-22) ముఖ్యంగా, యెహోవాపట్ల తమకున్న నిజమైన ప్రేమనుబట్టే వారు మంచి స్నేహితులయ్యారు. మీరు ప్రేమించేంతగా యెహోవాను ప్రేమించే స్నేహితులు మీకు దొరుకుతారా? క్రైస్తవ సంఘంలో మీకు అలాంటి స్నేహితులు ఖచ్చితంగా ఎంతోమంది దొరుకుతారు. యెహోవాను బాధపెట్టేది చేయమని వారు మిమ్మల్ని ప్రోత్సహించే బదులు యెహోవాకు విధేయులుగా ఉండేలా, యెహోవాకు దగ్గరయ్యేలా, ఆత్మనుబట్టి విత్తేలా వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. (గలతీయులకు 6:7, 8 చదవండి.) దేవుని ప్రేమలో నిలిచివుండేలా వారు మీకు సహాయం చేస్తారు.

అధికారాన్ని గౌరవించండి

14. సాధారణంగా, అధికారాన్ని గౌరవించడం మనకు ఎందుకు కష్టంగా ఉంటుంది?

14 రెండవదిగా, అధికారాన్ని గౌరవించడం ద్వారా యెహోవాపట్ల మనకున్న ప్రేమను చూపిస్తాం. మనం అలా అధికారాన్ని గౌరవించాలి కూడా. అధికారాన్ని గౌరవించడం మనకు కొన్నిసార్లు ఎందుకు కష్టమనిపిస్తుంది? దానికి అధికారంలో ఉన్నవారు అపరిపూర్ణులు కావడమే ఒక కారణం. అంతేకాక, మనం కూడా అపరిపూర్ణులం కాబట్టి సహజసిద్ధంగానే మనం తిరుగుబాటు ధోరణితో పోరాడుతుంటాం.

15, 16. (ఎ) యెహోవా తన ప్రజల బాగోగులను చూసుకునేందుకు నియమించినవారిని మనం ఎందుకు గౌరవించాలి? (బి) మోషే మీద ఇశ్రాయేలీయులు చేసిన తిరుగుబాటును యెహోవా పరిగణించిన విధానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

15 ‘అది అంత కష్టమైనప్పుడు మనం ఎందుకు అధికారాన్ని గౌరవించాలి?’ అని మీకు అనిపించవచ్చు. దాని సమాధానం సర్వాధిపత్యపు వివాదాంశంతో ముడిపడివుంది. మీ సర్వాధిపతిగా, మీ పరిపాలకునిగా మీరు ఎవరిని ఎన్నుకుంటారు? మనం యెహోవాను సర్వాధిపతిగా ఎన్నుకుంటే ఆయన అధికారాన్ని గౌరవించాలి. ఆయన అధికారాన్ని గౌరవించకుండా ఆయనే మన పరిపాలకుడని మనస్ఫూర్తిగా పిలవగలమా? అంతేకాక, సాధారణంగా యెహోవా తన అధికారాన్ని అపరిపూర్ణ మానవుల ద్వారా చూపిస్తాడు. తన ప్రజల బాగోగులను చూసుకునే బాధ్యతను ఆయన వారికే అప్పగించాడు. మనం వారి మీద తిరుగుబాటు చేస్తే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?—1 థెస్సలొనీకయులు 5:12, 13 చదవండి.

16 ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు మోషేకు వ్యతిరేకంగా సణిగి తిరుగుబాటు చేసినప్పుడు వారు తన మీదే తిరుగుబాటు చేసినట్లు యెహోవాకు అనిపించింది. (సంఖ్యా. 14:26, 27) యెహోవా మారలేదు. ఆయన నియమించినవారిపై మనం ఎప్పుడైనా తిరుగుబాటు చేస్తే యెహోవాపై తిరుగుబాటు చేసినట్లే అవుతుంది!

17. క్రైస్తవ సంఘంలో బాధ్యతలు చేపట్టేవారి పట్ల ఎలాంటి వైఖరి కలిగివుండడానికి కృషి చేయాలి?

17 క్రైస్తవ సంఘంలో బాధ్యతలు చేపట్టేవారి పట్ల సరైన వైఖరి కనబరచాలని అపొస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. “మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి” అని ఆయన రాశాడు. (హెబ్రీ. 13:17) అలా విధేయత చూపించాలంటే, లోబడివుండాలంటే మనం ఎంతో కృషి చేయాలి. ఏదేమైనా, మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికే కృషి చేస్తున్నాం అన్నది గుర్తుంచుకోండి. దానికోసం కృషి చేయడం ఎంతో ప్రయోజనకరమని మీకు అనిపించడంలేదా?

యెహోవా దృష్టిలో పరిశుద్ధంగా ఉండండి

18. మనం పరిశుభ్రంగా ఉండాలని యెహోవా ఎందుకు కోరుకుంటున్నాడు?

18 మూడవదిగా, యెహోవా దృష్టిలో పరిశుద్ధంగా ఉండడానికి కృషి చేయడం ద్వారా ఆయన పట్ల మనకు ప్రేమ ఉందని చూపిస్తాం. సాధారణంగా తమ పిల్లలు శుభ్రంగా ఉండేలా తల్లిదండ్రులు ఎంతో కృషి చేస్తారు. ఎందుకు? పిల్లలు సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండడం చాలా అవసరం. అంతేకాక పిల్లలు పరిశుభ్రంగా ఉంటే కుటుంబానికి మంచి పేరు వస్తుంది. తల్లిదండ్రులు పిల్లలను ప్రేమిస్తున్నారనీ వారి బాగోగులను చూసుకుంటున్నారనీ అది చూపిస్తుంది. అలాంటి కారణాలనుబట్టే, మనం పరిశుభ్రంగా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం సుఖసంతోషాలతో ఉండాలంటే మనం పరిశుభ్రంగా ఉండడం చాలా అవసరమని ఆయనకు తెలుసు. మనం పరిశుభ్రంగా ఉంటే తనకు మంచి పేరు వస్తుందని కూడా మన పరలోకపు తండ్రికి తెలుసు. అంతేకాక, మనం పరిశుభ్రంగా ఉండడం ఎంతో అవసరం, ఎందుకంటే ఈ మురికి లోకంలోని వారిలా మనం లేమని గమనించే ప్రజలు దేవునికి సేవ చేయాలని అనుకోవచ్చు.

19. శారీరక పరిశుభ్రత చాలా అవసరమని మనకు ఎలా తెలుసు?

19 ఏ విషయాల్లో మనం పరిశుభ్రంగా ఉండాలి? అన్ని విషయాల్లో మనం పరిశుభ్రంగా ఉండాలి. ప్రాచీన ఇశ్రాయేలులో, శారీరక పరిశుభ్రత చాలా అవసరమని తన ప్రజలకు యెహోవా చెప్పాడు. (లేవీ. 15:31) అంతేకాక, పాత్రలను శుభ్రం చేయడం, చేతులు కాళ్లు కడుక్కొవడం, బట్టలు ఉతుక్కోవడం, మల విసర్జన వంటి విషయాల్లో మోషే దర్మశాస్త్రం నియమాలను ఇచ్చింది. (నిర్గ. 30:17-21; లేవీ. 11:32; సంఖ్యా. 19:17-20, ద్వితీ. 23:13, 14) తమ దేవుడైన యెహోవా పరిశుద్ధుడని అంటే ‘నిర్మలమైనవాడు’, ‘నిష్కళంకుడు’, ‘పవిత్రమైనవాడు’ అని ఇశ్రాయేలీయులకు గుర్తుచేయబడింది. పరిశుద్ధుడైన దేవుని సేవకులు కూడా పరిశుద్ధంగానే ఉండాలి.—లేవీయకాండము 11:44, 45 చదవండి.

20. ఏ విషయాల్లో మనం పరిశుభ్రంగా ఉండాలి?

20 మనం శరీరాన్నేకాదు అంతరంగాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఆలోచనలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి కృషి చేస్తాం. మన చుట్టూ ఉన్న లోకం నైతికంగా ఎంతగా దిగజారిపోయినప్పటికీ మనం మాత్రం నైతిక పరిశుభ్రత విషయంలో యెహోవా ప్రమాణాలను నమ్మకంగా పాటిస్తాం. ప్రాముఖ్యంగా, మన సేవ పరిశుభ్రంగా ఉండేలా అబద్ధమత కల్మషాన్ని మనకు అంటకుండా చూసుకుంటాం. ‘పోవుడి పోవుడి అచ్చటనుండి వెళ్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దానియొద్దనుండి తొలగిపోవుడి, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి’ అని యెషయా 52:11లో ఉన్న ప్రేరేపిత హెచ్చరికను ఎప్పటికీ మరచిపోం. ప్రస్తుతం, అబద్ధారాధనకు సంబంధించిన ఛాయలు మనమీద పడకుండా జాగ్రత్తపడడం ద్వారా మన ఆరాధనను పరిశుభ్రంగా ఉంచుకుంటాం. అందుకే, మనం అబద్ధ మతాలతో సంబంధమున్న ప్రజాదరణ పొందిన ఆచారాలకూ సెలవు దినాలకూ దూరంగా ఉంటాం. పరిశుభ్రంగా ఉండడం కష్టమే అయినా అది దేవుని ప్రేమలో నిలిచి ఉండేందుకు సహాయం చేస్తుంది కాబట్టి, యెహోవా ప్రజలు అలా ఉండేందుకు కృషి చేస్తారు.

21. మనం దేవుని ప్రేమలో నిలిచి ఉంటామని ఎలా చెప్పవచ్చు?

21 తన ప్రేమలో మనం నిరంతరం నిలిచివుండాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనమందరం దేవుని ప్రేమలో నిలిచి ఉండేలా శాయశక్తులా కృషిచేయాలి. యేసు మాదిరిని అనుకరించడంతోపాటు యెహోవా ఆజ్ఞలకు విధేయులై దేవున్ని ప్రేమిస్తున్నామని చూపించడం ద్వారా అలా చేయవచ్చు. అలా చేస్తే, ఏదీ “మన ప్రభువైన క్రీస్తుయేసునందలి దేవుని ప్రేమనుండి మనలను ఎడబాప నేర[దు]” లేదా వేరుచేయలేదనే నమ్మకంతో ఉండవచ్చు.—రోమా. 8:38, 39.

మీకు జ్ఞాపకమున్నాయా?

• దేవుని ప్రేమలో నిలిచి ఉండడానికి మన మనస్సాక్షి ఎలా సహాయం చేస్తుంది?

• యెహోవా ప్రేమిస్తున్నవారిని మనం ఎందుకు ప్రేమించాలి?

• అధికారంలో ఉన్నవారిని గౌరవించడం ఎందుకు ప్రాముఖ్యం?

• పరిశుభ్రంగా ఉండడం దేవుని ప్రజలకు ఎందుకు ప్రాముఖ్యం?

[అధ్యయన ప్రశ్నలు]

[20వ పేజీలోని బాక్సు/చిత్రం]

మంచి ప్రవర్తనను ప్రోత్సహించే ఒక పుస్తకం

2008/2009 జిల్లా సమావేశంలో ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే 224 పేజీల పుస్తకం విడుదల చేయబడింది. ఈ కొత్త పుస్తకం ఎందుకు ప్రచురించబడింది? ఈ పుస్తకం యెహోవా ప్రమాణాలను తెలుసుకొని, వాటిని ప్రేమించడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలో అది తెలియజేస్తుంది. ఈ రోజుల్లో యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా జీవించడమే శ్రేష్ఠమైనదనీ అలా జీవించడం వల్ల భవిష్యత్తులో నిరంతర జీవితాన్ని పొందుతామనీ మనం నమ్ముతాం. అయితే ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’ అనే పుస్తకాన్ని శ్రద్ధగా చదివితే ఈ విషయాల్లో మన నమ్మకం మరింత బలపడుతుంది.

అంతకన్నా ముఖ్యంగా, యెహోవాకు విధేయులుగా ఉండడం భారంకాదని గ్రహించేలా చేస్తుంది. అలా విధేయులముగా ఉండడం ద్వారా తనను ఎంతగా ప్రేమిస్తున్నామో యెహోవాకు చూపిస్తాం. అందుకే ‘నేను యెహోవాకు ఎందుకు లోబడుతున్నాను?’ అని ఆలోచించుకునేలా ఈ పుస్తకం సహాయం చేస్తుంది.

విచారకరంగా, కొంతమంది యెహోవా ప్రేమను వదిలి వెళ్లిపోతుంటారు. సాధారణంగా, ప్రవర్తన సరిగ్గాలేకే వారు అలా వెళ్లిపోతుంటారు గానీ ఏదో ఒక సిద్ధాంతం అర్థంకాక కాదు. అలాంటప్పుడు యెహోవా నియమాల పట్ల, మన జీవితాన్ని నిర్దేశించే సూత్రాల పట్ల మనకున్న ప్రేమను, కృతజ్ఞతను పెంచుకోవడం ఎంత ప్రాముఖ్యం! సరైనది చేయాలనే కృతనిశ్చయంతో ఉండేలా, సాతానును అబద్ధికుడని నిరూపించేలా అన్నింటికన్నా ముఖ్యంగా దేవుని ప్రేమలో నిలిచివుండేలా ఈ కొత్త పుస్తకం ప్రపంచవ్యాప్తంగావున్న యెహోవా ప్రజలకు సహాయం చేస్తుందని మేము నమ్ముతున్నాం.—యూదా 20, 21.

[18వ పేజీలోని చిత్రం]

“నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమ యందు నిలిచి యుందురు”