కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ ‘శుభవర్తమానముగల దినాన’ ఏదీ మిమ్మల్ని ఆటంకపరచనివ్వకండి

ఈ ‘శుభవర్తమానముగల దినాన’ ఏదీ మిమ్మల్ని ఆటంకపరచనివ్వకండి

ఈ ‘శుభవర్తమానముగల దినాన’ ఏదీ మిమ్మల్ని ఆటంకపరచనివ్వకండి

న లుగురు కుష్ఠరోగులు ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నారు. షోమ్రోను పట్టణపు గుమ్మంవద్ద ఎవరూ వాళ్లకు ధర్మం చేయలేదు. సిరియనులు ముట్టడించడంతో షోమ్రోను పట్టణం ఆకలితో అలమటిస్తుంది. ఆహారం ధర విపరీతంగా పెరగడంతో పట్టణంలోకి వెళ్లినా లాభంలేదు. అప్పటికే అక్కడ మనిషిని చంపుకు తిన్న సంఘటన కూడా వెలుగుచూసింది.—2 రాజు. 6:24-29.

‘మనం సిరియనుల శిబిరానికి ఎందుకు వెళ్లకూడదు?’ ‘వెళ్లడంవల్ల నష్టమేమీ లేదు’ అని ఆ నలుగురు అనుకున్నారు. సందెచీకటిలో ఎవరికీ కనిపించకుండా బయలుదేరి సిరియనుల శిబిరానికి చేరుకున్నారు. వారు అక్కడకు వచ్చేసరికి అంతా నిశ్శబ్దంగా ఉంది. కాపలాదారులెవరూ లేరు. గుర్రాలు, గాడిదలు కట్టేసి ఉన్నాయి గానీ సైనికులెవరూ లేరు. ఆ నలుగురూ గుడారంలోకి తొంగి చూశారు. లోపల ఎవరూ లేరు కానీ తినడానికీ తాగడానికీ మాత్రం బోలెడన్ని ఉన్నాయి. వారు తినగలిగినంత తినీ, తాగగలిగినంత తాగారు. బంగారం, వెండి, బట్టలు, ఇతర విలువైన వస్తువులు కూడా వారికి కనిపించాయి. వారికి నచ్చింది తీసుకుని దాచిపెట్టుకున్నారు. ఆ తర్వాత మరి కొన్నింటి కోసం తిరిగొచ్చారు. సిరియనుల శిబిరం ఎందుకు ఖాళీ అయింది? సైన్యం వస్తున్న శబ్దం సిరియనుల దండుకు వినబడేలా యెహోవా చేశాడు. నిజంగానే తమ మీదికి సైన్యం వస్తుందనుకొని సిరియనులు అక్కడి నుండి పారిపోయారు. అలా సైనికుల శిబిరమంతా ఖాళీ అయిపోయింది. వాళ్లు భయంతో ఎక్కడివక్కడ వదిలేసి పారిపోయారు!

ఆ కుష్ఠరోగులు విలువైన వస్తువులను తీసుకెళ్లి దాచుకుంటున్నప్పుడు, దగ్గర్లోని షోమ్రోను ప్రజలు తిండిలేక అలమటిస్తున్నారని గుర్తొచ్చి వారి మనసు నొచ్చుకుంది. వారు “మనము చేయునది మంచి పనికాదు, నేటిదినము శుభవర్తమానముగల దినము, మనము ఊరకొననేల?” అని అనుకున్నారు. వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా షోమ్రోనుకు వెళ్లి ఆ శుభవర్తమానాన్ని వారికి తెలియజేశారు.—2 రాజు. 7:1-11.

మనం కూడా “శుభవర్తమానముగల దినము” అని పిలవదగిన కాలంలో జీవిస్తున్నాం. ‘ఈ యుగసమాప్తికి’ సంబంధించిన ‘సూచనల’ గురించి చెబుతున్నప్పుడు యేసు ఒక అసాధారణ అంశాన్ని తెలియజేశాడు. ఆయన, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని చెప్పాడు. (మత్త. 24:3, 14) కాబట్టి, మనం ఇప్పుడు ఏమి చేయాలి?

వ్యక్తిగత చింతలు మనల్ని కృంగదీయవచ్చు

అవన్నీ దొరికిన ఆనందంలో ఆ కుష్ఠరోగులు కొంతసేపు షోమ్రోనును మరచిపోయారు. వారికి దొరికే వాటిపైనే తమ మనసు లగ్నం చేశారు. అలాంటిదే మన విషయంలోనూ జరుగుతుందా? ఈ యుగ సమాప్తికి సంబంధించిన వివిధ సూచనల్లో “కరవు” గురించి కూడ చెప్పబడింది. (లూకా 21:7, 11) “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి” అని యేసు తన శిష్యులను హెచ్చరించాడు. (లూకా 21:34) క్రైస్తవులముగా మనం దైనందిన విషయాల గురించిన చింతల్లో మునిగిపోతే ‘శుభవర్తమాన దినంలో’ జీవిస్తున్నామనే విషయాన్ని మరచిపోయే ప్రమాదముంది. అందుకే, ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి.

బ్లెస్సింగ్‌ అనే క్రైస్తవురాలు వ్యక్తిగత విషయాలు తనను కృంగదీయకుండా చూసుకుంది. ఆమె టీచరు కోర్సు చేస్తూ పయినీరుగా సేవచేసింది. ఆ తర్వాత, బెతెల్‌లో సేవ చేస్తున్న సహోదరుణ్ణి పెళ్లి చేసుకుని బెనిన్‌ బెతెల్‌ కుటుంబంలో చేరింది. “నేను గదులు శుభ్రం (హౌస్‌కీపింగ్‌) చేస్తాను. నాకు అప్పగించిన పనిలో నేను నిజంగా ఆనందాన్ని పొందుతున్నాను.” తాను 12 ఏళ్లపాటు చేసిన పూర్తికాల సేవను గుర్తుచేసుకొని బ్లెస్సింగ్‌ ఇప్పుడు సంతోషిస్తోంది. మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ “శుభవర్తమాన దినము” మీదే తన మనసు లగ్నం చేసినందుకు బ్లెస్సింగ్‌ ఎంతో ఆనందిస్తుంది.

సమయాన్ని హరించివేసే వాటికి దూరంగా ఉండండి

డెబ్భైమంది శిష్యులను పంపిస్తున్నప్పుడు, యేసు “కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి” అని అన్నాడు. (లూకా 10:2) కోతకాలాన్ని వాయిదా వేయడంవల్ల కొంత పంటను ఎలాగైతే నష్టపోతామో ప్రకటనా పనిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణనష్టం జరుగుతుంది. అందుకే యేసు “త్రోవలో ఎవనినైనను కుశలప్రశ్న లడుగవద్దు” అని కూడా చెప్పాడు. (లూకా 10:5) మూల భాషలో “కుశలప్రశ్నలు అడగడం” అంటే “హలో” లేదా “బాగున్నారా” అని పలకరించడం మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంది. ఆ కాలంలో స్నేహితులను కలిసినప్పుడు వారిని కౌగలించుకోవడం, చాలాసేపు వారితో మాట్లాడడం వంటివి కూడా చేసేవారు. అందుకే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అనవసరమైన విషయాలకు దూరంగా ఉండమని యేసు తన అనుచరులకు చెప్పాడు. ఎందుకంటే, వారు చాటించాల్సిన సందేశం అత్యవసరమైనది.

అలాంటి అనవసరమైన వాటివల్ల ఎంత సమయం వృథా అవుతుందో ఆలోచించండి. ఎన్నో ఏళ్లుగా చాలా దేశాల్లో సమయాన్ని హరించివేసే వాటిలో టీవీ మొదటి స్థానం కొట్టేసింది. మొబైల్‌ ఫోన్‌లు, కంప్యూటర్లు మాత్రం తక్కువ తిన్నాయా? “సగటు బ్రిటన్‌ వాసి రోజులో 88 నిమిషాలు ల్యాండ్‌లైన్‌లో మాట్లాడడానికి, 62 నిమిషాలు మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడడానికి, 53 నిమిషాలు ఈ-మెయిల్‌లు పంపించడానికి, 22 నిమిషాలు ఎస్‌యమ్‌ఎస్‌లు చేయడానికి వెచ్చిస్తున్నారు” అని 1,000 మంది బ్రిటన్‌వాసులపై జరిపిన ఒక సర్వేలో తేలింది. వీటన్నిటినీ లెక్కకడితే ఒక సహాయ పయినీరు రోజుకు వెచ్చించే గంటలకు రెండింతలకన్నా ఎక్కువ గంటలను వాటికే వెచ్చిస్తున్నారన్న మాట. మీరు వాటి కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు?

ఎర్నెస్ట్‌, హిల్డెగార్ట్‌ జాలీజర్‌ జంట తమ సమయాన్ని జాగ్రత్తగా వెచ్చించారు. వారిద్దరూ కలిసి నాజీ సామూహిక నిర్బంధ శిబిరాల్లో, కమ్యూనిస్టు జైళ్లలో 40 సంవత్సరాలకుపైగా గడిపారు. వారు విడుదలైన తర్వాత, పయినీరు సేవ చేపట్టారు. వారు అప్పటినుండి తమ భూజీవితం ముగిసేంతవరకు ఆ సేవలోనే కొనసాగారు.

చాలామంది జాలీజర్‌లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలనుకున్నారు. రోజులో ఎక్కువ సమయం ఉత్తరాలు రాయడానికి, చదవడానికి వెచ్చించివుండేవారే. కానీ, వారు తమ జీవితంలో యెహోవా సేవకే అధిక ప్రాధాన్యతనిచ్చారు.

నిజమే ఆత్మీయులు మనకు ఎప్పటికప్పుడు ఫోను చేస్తూ ఉండాలని, ఉత్తరాలు రాస్తూ ఉండాలని మనందరికీ అనిపిస్తుంది. అందులో తప్పేమీ లేదు. రొటీన్‌ పనులకు భిన్నంగా ఏదో ఓ మంచి పని చేయడం అవసరమే. కానీ సువార్త ప్రకటించాల్సిన ఈ కాలంలో సమయాన్ని హరించివేసేవాటికి ఎక్కువ సమయం వెచ్చించకుండా ఉండడం తెలివైన పని.

సువార్తను పూర్ణంగా ప్రకటించండి

“శుభవర్తమాన దినంలో” జీవించడం ఎంత గొప్ప ఆశీర్వాదం. మొదట్లో ఆ నలుగురు కుష్ఠరోగులు ప్రక్కదారి పట్టినట్లు మనం ప్రక్కదారి పట్టకుండా చూసుకోవాలి. “మనము చేయునది మంచి పనికాదు” అని వారు అనుకున్నారనేది గుర్తుంచుకోండి. అలాగే సొంత లక్ష్యాలు లేదా సమయాన్ని తినేసే వ్యాపకాలు పరిచర్యలో పూర్తిగా భాగం వహించే విషయంలో ఆటంకంగా మారకుండా చూసుకోవాలి.

మనకు ఈ విషయంలో అపొస్తలుడైన పౌలు చక్కని మాదిరి. ఆయన తన 20 ఏళ్ల పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ, “క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించియున్నాను” అని అన్నాడు. (రోమా. 15:18-20) పౌలు ఏదీ తన ఉత్సాహాన్ని నీరుగార్చకుండా చూసుకున్నాడు. ఈ “శుభవర్తమాన దినం”లో మనం కూడా ఆయనలాగే ఉత్సాహంగా రాజ్య సందేశాన్ని ప్రకటిద్దాం.

[28వ పేజీలోని చిత్రం]

బ్లెస్సింగ్‌ తన వ్యక్తిగత చింతలు పూర్తికాల పరిచర్యను ఆటంకపరచనివ్వలేదు

[29వ పేజీలోని చిత్రం]

జాలీజర్‌ దంపతులు సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించారు