కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

క్రీస్తులా విధేయత, ధైర్యాన్ని చూపించండి

క్రీస్తులా విధేయత, ధైర్యాన్ని చూపించండి

క్రీస్తులా విధేయత, ధైర్యాన్ని చూపించండి

“ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను.”—యోహా. 16:33.

1. యేసు ఎంతగా దేవుని పట్ల విధేయత చూపించాడు?

యేసుక్రీస్తు ఎప్పుడూ దేవునికి ఇష్టమైన విధంగా నడుచుకున్నాడు. తన పరలోక తండ్రికి అవిధేయత చూపించాలనే ఆలోచన కూడ తన మనసులోకి రానివ్వలేదు. (యోహా. 4:34; హెబ్రీ. 7:26) అయితే, ఆయన విధేయత చూపించడానికి పరిస్థితులు అప్పుడు అంత అనువుగా లేవు. తన తండ్రికి అవిధేయుడయ్యేలా యేసును ఒప్పించాలని, బలవంతం చేయాలని, మోసగించాలని ఆయన పరిచర్య ఆరంభించినప్పటి నుండి సాతానుతోపాటు మరికొందరు యేసు శత్రువులు ప్రయత్నించారు. (మత్త. 4:1-11; లూకా 20:20-25) వారు ఆయనను శారీరకంగా, మానసికంగా చాలా బాధపెట్టారు. చివరకు, ఆయనను హింసాకొయ్యపై చంపారు. (మత్త. 26:37, 38; లూకా 22:44; యోహా. 19:1, 17, 18) అన్ని కష్టాలుపడినా, అంత తీవ్రమైన శ్రమలను ఎదుర్కొన్నా, యేసు ‘మరణం పొందునంతగా విధేయత చూపించాడు.’—ఫిలిప్పీయులకు 2:8 చదవండి.

2, 3. బాధలను అనుభవిస్తున్నా విధేయత చూపించే విషయంలో మనం యేసు నుండి ఏమి నేర్చుకోవచ్చు?

2 యేసు మానవునిగా భూమ్మీదున్నప్పుడు తనకు ఎదురైన కష్టాల నుండి విధేయతకు సంబంధించి కొత్త విషయాలను నేర్చుకున్నాడు. (హెబ్రీ. 5:8) యేసు ఎన్నో ఏళ్లు యెహోవాతో దగ్గరి సంబంధాన్ని అనుభవించడమే కాక, సృష్టి చేస్తున్నప్పుడు దేవుని దగ్గర ‘ప్రధానశిల్పిగా’ పనిచేశాడు కాబట్టి, యెహోవాను సేవించే విషయంలో ఆయన కొత్తగా నేర్చుకోవాల్సిందంటూ ఏదీలేదని మనకు అనిపించవచ్చు. (సామె. 8:30) అయితే, ఓ మానవుడిగా ఆయన బాధలను స్వయంగా అనుభవించాడు. అలాంటి పరిస్థితుల్లోనూ దేవునికి నమ్మకంగా ఉండడం ద్వారా తన యథార్థతను పూర్తిగా నిరూపించుకున్నాడు. అలా దేవుని కుమారుడైన యేసు ఆధ్యాత్మికంగా ఎదిగాడు. ఆయన అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

3 యేసు పరిపూర్ణ మానవుడైనప్పటికీ తన స్వశక్తితోనే పరిపూర్ణ విధేయత చూపించడానికి ప్రయత్నించలేదు. దేవుని సహాయం కోసం ప్రార్థించాడు. (హెబ్రీయులు 5:7 చదవండి.) మనం కూడా విధేయులముగా ఉండాలంటే వినయస్థులముగా ఉండాలి, దేవుని సహాయం కోసం ఎల్లప్పుడూ ప్రార్థించాలి. అందుకే, అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను, ‘తనను తాను తగ్గించుకొని, మరణం పొందునంతగా విధేయత చూపించిన’ “క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి” అని ఉపదేశించాడు. (ఫిలి. 2:5-8) దుష్టలోకంలోనూ విధేయత చూపించడం మానవులకు సాధ్యమేనని యేసు తన మాదిరినిబట్టి చూపించాడు. యేసు పరిపూర్ణుడు కాబట్టి విధేయత చూపించాడు కానీ మనలాంటి అపరిపూర్ణ మానవులకు విధేయత చూపించడం సాధ్యమేనా?

అపరిపూర్ణతలున్నా విధేయత చూపించవచ్చు

4. దేవుడు మనకు స్వేచ్ఛాచిత్తాన్ని అనుగ్రహించాడు కాబట్టి మనమీద ఏ బాధ్యత ఉంది?

4 దేవుడు ఆదాముహవ్వలను తెలివిగల ప్రాణులుగా సృష్టించాడు. వారికి స్వేచ్ఛాచిత్తాన్ని అనుగ్రహించాడు. వారి పిల్లలం కాబట్టి మనకూ స్వేచ్ఛాచిత్తముంది. దానర్థమేమిటి? మనం మంచినైనా, చెడునైనా ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది. మరో మాటలో చెప్పాలంటే, మనం తనకు విధేయులముగా ఉండాలో లేదో నిర్ణయించుకునే స్వేచ్ఛను దేవుడు మనకు ఇచ్చాడు. అంత గొప్ప స్వేచ్ఛ దేవుడు మనకు ఇచ్చాడు కాబట్టి, ఈ విషయంలో లెక్కఅప్పజెప్పే బాధ్యత కూడ మనమీద ఉంది. మనం తీసుకునే నిర్ణయాలు జీవానికి లేదా మరణానికి దారితీయగలవు. మన ఆత్మీయులను కూడ ప్రభావితం చేస్తాయి.

5. మనందరం ఎలాంటి సంఘర్షణకు గురౌతాం? దాన్ని జయించాలంటే మనం ఏమి చేయాలి?

5 మనకు అపరిపూర్ణత వారసత్వంగా వచ్చింది కాబట్టి, సహజంగానే విధేయత చూపించడం మనకు కష్టమనిపిస్తుంది. దేవుని నియమాలను ఎల్లప్పుడూ పాటించడం అంత సులభంకాదు. ఈ విషయంలో పౌలు కూడ చాలా కష్టపడ్డాడు. ఆయన, “వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది” అని రాశాడు. (రోమా. 7:23) ఎలాంటి త్యాగం చేయాల్సిన అవసరం లేనప్పుడు, ఎలాంటి బాధ లేదా అసౌకర్యం లేనప్పుడు విధేయత చూపించడం కష్టమేమీకాదు. అయితే, విధేయత చూపించాలా లేక ‘శరీరాశకు, నేత్రాశకు’ లొంగిపోవాలా అనే సంఘర్షణకు గురైనప్పుడు మనం ఏమి చేస్తాం? మన అపరిపూర్ణత వల్ల లేక మన చుట్టూ ఉన్న “లౌకికాత్మ” ప్రభావం వల్ల ఆ చెడు కోరికలు పుడతాయి. ఆ కోరికలు మనమీద బలంగా పనిచేయగలవు. (1 యోహా. 2:16; 1 కొరిం. 2:12) వాటికి లొంగిపోకూడదంటే, కష్ట పరిస్థితి లేదా శోధన ఎదురుకాకముందే మన ‘హృదయాన్ని స్థిరపరచుకోవాలి.’ అంతేకాక, ఏదేమైనా యెహోవాకు లోబడాలని నిర్ణయించుకోవాలి. (2 దిన. 20:33) తమ హృదయాన్ని స్థిరపరచుకోవడం వల్ల దేవునికి విధేయత చూపించడంలో విజయం సాధించిన అనేకుల ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి.—ఎజ్రా 7:10; దాని. 1:8.

6, 7. మంచి నిర్ణయాలు తీసుకునేందుకు వ్యక్తిగత అధ్యయనం ఎలా సహాయం చేస్తుందో ఉదాహరణతో చెప్పండి.

6 మన హృదయాన్ని స్థిరపరచుకోవాలంటే మనం మొదటిగా బైబిలును, బైబిలు సాహిత్యాలను శ్రద్ధగా చదవాలి. మీరు ఈ కింది పరిస్థితిని ఊహించుకోండి. అది మీరు వ్యక్తిగత అధ్యయనం చేసే రోజు. ఆ రోజు మీరు దేవుని వాక్యం నుండి నేర్చుకునేది అన్వయించుకునేలా యెహోవా ఆత్మ సహాయం కోరారు. అయితే ఆ తర్వాతి రోజు సాయంత్రం టీవీలో ఓ సినిమా చూడాలనుకుంటున్నారు. సినీ విమర్శకులు అది మంచి సినిమా అనే కితాబిచ్చారు. కానీ దాంట్లో అనైతికతను, హింసను చూపించే కొన్ని దృశ్యాలున్నాయని మీకు తెలుసు.

7 అప్పుడు మీరు ఎఫెసీయులు 5:3లోని పౌలు ఉపదేశం గురించి ఆలోచిస్తారు: “మీలో జారత్వమేగాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.” అంతేకాక, పౌలు ఫిలిప్పీయులకు 4:8లో (చదవండి) ఇచ్చిన సలహాను కూడ గుర్తుచేసుకుంటారు. మీరు ఆ ప్రేరేపిత ఉపదేశం గురించి ధ్యానిస్తుండగా, ‘నేను కావాలని అలాంటి కార్యక్రమాలను చూస్తే, దేవునికి పూర్ణ విధేయత చూపించిన యేసు మాదిరిని అనుకరించినట్లౌతుందా?’ అని ఆలోచిస్తారు. చివరకు, మీరేమి చేస్తారు? ఏదేమైనా ఆ సినిమాను చూస్తారా?

8. మనకున్న ఉన్నత నైతిక, ఆధ్యాత్మిక ప్రమాణాలను ఎందుకు కాపాడుకోవాలి?

8 హింస, అనైతిక వినోదం రూపంలో ఉండే చెడు సహవాసంతోపాటు, ఇతర చెడు సహవాసాల వల్ల వచ్చే చెడు ఫలితాలు నామీద పడకుండ చూసుకోగలననే ధీమాతో నైతిక, ఆధ్యాత్మిక ప్రమాణాలను అంతగా పట్టించుకోకపోవడం పొరపాటు అవుతుంది. బదులుగా, సాతానును అనుసరించే ఈ లోక ప్రజల చెడు ప్రభావాల నుండి మనల్ని మనం రక్షించుకోవాలి, మన పిల్లలను రక్షించాలి. కొన్ని ప్రమాదకరమైన కంప్యూటర్‌ వైరస్‌లు కంప్యూటర్లలో ఉన్న సమాచారాన్ని నాశనం చేస్తాయి, వాటిని పనిచేయకుండా చేయడమే కాక, ఇతర కంప్యూటర్లనూ పాడుచేస్తాయి. అందుకే కంప్యూటర్లను వాడేవారు వైరస్‌ల బారిన తమ కంప్యూటర్లు పడకూడదని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వారే అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, సాతాను “తంత్రముల” విషయంలో మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి.—ఎఫె. 6:11.

9. మనం ప్రతీరోజు యెహోవాకు లోబడాలనే కృతనిశ్చయంతో ఎందుకు ఉండాలి?

9 మనం యెహోవాకు ఇష్టమైన విధంగా ప్రవర్తిస్తామో లేదో చూపించే ఏదో ఒక నిర్ణయం దాదాపు ప్రతీరోజు తీసుకుంటూనే ఉంటాం. మనం రక్షించబడాలంటే దేవునికి లోబడి ఆయన నీతి సూత్రాలను పాటించాలి. ‘మరణం పొందునంతగా’ విధేయత చూపించే విషయంలో క్రీస్తు ఉంచిన మాదిరిని అనుసరించడం ద్వారా మనకు నిజమైన విశ్వాసముందని చూపిస్తాం. మనం నమ్మకంగా ఉంటే యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే, “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును” అని యేసు వాగ్దానం చేశాడు. (మత్త. 24:13) అలా అంతం వరకు సహించాలంటే మనకు యేసులా నిజమైన ధైర్యం అవసరం.—కీర్త. 31:24.

ధైర్యం చూపించే విషయంలో యేసు గొప్ప మాదిరి

10. మనం ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొనే అవకాశముంది? అలాంటప్పుడు మనం ఏమి చేయాలి?

10 మన చుట్టూవున్న ప్రజల్లో లోకపోకడలు కనిపిస్తున్నాయి. వాటి ప్రభావానికి మనం తలొగ్గకూడదంటే మనకు ధైర్యం అవసరం. యెహోవా నీతియుక్త మార్గాలను విడిచిపెట్టేలా చేయగల నైతిక, ఆర్థిక, మత ఒత్తిళ్లు క్రైస్తవులకు ఎదురౌతుంటాయి. చాలామంది క్రైస్తవులకు కుటుంబంలో వ్యతిరేకత ఎదురౌతోంది. కొన్ని దేశాల్లో విద్యా సంస్థలు పరిణామ సిద్ధాంతాన్ని మునుపటి కన్నా మరింత జోరుగా ప్రచారం చేస్తున్నాయి. నాస్తికత్వం మీద ప్రజల నమ్మకం పెరుగుతోంది. ఇలాంటి ఒత్తిళ్లను మనం పట్టించుకోకుండా ఉండలేం. వాటికి తలొగ్గకుండా, మనల్ని మనం రక్షించుకోవాలంటే తగిన చర్యతీసుకోవాలి. ఈ విషయంలో మనమెలా విజయం సాధించవచ్చో యేసు ఉదాహరణ నుండి తెలుసుకుందాం.

11. యేసు ఉదాహరణను ధ్యానించడం వల్ల మనం మరింత ధైర్యాన్ని ఎలా కూడగట్టుకోగలం?

11 యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి యున్నాను.” (యోహా. 16:33) లోక ప్రభావానికి ఆయన ఎప్పుడూ తలొగ్గలేదు. లోక ప్రభావానికి లోనై తన ప్రకటనా పనిని ఎన్నడూ ఆపలేదు. సత్యారాధన విషయంలో తనకున్న ప్రమాణాలను తగ్గించుకోలేదు. తన మంచి ప్రవర్తనను మార్చుకోలేదు. అలా మనం కూడ చేయాలి. యేసు తన శిష్యుల గురించి యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.” (యోహా. 17:16) క్రీస్తు చూపించిన ధైర్యం గురించి అధ్యయనం చేసి, దానిని ధ్యానిస్తే, లోకం నుండి వేరుగా ఉండేందుకు కావాల్సిన ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతాం.

యేసును చూసి ధైర్యాన్ని నేర్చుకోండి

12-14. వివిధ సందర్భాల్లో యేసు ధైర్యాన్ని ఎలా చూపించాడో వివరించండి.

12 యేసు తన పరిచర్య అంతటిలో ఎంతో ధైర్యాన్ని చూపించాడు. దేవుని కుమారునిగా తనకున్న అధికారాన్ని ఉపయోగిస్తూ ఆయన ధైర్యంగా “దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రో[శాడు].” (మత్త. 21:12) యేసు భూజీవితంలోని చివరి రాత్రి, ఆయనను బంధించడానికి సైనికులు వచ్చినప్పుడు తన శిష్యులను కాపాడడానికి ధైర్యంగా ముందుకువచ్చి, “మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడి” అని అన్నాడు. (యోహా. 18:8) కొద్దిసేపటి తర్వాత, ఆయన కత్తిని ఒరలో ఉంచమని పేతురుకు చెప్పి, తాను మానవ ఆయుధాలను కాక యెహోవానే నమ్ముకున్నానని చూపించాడు.—యోహా. 18:11.

13 ప్రేమలేని అబద్ధ బోధకుల అసలు రూపాన్ని, తప్పుడు బోధలను యేసు ధైర్యంగా బయటపెట్టాడు. “అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు” అని ఆయన వారితో అన్నాడు. “ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. . . . మీరు గిన్నెయు పళ్లెమును వెలుపట శుద్ధిచేయుదురు గాని అవి లోపల దోపుతోను అజితేంద్రియత్వముతోను నిండియున్నవి” అని కూడ అన్నాడు. (మత్త. 23:13, 23, 25) అబద్ధ మతబోధకులు యేసు శిష్యులను కూడ హింసించి, వారిలో కొందరిని చంపనున్నారు కాబట్టి, యేసులాంటి ధైర్యం శిష్యులకు కూడ అవసరమైంది.—మత్త. 23:34; 24:9.

14 దయ్యాలు ఎదురుపడినప్పుడు కూడ ఆయన ధైర్యాన్ని చూపించాడు. ఓ సందర్భంలో దయ్యం పట్టిన ఓ వ్యక్తి ఆయనకు ఎదురుపడ్డాడు. ఆయన ఎంత బలవంతుడంటే, ఎవరూ గొలుసులతో కట్టలేకపోయారు. యేసు భయపడకుండా ఆ మనిషిని పట్టిపీడించిన అనేక దయ్యాలను అతని నుండి వెళ్లగొట్టాడు. (మార్కు 5:1-13) నేడు, అలాంటి అద్భుతాలు చేసే శక్తి దేవుడు క్రైస్తవులకు అనుగ్రహించలేదు. అయినా, మనం కూడ ప్రకటనా బోధనా పనిలో ‘అవిశ్వాసుల మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసిన’ సాతానుతో ఆధ్యాత్మిక యుద్ధం చేయాల్సివస్తుంది. (2 కొరిం. 4:4) యేసులా మన ఆయుధాలు కూడ “శరీరసంబంధమైనవి కావుగాని, దేవునియెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి.” బలంగా పాతుకుపోయిన అబద్ధ నమ్మకాలే ఆ దుర్గాలు. (2 కొరిం. 10:4) దేవుడు అనుగ్రహించిన ఆ ఆయుధాలను ఉపయోగించే విషయంలో మనం యేసు నుండి ఎంతో తెలుసుకోవచ్చు.

15. యేసుకు ధైర్యం ఎక్కడ నుండి వచ్చింది?

15 విశ్వాసంతోనే యేసు ధైర్యాన్ని ప్రదర్శించాడు కానీ మొండితనంతో కాదు. మనం కూడ ఆయన మాదిరిని అనుసరించాలి. (మార్కు 4:40) మనం నిజమైన విశ్వాసాన్ని ఎలా సంపాదించవచ్చు? ఈ విషయంలో కూడ యేసు మాదిరి మనకు సహాయం చేస్తుంది. లేఖనాల గురించి తనకు బాగా తెలుసని, లేఖనాల పట్ల తనకు పూర్తి నమ్మకముందని ఆయన చూపించాడు. యేసు మామూలు ఖడ్గాన్ని కాదుగానీ ఆత్మఖడ్గమైన దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. ఆయన పదేపదే లేఖనాలను ఉపయోగిస్తూ బోధించాడు. ఆయన చాలాసార్లు “వ్రాయబడియున్నది” అనే మాటను ఉపయోగించాడు, అంటే దేవుని వాక్యంలోని విషయాలను ప్రస్తావించాడు. *

16. మనం బలమైన విశ్వాసాన్ని ఎలా సంపాదించుకోవచ్చు?

16 యేసు శిష్యులకు తప్పనిసరిగా పరీక్షలు ఎదురౌతాయి. వాటిని సహించేందుకు కావాల్సిన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే మనం ప్రతీరోజు బైబిలు చదువుతూ, క్రైస్తవ కూటాలకు హాజరౌతూ విశ్వాసానికి పునాదియైన సత్యాలను మనసులో నింపుకోవాలి. (రోమా. 10:17) అంతేకాక, అవి మన హృదయంలోకి ఇంకిపోయేలా నేర్చుకున్నవాటిని ధ్యానించాలి. విశ్వాసం ఉంటేనే క్రియల్లో ధైర్యాన్ని చూపిస్తాం. (యాకో. 2:17) విశ్వాసం ఆత్మ ఫలంలోని ఒక లక్షణం కాబట్టి మనం పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించాలి.—గల. 5:22.

17, 18. ఓ యువ సహోదరి పాఠశాలలో ఎలా ధైర్యం చూపించింది?

17 కిట్టీ అనే యువ సహోదరి నిజమైన విశ్వాసం వల్ల ధైర్యం ఎలా వస్తుందో సొంత అనుభవంతో తెలుసుకుంది. పాఠశాలలో ‘సువార్త చెప్పేందుకు సిగ్గుపడకూడదు’ అని ఆమెకు చిన్నప్పటి నుండి తెలుసు, తోటి విద్యార్థులకు మంచి సాక్ష్యం ఇవ్వాలని ఆమె ఎంతగానో కోరుకుంది. (రోమా. 1:16) ప్రతీ సంవత్సరం ఇతరులకు ప్రకటించాలని గట్టిగా నిర్ణయించుకునేది కానీ ఆమె ఎంత ప్రయత్నించినా భయంతో ప్రకటించలేకపోయేది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె వేరే పాఠశాలలో చేరింది. అప్పుడు ఆమె, “ఈసారి నాకు దొరికిన ఏ అవకాశాన్ని చేజారిపోనివ్వను” అని అనుకుంది. కిట్టీ క్రీస్తులాంటి ధైర్యం, వివేచన, సరైన అవకాశం కోసం ప్రార్థించింది.

18 పాఠశాలలో మొదటి రోజు విద్యార్థులను తమను తాము పరిచయం చేసుకోమని చెప్పారు. చాలామంది తాము ఏయే మతాలకు చెందినవారో చెప్పారు. అంతేకాక తమ మతాచారాల్లో పాల్గొనడంలేదని అన్నారు. తాను ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్లు ప్రార్థిస్తూ వచ్చానని కిట్టీ గుర్తించింది. తన వంతు వచ్చినప్పుడు, ఆమె ధైర్యంగా, “నేను ఒక యెహోవాసాక్షిని. ఆరాధన, ప్రవర్తన విషయంలో నేను బైబిల్లోని నియమాలు పాటిస్తాను” అని చెప్పింది. ఆమె తన విశ్వాసం గురించి మరికొన్ని విషయాలు చెబుతుంటే, కొందరు విద్యార్థులు ఆమెను వింతగా చూశారు. అయితే ఇతరులు ఆమె చెప్పేది శ్రద్ధగా విని ఆ తర్వాత ప్రశ్నలు కూడా అడిగారు. తన నమ్మకాలను సమర్థించడంలో కిట్టీ ఓ మంచి ఉదాహరణ అని ఉపాధ్యాయుడు అన్నాడు. ధైర్యం చూపించే విషయంలో యేసు చూపించిన మాదిరిని అనుసరించినందుకు కిట్టీ ఎంతో సంతోషించింది.

క్రీస్తులాంటి విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించండి

19. (ఎ) నిజమైన విశ్వాసం కలిగివుండాలంటే ఏమి చేయాలి? (బి) యెహోవాను మనం ఎలా సంతోషపెట్టగలం?

19 విశ్వాసం ఉంటే ధైర్యాన్ని క్రియల్లో చూపిస్తామని అపొస్తలులు కూడ గుర్తించారు. వారు యేసును, “విశ్వాసము వృద్ధిపొందించుము” అని వేడుకున్నారు. (లూకా 17:5, 6 చదవండి.) నిజమైన విశ్వాసం కలిగివుండడమంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం మాత్రమే కాదు. చిన్నపిల్లవానికి దయగల, ప్రేమగల తన తండ్రితో ఎలాంటి దగ్గరి సంబంధం ఉంటుందో అలాంటి సంబంధాన్నే మనం యెహోవాతో కలిగివుండాలి. దైవప్రేరణతో సొలొమోను ఇలా రాశాడు: “నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.” (సామె. 23:15, 16) అదే విధంగా, నీతి సూత్రాల విషయంలో మనం ధైర్యాన్ని చూపిస్తే యెహోవా సంతోషిస్తాడు. అది తెలుసుకున్నప్పుడు మన ధైర్యం పెరుగుతుంది. కాబట్టి, నీతి విషయంలో ధైర్యాన్ని చూపిస్తూ యేసు ఉదాహరణను ఎల్లప్పుడూ అనుకరిద్దాం!

[అధస్సూచి]

మీరు వివరించగలరా?

• మనం అపరిపూర్ణులమైనా విధేయత చూపించాలంటే ఏది అవసరం?

• నిజమైన విశ్వాసాన్ని ఎలా సంపాదించుకోవచ్చు? ధైర్యంగా ఉండేందుకు అదెలా సహాయం చేస్తుంది?

• విధేయతను కనబరుస్తూ క్రీస్తులాంటి ధైర్యాన్ని చూపించడం వల్ల ప్రయోజనమేమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[13వ పేజీలోని చిత్రం]

శోధనలకు లొంగిపోకుండా ఉండడానికి మీరు మీ ‘హృదయాన్ని స్థిరపరచుకుంటున్నారా?’

[15వ పేజీలోని చిత్రం]

యేసులా మనం కూడా విశ్వాసాన్ని బట్టి ధైర్యాన్ని చూపించవచ్చు