కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దైవిక విద్యకున్న అతిశ్రేష్ఠమైన విలువ

దైవిక విద్యకున్న అతిశ్రేష్ఠమైన విలువ

దైవిక విద్యకున్న అతిశ్రేష్ఠమైన విలువ

‘క్రీస్తుయేసునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానం కోసం సమస్తాన్నీ నష్టంగా ఎంచుకొంటున్నాను.’—ఫిలి. 3:8.

1, 2. కొందరు క్రైస్తవులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎందుకు?

రాబర్ట్‌ చిన్నప్పటి నుండి చదువులో రాణిస్తూ వచ్చాడు. తనకు ఎనిమిదేళ్లు ఉన్నప్పుడే ఒక టీచరు వాళ్లింటికి వచ్చి, ‘నీకు అసాధ్యమనేది ఏదీ లేదు నీవు ఏదైనా సాధించగలవు. నువ్వు ఏదో ఒకరోజు డాక్టరు అవుతావని ఆశిస్తున్నాను’ అని చెప్పింది. ఆయన ఉన్నత పాఠశాలలో మంచి మార్కులు సంపాదించాడు కాబట్టి ఆయన దేశంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా చేరవచ్చు. అలాంటి అవకాశం ఎవరికైనా జీవితంలో ఒకే ఒకసారి దొరుకుతుందని చాలామంది అనుకుంటారు. రాబర్ట్‌ క్రమ పయినీరు సేవ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. దాని కోసం పై చదువులకు వెళ్లే అవకాశాన్ని వదులుకున్నాడు.

2 రాబర్ట్‌లాగే, పెద్దాచిన్నా అనే తేడా లేకుండా క్రైస్తవుల్లోని అనేకులకు ఈ లోకంలో పైకి ఎదిగే అవకాశాలున్నాయి. ఆధ్యాత్మిక లక్ష్యాల కోసం అలాంటి అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోకూడదని కొందరు నిర్ణయించుకుంటారు. (1 కొరిం. 7:29-31) రాబర్ట్‌లాగే క్రైస్తవులు ప్రకటనా పనిలో కష్టపడి పనిచేసేందుకు ఎందుకు ముందుకొస్తున్నారు? ముఖ్యంగా యెహోవాపట్ల ప్రేమతోనే వారలా చేస్తున్నారు. అంతేకాక, యెహోవా చేత ఉపదేశించబడడం అతిశ్రేష్ఠమైనదని వారు అర్థం చేసుకున్నారు. ఒకవేళ, సత్యం తెలుసుకొని ఉండకపోతే మీ జీవితం ఎలా ఉండేదో ఈమధ్యకాలంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? యెహోవా చేత ఉపదేశించబడడం వల్ల వచ్చిన అద్భుతమైన ఆశీర్వాదాల్లో కొన్నింటి గురించి ఆలోచిస్తే సువార్త ఎంత విలువైందో గుర్తుంచుకుంటాం, ఉత్సాహంగా దాన్ని ఇతరులకు ప్రకటించగలుగుతాం.

దేవునిచేత ఉపదేశించబడడం ఎంతో గొప్ప విషయం

3. యెహోవా అపరిపూర్ణ మానవులకు ఉపదేశించడానికి ఇష్టపడుతున్నాడని ఎందుకు ఖచ్చితంగా చెప్పగలం?

3 యెహోవా తన మంచితనాన్ని బట్టే అసంపూర్ణ మానవులకు ఉపదేశించడానికి ఇష్టపడుతున్నాడు. అభిషిక్త క్రైస్తవుల గురించి యెషయా 54:13 ఇలా ప్రవచించింది: “నీ పిల్లలందరు యెహోవాచేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును.” ఒక రకంగా చెప్పాలంటే, ఆ మాటలు క్రీస్తుకు చెందిన ‘వేరే గొర్రెలకు’ కూడా వర్తిస్తాయి. (యోహా. 10:16) మన కాలంలో నెరవేరుతున్న ఒక ప్రవచనాన్ని బట్టి అది స్పష్టమౌతుంది. అన్ని జనాంగాల నుండి ప్రజలు ప్రవాహంలా సత్యారాధనలోకి రావడాన్ని యెషయా ఆ దర్శనంలో చూశాడు. ఆయన ఆ దర్శనంలో, “యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుతుము” అని వారు ఒకరితో ఒకరు చెప్పుకోవడాన్ని చూశాడు. (యెష. 2:1-3) యెహోవా చేత ఉపదేశించబడడం ఎంత గొప్ప విషయం!

4. తన నుండి ఉపదేశం పొందేవారు ఎలా ఉండాలని యెహోవా కోరుతున్నాడు?

4 యెహోవా నుండి ఉపదేశం పొందాలంటే మనం ఏమి చేయాలి? దాని కోసం మనం ప్రాముఖ్యంగా వినయాన్ని చూపించాలి. కీర్తనకర్తయైన దావీదు ఇలా రాశాడు: “యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై యున్నాడు. . . . తన మార్గమును దీనులకు నేర్పును.” (కీర్త. 25:8, 9) అంతేకాక, యేసు ఇలా చెప్పాడు: “తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరచినావని నిన్ను స్తుతించుచున్నాను.” (లూకా 10:21) “దీనులకు కృప అనుగ్రహించు” దేవునికి దగ్గరవ్వాలని మీకు అనిపించడం లేదా?—1 పేతు. 5:5.

5. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం ఎలా తెలుసుకోగలిగాం?

5 మన సొంత సామర్థ్యంతోనే, సొంత జ్ఞానంతోనే సత్యాన్ని తెలుసుకున్నామని మనం చెప్పగలమా? లేదు. నిజం చెప్పాలంటే, మనంతట మనమే దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని యేసు చెప్పాడు. (యోహా. 6:44) ప్రకటనా పని ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా యెహోవా ‘అన్యజనులందరి ఇష్టవస్తువులైన’ గొర్రెల్లాంటి ప్రజలను తనవైపు ఆకర్షిస్తున్నాడు. (హగ్గ. 2:7) యెహోవా తన కుమారునివైపు ఎంతోమందిని నడిపించాడు. వారిలో మీరూ ఉన్నందుకు ఆయనకు రుణపడిలేరా?—యిర్మీయా 9:23, 24 చదవండి.

మన జీవితాలను మార్చే శక్తి

6. ‘యెహోవా గురించిన జ్ఞానాన్ని’ సంపాదించడం వల్ల ప్రజలు ఎలాంటి గొప్ప మార్పులు చేసుకునే అవకాశముంది?

6 మన కాలంలో మానవుల వ్యక్తిత్వాల్లో వస్తున్న మార్పుల గురించి యెషయా తన ప్రవచనంలో కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. గతంలో క్రూరంగా ప్రవర్తించినవారు ఇప్పుడు శాంతికాముకులుగా మారారు. (యెషయా 11:6-9 చదవండి.) జాతి, దేశం, తెగ, లేదా సాంస్కృతిక భేదాలను బట్టి ఒకప్పుడు ఒకరినొకరు ద్వేషించుకున్నవారు కలిసిమెలిసి జీవించడం నేర్చుకున్నారు. మరోమాటలో చెప్పాలంటే వారు, “తమ ఖడ్గములను నాగటి నక్కులుగా” మార్చుకున్నారు. (యెష. 2:4) వారన్ని మార్పులు ఎందుకు చేసుకున్నారు? వారు ‘యెహోవా గురించిన జ్ఞానాన్ని’ సంపాదించుకొని, దాన్ని తమ జీవితాల్లో పాటించారు. దేవుని సేవకులు అపరిపూర్ణులైనప్పటికీ, వారు నిజమైన అంతర్జాతీయ సహోదరత్వంలో భాగమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా సువార్త పట్ల చూపిస్తున్న ఆకర్షణ, దాని వల్ల వస్తున్న మంచి ఫలితాలు దైవిక విద్య ఎంత విలువైందో రుజువుచేస్తున్నాయి.—మత్త. 11:19.

7, 8. (ఎ) దైవిక విద్య వల్ల ‘దుర్గంలా’ బలంగా పాతుకుపోయిన ఏ విషయాలను ప్రజలు పడద్రోయగలుగుతారు? (బి) దైవిక విద్య వల్ల యెహోవా స్తుతించబడతాడని ఎలా చెప్పవచ్చు?

7 అపొస్తలుడైన పౌలు దేవుని సేవకులు చేస్తున్న పరిచర్యను ఆధ్యాత్మిక యుద్ధంతో పోల్చాడు. ఆయన, ‘మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవునియెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి. దేవునిగూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోస్తున్నాం.’ (2 కొరిం. 10:4, 5) ‘దుర్గంలా’ బలంగా పాతుకుపోయిన విషయాల నుండి దైవిక విద్య ప్రజలను విముక్తి చేస్తోంది. అవేమిటి? వాటిలో అబద్ధ బోధలు, మూఢనమ్మకాలు, మానవ సిద్ధాంతాలు వంటివి ఉన్నాయి. అవి మచ్చుకు కొన్ని మాత్రమే. (కొలొ. 2:8) అంతేకాక, చెడు అలవాట్లను విడిచిపెట్టి దేవుడు ఇష్టపడే లక్షణాలను అలవర్చుకునేందుకు దైవిక విద్య సహాయం చేస్తోంది. (1 కొరిం. 6:9-11) కుటుంబంలో సంతోషాన్ని పెంచుతుంది. నిరాశనిస్పృహల్లో మునిగిపోయినవారి జీవితంలో ఆశను నింపుతుంది. ఇప్పుడు అలాంటి విద్యే అవసరం.

8 కింది ఉదాహరణ చూపిస్తున్నట్లుగా, ప్రజలు అనేక లక్షణాలతో పాటు యోగ్యంగా లేదా నిజాయితీగా ప్రవర్తించడం కూడా నేర్చుకునేందుకు యెహోవా సహాయం చేస్తాడు. (హెబ్రీ. 13:18) ఇండియాలోని ఒకామె బైబిలు అధ్యయనం చేసి కొంతకాలానికి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకురాలైంది. ఒకరోజు రాజ్యమందిర నిర్మాణ పనిలో పాల్గొని ఇంటికి వస్తుంటే ఆమెకు బస్టాండులో బంగారు గొలుసు దొరికింది. దాని విలువ దాదాపు 40 వేల రూపాయలు ఉంటుంది. ఆమె పేదరాలే అయినా ఆ గొలుసును పోలీస్‌ స్టేషనుకు తీసుకెళ్లి దాని యజమానికి ఇవ్వమని కోరింది. ఆ పోలీసు అధికారి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. మరో అధికారి ఆమెను ఇలా అడిగాడు: “ఈ గొలుసును మీ దగ్గరే ఎందుకు ఉంచుకోలేదు?” దానికి ఆమె, “బైబిలు బోధలవల్ల నేను మారాను. నేను ఇప్పుడు నిజాయితీగా ఉంటున్నాను” అని చెప్పింది. ఆ అధికారి ఎంతో ముగ్ధుడై ఆమెతో స్టేషనుకు వచ్చిన క్రైస్తవ పెద్దతో ఇలా అన్నాడు: “ఈ రాష్ట్రంలో 3 కోట్ల 80 లక్షలకన్నా ఎక్కువమంది ఉన్నారు. ఈమెలా 10 మందిని మార్చగలిగితే చాలు, అది గొప్ప విజయమే అవుతుంది.” దైవిక విద్య వల్ల కోట్లాది మంది జీవితాల్లో మార్పు వచ్చిందనే విషయం గురించి ఆలోచించినప్పుడు యెహోవాను స్తుతించేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయని మనకు అనిపించడం లేదా?

9. ప్రజలు తమ జీవితాల్లో ఎన్నో మార్పులు ఎలా చేసుకోగలుగుతున్నారు?

9 జీవితాలను మార్చే శక్తివున్న బైబిలుతోపాటు పరిశుద్ధాత్మను కూడా యెహోవా ఇచ్చాడు. అవి ప్రజలు తమ జీవితాల్లో ఎన్నో మార్పులు చేసుకునేందుకు సహాయం చేస్తాయి. (రోమా. 12:2; గల. 5:22, 23) కొలొస్సయులకు 3:9, 10 ఇలా చెబుతోంది: ‘జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనుడి.’ ఓ వ్యక్తి అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టి, అతని ఆలోచనా విధానంతో పాటు భావాలనూ మార్చే శక్తి బైబిలు సందేశానికి ఉంది. (హెబ్రీయులకు 4:12 చదవండి.) లేఖనాల గురించిన ఖచ్చితమైన జ్ఞానం పొందడంతోపాటు యెహోవా నీతి ప్రమాణాల ప్రకారం తమ జీవితాలను మార్చుకోవడం వల్ల ఒక వ్యక్తి యెహోవాకు స్నేహితుడవుతాడు. అతనికి నిత్యమూ జీవించే అవకాశం కూడా లభిస్తుంది.

యెహోవా మనల్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తున్నాడు

10. (ఎ) యెహోవా మాత్రమే మనల్ని భవిష్యత్తు కోసం ఎందుకు సిద్ధం చేయగలడు? (బి) త్వరలో భూమ్మీద ఎలాంటి పెనుమార్పులు జరుగుతాయి?

10 భవిష్యత్తులో ఏమి జరుగుతుందో యెహోవాకు తెలుసు కాబట్టి ఆయన మాత్రమే మనల్ని భవిష్యత్తు కోసం సిద్ధం చేయగలడు. మానవుల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆయన నిర్ణయిస్తాడు. (యెష. 46:9, 10) “యెహోవా మహా దినము సమీపమాయెను” అని బైబిలు ప్రవచనం తెలియజేస్తుంది. (జెఫ. 1:14) ఆ దినం గురించి సామెతలు 11:4లో చెప్పబడిన మాటలు నిజమౌతాయి. అక్కడ ఇలా ఉంది: “ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి రక్షించును.” సాతాను లోకానికి యెహోవా తీర్పుతీర్చే సమయం వచ్చినప్పుడు యెహోవాతో మనకున్న సంబంధానికే ఎక్కువ విలువుంటుంది కానీ, డబ్బుకు కాదు. యెహెజ్కేలు 7:19 కూడా ఇలా చెబుతోంది: “తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని యెంచుదురు.” అలా జరుగుతుందని తెలుసుకోవడం వల్ల మనం ఇప్పుడు జ్ఞానయుక్తమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

11. దైవిక విద్య మనల్ని ఏ విధంగా కూడా భవిష్యత్తు కోసం సిద్ధం చేస్తుంది?

11 దైవిక విద్య మనల్ని ఓ ప్రత్యేకమైన విధంగా కూడా యెహోవా ఉగ్రత దినం కోసం సిద్ధం చేస్తుంది. అది సరైన విషయాలకు ప్రాధాన్యతనిచ్చేలా మనకు సహాయం చేస్తుంది. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇలా రాశాడు: “ఇహమందు ధనవంతులైనవారు గర్విష్టులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, . . . దేవునియందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపించుము.” మనం ధనవంతులం కాకపోయినా ఈ దైవిక ఉపదేశం వల్ల ప్రయోజనం పొందవచ్చు. దాని కోసం ఏమి చేయాలి? వస్తుసంపదలు కూడబెట్టే బదులు ‘మేలుచేసేవారిగా, సత్క్రియలు అను ధనము గలవారిగా’ ఉండేందుకు కృషి చేయాలి. మన జీవితాల్లో యెహోవా సేవకు మొదటి స్థానం ఇస్తే ‘రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకోగలుగుతాం.’ (1 తిమో. 6:17-19) అలా త్యాగాలు చేస్తే మనకు మంచి వివేచనా శక్తి ఉందని చూపిస్తాం. ఎందుకంటే యేసు, “ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము?” అని అన్నాడు. (మత్త. 16:26, 27) యెహోవా దినం దగ్గర్లో ఉంది కాబట్టి మనలో ప్రతీ ఒక్కరం, ‘నేను ధనాన్ని ఎక్కడ కూర్చుకుంటున్నాను? నేను దేవునికి దాసునిగా ఉంటున్నానా లేదా సిరికి దాసునిగా ఉంటున్నానా?’ అని ప్రశ్నించుకోవాలి.—మత్త. 6:19, 20, 24.

12. కొందరు మన పరిచర్యను చులకన చేసినంత మాత్రాన మనం ఎందుకు వెనక్కు తగ్గకూడదు?

12 ప్రాణాలను రక్షించే సువార్త ప్రకటనా పని, శిష్యులను చేసే పని క్రైస్తవులు చేయాల్సిన ‘సత్క్రియల్లో’ అత్యంత ప్రాముఖ్యమైనవని బైబిలు చెబుతోంది. (మత్త. 24:14; 28:19, 20) మొదటి శతాబ్దంలో చూసినట్లే కొంతమంది మన పరిచర్యను చులకనగా చూడవచ్చు. (కొరింథీయులు 1:18-21 చదవండి.) అంతమాత్రాన మన సందేశానికున్న విలువ తగ్గిపోదు. సమయం ఉండగానే మన సందేశాన్ని విని దాన్ని విశ్వసించే అవకాశాన్ని ప్రజలందరికీ ఇవ్వాలి. ప్రజలు చులకనగా చూసినంత మాత్రాన దాని ప్రాముఖ్యతా తగ్గిపోదు. (రోమా. 10:13, 14) దైవిక విద్య నుండి ప్రయోజనం పొందేలా ప్రజలకు సహాయం చేసే కొద్దీ మనం ఎన్నో ఆశీర్వాదాలను పొందుతాం.

త్యాగాలు చేసినందుకు ఆశీర్వదించబడ్డారు

13. సువార్త కోసం అపొస్తలుడైన పౌలు ఏయే త్యాగాలు చేశాడు?

13 క్రైస్తవుడు కాకముందు, అపొస్తలుడైన పౌలు యూదా మతంలో రాణించేలా శిక్షణ పొందాడు. ఆయనకు బహుశా 13 ఏళ్లు కూడా నిండకముందే తన సొంత ఊరు అయిన తార్సును విడిచిపెట్టి యెరూషలేముకు వెళ్లాడు. ధర్మశాస్త్ర బోధకునిగా ఎంతో గౌరవించబడే గమలీయేలు దగ్గర విద్యను అభ్యసించడానికి అక్కడికి వెళ్లాడు. (అపొ. 22:3) కొంత కాలానికి తన సమకాలీనుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన అలాగే కొనసాగివుంటే యూదా మతంలో ప్రముఖుడయ్యేవాడు. (గల. 1:13, 14) ఆయన సువార్తను అంగీకరించినప్పుడు వాటన్నిటినీ విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. తప్పుడు నిర్ణయం తీసుకున్నానని ఆయన అనుకున్నాడా? లేదు. ఆయన ఇలా రాశాడు: “నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతి శ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.”—ఫిలి. 3:8.

14, 15. ‘దేవుని జతపనివారిగా’ మనం ఎలాంటి ఆశీర్వాదాలను అనుభవిస్తున్నాం?

14 పౌలులా క్రైస్తవులైన మనం నేడు ప్రకటనా పని కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నాం. (మార్కు 10:29, 30) అలా త్యాగాలు చేయడం వల్ల మనం ఏమైనా నష్టపోతామా? చాలామంది ఈ ఆర్టికల్‌ మొదట్లో ప్రస్తావించబడిన రాబర్ట్‌లాగే అనుకుంటున్నారు. ఆయన ఇలా అన్నాడు: “ఇలా చేసినందుకు నేను అస్సలు బాధపడడం లేదు. పూర్తికాల పరిచర్య నాలో ఆనందాన్ని సంతృప్తిని నింపింది. దానివల్ల నాకు ‘యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనే’ అవకాశం కలిగింది. యెహోవా సేవ కోసం వస్తుపరంగా ఏ త్యాగం చేసినా నేను చేసినదానికన్నా ఎక్కువగా యెహోవా నన్ను ఆశీర్వదించాడు. నేను అన్నీ పొందానే తప్ప, నేనేదో పెద్ద త్యాగం చేసినట్లు నాకు అనిపించలేదు.”—కీర్త. 34:8; సామె. 10:22.

15 మీరు గత కొంతకాలంగా ప్రకటనా పనిని బోధనా పనిని చేస్తున్నట్లయితే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునే అవకాశాలు ఖచ్చితంగా మీకు కూడా లభించే ఉంటాయి. ఇతరులకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు యెహోవా పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందినట్లు ఎప్పుడైనా మీకు అనిపించిందా? సందేశాన్ని శ్రద్ధగా వినేలా యెహోవా వారి హృదయాన్ని తెరిచినప్పుడు వారి కళ్లల్లో ఆనందాన్ని చూశారా? (అపొ. 16:14) అడ్డంకులను అధిగమించేలా యెహోవా మీకు సహాయం చేశాడా? ఉదాహరణకు, పరిచర్యను మరింత చేసేలా మీకున్న అడ్డంకులను ఆయన తొలగించాడా? మీకు నిస్సత్తువగా అనిపించినప్పుడు మీరు మీ పరిచర్యను కొనసాగించేలా ఆయన మీ కష్ట కాలాల్లో తోడుగా నిలిచాడా? (ఫిలి. 4:13) పరిచర్యలో మనం యెహోవా సహాయాన్ని స్వయంగా చవిచూసినప్పుడు యెహోవా నిజంగా ఉన్నాడనే నమ్మకం బలపడుతుంది. ఆయనకు మరింత దగ్గరౌతాం. (యెష. 41:9, 10) దైవిక విద్య అనే గొప్ప పనిలో మనం “దేవుని జతపనివారిగా” ఉండడం ఒక ఆశీర్వాదం కాదంటారా?—1 కొరిం. 3:9.

16. దైవిక విద్యకు సంబంధించి మీరు చేసే కృషి విషయంలో, త్యాగాల విషయంలో మీకు ఏమనిపిస్తుంది?

16 చిరకాలం తమ పేరు నిలిచిపోయేలా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని చాలామంది ఆశిస్తారు. ఈ లోకంలో వివిధ ప్రముఖులు సాధించే విజయాలను కూడా ప్రజలు గుర్తుంచుకోవడం లేదని మనం చూశాం. అయితే, నేడు యెహోవా నామాన్ని మహిమపరచడానికి సంబంధించి ఆయన ప్రజలు చేస్తున్న పనులు వారి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అవి ఎప్పుడూ గుర్తుచేసుకోబడతాయి. (సామె. 10:7; హెబ్రీ. 6:10) చరిత్రలో నిలిచిపోయే పనిలో అంటే యెహోవా గురించి బోధించే పనిలో భాగం వహించడాన్ని మనకు లభించిన గొప్ప అవకాశంగా భావిద్దాం.

మీరు ఎలా జవాబిస్తారు?

• తన చేత ఉపదేశించబడేవారు ఎలా ఉండాలని యెహోవా కోరుతున్నాడు?

• దైవిక విద్య ప్రజల జీవితాలను ఎలా మారుస్తుంది?

• దైవిక విద్య నుండి ప్రయోజనం పొందేలా ఇతరులకు సహాయం చేయడం వల్ల మనం ఏ విధంగా ఆశీర్వదించబడ్డాం?

[అధ్యయన ప్రశ్నలు]

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా చేత ఉపదేశించబడేవారు నిజమైన అంతర్జాతీయ సహోదరత్వంలో భాగమయ్యారు

[24వ పేజీలోని చిత్రం]

‘దేవుని జతపనివారిగా’ ఉండడం ఓ ఆశీర్వాదం కాదంటారా?