కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిలు శ్రద్ధగా చదివి మీ ప్రార్థనలను మెరుగుపర్చుకోండి

బైబిలు శ్రద్ధగా చదివి మీ ప్రార్థనలను మెరుగుపర్చుకోండి

బైబిలు శ్రద్ధగా చదివి మీ ప్రార్థనలను మెరుగుపర్చుకోండి

‘యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను ఆలకించుము.’—నెహె. 1:11.

1, 2. బైబిల్లో రాయబడిన కొన్ని ప్రార్థనలను పరిశీలించడం ఎందుకు ప్రయోజనకరం?

సత్యారాధనలో ప్రార్థనకు, బైబిలును శ్రద్ధగా చదవడానికి ప్రాముఖ్యమైన స్థానముంది. (1 థెస్స. 5:17; 2 తిమో. 3:16, 17) నిజమే, బైబిలు ఒక ప్రార్థనా పుస్తకం కాకపోయినప్పటికి, దానిలో అనేక ప్రార్థనలున్నాయి, వాటిలో చాలా ప్రార్థనల్ని మనం కీర్తనల పుస్తకంలో చూస్తాం.

2 మీరు శ్రద్ధగా బైబిలు చదువుతున్నప్పుడు బహుశా మీకు ఎదురయ్యే పరిస్థితులకు సరిపడే ప్రార్థనలు మీకు కనిపించవచ్చు. నిజానికి బైబిల్లో రాయబడిన ప్రార్థనల్లోని అంశాలను మీ ప్రార్థనల్లో ప్రస్తావించినప్పుడు అవి మరింత మెరుగ్గా ఉంటాయి. సహాయం అర్థించి జవాబు పొందిన వారినుండి, వారు ప్రార్థించిన విషయాల నుండి మీరేమి నేర్చుకోవచ్చు?

దేవుని నిర్దేశమేమిటో తెలుసుకొని దానిని పాటించండి

3, 4. అబ్రాహాము దాసుడు ఏ పనిమీద వెళ్లాడు? ఆ దాసుని ప్రార్థనకు యెహోవా ఇచ్చిన జవాబు నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

3 బైబిలును శ్రద్ధగా చదివినప్పుడు, అన్ని సందర్భాల్లో దేవుని నిర్దేశం కోసం ప్రార్థించాలనే విషయం తెలుసుకుంటారు. ఇస్సాకుకు దైవభయంగల భార్యను తీసుకొచ్చేందుకు పూర్వికుడైన అబ్రాహాము తన పెద్ద దాసుణ్ణి, బహుశా ఎలీయెజెరును మెసొపొతమియకు పంపించినప్పుడు ఏమి జరిగిందో గమనించండి. ఒక బావి దగ్గర స్త్రీలు నీళ్లు చేదుకుంటూ ఉండగా ఆ దాసుడు ఇలా ప్రార్థించాడు: “యెహోవా . . . నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా—నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండునుగాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందుననెను.”—ఆది. 24:12-14.

4 అబ్రాహాము దాసుని ఒంటెలకు రిబ్కా, నీళ్లు పోసినప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు లభించింది. ఆ తర్వాత రిబ్కా ఆయనతోపాటు కనానుకు వచ్చి ఇస్సాకును పెళ్లి చేసుకుంది. అలాగని దేవుడు మీక్కూడా ఓ ప్రత్యేక సూచనేదో ఇస్తాడని ఆశించకూడదు. అయితే దేవునికి ప్రార్థించి, ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడేందుకు నిర్ణయించుకుంటే ఆయన మీకు తగిన నిర్దేశమిస్తాడు.—గల. 5:18.

ప్రార్థన భయాన్ని తగ్గిస్తుంది

5, 6. ఏశావును కలుసుకునే ముందు యాకోబు చేసిన ప్రార్థనలో ముఖ్యంగా మనమేమి గమనించవచ్చు?

5 ప్రార్థన భయాన్ని తగ్గిస్తుంది. తన కవల సోదరుడైన ఏశావువల్ల తనకు ప్రమాదముందని భయపడిన యాకోబు ఇలా ప్రార్థించాడు: “యెహోవా . . . నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను . . . నా సహోదరుడైన ఏశావు చేతినుండి దయచేసి నన్ను తప్పించుము; అతడు వచ్చి పిల్లలతో తల్లిని, నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నీవు—నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు, విస్తారమగుటవలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను.”—ఆది. 32:9-12.

6 యాకోబు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా, ఆయనా ఏశావూ సమాధానపడినప్పుడు ఆయన ప్రార్థనకు జవాబు లభించింది. (ఆది. 33:1-4) యాకోబు చేసిన ప్రార్థనను మీరు జాగ్రత్తగా చదివితే, ఆయన కేవలం సహాయం కోసమే ప్రార్థించలేదని గ్రహిస్తారు. ఆయన వాగ్దత్త సంతానంపై తన విశ్వాసాన్ని, దేవుని కృపపట్ల తన కృతజ్ఞతను వ్యక్తపర్చాడు. మీలోనూ అలాంటి ‘భయాలున్నాయా?’ (2 కొరిం. 7:5) అలాగైతే, ప్రార్థన మీలోని భయాన్ని తగ్గిస్తుందని యాకోబు ప్రార్థన మీకు గుర్తుచేయవచ్చు. అయితే అవసరమైన వాటి గురించే ప్రార్థించడం కాదుగానీ విశ్వాసం వ్యక్తపర్చే మాటలూ మన ప్రార్థనలో ఉండాలి.

జ్ఞానం కోసం ప్రార్థించండి

7. తన మార్గాలు తెలియజేయమని మోషే యెహోవాను ఎందుకు ప్రార్థించాడు?

7 యెహోవాను సంతోషపర్చాలనే కోరిక మనలోవుంటే, జ్ఞానం కోసం ఆయనకు ప్రార్థిస్తాం. తన మార్గాలేమిటో తెలియజేయమని మోషే దేవుణ్ణి ప్రార్థించాడు. ఆయనిలా వేడుకున్నాడు: “ఈ ప్రజలను [ఐగుప్తు నుండి] తోడుకొని పొమ్మని [యెహోవా] నీవు నాతో చెప్పుచున్నావు . . . కాబట్టి నీ కటాక్షము నా యెడల కలిగిన యెడల నీ కటాక్షము నా యెడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము.” (నిర్గ. 33:12, 13) దానికి జవాబుగా దేవుడు తన ప్రజలను చక్కగా నడిపించడానికి మోషేకు అవసరమైన పరిజ్ఞానాన్ని ఇచ్చాడు.

8. మొదటి రాజులు 3:7-14లోని విషయాన్ని ధ్యానించడం ద్వారా మీరెలా ప్రయోజనం పొందవచ్చు?

8 “యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము” అని దావీదు కూడా ప్రార్థించాడు. (కీర్త. 25:4) ఇశ్రాయేలును పరిపాలించడానికి అవసరమైన జ్ఞానం ఇమ్మని దావీదు కుమారుడైన సొలొమోను దేవుణ్ణి వేడుకున్నాడు. సొలొమోను చేసిన ప్రార్థనకు సంతోషించి యెహోవా ఆయన అడిగిన జ్ఞానంతోపాటు ఐశ్వర్యాన్నీ, ఘనతనూ అనుగ్రహించాడు. (1 రాజులు 3:7-14 చదవండి.) మీకు ఇవ్వబడిన సంఘ బాధ్యతలు నిర్వహించలేరని మీకనిపించినప్పుడు జ్ఞానం కోసం ప్రార్థించి, వినయం చూపించండి. అప్పుడు మీరు మీ బాధ్యతల్ని సరైన రీతిలో, ప్రేమపూర్వకంగా నిర్వహించేలా అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకొని, వివేచనతో పనిచేయడానికి దేవుడు సహాయం చేస్తాడు.

హృదయపూర్వకంగా ప్రార్థించండి

9, 10. ఆలయ ప్రతిష్ఠాపనప్పుడు సొలొమోను చేసిన ప్రార్థనలో హృదయానికి సంబంధించి ఏ ప్రత్యేక విషయాన్ని మీరు గమనించారు?

9 దేవుడు మీ ప్రార్థన వినాలంటే మీరు హృదయపూర్వకంగా ప్రార్థించాలి. సా.శ.పూ. 1026వ సంవత్సరం, యెరూషలేములో యెహోవా ఆలయ ప్రతిష్ఠాపనప్పుడు సమకూడిన ప్రజలందరి ఎదుట సొలొమోను హృదయపూర్వకంగా చేసిన ప్రార్థనను మనం మొదటి రాజులు 8వ అధ్యాయంలో చదువుతాం. నిబంధన మందసాన్ని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టిన తర్వాత యెహోవా మేఘం ఆలయంలో నిండుకుంది, అది చూసిన సొలొమోను దేవుణ్ణి స్తుతించాడు.

10 సొలొమోను చేసిన ప్రార్థనను శ్రద్ధగా పరిశీలించి, అందులో హృదయం చాలాసార్లు ప్రస్తావించబడిందనే విషయం గమనించండి. ఒకరి హృదయంలో ఏముందో యెహోవాకు మాత్రమే తెలుసని సొలొమోను అన్నాడు. (1 రాజు. 8:38, 39) ఆ ప్రార్థనలోనే ఆయన, ‘పూర్ణహృదయంతో దేవుని తట్టు తిరిగిన’ పాపికి నిరీక్షణ ఉందని అన్నాడు. దేవుని ప్రజలు ఒకవేళ శత్రువు చేతికి చిక్కినా, వారు యెహోవాకు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే, ఆయన వారి ప్రార్థనలు వింటాడు. (1 రాజు. 8:48, 58, 61) కాబట్టి మీరుచేసే ప్రార్థనలు హృదయపూర్వకంగా ఉండాలి.

కీర్తనలు మీ ప్రార్థనలను ఎలా మెరుగుపరుస్తాయి?

11, 12. కొంతకాలంపాటు దేవుని ఆలయానికి వెళ్లలేకపోయిన ఓ లేవీయుడు చేసిన ప్రార్థన నుండి మీరేమి నేర్చుకున్నారు?

11 కీర్తనలను శ్రద్ధగా చదవడం మీ ప్రార్థనలను మెరుగుపర్చి, దేవుని జవాబు కోసం నిరీక్షించేందుకు తోడ్పడుతుంది. పరవాసంలో ఉన్న లేవీయుడు ఎంత ఓపిక చూపించాడో గమనించండి. కొంతకాలంపాటు ఆయన యెహోవా ఆలయానికి వెళ్లలేకపోయినా, ఆయనిలా అన్నాడు: “నా ప్రాణమా, నీవేల క్రుంగియున్నావు? నాలో నీవేల తొందరపడుచున్నావు? దేవునియందు నిరీక్షణ యుంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకను నేనాయనను స్తుతించెదను.”—కీర్త. 42:5, 11; 43:5.

12 ఆ లేవీయుని ఉదాహరణ నుండి మనమేమి నేర్చుకోవచ్చు? నీతినిమిత్తం మీరు జైల్లోవుండి కొంతకాలం వరకు తోటి విశ్వాసులతో కలిసి ఆరాధించడం కుదరకపోతే, దేవుడు మీకు సహాయం చేసేంతవరకు ఓపికగా నిరీక్షించండి. (కీర్త. 37:5) గతంలో దేవుని సేవలో మీరు ఆనందించిన సందర్భాల్ని గుర్తుచేసుకుంటూ, మీరు తిరిగి తన ప్రజలతో సహవసించేలా మీకు సహాయం చేసేంతవరకు ‘దేవునియందు నిరీక్షిస్తూ’ సహనం కోసం ప్రార్థించండి.

విశ్వాసంతో ప్రార్థించండి

13. యాకోబు 1:5-8 చెబుతున్నట్లు మనమెందుకు విశ్వాసంతో ప్రార్థించాలి?

13 మీరు ఎలాంటి పరిస్థితిలోవున్నా విశ్వాసంతో ప్రార్థించండి. మీరొకవేళ మీ యథార్థతకు సంబంధించిన పరీక్షను ఎదుర్కొంటుంటే, శిష్యుడైన యాకోబు ఇచ్చిన సలహాను పాటించండి. యెహోవాకు ప్రార్థించడమే కాక, మీరు ఎదుర్కొంటున్న పరీక్షను సహించడానికి అవసరమైన జ్ఞానాన్ని ఆయన ఇస్తాడనే నమ్మకం కూడా కలిగివుండండి. (యాకోబు 1:5-8 చదవండి.) మీరెంత కలతపడుతున్నారో దేవునికి తెలుసు, ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా మీకు నడిపింపును, ఓదార్పును ఇస్తాడు. “ఏమాత్రమును సందేహింపక” పూర్తి విశ్వాసంతో మీ హృదయాన్ని ఆయన ఎదుట కుమ్మరించి, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపును, ఆయన వాక్యమిచ్చే ఉపదేశాన్ని అంగీకరించండి.

14, 15. హన్నా విశ్వాసంతో ప్రార్థించింది, ప్రవర్తించింది అని ఎందుకు చెప్పవచ్చు?

14 లేవీయుడైన ఎల్కానా ఇద్దరు భార్యల్లో ఒకరైన హన్నా విశ్వాసంతో ప్రార్థించింది, ప్రవర్తించింది. పిల్లల్లేని హన్నాను, చాలామంది పిల్లలున్న ఆమె సవతి పెనిన్నా విసిగించేది. తనకు మగ పిల్లవాడు పుడితే, అతణ్ణి యెహోవాకు అప్పగిస్తానని ఆలయంలో హన్నా ప్రమాణం చేసింది. ప్రార్థిస్తున్నప్పుడు ఆమె పెదవులు వణకడం చూసిన ప్రధాన యాజకుడైన ఏలీ ఆమె తాగిన మత్తులో ఉందనుకున్నాడు. తాను పొరబడ్డానని గ్రహించి, “ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక” అని ఆమెతో అన్నాడు. చివరకు ఏమి జరుగుతుందో హన్నాకు ఖచ్చితంగా తెలియకపోయినా, తన ప్రార్థనకు జవాబు లభిస్తుందని ఆమె విశ్వసించింది. కాబట్టి ఆమె అప్పటినుండి “దుఃఖముఖిగా” ఉండడం మానేసింది అంటే ఆమె ఇక చింతించడం మానేసింది.—1 సమూ. 1:9-18.

15 సమూయేలు పుట్టి, పాలు మానేసిన తర్వాత, దేవాలయంలో పవిత్ర సేవ చేసేందుకు హన్నా ఆ బాలుణ్ణి యెహోవాకు అప్పగించింది. (1 సమూ. 1:19-28) దేవాలయంలో హన్నా చేసిన ప్రార్థనను శ్రద్ధగా పరిశీలిస్తే, మీ ప్రార్థనలు మెరుగవడమే కాక, యెహోవా జవాబిస్తాడనే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనస్సును కృంగదీసే దుఃఖాన్నైనా అధిగమించవచ్చని గ్రహిస్తారు.—1 సమూ. 2:1-10.

16, 17. నెహెమ్యా విశ్వాసంతో ప్రార్థించి, ప్రవర్తించినందువల్ల ఏమి జరిగింది?

16 సా.శ.పూ. ఐదవ శతాబ్దంలో జీవించిన నీతిమంతుడైన నెహెమ్యా కూడా విశ్వాసంతో ప్రార్థించాడు, ప్రవర్తించాడు. ఆయనిలా ప్రార్థించాడు: “యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను.” నెహెమ్యా ప్రార్థనలో ప్రస్తావించిన “ఈ మనుష్యుడు” ఎవరు? ఆయన పారసీక రాజైన అర్తహషస్త, ఈయన దగ్గర నెహెమ్యా గిన్నె అందించేవానిగా పనిచేశాడు.—నెహె. 1:11.

17 బబులోను చెరనుండి విడిపించబడిన యూదులు ‘శ్రమను నిందను పొందుతున్నారని, యెరూషలేము ప్రాకారము పడద్రోయబడిందని’ తెలుసుకున్న నెహెమ్యా చాలారోజులు విశ్వాసంతో ప్రార్థించాడు. (నెహె. 1:3, 4) నెహెమ్యా ఊహించినదానికన్నా మిన్నగా ఆయన ప్రార్థనకు జవాబు లభించింది. ఎలాగంటే యెరూషలేముకు తిరిగివెళ్లి దాని ప్రాకారాలను నిర్మించడానికి అర్తహషస్త రాజు నెహెమ్యాను అనుమతించాడు. (నెహె. 2:1-8) అనతికాలంలోనే యెరూషలేము ప్రాకారాలు మరమ్మతు చేయబడ్డాయి. సత్యారాధనను దృష్టిలో పెట్టుకొని నెహెమ్యా విశ్వాసంతో ప్రార్థించాడు కాబట్టి వాటికి జవాబు లభించింది. మీ ప్రార్థనలూ అలాగే ఉంటున్నాయా?

స్తుతించడం, కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి

18, 19. యెహోవా సేవకుడు ఏ కారణాలనుబట్టి ఆయనను స్తుతించాలి, కృతజ్ఞతలు చెప్పాలి?

18 ప్రార్థించేటప్పుడు యెహోవాను స్తుతిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోకండి. అలా ప్రార్థించడానికి మనకెన్నో కారణాలున్నాయని చెప్పవచ్చు. ఉదాహరణకు, యెహోవా రాజ్యపరిపాలనను దావీదు కొనియాడాడు. (కీర్తన 145:10-13 చదవండి.) యెహోవా రాజ్యాన్ని ప్రకటించే ఆధిక్యతపట్ల మీకు కృతజ్ఞత ఉందని మీ ప్రార్థనలు చూపిస్తున్నాయా? క్రైస్తవ కూటాలు, సమావేశాల పట్ల మీకెంత కృతజ్ఞతవుందో దేవునికి హృదయపూర్వకంగా తెలియజేయడానికి కూడా దావీదు మాటలు దోహదపడవచ్చు.—కీర్త. 27:4; 122:1.

19 దేవునితో మీకున్న విలువైన సంబంధం పట్ల కృతజ్ఞతవుంటే హృదయపూర్వకంగా మీరిలా ప్రార్థించగలుగుతారు: “నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘమండలమువరకు వ్యాపించియున్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము. నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము.” (కీర్త. 57:9-11) ఆ మాటలెంత ప్రోత్సాహకరంగా ఉన్నాయి! కీర్తనల్లోని ఆ మాటలు మీ ప్రార్థనలను తీర్చిదిద్ది వాటిని మరింత మెరుగుపరుస్తాయని మీరంగీకరించరా?

పూజ్యభావంతో దేవుణ్ణి వేడుకోండి

20. దేవునిపట్ల తనకు భక్తివుందని మరియ ఎలా వ్యక్తపర్చింది?

20 దేవునిపట్ల పూజ్యభావముందని మీ ప్రార్థనల్లో స్పష్టంగా కనిపించాలి. మెస్సీయకు తాను తల్లిని అవుతానని తెలిసిన వెంటనే పూజ్యభావంతో మరియ చేసిన ప్రార్థన కూడా, దేవాలయ సేవకు బాలుడైన సమూయేలును అప్పగించినప్పుడు హన్నా చేసిన ప్రార్థనలాగే ఉంది. మరియకు దేవుని పట్ల పూజ్యభావం ఉందనే విషయం ఆమె పలికిన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. “నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను” అని ఆమె ప్రార్థించింది. (లూకా 1:46, 48) అలాంటి మాటలనే వ్యక్తపరుస్తూ మీ ప్రార్థనలను మెరుగుపర్చుకోగలరా? దైవభక్తిగల మరియను మెస్సీయ అయిన యేసుకు తల్లిగా దేవుడు ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదు.

21. యేసు విశ్వాసం ప్రదర్శిస్తూ పూజ్యభావంతో ప్రార్థించాడని ఎలా చెప్పవచ్చు?

21 యేసు పూర్ణవిశ్వాసం ప్రదర్శిస్తూ పూజ్యభావంతో ప్రార్థించాడు. ఉదాహరణకు, లాజరును పునరుత్థానం చేయడానికి ముందు, “యేసు కన్నులు పైకెత్తి—తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును” అని ప్రార్థించాడు. (యోహా. 11:41, 42) మీరు కూడా అలాంటి విశ్వాసంతో, పూజ్యభావంతో ప్రార్థిస్తారా? యేసు నేర్పిన భక్తిపూర్వక మాదిరి ప్రార్థనను మీరు శ్రద్ధగా చదివితే, అందులో ప్రత్యేకంగా యెహోవా నామం పరిశుద్ధపర్చడం, ఆయన రాజ్యం రావడం, ఆయన చిత్తం నెరవేరడం వంటి ముఖ్యాంశాలను మీరు గమనిస్తారు. (మత్త. 6:9, 10) మీరు చేసుకునే ప్రార్థనల గురించి ఒక్కసారి ఆలోచించండి. యెహోవా రాజ్యం, ఆయన చిత్తం, ఆయన నామాన్ని పరిశుద్ధపర్చే విషయంలో శ్రద్ధవుందని మీ ప్రార్థనలు చూపిస్తున్నాయా? అవి అలా చూపించాలి.

22. సువార్త ప్రకటించడానికి అవసరమైన ధైర్యాన్ని యెహోవా ఇస్తాడని మీరెందుకు నమ్మవచ్చు?

22 హింస, ఇతర పరీక్షలు ఎదురౌతాయి కాబట్టి, ధైర్యంగా యెహోవా సేవ చేయడానికి సహాయపడమని కూడా తరచూ ప్రార్థనలో వేడుకోవాలి. యూదుల మహాసభ ‘యేసు నామమునుబట్టి బోధించకూడదని’ పేతురు, యోహానులను ఆజ్ఞాపించినప్పుడు ఆ అపొస్తలులు తాము బోధించకుండా ఉండలేమని ధైర్యంగా చెప్పారు. (అపొ. 4:18-20) విడుదల చేయబడిన తర్వాత వారువెళ్లి తోటి విశ్వాసులకు జరిగింది వివరించారు. అప్పుడు అక్కడున్న వారందరు తాము వాక్యాన్ని ధైర్యంగా బోధించడానికి సహాయపడమని దేవుణ్ణి వేడుకున్నారు. ఆ ప్రార్థనకు జవాబు లభించినందుకు వారెంత సంతోషించారో, ఎందుకంటే ‘వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు.’ (అపొస్తలుల కార్యములు 4:24-31 చదవండి.) దానివల్ల వేలాదిమంది యెహోవా ఆరాధకులయ్యారు. ధైర్యంగా సువార్త ప్రకటించేలా ప్రార్థన మిమ్మల్ని కూడా బలపర్చగలదు.

మీ ప్రార్థనలను మెరుగుపర్చుకుంటూ ఉండండి

23, 24. (ఎ) బైబిలును శ్రద్ధగా చదవడం మీ ప్రార్థనల్ని ఎలా మెరుగుపర్చగలదో వివరించే ఇతర ఉదాహరణలు పేర్కొనండి. (బి) మీ ప్రార్థనల్ని మెరుగుపర్చుకునేందుకు మీరేమి చేస్తారు?

23 బైబిలును శ్రద్ధగా చదివితే మీ ప్రార్థనలు మెరుగుపడతాయని చూపించడానికి మరెన్నో ఉదాహరణలున్నాయని చూస్తారు. ఉదాహరణకు, యోనాలా మీరు కూడా మీ ప్రార్థనలో “యెహోవా యొద్దనే రక్షణ దొరుకును” అని ఒప్పుకోవచ్చు. (యోనా 2:1-10) చేసిన ఘోరమైన పాపాన్నిబట్టి కలతపడి పెద్దల సహాయం తీసుకోవాలనుకున్నప్పుడు, మీ వ్యక్తిగత ప్రార్థనల్లో మీ పశ్చాత్తాపాన్ని వ్యక్తపర్చడానికి దావీదు ప్రార్థనలోని మాటలు మీకు సహాయం చేయవచ్చు. (కీర్త. 51:1-12) కొన్నిసార్లు యిర్మీయాలాగే మీరూ ప్రార్థనలో యెహోవాను స్తుతించవచ్చు. (యిర్మీ. 32:16-19) మీరు పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంటే, ఎజ్రా 9వ అధ్యాయంలోని ప్రార్థనను శ్రద్ధగా చదివి, వ్యక్తిగతంగా ప్రార్థించడం దేవునికి లోబడి ‘ప్రభువు నందు మాత్రమే పెళ్లిచేసుకోవాలనే’ మీ నిర్ణయాన్ని బలపరుస్తుంది.—1 కొరిం. 7:39; ఎజ్రా 9:6, 10-15.

24 బైబిలును శ్రద్ధగా చదువుతూ, పరిశీలిస్తూ ఉండండి. ప్రార్థనలో ఏ అంశాలు కూడా చేర్చవచ్చో ఆలోచించండి. లేఖనాల్లోని విషయాలను మీరు మీ విన్నపాల్లో, ప్రార్థనల్లో, కృతజ్ఞతాస్తుతుల్లో ప్రస్తావించవచ్చు. బైబిలును శ్రద్ధగా చదువుతూ మీ ప్రార్థనలు మెరుగుపర్చుకుంటుండగా మీరు నిశ్చయంగా యెహోవా దేవునికి మరింత దగ్గరౌతారు.

మీరెలా జవాబిస్తారు?

• మనమెందుకు దేవుని నిర్దేశమేమిటో తెలుసుకొని దానిని పాటించాలి?

• జ్ఞానం కోసం ప్రార్థించేలా మనల్ని ఏది పురికొల్పాలి?

• కీర్తనల పుస్తకం మన ప్రార్థనల్ని ఎలా మెరుగుపర్చగలదు?

• మనం విశ్వాసంతో, పూజ్యభావంతో ఎందుకు ప్రార్థించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని చిత్రం]

అబ్రాహాము సేవకుడు దేవుని నడిపింపు కోసం ప్రార్థించాడు. మీరూ అలా ప్రార్థిస్తారా?

[10వ పేజీలోని చిత్రం]

కుటుంబ ఆరాధన మీ ప్రార్థనల్ని మెరుగుపర్చగలదు