కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

శాశ్వతకాలం ఉండే ప్రేమను పెంపొందించుకోండి

శాశ్వతకాలం ఉండే ప్రేమను పెంపొందించుకోండి

శాశ్వతకాలం ఉండే ప్రేమను పెంపొందించుకోండి

‘ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వతకాలముంటుంది.’—1 కొరిం. 13:7, 8.

1. (ఎ) వార్తా మాధ్యమాలు ప్రేమను ఎలా చిత్రీకరించాయి? (బి) నేడు చాలామంది ఎవరిమీద, వేటిమీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు?

వార్తా మాధ్యమాలు ప్రేమ అనే అంశానికి ఎంతో ప్రాచుర్యం కల్పించాయి. ప్రేమ గొప్పతనాన్ని పొగుడుతూ ఎంతోమంది పాటలు కట్టారు. మానవులకు ప్రేమ ఎంతో అవసరం. అయితే ఇప్పటివరకు పుస్తకాల్లో, సినిమాల్లో ఊహాజనిత ప్రేమ కథలకే ప్రాముఖ్యతనిచ్చారు. మార్కెట్లలో అవి ఎంతో విరివిగా అందుబాటులో ఉన్నాయి. కానీ విచారకరమైన విషయమేమిటంటే దేవునిపట్ల, తోటి మానవులపట్ల నిజమైన ప్రేమ కరువైపోయింది. అంత్యదినాలకు సంబంధించిన బైబిలు ప్రవచనాల నెరవేర్పును మనం కళ్లారా చూస్తున్నాం. నేటి లోకంలో “స్వార్థప్రియులు, ధనాపేక్షులు . . . దేవునికంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు” ఉన్నారు.—2 తిమో. 3:1-5.

2. తప్పుదారి పట్టిన ప్రేమ గురించి బైబిలు ఏమని హెచ్చరిస్తోంది?

2 మానవులు ప్రేమ చూపించగలరు. అయితే, తప్పుదారి పట్టిన ప్రేమకు దూరంగా ఉండమని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. ఒకరి హృదయంలో అలాంటి ప్రేమ పుడితే ఏమి జరుగుతుందో బైబిలు చెబుతోంది. (1 తిమో. 6:9, 10) దేమా గురించి అపొస్తలుడైన పౌలు ఏమి రాశాడో మీకు తెలుసా? ఆయన మొదట పౌలుతో సహవసించినా, ఆ తర్వాత ఆయన లోకం ఆశ చూపుతున్న వాటిని ప్రేమించడం మొదలుపెట్టాడు. (2 తిమో. 4:10) అపొస్తలుడైన యోహాను ఈ ప్రమాదం గురించే హెచ్చరించాడు. (1 యోహాను 2:15, 16 చదవండి.) ఒకవైపు లోకాన్ని, దానిలోవున్న తాత్కాలిక విషయాలను, దాని విధానాలను ప్రేమిస్తూనే దేవుణ్ణి, ఆయన నుండి వచ్చినవాటిని ప్రేమించడం అసాధ్యం.

3. ప్రేమకు సంబంధించి ఏది అంత సులభమైన పని కాదు? దానికి సంబంధించి ఏ ప్రశ్నలు తలెత్తుతాయి?

3 మనం ఈ లోకంలోనే జీవిస్తున్నా దాని సంబంధులం కాము. కాబట్టి, ప్రేమ గురించి లోకానికున్న వక్రమైన ఆలోచనకు దూరంగా ఉండడం అంత సులభమేమీ కాదు. తప్పుదారి పట్టిన అలాంటి ప్రేమను అలవర్చుకోకుండా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. అయితే, మనం ఎవరిపట్ల నిస్వార్థమైన ప్రేమను పెంపొందించుకొని, దాన్ని కనబరచాలి? అన్నిటినీ ఓర్చుకునే, శాశ్వత కాలం ఉండే ప్రేమను అలవర్చుకోవడానికి మనకు ఏవి సహాయం చేస్తాయి? ఇలాంటి ప్రేమ ఇప్పుడూ, ఎల్లప్పుడూ మనకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది? వీటికి దేవుడిచ్చే జవాబులేమిటో తెలుసుకుంటే, మనం సరైన ప్రేమను చూపించగలుగుతాం.

యెహోవాపట్ల ప్రేమను పెంచుకోండి

4. దేవునిపట్ల ప్రేమను పెంచుకోవడానికి మనమేమి చేయాలి?

4 పెంచుకోవడం అనే మాటను అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. నేలను దున్ని, విత్తనాలు విత్తడానికి కష్టపడే రైతు గురించి ఒకసారి ఆలోచించండి. విత్తనాలు మొలకెత్తి, పెరగాలని ఆయన ఆశిస్తాడు. (హెబ్రీ. 6:7) అలాగే, దేవునిపట్ల మనకున్న ప్రేమ కూడా పెరగాలి. దాని కోసం మనం ఏమి చేయాలి? రాజ్య విత్తనం విత్తబడిన హృదయమనే నేలను సాగుచేయాలి. అంటే, దేవుని గురించిన మన జ్ఞానం పెరిగేలా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయాలి. (కొలొ. 1:9, 10) క్రమంగా కూటాలకు హాజరౌతూ వాటిలో పాల్గొనడం ద్వారా కూడా మన జ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. లోతైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనలో ప్రతీ ఒక్కరం పట్టుదలతో కృషి చేస్తున్నామా?—సామె. 2:1-7.

5. (ఎ) యెహోవా ప్రధాన లక్షణాల గురించి మనమెలా తెలుసుకోగలుగుతాం? (బి) దేవుని న్యాయం, జ్ఞానం, శక్తి గురించి మీకేమనిపిస్తుంది?

5 యెహోవా తన వాక్యం ద్వారా తన వ్యక్తిత్వం గురించి తెలియజేస్తున్నాడు. క్రమంగా లేఖనాలను అధ్యయనం చేస్తూ యెహోవా గురించిన జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం ఆయన న్యాయం, శక్తి, జ్ఞానం వంటి లక్షణాల గురించేకాక అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సర్వోత్తమ లక్షణమైన ప్రేమ గురించి మరింత తెలుసుకోగలుగుతాం. యెహోవా చేసే పనులన్నీ న్యాయంగా ఉంటాయి, అది ఆయన సంపూర్ణమైన ధర్మశాస్త్రంలో కూడా కనిపిస్తుంది. (ద్వితీ. 32:4; కీర్త. 19:7) యెహోవా సృష్టి కార్యాల గురించి ఆలోచించినప్పుడు, ఆయన సాటిలేని జ్ఞానం మనకు కనిపిస్తుంది. అది మనకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తుంది. (కీర్త. 104:24) ఈ విశ్వాన్ని చూసినప్పుడు యెహోవాయే అధిక శక్తి గలవాడని, ఆయన శక్తికి అంతు లేదని మనకు అర్థమౌతుంది.—యెష. 40:26.

6. దేవుడు మనపట్ల ప్రేమను ఎలా చూపించాడు? అది తెలుసుకున్న తర్వాత మీకేమనిపించింది?

6 యెహోవా సర్వోత్తమ లక్షణమైన ప్రేమ గురించి ఏమి చెప్పవచ్చు? అది ఎల్లల్లేనిది, అందరినీ ప్రభావితం చేస్తుంది. మానవులను విడిపించడానికి విమోచన క్రయధనం ఏర్పాటు చేయడం ద్వారా దేవుడు ఆ ప్రేమను చూపించాడు. (రోమీయులు 5:8 చదవండి.) లోకంలోని ప్రజలందరి కోసం ఆయన ఆ ఏర్పాటు చేశాడు. అయితే, దేవుని ప్రేమకు స్పందించి ఆయన కుమారునిపట్ల విశ్వాసం చూపించినవారే దాని నుండి ప్రయోజనం పొందుతారు. (యోహా. 3:16, 36) మన పాపాల కోసం యెహోవా యేసును పాపపరిహారార్థ బలిగా అర్పించాడనే వాస్తవం, ఆయనను ప్రేమించాలనే ప్రేరణను మనలో కలుగజేయాలి.

7, 8. (ఎ) దేవునిపట్ల ప్రేమ చూపించాలంటే మనమేమి చేయాలి? (బి) ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలు ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నారు?

7 దేవుడు మనకోసం అన్ని చేసినందుకు మనం ఆయనపట్ల ప్రేమను ఎలా చూపించవచ్చు? దానికి బైబిలు ఇలా జవాబిస్తోంది: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహా. 5:3) దేవునిపట్ల ప్రేమవుంటే మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తాం. ఆ ప్రేమతోనే మనం ఆయన నామం గురించి, రాజ్యం గురించి సాక్ష్యమిస్తాం. దానివల్ల ఇతరులు కూడా ప్రయోజనం పొందుతారు. మనం హృదయపూర్వకంగా ఇతరులకు ప్రకటించినప్పుడు, సదుద్దేశంతో దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నామని చూపిస్తాం.—మత్త. 12:34.

8 ప్రజలు రాజ్య సందేశాన్ని పట్టించుకోకపోయినా లేక దాన్ని పూర్తిగా తిరస్కరించినా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరులు ఎంతో పట్టుదలతో దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నారు. పరిచర్యను సంపూర్ణంగా నెరవేర్చే విషయంలో వారు వెనుకడుగు వేయడంలేదు. (2 తిమో. 4:5) అలాగే మనం దేవుని జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తూ, ఆయన ఇతర ఆజ్ఞలను పాటించేందుకు ప్రయత్నిద్దాం.

మన ప్రభువైన యేసుక్రీస్తును ఎందుకు ప్రేమిస్తాం?

9. యేసు ఎలాంటి పరీక్షల్ని ఓర్చుకున్నాడు? ఎందుకు ఓర్చుకున్నాడు?

9 దేవుణ్ణి ప్రేమించడంతోపాటు, ఆయన కుమారునిపట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి మనకు ఎన్నో కారణాలున్నాయి. మనం యేసును ఎన్నడూ చూడకపోయినా ఆయన గురించి ఎక్కువగా తెలుసుకునేకొద్దీ ఆయనపట్ల ప్రేమ పెరుగుతుంది. (1 పేతు. 1:8) యేసు ఎలాంటి కష్టాలను ఓర్చుకున్నాడు? ఆయన తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు ఇతరులు అకారణంగా ఆయనను ద్వేషించారు, హింసించారు, అభాండాలు వేశారు, దూషించారు. వాటితోపాటు ఆయనింకా ఎన్నో అవమానాలను భరించాడు. (యోహాను 15:25 చదవండి.) తన పరలోక తండ్రిపట్ల ఆయనకు ప్రేమ ఉంది కాబట్టే యేసు ఆ పరీక్షలన్నిటినీ ఓర్చుకున్నాడు. ఆ ప్రేమతోనే మానవులకోసం విమోచన క్రయధన బలిగా తన ప్రాణాన్ని అర్పించాడు. దానివల్ల ఎంతోమందికి విమోచన లభించింది.—మత్త. 20:28.

10, 11. క్రీస్తు మనకోసం చేసినవాటినిబట్టి, మనకు ఏ లక్ష్యం ఉండాలి?

10 యేసు జీవితం మనలో ప్రేరణ కలిగిస్తుంది. ఆయన మనకోసం చేసినవాటి గురించి ఆలోచిస్తే ఆయనపట్ల మనకున్న ప్రేమ అధికమౌతుంది. రాజ్యం గురించి ప్రకటించి శిష్యులను చేయాలనే యేసు ఆజ్ఞను పాటించాలంటే, ఆయన శిష్యులముగా మనం ఆయనలాంటి ప్రేమను పెంపొందించుకొని దాన్ని ఎల్లప్పుడూ చూపించడానికి ప్రయత్నించాలి.—మత్త. 28:19, 20.

11 మానవులపట్ల క్రీస్తు అంత ప్రేమ చూపించాడు కాబట్టే, అంతం రాకముందే మనకు అప్పగించబడిన పనిని తప్పక పూర్తి చేయాలని మనకు అనిపిస్తుంది. (2 కొరింథీయులు 5:14, 15 చదవండి.) క్రీస్తు ముఖ్యంగా ప్రేమతోనే మానవులపట్ల దేవునికున్న ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఉంచిన పరిపూర్ణ మాదిరి మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం అలా నెరవేర్చాలంటే, దేవునిపట్ల సాధ్యమైనంత ఎక్కువ ప్రేమను పెంపొందించుకోవాలి. (మత్త. 22:37) యేసు బోధలను, ఆజ్ఞలను పాటిస్తే మనం ఆయనను ప్రేమిస్తున్నామని, ఆయనలాగే ఏమి జరిగినా యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థిస్తామనే కృతనిశ్చయాన్ని చూపిస్తాం.—యోహా. 14:23, 24; 15:10.

సర్వోత్తమమైన ప్రేమను ఎల్లప్పుడూ చూపించండి

12. “సర్వోత్తమమైన మార్గం” అని అన్నప్పుడు పౌలు మనసులో ఏముంది?

12 అపొస్తలుడైన పౌలు క్రీస్తును అనుకరించాడు. ఆయన క్రీస్తు మాదిరిని పూర్తిగా అనుకరించాడు కాబట్టే తనను పోలి నడుచుకోమని సహోదరులను ధైర్యంగా ప్రోత్సహించాడు. (1 కొరిం. 11:1) మొదటి శతాబ్దంలో స్వస్థతలు చేయడం, భాషలు మాట్లాడడం వంటి కొన్ని ఆత్మవరాలు అనుగ్రహించబడ్డాయి. వాటి కోసం ఉత్సాహంగా కృషి చేయమని పౌలు కొరింథు క్రైస్తవులను ప్రోత్సహించినప్పటికీ, వాటికన్నా శ్రేష్ఠమైనది ఒకటి ఉందని ఆయన వివరించాడు. 1 కొరింథీయులు 12:31లో పౌలు ఇలా చెప్పాడు: “ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.” దాని తర్వాతి వచనాలనుబట్టి చూస్తే ఆయన సర్వోత్తమమైన ప్రేమ గురించే మాట్లాడుతున్నాడని అర్థమౌతుంది. అది సర్వోత్తమమైనదని ఎలా చెప్పవచ్చు? పౌలు ఆ మాటల అర్థాన్ని వివరించాడు. (1 కొరింథీయులు 13:1-3 చదవండి.) తనకు కొన్ని మంచి సామర్థ్యాలున్నప్పటికీ, తాను గొప్ప పనులు చేసినప్పటికీ ఒకవేళ ప్రేమ చూపించకపోతే నిష్ప్రయోజనమని ఆయన చెప్పాడు. దేవుని పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఆయన ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని వివరించాడు. అదెంతటి చక్కని వివరణ!

13. (ఎ) 2010వ సంవత్సరపు వార్షిక వచనం ఏమిటి? (బి) ప్రేమ శాశ్వత కాలముంటుందని ఎలా చెప్పవచ్చు?

13 తర్వాతి వచనాల్లో పౌలు ప్రేమను నిర్వచించాడు. ప్రేమ చూపించాలంటే ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఆయన వివరించాడు. (1 కొరింథీయులు 13:4-8 చదవండి.) సమయం తీసుకొని మీ ప్రేమ ఎలాంటిదో పరీక్షించుకోండి. 7వ వచనంలోని చివరి భాగం గురించి, 8వ వచనంలోని మొదటి భాగం గురించి ముఖ్యంగా ఆలోచించండి. అక్కడిలా ఉంది: ‘ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలముంటుంది.’ 2010వ సంవత్సరంలో మన వార్షిక వచనం అదే. క్రైస్తవ సంఘం శైశవ దశలో ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించిన ఆత్మవరాలు అంటే ప్రవచనాలు, భాషల వంటివి నిలిచిపోతాయని ఆ వచనాల్లోనే పౌలు చెప్పాడని గమనించండి. అయితే, ప్రేమ శాశ్వత కాలముంటుంది. యెహోవా ప్రేమాస్వరూపి, ఆయన నిత్యమూ ఉంటాడు. కాబట్టి, ప్రేమ ఎన్నడూ గతించిపోదు. నిత్యుడైన దేవుని లక్షణంగా ప్రేమ నిరంతరం ఉంటుంది.—1 యోహా. 4:8.

ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది

14, 15. (ఎ) ప్రేమ ఉంటే మనం పరీక్షలను ఓర్చుకోగలుగుతామని ఎలా చెప్పవచ్చు? (బి) ఒక యువ సహోదరుడు విశ్వాసం విషయంలో ఎందుకు రాజీపడలేదు?

14 ఎలాంటి కష్టాలు, సమస్యలు వచ్చినా, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, వాటన్నిటినీ క్రైస్తవులు ఎలా ఓర్చుకోగలుగుతారు? ముఖ్యంగా, నిస్వార్థమైన ప్రేమవల్లే వారు వాటిని సహించగలుగుతారు. అలాంటి ప్రేమ చూపించడానికి వస్తుపరమైన త్యాగాలు చేస్తే సరిపోదు. యథార్థతను కాపాడుకునేందుకు కృషి చేయాలి, క్రీస్తు కోసం మన ప్రాణాల్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. (లూకా 9:24, 25) రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో, ఆ తర్వాతి కాలంలో విశ్వాసాన్ని నిలుపుకోవడం కోసం సామూహిక నిర్బంధ శిబిరాల్లో, లేబరు క్యాంపుల్లో బాధల్ని అనుభవించిన సాక్షుల అనుభవాల గురించి ఒక్కసారి ఆలోచించండి.

15 జర్మనీ దేశస్థుడైన విల్‌హెల్మ్‌ అనే యువసాక్షి ఉదాహరణను చూడండి. తన విశ్వాసం విషయంలో రాజీపడే బదులు నాజీ ఫైరింగ్‌ స్క్వాడ్‌ (తుపాకీతో మరణ శిక్ష విధించే దళం) చేతుల్లో మరణించడానికే మొగ్గుచూపాడు. తన కుటుంబానికి రాసిన చివరి ఉత్తరంలో ఆయన ఇలా అన్నాడు: “మన నాయకుడైన యేసుక్రీస్తు ఆజ్ఞాపించినట్లు, మనం అన్నింటికన్నా ప్రాముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన పక్షాన మనం ధైర్యంగా నిలబడితే మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు.” ఆ తర్వాత, ఒకానొక కావలికోట సంచికలో, ఆయన కుటుంబ సభ్యురాలు ఒకరు ఇలా రాశారు: “కాలప్రవాహంలో మేము ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కుటుంబంగా మేము దేవునిపట్ల ప్రేమ చూపించడానికే ఎల్లప్పుడూ ప్రాముఖ్యతనిచ్చాం.” ఆర్మేనియా, ఎరిట్రియా, దక్షిణ కొరియాతోపాటు అనేక ఇతర దేశాల్లోని జైళ్లలో బాధలను అనుభవిస్తున్న చాలామంది సహోదరులు అలాంటి స్ఫూర్తినే కనబరుస్తున్నారు. వారు నమ్మకంగా యెహోవాపట్ల ప్రేమను చూపిస్తున్నారు.

16. మలావీలోని మన సహోదరులు ఎలాంటి పరీక్షలను సహించారు?

16 అనేక ప్రాంతాల్లో, ఇతర రకాల పరీక్షలు మన సహోదరుల విశ్వాసాన్ని, సహనాన్ని పరీక్షిస్తున్నాయి. దాదాపు 26 సంవత్సరాలపాటు మలావీలోని యెహోవాసాక్షులు ప్రభుత్వ నిషేధాలను, తీవ్ర వ్యతిరేకతలను, అనేక విధాల క్రూరత్వాన్ని భరించారు. వారలా సహించినందుకు ఆశీర్వదించబడ్డారు. హింస చెలరేగినప్పుడు, ఆ దేశంలో దాదాపు 18,000 మంది సాక్షులు ఉండేవారు. ముప్ఫై సంవత్సరాల తర్వాత వారి సంఖ్య రెండింతలు కన్నా ఎక్కువైంది, అంటే 38,393కు చేరింది. అలాంటి ఫలితాలే ఇతర దేశాల్లో కూడా వచ్చాయి.

17. అవిశ్వాసులైన కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి పరీక్షలు కొందరు ఎదుర్కొన్నారు? వారు వాటిని ఎలా సహించగలిగారు?

17 దేవుని ప్రజలపై వ్యతిరేకులు నేరుగా దాడిచేయడం ఒక ఎత్తైతే, కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కోవడం మరో ఎత్తు. కుటుంబ సభ్యులు లేదా బంధువులు వారిమీద ఒత్తిడి తీసుకురావచ్చు. యేసు అలా జరుగుతుందని ముందే చెప్పాడు. ఆయన చెప్పినట్లే చాలామంది వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. (మత్త. 10:35, 36) టీనేజర్లు అవిశ్వాసులైన తల్లిదండ్రుల నుండి ఎదురైన వ్యతిరేకతను సహించారు. కొందరిని ఇంట్లో నుండి వెళ్లగొట్టారు. అయితే దయగల సాక్షులు వారిని అక్కున చేర్చుకున్నారు. మరికొందరు తిరస్కరించబడ్డారు. అలాంటి కష్టాలను వారు ఎలా సహించగలిగారు? కేవలం సహోదర ప్రేమతోనే కాదుగానీ, ప్రాముఖ్యంగా యెహోవాపట్ల, ఆయన కుమారునిపట్ల నిజమైన ప్రేమతో వాటిని సహించగలిగారు.—1 పేతు. 1:22; 1 యోహా. 4:21.

18. అన్నిటినీ సహించే ప్రేమ వివాహిత క్రైస్తవులకు ఎలా సహాయం చేస్తుంది?

18 అన్నింటినీ సహించే ప్రేమను చూపించాల్సిన పరిస్థితులు జీవితంలో ఎన్నో ఎదురౌతాయి. ప్రేమ ఉంటే వైవాహిక జీవితంలో దంపతులు యేసు చెప్పిన ఈ మాటలను గౌరవిస్తారు: “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదు.” (మత్త. 19:6) “శరీరసంబంధమైన శ్రమలు” ఎదురౌతున్నప్పుడు, క్రైస్తవులు తమ వివాహ జీవితంలో యెహోవాకే ప్రాముఖ్యతనివ్వాలని గుర్తుచేసుకోవాలి. (1 కొరిం. 7:28) ‘ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది’ అని ఆయన వాక్యం చెబుతోంది. ఈ లక్షణాన్ని ధరించే భార్యభర్తలు ఒకరికొకరు నమ్మకంగా ఉంటూ తమ వివాహాన్ని పటిష్ఠపరచుకుంటారు.—కొలొ. 3:14.

19. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు దేవుని ప్రజలు ఏమి చేశారు?

19 ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ప్రేమవల్లే సహోదరులు అన్నిటినీ సహించగలిగారు. దక్షిణ పెరూలో భూకంపం వచ్చినప్పుడు, అమెరికాలోని సింధూ శాఖను హరికేన్‌ కత్రీనా అతలాకుతలం చేసినప్పుడు మన సహోదరులు అలాంటి ప్రేమనే కనబరిచారు. ఎంతోమంది సహోదరులు తమ ఇళ్లను, ఆస్తులను పోగొట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగావున్న సహోదరులకు ప్రేమ ఉండడంవల్లే సహాయ సామగ్రిని అందించారు, ఇళ్లను తిరిగి నిర్మించారు, రాజ్యమందిరాలను మరమ్మత్తు చేశారు. ఎలాంటి పరిస్థితిల్లోనైనా, మన సహోదరులు ఎల్లప్పుడూ ప్రేమ చూపిస్తారని అవి రుజువు చేస్తున్నాయి.—యోహా. 13:34, 35; 1 పేతు. 2:17.

ప్రేమ శాశ్వత కాలముంటుంది

20, 21. (ఎ) ప్రేమ శ్రేష్ఠమైన లక్షణం అని ఎందుకు చెప్పవచ్చు? (బి) మీరెందుకు ఎల్లప్పుడూ ప్రేమ చూపించాలనే కృతనిశ్చయంతో ఉన్నారు?

20 సర్వోత్తమ లక్షణమైన ప్రేమను చూపించడం ఎంత జ్ఞానయుక్తమో యెహోవా ప్రజల్ని చూస్తే తెలుస్తుంది. నిజంగా, ప్రేమ అన్ని పరిస్థితుల్లో చూపించాల్సిన అతి శ్రేష్ఠమైన లక్షణం. పౌలు ఆ సత్యాన్ని ఎలా నొక్కిచెప్పాడో చూడండి. మొదటిగా, ఆత్మ వరాలు గతించిపోతాయని, క్రైస్తవ సంఘం శైశవదశ నుండి ఎదిగి పరిణతిగలదిగా తయారౌతుందని ఆయన చెప్పాడు. ఆ తర్వాత అపొస్తలుడైన పౌలు ఈ మాటలతో ముగించాడు: “కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే.”—1 కొరిం. 13:13.

21 మనం విశ్వాసంతో ఎదురుచూస్తున్నవన్నీ త్వరలోనే నెరవేరతాయి. అప్పుడిక వాటిపై విశ్వాసముంచాల్సిన అవసరం ఉండదు. మనం ఇప్పుడు వాగ్దానాల నెరవేర్పు కోసం ఆశతో ఎదురుచూస్తున్నాం. అవి నూతనలోకంలో నెరవేరినప్పుడు, ఇక మనం వాటి గురించి నిరీక్షించాల్సిన అవసరమే ఉండదు. కానీ, ప్రేమ విషయమేమిటి? అది ఎన్నడూ గతించిపోదు, శాశ్వతంగా ఉంటుంది. మనం నిత్యమూ జీవిస్తాం కాబట్టి దేవుని ప్రేమలోని మరిన్ని అంశాలను చవిచూసి, వాటిని అర్థం చేసుకోగలుగుతాం. శాశ్వత కాలం ఉండే సర్వోత్తమమైన ప్రేమను చూపించే విషయంలో దేవుని చిత్తాన్ని చేయడం ద్వారా మీరు నిత్యం జీవించవచ్చు!—1 యోహా. 2:17.

మీరెలా జవాబిస్తారు?

• తప్పుదారి పట్టిన ప్రేమ విషయంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

• ప్రేమవల్ల వేటిని సహించగలుగుతాం?

• ప్రేమ శాశ్వతకాలం ఉంటుందని ఎలా చెప్పవచ్చు?

[అధ్యయన ప్రశ్నలు]

[27వ పేజీలోని బ్లర్బ్‌]

‘ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలముంటుంది’ అనేదే 2010వ సంవత్సరపు వార్షిక వచనం.—1 కొరిం. 13:7, 8.

[25వ పేజీలోని చిత్రం]

దేవునిపట్ల ప్రేమ ఉంటే మనం సాక్ష్యమిస్తాం

[26వ పేజీలోని చిత్రం]

శాశ్వతకాలం ఉండే ప్రేమవల్లే మలావీలోని మన సహోదర సహోదరీలు పరీక్షలను సహించగలిగారు