కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుణ్ణి చురుగ్గా, ఆనందంగా సేవించండి

దేవుణ్ణి చురుగ్గా, ఆనందంగా సేవించండి

దేవుణ్ణి చురుగ్గా, ఆనందంగా సేవించండి

మనం ఆనందంగా ఉండాలని యెహోవా కోరుతున్నాడు. (కీర్త. 100:2) ఆయన సేవకులుగా మీరు అనేక బాధ్యతల వల్ల తీరికలేకుండా పనిచేస్తుండవచ్చు. బహుశా మీరు యెహోవాకు సమర్పించుకున్నప్పుడు అన్ని బాధ్యతలు లేకపోయుండొచ్చు. అయితే ప్రస్తుతం ఉద్యోగ బాధ్యతల వల్ల, సంఘ బాధ్యతల వల్ల మీరు ఒత్తిడికి లోనౌతుండవచ్చు. మీరు అనుకున్నవన్నీ చేయలేకపోయినప్పుడు మీరు అపరాధ భావంతో సతమతమౌతుండవచ్చు. ఏ పనికెంత ప్రాముఖ్యతనివ్వాలో అంత ప్రాముఖ్యతనిస్తూ, ‘యెహోవాయందు ఆనందాన్ని’ ఎలా కాపాడుకోవచ్చు?—నెహె. 8:10.

అంత్యదినాల్లో జీవిస్తున్నాం కాబట్టి మీరు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. మీరు మీ పనులను ఓ క్రమ పద్ధతిలో చేసుకుంటే వాటిని తగ్గించుకోవచ్చు. ఈ విషయంలో దైవప్రేరణతో అపొస్తలుడైన పౌలు ఇచ్చిన ఉపదేశం ఎంతో ఉపయోగపడుతుంది. ఆయన, “దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి” అని చెప్పాడు.—ఎఫె. 5:15, 16.

ఆ మంచి సలహాను మనసులో ఉంచుకొని మనం సాధించగలిగే లక్ష్యాలను పెట్టుకుంటూనే, వ్యక్తిగత అధ్యయనం, కుటుంబాన్ని చూసుకోవడం, ప్రకటనా పని, ఉద్యోగంవంటి వాటికీ ఎలా సముచితమైన స్థానమివ్వగలం?

మీరు దేవునికి సమర్పించుకొని, బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఎంత సంతోషించారో గుర్తుందా? యెహోవా గురించి, ఆయన ఉద్దేశాల గురించి తెలుసుకున్నప్పుడు మీరు పులకించిపోయివుంటారు. వాటిని అవగాహన చేసుకొని, ఆనందాన్ని పొందడానికి మీరు ఎన్నో నెలలు శ్రద్ధగా బైబిలు అధ్యయనం చేసివుంటారు. మీరు చేసిన కృషికి తగిన ఫలితం దక్కింది. ఆ అధ్యయనం మీ జీవితాన్నే మార్చేసింది.

మీరు అప్పుడు పొందిన ఆనందాన్ని కాపాడుకోవాలంటే, క్రమంగా ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవాలి. బైబిలు చదివి, అధ్యయనం చేయడానికి కూడ తీరిక దొరకడంలేదని మీకు అనిపిస్తే మీరు ప్రతీరోజు చేస్తున్న పనులను ఒకసారి పరిశీలించుకోండి. బైబిలు అధ్యయనం చేసి, ధ్యానించడానికి ప్రతీరోజూ కొద్ది నిమిషాలు కేటాయించగలిగినా మీరు యెహోవాకు దగ్గరౌతారు. దానివల్ల మీ ఆనందం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది.

చాలామంది క్రైస్తవులు అంత ప్రాముఖ్యంకాని పనులకు సమయాన్ని తగ్గించుకొని ఆ సమయాన్ని ప్రాముఖ్యమైన పనులకు కేటాయించవచ్చు. మీరు ఇప్పుడు ఈ విషయాల గురించి ఆలోచించండి. ‘వారపత్రికలు, మాసపత్రికలు, వార్తాపత్రికలు చదవడానికి, టీవీ చూడడానికి, సంగీతం వినడానికి, లేదా ఏదో ఒక హాబీకి ఎంత సమయం కేటాయిస్తున్నాను?’ అలాంటి కార్యకలాపాలను వాటివాటి స్థానంలో ఉంచితేనే నిజమైన ఉల్లాసాన్ని పొందుతాం. (1 తిమో. 4:8) మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని మీకు అనిపిస్తే వివిధ పనులకు మీరు కేటాయించే సమయాన్ని మార్చుకోండి.

భర్త, ముగ్గురు పిల్లల తండ్రి, సంఘ పెద్ద అయిన ఆడమ్‌ తనకు ఏది సహాయం చేస్తుందో చెబుతూ ఇలా అన్నాడు: “నేను నిరాడంబరంగా ఉండడానికి కృషిచేస్తాను. సమయాన్ని తినేసే హాబీలకు దూరంగా ఉంటాను. మన సమయాన్ని వృథా చేసే వస్తువులను కొనను. అన్నీ వదులుకొని బైరాగిలా జీవిస్తున్నానని కాదుగానీ సాదాసీదా వినోదాన్ని ఆనందిస్తాను.”

మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల వచ్చిన మంచి ఫలితాల గురించి ఆలోచించినప్పుడు మీరు ఆనందాన్ని కాపాడుకోగలుగుతారు, సానుకూలంగా ఆలోచించగలుగుతారు. ఉదాహరణకు, ముగ్గురు పిల్లల తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తూ సంఘ పెద్దగా సేవచేస్తున్న మార్యుష్‌ ఇలా అన్నాడు: “నేను బైబిలు చదవడం మొదలుపెట్టినప్పుడు భవిష్యత్తు విషయంలో ఆశలు పెంచుకున్నాను. ఇప్పటికీ నాకు కొన్నిసార్లు సమస్యలు ఎదురౌతాయి. వాటిలో అనేక సమస్యలు యెహోవా మాత్రమే అర్థం చేసుకోగలడు. ఆయన సహాయంతో నేను మంచి భవిష్యత్తు కోసం ఆశతో ఎదురుచూస్తూ జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతున్నాను.”

మార్యుష్‌ విషయంలో జరిగినట్లే, సానుకూలంగా ఆలోచించినంత మాత్రాన చింతలన్నీ పోతాయని కాదు. కానీ, అలా ఆలోచిస్తే సమస్యల్లోనూ కాస్త ఊరటను పొంది, వాటిని సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. బైబిలు ఇలా చెబుతోంది: “బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.” (సామె. 15:15) ఇప్పటికే దేవుడు మీపట్ల ఎంత ప్రేమ చూపించాడో ఆలోచించండి. అలా చేస్తే దేవుని మీద మీకున్న ప్రేమ పెరిగి, ఆయన సేవలో మీ ఆనందం రెట్టింపు అవుతుంది.—మత్త. 22:37.

యెహోవాకు, ఆయన రాజ్య సంబంధమైన విషయాలకు ప్రాముఖ్యతనిస్తే కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటుంది. క్రైస్తవ లక్షణాలను చూపిస్తే కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉండదు. కుటుంబమంతా ఐక్యంగా ఉంటుంది, ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. అప్పుడు మీ ఇల్లు శాంతి ఐక్యతలకు నెలవు అవుతుంది.—కీర్త. 133:1.

కుటుంబంగా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో భాగం వహిస్తే, కుటుంబంలోనివారంతా ఆనందంగా ఉండగలుగుతారు. మార్యుష్‌ ఇంకా ఇలా అన్నాడు: “మేము కుటుంబంగా కలిసి గడిపే సమయానికి నేను ఎంతో విలువిస్తాను. నా భార్య నాకు ఎంతో చేదోడువాదోడుగా ఉంటుంది. సాధ్యమైనప్పుడల్లా అంటే, పరిచర్యలో లేదా సమావేశాలకు ముందు స్టేడియం శుభ్రం చేస్తున్నప్పుడు, బహిరంగ ప్రసంగాలు ఇవ్వడానికి నేను వేరే సంఘాలకు వెళ్తున్నప్పుడు ఆమె నాకు తోడుగా వస్తుంది. ఇది నాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది.”

క్రైస్తవులు తమ కుటుంబాలను పోషించి, సంరక్షించాలని బైబిలు ఆజ్ఞాపిస్తోంది. (1 తిమో. 5:8) అయితే, ఒకవేళ ఉద్యోగమే మీ సమయాన్ని, శక్తిని హరించివేస్తుంటే, మీరు దేవుని సేవను ఆనందంగా చేయలేకపోతారు. అలాంటప్పుడు యెహోవాకు ప్రార్థించండి. (కీర్త. 55:22) కొంతమంది, దేవుని రాజ్యానికి ప్రాముఖ్యతనివ్వాలంటే వేరే ఉద్యోగం వెతుక్కోవాల్సిందేనని గుర్తించారు. గంటల తరబడి కష్టపడి పనిచేయాల్సివచ్చే ఉద్యోగంలో చేరితే జీతం బాగా వస్తుందనే ఆశతో ఏ క్రైస్తవుడు కూడా ఎంతో ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాలను పక్కకు నెట్టేయకూడదు.—సామె. 22:3.

మీరు చేయాలనుకుంటున్న ఉద్యోగంలో లేదా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్న లాభనష్టాల గురించి ఆలోచించండి. మంచి జీతం, సంతృప్తికరమైన పని ఉండాలని కోరుకోవడం తప్పేమీ కాదు. కానీ, మీ కుటుంబం ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు మీ ఉద్యోగం దోహదపడుతోందా? అన్ని విషయాలను బేరీజు వేసుకొని యెహోవాతో మీకున్న సంబంధానికే ప్రాముఖ్యతనిచ్చే నిర్ణయాలు తీసుకోండి.

ప్రస్తుతం మీరు చేస్తున్న ఉద్యోగం మీ ఆధ్యాత్మిక ప్రగతికి దోహదపడకపోతే, మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆధ్యాత్మిక విషయాలకు సమయాన్ని కేటాయించేందుకు చాలామంది క్రైస్తవులు తమ జీవితాల్లో ఎన్నో మార్పులు చేసుకున్నారు. పోలండ్‌లోని ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “ఒకప్పుడు నేను పనిచేసే కంపెనీని వదిలేయడం తప్ప మరో మార్గం నాకు కనిపించలేదు. ఎందుకంటే, నేను ఎన్నోసార్లు కంపెనీ పనులమీద ఇల్లు వదిలి వెళ్లాల్సివచ్చేది. దానివల్ల నేను అటు ఆధ్యాత్మిక విషయాలకు శ్రద్ధనివ్వలేకపోయాను, ఇటు కుటుంబాన్ని చూసుకోలేకపోయాను.” ఇప్పుడు ఆ సహోదరుడు తన సమయాన్ని, శక్తిని ఎక్కువగా వెచ్చించాల్సిన అవసరంలేని ఉద్యోగం చేస్తున్నాడు.

ఇతరులకు సహాయం చేయడంలో ఆనందాన్ని పొందండి

“పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని యేసు చెప్పాడు. (అపొ. 20:35) అలా ఇచ్చే అవకాశాలెన్నో క్రైస్తవులకు దొరుకుతాయి. అలా చేయడానికి పెద్దపెద్ద పనులు చేయాలనేమీ లేదు. కొన్నిసార్లు ఆప్యాయంగా చిందించే చిరునవ్వు, కరచాలనం లేదా దేవుని సేవలో కృషి చేసిన సహోదరుణ్ణి/సహోదరిని అభినందించడం వంటివి చేస్తే సరిపోతుంది. అలా చేయడంవల్ల ఇద్దరూ ఎంతో ఆనందిస్తారు.

“ధైర్యము చెడినవారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊత నియ్యుడి” అని అపొస్తలుడైన పౌలు తోటి క్రైస్తవులను ప్రోత్సహించాడు. (1 థెస్స. 5:14) కొన్నిసార్లు మానసికంగా కృంగిపోయినవారు తమ స్వశక్తితో సమస్యలను అధిగమించలేకపోతున్నామని అనుకోవచ్చు. మీరు అలాంటి వారికి చేయూతనిస్తారా? ఒక సహోదరుడు మునుపటిలా సంతోషంగా యెహోవా సేవలో పాల్గొనడంలేదని మీకనిపిస్తే ఆయన్ని ప్రోత్సహించండి. అలా చేస్తే మీరు కూడా ప్రోత్సహించబడతారు. కొన్ని సమస్యల్ని మానవులెవ్వరూ పరిష్కరించలేరు. అయితే, మీరు వారిపట్ల సానుభూతి చూపించండి, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే యెహోవా సహాయాన్ని కోరమని ఆ సహోదరుణ్ణి ప్రోత్సహించండి. తన సహాయం కోరేవారిని యెహోవా ఎన్నడూ నిరాశపర్చడు.—కీర్త. 27:10; యెష. 59:1.

మీరు మరొకటి కూడ చేయవచ్చు. మునుపటిలా సంతోషంగా యెహోవా సేవలో పాల్గొనలేకపోతున్న వ్యక్తిని మీతో కలిసి పరిచర్యలో పాల్గొనమని ప్రోత్సహించవచ్చు. యేసు 70 మంది శిష్యులను ‘ఇద్దరిద్దరి’ చొప్పున పంపించాడు. (లూకా 10:1) యేసు చేసిన ఆ ఏర్పాటు వల్ల ఆ ఇద్దరికీ ఒకరినొకరు ప్రోత్సహించుకునే అవకాశం దొరికిందని మీకు అనిపించడంలేదా? ఆయన మాదిరిని అనుసరిస్తూ నేడు కూడా, కొందరు తిరిగి మునుపటి ఆనందంతో సేవచేసేందుకు సహాయం చేయగలరేమో ఆలోచించండి.

మనం జీవితంలో నిజంగానే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుండవచ్చు. అయినా పౌలు, “ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి” అని ప్రోత్సహించాడు. (ఫిలి. 4:4) మీరు దేవుణ్ణి ప్రేమించి, ఆయనకు విధేయులై ఆయన ఇచ్చిన పనిలో పట్టుదలతో కొనసాగుతున్నారు కాబట్టి మీ జీవితం సార్థకమైంది. అది మీకు ఆనందాన్నిస్తుంది. అంతేకాక, మీరు ఎదుర్కొనే ఒత్తిళ్లను, సమస్యలను అధిగమించేందుకు యెహోవా సహాయం చేస్తున్నాడు.—రోమా. 2:6, 7.

యెహోవా వాగ్దానం చేసిన నూతన లోకం త్వరలో రానుందనే విశ్వాసం మనకు ఉంది. దానివల్ల మనకు ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయి! నిజంగా మనం ఆనందించడానికి ఎన్నో కారణాలున్నాయి! (కీర్త. 37:34) యెహోవా మనల్ని ఇప్పుడు కూడ ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడని గుర్తుంచుకొని ఆనందంగా ఉందాం. అలా మనం ‘సంతోషంగా యెహోవాను సేవించగలుగుతాం.’—కీర్త. 100:2.

[8వ పేజీలోని డయాగ్రామ్‌]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

ఆనందంగా ఉండాలంటే వివిధ పనులకు మీరు కేటాయించే సమయాన్ని మార్చుకోండి

ఉల్లాస కార్యకలాపాలు, వినోదం

ఇల్లు, కుటుంబ సంరక్షణ

పని

క్రైస్తవ కూటాలు

వ్యక్తిగత అధ్యయనం

పరిచర్య

[10వ పేజీలోని చిత్రాలు]

తిరిగి దేవుని సేవలో ఆనందంగా పాల్గొనేలా మీరు ఇతరులకు సహాయం చేయగలరా?