కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?

మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?

మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?

‘నేను ఎవనివాడనో ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచాడు.’—అపొ. 27:23.

1. బాప్తిస్మపు అభ్యర్థులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? బాప్తిస్మం విషయంలో ఎలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి?

 “యేసుక్రీస్తు బలి ఆధారంగా మీరు మీ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవా చిత్తం చేయడానికి మిమ్మల్ని మీరు యెహోవాకు సమర్పించుకున్నారా?” బాప్తిస్మ ప్రసంగం చివర్లో, బాప్తిస్మం తీసుకునే అభ్యర్థులను అడిగే రెండు ప్రశ్నల్లో ఇది ఒకటి. క్రైస్తవులు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవడం వల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం? దేవునికి సమర్పించుకోకపోతే ఆయనకు ఇష్టమైన విధంగా ఆరాధించలేమని ఎందుకు చెప్పవచ్చు? ఆ ప్రశ్నలకు జవాబుల కోసం మొదట మనం సమర్పణ అంటే ఏమిటో తెలుసుకోవాలి.

2. యెహోవాకు సమర్పించుకోవడం అంటే ఏమిటి?

2 దేవునికి సమర్పించుకోవడం అంటే ఏమిటి? అపొస్తలుడైన పౌలు దేవునితో తనకున్న సంబంధాన్ని ఎలా వివరించాడో గమనించండి. ప్రమాదంలో చిక్కుకున్న ఓడలో అందరిముందు తాను ‘ఎవనివాడనో’ అనే మాటను ఉపయోగించి తాను యెహోవాకు చెందినవాడినని పౌలు సూచించాడు. (అపొస్తలుల కార్యములు 27:22-24 చదవండి.) నిజక్రైస్తవులందరూ యెహోవాకు చెందినవారు. అదే లోకం విషయానికొస్తే, అది “దుష్టుని యందున్నది.” (1 యోహా. 5:19) యెహోవా తమ సమర్పణను అంగీకరించే విధంగా ప్రార్థనలో క్రైస్తవులు సమర్పించుకున్నప్పుడు వారు ఆయనకు చెందినవారౌతారు. అది వ్యక్తిగతంగా చేసుకునే ప్రమాణం. ఒక వ్యక్తి అలా సమర్పించుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకుంటాడు.

3. యేసు బాప్తిస్మం దేన్ని సూచిస్తోంది? ఆయన అనుచరులు ఆయన మాదిరిని ఎలా అనుసరించవచ్చు?

3 దేవుని చిత్తం చేయాలని నిర్ణయించుకోవడం ద్వారా యేసు మనకు ఓ మంచి మాదిరినుంచాడు. దేవునికి సమర్పించుకున్న ఇశ్రాయేలు జనాంగంలో పుట్టాడు కాబట్టి ఆయన దేవునికి సమర్పించుకున్నట్లే. దీన్నిబట్టి, ఆయన దేవునికి సమర్పించుకోవాలనే ఉద్దేశంతో బాప్తిస్మం తీసుకోలేదని తెలుస్తుంది. అంతేకాక, “దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నాను” అని ఆయన అన్నాడని దేవుని వాక్యం చెబుతోంది. (హెబ్రీ. 10:7; లూకా 3:21) కాబట్టి, యేసు బాప్తిస్మం, తాను తన తండ్రి చిత్తాన్ని చేయడానికి తనను తాను అర్పించుకున్నాడని సూచిస్తోంది. బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకురావడం ద్వారా ఆయన అనుచరులు ఆయన మాదిరిని అనుసరిస్తారు. అయితే, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకున్నప్పుడు, ప్రార్థనలో తాను దేవునికి సమర్పించుకున్నాడని బహిరంగంగా చూపిస్తాడు.

సమర్పించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు

4. దావీదు యోనాతానుల స్నేహాన్ని చూస్తే నిబద్ధత గురించి మనకు ఏమి తెలుస్తుంది?

4 క్రైస్తవ సమర్పణ గంభీరమైన విషయం. సమర్పించుకోవడం అంటే కేవలం నిబద్ధత చూపించడం మాత్రమే కాదు. మనమిప్పుడు సమర్పణవల్ల వచ్చే ప్రయోజనాలను చూద్దాం. వాటిని అర్థం చేసుకునేందుకు ముందుగా మనం సమర్పణను, నిబద్ధతతో పోల్చుదాం. ఉదాహరణకు, మానవ సంబంధాల్లో నిబద్ధత చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలను పరిశీలిద్దాం. మచ్చుకు, స్నేహం గురించే ఆలోచించండి. స్నేహం వల్ల వచ్చే ప్రయోజనాలు పొందాలంటే దానితోపాటు వచ్చే బాధ్యతను అంగీకరించాలి. అంటే నిబద్ధత చూపించాలి. మీ స్నేహితుని బాగోగులను చూసుకునే బాధ్యత ఉందని మీకు అనిపిస్తుంది. బైబిల్లో ఎంతోమంది మంచి స్నేహితుల గురించి చెప్పబడింది. దావీదు యోనాతానులు అలాంటి స్నేహితులే. తమ స్నేహాన్నిబట్టి వారు ఒక నిబంధన కూడా చేసుకున్నారు. (1 సమూయేలు 17:57; 18:1, 3 చదవండి.) అంతటి నిబద్ధత స్నేహితుల మధ్య అరుదుగా కనిపించినప్పటికీ, స్నేహితులు ఒకరిపట్ల ఒకరికి బాధ్యత ఉన్నట్లు భావించి నిబద్ధత చూపిస్తే వారి స్నేహం వర్ధిల్లుతుంది.—సామె. 17:17; 18:24.

5. ఒక మంచి యజమానికి దాసునిగా ఉండడంవల్ల ఒక వ్యక్తి ఎలా శాశ్వత ప్రయోజనం పొందుతాడు?

5 ఇశ్రాయేలీయులు నిబద్ధత చూపించడం వల్ల మరో రకమైన బంధంలో కూడా ప్రయోజనం పొందారని దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రాన్నిబట్టి తెలుస్తుంది. ఒక మంచి యజమానికి ఎల్లప్పుడూ దాసునిగా ఉండాలని ఇష్టపడితే, ఆ దాసుడు తన యజమానితో ఒక శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: “అయితే ఆ దాసుడు—నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.”—నిర్గ. 21:5, 6.

6, 7. (ఎ) నిబద్ధత వల్ల ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతారు? (బి) యెహోవాతో మనకున్న సంబంధం గురించి అది ఏమి తెలియజేస్తుంది?

6 వివాహ బంధం విషయానికొస్తే, దానికి ఇంకా ఎంతో నిబద్ధత అవసరం. అది కేవలం ఒక ఒప్పందానికి కట్టుబడివుండడం కాదుగానీ ఒక వ్యక్తికి కట్టుబడివుండడం. పెళ్లి కాకుండా సహజీవనం చేస్తున్న స్త్రీ పురుషులు ఎన్నడూ నిజమైన భద్రతను అనుభవించలేరు, వారి పిల్లల పరిస్థితి కూడా అంతే. కానీ, గౌరవపూర్వకంగా పెళ్లి చేసుకున్న దంపతుల విషయానికొస్తే, సమస్యలు వచ్చినప్పుడు వారు ప్రేమతో వాటిని పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి.—మత్త. 19:5, 6; 1 కొరిం. 13:7, 8; హెబ్రీ. 13:4.

7 ప్రాచీన కాలాల్లోని ప్రజలు పని, వ్యాపారం వంటి విషయాల్లో ఒప్పందాలు చేసుకోవడంవల్ల ప్రయోజనం పొందారు. (మత్త. 20:1, 2, 8) నేడు కూడా అంతే. ఉదాహరణకు, ఏదైనా వ్యాపారం మొదలుపెట్టే ముందు లేదా ఓ కొత్త ఉద్యోగంలో చేరేముందు రాతపూర్వక ఒప్పందం చేసుకున్నట్లయితే అది మనకు ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి, కేవలం నిబద్ధత కనబరచడం వల్ల స్నేహాలు, వివాహం, ఉద్యోగం వంటి విషయాల్లో ఇంత ప్రయోజనం ఉందంటే, హృదయపూర్వకంగా యెహోవాకు సమర్పించుకొని ఆయనతో సంబంధాన్ని ఏర్పరచుకోవడంవల్ల ఇంకెంత ప్రయోజనం ఉంటుందో ఒకసారి ఆలోచించండి! అయితే, గతంలో ప్రజలు యెహోవా దేవునికి సమర్పించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందారో, వారు చేసుకున్న సమర్పణ కేవలం నిబద్ధత మాత్రమే కాదని ఎందుకు చెప్పవచ్చో ఇప్పుడు చూద్దాం.

సమర్పించుకోవడం వల్ల ఇశ్రాయేలీయులు ఎలా ప్రయోజనం పొందారు?

8. ఇశ్రాయేలీయులు దేవునికి సమర్పించుకోవడం దేన్ని సూచించింది?

8 ఇశ్రాయేలీయులు యెహోవాతో నిబంధన చేసుకున్నప్పుడు, వారు ఆయన సమర్పిత జనాంగమయ్యారు. వారిని సీనాయి పర్వతం దగ్గర సమకూర్చి, యెహోవా వారితో ఇలా చెప్పాడు: “మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.” దానికి ప్రజలు, “యెహోవా చెప్పినదంతయు చేసెదము” అని ఏక స్వరముతో చెప్పారు. (నిర్గ. 19:4-8) సమర్పిత జనాంగంగా ఉండడానికి, వారు ఏదో ఒక పని విషయంలో నిబద్ధత చూపిస్తే సరిపోదు. వారు యెహోవా స్వాస్థ్యంగా ఉండాలి. యెహోవా వారిని తన ‘స్వకీయ సంపాద్యంగా’ పరిగణిస్తాడు.

9. దేవునికి సమర్పించుకోవడం వల్ల ఇశ్రాయేలీయులు ఎలా ప్రయోజనం పొందారు?

9 యెహోవా సొత్తుగా ఉండడంవల్ల ఇశ్రాయేలీయులు ప్రయోజనం పొందారు. ఆయన వారికి నమ్మకంగా ఉంటూ వారిని తన పిల్లల్లా ప్రేమగా చూసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులతో, “స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండ తన చంటిపిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను” అని అన్నాడు. (యెష. 49:15) యెహోవా వారికి ధర్మశాస్త్ర నియమాలను, దేవదూతల కాపుదలను ఇచ్చాడు. ప్రవక్తలను పంపించి ప్రోత్సహించాడు. ఒక కీర్తనకర్త ఇలా రాశాడు: “ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి.” (కీర్త. 147:19, 20; కీర్తనలు 34:7, 19; 48:14 చదవండి.) యెహోవా గతంలో తన సొత్తుగా ఉన్న జనాంగాన్ని చూసుకున్నట్లే, మన కాలంలోనూ తనకు సమర్పించుకున్నవారిని చూసుకుంటాడు.

మనం దేవునికి ఎందుకు సమర్పించుకోవాలి?

10, 11. మనం దేవుని విశ్వ కుటుంబంలో పుట్టామా? వివరించండి.

10 దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవాలా వద్దా అని ఆలోచించేవారు, ‘దేవునికి సమర్పించుకోకపోయినా ఆయనను ఆరాధించవచ్చు కదా?’ అని అనుకోవచ్చు. ప్రస్తుతం దేవుని ముందు మన పరిస్థితి ఏమిటో ఆలోచిస్తే దానికి జవాబు తెలుస్తుంది. ఆదాము పాపం కారణంగా, మనం దేవుని కుటుంబంలో పుట్టలేదు. (రోమా. 3:23; 5:12) ఆయన విశ్వ కుటుంబంలో ఒకరం కావాలనుకుంటే దేవునికి మనం సమర్పించుకోవడం చాలా అవసరం. ఎందుకు?

11 ఏ మానవ తండ్రీ తన పిల్లలకు దేవుడు ఉద్దేశించినట్లు నిత్యజీవాన్ని ఇవ్వలేకపోయాడు. (1 తిమో. 6:18, 19) మొదటి దంపతులు పాపం చేసినప్పుడు వారు తమ ప్రేమగల తండ్రి, సృష్టికర్త అయిన యెహోవా నుండి వేరుపడ్డారు కాబట్టి మనం ఆయన కుమారులుగా పుట్టలేదు. (ద్వితీయోపదేశకాండము 32:5 ను పోల్చండి.) అప్పటి నుండి మానవులు యెహోవా విశ్వ కుటుంబం వెలుపల దేవునికి దూరంగా జీవించసాగారు.

12. (ఎ) అపరిపూర్ణ మానవులు దేవుని కుటుంబ సభ్యులు ఎలా కాగలరు? (బి) బాప్తిస్మం తీసుకునే ముందు మనం ఏ చర్యలు తీసుకోవాలి?

12 అయితే, తనకు ఇష్టమైన సేవకుల్లో ఒకరిగా మనల్ని స్వీకరించమని మనం దేవుణ్ణి కోరవచ్చు. a పాపులమైన మనకు అది ఎలా సాధ్యం? అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాం.’ (రోమా. 5:10) బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఆయన ఆమోదం పొందేందుకు మంచి మనస్సాక్షి ఇవ్వమని దేవుణ్ణి వేడుకుంటాం. (1 పేతు. 3:21) అయితే, బాప్తిస్మం తీసుకునే ముందు మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. మనం దేవుణ్ణి తెలుసుకొని, ఆయనపై నమ్మకముంచడాన్ని నేర్చుకోవాలి. పశ్చాత్తాపపడి మన పద్ధతులను మార్చుకోవాలి. (యోహా. 17:3; అపొ. 3:19, 20; హెబ్రీ. 11:6) దేవుడు మనల్ని తన కుటుంబంలో చేర్చుకునే ముందు మనం మరొకటి కూడా చేయాలి. అదేమిటి?

13. దేవుని ఆమోదం పొందిన ఆరాధకుల కుటుంబంలో ఒకరిగా ఉండడానికి ఆయనకు సమర్పించుకున్నామని ప్రమాణం చేయడం ఎందుకు సముచితం?

13 యెహోవా దేవుని నుండి వేరుపడిన ఒక వ్యక్తి ఆయన ఆమోదం పొందిన సేవకుడు కావాలనుకుంటే మొదటిగా ఆయనకు ఒక ముఖ్యమైన వాగ్దానం చేయాలి. దాన్ని అర్థం చేసుకునేందుకు ఓ ఉదాహరణను చూద్దాం. సమాజంలో గౌరవమున్న ఒక తండ్రి ఓ అనాథ బాలుణ్ణి ఇష్టపడి, దత్తత తీసుకోవాలనుకుంటున్నాడు. ఆ తండ్రికి మంచి వ్యక్తిగా పేరుంది. అయినా, ఆ బాలుణ్ణి తన కుమారునిగా స్వీకరించే ముందు వాణ్ణి ఒక మాటివ్వమంటాడు. “నిన్ను నా కుమారునిగా స్వీకరించే ముందు, నాకు ఓ విషయం చెప్పు. నువ్వు నన్ను తండ్రిగా ప్రేమించి, గౌరవిస్తావా?” అని అడుగుతాడు. ముఖ్యమైన ఆ ప్రమాణం చేసేందుకు ఆ బాలుడు ఇష్టపడితేనే ఆ తండ్రి వాణ్ణి తన కుటుంబంలో చేర్చుకుంటాడు. అది న్యాయమే కదా? అలాగే, తనకు సమర్పించుకున్నామని ప్రమాణం చేసేవారినే యెహోవా తన కుటుంబంలో చేర్చుకుంటాడు. బైబిలు ఇలా చెబుతోంది: “పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి.”—రోమా. 12:1.

ప్రేమతో, విశ్వాసంతో తీసుకునే చర్య

14. సమర్పణ ప్రేమతో తీసుకునే చర్య అని ఎలా చెప్పవచ్చు?

14 దేవునికి సమర్పించుకుంటున్నామని ప్రమాణం చేయడం ద్వారా యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామని చూపిస్తాం. కొన్ని విధాలుగా అది వివాహ ప్రమాణం లాంటిదే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, పెళ్లికుమార్తెకు నమ్మకంగా ఉంటానని ప్రమాణం చేయడం ద్వారా ఆమె పట్ల తనకున్న ప్రేమను క్రైస్తవ పెళ్లికుమారుడు వ్యక్తం చేస్తాడు. అది ఒకానొక పని చేస్తానని ఇచ్చే మాట కాదుగానీ ఒక వ్యక్తికి చేసే ప్రమాణం. వివాహ ప్రమాణం చేయకపోతే తాను పెళ్లికుమార్తెతో జీవితం పంచుకోలేనని ఓ క్రైస్తవ పెళ్లికుమారునికి తెలుసు. అలాగే, సమర్పించుకున్నామని ప్రమాణం చేయకపోతే, యెహోవా కుటుంబంలో సభ్యునిగా ఉండడంవల్ల వచ్చే ప్రయోజనాలను పూర్తిగా అనుభవించలేం. అందుకే, మనకు అపరిపూర్ణతలున్నా ఆయన సొత్తుగా ఉండాలని కోరుకొని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయనకు నమ్మకంగా ఉండాలనే కృతనిశ్చయాన్ని కనబరుస్తూ దేవునికి సమర్పించుకుంటాం.—మత్త. 22:37.

15. సమర్పించుకోవడం ద్వారా మనం విశ్వాసాన్ని ఎలా చూపిస్తాం?

15 దేవునికి సమర్పించుకోవడం ద్వారా ఆయనపట్ల విశ్వాసం ఉందని చూపిస్తాం. ఎలా? యెహోవాపట్ల మనకు విశ్వాసముంటే ఆయనకు దగ్గరవడం వల్ల మంచి జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది. (కీర్త. 73:28) “మూర్ఖమైన వక్రజనము” మధ్య జీవిస్తున్నాం కాబట్టి దేవుని ఆజ్ఞలు పాటించడం అన్ని సందర్భాల్లో సులభంకాదని మనకు తెలుసు. అయినా మనం చేసే ప్రయత్నాలకు మద్దతునిస్తాననే దేవుని వాగ్దానాన్ని నమ్ముతాం. (ఫిలి. 2:14, 15; 4:13) మనం అపరిపూర్ణులమని మనకు తెలుసు. అదే సమయంలో, తప్పులు చేసినప్పుడు యెహోవా మనపట్ల కనికరంతో వ్యవహరిస్తాడనే నమ్మకం కూడా మనకుంది. (కీర్తనలు 103:13, 14; రోమీయులు 7:21-25 చదవండి.) అంతేకాక, యథార్థత కాపాడుకోవడానికి కృతనిశ్చయాన్ని కనబరిస్తే యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకం మనకుంది.—యోబు 27:5.

దేవునికి సమర్పించుకుంటే సంతోషంగా ఉంటాం

16, 17. యెహోవాకు సమర్పించుకోవడం వల్ల మనం ఎందుకు సంతోషంగా ఉంటాం?

16 యెహోవాకు సమర్పించుకోవడం ద్వారా మనల్ని మనం అర్పించుకుంటాం కాబట్టి సంతోషంగా ఉంటాం. యేసు, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అనే ప్రాథమిక సత్యాన్ని చెప్పాడు. (అపొ. 20:35) ఇవ్వడంలో ఎంత ఆనందం ఉందో ఆయన తన భూపరిచర్యలో పూర్తిగా చవిచూశాడు. జీవమార్గం తెలుసుకునేలా ప్రజలకు సహాయం చేయడానికి ఆయన కొన్నిసార్లు విశ్రాంతి, సౌకర్యం, ఆహారం వంటివాటి గురించి కూడా ఆలోచించలేదు. (యోహా. 4:34) తన తండ్రి హృదయాన్ని సంతోషపెట్టడంలో ఆనందాన్ని పొందాడు. యేసు ఇలా చెప్పాడు: “ఆయన కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును.”—యోహా. 8:29; సామె. 27:11.

17 సంతృప్తికరమైన జీవితాన్ని ఎలా గడపవచ్చో యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆయన వారితో, ‘ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల, తన్నుతాను ఉపేక్షించుకోవాలి’ అని అన్నాడు. (మత్త. 16:24) అలా చేయడంవల్ల మనం యెహోవాకు మరింత దగ్గరౌతాం. మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేవారి కాపుదలలో ఉండడానికి మనం ఇష్టపడమా?

18. ఓ వ్యక్తికి లేదా వస్తువుకు సమర్పించుకోవడం వల్ల వచ్చే సంతోషంకన్నా మనం యెహోవాను సమర్పించుకోవడం వల్ల వచ్చే సంతోషం ఎక్కువని ఎందుకు చెప్పవచ్చు?

18 యెహోవాకు సమర్పించుకొని, ఆయన చిత్తం చేస్తూ ఆ సమర్పణకు తగ్గట్టు జీవించడంవల్ల ఎంతో సంతోషంగా ఉంటాం. ఈ లోకంలో ఇంకెవ్వరికి సమర్పించుకున్నా, దేనికి సమర్పించుకున్నా అంత సంతోషాన్ని పొందలేం. ఉదాహరణకు, చాలామంది వస్తుసంపాదన కోసం తమ జీవితాన్నే అంకితం చేసుకుంటారు. అంతచేసినా, వారు నిజమైన సంతోషాన్ని, సంతృప్తిని సొంతం చేసుకోలేరు. అయితే, యెహోవాకు సమర్పించుకునేవారు మాత్రం నిత్యమూ సంతోషంగా ఉంటారు. (మత్త. 6:24) ‘దేవుని జతపనివారిగా’ సేవచేసే గొప్ప అవకాశాన్నిబట్టి వారు సంతోషిస్తారు. ఎంతైనా వారు, ఓ పనికి తమను తాము సమర్పించుకోలేదు గానీ, కృతజ్ఞతగల మన దేవునికి సమర్పించుకున్నారు. (1 కొరిం. 3:9) వారి స్వయంత్యాగాన్ని ఆయన మెచ్చుకున్నంతగా మరెవ్వరూ మెచ్చుకోలేరు. ఆయన కాపుదల నుండి ఆయన ఆరాధకులు ఎల్లప్పుడూ ప్రయోజనం పొందేలా తన రాజ్యంలో ఆయన వారిని యౌవనులుగా చేస్తాడు.—యోబు 33:25; హెబ్రీయులు 6:10 చదవండి.

19. యెహోవాకు సమర్పించుకున్నవారికి ఎలాంటి గొప్ప అవకాశముంది?

19 మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడం వల్ల మీరు ఆయనకు మరింత దగ్గరౌతారు. “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును” అని బైబిలు చెబుతోంది. (యాకో. 4:8; సామె. 3:32) తర్వాతి ఆర్టికల్‌లో, యెహోవా సొత్తుగా ఉండాలనే నిర్ణయాన్ని ధైర్యంగా ఎందుకు తీసుకోవచ్చో చూస్తాం.

[అధస్సూచి]

a వెయ్యి సంవత్సరాలు ముగిసేంతవరకు యేసు ‘వేరేగొర్రెలు’ దేవుని కుమారులు కాలేరు. అయితే, దేవునికి సమర్పించుకున్నారు కాబట్టి, వారు దేవుణ్ణి ‘తండ్రి’ అని పిలవడం సబబే. వారిని యెహోవా ఆరాధకుల కుటుంబంలో ఒకరిగా పరిగణించడం కూడ సముచితమే.—యోహా. 10:16; యెష. 64:8; మత్త. 6:9; ప్రక. 20:5.

మీరెలా జవాబిస్తారు?

• దేవునికి సమర్పించుకోవడమంటే ఏమిటి?

• దేవుని సమర్పిత సేవకులుగా ఉండడంవల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?

• క్రైస్తవులు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[6వ పేజీలోని చిత్రం]

మన సమర్పణకు తగ్గట్టు జీవిస్తే నిత్యమూ సంతోషంగా ఉంటాం