కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా కృపనుబట్టే మనం ఆయన సొత్తుగా ఉన్నాం

యెహోవా కృపనుబట్టే మనం ఆయన సొత్తుగా ఉన్నాం

యెహోవా కృపనుబట్టే మనం ఆయన సొత్తుగా ఉన్నాం

“మనము . . . ప్రభువువారమై యున్నాము.”—రోమా. 14:8.

1, 2. (ఎ) మనకు ఏ గొప్ప అవకాశం ఇవ్వబడింది? (బి) మనం ఏ ప్రశ్నల గురించి చర్చిస్తాం?

 “మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు” అని యెహోవా ఇశ్రాయేలీయులకు చెప్పాడు. అది ఎంత గొప్ప అవకాశం! (నిర్గ. 19:5) యెహోవా సొత్తుగా ఉండే గొప్ప అవకాశం క్రైస్తవ సంఘంలోనివారికి కూడా నేడు ఇవ్వబడింది. (1 పేతు. 2:9; ప్రక. 7:9, 14, 15) అది మనకు ఎల్లప్పుడూ మంచే చేస్తుంది.

2 యెహోవా సొత్తుగా ఉండడం గొప్ప అవకాశమే అయినా, అది మనపై ఒక బాధ్యతను కూడ ఉంచుతుంది. ‘యెహోవా ఆశించినట్లు నేను ప్రవర్తించగలనా? ఒకవేళ రేపు నేను ఏదైనా పాపం చేస్తే ఆయన నన్ను తిరస్కరిస్తాడా? యెహోవాకు సొత్తుగా ఉంటే నేను నా స్వేచ్ఛను కోల్పోతానా?’ అనే ప్రశ్నలు కొందరికి వస్తాయి. అలాంటి విషయాల గురించి ఆలోచించడం తప్పుకాదు. అయితే ముందుగా, యెహోవాకు సొత్తుగా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి? అనే ప్రశ్న గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.

యెహోవాకు సొత్తుగా ఉంటే సంతోషంగా ఉంటాం

3. యెహోవాను సేవించాలని నిర్ణయించుకోవడం వల్ల రాహాబుకు ఎలాంటి మేలు జరిగింది?

3 యెహోవాకు సొత్తుగా ఉండడంవల్ల మేలు జరుగుతుందా? ప్రాచీన యెరికో పట్టణస్థురాలైన రాహాబు అనే వేశ్య ఉదాహరణ తీసుకోండి. ఆమె చిన్నప్పటి నుండి కనాను దేవతలకు సంబంధించిన హేయమైన ఆరాధనలో పాల్గొనివుంటుంది. అయినా, ఆమె ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన విజయాల గురించి విన్నప్పుడు ఆయనే సత్యదేవుడు అని గ్రహించింది. అందుకే, ఆమె దేవుడు ఎన్నుకున్న ప్రజలను కాపాడడానికి తన ప్రాణాలను పణంగా పెట్టింది. అలా తన భవిష్యత్తును వారి చేతుల్లో ఉంచింది. బైబిలు ఆమె గురించి ఇలా చెబుతోంది: “రాహాబను వేశ్యకూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా?” (యాకో. 2:25) ప్రేమ, న్యాయం వంటి విషయాల్లో దేవుని ఉపదేశం పొందే పరిశుభ్రమైన ప్రజల్లో ఒకరిగా ఉండే గొప్ప అవకాశం దొరకడం వల్ల ఆమెకు జరిగిన మేలు గురించి ఒక్కసారి ఆలోచించండి. ఆమె తన గత జీవన విధానాన్ని విడిచిపెట్టినందుకు ఎంత సంతోషించివుంటుంది! ఆమె ఓ ఇశ్రాయేలీయుణ్ణి పెళ్లిచేసుకొని బోయజును కన్నది. తన కుమారుణ్ణి దేవునిపట్ల భయభక్తులుగల మంచి వ్యక్తిగా పెంచింది.—యెహో. 6:25; రూతు 2:4-12; మత్త. 1:5, 6.

4. యెహోవాను సేవించాలని నిర్ణయించుకోవడం వల్ల రూతు ఎలా ప్రయోజనం పొందింది?

4 మోయాబీయురాలైన రూతు కూడ యెహోవాను సేవించాలని నిర్ణయించుకుంది. చిన్నప్పుడు ఆమె కెమోషు దేవతను, మోయాబీయుల ఇతర దేవతలను ఆరాధించివుంటుంది. కానీ సత్యదేవుడైన యెహోవాను తెలుసుకొని, తన దేశంలో ఆశ్రయాన్ని పొందడానికి వచ్చిన ఇశ్రాయేలీయుణ్ణి పెళ్లిచేసుకుంది. (రూతు 1:1-6 చదవండి.) ఆ తర్వాత, రూతు, ఆమె తోటికోడలైన ఓర్పా తమ అత్త అయిన నయోమితో కలిసి బేత్లెహేముకు బయలుదేరారు. అప్పుడు నయోమి ఆ ఇద్దరినీ పుట్టింటికి వెళ్లమని వేడుకుంది. ఎందుకంటే, ఇశ్రాయేలు దేశానికి వెళ్లి అక్కడ స్థిరపడడం అనుకున్నంత సులభమేమీ కాదు. ఓర్పా తన అత్త చెప్పినట్లే, “తన జనులయొద్దకును, తన దేవునియొద్దకును తిరిగిపోయినది,” కానీ రూతు మాత్రం వెళ్లలేదు. ఆమె విశ్వాసానికి తగ్గట్టు ప్రవర్తించింది. అంతేకాదు, తాను ఎవరి సొత్తు కావాలనుకుంటుందో ఆమెకు తెలుసు. అందుకే ఆమె “నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు—నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు” అని నయోమితో చెప్పింది. (రూతు 1:15, 16) యెహోవాను సేవించాలని ఆమె నిర్ణయించుకుంది కాబట్టి, దేవుని ధర్మశాస్త్రంలో విధవరాళ్లకు, పేదవారికి, భూమిలేనివారికి చేయబడిన ప్రత్యేక ఏర్పాటు నుండి ఆమె ప్రయోజనం పొందింది. యెహోవా రెక్కల క్రింద ఆమె సంతోషాన్ని, సంరక్షణను, భద్రతను చవిచూసింది.

5. యెహోవాను నమ్మకంగా సేవిస్తున్నవారి ఉదాహరణల నుండి మీరేమి తెలుసుకున్నారు?

5 యెహోవాకు సమర్పించుకున్న తర్వాత ఎన్నో దశాబ్దాలుగా ఆయనను నమ్మకంగా సేవిస్తున్న కొంతమంది మీకు తెలిసేవుండవచ్చు. ఆయనను సేవించడం వల్ల వారు ఎలాంటి ప్రయోజనాలు పొందారో వారిని అడిగి తెలుసుకోండి. వారికీ కష్టాలు ఎదురయ్యాయి. వారి ఉదాహరణలు, “యెహోవా తమకు దేవుడుగాగల జనులు ధన్యులు” అని కీర్తనకర్త చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజమని బలంగా రుజువుచేస్తున్నాయి.—కీర్త. 144:15.

యెహోవా మన పరిమితులను అర్థంచేసుకుంటాడు

6. యెహోవా కోరేవాటిని చేయలేమని మనం ఎందుకు భయపడకూడదు?

6 యెహోవా కోరే విధంగా జీవించగలరో లేదో అని మీరు అనుకొనివుంటారు. దేవుని సేవకునిగా ఉంటూ, ఆయన నియమాలను పాటించడం, ఆయన ప్రతినిధులుగా ఉండడం అంత సులభంకాదని అనిపించవచ్చు. ఉదాహరణకు, యెహోవా మోషేను ఇశ్రాయేలీయులతో, ఐగుప్తు రాజుతో మాట్లాడేందుకు వెళ్లమని ఆజ్ఞాపించినప్పుడు, అది తనవల్ల కానిపని అని అనుకున్నాడు. అయితే, మోషే చేయలేనిదాన్ని దేవుడు కోరలేదు. అంతేకాక, యెహోవా ‘ఆయన చేయాల్సింది బోధించాడు.’ (నిర్గమకాండము 3:11; 4:1, 10, 13-15 చదవండి.) మోషే యెహోవా ఇచ్చిన సహాయాన్ని తీసుకున్నాడు కాబట్టి దేవుని చిత్తం చేయడంలో ఆనందాన్ని పొందాడు. యెహోవా మన సామర్థ్యానికి మించినవి చేయమని కోరడు. మనం అపరిపూర్ణులమని ఆయనకు తెలుసు కాబట్టి, మనకు సహాయం చేయాలనుకుంటాడు. (కీర్త. 103:14) యేసు అనుచరులముగా దేవుణ్ణి సేవించడం ఆహ్లాదకరంగా ఉంటుందే కానీ భారంగా కాదు. ఎందుకంటే ఆయన అనుచరులముగా జీవిస్తే ఇతరులు ప్రయోజనం పొందుతారు, యెహోవానూ సంతోషపెట్టగలుగుతాం. “నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి” అని యేసు చెప్పాడు.—మత్త. 11:28, 29.

7. యెహోవా తాను కోరేవాటిని చేసేందుకు కావాల్సిన సహాయాన్ని మనకు చేస్తాడనే ధైర్యంతో మీరెందుకు ఉండవచ్చు?

7 ఆయన సేవచేసేలా శక్తినివ్వమని యెహోవాకు ప్రార్థిస్తే, ఆయన మనకు ఎప్పుడూ బలాన్నిచ్చి కావాల్సిన ప్రోత్సాహాన్నిస్తాడు. ఉదాహరణకు, యిర్మీయా ధైర్యస్థుడేమీ కాదని బైబిలు లేఖనాలనుబట్టి తెలుస్తోంది. అందుకే, యెహోవా ఆయనను ప్రవక్తగా నియమించినప్పుడు, ఆయన, “అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము నేను బాలుడనే; మాటలాడుటకు నాకు శక్తి చాలదు” అని ఓ సందర్భంలో అన్నాడు. మరో సందర్భంలోనైతే, “ఆయన నామమును బట్టి ప్రకటింపను” అని కూడా అన్నాడు. (యిర్మీ. 1:6; 20:9) అయినా యెహోవా ప్రోత్సాహంతో, ప్రజలు ఇష్టపడని సందేశాన్ని 40 సంవత్సరాలు ప్రకటించగలిగాడు. యెహోవా ఆయనను మళ్లీ మళ్లీ ఈ మాటలతో బలపర్చాడు: “నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును.”—యిర్మీ. 1:8, 19; 15:20.

8. మనం యెహోవామీద నమ్మకముంచుతున్నామని ఎలా చూపిస్తాం?

8 యెహోవా మోషే, యిర్మీయాలను బలపర్చినట్లే, తన ఆజ్ఞలను పాటించేలా మనల్ని కూడ బలపర్చగలడు. అయితే, మనం ఆయన సహాయాన్ని కోరాలి. బైబిలు ఇలా చెబుతోంది: “నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును.” (సామె. 3:5, 6) ఆయన తన వాక్యం ద్వారా, సంఘం ద్వారా మనకు ఇస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మనం యెహోవామీద నమ్మకముంచుతున్నామని చూపిస్తాం. మన జీవితంలో ఆయన నిర్దేశాన్ని తీసుకుంటే, మనకు ఏ ఆటంకం వచ్చినా ఆయనకు నమ్మకంగా ఉండగలుగుతాం.

యెహోవా ప్రతీ సేవకునిపట్ల శ్రద్ధ చూపిస్తాడు

9, 10. తొంభై ఒకటవ కీర్తన ఎలాంటి సంరక్షణ గురించి వాగ్దానం చేస్తోంది?

9 యెహోవాకు సమర్పించుకోవడం గురించి ఆలోచించినప్పుడు కొందరు తాము పాపం చేస్తామేమో, ఆయన సేవకులుగా ఉండేందుకు అనర్హులమౌతామేమో, ఆయన తమను తిరస్కరిస్తాడేమో అని భయపడివుంటారు. అయితే, సంతోషకరంగా, ఆయనతో ఉన్న అమూల్యమైన సంబంధాన్ని కాపాడుకునేందుకు కావాల్సిన కాపుదలను యెహోవా మనకు ఇస్తాడు. ఈ విషయంలో 91వ కీర్తనలోని వచనాలు ఏమి చెబుతున్నాయో చూద్దాం.

10 ఆ కీర్తనలోని మొదటి వచనం ఇలా చెబుతోంది: “మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. —ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును.” (కీర్త. 91:1-3) తనను ప్రేమించి, తనపై నమ్మకముంచేవారిని సంరక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. (కీర్తనలు 91:9, 14 చదవండి.) ఆయన ఎలాంటి సంరక్షణను ఇస్తాడు? గతంలో ఆయన వాగ్దాన మెస్సీయ రావాల్సిన వంశాన్ని కాపాడేందుకు కొన్నిసార్లు తన సేవకుల ప్రాణాలను రక్షించాడు. అయితే, దేవుని నమ్మకమైన సేవకులు తమ యథార్థతను విడిచిపెట్టేలా చేసేందుకు సాతాను శతవిధాలా ప్రయత్నించాడు. దానివల్ల అనేకమంది దేవుని సేవకులు బంధించబడ్డారు, యాతనపెట్టబడ్డారు, చివరకు చంపబడ్డారు. (హెబ్రీ. 11:34-39) యథార్థతను నిలబెట్టుకునేలా యెహోవా వారికి సహాయం చేశాడు కాబట్టి, ఆ శ్రమలను సహించేందుకు కావాల్సిన ధైర్యాన్ని వారు కూడగట్టుకోగలిగారు. అందుకే, 91వ కీర్తన, ఆధ్యాత్మిక సంరక్షణ విషయంలో యెహోవా ఇచ్చే వాగ్దానం గురించి మాట్లాడుతుందని చెప్పవచ్చు.

11. “మహోన్నతుని చాటు” అంటే ఏమిటి? ఆ స్థలంలో దేవుడు ఎవరిని కాపాడతాడు?

11 ఒక విధంగా చెప్పాలంటే, “మహోన్నతుని చాటు” అని కీర్తనకర్త చెప్పిన మాట ఆధ్యాత్మిక సంరక్షణనిచ్చే స్థలాన్ని సూచిస్తోంది. దేవుని అతిథులుగా దానిలో ఆశ్రయం పొందేవారు ఆయనపై తమకున్న విశ్వాసాన్ని, ప్రేమను దెబ్బతీయగల విషయాల నుండి, వ్యక్తుల నుండి సంరక్షించబడతారు. (కీర్త. 15:1, 2; 121:5) అవిశ్వాసులు దాన్ని గుర్తించలేరు కాబట్టి అది చాటున ఉండే స్థలం అని చెప్పవచ్చు. తమ ప్రవర్తన ద్వారా ‘నేను నమ్ముకొను నా దేవుడు’ అని చాటిచెప్పే ప్రజల్ని యెహోవా ఆ స్థలంలో కాపాడతాడు. మనం ఆ ఆశ్రయ స్థలంలోనే ఉంటే, ‘వేటగాడైన’ సాతాను ఉరిలోపడి దేవుని అనుగ్రహం కోల్పోతామేమో అని అనవసరంగా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడదు.

12. దేవునితో మన సంబంధానికి పొంచివున్న కొన్ని ప్రమాదాలేమిటి?

12 దేవునితో మనకున్న అమూల్యమైన సంబంధానికి పొంచివున్న కొన్ని ప్రమాదాలేమిటి? కీర్తనకర్త అనేక ప్రమాదాల గురించి చెప్పాడు. వాటిలో “చీకటిలో సంచరించు తెగులు . . . మధ్యాహ్నమందు పాడుచేయు రోగము” వంటివి ఉన్నాయి. (కీర్త. 91:5, 6) ‘వేటగాడు’ అనేకమందిని ఓ ఉరిలో పడేశాడు. స్వేచ్ఛగా జీవించాలనే స్వార్థపూరిత కోరికే ఆ ఉరి. (2 కొరిం. 11:3) అత్యాశ, గర్వం, ధనాశను ప్రోత్సహించి మరికొందరిని తన ఉరిలో పడేశాడు. ఇంకా కొందరిని దేశాభిమానం, పరిణామ సిద్ధాంతం, అబద్ధమతం వంటి వాటిని ఉపయోగించి మోసగించాడు. (కొలొ. 2:8) అంతేకాక, లైంగిక దుర్నీతి అనే ఉరిలో చాలామందిని పడేశాడు. ఆధ్యాత్మికంగా హాని కలిగించే అలాంటి తెగుళ్లవల్ల చాలామంది దేవునిపట్ల తమకున్న ప్రేమను కోల్పోయారు.—కీర్తనలు 91:7-10 చదవండి; మత్త. 24:12.

దేవుని పట్ల మీకున్న ప్రేమను ఎలా కాపాడుకోవాలి?

13. మనల్ని ఆధ్యాత్మికంగా బలహీనపర్చే కొన్ని ప్రమాదాల నుండి యెహోవా మనల్ని ఎలా కాపాడతాడు?

13 ఈ ఆధ్యాత్మిక ప్రమాదాల నుండి యెహోవా తన ప్రజలను ఎలా కాపాడతాడు? 91వ కీర్తనలో ఇలా ఉంది: “నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.” (కీర్త. 91:11) మనం సువార్త ప్రకటించేలా పరలోకంలోని దేవదూతలు మనల్ని నడిపిస్తూ, సంరక్షిస్తారు. (ప్రక. 14:6) క్రైస్తవ పెద్దలు కూడ లేఖనాలకు కట్టుబడి బోధించడం ద్వారా అబద్ధ తర్కాలనుబట్టి మోసపోకుండా మనల్ని కాపాడతారు. లోక పోకడలను విడిచిపెట్టలేకపోతున్నవారికి వారు వ్యక్తిగతంగా సహాయం చేస్తారు. (తీతు 1:9; 1 పేతు. 5:2) అంతేకాక, పరిణామ సిద్ధాంతం, చెడు కోరికల ప్రలోభం, ధన వ్యామోహం, పేరుప్రఖ్యాతుల కోసం ప్రాకులాడడం, ఇతర హానికరమైన కోరికలు, ప్రభావాల వంటి వాటి నుండి కాపాడడానికి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నాడు. (మత్త. 24:45) పైన ప్రస్తావించబడిన కొన్ని ప్రమాదాల్లో చిక్కుకోకుండా ఉండేందుకు మీరు ఏమి చేశారు?

14. దేవుడిచ్చే సంరక్షణ నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు?

14 రక్షణ కోసం దేవుని ‘చాటున’ ఉండడానికి మనం ఏమి చేయాలి? దుర్ఘటనలు, అంటువ్యాధుల బారినపడకుండా, నేరస్థుల చేతుల్లో చిక్కుకోకుండా ఉండేందుకు ఎల్లప్పుడూ జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని మనం ఎలా కాపాడుకుంటూ ఉంటామో అలాగే ఆధ్యాత్మిక ప్రమాదాల బారిన పడకుండా ఎల్లప్పుడూ మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే, మనం మన సాహిత్యాల్లో, సంఘ కూటాల్లో, సమావేశాల్లో, యెహోవా ఇచ్చే నిర్దేశాన్ని ఎల్లప్పుడూ సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల సలహా కోరాలి. అంతేకాదు, మన క్రైస్తవ సహోదరసహోదరీలు కనబరిచే వివిధ లక్షణాలనుబట్టి ప్రయోజనం పొందుతాం. సంఘంతో సహవసించడం వల్ల మనం జ్ఞానవంతులం కాగలుగుతాం.—సామె. 13:20; 1 పేతురు 4:10 చదవండి.

15. మనం యెహోవా ఆమోదాన్ని కోల్పోయేలా చేయగల వాటి నుండి ఆయన మనల్ని కాపాడతాడని మనం ఎందుకు నమ్మవచ్చు?

15 మనం ఆయన ఆమోదాన్ని కోల్పోయేలా చేయగల వాటి నుండి యెహోవా మనల్ని కాపాడతాడా లేదా అని అనుమానపడనక్కర్లేదు. (రోమా. 8:38, 39) క్రైస్తవులను చంపాలని కాదుగానీ పరిశుద్ధ దేవుని నుండి వారిని దూరం చేయాలని ప్రయత్నించే శక్తివంతమైన మత, రాజకీయ శత్రువుల నుండి యెహోవా క్రైస్తవ సంఘాన్ని కాపాడాడు. “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు” అని తాను ఇచ్చిన మాటను యెహోవా నిలబెట్టుకున్నాడు.—యెష. 54:17.

మనకు ఎవరు స్వేచ్ఛనిస్తారు?

16. లోకం మనకు ఎందుకు స్వేచ్ఛను ఇవ్వలేదు?

16 యెహోవా సొత్తుగా ఉండడం వల్ల మనం స్వేచ్ఛను కోల్పోతామా? లేదు. లోకస్థులుగా ఉండడంవల్లే మనం స్వేచ్ఛను కోల్పోతాం. లోకం యెహోవా నుండి వేరుపడింది. అప్పటి నుండి అది, ప్రజలను దాసులనుగా చేసి పరిపాలించే క్రూరమైన దేవత చేతుల్లో ఉంది. (యోహా. 14:30) ఉదాహరణకు, సాతాను వ్యవస్థ ప్రజలమీద ఆర్థిక ఒత్తిళ్లు తీసుకొచ్చి వారికి స్వేచ్ఛ లేకుండా చేస్తోంది. (ప్రకటన 13:16, 17 ను పోల్చండి.) అంతేకాక, పాపానికి కూడ ప్రజలను లోబర్చుకొని మోసగించే శక్తి ఉంది. (యోహా. 8:34; హెబ్రీ. 3:13) అవిశ్వాసులు యెహోవా బోధలకు వ్యతిరేకమైన జీవిత విధానాన్ని ప్రోత్సహిస్తూ అందులో స్వేచ్ఛ ఉందని మాటివ్వవచ్చు. కానీ వారి మాట వినేవారు చివరకు పాపభరితమైన, దిగజారిన జీవనశైలికి దాసులౌతారు.—రోమా. 1:24-32.

17. యెహోవా మనకు ఎలాంటి స్వేచ్ఛను ఇస్తున్నాడు?

17 అయితే, మనం యెహోవా కాపుదలలోకి వస్తే, మనకు హాని కలిగించే వాటన్నిటి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. కొన్ని విధాలుగా మన పరిస్థితిని, ప్రాణాంతకమైన పరిస్థితి నుండి కాపాడగల నైపుణ్యమున్న సర్జన్‌ చేతుల్లో తన ప్రాణాన్ని పెట్టే ఓ వ్యక్తితో పోల్చవచ్చు. పాపం వారసత్వంగా వచ్చినందుకు మనందరం ప్రాణాంతకమైన పరిస్థితిలో ఉన్నాం. క్రీస్తు బలిమీద విశ్వాసముంచుతూ యెహోవా కాపుదలలోకి వస్తేనే, మనం పాపం వల్ల ఎదుర్కొంటున్న చెడు పర్యవసానాలను తప్పించుకొని నిరంతరం జీవించగలుగుతాం. (యోహా. 3:36) శస్త్రచికిత్స చేయడంలో నిపుణుడనే పేరు సర్జన్‌కు ఉందని తెలిస్తే ఆయనమీద మన నమ్మకం ఎలా పెరుగుతుందో, అలాగే యెహోవా గురించి తెలుసుకునేకొద్దీ ఆయనమీద మన విశ్వాసం కూడా పెరుగుతుంది. అందుకే, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తాం. అలా చేస్తే, ఆయన సొత్తుగా ఉండే విషయంలో మనకున్న భయాలను వదిలేసి ఆయనను ప్రేమించగలుగుతాం.—1 యోహా. 4:18.

18. యెహోవా సొత్తుగా ఉండేవారు దేన్ని అనుభవిస్తారు?

18 దేన్నైనా ఎన్నుకునే స్వేచ్ఛను యెహోవా మానవులందరికీ ఇస్తున్నాడు. ఆయన వాక్యం ఇలా చెబుతోంది: “నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి . . . జీవమును కోరుకొనుడి.” (ద్వితీ. 30:19, 20) ఆయనను సేవించాలని ఇష్టపూర్వకంగా నిర్ణయించుకోవడం ద్వారా తనపట్ల మనకున్న ప్రేమను చూపించాలని ఆయన కోరుతున్నాడు. మనం ప్రేమించే దేవునికి సొత్తుగా ఉండడం వల్ల స్వేచ్ఛను కోల్పోం గానీ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాం.

19. యెహోవా కృపవల్లే ఆయన సొత్తుగా ఉండగలుగుతామని ఎలా చెప్పవచ్చు?

19 మనం పాపులం కాబట్టి, పరిపూర్ణుడైన దేవుని సొత్తుగా ఉండడానికి తగినవారం కాదు. కానీ దేవుని కృపవల్లే అది సాధ్యమైంది. (2 తిమో. 1:9) అందుకే, పౌలు ఇలా రాశాడు: ‘మనము బ్రదికినను యెహోవా కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను యెహోవా కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను యెహోవావారమై ఉన్నాము.’ (రోమా. 14:8, NW) యెహోవా సొత్తుగా ఉండాలని నిర్ణయించుకుంటే ఆ నిర్ణయాన్నిబట్టి మనం ఏనాడూ బాధపడం.

మీరెలా జవాబిస్తారు?

• యెహోవాకు సొత్తుగా ఉండడంవల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

• దేవుడు కోరేవాటిని మనం ఎలా చేయగలుగుతున్నాం?

• యెహోవా తన సేవకులను ఎలా సంరక్షిస్తున్నాడు?

[అధ్యయన ప్రశ్నలు]

[8వ పేజీలోని చిత్రాలు]

యెహోవా సొత్తుగా ఉండడంవల్ల ఏ ప్రయోజనాలు పొందారో చెప్పమని ఇతరులను అడగండి

[10వ పేజీలోని చిత్రం]

యెహోవా మనల్ని ఏయే విధాలుగా సంరక్షిస్తున్నాడు?