కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా పరిపాలనే సరైనదని నిరూపించబడింది!

యెహోవా పరిపాలనే సరైనదని నిరూపించబడింది!

యెహోవా పరిపాలనే సరైనదని నిరూపించబడింది!

“మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి.”—దాని. 4:17.

1, 2. మానవ పరిపాలన విఫలం కావడానికి కొన్ని కారణాలేమిటి?

 మానవ పరిపాలన విఫలమైపోయింది! ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. విజయవంతంగా పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానం వారికి లేకపోవడమే ఆ వైఫల్యానికి ముఖ్య కారణం. ఈ రోజుల్లో పరిపాలకులంతా ‘స్వార్థప్రియులుగా, ధనాపేక్షులుగా, బింకములాడువారిగా, అహంకారులుగా, అపవిత్రులుగా, అతిద్వేషులుగా, అపవాదకులుగా, అజితేంద్రియులుగా, క్రూరులుగా, సజ్జనద్వేషులుగా, ద్రోహులుగా, గర్వాంధులుగా’ ఉన్నారు. దీన్నిబట్టి మానవ పరిపాలన ఎంత విఫలమైందో స్పష్టంగా తెలుస్తుంది.—2 తిమో. 3:2-4.

2 ఎంతోకాలం క్రితం మన మొదటి తల్లిదండ్రులు దేవుని పరిపాలనా విధానాన్ని తిరస్కరించారు. అలా తిరస్కరించడం ద్వారా తాము స్వేచ్ఛను కోరుకున్నామని వారు అనుకొనివుంటారు. నిజానికి వారు స్వేచ్ఛను పొందలేదు కానీ సాతాను పరిపాలనా విధానానికి దాసులయ్యారు. “లోకాధికారి” చెడు ప్రభావం మానవుల పరిపాలన మీద ఎంతగానో ఉంది. దాదాపు 6,000 సంవత్సరాలుగా మానవులు చేసిన అస్తవ్యస్తమైన పరిపాలన, మనల్ని చరిత్రలోనే ముందెన్నడూ లేనంత హీనస్థితికి దిగజార్చింది. (యోహా. 12:31) మానవజాతి స్థితి గురించి చెబుతూ, “సమస్యలు లేని పరిపూర్ణ లోకం కోసం వేచిచూడడం” వ్యర్థమని ది ఆక్స్‌ఫర్డ్‌ హిస్టరీ ఆఫ్‌ ద ట్వంటియత్‌ సెంచరీ అనే పుస్తకం చెబుతోంది. ఆ పుస్తకం ఇంకా ఇలా వివరిస్తోంది: “అది సాధ్యంకాని పని, ఒకవేళ అలాంటి లోకం సృష్టించడానికి ప్రయత్నించినా చివరకు నాశనాన్ని, నియంతృత్వాన్ని, ఘోరమైన యుద్ధాల్నే చూడాల్సివస్తుంది.” మానవ పరిపాలన విఫలమైందని ఎంత నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు!

3. ఆదాముహవ్వలు పాపం చేసివుండకపోతే, దేవుని పరిపాలన ఎలా ఉండేది?

3 మానవులను సమర్థంగా పరిపాలించగల ఒకే ఒక పరిపాలనను అంటే దేవుని పరిపాలనను మన మొదటి తల్లిదండ్రులు వద్దనుకోవడం ఎంత విషాదకరం! ఒకవేళ ఆదాముహవ్వలు తనకు నమ్మకంగా ఉంటే యెహోవా ఎలా పరిపాలించివుండేవాడో మనకు తెలియదనుకోండి. కానీ, ఒకటి మాత్రం నిజం, మానవులు దేవుని పరిపాలనను అంగీకరించివుంటే వారిలో ప్రేమ, నిష్పక్షపాతం వెల్లివిరిసేవి. (అపొ. 10:34; 1 యోహా. 4:8) యెహోవాకు సాటిలేని జ్ఞానం ఉంది కాబట్టి, మానవులు ఆయన పరిపాలనలోనే ఉండివుంటే మానవ పరిపాలనకు మద్దతిచ్చేవారి వల్ల జరిగిన తప్పులన్నిటిని చూడాల్సిన పరిస్థితి ఏర్పడేదికాదు. అదే దేవుని పరిపాలనలో కొనసాగివుంటే ‘ప్రతి జీవి కోరిక తృప్తిపరచబడి’ ఉండేది. (కీర్త. 145:16) ఒక్కమాటలో చెప్పాలంటే, అది పరిపూర్ణమైన పరిపాలనగా ఉండేది. (ద్వితీ. 32:4) అంత మంచి పరిపాలనను మానవులు వద్దనుకోవడం ఎంత విషాదకరం!

4. సాతాను పరిపాలనను దేవుడు ఎంతమేరకు అనుమతించాడు?

4 మానవుల పరిపాలనను యెహోవా అనుమతించినప్పటికీ, వారిపై తన పరిపాలన హక్కును మాత్రం ఏనాడూ వదులుకోలేదని గుర్తుంచుకోవాలి. ఎంతో శక్తిమంతుడైన బబులోను రాజు కూడా “మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముపైని అధికారి” అని గుర్తించాల్సివచ్చింది. (దాని. 4:17) చివరకు, దేవుని రాజ్యం ఆయన చిత్తం నెరవేరేలా చూస్తుంది. (మత్త. 6:9, 10) సాతాను లేవదీసిన సవాళ్లకు సరైన జవాబివ్వడానికి యెహోవా, అతనిని కొంతకాలం ‘ఈ యుగ సంబంధమైన దేవతగా’ ఉండేందుకు అనుమతించాడు. (2 కొరిం. 4:4; 1 యోహా. 5:19) అయితే సాతాను, యెహోవా పెట్టిన హద్దుల్ని ఎన్నడూ దాటలేకపోయాడు. (2 దిన. 20:6; యోబు 1:11, 12; 2:3-6 పోల్చండి.) అంతేకాదు, దేవుని ప్రధాన శత్రువు పరిపాలన కింద జీవిస్తున్నా, దేవుని పరిపాలనకు లోబడినవారు అన్నికాలాల్లో ఎవరో ఒకరు ఉండనేవున్నారు.

ఇశ్రాయేలీయులపై దేవుని పరిపాలన

5. ఇశ్రాయేలీయులు దేవునితో ఏ ప్రమాణం చేశారు?

5 హేబెలు కాలం నుండి ఇశ్రాయేలు జనాంగం ఏర్పడేంత వరకు ఎంతోమంది విశ్వాసులు యెహోవాను ఆరాధించి ఆయన ఆజ్ఞలకు లోబడ్డారు. (హెబ్రీ. 11:4-22) మోషే కాలంలో, పితరుడైన యాకోబు సంతానంతో యెహోవా ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ సంతానమే ఇశ్రాయేలు జనాంగమైంది. సా.శ.పూ. 1513లో ఇశ్రాయేలీయులు, “యెహోవా చెప్పినదంతయు చేసెదము” అని ప్రమాణం చేయడం ద్వారా వారు, వారి వంశీయులు యెహోవాను తమ పరిపాలకునిగా అంగీకరించారు.—నిర్గ. 19:8.

6, 7. ఇశ్రాయేలీయులపై దేవుని పరిపాలన ఎలా ఉండేది?

6 యెహోవా ఒక ఉద్దేశంతో ఇశ్రాయేలీయుల్ని తన ప్రజలుగా స్వీకరించాడు. (ద్వితీయోపదేశకాండము 7:7, 8 చదవండి.) ఇశ్రాయేలీయుల బాగోగులు మాత్రమే మనసులో ఉంచుకొని యెహోవా వారిని ఎంచుకోలేదు. ఎంతో ప్రాముఖ్యమైన తన నామాన్ని, తన సర్వాధిపత్యాన్ని మనసులో ఉంచుకొని యెహోవా ఆ నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి, వారు యెహోవాయే సత్య దేవుడు అని సాక్ష్యమిచ్చే ప్రజలుగా ఉండాలి. (యెష. 43:10; 44:6-8) అందుకే యెహోవా ఆ జనాంగంతో ఇలా చెప్పాడు: “ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠితజనము. మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయజనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను.”—ద్వితీ. 14:2.

7 ఇశ్రాయేలీయుల అపరిపూర్ణతల్ని మనసులో ఉంచుకొని యెహోవా వారిని పరిపాలించాడు. అయితే, ఆయన నియమాలు పరిపూర్ణమైనవి, ఆయన లక్షణాలు వాటిలో స్పష్టంగా కనిపించాయి. యెహోవా మోషే ద్వారా ఇచ్చిన ఆజ్ఞలు ఆయన పరిశుద్ధుడని, న్యాయాన్ని ప్రేమించేవాడని, క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని, సహనశీలి అని స్పష్టంగా తెలియజేశాయి. ఆ తర్వాత యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులు యెహోవా ఆజ్ఞలకు లోబడినప్పుడు సమాధానాన్ని, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అనుభవించారు. (యెహో. 24:21, 22, 31) ఇశ్రాయేలీయుల చరిత్రను తిరగేసి చూస్తే యెహోవా పరిపాలన విజయం సాధించిందని మనకు తెలుస్తుంది.

మానవులు తగిన మూల్యం చెల్లించాల్సివచ్చింది

8, 9. ఇశ్రాయేలీయులు ఎలాంటి తెలివితక్కువ కోరిక కోరారు? దానివల్ల ఎలాంటి ఫలితాలొచ్చాయి?

8 అయితే కాలం గడుస్తుండగా ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుని పరిపాలనకు తిరుగుబాటు చేసి ఆయన సంరక్షణను అనుభవించలేకపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇశ్రాయేలీయులు తమకు ఒక మానవ రాజు కావాలని సమూయేలుపై ఒత్తిడి తెచ్చారు. అయితే, వారు అడిగినట్లే చేయమని యెహోవా సమూయేలుకు చెప్పాడు. యెహోవా ఇంకా ఇలా చెప్పాడు: “వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించి యున్నారు.” (1 సమూ. 8:7) యెహోవా వాళ్లడిగినట్లే వారిపై ఒక రాజు ఉండేందుకు అనుమతించినప్పటికీ, మానవ రాజును కోరడంవల్ల వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించాడు.—1 సమూయేలు 8:9-18 చదవండి.

9 యెహోవా ఇచ్చిన హెచ్చరిక నిజమని చరిత్రను చూస్తే తెలుస్తుంది. మానవ రాజు పరిపాలన కింద ఉండడంవల్ల ఇశ్రాయేలీయులు తీవ్రమైన కష్టాలు అనుభవించారు. ముఖ్యంగా ఆ రాజు యెహోవాకు నమ్మకంగా లేనప్పుడు వారి పరిస్థితి మరీ హీనంగా తయారైంది. ఇశ్రాయేలీయుల ఉదాహరణను మనసులో ఉంచుకుంటే, ఎన్నో యుగాలపాటు యెహోవా గురించి తెలియని మానవులు పరిపాలించడం వల్ల ఎలాంటి శాశ్వత మేలు జరగకపోవడాన్ని చూసి మనం ఆశ్చర్యపోము. శాంతి, భద్రతలను సాధించడానికి కొంతమంది రాజకీయ నాయకులు దేవుని ఆశీర్వాదాన్ని కోరతారు కానీ, తన పరిపాలనకు లోబడనివారిని యెహోవా ఎలా ఆశీర్వదిస్తాడు?—కీర్త. 2:10-12.

దేవుని పరిపాలనలో ఓ కొత్త జనాంగం

10. ఇశ్రాయేలు జనాంగం స్థానంలో ఓ కొత్త జనాంగాన్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు?

10 ఇశ్రాయేలు జనాంగం యెహోవాను నమ్మకంగా సేవించడానికి ఇష్టపడలేదు. చివరకు, వారు దేవుని అభిషిక్తుడైన మెస్సీయను కూడా తిరస్కరించారు. దాంతో యెహోవా వారిని తిరస్కరించి వారి స్థానంలో ఓ కొత్త జనాంగాన్ని ఎన్నుకోవాలనుకున్నాడు. దానివల్ల సా.శ. 33లో యెహోవా అభిషిక్త ఆరాధకులుండే క్రైస్తవ సంఘం ఉనికిలోకి వచ్చింది. నిజానికి అదే యెహోవా పరిపాలనకు లోబడుతున్న ఓ కొత్త జనాంగం. పౌలు దాన్ని “దేవుని ఇశ్రాయేలు” అని పిలిచాడు.—గల. 6:16.

11, 12. పర్యవేక్షణకు సంబంధించి ప్రాచీన ఇశ్రాయేలుకు, ‘దేవుని ఇశ్రాయేలుకు’ మధ్య ఎలాంటి పోలికలున్నాయి?

11 ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికీ, కొత్త జనాంగమైన ‘దేవుని ఇశ్రాయేలుకూ’ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి, కొన్ని పోలికలూ ఉన్నాయి. అప్పటి ఇశ్రాయేలీయుల్లా, క్రైస్తవ సంఘానికి మానవ రాజు లేడు, పాపుల కోసం జంతు బలులు అర్పించాల్సిన అవసరమూ లేదు. కానీ వాటి మధ్య ఒక పోలిక ఉంది. ఇశ్రాయేలీయుల్లో ఉన్నట్లే క్రైస్తవ సంఘంలోనూ పెద్దలు ఉన్నారు. (నిర్గ. 19:3-8) ఆ క్రైస్తవ పెద్దలు మందపై అధికారం చెలాయించరు. కానీ, సంఘాన్ని కాస్తూ మనస్ఫూర్తిగా క్రైస్తవ కార్యకలాపాల్లో నాయకత్వం వహిస్తారు. వారు సంఘంలోని ప్రతీ వ్యక్తితో ప్రేమగా వ్యవహరిస్తారు, అందరినీ గౌరవ మర్యాదలతో చూస్తారు.—2 కొరిం. 1:24; 1 పేతు. 5:2, 3.

12 ప్రాచీన ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా వ్యవహరించిన తీరును ‘దేవుని ఇశ్రాయేలులోని’ సభ్యులు, వారి సహచరులైన ‘వేరే గొర్రెలు’ ధ్యానించడం ద్వారా ఆయనపట్ల, ఆయన పరిపాలన విధానంపట్ల కృతజ్ఞతను పెంచుకుంటారు. (యోహా. 10:16) ఉదాహరణకు, ఇశ్రాయేలీయుల్ని రాజులు పరిపాలించినప్పుడు వారు జనాంగంపై ఎంతో ప్రభావం చూపించారు. అది వారికి కొన్నిసార్లు మంచి చేసింది, మరికొన్నిసార్లు చెడు చేసింది. ప్రాచీన రాజుల్లా తాము పరిపాలకులు కాకపోయినా, విశ్వాసం విషయంలో మంచి మాదిరిగా ఉండాలని అది క్రైస్తవ సంఘంలో నాయకత్వం వహిస్తున్నవారికి గుర్తుచేస్తోంది.—హెబ్రీ. 13:7.

యెహోవా నేడు ఎలా పరిపాలిస్తున్నాడు?

13. 1914లో ఏ ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది?

13 మానవ పరిపాలన త్వరలో అంతం కానుందని నేటి క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తున్నారు. 1914లో యెహోవా పరలోకంలో తన రాజ్యాన్ని స్థాపించి యేసుక్రీస్తును దానికి రాజుగా నియమించాడు. ఆ సమయంలో, ‘జయించుచు, జయించుటకు’ బయలువెళ్లే అధికారాన్ని యెహోవా యేసుకు ఇచ్చాడు. (ప్రక. 6:2) ‘శత్రువులమధ్య నీవు పరిపాలన చేయుము’ అని కొత్తగా సింహాసనాన్ని అధిష్ఠించిన రాజుకు ఆజ్ఞాపించాడు. (కీర్త. 110:2) విచారకరంగా, జనాంగాలు యెహోవా పరిపాలనను తిరస్కరిస్తూ, ‘[యెహోవా] దేవుడు లేడన్నట్లుగా’ ప్రవర్తిస్తూ వచ్చాయి.—కీర్త. 14:1.

14, 15. (ఎ) నేడు మనం ఎలా దేవుని పరిపాలన కింద ఉన్నాం? ఏ ప్రశ్నలు తలెత్తుతాయి? (బి) దేవుని పరిపాలనే ఉత్తమమైనదని అనడానికి మన రోజుల్లో ఎలాంటి రుజువులున్నాయి?

14 ‘దేవుని ఇశ్రాయేలుకు’ చెందిన అభిషిక్త సభ్యులైన కొంతమంది ఇప్పటికీ భూమ్మీద సజీవంగా ఉన్నారు. యేసు సహోదరులుగా వీరు ‘క్రీస్తుకు రాయబారులుగా’ పనిచేస్తారు. (2 కొరిం. 5:20) ఈ అభిషిక్త సహోదరులు నమ్మకమైనవాడును బుద్ధిమంతుడైన దాసునిగా నియమించబడ్డారు. ఇతర అభిషిక్తుల పట్ల, రోజురోజుకీ పెరుగుతున్న భూనిరీక్షణగల లక్షలాదిమంది క్రైస్తవుల పట్ల తగిన శ్రద్ధ చూపిస్తూ తగినవేళ ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే బాధ్యత వీరికి అప్పగించబడింది. (మత్త. 24:45-47; ప్రక. 7:9-15) నేడు సత్యారాధకులు ఆధ్యాత్మికంగా వర్ధిల్లడాన్ని చూస్తుంటే యెహోవా ఆ ఏర్పాటును ఆశీర్వదించాడని స్పష్టంగా అర్థమౌతోంది.

15 మనలో ప్రతీ ఒక్కరం ఈ విషయాల గురించి ఆలోచించాలి: ‘క్రైస్తవ సంఘంలో నేను చేపట్టాల్సిన బాధ్యతలేమిటో నేను పూర్తిగా అర్థం చేసుకున్నానా? నేను సరైన విధంగా యెహోవా పరిపాలనను సమర్థిస్తున్నానా? యెహోవా రాజ్య పౌరునిగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నానా? దేవుని రాజ్యం గురించి ఇతరులకు ప్రకటించే విషయంలో నేను చేయగలిగినదంతా చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నానా?’ ఒక గుంపుగా మనం, పరిపాలక సభ ఇస్తున్న నిర్దేశాలకు ఇష్టపూర్వకంగా లోబడుతూ, సంఘంలో నియమించబడిన పెద్దలకు సహకరిస్తాం. ఇవన్నీ చేయడం ద్వారా మనం దేవుని పరిపాలనను అంగీకరిస్తున్నామని చూపిస్తాం. (హెబ్రీయులు 13:17 చదవండి.) మనం ఇష్టపూర్వకంగా లోబడితే, ఐక్యత లేని ఈ లోకంలో ఐక్యంగా ఉండగలుగుతాం. దానివల్ల శాంతి, నీతి విలసిల్లడమేకాక యెహోవా ఘనపర్చబడతాడు. అలా యెహోవా పరిపాలనే ఉత్తమమైనదని నిరూపించబడుతుంది.

యెహోవా పరిపాలన విజయం సాధిస్తుంది

16. ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఏ నిర్ణయం తీసుకోవాలి?

16 ఏదెనులో లేవదీయబడిన వివాదాంశాలు పరిష్కరించబడే రోజు అతి దగ్గర్లో ఉంది. కాబట్టి, ప్రజలు ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. యెహోవా పరిపాలనను అంగీకరిస్తారో లేక మానవ పరిపాలనను అంటిపెట్టుకుని ఉంటారో వారు నిర్ణయించుకోవాలి. సరైన నిర్ణయం తీసుకునేలా దీనులకు సహాయం చేసే గొప్ప అవకాశం మనకుంది. త్వరలోనే హార్‌మెగిద్దోను యుద్ధం జరుగుతుంది. అప్పుడు సాతాను చెప్పుచేతల్లో నడుస్తున్న ఈ మానవ ప్రభుత్వాల స్థానంలో యెహోవా ప్రభుత్వం శాశ్వతంగా స్థాపించబడుతుంది. (దాని. 2:44; ప్రక. 16:16) మానవ పరిపాలన అంతమౌతుంది, దేవుని రాజ్యం ఈ భూమిని పరిపాలిస్తుంది. యెహోవా పరిపాలన విధానం సరైనదని పూర్తిగా నిరూపించబడుతుంది.ప్రకటన 21:3-5 చదవండి.

17. ఏ వాస్తవాలను మనసులో ఉంచుకుంటే దీనులు పరిపాలనకు సంబంధించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు?

17 యెహోవా పక్షాన చేరాలని ఇంకా నిర్ణయించుకోనివారు, దేవుని పరిపాలన వల్ల మానవులకు జరిగే మేలు గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించాలి. నేరం, తీవ్రవాదం వంటి సమస్యల్ని మానవ పరిపాలన తీసివేయలేకపోయింది. దేవుని పరిపాలనైతే ఈ ప్రపంచ తెర మీది నుండి దుష్టుల్ని నిర్మూలిస్తుంది. (కీర్త. 37:1, 2, 9) మానవ పరిపాలన యుద్ధాలకు దారితీసింది కానీ, దేవుని పరిపాలన “భూదిగంతములవరకు యుద్ధములు” లేకుండా చేస్తుంది. (కీర్త. 46:9) అంతెందుకు, దేవుని పరిపాలన చివరకు మానవులకూ జంతువులకూ మధ్య కూడా శాంతిని నెలకొల్పుతుంది. (యెష. 11:6-9) మానవ పరిపాలనలో ఆకలి, పేదరికం వంటివి మనుష్యుల్ని పట్టి పీడిస్తూనే వచ్చాయి కానీ, దేవుని పరిపాలన వాటిని తీసివేస్తుంది. (యెష. 65:21) మానవ పరిపాలకులు సదుద్దేశంతో ప్రయత్నించినా అనారోగ్యాన్ని, మరణాన్ని తీసివేయలేకపోయారు కానీ, దేవుని పరిపాలనలో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు మళ్లీ యౌవన బలాన్ని పొంది ఎంతో సంతోషిస్తారు. (యోబు 33:25; యెష. 35:5, 6) నిజానికి, భూమంతా పరదైసుగా మారుతుంది. అప్పుడు చనిపోయినవారు కూడా తిరిగి లేపబడతారు.—లూకా 23:43; అపొ. 24:15.

18. దేవుని పరిపాలనే ఉత్తమమైనదనే నమ్మకం మనకు ఉందని ఎలా చూపించవచ్చు?

18 సాతాను మొదటి తల్లిదండ్రులను వారి సృష్టికర్తకు దూరమయ్యేలా చేసినప్పుడు మానవజాతికి ఎంతో హాని జరిగింది. దాన్నంతటినీ దేవుని పరిపాలన తీసివేస్తుంది. అంతేకాదు, సాతాను దాదాపు 6,000 సంవత్సరాలుగా మానవులకు హాని చేస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు, క్రీస్తు ద్వారా కేవలం 1,000 సంవత్సరాల్లోనే ఆ హానినంతా తొలగిస్తాడు! దేవుని పరిపాలనే సర్వోత్తమమైనదని చెప్పడానికి ఇంకేమి కావాలి! దేవుని సాక్షులముగా మనం ఆయనను పరిపాలకునిగా అంగీకరిస్తాం. కాబట్టి, మన జీవితాల్లో ప్రతీ రోజూ, ప్రతీ క్షణం ఆయన ఆరాధకులమనీ, ఆయన రాజ్య పౌరులమనీ, ఆయన సాక్షులుగా ఉన్నందుకు గర్వపడుతున్నామనీ చూపిద్దాం. వినడానికి ఇష్టపడేవారికి యెహోవా పరిపాలనే ఉత్తమమైనదని చెప్పేందుకు దొరికిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుందాం.

దేవుని పరిపాలన గురించి ఈ లేఖనాల నుండి మనం ఏమి నేర్చుకున్నాం?

ద్వితీయోపదేశకాండము 7:7, 8.

1 సమూయేలు 8:9-18.

హెబ్రీయులు 13:17.

ప్రకటన 21:3-5.

[అధ్యయన ప్రశ్నలు]

[29వ పేజీలోని చిత్రాలు]

యెహోవా ఎన్నడూ తన పరిపాలనా హక్కును వదులుకోలేదు

[31వ పేజీలోని చిత్రం]

యెహోవా పరిపాలనకు ఇష్టపూర్వకంగా లోబడితే ప్రపంచ ఐక్యత నెలకొంటుంది