కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీ జీవితంలో ప్రతీరోజు దేవుణ్ణి మహిమపరచండి

మీ జీవితంలో ప్రతీరోజు దేవుణ్ణి మహిమపరచండి

మీ జీవితంలో ప్రతీరోజు దేవుణ్ణి మహిమపరచండి

“ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము . . . నేను నడువవలసిన మార్గము నాకు తెలియజేయుము” అని కీర్తనకర్త అయిన దావీదు యెహోవాకు ప్రార్థించాడు. (కీర్త. 143:8) మీరు ప్రతీరోజు నిద్రనుండి లేచి, ఓ కొత్త రోజును చూసే అవకాశం ఇచ్చినందుకు యెహోవాకు కృతజ్ఞతలు చెప్పిన తర్వాత, నిర్ణయాలు తీసుకునే విషయంలో అలాగే సరైన చర్యలు తీసుకునే విషయంలో సహాయం చేయమని దావీదు వేడుకున్నట్లే మీరూ వేడుకుంటున్నారా? మీరు ఇప్పటికే అలా చేస్తుండవచ్చు.

యెహోవా సమర్పిత సేవకులముగా మనం ‘భోజనంచేసినా పానము చేసినా ఏమి చేసినా సమస్తం దేవుని మహిమ కోసం చేయడానికి’ కృషిచేస్తాం. (1 కొరిం. 10:31) ప్రతీరోజు మనం ప్రవర్తించే తీరు యెహోవాను ఘనపర్చవచ్చు లేదా ఆయనకు అపకీర్తి తీసుకురావచ్చు అనే విషయం మనకు తెలుసు. అంతేకాక, క్రీస్తు సహోదరులతో సహా ఈ భూమ్మీదున్న దేవుని సేవకులందర్నీ సాతాను “రాత్రింబగళ్లు” నిందిస్తున్నాడని కూడా మనకు తెలుసు. (ప్రక. 12:10) కాబట్టి మన పరలోక తండ్రికి “రాత్రింబగళ్లు” సేవ చేయడం ద్వారా సాతాను వేసిన నిందలకు జవాబివ్వాలని, యెహోవా హృదయాన్ని సంతోషపరచాలని తీర్మానించుకుంటాం.—ప్రక. 7:15; సామె. 27:11.

మీ జీవితంలో ప్రతీరోజు దేవుణ్ణి మహిమపరిచేందుకు సహాయం చేయగల రెండు ప్రాముఖ్యమైన మార్గాలను ఇప్పుడు చూద్దాం. మొదటిగా, మన జీవితంలో వేటికి ప్రాముఖ్యతనివ్వాలో గుర్తించాలి. రెండవది, ఇతరులపట్ల శ్రద్ధ చూపించాలి.

దేవునికి మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

యెహోవాకు సమర్పించుకోవడం ద్వారా ఆయనను సేవించాలనే బలమైన కోరిక మనకుందని చూపించాం. అంతేకాక, “దినదినము” అంటే నిత్యం ఆయన మార్గంలో నడుస్తామని యెహోవాకు మాటిచ్చాం. (కీర్త. 61:5, 8) అయితే, ఆయనకు ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోగలుగుతాం? యెహోవాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నామని మనం ప్రతీరోజు ఎలా చూపించవచ్చు?

మనం ఏ బాధ్యతల్ని నెరవేర్చాలని యెహోవా ఆశిస్తున్నాడో బైబిలు స్పష్టంగా చెబుతోంది. (ద్వితీ. 10:12, 13) అలాంటివి కొన్ని 22వ పేజీలోవున్న “ దేవుడు మనకిచ్చిన బాధ్యతలు” అనే బాక్సులో ఉన్నాయి. దేవుడు మనకు ఆ బాధ్యతలను అప్పగించాడు కాబట్టి అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. ఒకే సమయంలో రెండుకన్నా ఎక్కువ విషయాలు ప్రాముఖ్యమని అనిపించినప్పుడు దేనికి ప్రాధాన్యతనివ్వాలో ఎలా నిర్ణయించుకోవచ్చు?

మనం పవిత్రసేవకు అంటే బైబిలు అధ్యయనం, ప్రార్థన, క్రైస్తవ కూటాలు, పరిచర్య వంటి వాటికి ప్రాముఖ్యతనిస్తాం. (మత్త. 6:33; యోహా. 4:34; 1 పేతు. 2:9) అలాగని, రోజంతా కేవలం ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేస్తూ ఉండలేముగాని, ఎన్నో ఇంటి పనులతోపాటు ఉద్యోగం చేయడం, స్కూలుకు వెళ్లడం వంటివి కూడా చేయాల్సివుంటుంది. పవిత్రసేవకు అంటే క్రైస్తవ కూటాలకు హాజరవడం వంటి వాటికి ఆటంకం కలిగించని విధంగా మన ఉద్యోగాన్ని, మరితర పనులను చక్కబెట్టుకోవడానికి శాయశక్తులా కృషిచేస్తాం. ఉదాహరణకు, సెలవులకు వెళ్లాలనుకుంటున్నప్పుడు ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనంలో జరిగే ఆధ్యాత్మిక కార్యకలాపాలకు, లేదా పెద్దాచిన్నా సమావేశాలకు తప్పిపోకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు, ఒకే సమయంలో రెండు బాధ్యతలను నిర్వర్తించగలుగుతాం. అలా చేసేందుకు లభించే రెండు సందర్భాలు చూద్దాం. కుటుంబమంతా కలిసి రాజ్యమందిరాన్ని శుభ్రం చేయవచ్చు లేదా పని స్థలంలోగానీ స్కూల్లోగానీ భోజన సమయంలో తోటివారికి సాక్ష్యమివ్వవచ్చు. నిజానికి, మన జీవితంలో ఉద్యోగం, విద్య, స్నేహితుల వంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ నిర్ణయాలు మన ప్రేమగల తండ్రి అయిన యెహోవా ఆరాధనకు మన జీవితంలో ప్రాముఖ్యతను ఇస్తున్నామని చూపించేలా ఉండాలి.—ప్రసం. 12:13.

ఇతరులపట్ల శ్రద్ధ చూపించాలి

మనం ఇతరుల పట్ల శ్రద్ధ చూపిస్తూ వారికి మంచి చేయాలని యెహోవా కోరుతున్నాడు. కానీ సాతాను స్వార్థాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అతడి లోకం ‘స్వార్థప్రియులతో, సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారితో,’ ‘శరీరేచ్ఛేలనుబట్టి విత్తేవారితో’ నిండివుంది. (2 తిమో. 3:1-5; గల. 6:8) తాము చేసే పనులవల్ల ఇతరులకు జరిగే కీడు గురించి పెద్దగా ఆలోచించరు. లోకంలో ఎక్కడచూసినా “శరీరకార్యములు” స్పష్టంగా కనిపిస్తున్నాయి.—గల. 5:19-21.

వీరికి, యెహోవా పరిశుద్ధాత్మ నిర్దేశంలో నడుస్తున్నవారికి మధ్య ఎంత తేడావుంది! యెహోవా పరిశుద్ధాత్మ నిర్దేశంలో నడుస్తున్నవారు ఇతరులపట్ల ప్రేమతో, దయతో, మంచితనంతో వ్యవహరిస్తారు. (గల. 5:22) మన అవసరాలకన్నా ఇతరుల అవసరాలకే ప్రాముఖ్యతనివ్వాలని దేవుని వాక్యం చెబుతోంది. అందుకే మనం ఇతరులపట్ల శ్రద్ధ ఉందని చూపించే పనులు చేస్తాం, అదే సమయంలో వారి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తపడతాం. (1 కొరిం. 10:24, 33; ఫిలి. 2:3, 4; 1 పేతు. 4:15) తోటి విశ్వాసుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తాం. అలాగే, అవిశ్వాసులకు కూడా మేలు చేయడానికి కృషిచేస్తాం. (గల. 6:10) ఈ రోజు మీరు కలుసుకునేవారికి ఏ విధంగా దయ చూపించగలరో ఆలోచించండి.—23వ పేజీలోవున్న  “వీరిపట్ల శ్రద్ధ చూపించండి,” అనే బాక్సు చూడండి.

మనం ఫలాని సమయంలోనే, ఫలాని పరిస్థితిలోనే శ్రద్ధ చూపించాలని ఏమీలేదు. (గల. 6:2; ఎఫె. 5:2; 1 థెస్స. 4:9, 10) బదులుగా, మనకు ఇబ్బంది అనిపించినా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రతీరోజు సిద్ధంగా ఉండాలి. మనకున్న సమయాన్ని, వస్తుసంపదలను, అనుభవాన్ని, జ్ఞానాన్ని ఉదారంగా ఉపయోగించాలనుకుంటాం. ఇతరుల పట్ల మనం ఉదారంగా ఉంటే తానూ మన పట్ల ఉదారంగా ఉంటాననే హామీని యెహోవా మనకిచ్చాడు.—సామె. 11:25; లూకా 6:38.

“రాత్రింబగళ్లు” పవిత్ర సేవ చేయాలి

యెహోవాకు “రాత్రింబగళ్లు” పవిత్ర సేవ చేయడం అసలు సాధ్యమేనా? మన ఆరాధనకు సంబంధించిన వాటన్నిటిలో క్రమంగా, చురుగ్గా పాల్గొంటే అది సాధ్యమౌతుంది. (అపొ. 20:31) ప్రతీరోజు బైబిలు చదివి ధ్యానించడం ద్వారా, పట్టుదలతో ప్రార్థించడం ద్వారా, కూటాలన్నిటికీ హాజరవడానికి కృషిచేయడం ద్వారా, సాక్ష్యమిచ్చేందుకు దొరికే ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం మన జీవితాలను పవిత్ర సేవ కోసం అంకితం చేసుకోవచ్చు.—కీర్త. 1:2; లూకా 2:37; అపొ. 4:20; 1 థెస్స. 3:9, 10; 5:17.

మనం యెహోవాకు అలాంటి పవిత్ర సేవ చేస్తున్నామా? మనం అలా చేస్తుంటే, యెహోవాను సంతోషపెట్టి, సాతాను వేసిన నిందలకు జవాబివ్వాలన్న మన కోరిక మనం చేసే ప్రతీ పనిలో కనిపిస్తుంది. మనం ఏ పరిస్థితిలోవున్నా, ఏ పనిచేసినా యెహోవాను మహిమపరచడానికి కృషిచేస్తాం. యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా మాట్లాడతాం, ప్రవర్తిస్తాం, నిర్ణయాలు తీసుకుంటాం. ఆయన మనపట్ల ప్రేమ చూపిస్తున్నందుకు, సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతగా మనం ఆయనమీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతాం, ఆయన సేవలో చేయగలిగినదంతా చేస్తాం. మన అపరిపూర్ణతల వల్ల యెహోవా ప్రమాణాలను పాటించలేకపోయినప్పుడు ఆయన మనకిచ్చే ఉపదేశాన్ని, క్రమశిక్షణను స్వీకరిస్తాం.—కీర్త. 32:5; 119:97; సామె. 3:25, 26; కొలొ. 3:17; హెబ్రీ. 6:11, 12.

మనం ప్రతీరోజు దేవుణ్ణి మహిమపరిచేందుకు కృషి చేద్దాం. అలా చేస్తే మన ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది, ప్రేమగల మన పరలోక తండ్రి కాపుదలను నిత్యమూ అనుభవిస్తాం.—మత్త. 11:29; ప్రక. 7:16, 17.

[22వ పేజీలోని బాక్సు/చిత్రాలు]

 దేవుడు మనకిచ్చిన బాధ్యతలు

• తరచూ ప్రార్థించండి.—రోమా. 12:12.

• బైబిలును బాగా అధ్యయనం చేసి, దాన్ని మీ జీవితంలో పాటించండి.—కీర్త. 1:2; 1 తిమో. 4:15.

• సంఘంలో యెహోవాను ఆరాధించండి. —కీర్త. 35:18; హెబ్రీ. 10:24, 25.

• మీ కుటుంబ సభ్యుల భౌతిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరాలను తీర్చండి.—1 తిమో. 5:8.

• రాజ్య సువార్తను ప్రకటించి శిష్యులను చేయండి.—మత్త. 24:14; 28:19, 20.

• భౌతిక, ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరాలను తీర్చడంలో భాగంగా మంచి వినోదాన్ని కూడా ఏర్పాటు చేయండి.—మార్కు 6:31; 2 కొరిం. 7:1; 1 తిమో. 4:8, 16.

• సంఘ బాధ్యతలను నిర్వర్తించండి.—అపొ. 20:28; 1 తిమో. 3:1.

• మన ఇంటిని, రాజ్యమందిరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.—1 కొరిం. 10:32.

[23వ పేజీలోని బాక్సు/చిత్రం]

 వీరిపట్ల శ్రద్ధ చూపించండి

• ఒక వృద్ధ సహోదరుడు లేదా సహోదరి.—లేవీ. 19:32.

• అనారోగ్యంగా ఉన్నవారు లేదా మానసికంగా కృంగినవారు.—సామె. 14:21.

• సంఘంలోని ఓ సహోదరుడు/సహోదరి చాలా అవసరంలో ఉన్నప్పుడు మీరు చేతనైనంత సహాయం చేయవచ్చు.—రోమా. 12:13.

• మీ కుటుంబ సభ్యులు.—1 తిమో. 5:4, 8.

• భర్త/భార్యను కోల్పోయిన తోటి విశ్వాసి.—1 తిమో. 5:9, 10.

• సంఘంలో కష్టపడి పని చేస్తున్న సంఘ పెద్ద.—1 థెస్స. 5:12, 13; 1 తిమో. 5:17.