కంటెంట్‌కు వెళ్లు

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

బైబిలు జీవితాల్ని మారుస్తుంది

“నాలో ఉన్న ద్వేషాన్ని కూడా తీసేసుకున్నాను.”​—హఫెనీ గామా

వయసు: 34

దేశం: జాంబియా

ఒకప్పుడు: రాస్టఫారి మతస్థుడు a

నా గతం: నేను జాంబియాలో ఒక శరణార్థ శిబిరంలో పుట్టాను. యుద్ధం జరుగుతున్నప్పుడు మా అమ్మ నమీబియా నుండి పారిపోయి సౌత్‌ వెస్ట్‌ ఆఫ్రికా పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ (SWAPO) అనే సంస్థలో చేరింది. ఆ సంస్థ అప్పట్లో నమీబియాను పరిపాలిస్తున్న దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది.

నాకు 15 ఏళ్లు వచ్చేవరకు వేర్వేరు శరణార్థ శిబిరాల్లో పెరిగాను. SWAPO శిబిరాల్లో పెరిగే పిల్లల్లో, నల్లజాతీయుల స్వాతంత్ర్యం కోసం ముందుండి పోరాడాలి అనే స్ఫూర్తిని నూరిపోసేవాళ్లు. ఫలానా ప్రభుత్వమే మంచిదని, తెల్లజాతీయుల్ని ద్వేషించాలని కూడా వాళ్లు నేర్పించేవాళ్లు.

నాకు 11 ఏళ్లున్నప్పుడు క్రిస్టియన్‌గా మారాలనిపించింది. మేము ఉంటున్న శరణార్థ శిబిరం కాంపోండ్‌లో రోమన్‌ క్యాథలిక్‌లు, లూథరన్‌లు, ఆంగ్లికన్‌లు, ఇంకా మిగతా డినామినేషన్‌ వాళ్లు కలిసుండే ఒక చర్చీ ఉండేది. ఆ చర్చీ పాస్టర్‌ దగ్గరికెళ్లి, నేను క్రిస్టియన్‌గా మారాలి అనుకుంటున్నానని చెప్పాను. కానీ ఆయన వద్దన్నాడు. అప్పటినుండి నాకు దేవుని మీద నమ్మకం పోయింది. 15 ఏళ్లు వచ్చేసరికి, నాకు రెగ్గీ మ్యూజిక్‌ మీద ఇష్టం అలాగే నల్లజాతివాళ్లకు జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టాలనే కోరిక రెండూ పెరిగాయి. అందుకే రాస్టఫారి మతంలో చేరాను. ఆ మతం చెప్తున్నట్లు జుట్టును పొడవుగా పెంచుకుని జడలుగా అల్లుకునేవాణ్ణి, గంజాయి తాగేవాణ్ణి, ఇంకా మాంసం తినడం మానేశాను, నల్లజాతివాళ్లకు స్వాతంత్ర్యం ఎంత అవసరమో ఇతరులకు చెప్పేవాణ్ణి. కానీ తప్పుడు పనులు చేయడం, హింసను ఎక్కువగా చూపించే సినిమాలు చూడడం, బూతులు మాట్లాడడం మాత్రం ఆపలేదు.

బైబిలు నా జీవితాన్ని ఎలా మార్చిందంటే: 1995 నాటికి నాకు సుమారు 20 ఏళ్లు. ఆ వయసులో, ‘నా జీవితం ఏంటి ఇలా ఉంది? ఏం చేస్తే బాగుంటుంది?’ అని ఆలోచించడం మొదలుపెట్టాను. రాస్టఫారి మతానికి సంబంధించి నాకు దొరికిన పుస్తకాలన్నీ చదివాను. ఆ పుస్తకాల్లో అక్కడక్కడ లేఖనాల్ని ప్రస్తావించారు; కానీ వాటిని వివరించిన విధానం నాకు పూర్తిగా అర్థంకాలేదు. అందుకే, ఒకసారి బైబిల్ని చదవాలని నిర్ణయించుకున్నాను.

కొన్నిరోజులకు, రాస్టఫారి మతాన్ని పాటించే నా ఫ్రెండ్‌ ఒకరు, యెహోవాసాక్షులు తయారు చేసిన ఒక బైబిలు పుస్తకాన్ని ఇచ్చాడు. అందులో ఉన్న లేఖనాల్ని నా బైబిల్లో తెరిచి చూస్తూ మొత్తం పుస్తకాన్ని చదివేశాను. ఆ తర్వాత కొన్ని రోజులకు యెహోవాసాక్షుల్ని కలిసి వాళ్ల దగ్గర స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాను.

అతికష్టం మీద గంజాయి తాగడం, అతిగా మందు తాగడం మానేశాను. (2 కొరింథీయులు 7:1) నేను తయారయ్యే పద్ధతి మార్చుకున్నాను, పొడవాటి జుట్టును కత్తిరించుకున్నాను, పోర్నోగ్రఫీ అలాగే హింస ఎక్కువగా ఉన్న సినిమాలు చూడడం, బూతులు మాట్లాడడం ఆపేశాను. (ఎఫెసీయులు 5:3, 4) తెల్లజాతి వాళ్లమీద నాకున్న ద్వేషాన్ని కూడా తీసేసుకున్నాను. (అపొస్తలుల కార్యాలు 10:34, 35) ఈ మార్పులన్నీ చేసుకోగలిగానంటే, దానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, తెల్లజాతి వాళ్లమీద నాలో ద్వేషాన్ని నూరిపోసే సంగీతాన్ని వినడం ఆపేయడం. రెండవది, నన్ను మళ్లీ పాత జీవితంలోకి తీసుకెళ్లే స్నేహితులకు దూరంగా ఉండడం.

ఈ మార్పులన్నీ చేసుకున్న తర్వాత, యెహోవాసాక్షి అవ్వాలనే ఉద్దేశంతో రాజ్యమందిరాన్ని వెతుక్కుంటూ వెళ్లాను. సహోదరులు నాకు స్టడీ ఏర్పాటు చేశారు. బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షి అవ్వాలనే నా నిర్ణయం మా ఇంట్లోవాళ్లకు నచ్చలేదు. మా అమ్మ ఐతే, ’నువ్వు ఏ చర్చీకి వెళ్లినా ఫర్వాలేదు, యెహోవాసాక్షి మాత్రం అవ్వకు’ అని చెప్పింది. రాజకీయ నాయకుడైన మా అంకుల్‌ ఒకరు కూడా, నేను యెహోవాసాక్షి అవ్వాలి అనుకుంటున్నందుకు నన్ను ఎప్పుడూ ఏదోకటి అనేవాడు.

ఆ వ్యతిరేకతను, ఎగతాళిని తట్టుకోవడానికి యేసు ఉదాహరణ నాకు సహాయం చేసింది. ఆయన ప్రజలతో ఎలా ఉండేవాడో తెలుసుకొని నేను కూడా అలా ఉండడానికే ప్రయత్నించాను. యెహోవాసాక్షులు బోధించేవాటిని బైబిల్లో ఉన్న విషయాలతో పోల్చి చూసినప్పుడు, వీళ్లదే నిజమైన మతమని నాకు నమ్మకం కుదిరింది. ఉదాహరణకు, బైబిలు చెప్తున్నట్టు వాళ్లు ఇతరులకు మంచివార్త ప్రకటిస్తారు. (మత్తయి 28:19, 20; అపొస్తలుల కార్యాలు 15:14) ఇంకా రాజకీయాలకు దూరంగా ఉంటారు.—కీర్తన 146:3, 4; యోహాను 15:17, 18.

నేను ఎలా ప్రయోజనం పొందానంటే: బైబిలు చెప్పేది పాటించడంవల్ల నాకు చాలా రకాలుగా మేలు జరిగింది. ఉదాహరణకు, గంజాయి తాగడం మానేయడంవల్ల నాకు ప్రతీనెల చాలా డబ్బులు మిగిలేవి. డ్రగ్స్‌ తీసుకోవడంవల్ల కలిగే అనర్థాలు తప్పించుకోగలిగాను, ఆరోగ్యంగా ఉన్నాను, మానసికంగా కూడా బావున్నాను.

టీనేజీ వయసులో ఉన్నప్పటి నుండి నేను కలలుగన్న జీవితం, ఇప్పుడు నా సొంతమైంది. చాలా సంతోషంగా ఉన్నాను, అర్థవంతమైన జీవితం గడుపుతున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా, దేవునికి దగ్గరయ్యాను.—యాకోబు 4:8.

[అధస్సూచీలు]

a రాస్టఫారి అనేది జమైకాలోని ఒక మతం. ఆ మతస్థులు పొడవాటి జుట్టు పెంచుకుంటారు. ఇతియోపియా చక్రవర్తిని దేవునిగా భావిస్తారు.