కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘నీతిమంతులు సూర్యునిలా తేజరిల్లుతారు’

‘నీతిమంతులు సూర్యునిలా తేజరిల్లుతారు’

‘నీతిమంతులు సూర్యునిలా తేజరిల్లుతారు’

“అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు.”—మత్త. 13:43.

1. రాజ్యానికి సంబంధించిన ఏ విషయాలు వివరించడానికి యేసు ఉపమానాలు ఉపయోగించాడు?

 రాజ్యానికి సంబంధించిన వివిధ విషయాలను వివరించడానికి యేసుక్రీస్తు అనేక ఉపమానాలను ఉపయోగించాడు. యేసు “జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.” (మత్త. 13:35) యేసు రాజ్యసత్యం అనే విత్తనాన్ని విత్తడం గురించి అనేక ఉపమానాలు చెప్పాడు. ఆ ఉపమానాల్లో, సందేశాన్ని అంగీకరించే విషయంలో ఓ వ్యక్తి హృదయపరిస్థితి ఏ పాత్ర పోషిస్తుందో, ఓ వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతి సాధించే విషయంలో యెహోవా ఏ పాత్ర పోషిస్తాడో నొక్కిచెప్పాడు. (మార్కు 4:3-9, 26-29) రాజ్య సందేశాన్ని వినేవారి సంఖ్య పెరుగుతున్నట్లు మొదట్లో అనిపించకపోయినా ఆ తర్వాత వారి సంఖ్య అసాధారణమైన రీతిలో పెరుగుతుందని చెప్పడానికి యేసు మరో ఉపమానాన్ని చెప్పాడు. (మత్త. 13:31-33) అంతేకాక, రాజ్య సందేశాన్ని వినేవారందరూ రాజ్యపౌరులు అవుతారనేమీ లేదని ఆయన తెలియజేశాడు.—మత్త. 13:47-50. a

2. గోధుమల, గురుగుల గురించి యేసు చెప్పిన ఉపమానంలో మంచి విత్తనం ఎవరిని సూచిస్తోంది?

2 అయితే, తనతో పరిపాలించేవారు ఎలా సమకూర్చబడతారో వివరించేందుకు యేసు ఒక ఉపమానం చెప్పాడు. దీన్ని గోధుమల గురుగుల ఉపమానమని అంటారు. ఇది మత్తయి 13వ అధ్యాయంలో ఉంది. యేసు మరో ఉపమానంలోనైతే విత్తబడే విత్తనం “రాజ్యమునుగూర్చిన వాక్యము” అని చెప్పాడు కానీ, ఈ ఉపమానంలో మాత్రం మంచి విత్తనం ‘రాజ్య కుమారులను’ సూచిస్తోందని చెప్పాడు. (మత్త. 13:19, 38, అథఃస్సూచి) వీరు రాజ్యపౌరులు కాదుగానీ రాజ్య ‘కుమారులు’ లేదా రాజ్యవారసులు.—రోమా. 8:14-17; గలతీయులు 4:6, 7 చదవండి.

గోధుమల, గురుగుల ఉపమానం

3. ఉపమానంలోని వ్యక్తి ఏ సమస్యను ఎదుర్కొన్నాడు? దాన్ని ఎలా పరిష్కరించాలనుకున్నాడు?

3 యేసు ఈ ఉపమానం చెప్పాడు: “పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి—అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా, అందులో గురుగులెక్కడనుండి వచ్చినవని అడిగిరి. —ఇది శత్రువుచేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు—మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి. అందుకతడు—వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు. కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగనియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.”—మత్త. 13:24-30.

4. (ఎ) ఈ ఉపమానంలోని వ్యక్తి ఎవరు? (బి) యేసు మంచి విత్తనాన్ని విత్తడం ఎప్పుడు మొదలుపెట్టాడు? ఎలా మొదలుపెట్టాడు?

4 పొలంలో మంచి విత్తనాన్ని విత్తిన వ్యక్తి ఎవరు? దాని జవాబును యేసు తన శిష్యులకు చెప్పాడు: “మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు.” (మత్త. 13:37) ‘మనుష్యకుమారుడైన’ యేసు భూపరిచర్య చేసిన మూడున్నర సంవత్సరాల్లో విత్తనాలు విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేశాడు. (మత్త. 8:20; 25:31; 26:64) ఆ తర్వాత సా.శ. 33 పెంతెకొస్తు రోజు నుండి మంచి విత్తనాన్ని అంటే ‘రాజ్యకుమారులను’ విత్తడం మొదలుపెట్టాడు. యెహోవా ప్రతినిధిగా యేసు తన శిష్యులమీద పరిశుద్ధాత్మను కుమ్మరించి వారిని దేవుని కుమారులుగా అభిషేకించినప్పుడు ఈ విత్తే పని ఆరంభమైనట్లు తెలుస్తోంది. b (అపొ. 2:33) ఆ మంచి విత్తనం గోధుమలుగా పెరిగింది. రాజ్యంలో యేసు తోటి వారసులు, తోటి రాజులు అయ్యేవారిని పూర్తిగా సమకూర్చడానికే ఆ మంచి విత్తనం విత్తబడుతుంది.

5. ఉపమానంలో శత్రువు ఎవరు? గురుగులు ఎవరు?

5 ఆ శత్రువు ఎవరు? గురుగులు ఎవరు? “శత్రువు అపవాది” అని, “గురుగులు దుష్టుని సంబంధులు” అని యేసు వివరించాడు. (మత్త. 13:25, 38, 39) మొక్కగా ఉన్నప్పుడు ఈ విషపూరితమైన గురుగులు చూడడానికి గోధుమల్లాగే కనిపిస్తాయి. రాజ్యకుమారులమని చెప్పుకుంటూ సరైన ఫలాలను ఫలించనివారిని వర్ణించడానికి గురుగులు అనే పదం ఎంత చక్కగా సరిపోతుంది! క్రీస్తు అనుచరులమని చెప్పుకునే ఈ వేషధారులైన క్రైస్తవులు నిజానికి అపవాదియైన సాతాను ‘సంతానం.’—ఆది. 3:15.

6. గురుగులు తెరమీదకు ఎప్పుడు వచ్చారు? అప్పుడు మనుష్యులు ఏ భావంలో ‘నిద్రించారు’?

6 గురుగుల్లాంటి ఈ క్రైస్తవులు తెరమీదకు ఎప్పుడు వచ్చారు? “మనుష్యులు నిద్రించుచుండగా” అని యేసు చెప్పాడు. (మత్త. 13:25) అది ఎప్పుడు జరిగింది? అపొస్తలుడైన పౌలు ఎఫెసులోని పెద్దలతో అన్న మాటల్లో మనకు జవాబు దొరుకుతుంది: “నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపొ. 20:29, 30) ఆధ్యాత్మికంగా మెలకువగా ఉండమని ఆయన ఆ పెద్దలను ప్రోత్సహించాడు. మొదటి శతాబ్దంలో మతభ్రష్టత్వాన్ని ‘అడ్డగించిన’ అపొస్తలులు ఒక్కొక్కరు చనిపోసాగారు. ఆ సమయంలో చాలామంది క్రైస్తవులు ఆధ్యాత్మిక నిద్రలోకి జారుకున్నారు. (2 థెస్సలొనీకయులు 2:3, 6-8 చదవండి.) అప్పటి నుండే మతభ్రష్టత్వం వేళ్లూనుకుంది.

7. గోధుమలే గురుగులయ్యాయా? వివరించండి.

7 గోధుమలు గురుగులౌతాయని యేసు చెప్పలేదు గానీ గోధుమల మధ్య గురుగులు విత్తబడ్డాయని ఆయన చెప్పాడు. కాబట్టి, ఒకప్పుడు నిజక్రైస్తవులుగా ఉండి ఆ తర్వాత సత్యాన్ని వదిలిపెట్టినవాళ్ల గురించి ఈ ఉపమానం చెప్పడంలేదు. బదులుగా, సంఘంలోకి దుష్టులను ప్రవేశపెట్టడం ద్వారా క్రైస్తవ సంఘాన్ని పాడుచేయడానికి సాతాను ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నాన్ని అది సూచిస్తోంది. చివరి అపొస్తలుడైన యోహాను వృద్ధుడయ్యేనాటికి, మతభ్రష్టత్వం స్పష్టంగా కనిపించింది.—2 పేతు. 2:1-3; 1 యోహా. 2:18.

“కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగనియ్యుడి”

8, 9. (ఎ) యజమాని తన దాసులకు ఇచ్చిన ఆదేశాలను యేసు శ్రోతలు అర్థం చేసుకొనివుంటారని ఎలా చెప్పవచ్చు? (బి) ఉపమానంలో చెప్పబడినట్లే గోధుమలు, గురుగులు ఎలా కలిసి పెరిగాయి?

8 యజమానుని దాసులు సమస్య గురించి చెబుతూ, “మేము వెళ్లి వాటిని [గురుగులను] పెరికి కూర్చుట నీకిష్టమా?” అని అడిగారు. (మత్త. 13:27, 28) కోతకాలమువరకు రెండింటిని కలిసి పెరగనివ్వమని ఆయన ఇచ్చిన జవాబు ఆశ్చర్యం కలిగించవచ్చు. అయితే ఆ మాటలను యేసు శిష్యులు అర్థం చేసుకొనివుంటారు. ఎందుకంటే, ప్రారంభంలో గోధుమలకు, గురుగులకు మధ్యవున్న తేడాను గుర్తుపట్టడం ఎంత కష్టమో వారు తెలిసేవుంటుంది. గోధుమల వేళ్లకు గురుగుల వేళ్లు అల్లుకుపోతాయని కూడా వ్యవసాయంలో కొంత అనుభవమున్నవారికి అర్థమౌతుంది. c అందుకే కొంతకాలం వరకు వేచివుండమని యజమాని ఆదేశిస్తాడు!

9 అదే విధంగా, తర్వాతి శతాబ్దాల్లో, క్రైస్తవ మతానికి చెందిన వివిధ శాఖలు అసాధారణమైన గురుగుల పంటను కోశాయి. మొదట, రోమన్‌ క్యాథలిక్‌, ఆర్థోడాక్స్‌ చర్చీలు, ఆ తర్వాత అనేక ప్రొటస్టెంటు శాఖలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అదే సమయంలో, ప్రపంచమనే పొలంలో గోధుమ విత్తనాలు కూడా విత్తబడ్డాయి. ఆ రెండూ పెరగడానికి ఎంతో కాలం పట్టినా కోతకాలం మాత్రం కొద్దికాలమే ఉంటుంది. గృహస్థుడు ఆ సమయంవరకు ఓపిగ్గా వేచివున్నాడు.

కోతకాలం కోసం ఎంతోకాలం వేచిచూశారు

10, 11. (ఎ) కోతకాలం ఎప్పుడు ప్రారంభమైంది? (బి) సూచనార్థక గోధుమలు యెహోవా కొట్టులోకి ఎలా తీసుకురాబడ్డారు?

10 యేసు ఇలా చెప్పాడు: “కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు.” (మత్త. 13:39) దుష్టవిధానపు అంత్యదినాల్లో వేరుచేసే పని జరుగుతుంది. అప్పుడు రాజ్యకుమారులు సమకూర్చబడి, గురుగుల్లాంటివారి నుండి వేరుచేయబడతారు. దీని గురించి అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “తీర్పు దేవుని ఇంటియొద్ద ఆరంభమగు కాలము వచ్చియున్నది; అది మనయొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి యేమవును?”—1 పేతు. 4:17.

11 అంత్యదినాలు లేదా “యుగసమాప్తి” ప్రారంభమైన కొంతకాలానికి నిజక్రైస్తవులమని చెప్పుకుంటున్నవారు ‘రాజ్యకుమారులా’ లేక ‘దుష్టుని సంబంధులా’ అని గుర్తించేందుకు వారికి తీర్పు ప్రారంభమైంది. కోతకాలం ప్రారంభంలో “ముందుగా” మహాబబులోను కూలిపోయింది, ఆ తర్వాత రాజ్యకుమారులు సమకూర్చబడ్డారు. (మత్త. 13:30) అప్పటినుండి సూచనార్థక గోధుమలు యెహోవా కొట్టులోకి ఎలా తీసుకురాబడ్డారు? గోధుమల్ని సూచిస్తున్న రాజ్యకుమారుల్లో చనిపోయినవారు ఇప్పటికే పరలోక బహుమానాన్ని పొందారు. ఇంకా భూమ్మీద జీవిస్తున్నవారు వ్యవస్థీకరించబడిన క్రైస్తవ సంఘంలో భాగంగా ఉన్నారు. అక్కడ వారు దేవుని అనుగ్రహాన్ని, రక్షణను చవిచూస్తున్నారు.

12. కోతపని ఎంతకాలం కొనసాగుతుంది?

12 తీర్పు ఎంతకాలం ఉంటుంది? యేసు ‘కోతకాలం’ అనే పదాన్ని ఉపయోగించాడు. దీన్నిబట్టి అది కొంతకాలం ఉంటుందని తెలుస్తుంది. (ప్రక. 14:15, 16) ఈ అంత్యదినాల చివరివరకు అభిషిక్త క్రైస్తవుల్లోని వివిధ సభ్యులు తీర్పు తీర్చబడతారు. వారు చివరి ముద్ర పొందేంతవరకు ఆ తీర్పు కొనసాగుతుంది.—ప్రక. 7:1-4.

13. గురుగుల్లాంటివారు ఎలా ఆటంకపరుస్తారు? వారెలా దుర్నీతికి పాల్పడుతున్నారు?

13 రాజ్యం నుండి పడవేయబడడానికి ఎవరు సమకూర్చబడతారు? వారెలా ఇతరులకు ఆటంకం కలిగించి, దుర్నీతికి పాల్పడతారు? (మత్త. 13:41) గురుగుల్లాంటి నామకార్థ క్రైస్తవ మతనాయకులు ఎన్నో శతాబ్దాలుగా లక్షలాదిమందిని తప్పుదోవపట్టించారు. దేవుణ్ణి అవమానపర్చే బోధలను, అనేకమందిని ‘ఆటంకపరిచిన’ విషయాలను వారు బోధిస్తూ వచ్చారు. ఉదాహరణకు, వారు నరకంలో నిత్యయాతన ఉంటుందనే సిద్ధాంతాన్ని, తికమకపెట్టే మర్మమైన త్రిత్వ సిద్ధాంతాన్ని బోధిస్తూ వచ్చారు. వ్యభిచారంతో సమానమైన లోకస్నేహాన్ని చేయడం ద్వారా, కొన్ని సందర్భాల్లో ఘోరమైన లైంగిక దుర్నీతికి పాల్పడడం ద్వారా చాలామంది మతనాయకులు తమ మందలోని వారికి చెడ్డ మాదిరిని ఉంచారు. (యాకో. 4:4) అంతేకాక, నామకార్థ క్రైస్తవమతాలవారు తమ సభ్యులు చేస్తున్న లైంగిక దుర్నీతిని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. (యూదా 4 చదవండి.) ఇంత జరుగుతున్నా, వారు పైకి మాత్రం తామెంతో పవిత్రులమన్నట్లు, దైవభక్తిగలవారమన్నట్లు నటిస్తున్నారు. అలాంటివారి ప్రభావం నుండి బయటపడినందుకు, ఆటంకపరిచే తప్పుడు బోధలను విడిచిపెట్టినందుకు రాజ్యకుమారులు ఎంత సంతోషంగా ఉన్నారు!

14. గురుగుల్లాంటివారు ఎలా ఏడుస్తూ పండ్లు కొరుకుతారు?

14 గురుగుల్లాంటివారు ఎలా ఏడుస్తూ పండ్లు కొరుకుతారు? (మత్త. 13:42) ‘దుష్టుని సంబంధులతో’ సహవాసం చేయడంవల్ల భ్రష్టుపట్టే అవకాశముందని, వారి బోధలు ఎంతో విషపూరితమైనవని ‘రాజ్య కుమారులు’ బట్టబయలు చేసినప్పుడు ఆ దుష్టుని సంబంధులు యాతనపెట్టబడతారు. రోజురోజుకీ చర్చి సభ్యుల సంఖ్య తగ్గిపోవడం, చర్చి సభ్యులమీద తమ ఆధిపత్యం తగ్గిపోవడం కూడా వారిని బాధిస్తుంది.—యెషయా 65:13, 14 చదవండి.

15. గురుగుల్లాంటివారు ఏ విధంగా అగ్నిలో కాల్చివేయబడతారు?

15 గురుగుల్లాంటివారు ఏ విధంగా కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడతారు? (మత్త. 13:40) ఆ మాటలు గురుగులకు చివరికి ఏమౌతుందో తెలియజేస్తున్నాయి. వారు అగ్నిగుండంలో పడవేయబడతారు, అంటే నిత్యనాశనాన్ని చవిచూస్తారు. (ప్రక. 20:14; 21:8) క్రైస్తవులమని చెప్పుకునే గురుగుల్లాంటి ఈ వేషధారులు ‘మహాశ్రమలప్పుడు’ సమూలంగా నాశనంచేయబడతారు.—మత్త. 24:21, NW.

వారు ‘సూర్యునిలా తేజరిల్లుతారు’

16, 17. దేవుని ఆలయం గురించి మలాకీ ఏమని ప్రవచించాడు? అది ఎలా నెరవేరడం మొదలైంది?

16 ఏ సమయంలో గోధుమల్లాంటివారు ‘సూర్యునిలా తేజరిల్లుతారు’? (మత్త. 13:43) దేవుని ఆలయాన్ని శుభ్రం చేయడం గురించి మలాకీ ఈ విధంగా ప్రవచించాడు: “మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చుదినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్నివంటివాడు, చాకలివాని సబ్బువంటి వాడు; వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.”—మలా. 3:1-3.

17 మన కాలంలో ఈ ప్రవచనం 1918 నుండి నెరవేరడం ఆరంభమైందని తెలుస్తోంది. ఆ సంవత్సరంలో, “నిబంధన దూత” అయిన యేసుక్రీస్తుతో కలిసి యెహోవా ఆధ్యాత్మిక ఆలయాన్ని పరిశీలించడానికి వచ్చాడు. పరిశుభ్రపరచడం పూర్తయిన తర్వాత ఏమౌతుందో మలాకీ వివరిస్తున్నాడు: “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో మీరు తిరిగి కనుగొందురు.” (మలా. 3:18) పునరుత్తేజితులైన నిజక్రైస్తవులు ఉత్సాహంతో పరిచర్యలో పాల్గొనడాన్నిబట్టి కోతకాలం ప్రారంభమైందని తెలుస్తోంది.

18. మన కాలంలో ఏమి జరుగుతుందని దానియేలు ప్రవచించాడు?

18 మన కాలం గురించి ప్రవక్తయైన దానియేలు ఇలా ప్రవచించాడు: “బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతిమార్గము ననుసరించి నడుచుకొనునట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రమువలె నిరంతరమును ప్రకాశించెదరు.” (దాని. 12:3) అంతగా ప్రకాశిస్తున్న వీరు ఎవరు? గోధుమలు గురుగుల ఉపమానంలో యేసు ప్రస్తావించిన అసలు గోధుమలైన అభిషిక్త క్రైస్తవులే ఆ విధంగా ప్రకాశిస్తున్నారు. క్రైస్తవులమని చెప్పుకునే గురుగుల్లాంటివారు ‘సమకూర్చబడుతున్నారని’ రోజురోజుకీ పెరిగిపోతున్న గొర్రెల్లాంటి గొప్పసమూహపువారు స్పష్టంగా గుర్తించగలుగుతున్నారు. ఈ భావి రాజ్యపౌరులు అభిషిక్త శేషంతో సహవసించడం ద్వారా చీకటిమయమైన లోకంలో వీరు కూడా వెలుగును ప్రకాశిస్తున్నారు.—జెక. 8:23; మత్త. 5:14-16; ఫిలి. 2:15.

19, 20. ‘రాజ్యకుమారులు’ దేనికోసం ఆశతో ఎదురుచూస్తున్నారు? తర్వాతి ఆర్టికల్‌లో మనం ఏమి చర్చిస్తాం?

19 ఇప్పుడు ‘రాజ్యకుమారులు’ మహిమాన్వితమైన పరలోక బహుమానం కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. (రోమా. 8:18, 19; 1 కొరిం. 15:53; ఫిలి. 1:21-24) అప్పటివరకు వారు నమ్మకంగా ఉంటూ తమ వెలుగును ప్రకాశిస్తూ ఉండాలి. ‘దుష్టుని సంబంధులకు’ వేరుగా ఉండడానికి కృషిచేయాలి. (మత్త. 13:38; ప్రక. 2:10) మన కాలంలో గురుగులు ‘సమకూర్చబడడం’ వల్ల వచ్చిన ఫలితాలను కళ్లారా చూసే అవకాశం దొరికినందుకు మనమెంత సంతోషిస్తున్నాం!

20 నేడు గొప్పసమూహపువారు రోజురోజుకీ పెరుగుతున్నారు. రాజ్యపౌరులుగా భూమ్మీద నిరంతరం జీవించే అవకాశమున్న ఈ గొప్పసమూహానికీ, రాజ్యకుమారులకూ మధ్యవున్న సంబంధమేమిటి? ఈ ప్రశ్నకు తర్వాతి ఆర్టికల్‌ జవాబిస్తుంది.

[అధస్సూచీలు]

a ఈ ఉపమానాల గురించి మరింత తెలుసుకోవడానికి కావలికోట, జూలై 15, 2008 సంచికలోని 12-21 పేజీలు చూడండి.

b ఈ ఉపమానంలో, విత్తనాలు విత్తడం అనేది ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో పాల్గొని అభిషిక్త క్రైస్తవుల్లో కొత్తవారిని చేర్చడాన్ని సూచించడంలేదు. పొలంలో విత్తబడిన ‘మంచి విత్తనములు రాజ్యకుమారులు’ అని యేసు చెప్పాడే గానీ ‘రాజ్యకుమారులౌతారు’ అని చెప్పలేదు. కాబట్టి, విత్తనాలు విత్తడం అనేది ప్రపంచమనే పొలంలో ఈ రాజ్యకుమారులను అభిషేకించడాన్ని సూచిస్తోంది.

c గోధుమల వేళ్లకు గురుగుల వేళ్లు ఎంతగా అల్లుకుపోతాయంటే కోతకాలంకన్నా ముందే వాటిని పెకిలించివేయడానికి ప్రయత్నిస్తే గోధుమలను ఎంతగానో నష్టపోవాల్సివస్తుంది.—లేఖనాలపై అంతర్దృష్టి (ఆంగ్లం), 1వ సంపుటి, 1178వ పేజీ.

మీకు గుర్తున్నాయా?

గోధుమలు, గురుగుల గురించి యేసు చెప్పిన ఉపమానంలో ఈ కింది విషయాలు దేన్ని సూచిస్తున్నాయి?

• మంచి విత్తనం

• విత్తనాలు విత్తిన వ్యక్తి

• విత్తనాలు విత్తడం

• శత్రువు

• గురుగులు

• కోతకాలం

• కొట్టు

• ఏడ్వడం, పండ్లు కొరకడం

• అగ్నిగుండం

[అధ్యయన ప్రశ్నలు]

[20వ పేజీలోని చిత్రాలు]

సా.శ. 33 పెంతెకొస్తు రోజున మంచి విత్తనం విత్తడం ప్రారంభమైంది

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా కొట్టులోకి సూచనార్థక గోధుమలు తీసుకురాబడుతున్నాయి

[క్రెడిట్‌ లైను]

Pictorial Archive (Near Eastern History) Est.