కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి?

తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి?

తండ్రి నామంలో, కుమారుని నామంలో, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి?

‘కాబట్టి మీరు వెళ్లి శిష్యులను చేయండి. తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమివ్వండి.’—మత్త. 28:19.

1, 2. (ఎ) సా.శ. 33 పెంతెకొస్తు రోజున యెరూషలేములో ఏమి జరిగింది? (బి) జనసమూహంలోని చాలామంది ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు?

 వేర్వేరు దేశాల నుండి వచ్చిన ప్రజలతో యెరూషలేము సందడిగా ఉంది. సా.శ. 33 పెంతెకొస్తు రోజున ఓ ప్రాముఖ్యమైన పండుగ జరుగుతోంది. చాలామంది ఆ పండుగను జరుపుకుంటున్నారు. కానీ, అసాధారణమైన ఓ సంఘటన జరిగింది. దాని తర్వాత అపొస్తలుడైన పేతురు, ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసిన ఉత్తేజకరమైన ప్రసంగాన్నిచ్చాడు. దాని ఫలితంగా, దాదాపు 3,000 మంది యూదులు, యూదామత ప్రవిష్టులు పశ్చాత్తాపపడి నీటి బాప్తిస్మం తీసుకున్నారు. అలా వారు కొత్తగా ఏర్పడిన క్రైస్తవ సంఘంలో సభ్యులయ్యారు. (అపొ. 2:41) చాలామంది యెరూషలేము చుట్టుప్రక్కలున్న సరస్సుల్లో, జలాశయాల్లో బాప్తిస్మం తీసుకోవడం ఎంతో గందరగోళాన్ని రేపివుంటుంది.

2 అంతమంది ఎందుకు బాప్తిస్మం తీసుకున్నారు? ఆ రోజు వారు బాప్తిస్మం తీసుకోకముందు, “వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని ఆకాశమునుండి” వచ్చింది. ఒక ఇంటి మేడగదిలో సమకూడిన దాదాపు 120 మంది యేసు శిష్యుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఆ తర్వాత దైవభక్తిగల స్త్రీపురుషులంతా ఒకదగ్గర చేరారు. ఆ శిష్యులు ‘అన్యభాషల్లో మాట్లాడడాన్ని’ చూసి వారు చెప్పేది వినేందుకు ఎంతో ఆసక్తిని చూపించారు. యేసు మరణం గురించి పేతురు వారి ముఖంమీద చేసిన వ్యాఖ్యలతోసహా ఆయన చెప్పినదంతా విని వారిలో చాలామంది ‘హృదయములో నొచ్చుకున్నారు.’ అప్పుడు వారేమి చేయాలి? పేతురు మాటల్లోనే జవాబుంది: “మీరు మారుమనస్సు పొంది . . . ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు.”—అపొ. 2:1-4, 36-38.

3. పెంతెకొస్తు రోజున, పశ్చాత్తాపపడిన యూదులు, యూదామత ప్రవిష్టులు ఏమి చేయాల్సిన అవసరం ఏర్పడింది?

3 పేతురు మాటలు విన్న యూదుల, యూదామత ప్రవిష్టుల ఆధ్యాత్మిక పరిస్థితి గురించి ఒకసారి ఆలోచించండి. వారు అప్పటికే యెహోవాను తమ దేవునిగా అంగీకరించారు. అంతేకాదు, దేవుని చురుకైన శక్తి అయిన పరిశుద్ధాత్మ గురించి వారు హెబ్రీ లేఖనాల నుండి తెలుసుకున్నారు. దేవుడు సృష్టికార్యాలను చేయడానికి, ఆ తర్వాతి కాలంలో మరితర కార్యాలు చేయడానికి దాన్ని ఉపయోగించాడు. (ఆది. 1:2; న్యాయా. 14:5, 6; 1 సమూ. 10:6; కీర్త. 33:6) అయితే, కేవలం ఆ విషయాలు తెలిసుంటే సరిపోదు. వారు మెస్సీయ అయిన యేసు ద్వారా దేవుడు రక్షణ అనుగ్రహించాడనే విషయాన్ని కూడా తెలుసుకొని ఆయనను అంగీకరించాలి. అందుకే, “యేసుక్రీస్తు నామమున” వారు “బాప్తిస్మము” పొందాల్సిన అవసరం ఉందని పేతురు నొక్కిచెప్పాడు. కొన్నిరోజుల ముందు పునరుత్థానం చేయబడిన యేసు, “తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి” ప్రజలకు బాప్తిస్మం ఇవ్వమని పేతురుకు, మరితరులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19, 20) ఆ మాటలు మొదటి శతాబ్దంలోని వారికే కాక మనకు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. వాటికున్న అర్థం ఏమిటి?

తండ్రి నామంలో

4. యెహోవాతో సంబంధం కలిగివుండే ప్రజల విషయంలో ఎలాంటి మార్పు వచ్చింది?

4 ముందు చూసినట్లుగా పేతురు ప్రసంగానికి స్పందించినవారంతా యెహోవా ఆరాధకులే. వారు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగివుండేవారు. యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటించడానికి ప్రయత్నిస్తుండేవారు కాబట్టే వారు వేర్వేరు దేశాల నుండి యెరూషలేముకు వచ్చారు. (అపొ. 2:5-11) అయితే ఆ సందర్భంలో యెహోవా, మానవులతో తాను వ్యవహరించే తీరులో పెనుమార్పు తీసుకొచ్చాడు. తనకు ఓ ప్రత్యేక జనాంగంగా ఉండే అవకాశాన్ని యూదుల నుండి తీసేశాడు. ఇకపై వారు యెహోవా ఆమోదం పొందాలంటే కేవలం ధర్మశాస్త్రం పాటిస్తే సరిపోదు. (మత్త. 21:43; కొలొ. 2:13, 14) యెహోవాతో తమ సంబంధం కొనసాగాలంటే వారు చేయాల్సింది ఇంకేదో ఉంది.

5, 6. దేవునితో సంబంధం కలిగివుండడానికి మొదటి శతాబ్దంలోని యూదులు, యూదామత ప్రవిష్టులు ఏమి చేశారు?

5 వారు జీవదాత అయిన యెహోవావైపు తిరగాలి. (అపొ. 4:24) పేతురు వివరణకు స్పందించినవారు యెహోవా ఎంత దయగల తండ్రో మునుపటికన్నా ఇప్పుడు మరింత స్పష్టంగా చూడగలిగారు. ఎందుకంటే, దేవుడు తమను విడుదల చేయడానికి మెస్సీయను పంపించాడు. అంతేకాక, పేతురు మాటలను వింటున్నవారిని క్షమించడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వారితో పేతురు, “మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెను” అని చెప్పాడు. తనతో సంబంధం కలిగివుండాలని ఇష్టపడేవారికోసం తండ్రి ఎంతో గొప్ప కార్యాన్ని చేశాడు. పేతురు మాటల్ని అన్వయించుకునేవారు తండ్రి చేసినదానిపట్ల మరింత కృతజ్ఞత చూపించేందుకు ఇప్పుడు ఇంకా ఎన్నో కారణాలున్నాయి.—అపొస్తలుల కార్యములు 2:30-36 చదవండి.

6 యెహోవాతో సంబంధం కలిగివుండాలంటే యేసు ద్వారా యెహోవా తమకు రక్షణను అందిస్తున్నాడనే విషయాన్ని గుర్తించాలని యూదులు, యూదామత ప్రవిష్టులు అర్థం చేసుకున్నారు. వారు తెలిసో, తెలియకో యేసును చంపించడంలో భాగం వహించినందుకే కాక తాము చేసిన ఇతర పాపాల విషయంలో కూడా ఎందుకు పశ్చాత్తాపపడ్డారో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. అంతేకాక, ఆ తర్వాతి రోజుల్లో వారు ఎందుకు “అపొస్తలుల బోధయందు . . . ఎడతెగక” కొనసాగారో కూడా మనకు అర్థమౌతుంది. (అపొ. 2:42) ఇప్పుడు వారు “ధైర్యముతో కృపాసనమునొద్దకు” చేరగలుగుతారు, చేరాలనుకుంటారు కూడా.—హెబ్రీ. 4:16.

7. నేడు అనేకులు ఎలా దేవునిపట్ల తమకున్న అభిప్రాయాన్ని మార్చుకొని తండ్రి నామమున బాప్తిస్మం తీసుకున్నారు?

7 మన కాలంలో వేర్వేరు ప్రాంతాల, జాతుల నుంచి వచ్చిన లక్షలాదిమంది బైబిలు నుండి యెహోవా గురించిన సత్యం నేర్చుకున్నారు. (యెష. 2:2, 3) వారిలో కొందరు ఒకప్పుడు నాస్తికులు. మరికొందరు, దేవుడున్నాడని నమ్మినా ఆయనకు మానవులపట్ల శ్రద్ధలేదని అనుకునేవారు. కానీ ఇప్పుడు సృష్టికర్త ఉన్నాడనీ, ఆయనతో ఓ మంచి సంబంధాన్ని కలిగివుండవచ్చనీ వారికి నమ్మకం కుదిరింది. ఇంకా కొందరు త్రియేక దేవుణ్ణి ఆరాధించేవారు లేదా వివిధ విగ్రహాలను పూజించేవారు. యెహోవా ఒక్కడే సర్వశక్తిగల దేవుడని తెలుసుకున్నారు, ఇప్పుడు వారు ఆయన పేరును ఉపయోగిస్తూ ప్రార్థిస్తున్నారు. అలా వారు, తండ్రి నామమున బాప్తిస్మం తీసుకోవాలని యేసు తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తున్నారు.

8. ఆదాము ద్వారా వచ్చిన పాపం గురించి తెలియనివారు తండ్రి గురించి ఏమి గుర్తించాల్సి వచ్చింది?

8 ఆదాము నుండి పాపాన్ని వారసత్వంగా పొందామని కూడా వారు అర్థం చేసుకున్నారు. (రోమా. 5:12) ఆ సత్యాన్ని వారు కొత్తగా అంగీకరించాల్సి ఉంది. అలాంటి వారిని, తనకున్న జబ్బు గురించి తెలియని రోగితో పోల్చవచ్చు. అప్పుడప్పుడు నొప్పిరావడం వంటి కొన్ని రోగలక్షణాలు రోగికి ఉండవచ్చు. అయినా, ఫలానా రోగం ఉందని నిర్ధారణ కాలేదు కాబట్టి తాను ఆరోగ్యవంతుణ్ణే అని అనుకుంటాడు. కానీ, వాస్తవాలు దానికి విరుద్ధంగా ఉంటాయి. (1 కొరింథీయులు 4:4 పోల్చండి.) ఒకవేళ ఆయనకు జబ్బు ఉందని నిర్ధారణైతే ఆయనేమి చేస్తాడు? బాగా పేరుపొందిన మెరుగైన చికిత్సను అంగీకరించడా? అదే విధంగా బైబిలు “రోగనిర్ధారణ” చేసినట్లుగా చాలామంది తమకు వారసత్వంగా పాపం సంక్రమించిందని అంగీకరించి దాన్ని దేవుడే “నయం” చేస్తాడని అర్థం చేసుకున్నారు.—ఎఫె. 4:17-19.

9. తనతో ప్రజలు సంబంధం కలిగివుండేలా యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?

9 మీరిప్పటికే యెహోవా దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులైతే, ఆయనతో సంబంధం కలిగివుండడం ఎంత గొప్ప విషయమో మీకు తెలుసు. మీ తండ్రియైన యెహోవా ఎంత ప్రేమగలవాడో మీరిప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. (రోమీయులు 5:8 చదవండి.) ఆదాముహవ్వలు తనకు వ్యతిరేకంగా పాపం చేసినా, వారి సంతానంలోనివారంతా అంటే మనమంతా తనతో మంచి సంబంధం కలిగివుండేలా దేవుడు ఓ ఏర్పాటు చేశాడు. ఆ కారణంగా, తన ప్రియ కుమారుడు వేదనను అనుభవించి చనిపోతుంటే దేవుడు దాన్ని చూసి బాధపడాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తర్వాత దేవుని అధికారాన్ని అంగీకరించి ఆయన ఆజ్ఞలను ప్రేమతో పాటించాలని మనకు అనిపిస్తుంది కదా! మీరింకా అలా చేయనట్లయితే, మీరు దేవునికి సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోవడానికి మీకు ఎన్నో కారణాలున్నాయి.

కుమారుని నామంలో

10, 11. (ఎ) మీరు యేసుకు ఎంత రుణపడివున్నారు? (బి) విమోచన క్రయధనంగా యేసు చనిపోవడం గురించి మీకేమనిపిస్తుంది?

10 జనసమూహంతో పేతురు అన్న మాటల గురించి మళ్లీ ఒకసారి ఆలోచించండి. యేసును అంగీకరించడం ఎంత ప్రాముఖ్యమో ఆయన చెప్పాడు. అలా అంగీకరిస్తేనే, ‘కుమారుని నామంలో’ బాప్తిస్మం పొందగలుగుతాం. అయితే, ఆ నామంలో బాప్తిస్మం పొందడాన్ని అప్పట్లో ఎందుకు ప్రాముఖ్యమైనదిగా ఎంచారు? ఇప్పుడు ఎందుకు ప్రాముఖ్యమైనదిగా ఎంచాలి? యేసును అంగీకరించి, ఆయన నామంలో బాప్తిస్మం తీసుకోవాలంటే సృష్టికర్తతో మనకున్న సంబంధం విషయంలో క్రీస్తు పోషించిన పాత్రను గుర్తించాలి. ధర్మశాస్త్రానికి సంబంధించిన శాపం నుండి యూదులను విడుదల చేయడానికి యేసును హింసాకొయ్యపై వేలాడదీయాల్సి వచ్చింది. అయితే, ఆయన మరణంవల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరాయి. (గల. 3:13) మానవజాతికి అవసరమైన విమోచనా క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. (ఎఫె. 2:15, 16; కొలొ. 1:19, 20; 1 యోహా. 2:1, 2) దానికోసం యేసు అన్యాయాన్ని, దూషణను, హింసను చివరికి మరణాన్ని కూడా సహించాడు. మరి ఆయన బలిపట్ల మీకు ఎంత కృతజ్ఞత ఉంది? మీరు, 1912లో మంచుకొండను ఢీకొని మునిగిపోయిన టైటానిక్‌ ఓడలో ప్రయాణిస్తున్న 12 ఏళ్ల బాలుడు అని ఊహించుకోండి. మీరు లైఫ్‌బోట్‌లోకి వెళ్లాలనుకున్నారు కానీ అది అప్పటికే నిండిపోయింది. అది చూసిన ఓ వ్యక్తి తన భార్యను ముద్దుపెట్టుకొని తాను ఆ లైఫ్‌బోట్‌లో నుండి మునిగిపోతున్న ఓడలోకి వచ్చి మిమ్మల్ని ఆ లైఫ్‌బోట్‌లోకి వెళ్లనిచ్చాడు. అప్పుడు మీకెలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మీరు ఆయనకు ఎంతో రుణపడి ఉంటారు కదా! అయితే, ఆ అనుభవాన్ని నిజంగా ఎదుర్కొన్న ఓ అబ్బాయికి ఎలా అనిపించి ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. a అయితే, ఆ వ్యక్తి చేసిన దానికన్నా యేసు మీ కోసం ఎక్కువే చేశాడు. మీరు నిరంతరం జీవించేలా ఆయన మీ కోసం మరణించాడు.

11 దేవుని కుమారుడు మీ కోసం చేసిన త్యాగం గురించి తెలుసుకున్నప్పుడు మీకెలా అనిపించింది? (2 కొరింథీయులు 5:14, 15 చదవండి.) మీ హృదయం కృతజ్ఞతతో నిండిపోయివుంటుంది. ఆ కృతజ్ఞతతో మీరు మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు. ‘మీ కోసం కాక, మీ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించాలనుకున్నారు.’ కుమారుని నామంలో బాప్తిస్మం పొందాలంటే ఆయన మీకోసం చేసినదాన్ని గుర్తించి ‘జీవాధిపతిగా’ ఆయన అధికారాన్ని అంగీకరించాలి. (అపొ. 3:15; 5:31) మీకు గతంలో సృష్టికర్తతో ఎలాంటి సంబంధం ఉండేదికాదు, భవిష్యత్తు విషయంలో మీకు ఎలాంటి ఆశ ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు చిందించిన రక్తంపై విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకోవడంవల్ల మీకు ఇప్పుడు తండ్రితో సంబంధం ఏర్పడింది. (ఎఫె. 2:12, 13) అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “గతకాలమందు దేవునికి దూరస్థులును, మీ దుష్క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునై యుండిన మిమ్మును కూడ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన [యేసు] మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు [దేవుడు] మిమ్మును సమాధానపరచెను.”—కొలొ. 1:21, 22.

12, 13. (ఎ) మీరు కుమారుని నామంలో బాప్తిస్మం తీసుకున్నవారైతే, ఇతరులు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు ఏమి చేస్తారు? (బి) యేసు నామంలో బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులుగా మీపై ఎలాంటి బాధ్యత ఉంది?

12 మీరు కుమారుని నామంలో బాప్తిస్మం తీసుకున్నప్పటికీ మీ పాపభరిత ఆలోచనల గురించి మీకు బాగా తెలుసు. అలా తెలిసివుండడం మీకు ప్రతీరోజు ఎంతో మేలు చేస్తుంది. ఉదాహరణకు, ఎవరైనా మీ మనసు నొప్పిస్తే, మీలా వారూ పాపులేనని గుర్తుంచుకుంటారా? మీ ఇద్దరికీ దేవుని క్షమాపణ అవసరం. అంతేకాక, మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి. (మార్కు 11:25) దీన్ని నొక్కిచెప్పడానికి యేసు ఈ ఉపమానాన్ని చెప్పాడు: ఒక యజమాని తన దాసుడు చేసిన పదివేల తలాంతుల (6 కోట్ల దేనారాలు) అప్పును రద్దు చేశాడు. ఆ తర్వాత, ఆ దాసుడు మాత్రం తనకు 100 దేనారాలు అచ్చివున్న తోటి దాసుణ్ణి విడిచిపెట్టలేదు. ఈ ఉపమానం చెప్పి యేసు ఈ విషయాన్ని స్పష్టం చేశాడు: తన తోటి సహోదరుణ్ణి క్షమించని వ్యక్తిని యెహోవా కూడా క్షమించడు. (మత్త. 18:23-35) అవును, కుమారుని నామంలో బాప్తిస్మం పొందాలంటే ఒక వ్యక్తి యేసు అధికారాన్ని గుర్తించి ఆయన మాదిరిని అనుకరించడమేకాక, ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉండడం వంటి యేసు బోధలను అనుసరించడానికి కూడా కృషి చేయాలి.—1 పేతు. 2:21; 1 యోహా. 2:5, 6.

13 మీరు అపరిపూర్ణులు కాబట్టి యేసును పూర్తిగా అనుకరించలేకపోతున్నారు. అయినా, దేవునికి హృదయపూర్వకంగా సమర్పించుకున్నారు కాబట్టి, మీరు సాధ్యమైనంతవరకు యేసును అనుకరించాలనుకుంటారు. మీరలా చేయాలంటే పాత వ్యక్తిత్వాన్ని వదిలేస్తూ కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకుంటూ ఉండాలి. (ఎఫెసీయులు 4:20-24 చదవండి.) ఒక స్నేహితునిపై మీకు గౌరవం ఏర్పడితే మీరు బహుశా ఆయన మాదిరిని అనుసరించాలని, ఆయనలాంటి మంచి లక్షణాలను అలవర్చుకోవాలని ప్రయత్నిస్తారు. అలాగే, క్రీస్తు నుండి నేర్చుకొని ఆయనను అనుకరించాలనుకుంటారు.

14. పరలోక రాజుగా యేసుకున్న అధికారాన్ని మీరు గుర్తిస్తున్నారని ఎలా చూపించవచ్చు?

14 మీరు మరో విధంగా కూడా, కుమారుని నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటో మీకు అర్థమైందని చూపించవచ్చు. దేవుడు “సమస్తమును ఆయన [యేసు] పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను.” (ఎఫె. 1:22) కాబట్టి, యెహోవా సమర్పిత సేవకులను యేసు నడిపిస్తున్న విధానాన్ని మీరు గౌరవించాలి. స్థానిక సంఘాల్లో క్రీస్తు అపరిపూర్ణులైన మానవుల్ని, ముఖ్యంగా నియమిత పెద్దలను ఉపయోగిస్తున్నాడు. ‘పరిశుద్ధులు సంపూర్ణులయ్యేందుకు [“పరిశుద్ధులు సరిదిద్దబడేందుకు,” NW], క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందేందుకు’ అలాంటివారు నియమించబడ్డారు. (ఎఫె. 4:13) ఒకవేళ ఒక అపరిపూర్ణ మానవుడు తప్పు చేసినా, పరలోక రాజ్యానికి రాజైన యేసు తన సమయంలో, తన పద్ధతిలో దాన్ని సరిదిద్దగలడు. మీరు ఆ విషయాన్ని నమ్ముతారా?

15. బాప్తిస్మం తీసుకుంటే మీరు ఎలాంటి ఆశీర్వాదాల కోసం ఎదురుచూడవచ్చు?

15 కొందరు ఇంకా యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం తీసుకోలేదు. మీరు ఆ కోవకు చెందినవారైతే కుమారుణ్ణి గుర్తించడం సముచితమని, అలా చేయడం ద్వారా మీకున్న కృతజ్ఞతను చూపించవచ్చని పైన వివరించబడిన విషయాలనుబట్టి గ్రహించారా? కుమారుని నామంలో బాప్తిస్మం తీసుకుంటే మీరు ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు.—యోహాను 10:9-11 చదవండి.

పరిశుద్ధాత్మ నామంలో

16, 17. పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందడమంటే ఏమిటి?

16 పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందడమంటే ఏమిటి? ముందే చూసినట్లుగా పెంతెకొస్తు రోజున పేతురు ప్రసంగం విన్నవారికి పరిశుద్ధాత్మ గురించి తెలుసు. నిజానికి, దేవుడు తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తున్నాడని నమ్మేందుకు కావాల్సినన్ని రుజువులను వారు కళ్లారా చూశారు. ‘పరిశుద్ధాత్మతో నిండుకొని అన్యభాషలతో మాట్లాడినవారిలో’ పేతురు కూడా ఉన్నాడు. (అపొ. 2:4, 8) ‘నామంలో’ అనే మాట ఒక వ్యక్తి పేరునే సూచించాల్సిన అవసరంలేదు. ఉదాహరణకు, నేడు చాలా పనులు “ప్రభుత్వం పేరిట” జరుగుతున్నాయి. ప్రభుత్వం అనేది ఒక వ్యక్తి కాదు. కానీ, ప్రభుత్వ అధికారంతో చాలా పనులు జరుగుతున్నాయి. అలాగే, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి కాదుగానీ యెహోవా చురుకైన శక్తి అని పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందే వ్యక్తి గ్రహిస్తాడు. ఆయన దేవుని సంకల్పంలో పరిశుద్ధాత్మ పాత్ర ఏమిటో కూడా గుర్తిస్తాడు.

17 మీరు బైబిలు అధ్యయనం చేయడం ద్వారా పరిశుద్ధాత్మ గురించి తెలుసుకున్నారు కదా? ఉదాహరణకు, లేఖనాలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణతోనే రాయబడ్డాయని మీరు అర్థం చేసుకున్నారు. (2 తిమో. 3:16, 17) మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తుండగా ‘పరలోకమందున్న తండ్రి’ మీకే కాక ‘తనను అడిగేవారికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడనే’ వాస్తవాన్ని మీరు మరింత స్ఫష్టంగా అర్థం చేసుకొనివుంటారు. (లూకా 11:13) మీ జీవితంలో పరిశుద్ధాత్మ నడిపింపును మీరు బహుశా చవిచూసివుంటారు. అయితే, మీరు ఇంకా పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోనివారైతే, యేసు ఇచ్చిన హామీ నుండి మీరూ ప్రయోజనం పొందవచ్చు. బాప్తిస్మం తీసుకుంటే మీరు ఆ ఆత్మను పొందుతారు కాబట్టి నిజమైన ఆశీర్వాదాలను సొంతం చేసుకోవచ్చు.

18. పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకునేవారు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుతారు?

18 నేడు కూడా యెహోవా క్రైస్తవ సంఘాన్ని తన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. మన రోజువారీ పనుల్లో కూడా ఆ ఆత్మ మనలో ప్రతీ ఒక్కరికీ సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందాలంటే మన జీవితంలో దాని పాత్ర ఏమిటో గుర్తించి కృతజ్ఞతతో దాని నిర్దేశాన్ని పాటించాలి. యెహోవాకు మనం చేసుకున్న సమర్పణకు తగినట్లు ఎలా జీవించవచ్చు? అలా జీవించడానికి పరిశుద్ధాత్మ ఎలా సహాయం చేస్తుంది? వంటి ప్రశ్నలు కొందరికి రావచ్చు. దాని గురించి మనం తర్వాత చూద్దాం.

[అధస్సూచి]

a తేజరిల్లు! (ఆంగ్లం) అక్టోబరు 22, 1981, 3-8 పేజీలు.

మీకు జ్ఞాపకమున్నాయా?

• మీ విషయంలో తండ్రి నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి?

• కుమారుని నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి?

• తండ్రి నామంలో, కుమారుని నామంలో బాప్తిస్మం తీసుకోవడం ఎంత ప్రాముఖ్యమో మీకు తెలుసని ఎలా చూపించవచ్చు?

• పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవడమంటే ఏమిటి?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రాలు]

సా.శ. 33 పెంతెకొస్తు తర్వాత కొత్త శిష్యులకు తండ్రితో ఎలాంటి సంబంధం ఏర్పడింది?

[క్రెడిట్‌ లైను]

By permission of the Israel Museum, Jerusalem