కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పరిస్థితులు మారినా దేవుని అనుగ్రహాన్ని కాపాడుకోండి

పరిస్థితులు మారినా దేవుని అనుగ్రహాన్ని కాపాడుకోండి

పరిస్థితులు మారినా దేవుని అనుగ్రహాన్ని కాపాడుకోండి

మీ జీవితంలో మార్పులు చోటుచేసుకున్నాయా? మారిన పరిస్థితులకు సర్దుకుపోవడం మీకు కష్టమనిపిస్తోందా? మనలో చాలామందికి అలాంటి పరిస్థితి ఎదురైవుంటుంది లేదా భవిష్యత్తులో ఎదురుకావచ్చు. గతంలో జీవించిన కొంతమంది ఉదాహరణలను పరిశీలిస్తే ఈ విషయంలో మనకు ఎలాంటి లక్షణాలు సహాయం చేస్తాయో తెలుసుకోవచ్చు.

ఉదాహరణకు దావీదు జీవితాన్నే తీసుకోండి. ఆయన జీవితంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సమూయేలు ఆయనను భవిష్యత్తు రాజుగా అభిషేకించినప్పుడు ఆయన, మందల్ని కాసుకునే ఓ బాలుడు మాత్రమే. ఆయన చిన్న వయసులోనే ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతుతో యుద్ధం చేయడానికి ముందుకొచ్చాడు. (1 సమూ. 17:26-32, 42) ఆ తర్వాత సౌలు రాజు ఆస్థానంలో ఉండే అవకాశం యువకుడైన దావీదుకు వచ్చింది, సైన్యాధిపతిగా కూడా నియమించబడ్డాడు. తన జీవితం ఇన్ని మలుపులు తిరుగుతుందని దావీదు అసలు ఊహించివుండడు లేదా తన జీవితంలో తర్వాత ఏమి జరుగుతుందో కూడా ఊహించివుండడు.

కొంతకాలానికి దావీదు, సౌలుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. (1 సమూ. 18:8, 9; 19:9, 10) దావీదు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎన్నో సంవత్సరాలు దేశదిమ్మరిగా తిరగాల్సి వచ్చింది. ఇశ్రాయేలీయుల మీద రాజుగా పరిపాలిస్తున్నప్పుడు, ముఖ్యంగా ఆయన వ్యభిచారానికి పాల్పడి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి హత్య చేయించిన తర్వాత ఆయన జీవితంలో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. పాపాలు చేయడంవల్ల తన సొంత కుటుంబంలోనే ఆయనకెన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఉదాహరణకు, ఆయన కుమారుడైన అబ్షాలోము ఆయనకు ఎదురుతిరిగాడు. (2 సమూ. 12:10-12; 15:1-14) ఇంత జరిగినా, దావీదు తాను చేసిన వ్యభిచారం, హత్య వంటి పాపాల విషయంలో పశ్చాత్తాపపడినప్పుడు యెహోవా ఆయనను క్షమించి అనుగ్రహం చూపించాడు.

మీ పరిస్థితులూ మారవచ్చు. ఆరోగ్య సమస్యలవల్ల, ఆర్థిక ఇబ్బందులవల్ల లేదా కుటుంబ సమస్యలవల్ల, కొన్నిసార్లు మనం చేసే పనుల వల్ల మన జీవితంలో పరిస్థితులు మారవచ్చు. అలాంటి కష్టాలను తట్టుకొని నిలబడాలంటే మనకు ఏ లక్షణాలు అవసరం?

వినయం మనకు సహాయం చేస్తుంది

లోబడే స్వభావమే వినయం. మనకు వినయం ఉంటే నిజాయితీగా మనం ఎలాంటివారమో, ఇతరులు ఎలాంటివారో తెలుసుకోగలుగుతాం. ఇతరుల లక్షణాలను, విజయాలను గుర్తించినప్పుడు వారి వ్యక్తిత్వాన్ని, వారు చేసే పనులను అభినందించగలుగుతాం. అలాగే మనకు వినయం ఉంటే, మన జీవితంలో ఫలాని పరిస్థితి ఎందుకు ఏర్పడిందో, అలాంటి పరిస్థితిలో ఏమి చేయాలో తెలుసుకోగలుగుతాం.

ఈ విషయంలో సౌలు కుమారుడైన యోనాతాను మంచి మాదిరిని ఉంచాడు. తన ప్రమేయం లేకుండా జరిగిన కొన్ని సంఘటనల వల్ల యోనాతాను పరిస్థితులు మారాయి. సమూయేలు సౌలుతో మాట్లాడినప్పుడు యెహోవా సౌలు నుండి రాజ్యాన్ని తీసివేస్తాడని చెప్పాడేకానీ యోనాతాను రాజు అవుతాడని చెప్పలేదు. (1 సమూ. 15:28; 16:1, 12, 13) యెహోవా యోనాతానును కాకుండా, దావీదును ఇశ్రాయేలీయుల తర్వాతి రాజుగా ఎంపిక చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే, సౌలు అవిధేయత వల్ల యోనాతాను రాజు కాలేకపోయాడు. సౌలు చేసిన తప్పుల్లో తన పాత్ర ఏమీ లేకపోయినా, యోనాతాను రాజుగా ఉండే అవకాశాన్ని కోల్పోయాడు. (1 సమూ. 20:30, 31) అలాంటి పరిస్థితిలో యోనాతాను ఎలా ప్రవర్తించాడు? రాజుగా ఉండే అవకాశం చేజారినందుకు యోనాతాను దావీదుపై కోపాన్ని, అసూయను పెంచుకున్నాడా? లేదు. యోనాతాను దావీదుకన్నా వయసులో చాలా పెద్దవాడైనప్పటికీ, అనుభవస్థుడైనప్పటికీ ఆయన దావీదుకు లోబడ్డాడు. (1 సమూ. 23:16-18) ఆయనకు వినయం ఉంది కాబట్టి, దేవుని ఆశీర్వాదం ఎవరిపై ఉందో గ్రహించగలిగాడు. ఆయన ‘తనను తాను ఎంచుకోదగిన దానికంటె ఎక్కువగా’ ఎంచుకోలేదు. (రోమా. 12:3) తన విషయంలో యెహోవా ఉద్దేశం ఏమిటో యోనాతాను గ్రహించి, యెహోవా నిర్ణయాన్ని స్వీకరించాడు.

అయితే, జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకున్నప్పుడు వాటితో సర్దుకుపోవడం కష్టమే. ఒకానొక సమయంలో యోనాతాను తనకు సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులతో తన బంధాన్ని కొనసాగించాల్సి వచ్చింది. భవిష్యత్తు రాజుగా ఉండేందుకు యెహోవా నియమించిన వ్యక్తీ, తన స్నేహితుడూ అయిన దావీదుతో ఒకవైపు స్నేహం కొనసాగించాల్సి వచ్చింది. అదేసమయంలో, యెహోవా చేత తిరస్కరించబడి అప్పటికింకా తన పరిపాలనను సాగిస్తున్న ఆయన తండ్రియైన సౌలుతో తన బంధాన్ని కొనసాగించాల్సి వచ్చింది. ఈ పరిస్థితినిబట్టి యోనాతాను ఎంతో మానసిక ఒత్తిడికి గురైవుంటాడు. అయితే ఆయన దేవుని అనుగ్రహాన్ని పొందడానికే ప్రయత్నించాడు. జీవితంలో వచ్చే మార్పులనుబట్టి మనం కూడా భయాందోళనలకు గురికావచ్చు. కానీ, వాటి విషయంలో యెహోవా ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఆ మార్పులకు సర్దుకుపోతూ ఆయనను నమ్మకంగా సేవించగలుగుతాం.

అణకువ అవసరం

ఒక వ్యక్తి తన పరిమితుల్ని గుర్తుంచుకొని ప్రవర్తించడమే అణకువ. అయితే వినయానికి, అణకువకు తేడా ఉంది. ఒక వ్యక్తి వినయస్థుడైనప్పటికీ తన పరిమితులేమిటో పూర్తిగా అర్థం చేసుకొని ప్రవర్తించకపోవచ్చు.

దావీదు తన జీవితంలో అణకువ చూపించాడు. యెహోవా ఆయనను రాజుగా ఎంపిక చేసినప్పటికీ ఆయన చాలా సంవత్సరాలపాటు రాజ్యాధికారాన్ని చేపట్టలేకపోయాడు. దానికిగల కారణాన్ని యెహోవా దావీదుకు వివరించాడని బైబిలు ఏమీ చెప్పట్లేదు. ఆ పరిస్థితి నిరాశ కలిగించేదిగా ఉన్నప్పటికీ ఆయన ఆందోళనపడలేదు. దావీదు తన పరిమితులేమిటో తెలుసుకొని యెహోవాయే ఆ పరిస్థితుల్ని అనుమతిస్తున్నాడని, ఆయనే వాటిని చక్కదిద్దుతాడని అర్థం చేసుకున్నాడు. అందుకే, ఆయన సౌలును చంపి తన ప్రాణాల్ని రక్షించుకోవాలనుకోలేదు. అంతేకాదు, తన స్నేహితుడైన అబీషై సౌలును చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆయన ఆ ప్రయత్నాన్ని ఆపాడు.—1 సమూ. 26:6-9.

కొన్నిసార్లు సంఘంలో కూడా ఫలాని పరిస్థితి ఎందుకు ఏర్పడిందో మనకు అర్థం కాకపోవచ్చు. లేదా బాధ్యతగల సహోదరులు దాన్ని సరైన పద్ధతిలో చక్కదిద్దట్లేదని మనకు అనిపించవచ్చు. అలాంటప్పుడు మనం యేసే సంఘానికి శిరస్సనీ, సంఘంలో నాయకత్వం వహించడానికి నియమించబడిన పెద్దల ద్వారా ఆయన సంఘాన్ని నడిపిస్తున్నాడనీ అణకువతో గుర్తిస్తామా? మనకు యెహోవా అనుగ్రహం ఉండాలంటే యేసుక్రీస్తు ద్వారా సంఘానికి ఆయనిచ్చే నడిపింపు కోసం వేచివుండాలని గుర్తించి అణకువ చూపిస్తామా? ‘అణకువ’ చూపించడం కష్టమైనాసరే మనం దాన్ని చూపిస్తామా?—సామె. 11:2, NW.

సాత్వికం ఉంటే సానుకూలంగా ఆలోచించగలుగుతాం

మృదుస్వభావమే సాత్వికం. విసుకు, కోపం, కక్షకట్టడం వంటివి చూపించకుండా జరిగిన హానిని సహించడానికి సాత్వికం సహాయం చేస్తుంది. సాత్వికాన్ని అలవర్చుకోవడం అంత సులభమేమీ కాదు. అయితే మనం ఆ లక్షణాన్ని అలవర్చుకోవడానికి కృషి చేయాలి. ఆసక్తికరంగా, ‘సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకుంటారు’ అని ఓ బైబిలు లేఖనం చెబుతోంది. (మత్త. 5:5) సాత్వికానికి, వినయానికి, అణకువకు మధ్య సంబంధం ఉంది. సాత్వికం ఉంటే మంచితనాన్ని, మృదుస్వభావాన్ని కూడా చూపిస్తాం. సాత్వికుడైన వ్యక్తి శిక్షణను అంగీకరించి కావాల్సిన మార్పులు చేసుకునేందుకు సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తాడు.

సాత్వికం ఉంటే జీవితంలో వచ్చే కొత్త మార్పులకు ఎలా సర్దుకుపోగలుగుతాం? చాలామంది జీవితంలో వచ్చే మార్పులను ఇష్టపడరనే విషయాన్ని మీరు గమనించేవుంటారు. నిజానికి, ఆ మార్పులవల్ల యెహోవాచేత మరింత శిక్షణ పొందే అవకాశం మనకు లభిస్తుంది. మోషే జీవితమే దానికి ఓ ఉదాహరణ.

నలభై ఏళ్లు నిండేనాటికే మోషే ఎన్నో మంచి లక్షణాలను అలవర్చుకున్నాడు. ఆయన దేవుని ప్రజల అవసరాన్ని గుర్తించగలిగాడు, స్వయంత్యాగ స్వభావాన్ని చూపించగలిగాడు. (హెబ్రీ. 11:24-26) అయితే, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించడానికి యెహోవా ఆయనను నియమించే ముందు ఆయన మరింత సాత్వికుడయ్యేలా దోహదపడిన ఎన్నో మార్పులు ఆయన జీవితంలో చోటుచేసుకున్నాయి. ఆయన ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను దేశంలో 40 ఏళ్లు ఓ అనామకునిగా, గొర్రెలకాపరిగా జీవించాల్సి వచ్చింది. దాని ఫలితమేమిటి? ఆయన మరింత మంచి వ్యక్తిగా మారాడు. (సంఖ్యా. 12:3) ఆయన తన ఇష్టాలకన్నా యెహోవా చిత్తానికే ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం నేర్చుకున్నాడు.

మోషే ఎంత సాత్వికుడో తెలుసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. అవిధేయులైన ఇశ్రాయేలు జనాంగాన్ని తిరస్కరించి ఆయన సంతానంలోనివారిని గొప్ప జనాంగంగా చేస్తానని యెహోవా మోషేకు చెప్పినప్పుడు ఏమి జరిగింది? (సంఖ్యా. 14:11-20) ఇశ్రాయేలీయుల్ని క్షమించమని మోషే యెహోవాను వేడుకున్నాడు. తన ఇష్టాలు కాదుగానీ యెహోవా నామం ఘనపర్చబడడం, తన సహోదరుల సంక్షేమం ఇవే తనకు ముఖ్యమని ఆయన మాటలనుబట్టి తెలుస్తోంది. జనాంగానికి నాయకునిగా, మధ్యవర్తిగా ఉండడానికి ఒక సాత్వికుడైన వ్యక్తి కావాలి. మిర్యాము, అహరోనులు మోషే మీద సణిగారు. అయినా, మోషే గురించి బైబిలు ఇలా చెబుతోంది: “మోషే భూమిమీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.” (సంఖ్యా. 12:1-3, 9-15) మోషే సాత్వికంతో తనకు జరిగిన అవమానాల్ని భరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ మోషే సాత్వికుడు కాకపోయుంటే పరిస్థితులు ఎలా ఉండేవి?

మరో సందర్భంలో, యెహోవా తన ఆత్మను కొంతమంది పురుషులమీద కుమ్మరించినప్పుడు వారు ప్రవచించడం మొదలుపెట్టారు. వారు తప్పు చేస్తున్నారని మోషే సహాయకుడైన యెహోషువ అనుకున్నాడు. కానీ మోషే మాత్రం సాత్వికం కనబరుస్తూ యెహోవాలా ఆలోచించాడు. అంతేకాదు, తన అధికారం ఎక్కడ పోతుందోనని భయపడలేదు. (సంఖ్యా. 11:26-29) మోషే సాత్వికుడు కాకపోయుంటే యెహోవా ఏర్పాటులో జరిగిన ఈ మార్పును అంగీకరించి ఉండేవాడా?

ఆయనకు సాత్వికం ఉండడంవల్లే యెహోవా తనకిచ్చిన గొప్ప అధికారాన్ని, పాత్రను సరిగ్గా నిర్వర్తించగలిగాడు. ప్రజల ప్రతినిధిగా హోరేబు పర్వతం మీదికి వెళ్లమని యెహోవా మోషేకు నిర్దేశించాడు. యెహోవా ఒక దూత ద్వారా మోషేతో మాట్లాడి ఆయనను తన నిబంధనకు మధ్యవర్తిగా నియమించాడు. ఆయనకు సాత్వికం ఉంది కాబట్టే అధికారానికి సంబంధించి ఆయన జీవితంలో వచ్చిన గొప్ప మార్పును అంగీకరించగలిగాడు, అదే సమయంలో యెహోవా అనుగ్రహాన్ని కాపాడుకోగలిగాడు.

మరి మన విషయమేమిటి? ఆధ్యాత్మిక పరిణతి సాధించడానికి సాత్వికం ఎంతో అవసరం. దేవుని ప్రజల్లో సేవాధిక్యతల్ని, అధికారాన్ని కలిగివున్నవారు సాత్వికులుగా ఉండాలి. సాత్వికం ఉంటే మన జీవితంలో మార్పులు చోటుచేసుకున్నప్పుడు గర్వాన్ని చూపించకుండా సరైన విధంగా ప్రవర్తించగలుగుతాం. ఆ సందర్భంలో మనమెలా ప్రవర్తిస్తామన్నదే ప్రాముఖ్యం. ఆ మార్పులను మనం అంగీకరిస్తామా? మరింత పరిణతి సాధించేందుకు లభించిన అవకాశాలుగా వాటిని పరిగణిస్తామా? ఆ మార్పులు సాత్వికాన్ని అలవర్చుకోవడానికి లభించిన సువర్ణావకాశాలు కావచ్చు!

మన జీవితంలో మార్పులు రావడం సహజం. కొన్నిసార్లు అలాంటి మార్పులు ఎందుకు చోటుచేసుకున్నాయో మనకు అర్థం కాకపోవచ్చు. మన పరిమితులవల్ల, మానసిక ఒత్తిడి వల్ల మనం కొన్నిసార్లు యెహోవాలా ఆలోచించలేకపోవచ్చు. అయినా వినయం, అణకువ, సాత్వికం వంటి లక్షణాలు ఉన్నట్లయితే జీవితంలో చోటుచేసుకునే మార్పులను అంగీకరిస్తాం, దేవుని అనుగ్రహాన్ని కాపాడుకోగలుగుతాం.

[4వ పేజీలోని బ్లర్బ్‌]

మనలో వినయముంటే నిజాయితీగా మనం ఎలాంటివారమో తెలుసుకోగలుగుతాం

[5వ పేజీలోని బ్లర్బ్‌]

ఆధ్యాత్మిక పరిణతి సాధించడానికి సాత్వికం ఎంతో అవసరం

[5వ పేజీలోని చిత్రం]

తాను మరింత సాత్వికుడయ్యేలా దోహదపడిన సవాళ్లను మోషే ఎదుర్కొన్నాడు