కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్కు ‘పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైనవాడు’

మార్కు ‘పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైనవాడు’

మార్కు ‘పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైనవాడు’

అంతియొకయ సంఘంలో కొన్ని సమస్యలున్నా అపొస్తలుడైన పౌలు, బర్నబాల మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు మాత్రం భిన్నమైనవి. వారు మిషనరీ యాత్ర గురించి ప్రణాళిక వేసుకుంటున్నప్పుడు తమతోపాటు ఎవరిని తీసుకువెళ్లాలనే విషయంలో వారి మధ్య “తీవ్రమైన వాదము” తలెత్తింది. (అపొ. 15:39) వారు మూడవ మిషనరీయైన మార్కు గురించి వాదులాడుకున్నారు. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయి, వేర్వేరు మార్గాల్లో వెళ్లారు.

అసలు మార్కు ఎవరు? ఆయన విషయంలో ఆ ఇద్దరు అపొస్తలులు ఎందుకు వాదులాడుకున్నారు? ఆ సమయంలో వారు తమ అభిప్రాయాల్ని మార్చుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదు? ఆ తర్వాత, వారెప్పుడైనా తమ అభిప్రాయాల్ని మార్చుకున్నారా? మార్కు కథ నుండి మీరేమి నేర్చుకోవచ్చు?

యెరూషలేములోని తన ఇంట్లో

మార్కు యెరూషలేములోని ఓ సంపన్న యూదా కుటుంబంలో పుట్టిపెరిగాడు. మొదటి శతాబ్దపు క్రైస్తవుల చరిత్ర చదువుతున్నప్పుడు ఆయన పేరును వింటాం. దాదాపు సా.శ. 44లో, హేరోదు అగ్రిప్ప I చెరసాల నుండి అపొస్తలుడైన పేతురును యెహోవా దూత అద్భుత రీతిలో విడిపించినప్పుడు, ఆయన “మార్కు అను మారుపేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థనచేయుచుండిరి.”—అపొ. 12:1-12. a

యెరూషలేము సంఘం కూటాలు జరుపుకోవడానికి మార్కు వాళ్ల అమ్మ ఇంటిని ఉపయోగించినట్లు తెలుస్తోంది. “అనేకులు” అక్కడ సమకూడారంటే వాళ్ల ఇల్లు పెద్దదేనని తెలుస్తుంది. మరియకు రొదే అనే పనిపిల్ల ఉండేది, పేతురు “తలవాకిటి తలుపు” తట్టినప్పుడు ఆ అమ్మాయే తలుపు తీయడానికి వెళ్లింది. వీటన్నిటినిబట్టి మరియ సంపన్నురాలు అని తెలుస్తుంది. కూటం జరుపుకున్న ఆ ఇల్లు ఆమె భర్త ఇల్లని చెప్పబడలేదు గానీ ఆమె ఇంటిగా చెప్పబడింది కాబట్టి ఆమె విధవరాలైవుంటుంది, మార్కు అప్పటికి ఇంకా చిన్నవాడైవుంటాడు.—అపొ. 12:13.

ప్రార్థించడానికి అక్కడ సమకూడినవారిలో మార్కు కూడా ఉండివుంటాడు. యేసు పరిచర్యను కళ్లారా చూసిన ఆయన శిష్యులతో, ఇతరులతో మార్కుకు బాగా పరిచయం ఉండివుంటుంది. యేసును బంధించినప్పుడు ఆయనను అనుకరించడానికి ప్రయత్నించి, ఆ తర్వాత తనను పట్టుకోవడానికి వచ్చినప్పుడు తన నారబట్టలు విడిచి పారిపోయిన పడుచువాడు మార్కే అయ్యుంటాడు.—మార్కు 14:51, 52.

సంఘంలో బాధ్యతలు

పరిణతిగల క్రైస్తవులతో సహవసించడం వల్ల మార్కుకు ఎంతో మంచి జరిగింది. ఆయన ఆధ్యాత్మికంగా పరిణతి సాధించి, బాధ్యతగల సహోదరుల దృష్టిలో పడ్డాడు. దాదాపు సా.శ. 46లో కరువు బాధితులైన సహోదరులకు ఉపశమనం కలిగించేలా పౌలు, బర్నబాలు ‘సహాయం చేయడానికి’ అంతియొకయ నుండి యెరూషలేముకు వెళ్లినప్పుడు వారు మార్కు పట్ల శ్రద్ధ చూపించారు. వారు తమ తిరుగు ప్రయాణంలో తమతోపాటు మార్కును అంతియొకయకు తీసుకెళ్లారు.—అపొ. 11:27-30; 12:25.

కేవలం పైపైన చదివే పాఠకుడు ఆ ముగ్గురూ కేవలం ఆధ్యాత్మిక సహోదరులని, అంతకుమించి వారి మధ్య సంబంధమేమీ లేదని, మార్కుకు ఉన్న సామర్థ్యాలనుబట్టే వారు ఆయనను నియమించివుంటారని అనుకోవచ్చు. అయితే, పౌలు తాను రాసిన ఒకానొక పత్రికలో మార్కు బర్నబాకు బంధువు అని తెలియజేశాడు. (కొలొ. 4:10) ఈ విషయాన్ని మనసులో ఉంచుకుంటే ఆ తర్వాత మార్కు విషయంలో జరిగిన కొన్ని సంఘటనల్ని అర్థం చేసుకోగలుగుతాం.

దాదాపు ఒక సంవత్సరం గడిచింది. మిషనరీ యాత్ర ప్రారంభించమని పరిశుద్ధాత్మ పౌలు బర్నబాలను నిర్దేశించింది. వారు అంతియొకయ నుండి కుప్రకు బయలుదేరారు. ‘ఉపచారం చేయువానిగా’ మార్కు అనే మారుపేరుగల యోహాను వారి వెంట వెళ్లాడు. (అపొ. 13:2-5) అపొస్తలులు పూర్తిగా ఆధ్యాత్మిక విషయాలకు అంకితమయ్యేలా బహుశా మార్కు వారికి ఆ యాత్రలో అవసరమైన సహాయం చేసివుంటాడు.

పౌలు, బర్నబా, మార్కులు కుప్ర మీదుగా వెళ్తూ ఆ మార్గంలోవున్న ప్రాంతాల్లో ప్రకటించారు. ఆ తర్వాత వారు ఆసియా మైనరుకు వెళ్లారు. అక్కడ మార్కు అనే మారుపేరుగల యోహాను పౌలుకు కోపం తెప్పించిన నిర్ణయం తీసుకున్నాడు. వారు పెర్గేకు వచ్చినప్పుడు, “యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను” అని బైబిలు చెబుతోంది. (అపొ. 13:13) ఆయన ఎందుకు అలా చేశాడో బైబిలు చెప్పడంలేదు.

దాదాపు రెండేళ్ల తర్వాత పౌలు, బర్నబా, మార్కులు మళ్లీ అంతియొకయలో కలుసుకుంటారు. తాము స్థాపించిన సంఘాలను బలపర్చేందుకు చేయాల్సిన రెండవ మిషనరీ యాత్ర గురించి పౌలు, బర్నబాలు చర్చించుకుంటున్నారు. బర్నబా తమ వెంట తన బంధువైన మార్కును తీసుకువెళ్లాలనుకున్నాడు. అంతకుముందు మార్కు తమను విడిచివెళ్లాడు కాబట్టి ఆయనను తీసుకువెళ్లడం పౌలుకు అస్సలు ఇష్టం లేదు. ఆర్టికల్‌ ప్రారంభంలో ప్రస్తావించబడిన సన్నివేశం అప్పుడే జరిగింది. బర్నబా మార్కును వెంటబెట్టుకొని తన స్వస్థలమైన కుప్రకు వెళ్తే, పౌలు సిరియకు వెళ్లాడు. (అపొ. 15:36-41) మార్కు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పౌలు, బర్నబాలు వేర్వేరు కోణాల్లో చూశారు.

రాజీపడడం

పై సంఘటననుబట్టి మార్కు ఎంతో బాధపడివుంటాడు. అయినా, ఆయన నమ్మకమైన ప్రచారకునిగా కొనసాగాడు. ఆ సంఘటన జరిగి దాదాపు 11, 12 ఏళ్లు గడిచిన తర్వాత తొలి క్రైస్తవుల చరిత్రలో మార్కు పేరు మళ్లీ కనిపిస్తుంది. ఎక్కడ? మీరు అసలు ఊహించని వ్యక్తితో అంటే పౌలుతో ఆయన పేరు కనిపిస్తుంది!

సా.శ. 60-61 మధ్యకాలంలో పౌలు రోములో ఖైదీగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో పత్రికలను సంఘాలకు రాశాడు. అవి ఇప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో భాగంగా ఉన్నాయి. ఆయన కొలస్సయులకు రాసిన పత్రికలో ఇలా అన్నాడు: “నాతోకూడ చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీపజ్ఞాతియైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ మార్కునుగూర్చి మీరు ఆజ్ఞలు పొందితిరి, ఇతడు మీయొద్దకు వచ్చినయెడల ఇతని చేర్చుకొనుడి . . . వీరుమాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై యున్నారు, వీరివలన నాకు ఆదరణ కలిగెను.”—కొలొ. 4:10, 11.

ఎంత మార్పు! ఒకప్పుడు మార్కును ఇష్టపడని పౌలు ఆ తర్వాత ఆయనను ఎంతో విలువైన సహవాసిగా పరిగణించాడు. అందుకే, మార్కు వారిని సందర్శించే అవకాశం ఉందని పౌలు కొలస్సయులకు తెలియజేశాడు. అదే జరిగివుంటే, ఆ సందర్భంలో మార్కు పౌలు ప్రతినిధిగా పనిచేసివుంటాడు.

కొన్నేళ్ల క్రితం పౌలు మార్కును అతిగా విమర్శించాడా? మార్కు తనకు లభించిన క్రమశిక్షణ నుండి ప్రయోజనం పొందాడా? లేదా పై రెండూ జరిగాయా? ఏదేమైనా పౌలు, మార్కులు రాజీపడడం వారి పరిణతిని చూపిస్తుంది. వారు గతాన్ని మరచిపోయి, కలిసి పనిచేశారు. తోటి క్రైస్తవునితో భేదాభిప్రాయాలు ఏర్పడినప్పుడు పాటించేందుకు అది ఎంత చక్కని మాదిరి!

ప్రయాణికుడైన మార్కు

మార్కు చేసిన వివిధ యాత్రల గురించి చదువుతున్నప్పుడు, ఆయన ఎన్నో దూరాలు ప్రయాణించాడని మీకు అర్థమౌతుంది. ఆయన యెరూషలేము నుండి అంతియొకయకు వెళ్లాడు, అక్కడి నుండి ఓడలో కుప్రకు, పెర్గేకు వెళ్లాడు. పెర్గే నుండి రోముకు వెళ్లాడు. పౌలు ఆయనను రోము నుండి కొలొస్సయి పట్టణానికి పంపించాలనుకున్నాడు. మార్కు ప్రయాణం అంతటితో ఆగిపోలేదు!

అపొస్తలుడైన పేతురు తన మొదటి పత్రికను దాదాపు సా.శ. 62-64 మధ్యకాలంలో రాశాడు. ఆయన తన పత్రికలో ఇలా అన్నాడు: ‘బబులోనులో ఉన్న ఆమె, నా కుమారుడైన మార్కు, మీకు వందనములు చెప్పుచున్నారు.’ (1 పేతు. 5:13) ఎన్నో ఏళ్ల క్రితం తమ ఇంట్లో జరిగిన కూటాలకు హాజరైన అపొస్తలునితో కలిసి సేవచేయడానికి మార్కు బబులోనుకు వెళ్లాడని దీన్నిబట్టి అర్థమౌతుంది.

దాదాపు సా.శ. 65లో, పౌలు రోములో రెండవసారి చెరసాలలో వేయబడినప్పుడు, తిమోతిని ఎఫెసు నుండి పిలిపించడానికి పత్రిక రాశాడు. ఆ పత్రికలో “మార్కును వెంటబెట్టుకొని రమ్ము” అని ఆయన కోరాడు. (2 తిమో. 4:11) దీన్నిబట్టి, మార్కు అప్పుడు ఎఫెసులో ఉన్నాడని అర్థమౌతోంది. పౌలు కోరినట్లే మార్కు తిమోతితో కలిసి రోముకు వచ్చివుంటాడు. అందులో అనుమానం లేదు. ఆ కాలంలో ప్రయాణాలు చేయడం అంత సులభమేమీ కాదు. అయితే ఆ ప్రయాణాలను మార్కు ఇష్టపూర్వకంగా చేశాడు.

మరో గొప్ప సేవాధిక్యత

యెహోవా ప్రేరణతో సువార్త పుస్తకాల్లో ఒకదాన్ని రాసే గొప్ప అవకాశం కూడా మార్కుకు లభించింది. రెండవ సువార్త పుస్తకంలో, దాన్ని రాసిన వ్యక్తి పేరు లేకపోయినా, ప్రాచీన నమ్మకాల ప్రకారం మార్కు దాన్ని రాశాడు. ఆయన ఆ పుస్తకంలోని సమాచారాన్ని పేతురు నుండి పొందాడు. నిజానికి, పేతురు కళ్లారా చూసినవన్నీ మార్కు రాశాడు.

అన్యులైన పాఠకుల కోసం మార్కు ఈ సువార్తను రాశాడని దాని విశ్లేషకులు నమ్ముతున్నారు. ఆయన ఈ సువార్తలో యూదుల ఆచారాల గురించి చక్కగా వివరించాడు. (మార్కు 7:3; 14:12; 15:42) యూదులుకాని వారికి అర్థమయ్యే అవకాశంలేని అరామిక్‌ పదాలను మార్కు అనువదించాడు. (మార్కు 3:17; 5:41; 7:11, 12, 34; 15:22, 34) ఆయన ఎన్నో లాటిన్‌ పదాలను ఉపయోగించాడు. ఆయన లాటిన్‌ పదాలను ఉపయోగిస్తూ వాడుక గ్రీకు భాషా పదాలను కూడా వివరించాడు. ఆయన యూదుల నాణేల విలువను రోమీయుల డబ్బుల లెక్కలో చెప్పాడు. (మార్కు 12:42) b మార్కు రోములో ఈ సువార్త పుస్తకాన్ని రాశాడని ఎంతో కాలంగా ప్రజలు నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని పైన చెప్పబడిన విషయాలు బలపరుస్తున్నాయి.

“పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు”

రోములో ఉన్నప్పుడు మార్కు కేవలం సువార్త పుస్తకం మాత్రమే రాయలేదు. “మార్కును వెంటబెట్టుకొని రమ్ము” అని పౌలు తిమోతితో అన్న మాటలు గుర్తుచేసుకోండి. పౌలు ఎందుకు అలా కోరాడు? “అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు” అని పౌలు అన్నాడు.—2 తిమో. 4:11.

బైబిల్లో ఇదే మార్కు గురించిన చివరి ప్రస్తావన. అయినా ఇది ఆయన గురించి ఎంతో చెబుతోంది. ఆయన క్రైస్తవ సంఘంలో అపొస్తలునిగా, నాయకునిగా లేదా ప్రవక్తగా పనిచేశాడని బైబిల్లో ఎక్కడా చెప్పబడలేదు. ఆయన పరిచారకునిగా పనిచేశాడు, అంటే ఇతరులకు సేవచేశాడు. తన మరణానికి కొంతకాలం ముందు తనకు మార్కు చేసిన సహాయం నుండి అపొస్తలుడైన పౌలు తప్పక ప్రయోజనం పొందివుంటాడు.

మార్కు గురించి బైబిల్లో ఉన్న సమాచారాన్ని ఒక దగ్గరకు చేరిస్తే, ఆయన ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఎంతో ఉత్సాహంగా సువార్త ప్రకటించాడని, ఆయన ఇతరులకు సేవచేయడానికి ఎంతో ఇష్టపడ్డాడని అర్థమౌతుంది. ఆయన పట్టుదలతో పరిచర్య కొనసాగించినందుకు ఎన్నో ఆశీర్వాదాలను, సేవాధిక్యతలను అనుభవించాడు!

నేడు దేవుని సేవకులముగా మనం రాజ్య సువార్త ప్రకటించే విషయంలో మార్కులాంటి కృతనిశ్చయాన్ని చూపిస్తాం. మార్కులాగే కొందరు సువార్త ప్రకటించడానికి వేరే ప్రాంతాలకు, కొన్నిసార్లు వేరే దేశాలకు వెళ్లగలుగుతున్నారు. అలా చేయడం మనందరికీ సాధ్యంకాకపోయినా, మరో ప్రాముఖ్యమైన విధంగా మనందరం మార్కును అనుకరించవచ్చు. మార్కు ఏ విధంగానైతే తన తోటి సహోదరులకు సహాయం చేయడానికి అసాధారణమైన రీతిలో కృషిచేశాడో, అదే విధంగా మనం, మన తోటి సహోదరులు దేవుని సేవలో కొనసాగేలా వారికి అవసరమైన సహాయం చేసేందుకు కృషిచేయడానికి ఇష్టపడతాం. మనం అలా చేస్తుండగా, యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.—సామె. 3:27; 10:22; గల. 6:2.

[అధస్సూచీలు]

a మార్కు సమకాలీనులు హెబ్రీ లేదా మరో భాషలో, తమ పేరుకు మరో పేరును జతచేసేవారు లేదా స్వీకరించేవారు. మార్కుకున్న యూదా పేరు యోహానన్‌, మన భాషలో యోహాను. లాటిన్‌లో ఆయన ఇంటిపేరు మార్కస్‌ లేదా మార్కు.—అపొ. 12:25.

b ఇవి నాడు చెలామణిలోవున్న ‘లెప్టాన్‌’ అనే గ్రీకు నాణేలు. ఇవే కనిష్ఠ విలువ ఉన్న నాణేలు.—అధ్యయన బైబిల్‌, రెఫరెన్సు.

[8వ పేజీలోని మ్యాపు/చిత్రం]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

మార్కు సందర్శించిన కొన్ని పట్టణాలు

రోము

ఎఫెసు

కొలొస్సయి

పెర్గే

(సిరియలోని) అంతియొకయ

కుప్ర

మధ్యధరా సముద్రం

యెరూషలేము

బబులోను