కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసుక్రీస్తు ఆయన సందేశం మీకెందుకు ప్రాముఖ్యం?

యేసుక్రీస్తు ఆయన సందేశం మీకెందుకు ప్రాముఖ్యం?

యేసుక్రీస్తు ఆయన సందేశం మీకెందుకు ప్రాముఖ్యం?

‘వారికి జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను.’—యోహాను 10:10.

యేసుక్రీస్తు భూమ్మీదకు వచ్చింది ఇవ్వడానికే గానీ తీసుకోవడానికి కాదు. ఆయన తన ప్రకటనా పని ద్వారా మానవజాతికి ఒక అమూల్యమైన బహుమతి ఇచ్చాడు. అదే, దేవుని గురించి, ఆయన చిత్తం గురించి సత్యాన్ని తెలియజేసే సందేశం. లక్షలాదిమంది నిజక్రైస్తవులు నిరూపిస్తున్నట్లు, ఆ సందేశాన్ని విని దాని ప్రకారం నడుచుకునేవారు ఇప్పుడు మెరుగైన జీవితాన్ని గడపవచ్చు. a యేసు అన్నిటికన్నా అమూల్యమైన బహుమతి గురించి అంటే, ఆయన తన పరిపూర్ణ జీవితాన్ని మన కోసం బలిగా అర్పించడం గురించి ఎక్కువగా ప్రకటించాడు. ఆయన సందేశంలోని అన్నిటికన్నా ముఖ్యమైన ఈ విషయాన్ని తెలుసుకుని దానికి స్పందించే దాన్నిబట్టే మన శాశ్వత సంక్షేమం ఉంటుంది.

దేవుడు, క్రీస్తు ఏమిచ్చారు? తాను తన శత్రువుల చేతుల్లో బాధ అనుభవిస్తూ చనిపోవాల్సివస్తుందని యేసుకు ముందే తెలుసు. (మత్తయి 20:17-19) అయినా, ‘దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానిమీద విశ్వాసం ఉంచే ప్రతీవాడు నశింపక నిత్యజీవం పొందేలా ఆయనను అనుగ్రహించాడు’ అని ఆయన అన్నాడు. యోహాను 3:16లో ఉన్న ఈ మాటలు చాలామందికి సుపరిచితమే. ‘అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి’ తాను వచ్చినట్లు కూడా యేసు చెప్పాడు. (మత్తయి 20:28) తన ప్రాణాన్ని వేరెవరో తీస్తారన్నట్లు కాకుండా తానే బలి అర్పణగా ఇవ్వబోతున్నట్లు ఆయన ఎందుకు చెప్పాడు?

సాటిలేని ప్రేమతో దేవుడు పాపం నుండి, దానివల్ల వచ్చిన అపరిపూర్ణతా మరణాల నుండి మానవులను విడిపించడానికి ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ఏమిటంటే, తన అద్వితీయ కుమారుడు ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించడానికి దేవుడు ఆయనను భూమ్మీదకు పంపించాడు. యేసు మన కోసం తన పరిపూర్ణ మానవ జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపూర్వకంగా ముందుకొచ్చాడు. ఈ ఏర్పాటునే బైబిలు విమోచన క్రయధనం చెల్లించడమని అంటోంది. ఇది దేవుడు మానవజాతికి ఇచ్చినవాటిలో అన్నిటికన్నా గొప్ప బహుమతి. b ఆ బహుమతి ద్వారా మనం నిరంతర జీవితం పొందే అవకాశం ఉంది.

మీరేమి చేయాలి? విమోచన క్రయధనం అనే బహుమతిని మీరూ పొందవచ్చా? అది మీమీదే ఆధారపడివుంది. ఉదాహరణకు, ఎవరైనా మీకు ఒక చక్కని బహుమతి అందిస్తున్నారనుకుందాం. మీరు చేయి చాపి దాన్ని తీసుకునేంతవరకు అది మీది కాదు. అలాగే యెహోవా మీ కోసం విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. అయితే మీరు ముందుకొచ్చి ఈ బహుమానం తీసుకునేంతవరకు అది మీది కాదు. అయితే మీరు దాన్ని ఎలా తీసుకోవచ్చు?

యేసు, తనమీద ‘విశ్వాసముంచేవాళ్లు’ నిరంతర జీవితాన్ని పొందుతారని చెప్పాడు. మీకు విశ్వాసముంటే అది మీరు జీవించే తీరులో కనిపిస్తుంది. (యాకోబు 2:26) యేసు మీద విశ్వాసం ఉంటే మీరాయన చెప్పినట్లు, ఆయన చేసినట్లు చేస్తారు. అలా చేయాలంటే యేసు గురించి, ఆయన తండ్రి గురించి బాగా తెలుసుకోవాలి. ‘ఏకైక సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే శాశ్వత జీవం’ అని యేసు చెప్పాడు.—యోహాను 17:3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

దాదాపు 2,000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రకటించిన ఒక సందేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది జీవితాలను మార్చివేసింది. ఆ సందేశం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సందేశం నుండి మీరు, మీకు ఇష్టమైన వాళ్లు ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఎలా ప్రయోజనం పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ విషయంలో యెహోవాసాక్షులు మీకు సంతోషంగా సహాయం చేస్తారు.

మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చివేయగల సందేశాన్ని ప్రకటించిన యేసుక్రీస్తు గురించి తర్వాతి పేజీల్లో మీరు ఇంకా ఎక్కువ తెలుసుకుంటారు. (w10-E 04/01)

[అధస్సూచీలు]

a క్రైస్తవులమని చెప్పుకునే ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా క్రీస్తును అనుకరించే వారేమీ కాదు. దేవుని గురించి, ఆయన చిత్తం గురించి యేసు బోధించిన సత్యాల ప్రకారం జీవించేవారే యేసు నిజమైన అనుచరులు.—మత్తయి 7:21-23.

b విమోచన క్రయధనం గురించి బైబిలు ఏమి చెబుతోందో ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని “విమోచన క్రయధనం—దేవుడిచ్చిన అతిగొప్ప బహుమానం” అనే 5వ అధ్యాయాన్ని చూడండి.