కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కల్పితాలు-వాస్తవాలు యేసు గురించిన సత్యం

కల్పితాలు-వాస్తవాలు యేసు గురించిన సత్యం

కల్పితాలు-వాస్తవాలు యేసు గురించిన సత్యం

ఈ నమ్మకాలు కల్పితాలా, వాస్తవాలా? మీరేమనుకుంటున్నారు?

యేసు డిసెంబరు 25న పుట్టాడు.

యేసు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు ఆయన్ను చూడ్డానికెళ్లారు.

యేసు తల్లిదండ్రులకు ఆయనొక్కడే సంతానం.

యేసు మనిషిరూపంలో వచ్చిన దేవుడు.

యేసు కేవలం మంచి మనిషి మాత్రమే కాదు.

ఆ నమ్మకాలన్నీ నిజాలేనని చాలామంది అంటారు. ఇతరులు అవి నిజాలో కాదో చెప్పడం కష్టమని, చివరికి అసాధ్యమని అంటారు. బహుశా వాళ్లు యేసును నమ్మినంతకాలం అవి నిజమో కాదో తేల్చుకోవడం అంత ముఖ్యం కాదనుకుంటారు.

అయితే బైబిలు మరోలా చెబుతుంది. ‘యేసుక్రీస్తు గురించిన జ్ఞానం’ సంపాదించుకోవాలని అంటే ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలని ప్రోత్సహిస్తోంది. (2 పేతురు 1:8) సువార్తలను అధ్యయనం చేసి మనం ఆయన గురించి తెలుసుకోవచ్చు. అవి యేసు గురించిన సత్యాన్ని చెబుతాయి. దానివల్ల ఏది కల్పితమో, ఏది వాస్తవమో తెలుస్తుంది. అందుకే పైన చెప్పుకున్న నమ్మకాల గురించి సువార్తలు ఏమంటున్నాయో తెలుసుకుందాం.

నమ్మకం: యేసు డిసెంబరు 25న పుట్టాడు.

నిజమేంటి? కల్పితం.

యేసు ఫలానా నెలలో లేదా ఫలానా రోజున పుట్టాడని బైబిలు సూటిగా చెప్పడం లేదు. మరైతే, డిసెంబరు 25 అనే తేదీ ఎలా వచ్చింది? క్రైస్తవులమని చెప్పుకున్న కొందరు, “సూర్యుడు ఆకాశంలో పైకి రావడం మొదలై పగటి సమయం ఎక్కువవడం ప్రారంభమయ్యే దక్షిణాయనం రోజున . . . అన్యజనులైన రోమన్లు చేసుకునే పండుగతో ఈ తేదీ కలవాలనుకున్నారు” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా చెబుతోంది. క్రిస్మస్‌ సందర్భంగా పాటించే ఆచారాలు “అన్యజనులు శీతాకాలం మధ్యలో జరుపుకునే వ్యవసాయ సంబంధమైన, సూర్యారాధన సంబంధమైన” పండుగల నుండి వచ్చినవని అదే పుస్తకం చెబుతోంది.

డిసెంబరు 25న తన పుట్టిన రోజును జరుపుకోవడాన్ని యేసు ఒప్పుకుంటాడా? ఈ విషయం ఆలోచించండి: యేసు ఏ రోజున పుట్టాడో తెలీదు. ఆయన పుట్టిన రోజును పండుగ చేసుకోమని లేఖనాలు ఎక్కడా చెప్పడం లేదు. తొలి క్రైస్తవులు ఆ పండుగ జరుపుకున్నట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, యేసు ఖచ్చితంగా ఏ రోజు చనిపోయాడో బైబిలు చెబుతోంది, అంతేకాదు, ఆ రోజును ఆచరించమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. a (లూకా 22:19) కాబట్టి యేసు తన పుట్టుకకు కాదు గానీ త్యాగపూరితమైన తన మరణానికున్న విలువకే ప్రాధాన్యతనివ్వాలని కోరుకున్నట్లు ఖచ్చితంగా తెలుస్తోంది.—మత్తయి 20:28.

నమ్మకం: యేసు పుట్టినప్పుడు ముగ్గురు జ్ఞానులు (లేదా కొన్ని ప్రాంతాలవారి నమ్మకాల ప్రకారం ముగ్గురు రాజులు) ఆయనను చూడడానికి వెళ్లారు.

నిజమేంటి? కల్పితం.

పసిబిడ్డగావున్న యేసు పశువుల తొట్టిలో ఉన్నప్పుడు ముగ్గురు జ్ఞానులు వచ్చి ఆయనకు బహుమతులు ఇస్తున్నట్లు మీరు చిత్రపటాల్లో లేదా నాటకాల్లో చూసివుండవచ్చు. అయితే, ఇది కల్పితమేగానీ వాస్తవం కాదు.

యేసు చిన్నప్పుడు ఆయనను స్తుతించడానికి తూర్పు నుండి కొందరు వచ్చారన్నమాట నిజమే. అయితే ఆ వచ్చినవాళ్లు నిజానికి జ్ఞానులు, అంటే జ్యోతిష్కులు. (మత్తయి 2:1) మరి వాళ్లు వచ్చి పశువుల పాకలోని పశువుల తొట్టిలో పడుకునివున్న యేసును చూశారా? లేదు; వాళ్లు ఆ శిశువు, ఇంట్లో ఉండగా చూశారు. దీన్నిబట్టి, వాళ్లు యేసు పుట్టిన కొన్ని నెలలకు అక్కడకు చేరుకున్నారని తెలుస్తోంది.—మత్తయి 2:9-11.

ఆ శిశువును చూడడానికి ఎంతమంది వచ్చారు? ఇద్దరా? ముగ్గురా? ముప్ఫైమందా? బైబిలు దానిగురించి ఏమీ చెప్పడంలేదు. బహుశా వాళ్లిచ్చిన మూడురకాల బహుమతులనుబట్టి ముగ్గురు వచ్చారనే నమ్మకం ఏర్పడివుంటుంది. b (మత్తయి 2:10, 11) ఆ జ్యోతిష్కుల్లో ఒక్కొక్కరు ఒక్కో జాతి మనుషుల నుండి వచ్చారని కొంతమంది చెప్తారు. అయితే, అలా అని లేఖనాల్లో ఎక్కడా లేదు. బదులుగా, ఇది “ఎనిమిదవ శతాబ్దానికి చెందిన, బాగా ఊహించే ఒక చరిత్రకారుని” కల్పన అని సువార్తల గురించి వ్యాఖ్యానిస్తున్న ఒక పుస్తకం చెబుతోంది.

నమ్మకం: యేసు తల్లిదండ్రులకు ఆయనొక్కడే సంతానం.

నిజమేంటి? కల్పితం.

యేసుకు తోబుట్టువులు ఉన్నారని సువార్తలు స్పష్టంగా చూపిస్తున్నాయి. లూకా సువార్త మరియకు యేసు “తొలిచూలు” కుమారుడని చెప్తూ ఆమెకు తర్వాత కూడా పిల్లలు పుట్టారని సూచిస్తుంది. c (లూకా 2:7) నజరేతులోని కొంతమంది యేసు ఆయన తోబుట్టువుల్లాంటి వాడే అంటూ ఆయనలో ప్రత్యేకతేమీ లేదన్నట్లు మాట్లాడారని మార్కు సువార్త చెబుతోంది. “ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా?” అని వాళ్లు అడిగారు.—మార్కు 6:3; మత్తయి 12:46; యోహాను 7:5.

సువార్తలు ఏమి చెబుతున్నాయో పట్టించుకోకుండా చాలామంది వేదాంతులు యేసు తల్లిదండ్రులకు ఆయనొక్కడే సంతానమని వాదిస్తుంటారు. మనమిప్పుడు చర్చిస్తున్న యేసు సహోదరులు, సహోదరీలు నిజానికి ఆయన బంధువులని కొంతమంది అంటారు. d వాళ్లు మరియ సవతి పిల్లలు అయ్యుండవచ్చని మరికొందరు అంటారు. కానీ దీని గురించి ఆలోచించండి: ఒకవేళ మరియకు యేసు తప్ప వేరే పిల్లలెవ్వరూ పుట్టివుండకపోతే నజరేతులోని ప్రజలు అలా అనివుండేవారా? అయితే, వాళ్లలో కొంతమంది మరియ ఎన్నోసార్లు గర్భవతిగా ఉండడం కళ్లారా చూసివుంటారు. మరియకు పుట్టిన ఎంతోమంది పిల్లల్లో యేసు ఒకడని వాళ్లకు బాగా తెలుసు.

నమ్మకం: యేసు మనిషిరూపంలో వచ్చిన దేవుడు.

నిజమేంటి? కల్పితం.

త్రిత్వ సిద్ధాంతానికి మూలమైన తలంపు అంటే దేవుడు మనిషిలా భూమ్మీదకు వచ్చి యేసు అనే వ్యక్తిగా జీవించాడనే తలంపు ఎప్పటినుండో ఉంది, అయితే అది మరీ యేసు భూమ్మీదున్నప్పటి నుండైతే లేదు. “కొత్త నిబంధనలో త్రిత్వం అనే పదంగానీ, ఆ సిద్ధాంతం గురించి ఎక్కువ వివరణగానీ కనిపించదు . . . శతాబ్దాల కాలంలో ఎన్నో వివాదాలతో ఈ సిద్ధాంతం క్రమేణా రూపుదిద్దుకుంది” అని ది ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా వివరిస్తోంది.

యేసు శరీరధారిగా వచ్చిన దేవుడని మతం బోధిస్తే అది ఆయనను అవమానపరిచినట్లే. e అదెలా? ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. కొంతమంది పనివాళ్లు తమ పై అధికారి దగ్గరకొచ్చి ఒక పని చేసిపెట్టమని అడిగారు. కానీ ఆ పనిచేసే అధికారం తనకు లేదని ఆ అధికారి చెప్పాడు. ఒకవేళ ఆయన చెప్పింది నిజమైతే, ఆయన తన పరిమితులేంటో అర్థం చేసుకున్నానని తెలివిగా చూపించాడు. అదే ఆయన చెప్పింది అబద్ధమైతే, అంటే ఆ పనివాళ్లు అడిగింది చేసే అధికారం ఆయనకున్నా చేయకూడదని నిర్ణయించుకుంటే, ఆయన మోసం చేసినట్లవుతుంది.

యేసు, తన అపొస్తలులలో ఇద్దరు ప్రత్యేక స్థానాలు కావాలని కోరుకున్నప్పుడు ఏమని సమాధానం చెప్పాడు? ఆయన వారితో, “నా కుడివైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకును” అని అన్నాడు. (మత్తయి 20:23) ఒకవేళ యేసు నిజంగా దేవుడే అయితే, ఆయన అబద్ధం చెప్పినట్లే కదా? అయితే, యేసు తనకన్నా ఎక్కువ అధికారం ఉన్నవానికి లోబడుతూ, వినయమంటే ఏమిటో చక్కగా చూపించడమే కాక, ఆయన తాను దేవునితో సమానం కాదని కూడా చూపించాడు.

నమ్మకం: యేసు కేవలం మంచి మనిషి మాత్రమే కాదు.

నిజమేంటి? వాస్తవం.

యేసు తాను కేవలం మంచి మనిషిని మాత్రమే కాదని స్పష్టంగా చెప్పాడు. ‘నేను దేవుని కుమారుణ్ణి’ అని ఆయన చెప్పాడు. (యోహాను 10:35) తాను దేవుని కుమారుణ్ణని ఎవ్వరైనా చెప్పుకోవచ్చు. ఒకవేళ యేసు తన గురించి చెప్పుకున్నది అబద్ధమైతే ఆయన ఎలాంటివాడని తేలుతుంది? నిజానికి ఆయన మంచి మనిషని కాదుగానీ పెద్ద మోసగాడని తేలుతుంది!

ఆయన గురించి దేవుడే చెప్పడం అన్నిటికన్నా గొప్ప రుజువు. దేవుడు, ‘ఈయన నా కుమారుడు’ అని యేసు గురించి రెండుసార్లు చెప్పాడు. (మత్తయి 3:17; 17:5) ఒకసారి ఆలోచించండి: భూమ్మీదున్న వారు దేవుని స్వరాన్ని విన్న కొన్ని సందర్భాల గురించి మాత్రమే బైబిలు చెబుతోంది. వాటిలో రెండుసార్లు ఆయన యేసు తన కుమారుడని స్పష్టంగా ప్రకటించాడు! యేసు తానెవరని చెప్పాడో అది నిజం అనడానికి ఇంతకంటే గొప్ప రుజువు ఇంకేదీ ఉండదు.

యేసు గురించి ఇంతకుముందు మీకు తెలియని వాస్తవాలేమైనా ఈ ఆర్టికల్లో తెలుసుకున్నారా? అలా అయితే సువార్త పుస్తకాలను ఇంకా ఎక్కువగా ఎందుకు అధ్యయనం చేయకూడదు? అలా చేస్తే సంతోషమే కాదు, ప్రయోజనం కూడా పొందుతారు. తన గురించీ, తన తండ్రి గురించీ సత్యం తెలుసుకుంటే “నిత్యజీవము” లభిస్తుందని యేసే చెప్పాడు.—యోహాను 17:3. (w10-E 04/01)

[అధస్సూచీలు]

a యేసు పస్కా పండుగ రోజున అంటే యూదుల క్యాలెండరు ప్రకారం నీసాను 14న చనిపోయాడు.—మత్తయి 26:2.

b ఆ విదేశీయులు “తమ పెట్టెలు విప్పి” బంగారం, సాంబ్రాణి, బోళం యేసుకు సమర్పించుకున్నారని మత్తయి రాశాడు. పేదవారైన యేసు తల్లిదండ్రులు ఆ తర్వాత కొద్దికాలానికే ఆయనను తీసుకుని అక్కడి నుండి శరణార్థులుగా పారిపోవాల్సివచ్చింది కాబట్టి, వాళ్లకు ఈ ఖరీదైన బహుమతులు సరైన సమయంలో అందివుంటాయి.—మత్తయి 2:10-15.

c యేసు పుట్టుక అద్భుతంగా జరిగినప్పటికీ మరియకు తర్వాత పుట్టిన పిల్లలందరూ సహజంగానే అంటే ఆమె భర్త యోసేపు వలన పుట్టారు.—మత్తయి 1:25.

d ఈ నమ్మకాన్ని దాదాపు సా.శ. 383లో జెరోమ్‌ అనే వ్యక్తి సమర్థించాడు. మరియ తన జీవితమంతా కన్యకగానే ఉండిపోయిందని విశ్వసించినవారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ, జెరోమ్‌ తాను ప్రతిపాదించిన సిద్ధాంతంలో పొరపాట్లు ఉన్నాయని ఆ తర్వాత అన్నాడు. అయినా చాలామందితోపాటు, క్యాథలిక్‌ చర్చి అధికారిక వర్గాల్లోనివారు ఆయన ముందు చెప్పిన సిద్ధాంతాన్నే ఇప్పటికీ నమ్ముతున్నారు.

e త్రిత్వం గురించి పూర్తి వివరాల కోసం, యెహోవాసాక్షులు ప్రచురించిన బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకంలోని 202-204 పేజీల్లోవున్న అనుబంధాన్ని చూడండి.

[14వ పేజీలోని బాక్సు/చిత్రం]

మిమ్మల్ని ఆశ్చర్యపర్చే మరికొన్ని వాస్తవాలు

యేసు ఎలాంటి వ్యక్తి? ఆయన కఠినంగా, ముభావంగా, ఎవ్వరితో కలవకుండా, సామాన్య ప్రజలతో సంబంధం లేనట్లు ఉండేవాడా? కొంతమంది అవుననే అంటారు. బహుశా అందుకే వాళ్లు యేసు గురించి ఈ కింది విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

• ఆయన నలుగురూ కలుసుకుని సంతోషించే విందులు వంటివాటికి వెళ్లాడు.—యోహాను 2:1-11.

• ఇతరులను మెచ్చుకున్నాడు.—మార్కు 14:6-9.

• పిల్లలతో ఉండడానికి ఇష్టపడ్డాడు.—మార్కు 10:13, 14.

• నలుగురూ చూస్తుండగా ఏడ్చాడు.—యోహాను 11:35.

• ఇతరుల మీద కనికరపడ్డాడు.—మార్కు 1:40, 41.