కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సమాజమందిరం యేసు, ఆయన శిష్యులు ప్రకటించిన స్థలం

సమాజమందిరం యేసు, ఆయన శిష్యులు ప్రకటించిన స్థలం

సమాజమందిరం యేసు, ఆయన శిష్యులు ప్రకటించిన స్థలం

“యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు . . . గలిలయయందంతట సంచరించెను.”—మత్తయి 4:23.

యేసు సమాజమందిరానికి వెళ్లినట్లు సువార్త పుస్తకాల్లో తరచూ కనిపిస్తుంది. ఆయన పెరిగిన నజరేతులో గానీ, ఆయన ఎక్కువ కాలం గడిపిన కపెర్నహూములో గానీ, మూడున్నర సంవత్సరాలు తీరిక లేకుండా పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన వెళ్లిన పట్టణాల్లోగానీ, గ్రామాల్లోగానీ దేవుని రాజ్యం గురించి ప్రకటించడానికి, బోధించడానికి యేసు తరచూ సమాజమందిరానికి వెళ్లేవాడు. యేసు తాను చేసిన పరిచర్య గురించి చెబుతూ, “యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని” అని అన్నాడు.—యోహాను 18:20.

యేసు అపొస్తలులు, ఇతర తొలి క్రైస్తవులు కూడా ఆయనలాగే యూదా సమాజమందిరాల్లో బోధించేవారు. అసలు యూదులు సమాజమందిరాల్లో ఆరాధించడం ఎలా మొదలుపెట్టారు? యేసు కాలంలో ఈ ఆరాధనా మందిరాలు ఎలా ఉండేవి? దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

యూదుల జీవితాల్లో చాలా ముఖ్యమైనది: యూదుల్లోని మగవాళ్లు పరిశుద్ధ ఆలయంలో జరిగే పండుగల కోసం సంవత్సరానికి మూడుసార్లు యెరూషలేముకు ప్రయాణమై వెళ్లేవాళ్లు. కానీ రోజువారీ ఆరాధన సమాజమందిరాల్లో జరుపుకునేవారు, పాలస్తీనాలోని వారైనా లేదా ఎక్కువ యూదు సమాజాలున్న వేరే ప్రాంతాల్లోని వారైనా అలాగే చేసేవారు.

సమాజమందిరాలను ఉపయోగించడం ఎప్పటి నుండి మొదలైంది? యూదులు బబులోనుకు బానిసలుగా వెళ్లిన కాలంలో (సా.శ.పూ. 607-537) అంటే యెహోవా ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం మొదలయ్యిందని కొందరు నమ్ముతారు. లేదా దేవుని ధర్మశాస్త్రం గురించి ఎక్కువ జ్ఞానం సంపాదించుకోవాలని, దానిని బాగా అర్థం చేసుకోవాలని యాజకుడైన ఎజ్రా చెప్పినప్పుడు, అంటే యూదులు బబులోను బానిసత్వం నుండి విడుదలపొంది తిరిగి వచ్చిన కొంతకాలానికి వాటిని ఉపయోగించడం మొదలైవుంటుంది.—ఎజ్రా 7:10; 8:1-8; 10:3.

“సమాజమందిరం” అనే పదానికి “సభ” లేదా “సమావేశం” అని అర్థం. హీబ్రూ లేఖనాల గ్రీకు అనువాదమైన సెప్టాజింట్‌లో ఆ పదాన్ని ఆ అర్థంలో ఉపయోగించారు. కాలంగడిచే కొద్దీ, ఆరాధన కోసం ప్రజలు కూడుకునే భవనం గురించి చెప్పడానికి ఆ పదాన్ని ఉపయోగించడం మొదలైంది. సా.శ. మొదటి శతాబ్దానికల్లా యేసు సందర్శించిన దాదాపు ప్రతీ పట్టణంలో సమాజమందిరం ఉండేది, నగరాల్లో ఒకటికన్నా ఎక్కువ ఉండేవి, యెరూషలేములో ఎన్నో ఉండేవి. అసలు ఆ భవనాలు ఎలా ఉండేవి?

నిరాడంబరమైన ఆరాధనా స్థలం: యూదులు సమాజమందిరాన్ని సాధారణంగా ఎత్తైన స్థలం చూసుకుని, దాని ద్వారం (1) యెరూషలేము వైపు ఉండేలా కట్టేవారు. అలాంటి నియమాలు అన్నిసార్లు ఖచ్చితంగా పాటించడం కుదరదు కాబట్టి అవసరమైనప్పుడు కొన్ని సర్దుబాట్లు చేసేవారని తెలుస్తుంది.

నిర్మాణం పూర్తయ్యేసరికి సమాజమందిరం సాధారణంగా ఎక్కువ అలంకారాలు లేకుండా నిరాడంబరంగా ఉండేది. అయితే, దాని మధ్యలో మాత్రం ఆ సమాజానికి అన్నిటికన్నా ముఖ్యమైన సంపద అంటే పవిత్ర లేఖనాల గ్రంథపు చుట్టలు ఉన్న మందసం లేదా పెట్టె  (2) ఉండేది. కూటాలు జరిగేటప్పుడు ఆ మందసాన్ని మధ్యలోకి తీసుకొచ్చి, అవి ముగిసిన తర్వాత దాన్ని ఒక గదిలో (3) భద్రపర్చేవారు.

ఆ మందసం దగ్గర అగ్రపీఠాలు (4) ఉండేవి. అవి సభికులకు అభిముఖంగా ఉండేవి. సమాజమందిరానికి ఆధ్వర్యం వహించేవారు లేదా ముఖ్యమైన అతిథులు వాటి మీద కూర్చునేవారు. (మత్తయి 23:5, 6) మందిరం మధ్యభాగానికి దగ్గర్లో కొంచెం ఎత్తుగా కట్టిన వేదిక (5) ఉండేది, దాని మీద గ్రంథపు చుట్టలు పెట్టుకోవడానికి పీఠం, ప్రసంగీకుడు కూర్చోవడానికి బల్ల ఉండేవి. ఆ వేదికకు ఎదురుగా మూడువైపులా సభకు వచ్చినవారు కూర్చోవడానికి మెట్లలాంటి గద్దెలు (6) ఉండేవి.

సాధారణంగా, ఒక ప్రాంతంలోని సమాజమందిరానికి సంబంధించిన పనులు ఆ ప్రాంతంలోని సంఘం సహాయంతో నిర్వహించబడేవి. ఆ భవనాన్ని మంచి స్థితిలో ఉంచడానికి అవసరమైన విరాళాలను ధనవంతులు, పేదవాళ్లు అనే తేడాలేకుండా అందరూ ఇష్టపూర్వకంగా ఇచ్చేవారు. మరి సమాజమందిరాల్లో కూటాలు ఎలా జరిగేవి?

సమాజమందిరంలో ఆరాధన: సమాజమందిరంలో ఆరాధిస్తున్నప్పుడు స్తుతించడం, ప్రార్థించడం, లేఖనాలు చదవడంతో పాటు బోధించడం, ప్రకటించడం కూడా చేసేవారు. సభకు వచ్చిన వారంతా షెమా వల్లించడంతో సమావేశం మొదలయ్యేది, యూదుల విశ్వాస ప్రకటనను షెమా అంటారు. హీబ్రూ భాషలో, షెమాలో ఉండే మొదటి లేఖనంలోని మొదటి పదం నుండి దానికి ఆ పేరు వచ్చింది. అది “ఇశ్రాయేలూ వినుము [షెమా]. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా” అనే లేఖనం.—ద్వితీయోపదేశకాండము 6:4.

దాని తర్వాత, మోషే రాసిన తోరహ్‌ అంటే బైబిల్లోని మొదటి ఐదు పుస్తకాలు చదువుతారు, వివరిస్తారు. (అపొస్తలుల కార్యములు 15:21) ఆ తర్వాత ప్రవక్తలు రాసిన పుస్తకాల్లోని భాగాలను (హఫ్తరాహ్‌లు) చదువుతారు, వివరిస్తారు, వాటిని ఎలా పాటించవచ్చో చెప్తారు. కొన్నిసార్లు వేరే చోట నుండి వచ్చిన ప్రసంగీకులు కూడా ప్రసంగించేవారు. లూకా 4:16-21 వచనాల్లో ఉన్న సందర్భంలో యేసు కూడా అలానే బోధించాడు.

అయితే, ఆ సమావేశంలో యేసు చేతికిచ్చిన గ్రంథపు చుట్టలోని లేఖనాలు ఇప్పుడు మనం వాడుతున్న బైబిళ్లలో ఉన్నట్లు అధ్యాయాలుగా, వచనాలుగా విభజించబడలేదు. యేసు తనకు కావలసిన లేఖనభాగం దొరికే వరకు ఆ గ్రంథపు చుట్టను ఎడమ చేత్తో విప్పుతూ, కుడి చేత్తో లోపలికి చుట్టడం ఉహించుకోవచ్చు. చదవడం పూర్తయిన తర్వాత ఆ గ్రంథాన్ని మళ్లీ మొదటికి చుట్టేవారు.

తరచూ, వీటిని ఆదిమ హీబ్రూ భాషలో చదివితే, అరామిక్‌ భాషలోకి తర్జుమా చేసేవారు. గ్రీకు భాషా సంఘాల్లో, సెప్టాజింట్‌ వాడేవారు.

రోజువారీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది: సమాజమందిరం యూదుల రోజువారీ జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనది. ఇది, దీనితోపాటు నిర్మించబడిన ఇతర భవనాలు సమాజానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడేవి. కొన్నిసార్లు న్యాయనిర్ణయాలు, తీర్పులు జరిగేవి, సాంఘిక కూటాలు, సమావేశాలు కూడా జరుపుకునేవారు, అలాంటివి జరిగినప్పుడు భోజనాలు చేయడానికి ప్రత్యేకమైన గదులు కూడా ఉండేవి. సమాజమందిరాలు ఉండే భవన సముదాయంలో కొన్నిసార్లు యాత్రికులు బస చేయడానికి కూడా ఏర్పాట్లు చేయబడేవి.

దాదాపు అన్ని పట్టణాల్లో, సమాజమందిరంతో పాటు ఒక పాఠశాల కూడా ఉండేది, సాధారణంగా అవి రెండూ ఒకే భవనంలో ఉండేవి. ఒక గదినిండా కూర్చున్న పిల్లలు తమ గురువు, మైనపు పలక మీద రాసి చూపిస్తున్న పెద్దపెద్ద అక్షరాలు చదవడం నేర్చుకుంటుంటే ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ప్రాముఖ్యంగా ఆ పాఠశాలల వల్లే ప్రాచీన యూదుల్లో నిరక్షరాస్యత ఉండేది కాదు, చివరికి సాధారణ ప్రజలకు కూడా లేఖనాలు బాగా తెలిసేవి.

ఏదేమైనా, క్రమంగా ఆరాధన జరుపుకోవడానికే సమాజమందిరాలు నిర్మించబడేవి. మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల కూటాలు, చాలావరకు యూదుల సమాజమందిరాల్లో జరిగిన కూటాల్లా ఉండేవంటే అందులో ఆశ్చర్యం లేదు. అలాగే క్రైస్తవ కూటాలు కూడా ప్రార్థించడం, పాటలు పాడడం, దేవుని వాక్యాన్ని చదవడం, దాని గురించి చర్చించుకోవడం ద్వారా యెహోవాను ఆరాధించడానికే ఏర్పాటు చేయబడ్డాయి. ఆ రెంటికీ ఉన్న పోలికలు అవి మాత్రమే కాదు. ఈ రెండు ఆరాధనా స్థలాల్లోనూ వాటి నిర్వహణంతా ఇష్టపూర్వకంగా ఇచ్చే విరాళాలతోనే జరిగేది. దేవుని వాక్యాన్ని చదివి, చర్చించే అధికారం మత గురువులకు మాత్రమే పరిమితం చేయబడలేదు. రెండు పద్ధతుల్లోనూ కూటాల్ని ఏర్పాటు చేసే, నిర్వహించే బాధ్యతని పెద్దలు తీసుకునేవారు.

యేసు చేసినట్లూ, మొదటి శతాబ్దంలోని ఆయన అనుచరులు చేసినట్లూ చేయడానికి నేడు యెహోవాసాక్షులు కృషి చేస్తున్నారు. వాళ్ల రాజ్యమందిరాల్లో జరిగే కూటాలు కొంతవరకు పూర్వకాలంలో సమాజమందిరాల్లో జరిగిన కూటాల్లానే ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, సత్యాన్ని ప్రేమించేవారు అన్ని కాలాల్లో ఏ లక్ష్యంతో సమావేశమయ్యారో సాక్షులు అదే లక్ష్యంతో అంటే ‘దేవునికి దగ్గరవ్వడానికి’ సమావేశమవుతున్నారు.—యాకోబు 4:8. (w10-E 04/01)

[16, 17వ పేజీలోని చిత్రం]

మొదటి శతాబ్దంలోని గామ్లా సమాజమందిరం నమూనా ఆధారంగా తయారుచేయబడింది

[18వ పేజీలోని చిత్రం]

సమాజమందిరంలోని పాఠశాలల్లో 6 నుండి 13 ఏళ్ల అబ్బాయిలు చదువుకునేవారు