కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన తన బోధకుని నుండి క్షమించడం నేర్చుకున్నాడు

ఆయన తన బోధకుని నుండి క్షమించడం నేర్చుకున్నాడు

వారి విశ్వాసాన్ని అనుసరించండి

ఆయన తన బోధకుని నుండి క్షమించడం నేర్చుకున్నాడు

యేసు తన కళ్లలోకి సూటిగా చూసిన ఆ భయంకరమైన క్షణాన్ని పేతురు ఎప్పటికీ మర్చిపోలేడు. పేతురుకు యేసు కళ్లలో ‘ఇలా చేశాడేంటి’ అనే బాధ కనబడిందా, లేక ఆ కళ్లు తనను నిందిస్తున్నట్టు అనిపించిందా? ఆయన కళ్లలో ఏమి కనిపించిందో ఖచ్చితంగా చెప్పలేం; ‘ప్రభువు తిరిగి పేతురువైపు చూశాడు’ అని మాత్రమే దేవుని వాక్యంలో ఉంది. (లూకా 22:61) కానీ ఆ ఒక్క చూపుతో, తనెంత పెద్ద పొరపాటు చేశాడో పేతురుకు అర్థమయ్యింది. ఏ పనైతే తానెప్పటికీ చేయనని చెప్పుకున్నాడో, ఏ విషయం గురించైతే యేసు ముందే చెప్పాడో అదే తాను చేసినట్టు పేతురు గ్రహించాడు. అదేమిటంటే, తానెంతో ప్రేమించే బోధకునికి తాను నమ్మకద్రోహం చేశాడు. పేతురు జీవితంలో అంతకన్నా దారుణమైన క్షణం మరొకటి లేదు.

అయితే పరిస్థితి చేయిదాటిపోలేదు. పేతురు ఎంతో విశ్వాసం గల వ్యక్తి కాబట్టి, చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని, యేసు బోధించిన గొప్ప పాఠాల్లో ఒకటైన క్షమాగుణానికి సంబంధించిన పాఠం నేర్చుకునే అవకాశం ఆయనకు ఇంకా ఉంది. మనలో ప్రతీ ఒక్కరం ఆ పాఠాన్ని నేర్చుకోవాలి. కాబట్టి, పేతురు ఈ పాఠాన్ని కష్టపడి ఎలా నేర్చుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం.

ఆయన నుండి మనమెంతో నేర్చుకోవచ్చు

దాదాపు ఆరు నెలల ముందు పేతురు తన సొంత పట్టణమైన కపెర్నహూములో యేసు దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా?” అని అడిగాడు. బహుశా క్షమించే విషయంలో తానెంతో గొప్ప మనసు చూపిస్తున్నానని పేతురు అనుకునివుంటాడు. ఎందుకంటే, ఆ రోజుల్లోని మత గురువులు మూడుసార్లు మాత్రమే క్షమించాలని బోధించేవారు! అయితే, యేసు “ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల [‘డెబ్భై ఏడు,’ NW] మారులమట్టుకు” అని చెప్పాడు.—మత్తయి 18:21, 22.

ఎదుటివాళ్లు ఎన్నిసార్లు పొరపాట్లు చేశారో పేతురు గుర్తుపెట్టుకోవాలని యేసు ఇక్కడ చెప్తున్నాడా? లేదు; ఏడుసార్లని పేతురు అన్నదానికి డెబ్భై ఏడుసార్లని చెప్పడంద్వారా క్షమించడానికి ఒక పరిమితి అంటూ లేదని యేసు చూపించాడు. ఆ రోజుల్లో లెక్కపెట్టుకుని క్షమించేవారు, క్షమించడానికి ఇష్టపడని అలాంటి కఠినమైన స్వభావాన్నే పేతురు కూడా కనబరుస్తున్నాడని యేసు చూపించాడు. అయితే, దేవుని క్షమాగుణానికి అవధుల్లేవు.

పేతురు యేసుతో వాదించలేదు. కానీ, యేసు నేర్పిన పాఠం నిజంగా ఆయన హృదయాన్ని చేరిందా? కొన్నిసార్లు, క్షమాపణ మనకెంత అవసరమో అర్థంచేసుకున్నప్పుడే క్షమాపణ గురించి ఎక్కువగా నేర్చుకుంటాం. ఇప్పుడు మనం యేసు మరణానికి దారితీసిన సంఘటలను పరిశీలిద్దాం. ఎంతో కష్టభరితమైన ఆ పరిస్థితుల్లో, పేతురు తన బోధకుని క్షమాపణ అవసరమైన ఎన్నో పొరపాట్లు చేశాడు.

చాలాసార్లు క్షమాపణ అవసరమైంది

అది చాలా ప్రాముఖ్యమైన సాయంత్రం, ఆ రాత్రి యేసు భూమ్మీద జీవించిన చివరి రాత్రి. యేసు తన అపొస్తలులకు ఇంకా ఎన్నో నేర్పించాల్సివుంది, వాటిలో ఒకటి వినయం. యేసు తనను తాను తగ్గించుకుని, సాధారణంగా సేవకుల్లో అందరికన్నా తక్కువవారు చేసే పనిని చేసి అంటే వారి పాదాలు కడిగి వారికి ఆదర్శంగా నిలిచాడు. పేతురు మొదట యేసు చేస్తున్న పని సరికాదన్నట్లు మాట్లాడాడు. ముందు, ఆయన తన కాళ్లు కడుగవద్దన్నాడు. తర్వాత, తన కాళ్లు మాత్రమే కాదు చేతులు, తల కూడా కడగమని పట్టుబట్టాడు! దానికి యేసు విసుక్కోకుండా, ఆ పని చేయడం ఎందుకు అవసరమో, దాని అర్థమేమిటో ప్రశాంతంగా వివరించాడు.—యోహాను 13:1-17.

అయితే, కాసేపటికే అపొస్తలులు తమలో ఎవరు గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. పేతురు కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా అలాంటి అహంకారాన్ని చూపించివుంటాడు. అయినా సరే, యేసు వారిని దయతో సరిదిద్దాడు, అంతేకాదు వాళ్లు చేసిన మంచి పనికి అంటే తనకు నమ్మకంగా ఉన్నందుకు వారిని మెచ్చుకున్నాడు. అయితే వాళ్లంతా తనను వదిలిపెట్టి వెళ్లిపోతారని చెప్పాడు. దానికి పేతురు చనిపోవాల్సివచ్చినా యేసును వదిలి వెళ్లనని చెప్పాడు. కానీ మరోలా జరుగుతుందని వివరిస్తూ ఆ రాత్రే, కోడి రెండుసార్లు కూయక ముందే తానెవరో తెలీదని పేతురు మూడుసార్లు అంటాడని యేసు ప్రవచించాడు. పేతురు అలా జరగదని చెప్పడమే కాదు, మిగతా అపొస్తలులందరికన్నా నమ్మకస్థునిగా నిరూపించుకుంటానని గొప్పలు చెప్పుకున్నాడు.—మత్తయి 26:31-35; మార్కు 14:27-31; లూకా 22:24-28.

పేతురు విషయంలో యేసు సహనం కోల్పోయే పరిస్థితి వచ్చిందా? నిజానికి, ఈ కష్టపరిస్థితి అంతటిలో యేసు అపరిపూర్ణులైన తన అపొస్తలుల్లో మంచిని చూడడానికే ప్రయత్నించాడు. పేతురు తనను వదిలిపెట్టి వెళ్లిపోతాడని యేసుకు తెలుసు, అయినా ఆయన, ‘నీ నమ్మిక తప్పిపోకుండా ఉండేలా నేను నీకొరకు వేడుకున్నాను; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు’ అన్నాడు. (లూకా 22:32) అలా పేతురు తన తప్పు సరిదిద్దుకుని విశ్వాసంతో మళ్లీ దేవుని సేవ చేస్తాడనే నమ్మకాన్ని యేసు వ్యక్తం చేశాడు. యేసు ఎంతటి కనికరాన్ని, క్షమాగుణాన్ని చూపించాడు!

తర్వాత గెత్సెమనే తోటలో పేతురును ఒకటికన్నా ఎక్కువసార్లు సరిదిద్దాల్సివచ్చింది. యేసు తాను ప్రార్థన చేస్తున్నప్పుడు నిద్రపోకుండా మెలకువగా ఉండమని పేతురుతో పాటు యాకోబుకు, యోహానుకు చెప్పాడు. మానసికంగా ఎంతో కృంగిపోయిన యేసుకు మద్దతు అవసరమైంది, అలాంటి పరిస్థితుల్లో పేతురు, మిగతావాళ్లు మళ్లీమళ్లీ నిద్రలోకి జారుకున్నారు. యేసు వాళ్ల పరిస్థితిని అర్థంచేసుకుని, వాళ్లను క్షమిస్తూ, “ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనము” అన్నాడు.—మార్కు 14:32-38.

కొద్దిసేపటికే ఒక పెద్ద గుంపు కాగడాలు, కత్తులు, కర్రలు పట్టుకుని అక్కడకు వచ్చింది. అది జాగ్రత్తగా, తెలివిగా వ్యవహరించాల్సిన సమయం. అయినా, పేతురు ముందూ వెనుకా ఆలోచించకుండా, కత్తితీసి ప్రధాన యాజకుని దాసుడైన మల్కు అనే వ్యక్తి తలమీద కొట్టి, అతని చెవిని తెగనరికాడు. యేసు ప్రశాంతంగా పేతురును సరిదిద్దాడు, గాయపడిన వ్యక్తిని బాగుచేసి అహింసా సూత్రాన్ని వివరించాడు. ఈ సూత్రాన్నే ఆయన అనుచరులు నేటికీ పాటిస్తున్నారు. (మత్తయి 26:47-55; లూకా 22:47-51; యోహాను 18:10, 11) పేతురు అప్పటికే తన బోధకుని క్షమాపణ అవసరమైన ఎన్నో పొరపాట్లు చేశాడు. ఆయన చేసిన పనులు, ‘అనేక విషయాల్లో మనమందరం తప్పిపోతాము’ అనే విషయాన్ని మనకు గుర్తుచేస్తాయి. (యాకోబు 3:2) ప్రతీరోజు దేవుని క్షమాపణ అవసరం రానివారు మనలో ఎవరున్నారు? అయితే, పేతురుకు ఆ రాత్రి అంతటితో అయిపోలేదు. ఆయనింకా ఘోరమైన పొరపాటు చేశాడు.

పేతురు చేసిన ఘోరమైన పొరపాటు

యేసు అక్కడున్న గుంపుతో, వాళ్లు వెతికేది తన కోసమే అయితే తన అపొస్తలులను వెళ్లనిమ్మని చెప్పాడు. యేసును ఆ గుంపు బంధించినప్పుడు పేతురు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత ఆయన, ఆయన తోటి అపొస్తలులు అక్కడినుండి పారిపోయారు.

పారిపోతున్న పేతురు, యోహానులు ఆగారు. వాళ్లలా ఆగింది మాజీ ప్రధాన యాజకుడైన అన్న ఇంటి దగ్గర్లో కావచ్చు. విచారణ కోసం యేసును మొదటిగా అక్కడికే తీసుకెళ్లారు. యేసును అక్కడినుండి తీసుకువెళుతున్నప్పుడు పేతురు, యోహాను “దూరమునుండే” ఆయన వెనక నడిచివెళ్లారు. (మత్తయి 26:58; యోహాను 18:12, 13) పేతురు పిరికివాడు కాదు. అసలు అలా వెళ్లాలంటేనే ఎంతో ధైర్యం కావాలి. ఆ గుంపువద్ద ఆయుధాలున్నాయి దానికితోడు, అప్పటికే పేతురు వాళ్లలో ఒకరిని గాయపర్చాడు. అయితే, తన బోధకుని కోసం చనిపోవడానికి కూడా సిద్ధమని చెప్పుకున్న పేతురు, తాను చెప్పుకున్నంత నమ్మకమైన ప్రేమను ఇక్కడ చూపించలేదు.—మార్కు 14:31.

చాలామంది నేడు పేతురులాగే క్రీస్తు అడుగుజాడల్లో “దూరమునుండే” అంటే ఎవ్వరూ తమను గమనించని విధంగా నడవాలనుకుంటారు. కానీ, ఇదే పేతురు ఆ తర్వాత కాలంలో రాసినట్లు, క్రీస్తు అడుగుజాడల్లో సరిగ్గా నడవాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అన్ని విషయాల్లో ఆయనను ఆదర్శంగా తీసుకుంటూ ఆయనకు వీలైనంత సన్నిహితంగా ఉండాలి.—1 పేతురు 2:21.

పేతురు ఎవ్వరికీ అనుమానం రాకుండా ధనవంతుడు, బాగా పలుకుబడి ఉన్న ప్రధాన యాజకుడైన కయప ఇంటికి చేరుకున్నాడు. అది యెరూషలేములో ఉన్న ఎంతో పెద్ద భవనాల్లో ఒకటి. సాధారణంగా అలాంటి ఇళ్లకు పెద్ద ద్వారముండేది. లోపలికి వెళ్తే మధ్యలో ఆవరణ, దాని చుట్టూ గదులు ఉండేవి. పేతురు ద్వారం వరకు వెళ్లాడు గానీ లోపలికి వెళ్లడానికి అనుమతి దొరకలేదు. అప్పటికే లోపలికి వెళ్లిన యోహాను బయటకొచ్చి, ద్వారపాలకురాలితో మాట్లాడి పేతురును లోపలికి తీసుకువెళ్లాడు. పేతురు యోహానుతోపాటే లేడని తెలుస్తోంది; ఆయన తన బోధకుని పక్షాన నిలబడడానికి లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. ఆయన ఆవరణలోనే ఉండిపోయాడు, అక్కడ కొంతమంది దాసులు, బంట్రౌతులు చలికాచుకుంటూ యేసుమీద అబద్ధసాక్ష్యం చెప్పేవాళ్లు లోపలికి, బయటకు వెళ్లడం గమనిస్తున్నారు.—మార్కు 14:54-59; యోహాను 18:15, 16, 18.

పేతురును లోపలికి వెళ్లనిచ్చిన ద్వారపాలకురాలు ఆ మంట వెలుగులో ఆయన ముఖాన్ని స్పష్టంగా చూసింది. ఆమెకు ఆయనెవరో తెలుసు. ఆమె ఆయనతో, “నీవును గలిలయుడగు యేసుతోకూడ ఉంటివి గదా” అంది. ఊహించని విధంగా దొరికిపోయిన పేతురు, యేసు ఎవరో తనకు తెలీదనీ, అసలామె ఏం మట్లాడుతుందో కూడా తనకు అర్థం కావడం లేదని బొంకాడు. ఎవరూ గుర్తుపట్టకూడదని ద్వారం దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు, కానీ అక్కడ మరొక అమ్మాయి కూడా ఆయనను గమనించి, “వీడును నజరేయుడగు యేసుతోకూడ ఉండెను” అంది. దానికి ఆయన “ఆ మనుష్యుని నేనెరుగను” అని ఒట్టుపెట్టుకున్నాడు. (మత్తయి 26:69-72) బహుశా ఇలా రెండోసారి అబద్దం చెప్పిన తర్వాత పేతురు కోడి కూయడం వినివుంటాడు, కానీ చాలా గందరగోళంలో ఉండడంవల్ల అప్పటికి కొన్ని గంటల ముందే యేసు చెప్పిన ప్రవచనాన్ని గుర్తుతెచ్చుకోలేకపోయాడు.

అది జరిగిన కొంతసేపటి తర్వాత కూడా పేతురు ఎవరి కంటాపడకుండా ఉండాలని తీవ్ర ప్రయత్నం చేస్తూనేవున్నాడు. కానీ ఆవరణలో నిల్చున్న కొంతమంది ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్లలో పేతురు గాయపరచిన దాసుడైన మల్కు బంధువు కూడా ఉన్నాడు. ఆయన పేతురుతో “నీవు తోటలో అతనితో కూడ ఉండగా నేను చూడలేదా?” అని అన్నాడు. వాళ్లు పొరబడుతున్నట్లు వాళ్లను ఎలాగైనా ఒప్పించాలని పేతురు అనుకున్నాడు. అందుకే ఆయన తను చెబుతున్నది అబద్ధమైతే తనకు కీడు జరగాలని శపించుకుంటూ ఒట్టుపెట్టుకున్నాడు. ఆయనలా అన్నాడోలేదో కోడి కూసింది, ఆ రాత్రి పేతురుకు కోడి కూత వినిపించడం ఇది రెండవసారి.—యోహాను 18:26, 27; మార్కు 14:71, 72.

యేసు అప్పుడే వసారాలోకి వచ్చాడు, అక్కడి నుండి ఆవరణ కనిపిస్తుంది. ఈ ఆర్టికల్‌ ఆరంభంలో, యేసు పేతురు కళ్లలోకి చూశాడని మనం చెప్పుకున్న సంఘటన ఇదే. అప్పుడు తాను తన బోధకుణ్ణి ఎంత మోసం చేశాడో పేతురుకు అర్థమైంది. చేసిన తప్పుకు ఎంతో కుమిలిపోతూ పేతురు ఆవరణ బయటకు వెళ్లిపోయాడు. అస్తమిస్తున్న పూర్ణ చంద్రుని కాంతిలో వీధుల్లోకి వెళ్లాడు. కానీ కళ్లల్లో నీళ్లు ఉబికిరావడంతో పరిసరాలు స్పష్టంగా కనిపించలేదు. దుఃఖం పొంగుకొచ్చి కుమిలికుమిలి ఏడ్చాడు.—మార్కు 14:72; లూకా 22:61, 62.

ఎవరైనా తమవల్ల అలాంటి ఘోరమైన తప్పు జరిగిందని గ్రహిస్తే తమకు ఇక క్షమాపణే ఉండదనుకోవడం సహజం. పేతురు కూడా అలానే అనుకునివుంటాడు. కానీ అది నిజమా?

పేతురు క్షమించరాని తప్పు చేశాడా?

తెల్లవారుతుండగా ఒక్కొక్క సంఘటన జరుగుతున్నప్పుడు పేతురు ఎంత గుండెకోత అనుభవించి ఉంటాడో మనం ఊహించడం కష్టం. యేసు ఎన్నో గంటలపాటు హింసించబడి మధ్యాహ్నం చనిపోయినప్పుడు, పేతురు తనను తాను ఎంతో నిందించుకునివుంటాడు! అప్పటికే బాధపడుతున్న తన బోధకుణ్ణి, ఆయన మానవ జీవితంలోని చివరి రోజున ఇంకా బాధపెట్టానని గుర్తొచ్చిన ప్రతీసారీ పేతురు మనసు ముక్కలైవుంటుంది. పేతురు ఎంత బాధలోవున్నా, నిరాశతో డీలా పడిపోలేదు. ఆ విషయం మనకెలా తెలుసంటే, ఆ సంఘటన జరిగి ఎన్నోరోజులు కాకముందే పేతురు తన సహోదరులతో కలిసి ఉన్నట్లు చదువుతాం. (లూకా 24:33) కటికచీకటి కమ్ముకున్న దుఃఖభరితమైన ఆ రాత్రి అపొస్తలులందరూ తాము ప్రవర్తించిన తీరుకు ఎంతో సిగ్గుపడివుంటారు, ఆ తర్వాత ఒకరినొకరు ఓదార్చుకుని ఉంటారు.

ఒకరకంగా, పేతురు తన జీవితంలో తీసుకున్న ఉత్తమమైన నిర్ణయాల్లో ఇదొకటి. దేవుని సేవకుడు తప్పు చేసినప్పుడు ఆయనెంత పెద్ద తప్పు చేశాడన్నది కాదుగానీ, పరిస్థితులను చక్కదిద్దుకోవాలని ఆయనెంత ఎక్కువగా కోరుకుంటున్నాడన్నదే ముఖ్యం. (సామెతలు 24:16) అంత కృంగిపోయి ఉన్నప్పటికీ పేతురు తన సహోదరులను కలుసుకుని తనకు నిజమైన విశ్వాసం ఉందని చూపించాడు. బాధతో లేదా పశ్చాత్తాపంతో మనసు విరిగిపోయినప్పుడు అందరికీ దూరంగా ఉండాలనిపిస్తుంది, కానీ అది ప్రమాదకరం. (సామెతలు 18:1) అలాంటి సమయంలో మన తోటి విశ్వాసులకు దగ్గరగా ఉంటూ దేవున్ని సేవించడానికి అవసరమైన శక్తిని సంపాదించుకోవడమే తెలివైన పని.—హెబ్రీయులు 10:24, 25.

పేతురు తన ఆధ్యాత్మిక సహోదరులతో ఉన్నాడు కాబట్టే, యేసు శరీరం ఆయన సమాధిలో లేదనే ఆందోళనకరమైన వార్త తెలుసుకోగలిగాడు. యేసును పాతిపెట్టి, ముద్రవేసి ద్వారాన్ని మూసేసిన సమాధి దగ్గరకు పేతురు, యోహానులు పరుగుపరుగున వెళ్లారు. బహుశా వాళ్లిద్దరిలో చిన్నవాడైన యోహాను అక్కడికి ముందుగా చేరుకున్నాడు. సమాధి ద్వారం తెరిచి ఉండడం చూసి ఆయన తటపటాయించాడు. అయితే పేతురు పరిగెత్తుకుంటూ రావడం వల్ల ఆయాసపడుతున్నా నేరుగా లోపలికి వెళ్లాడు. సమాధి ఖాళీగా ఉంది!—యోహాను 20:3-9.

యేసు పునరుత్థానం చేయబడ్డాడని పేతురు నమ్మాడా? మొదట్లో నమ్మలేదు, దేవదూతలు కనిపించి యేసు పునరుత్థానం చేయబడినట్లు తమకు చెప్పారని విశ్వాసులైన స్త్రీలు చెప్పినా ఆయన నమ్మలేదు. (లూకా 23:55–24:11) కానీ ఆ రోజు ముగిసేసరికి పేతురు మనసులోని బాధ, అనుమానం పటాపంచలైపోయాయి. యేసు మళ్ళీ సజీవంగా ఉన్నాడు, ఇప్పుడాయన శక్తివంతమైన ఆత్మప్రాణి! ఆయన తన అపొస్తలులందరికీ కనిపించాడు. అయితే అంతకన్నా ముందు ఆయన ఒంటరిగా మరొకరికి కనిపించాడు. “ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడెను” అని అపొస్తలులు ఆ రోజు మాట్లాడుకున్నారు. (లూకా 24:34) “ఆయన కేఫాకును, తరువాత పండ్రెండుగురికిని కనబడిన” ఆ ప్రత్యేకమైన రోజు గురించి అపొస్తలుడైన పౌలు కూడా రాశాడు. (1 కొరింథీయులు 15:5) కేఫా, సీమోను అనే పేర్లు కూడా పేతురుకు ఉండేవి. యేసు ఆ రోజు పేతురును ఒంటరిగా కలిశాడని తెలుస్తుంది.

యేసు, పేతురు కలుసుకున్న ఆ ప్రత్యేకమైన సందర్భంలో ఏమి జరిగిందో బైబిలు చెప్పడం లేదు. కానీ, పేతురు తన ప్రియమైన ప్రభువును సజీవునిగా చూడగలిగినందుకు, ఆయనకు తన బాధ చెప్పుకుని క్షమాపణ అడిగే అవకాశం దొరికినందుకు ఎంత ఉప్పొంగిపోయివుంటాడో మనం ఊహించవచ్చు. అప్పుడు ఆయన అన్నిటికన్నా ఎక్కువగా కోరుకున్నది క్షమాపణే. యేసు ఆయనను క్షమించాడు, అదీ ఎంతో ఎక్కువగా క్షమించాడు, అందులో సందేహం లేదు. ఈ రోజు పాపంలో పడిపోయే క్రైస్తవులు పేతురుకు క్షమాపణ దొరికిందని గుర్తుచేసుకోవాలి. దేవుడు క్షమించలేనంత ఘోరమైన పాపం చేసేశామని మనం ఎప్పుడూ అనుకోకూడదు. యేసు, “బహుగా క్షమించే” తన తండ్రిని నూటికి నూరుపాళ్లు ప్రతిబింబించాడు.—యెషయా 55:7.

క్షమాపణకు అదనపు రుజువు

యేసు తన అపొస్తలులను గలిలయకు వెళ్లమని చెప్పాడు, అక్కడ వాళ్లాయనను మళ్లీ కలుసుకున్నారు. వాళ్లు అక్కడకు చేరుకున్నప్పుడు, పేతురు గలిలయ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లాలనుకున్నాడు. కొంతమంది వేరేవాళ్లు ఆయనతోపాటు వెళ్లారు. పేతురు ఒకప్పుడు తన జీవితంలో ఎక్కువ సమయం గడిపిన సరస్సు దగ్గరకు మళ్లీ వచ్చాడు. పడవ చేసే కిర్రుకిర్రుమనే శబ్దం, అలల తాకిడి, ఆయన చేతుల్లో ఉన్న వలల గరుకుదనం ఇవన్నీ ఆయనకు సుపరిచితమైనవే కాబట్టి ఆయనకెంతో హాయిగా అనిపించివుంటుంది. యేసు భూమ్మీద తన పరిచర్యను ముగించాడు కాబట్టి తన జీవితంలో ఇప్పుడు ఏమి చేయాలనే దాని గురించి ఆయన ఆ రాత్రి ఆలోచించాడా? జాలరిగా సామాన్య జీవితం గడిపితే బావుంటుంది అనుకున్నాడా? ఏదైతేనేం, వాళ్లు ఆ రాత్రంతా ఒక్క చేపను కూడా పట్టలేదు.—మత్తయి 26:32; యోహాను 21:1-3.

తెల్లవారుజామున ఒక వ్యక్తి ఒడ్డు నుండి వాళ్లను పిలిచి, పడవకు మరోవైపు వల వేయమని చెప్పాడు. వాళ్లు అలా చేసినప్పుడు వలలో 153 చేపలు చిక్కాయి! అలా చెప్పిన వ్యక్తి ఎవరో పేతురుకు తెలుసు. ఆయన పడవ నుండి దూకి, ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఒడ్డున యేసు నిప్పులమీద కాల్చిన చేపల్ని తినడానికి వారికిచ్చాడు. ఆయన పేతురుతో మాట్లాడడం మొదలుపెట్టాడు.

బహుశా వాళ్లు పట్టిన విస్తారమైన చేపలను చూపిస్తూ నీ ప్రభువును “వీటికంటే” ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని యేసు పేతురును అడిగాడు. పేతురు యేసుకన్నా చేపల వ్యాపారాన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా? పేతురు ఎలాగైతే మూడుసార్లు తన ప్రభువు తెలీదని చెప్పాడో, అలాగే మూడుసార్లు తన స్నేహితుల ముందు తన ప్రభువును ప్రేమిస్తున్నానని చెప్పుకునే అవకాశాన్ని యేసు ఆయనకు ఇచ్చాడు. పేతురు అలా చెప్తున్నప్పుడు, ఆ ప్రేమను ఎలా చూపించాలో యేసు ఆయనకు వివరించాడు. ఎలా చూపించాలంటే, పవిత్ర సేవకు అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి, క్రీస్తు గొఱ్ఱెలను అంటే ఆయన నమ్మకమైన అనుచరులను పోషించాలి, వాళ్ల గురించి శ్రద్ధ తీసుకోవాలి.—యోహాను 21:4-17, NW.

యేసు ఆ విధంగా తన దృష్టిలో, యెహోవా దృష్టిలో పేతురు ఇంకా విలువైనవాడేనని స్పష్టంచేశాడు. క్రీస్తు నిర్దేశం క్రింద పేతురు సంఘంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. పేతురును పూర్తిగా క్షమించానని యేసు ఎంతో స్పష్టంగా చూపించాడు! యేసు చూపించిన ఆ దయ పేతురు హృదయాన్ని చేరుకుంది, దాని నుండి ఆయన దయ చూపించడం నేర్చుకున్నాడు.

పేతురు తన నియామకాన్ని ఎన్నో సంవత్సరాలపాటు నమ్మకంగా నెరవేర్చాడు. యేసు చనిపోయే ముందురోజు ఆజ్ఞాపించినట్లు ఆయన తన సహోదరులను బలపర్చాడు. పేతురు దయగా, ఓపిగ్గా క్రీస్తు అనుచరుల గురించి శ్రద్ధ తీసుకుని, వారిని పోషించాడు. సీమోను, సంఘానికి ప్రయోజనం కలిగేలా స్థిరమైన, బలమైన ప్రభావం చూపించడం ద్వారా, నమ్మదగిన వ్యక్తిగా ఉండడం ద్వారా పేతురు లేదా రాయి అని యేసు తనకు పెట్టిన పేరుకు తగ్గట్టు జీవించాడు. దానికి నిదర్శనం పేతురు రాసిన రెండు ప్రేమపూర్వకమైన పత్రికలే, అవి బైబిల్లో చాలా ముఖ్యమైనవి. ఆ పత్రికల ద్వారా కూడా, పేతురు క్షమాపణ గురించి యేసు నుండి నేర్చుకున్న పాఠాన్ని ఎన్నడూ మర్చిపోలేదని తెలుస్తుంది.—1 పేతురు 3:8, 9; 4:8.

మనం కూడా ఆ పాఠాన్ని నేర్చుకుందాం. మనం చేసే ఎన్నో తప్పులకు దేవుణ్ణి ప్రతీరోజు క్షమించమని అడుగుతున్నామా? ఆ తర్వాత, యెహోవా మనల్ని క్షమించాడని, ఆ క్షమాపణ మనల్ని శుద్ధిపరుస్తుందని నమ్ముతున్నామా? అలాగే మనం కూడా మనచుట్టూ ఉన్నవారిని క్షమిస్తున్నామా? అలాచేస్తే, మనం పేతురులా విశ్వాసాన్ని, ఆయన బోధకునిలా దయను చూపిస్తాం. (w10-E 04/01)

[22వ పేజీలోని బ్లర్బ్‌]

పేతురు తన బోధకుని క్షమాపణ అవసరమైన ఎన్నో పొరపాట్లు చేశాడు, ప్రతీరోజు క్షమాపణ అవసరం రానివారు మనలో ఎవరున్నారు?

[23వ పేజీలోని చిత్రం]

‘ప్రభువు తిరిగి పేతురువైపు చూశాడు’

[24వ పేజీలోని చిత్రం]

“ప్రభువు . . . సీమోనునకు కనబడెను”