కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు క్రీస్తును పూర్తిగా అనుసరిస్తున్నారా?

మీరు క్రీస్తును పూర్తిగా అనుసరిస్తున్నారా?

మీరు క్రీస్తును పూర్తిగా అనుసరిస్తున్నారా?

‘మీరెలా నడుచుకుంటున్నారో అలాగే మరింత ఎక్కువగా నడుచుకుంటూ ఉండండి.’ —1 థెస్స. 4:1, NW.

1, 2. (ఎ) యేసు కాలంలోని చాలామంది ప్రజలు ఏ గొప్ప కార్యాలను చూశారు? (బి) మనం జీవిస్తున్న కాలం కూడా ఎందుకు చాలా ప్రత్యేకమైనది?

 యేసు భూమిపై జీవించిన కాలంలో జీవించివుంటే ఎంత బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా? యేసు చేతుల్లో స్వస్థతపొంది అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందేవాళ్లమని మీరు అనుకొనివుండవచ్చు. లేదా యేసును చూడాలని, ఆయన చెప్పేది వినాలని, ఆయన నుండి నేర్చుకోవాలని, ఆయన ఏదైనా అద్భుతం చేస్తుంటే చూడాలని ఎంతగానో కోరుకొనివుండవచ్చు. (మార్కు 4:1, 2; లూకా 5:3-9; 9:11) యేసు ఆ కార్యాలన్నీ చేస్తుండగా కళ్లారా చూడడం ఓ అరుదైన అవకాశమే! (లూకా 19:37, 38) ఆ తర్వాతి తరాల వారెవ్వరూ అంత గొప్ప కార్యాలను చూడలేదు. “తన్ను తానే బలిగా అర్పించుకొనుటవలన” యేసు భూమ్మీద సాధ్యం చేసింది మళ్లీ ఎన్నడూ పునరావృతం కాదు.—హెబ్రీ. 9:26; యోహా. 14:18, 19.

2 మనం జీవిస్తున్న కాలం కూడా చాలా ప్రత్యేకమైనది. ఎందుకు? లేఖనాలు చెబుతున్నట్లు మనం ‘అంత్యకాలంలో’ లేదా ‘అంత్యదినాల్లో’ జీవిస్తున్నాం. (దాని. 12:1-4, 9; 2 తిమో. 3:1) ఈ కాలంలోనే సాతాను పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. త్వరలోనే అతడు బంధించబడి ‘అగాధంలో’ పడవేయబడతాడు. (ప్రక. 12:7-9, 12; 20:1-3) అంతేకాదు, మరెన్నడూ పునరావృతం కాని ఓ గొప్ప పనిలో అంటే “రాజ్య సువార్త” ప్రకటిస్తూ త్వరలో పరదైసు రానుందనే వార్తను ప్రజలకు చేరవేసే పనిలో పాల్గొనే అరుదైన అవకాశం ఈ కాలంలో మన ముందు ఉంది.—మత్త. 24:14.

3. పరలోకానికి ఆరోహణమయ్యే కొద్ది క్షణాలముందు యేసు తన అనుచరులకు ఏమి చేయమని చెప్పాడు? ఆ పనిలో భాగంగా ఏమి చేయాల్సివుంది?

3 పరలోకానికి ఆరోహణమయ్యే కొద్ది క్షణాలముందు యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు: “మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” (అపొ. 1:8) ప్రపంచవ్యాప్తంగా జరిగే ఓ బోధనా కార్యక్రమం గురించి యేసు ఇక్కడ మాట్లాడాడు. ఏ లక్ష్యంతో ఆ పని జరుగుతుంది? అంతానికి ముందే మరి కొంతమందిని క్రీస్తు శిష్యులనుగా చేయడానికి ఆ పని జరుగుతుంది. (మత్త. 28:19, 20) క్రీస్తు అప్పగించిన పనిని నెరవేర్చడంలో విజయం సాధించాలంటే మనం ఏమి చేయాలి?

4. (ఎ) 2 పేతురు 3:11, 12 లోని పేతురు మాటలు ఏ విషయాన్ని నొక్కిచెబుతున్నాయి? (బి) మనం దేని విషయంలో జాగ్రత్త వహించాలి?

4 అపొస్తలుడైన పేతురు చెప్పిన ఈ మాటల్ని గమనించండి: “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతు. 3:11, 12) మనం దైవభక్తికి సంబంధించిన క్రియలు చేయడానికి ప్రాధాన్యతనివ్వాలంటే ఈ అంత్యదినాల్లో మెలకువగా ఉండాలన్న విషయాన్ని పేతురు మాటలు నొక్కిచెబుతున్నాయి. రాజ్య సువార్త ప్రకటించడం కూడా ఆ క్రియల్లో ఒకటి. క్రీస్తు ఇచ్చిన ప్రకటనా పనిని చేయడంలో మన ప్రపంచవ్యాప్త సహోదర సహోదరీలు చూపిస్తున్న ఉత్సాహాన్ని చూసినప్పుడు మనమెంతో సంతోషిస్తాం. అదే సమయంలో దేవుని సేవలో మన ఉత్సాహం నీరుగారేలా చేసే సాతాను లోకపు ఒత్తిళ్ల విషయంలో, మనకు వారసత్వంగా వచ్చిన బలహీనతల విషయంలో జాగ్రత్తపడాలని గుర్తిస్తాం. మనం క్రీస్తును అనుసరిస్తూ ఉండాలంటే మనమేమి చేయాలో ఇప్పుడు పరిశీలిద్దాం.

దేవుడిచ్చిన బాధ్యతల్ని సంతోషంగా స్వీకరించండి

5, 6. (ఎ) పౌలు యెరూషలేములోని తన తోటి విశ్వాసులను ఏ విషయంలో మెచ్చుకున్నాడు? దేని గురించి ఆయన హెచ్చరించాడు? (బి) దేవుడు ఇచ్చిన బాధ్యతలను మనం ఎందుకు తేలిగ్గా తీసుకోకూడదు?

5 అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో, హింసలను సహిస్తూ నమ్మకంగా సేవచేసినందుకు యెరూషలేములోని క్రైస్తవులను మెచ్చుకున్నాడు. ఆయనిలా అన్నాడు: “మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి.” అవును, వారు నమ్మకంగా చేసిన సేవను యెహోవా గుర్తుంచుకున్నాడు. (హెబ్రీ. 6:10; 10:32-34) పౌలు వారిని ప్రేమతో మెచ్చుకున్నాడు కాబట్టి వారు ఎంతో ప్రోత్సాహాన్ని పొందివుంటారు. అయితే, అదే పత్రికలో బలహీనతలను అదుపులో ఉంచుకోకపోతే దేవుని సేవలో మన ఉత్సాహం నీరుగారుతుందని కూడా పౌలు హెచ్చరించాడు. దేవుని ఆజ్ఞలను పాటించే విషయంలో క్రైస్తవులు సాకులు చెప్పకూడదని పౌలు చెప్పాడు.

6 దేవుడు అప్పగించిన బాధ్యతల నుండి తప్పించుకునే స్వభావం గురించి ఆయన ఇచ్చిన హెచ్చరిక నేటి క్రైస్తవులకు కూడా వర్తిస్తుంది. మన బాధ్యతలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోకుండా లేదా దేవుని సేవలో మన ఉత్సాహాన్ని నీరుగార్చుకోకుండా చూసుకోవాలనే కృతనిశ్చయం మనకు ఉండాలి. (హెబ్రీ. 10:39) ఎంతైనా, పవిత్ర సేవ చేయడమనేది జీవన్మరణాలకు సంబంధించిన విషయం.—1 తిమో. 4:16.

7, 8. (ఎ) దేవుని సేవలో మనం మన ఉత్సాహాన్ని కాపాడుకోవాలంటే ఏమి చేయాలి? (బి) మనకు మొదట్లో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు లేకపోతే యెహోవా విషయంలో, యేసు విషయంలో మనం ఏమి గుర్తుంచుకోవాలి?

7 దేవుడు ఇచ్చిన బాధ్యతల్ని నిర్వర్తించే విషయంలో సాకులు చెప్పకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి? ప్రాముఖ్యంగా, సమర్పించుకున్నప్పుడు మనం దేవునికి చేసిన ప్రమాణాన్ని, దానికున్న అర్థాన్ని ఎల్లప్పుడూ ధ్యానించాలి. మరో మాటలో చెప్పాలంటే, మన జీవితాల్లో ఆయన చిత్తం చేయడానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తామని యెహోవాకు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. (మత్తయి 16:24 చదవండి.) కాబట్టి, కొన్నిసార్లు మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: ‘నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడు దేవుని చిత్తం చేస్తానని చూపించిన కృతనిశ్చయాన్ని ఇప్పటికీ చూపిస్తున్నానా? లేక రోజులు గడుస్తుండగా నా ఉత్సాహం తగ్గిపోయిందా?’

8 నిజాయితీగా పరిశీలించుకున్న తర్వాత, యెహోవా సేవలో మనకున్న ఉత్సాహం తగ్గిపోయిందని మనకు అనిపిస్తే, ఉత్తేజపరిచే జెఫన్యా మాటల్ని గుర్తుచేసుకోవడం మంచిది. ఆయనిలా చెప్పాడు: “భయపడకుము . . . నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును.” (జెఫ. 3:16, 17) అభయాన్నిచ్చే ఈ మాటలు, బబులోను చెర నుండి విడుదలై యెరూషలేముకు తిరిగి వచ్చిన ప్రాచీన ఇశ్రాయేలీయులకు మొదట వర్తించాయి. అయితే, నేటి దేవుని ప్రజలకు కూడా ఆ మాటలు వర్తిస్తాయి. మనం చేసేది యెహోవా పని కాబట్టి ఆయన, ఆయన కుమారుడు మన బాధ్యతను నిర్వర్తించేందుకు కావాల్సిన శక్తిని, సహాయాన్ని అందిస్తారని గుర్తుంచుకోండి. (మత్త. 28:20; ఫిలి. 4:13) దేవుని పనిని మనం ఉత్సాహంగా చేస్తూ ఉండడానికి కృషి చేసినట్లయితే ఆయన మనల్ని ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తూ ఉండేందుకు సహాయం చేస్తాడు.

ఉత్సాహంగా ‘రాజ్యాన్ని మొదట వెదకండి’

9, 10. గొప్ప విందును గురించి యేసు చెప్పిన ఉపమానంలో ఏ విషయం వివరించబడింది? మనం ఆ ఉపమానం నుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?

9 ఒక పరిసయ్యుల అధికారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు యేసు గొప్ప విందును గురించిన ఓ ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్య వారసులయ్యేందుకు వివిధ వ్యక్తులకు ఇవ్వబడిన అవకాశాన్ని ఆ ఉపమానంలో వివరించాడు. “నెపములు” చెప్పడమంటే ఏమిటో కూడా ఆయన వివరించాడు. (లూకా 14:16-21 చదవండి.) యేసు ఉపమానంలో, ఆహ్వానితులు విందుకు రాకుండా ఉండేందుకు ఏదో ఒక సాకు చెప్పారు. ఒక వ్యక్తి తాను కొనుక్కున్న పొలాన్ని చూడడానికి వెళ్లాలని చెప్పాడు. మరో వ్యక్తి తాను కొనుక్కున్న పశువులను పరీక్షించడానికి వెళ్లాలన్నాడు. ఇంకో వ్యక్తి, ‘నాకు కొత్తగా పెళ్లైంది, నేను రాలేను’ అని అన్నాడు. ఇవన్నీ కుంటి సాకులే. పొలాన్నిగానీ, పశువుల్నిగానీ కొనేవారు ఆ తర్వాత ఆగమేగాలమీద వెళ్లి చూడాల్సిన పరిస్థితి రాకుండా వాటిని కొనేముందే జాగ్రత్తగా పరిశీలిస్తారు. కొత్తగా పెళ్లైనవారు కూడా అంత ప్రాముఖ్యమైన ఆహ్వానాన్ని స్వీకరించి విందుకు రావడం సాధ్యమే కదా? అందుకే, ఉపమానంలోని అతిథేయికి కోపమొచ్చిందంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు.

10 ఈ ఉపమానం నుండి దేవుని ప్రజలందరూ ఓ పాఠం నేర్చుకోవచ్చు. అదేమిటి? దేవుని సేవను పక్కనపెట్టేంతగా మనం మన సొంత పనులకు అంటే యేసు ఉపమానంలో ప్రస్తావించినలాంటి పనులకు ప్రాముఖ్యతనివ్వకూడదు. ఒక క్రైస్తవుడు తన సొంత పనులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తే, పరిచర్యలో ఆయన ఉత్సాహం మెల్లమెల్లగా తగ్గిపోతుంది. (లూకా 8:14 చదవండి.) మనకు అలా కాకూడదంటే, ‘దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెదకండి’ అని యేసు ఇచ్చిన ఉపదేశాన్ని పాటించాలి. (మత్త. 6:33) వృద్ధులు, యౌవనులు అనే తేడా లేకుండా దేవుని సేవకులందరూ ఆ ప్రాముఖ్యమైన ఉపదేశాన్ని పాటిస్తుండడాన్ని చూడడం మనకెంత ప్రోత్సాహాన్నిస్తుంది! నిజానికి, చాలామంది పరిచర్యలో ఎక్కువ సమయాన్ని గడిపేలా తమ జీవితాన్ని నిరాడంబరంగా మార్చుకునేందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నారు. ఉత్సాహంగా దేవుని రాజ్యాన్ని మొదట వెదకడం వల్ల నిజమైన సంతోషం, గొప్ప సంతృప్తి కలుగుతాయని తమ సొంత అనుభవం నుండి వారు తెలుసుకున్నారు.

11. ఉత్సాహంతో, పూర్ణహృదయంతో దేవుణ్ణి సేవించడం ప్రాముఖ్యమని ఏ బైబిలు ఉదాహరణ చూపిస్తోంది?

11 దేవుని సేవలో ఉత్సాహంగా పాల్గొనడం ఎంత ప్రాముఖ్యమో తెలుసుకునేందుకు, ఇశ్రాయేలు రాజైన యెహోయాషు జీవితంలో జరిగిన ఓ సంఘటనను చూద్దాం. సిరియా చేతుల్లో ఓటమిని చవిచూస్తామేమో అనుకొని కన్నీళ్లతో యెహోయాషు ఎలీషా దగ్గరికి వెళ్లాడు. విజయం సాధించేందుకు యెహోవా సహాయం చేస్తాడని సూచిస్తూ ఎలీషా కిటికీలో నుండి సిరియావైపు బాణాలను వేయమన్నాడు. ఇది రాజును ఉత్తేజపరచి ఉంటుంది. ఆ తర్వాత బాణాలను నేలకు వేయమని రాజుకు ఎలీషా చెప్పాడు. యెహోయాషు కేవలం మూడుసార్లు మాత్రమే బాణాలను నేలకు వేశాడు. ఒకవేళ యెహోయాషు ఐదారుసార్లు బాణాలు వేసివుంటే “సిరియనులు నాశనమగువరకు . . . వారిని హతము” చేసివుండేవాడు. అలా చేయనందుకు ఎలీషా ఆయనమీద మండిపడ్డాడు. యెహోయాషు ఉత్సాహం చూపించలేదు కాబట్టి కేవలం మూడుసార్లు మాత్రమే వారిపై విజయం సాధించాడు. (2 రాజు. 13:14-19) ఈ ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? మనం పూర్ణహృదయంతో, ఉత్సాహంతో తనను సేవిస్తేనే యెహోవా మనల్ని మెండుగా ఆశీర్వదిస్తాడు.

12. (ఎ) జీవితంలో కష్టాలు ఎదురౌతున్నా ఉత్సాహంతో దేవుని సేవ చేయడానికి మనకు ఏది సహాయం చేస్తుంది? (బి) పరిచర్యలో చురుగ్గా పాల్గొనడంవల్ల మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందుతున్నారో చెప్పండి.

12 జీవితంలో ఎదురయ్యే కష్టాలు దేవుని సేవలో మనం చూపించే ఉత్సాహాన్ని, అంకితభావాన్ని పరీక్షిస్తాయి. చాలామంది సహోదర సహోదరీలు తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమౌతున్నారు. ఇంకొంతమంది తీవ్ర అనారోగ్యం వల్ల యెహోవా సేవలో ఎక్కువ చేయలేకపోతున్నందుకు నిరుత్సాహపడుతున్నారు. అయితే పరిస్థితులు ఎలా ఉన్నా, మన ఉత్సాహాన్ని కాపాడుకొని, క్రీస్తును పూర్తిగా అనుసరిస్తూ ఉండేలా మనలో ప్రతీ ఒక్కరం చర్యలు తీసుకోవచ్చు. “క్రీస్తును అనుసరిస్తూ ఉండేందుకు మీకు ఏది సహాయం చేస్తుంది?” అనే బాక్సులో ఇవ్వబడిన కొన్ని సలహాలను, లేఖనాలను చూడండి. వాటిని మీరెలా పూర్తిగా పాటించగలరో ఆలోచించండి. మీరలా చేస్తే నిజమైన ఆశీర్వాదాలు అనుభవిస్తారు. పరిచర్యలో చురుగ్గా పాల్గొంటే మనం స్థిరంగా ఉంటాం, మన జీవితం మెరుగౌతుంది, మనకు నిజమైన శాంతి సంతోషాలు లభిస్తాయి. (1 కొరిం. 15:58) అంతేకాక, పూర్ణాత్మతో దేవుని సేవ చేసినట్లయితే, “[యెహోవా] దినపు రాకడకొరకు” కనిపెట్టుకొని ఉండగలుగుతాం.—2 పేతు. 3:11, 12.

మీ పరిస్థితుల్ని నిజాయితీగా పరిశీలించుకోండి

13. మనం దేవుణ్ణి పూర్ణాత్మతో సేవిస్తున్నామో లేదో తెలుసుకోవడానికి ఏమి చేయవచ్చు?

13 పూర్ణాత్మతో సేవ చేయడమనేది మనం పరిచర్యలో వెచ్చించే గంటల మీద ఆధారపడివుండదని గుర్తుంచుకోండి. అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు. ఒకవేళ ఒక వ్యక్తి ఆరోగ్య సమస్యలవల్ల ప్రతీనెల పరిచర్యలో కేవలం రెండు గంటలు వెచ్చించగలిగినా యెహోవా దాన్నిబట్టి ఎంతో సంతోషించవచ్చు. (మార్కు 12:41-44 ను పోల్చండి.) పూర్ణాత్మతో సేవిస్తున్నామో లేదో తెలుసుకోవాలంటే మన సామర్థ్యాల్ని, పరిస్థితుల్ని నిజాయితీగా పరిశీలించుకోవాలి. క్రీస్తు అనుచరులముగా మనం ఆయనలా ఆలోచించాలనుకుంటాం. (1 కొరింథీయులు 2:16 చదవండి.) యేసు తన జీవితంలో దేనికి ప్రాధాన్యతనిచ్చాడు? కపెర్నహూము నుండి వచ్చిన ప్రజలతో ఆయనిలా అన్నాడు: ‘నేను దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే పంపబడితిని.’ (లూకా 4:43; యోహా. 18:37) పరిచర్యలో యేసు చూపించిన ఉత్సాహాన్ని మనసులో ఉంచుకొని, మీరు మరింత ఎక్కువగా పరిచర్యను చేయగలరేమో చూడడానికి మీ పరిస్థితుల్ని పరిశీలించుకోండి.—1 కొరిం. 11:1.

14. మనం ఎలా పరిచర్యలో మరింత ఎక్కువగా పాల్గొనవచ్చు?

14 మన పరిస్థితుల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే, మనం పరిచర్యలో మరింత సమయం గడపగలమనే నిర్ధారణకు రావచ్చు. (మత్త. 9:37, 38) ఉదాహరణకు, ఇటీవలే పాఠశాల విద్యను పూర్తిచేసుకున్న వేలాదిమంది యువతీయువకులు ఇప్పుడు పరిచర్యలో మరింత ఎక్కువ చేస్తూ పయినీర్లుగా ఉత్సాహంతో సేవచేయడం వల్ల వచ్చే ఆనందాన్ని చవిచూస్తున్నారు. అలాంటి సంతోషాన్ని చవిచూడాలని మీకు కూడా అనిపిస్తోందా? కొంతమంది తమ పరిస్థితుల్ని పరిశీలించుకొని, స్వదేశంలో లేదా విదేశాల్లో ప్రచారకుల అవసరం ఎక్కువగా ఉన్నచోటికి వెళ్లగలమనే నిర్ధారణకు వచ్చారు. ఇంకొంతమంది సహోదరులు, వేరే భాష మాట్లాడే ప్రజలకు సహాయం చేయడానికి ఓ కొత్త భాషను నేర్చుకున్నారు. మనం మరింత ఎక్కువగా పరిచర్య చేయడం కష్టమనిపించవచ్చు. అయితే, అలా చేయడంవల్ల ఎన్నో ఆశీర్వాదాలను అనుభవిస్తాం. అంతేకాక, “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై” ఉండేలా మనం ఇతరులకు సహాయం చేయగలుగుతాం.—1 తిమో. 2:3, 4; 2 కొరిం. 9:6.

బైబిలు ఉదాహరణలను అనుసరించండి

15, 16. క్రీస్తును ఉత్సాహంగా అనుసరించే విషయంలో మనం ఎవరి మాదిరులను అనుకరించవచ్చు?

15 తనను అనుసరించమని అన్నప్పుడు యేసు అపొస్తలులుగా మారిన కొందరు ఎలా స్పందించారు? మత్తయి గురించి బైబిలు ఇలా చెబుతోంది: “అతడు సమస్తమును విడిచిపెట్టి, లేచి, ఆయనను వెంబడించెను.” (లూకా 5:27, 28) చేపలు పడుతున్న పేతురు, అంద్రెయల గురించి మనమిలా చదువుతాం: “వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.” ఆ తర్వాత యేసు, తమ తండ్రితో కలిసి వలలు బాగుచేసుకుంటున్న యాకోబు, యోహానులను చూశాడు. వారు యేసు ఆహ్వానానికి ఎలా స్పందించారు? “వెంటనే వారు తమ దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.”—మత్త. 4:18-22.

16 అపొస్తలుడైన పౌలుగా మారిన సౌలు కూడా మంచి మాదిరిగా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన క్రీస్తు అనుచరులను తీవ్రంగా హింసించినప్పటికీ, ఆయన తన ప్రవర్తనను మార్చుకొని క్రీస్తు నామం ధరించడానికి ‘ఏర్పరచుకోబడిన సాధనమయ్యాడు.’ ఆయన “వెంటనే సమాజమందిరములలో—యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను.” (అపొ. 9:3-22) ఆయన ఎన్నో కష్టాలను, హింసలను సహించాల్సివచ్చినా, తన ఉత్సాహాన్ని ఏనాడూ కోల్పోలేదు.—2 కొరిం. 11:23-29; 12:15.

17. (ఎ) క్రీస్తును అనుసరించే విషయంలో మీ ఆశ ఏమిటి? (బి) పూర్ణహృదయంతో, పూర్ణశక్తితో యెహోవా చిత్తం చేయడంవల్ల మనం ఏ ఆశీర్వాదాలను పొందుతాం?

17 ఆ శిష్యుల మంచి మాదిరిని అనుసరిస్తూ, క్రీస్తు అనుచరులుకమ్మని ఇవ్వబడిన ఆహ్వానానికి ఉత్సాహంగా, బేషరతుగా స్పందించాలనుకుంటాం. (హెబ్రీ. 6:11, 12) ఉత్సాహంగా, పూర్తిగా క్రీస్తును అనుసరించడానికి మనం కృషిచేస్తుండగా ఏ ఆశీర్వాదాలను అనుభవిస్తాం? దేవుని చిత్తం చేయడంలో సంతోషిస్తాం, సంఘంలో అదనపు సేవాధిక్యతల్ని, బాధ్యతల్ని స్వీకరించడంవల్ల వచ్చే సంతృప్తిని చవిచూస్తాం. (కీర్త. 40:8; 1 థెస్సలొనీకయులు 4:1 చదవండి.) మనం క్రీస్తును అనుసరించడానికి తీవ్రంగా కృషిచేస్తుండగా మనశ్శాంతి, సంతోషం, సంతృప్తి, దేవుని ఆమోదం, నిత్యమూ జీవించే అవకాశం వంటి శాశ్వతమైన, గొప్ప ఆశీర్వాదాలను చవిచూస్తాం.—1 తిమో. 4:10.

మీకు గుర్తున్నాయా?

• మనకు ఏ ప్రాముఖ్యమైన పని అప్పగించబడింది, మనం దాన్ని ఎలా పరిగణించాలి?

• మనం ఏ మానవ బలహీనత విషయంలో జాగ్రత్తపడాలి, ఎందుకు?

• నిజాయితీగా మనం ఏమి పరిశీలించుకోవాలి?

• క్రీస్తును అనుసరిస్తూ ఉండడానికి మనకేది సహాయం చేస్తుంది?

[అధ్యయన ప్రశ్నలు]

[27వ పేజీలోని బాక్సు/చిత్రం]

క్రీస్తును అనుసరిస్తూ ఉండడానికి మీకు ఏది సహాయం చేస్తుంది?

▪ ప్రతీరోజు దేవుని వాక్యాన్ని చదవండి, చదివినదాన్ని ధ్యానించండి.—కీర్త. 1:1-3; 1 తిమో. 4:15.

▪ దేవుని ఆత్మ సహాయం కోసం, నిర్దేశం కోసం తరచూ ప్రార్థించండి.—జెక. 4:6; లూకా 11:9, 13.

▪ పరిచర్యను ఎంతో ఉత్సాహంగా చేసేవారితో సహవసించండి.—సామె. 13:20; హెబ్రీ. 10:24, 25.

▪ మనం జీవించే కాలాల ప్రాముఖ్యతను గుర్తించండి.—ఎఫె. 5:15, 16.

▪ సాకులు చెప్పడం వల్ల వచ్చే పరిణామాలేమిటో గుర్తుంచుకోండి.—లూకా 9:59-62.

▪ మీరు సమర్పించుకున్నప్పుడు యెహోవాకు చేసిన ప్రమాణాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోండి. అంతేకాక, యెహోవాను ఆరాధించడం వల్ల, క్రీస్తును పూర్ణహృదయంతో అనుసరించడం వల్ల వచ్చే మెండైన ఆశీర్వాదాలను కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.—కీర్త. 116:12-14; 133:3; సామె. 10:22.