కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పురుషులారా, క్రీస్తు శిరస్సత్వానికి మీరు లోబడుతున్నారా?

పురుషులారా, క్రీస్తు శిరస్సత్వానికి మీరు లోబడుతున్నారా?

పురుషులారా, క్రీస్తు శిరస్సత్వానికి మీరు లోబడుతున్నారా?

“ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు.”—1 కొరిం. 11:3.

1. యెహోవా ఓ క్రమపద్ధతిగల దేవుడని ఎలా చెప్పవచ్చు?

 ‘యెహోవా, మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమునుబట్టి అవి యుండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు’ అని ప్రకటన 4:10, 11 చెబుతోంది. యెహోవా సమస్తాన్ని సృష్టించాడు కాబట్టి ఆయనే విశ్వసర్వాధిపతి, తన సృష్టి అంతటిమీద ఆయనకే అధికారముంది. యెహోవా “దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు” అనే వాస్తవం దేవదూతలు వ్యవస్థీకరించబడిన తీరులో కనిపిస్తోంది.—1 కొరిం. 14:33; యెష. 6:1-3; హెబ్రీ. 12:22, 23.

2, 3. (ఎ) యెహోవా మొట్టమొదటిగా ఎవరిని సృష్టించాడు? (బి) తన తండ్రి ముందు జ్యేష్ఠకుమారుని స్థానమేమిటి?

2 అసలు దేన్నీ సృష్టించకముందు యెహోవా దేవుడు ఎన్నో యుగాలు ఒంటరిగా ఉన్నాడు. ఆయన మొట్టమొదటిగా ఓ ఆత్మప్రాణిని సృష్టించాడు. ఆ ప్రాణి ఆయన ప్రతినిధిగా వ్యవహరించాడు కాబట్టి ‘వాక్యముగా’ పిలువబడ్డాడు. ఆ వాక్యము ద్వారానే సమస్తము ఉనికిలోకి వచ్చాయి. తర్వాత ఆ వాక్యము ఓ పరిపూర్ణ మానవునిగా భూమ్మీదకు వచ్చి యేసుక్రీస్తుగా పేరుపొందాడు.—యోహాను 1:1-3, 14 చదవండి.

3 దేవుని గురించి, ఆయన జ్యేష్ఠ కుమారుని గురించి మాట్లాడుతున్నప్పుడు వారిలో ఎవరి స్థానం గొప్పదని బైబిలు చెబుతోంది? అపొస్తలుడైన పౌలు దైవప్రేరణతో ఇలా చెప్పాడు: “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను.” (1 కొరిం. 11:3) తండ్రి శిరస్సత్వం కింద క్రీస్తు ఉన్నాడని దీన్నిబట్టి తెలుస్తుంది. తెలివిగల ప్రాణులు ఓ క్రమ పద్ధతిలో నడుచుకుంటూ శాంతిసమాధానాలతో ఉండాలంటే శిరస్సత్వం వహించేవారు ఉండడం, శిరస్సత్వానికి లోబడడం చాలా అవసరం. యేసు ‘ద్వారా సర్వము సృష్టించబడినప్పటికీ’ ఆయన కూడా దేవుని శిరస్సత్వానికి లోబడాలి.—కొలొ. 1:16.

4, 5. యెహోవా శిరస్సత్వానికి లోబడే విషయంలో యేసు ఎలా భావించాడు?

4 యెహోవా శిరస్సత్వానికి లోబడి భూమ్మీదకు వచ్చే విషయంలో యేసు ఎలా భావించాడు? లేఖనాలు ఆయన గురించి ఇలా చెబుతున్నాయి: “ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదుగాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్ను తాను తగ్గించుకొనెను.”—ఫిలి. 2:5-8.

5 యేసు అన్ని సందర్భాల్లో తన తండ్రి చిత్తానికి వినయంగా లోబడ్డాడు. ఆయన ఇలా చెప్పాడు: “నా అంతట నేనే ఏమియు చేయలేను . . . నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్టప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.” (యోహా. 5:30) అంతేకాక, “[నా తండ్రి] కిష్టమైన కార్యము నేనెల్లప్పుడును చేయుదును” అని అన్నాడు. (యోహా. 8:29) తన భూజీవితంలోని చివరి రోజుల్లో యేసు తన తండ్రికి ప్రార్థిస్తూ, “చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని” అని అన్నాడు. (యోహా. 17:4) దీన్నిబట్టి, దేవుని శిరస్సత్వాన్ని గుర్తిస్తూ దానికి లోబడడం యేసుకు కష్టమనిపించలేదని అర్థమౌతోంది.

తన తండ్రికి లోబడడంవల్ల కుమారుడు ఆశీర్వదించబడ్డాడు

6. యేసు ఏ మంచి లక్షణాలను చూపించాడు?

6 యేసు భూమ్మీదున్నప్పుడు ఎన్నో మంచి లక్షణాలను కనబరిచాడు. వాటిలో తన తండ్రిపట్ల చూపించిన గొప్ప ప్రేమ ఒకటి. “నేను తండ్రిని ప్రేమించుచున్నాను” అని ఆయన అన్నాడు. (యోహా. 14:31) అంతేకాక, ఆయన ప్రజలపట్ల ఎంతో ప్రేమను కనబరిచాడు. (మత్తయి 22:35-40 చదవండి.) యేసు ప్రజలతో కఠినంగా లేదా గర్వంగా ప్రవర్తించలేదు కానీ వారిని అర్థం చేసుకుంటూ కనికరంతో వ్యవహరించాడు. ఆయన ఇలా చెప్పాడు: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” (మత్త. 11:28-30) పెద్దాచిన్నా అనే తేడా లేకుండా గొర్రెల్లాంటి ప్రజలందరూ, మరి ముఖ్యంగా అణచివేయబడినవారు యేసు మంచి వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన ప్రకటించిన ప్రోత్సాహకరమైన సందేశాన్ని విని ఎంతో ఓదార్పు పొందారు.

7, 8. ధర్మశాస్త్రం ప్రకారం, రక్తస్రావంతోవున్న స్త్రీ ఏమి చేయకూడదు? అయితే యేసు ఆమెతో ఎలా వ్యవహరించాడు?

7 యేసు స్త్రీలతో ఎలా వ్యవహరించాడో ఆలోచించండి. చరిత్రంతటిలో, చాలామంది పురుషులు స్త్రీలపట్ల ఎంతో అగౌరవంగా ప్రవర్తించారు. ఆఖరికి ప్రాచీన ఇశ్రాయేలులోని మతనాయకులు కూడా అలాగే ప్రవర్తించారు. కానీ యేసు స్త్రీలతో గౌరవపూర్వకంగా వ్యవహరించాడు. 12 ఏళ్లుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీతో ఆయన వ్యవహరించిన తీరులో అది స్పష్టంగా కనిపిస్తుంది. వైద్యుల చేతుల్లో ‘ఆమె అనేక తిప్పలు పడి,’ బాగవ్వాలనే ఆశతో తన డబ్బంతా ఖర్చుపెట్టింది. అంత చేసినా, ఆమె ‘మరింత సంకటపడింది.’ ధర్మశాస్త్రం ప్రకారం ఆమె అపవిత్రురాలు. అంతేకాదు, ఆమెను ముట్టేవారు కూడా అపవిత్రులౌతారు.—లేవీ. 15:19, 25.

8 యేసు రోగులను బాగుచేస్తున్నాడని విన్నప్పుడు ఆమె, “నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును” అని అనుకొని యేసు చుట్టూ ఉన్న జనసమూహం మధ్యలోకి వెళ్లింది. యేసును ముట్టిన వెంటనే ఆమె బాగైంది. ఆమె తన వస్త్రాన్ని ముట్టడం తప్పని యేసుకు తెలుసు. అయినా ఆమెపై కోపగించుకోకుండా, దయతో వ్యవహరించాడు. అన్ని సంవత్సరాలు ఆమె పడిన బాధలను అర్థం చేసుకొని, ఆమె సహాయం కోసం ఎంతగానో కోరుకుంటుందని గ్రహించాడు. కనికరం నిండిన స్వరంతో యేసు ఆమెతో ఇలా అన్నాడు: “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము . . . నీకు స్వస్థత కలుగుగాక.”—మార్కు 5:25-34.

9. పిల్లల్ని తన దగ్గరికి రాకుండా చేయడానికి శిష్యులు ప్రయత్నించినప్పుడు యేసు ఎలా స్పందించాడు?

9 చిన్నపిల్లలు కూడా యేసు దగ్గరికి రావడానికి భయపడలేదు. ఒక సందర్భంలో ప్రజలు పిల్లల్ని ఆయన దగ్గరకు తీసుకువచ్చినప్పుడు ఆయన శిష్యులు ప్రజల్ని గద్దించారు. పిల్లలు తనకు ఇబ్బంది కలిగించడం యేసుకు ఇష్టంలేదనుకొని వారలా చేసివుంటారు. కానీ యేసుకు అలా అనిపించలేదు. “యేసు అది చూచి కోపపడి—చిన్నబిడ్డలను నాయొద్దకు రానియ్యుడి, వారి నాటంకపరచవద్దు; దేవునిరాజ్యము ఈలాటివారిదే” అని అన్నాడని లేఖనాలు చెబుతున్నాయి. యేసు అలా అన్న తర్వాత, “ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని, వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను.” ఏదో వచ్చారు కదా అనే ఉద్దేశంతో కాదుగానీ ఆప్యాయతతో వారిని దగ్గరకు తీసుకున్నాడు.—మార్కు 10:13-16.

10. యేసు తాను కనబరచిన లక్షణాలను ఎవరి దగ్గర నేర్చుకున్నాడు?

10 యేసు తన భూజీవితంలో ఎన్నో లక్షణాలు కనబరిచాడు కదా, ఆయన వాటిని ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? మానవునిగా పుట్టకముందు యేసు తన పరలోక తండ్రిని ఎన్నో యుగాలు గమనించి, ఆయన లక్షణాలను నేర్చుకున్నాడు. (సామెతలు 8:22, 23, 30 చదవండి.) పరలోకంలో ఉన్నప్పుడు యేసు, యెహోవా తన సృష్టి పట్ల ప్రేమపూర్వకంగా తన శిరస్సత్వాన్ని చూపించడం గమనించి, ఆయన మాదిరిని అనుసరించాడు. ఒకవేళ యేసు యెహోవాకు లోబడి ఉండకపోతే ఆయన ఆ మంచి లక్షణాలను చూపించగలిగేవాడా? తన తండ్రికి లోబడడమంటే ఆయనకు ఎంతో ఇష్టం. అంతేకాక, అలాంటి కుమారుడు ఉన్నందుకు యెహోవా కూడా ఎంతో సంతోషించాడు. భూమ్మీదున్నప్పుడు యేసు తన పరలోక తండ్రికున్న అద్భుతమైన లక్షణాలను పరిపూర్ణంగా కనబరిచాడు. పరలోక రాజ్యానికి రాజుగా నియమించబడిన క్రీస్తుకు లోబడివుండడం ఎంత గొప్ప అవకాశం!

క్రీస్తు లక్షణాలను అనుకరించండి

11. (ఎ) మనం ఎవరిని అనుకరించేందుకు కృషిచేయాలి? (బి) సంఘంలో ప్రత్యేకంగా పురుషులు యేసును అనుకరించేందుకు ఎందుకు కృషిచేయాలి?

11 క్రైస్తవ సంఘంలోని వారందరూ మరిముఖ్యంగా పురుషులు క్రీస్తు లక్షణాలను అనుకరించేందుకు ఎప్పుడూ కృషిచేయాలి. మనం ముందే చూసినట్లు, “ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు” అని బైబిలు చెబుతోంది. క్రీస్తు తన శిరస్సు అయిన యెహోవాను అనుకరించినట్లే క్రైస్తవ పురుషులు తమ శిరస్సు అయిన క్రీస్తును అనుకరించేందుకు కృషిచేయాలి. క్రైస్తవునిగా మారిన తర్వాత అపొస్తలుడైన పౌలు సరిగ్గా అదే చేశాడు. అందుకే, “నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి” అని తన తోటి క్రైస్తవులను ఆయన ప్రోత్సహించగలిగాడు. (1 కొరిం. 11:1) అంతేకాక, అపొస్తలుడైన పేతురు ఇలా చెప్పాడు: “ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరి యుంచిపోయెను.” (1 పేతు. 2:20, 21) పురుషులు ప్రత్యేకంగా మరో కారణాన్ని బట్టి కూడా క్రీస్తును అనుకరించాలనే ప్రోత్సాహానికి ప్రాముఖ్యతనిస్తారు. వారే పెద్దలుగా, పరిచర్య సేవకులుగా నియమించబడతారు. యెహోవాను అనుకరించడానికి యేసు ఇష్టపడినట్లే, క్రైస్తవ పురుషులు క్రీస్తును, ఆయన లక్షణాలను అనుకరించడానికి ఇష్టపడాలి.

12, 13. తమ కాపుదలలో ఉన్న గొర్రెల పట్ల పెద్దలు ఎలా వ్యవహరించాలి?

12 క్రైస్తవ సంఘ పెద్దలు క్రీస్తును అనుకరించడం నేర్చుకోవాలి. పేతురు, పెద్దలను ఇలా హెచ్చరించాడు: “బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభాపేక్షతో కాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి.” (1 పేతు. 5:1-3) సంఘ పెద్దలు నియంతల్లా, అధికారం చెలాయించేవారిలా కఠినంగా వ్యవహరించకూడదు. వారు క్రీస్తులా మంద అవసరాల్ని అర్థం చేసుకుంటూ తమ కాపుదలలో ఉన్న గొర్రెల పట్ల ప్రేమగా, దయగా, వినయంగా వ్యవహరించడానికి కృషిచేయాలి.

13 సంఘంలో నాయకత్వం వహిస్తున్నవారు తాము అపరిపూర్ణులమని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. (రోమా. 3:23) అందుకే, వారు యేసు గురించి తెలుసుకొని, ఆయన ప్రేమను అనుకరించడానికి ఆసక్తి చూపించాలి. యెహోవా దేవుడు, క్రీస్తు ప్రజలతో ఎలా వ్యవహరించారో ధ్యానిస్తూ, వారిని అనుకరించేందుకు కృషిచేయాలి. పేతురు మనల్ని ఇలా ప్రోత్సహించాడు: “మీరందరు ఎదుటివానియెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.”—1 పేతు. 5:5.

14. పెద్దలు ఎంతమేరకు ఇతరులను గౌరవించాలి?

14 దేవుని మందతో వ్యవహరిస్తున్నప్పుడు సంఘంలోని నియమిత పురుషులు మంచి లక్షణాలను చూపించాలి. రోమీయులు 12:10 ఇలా చెబుతోంది: “సహోదర ప్రేమ విషయములో ఒకనియందొకడు అనురాగముగల వారై, ఘనతవిషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి.” పెద్దలు, పరిచర్య సేవకులు ఇతరులను గౌరవిస్తారు. సంఘంలోని ఇతరుల్లాగే, ఈ పురుషులు ‘కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై ఇతరులు తమకన్నా యోగ్యులని ఎంచాలి.’ (ఫిలి. 2:3) నాయకత్వం వహించేవారు ఇతరులను తమకన్నా అధికులుగా పరిగణించాలి. అలా చేయడం ద్వారా వారు పౌలు ఇచ్చిన ఈ ఉపదేశాన్ని అనుసరించగలుగుతారు: “బలవంతులమైన మనము, మనలను మనమే సంతోషపరచుకొనక, బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్ధులమై యున్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తుకూడ తన్ను తాను సంతోషపరచుకొనలేదు.”—రోమా. 15:1-3.

‘భార్యలను గౌరవించండి’

15. ఓ భర్త తన భార్యతో ఎలా వ్యవహరించాలి?

15 ఇప్పుడు వివాహితులైన పురుషులకు పేతురు ఇచ్చిన ఉపదేశాన్ని గమనించండి. ఆయన ఇలా రాశాడు: ‘పురుషులారా [భర్తలారా], ఎక్కువ బలహీనమైన ఘటమని [మీ] భార్యను సన్మానించి, జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి.’ (1 పేతు. 3:7) ఎవరినైనా సన్మానించడం లేక గౌరవించడం అంటే వారికి ఎంతో విలువ ఇవ్వడమని అర్థం. అలా చేసినప్పుడు మీరు ఆ వ్యక్తి అభిప్రాయాలను, అవసరాలను, కోరికలను పరిగణలోకి తీసుకుంటారు. బలమైన కారణం ఉంటే తప్ప మీరు వారి అభిప్రాయాన్ని తిరస్కరించరు. ఓ భర్త కూడా భార్యతో ఆ విధంగానే ప్రవర్తించాలి.

16. భార్యను సన్మానించే విషయంలో భర్తలకు దేవుని వాక్యం ఏ హెచ్చరికనిస్తోంది?

16 భార్యను సన్మానించాలని పేతురు భర్తలకు చెబుతున్నప్పుడు “మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు” అలా చేయమని హెచ్చరించాడు. (1 పేతు. 3:7) ఓ భర్త తన భార్యతో వ్యవహరించే తీరును యెహోవా ఎంత గంభీరంగా తీసుకుంటాడో దీన్నిబట్టి అర్థమౌతోంది. భార్యను గౌరవించకపోతే భర్త ప్రార్థనలకు ఆటంకం కలుగుతుంది. అంతేకాక, తమ భర్తలు తమతో గౌరవపూర్వకంగా వ్యవహరిస్తే భార్యలు కూడా సానుకూలంగా స్పందిస్తారు కదా?

17. భర్త తన భార్యను ఎంతగా ప్రేమించాలి?

17 భార్యను ప్రేమించడం గురించి దేవుని వాక్యం ఇలా ఉపదేశిస్తోంది: “పురుషులుకూడ తమ సొంతశరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు . . . తన శరీరమును ద్వేషించినవాడెవడును లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును . . . ఆలాగే క్రీస్తుకూడ సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తననువలె తన భార్యను ప్రేమింపవలెను.” (ఎఫె. 5:28, 29, 33) భర్త తన భార్యను ఎంతగా ప్రేమించాలి? పౌలు ఇలా చెప్పాడు: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫె. 5:25) క్రీస్తు ఇతరుల కోసం తన ప్రాణాలను ఇవ్వడానికి వెనకాడనట్లే, భర్త తన భార్య కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనకాడకూడదు. క్రైస్తవ భర్త తన భార్యతో మృదువుగా, దయగా, నిస్వార్థంగా వ్యవహరిస్తూ ఆమె మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వింటే ఆయన శిరస్సత్వానికి లోబడడం భార్యకు కూడా సులభమౌతుంది.

18. భార్యతో గౌరవపూర్వకంగా వ్యవహరించేలా భర్తకు ఏ సహాయం అందుబాటులో ఉంది?

18 భార్యను గౌరవించడమనే ఆజ్ఞను పాటించడం భర్తలకు చాలా కష్టమా? కాదు, వారికి సాధ్యంకానిది చేయమని యెహోవా ఎన్నడూ అడగడు. అదీగాక, విశ్వంలోనే అత్యంత శక్తివంతమైన దేవుని పరిశుద్ధాత్మ సహాయం వారికి ఉంది. యేసు ఇలా చెప్పాడు: “మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును.” (లూకా 11:12, 13) ఇతరులతోనే కాక భార్యతో కూడా మంచిగా వ్యవహరించేలా పరిశుద్ధాత్మ సహాయం ఇవ్వమని భర్తలు యెహోవాకు ప్రార్థించవచ్చు.—అపొస్తలుల కార్యములు 5:32 చదవండి.

19. మనం తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చూస్తాం?

19 నిజానికి, క్రీస్తుకు లోబడి ఆయన శిరస్సత్వాన్ని ఎలా అనుకరించాలో నేర్చుకునే బరువైన బాధ్యత పురుషులపై ఉంది. మరి స్త్రీల, ప్రత్యేకంగా భార్యల విషయమేమిటి? యెహోవా ఏర్పాటులో తమకున్న పాత్రను వారెలా పరిగణించాలో తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

మీకు గుర్తున్నాయా?

• యేసు చూపించిన ఏ లక్షణాలను మనం అనుకరించాలి?

• తమ కాపుదలలో ఉన్న గొర్రెలతో సంఘ పెద్దలు ఎలా వ్యవహరించాలి?

• ఓ భర్త తన భార్యతో ఎలా వ్యవహరించాలి?

[అధ్యయన ప్రశ్నలు]

[10వ పేజీలోని చిత్రాలు]

ఇతరులను గౌరవించడం ద్వారా యేసును అనుకరించండి