కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితులకు ఎలా సహాయం చేయాలి?

అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితులకు ఎలా సహాయం చేయాలి?

అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితులకు ఎలా సహాయం చేయాలి?

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితులతో ఏమి మాట్లాడాలో తెలీక మీరు ఎప్పుడైనా అయోమయంలో పడ్డారా? ఈ సమస్యను మీరు తప్పకుండా అధిగమించవచ్చు. ఎలా? ఖచ్చితంగా ఇలాగే మాట్లాడాలనే నియమమేదీ లేదు. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి సంస్కృతిని మనం పరిగణలోకి తీసుకోవాల్సివుంటుంది. అంతేకాకుండా, అందరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉండకపోవచ్చు. కాబట్టి, అనారోగ్యంతో ఉన్న ఒకరికి సాంత్వననిచ్చేవి మరొకరికి ఇవ్వకపోవచ్చు. పరిస్థితులు, భావోద్రేకాలు కూడా ఒకరోజు ఉన్నట్టు మరో రోజు ఉండకపోవచ్చు.

కాబట్టి ప్రాముఖ్యమైన విషయమేమిటంటే, మీకే అలాంటి పరిస్థితి వచ్చినట్టు ఊహించుకుని, మీ నుండి వాళ్లకు నిజంగా ఎలాంటి సహాయం అవసరమో గ్రహించండి. మీరు దీన్ని ఎలా చేయవచ్చు? బైబిలు సూత్రాల ప్రకారం ఇక్కడ కొన్ని సలహాలు ఇవ్వబడ్డాయి.

చక్కగా వినండి

బైబిలు సూత్రాలు:

‘ప్రతి ఒక్కరూ వినడానికి ఆత్రపడాలి, మాట్లాడడానికి నిదానించాలి.’యాకోబు 1:19, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

‘మాట్లాడడానికి, మౌనంగా ఉండడానికి సమయముంది.’ప్రసంగి 3:1, 7.

▪ అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితుల దగ్గరకు వెళ్లినప్పుడు వాళ్లు చెప్పేది జాగ్రత్తగా వినండి, వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకోండి. వెంటనే సలహాలు ఇవ్వకండి, ప్రతీదానికి పరిష్కారం చూపించాలనుకోకండి. వాళ్లను బాధపెట్టాలనే ఉద్దేశం మీకు లేకపోయినా, ఏదో ఒకటి మాట్లాడాలనే తొందరలో వాళ్లకు బాధ కలిగించే మాటలేమైనా అనే అవకాశముంది. మీ స్నేహితులు పరిష్కారం కోసం ఎదురుచూడకపోవచ్చు గానీ తమ బాధను మనస్ఫూర్తిగా వినేవాళ్ల కోసం ఎదురుచూస్తుండవచ్చు.

వాళ్ల మనసులోని బాధనంతా మీతో చెప్పుకోనివ్వండి. వాళ్ల మాటలకు అడ్డు చెప్పకండి. వాళ్లు పడుతున్న బాధ అంత పెద్దదేమీ కాదన్నట్టు మాట్లాడకండి. ఎమిల్యో a అనే వ్యక్తి ఇలా చెప్తున్నాడు, “నాకు ఫంగల్‌ మెనింజైటిస్‌ (మెదడు వాపు వ్యాధి) రావడంతో నా కంటి చూపు పోయింది, కొన్నిసార్లు నేను చాలా కృంగిపోతాను, ‘సమస్యలు ఉన్నది నీకు ఒక్కడికే కాదు, నీకన్నా ఘోరమైన బాధలుపడుతున్న వాళ్లు ఉన్నారు’ అంటూ స్నేహితులు నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, నా పరిస్థితిని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన నాకు ఉపశమనం దొరకదని వాళ్లు గ్రహించరు. అలాంటి మాటలు ఉపశమనమివ్వడం కాదుగానీ నన్ను మరింత కృంగదీస్తాయి.”

మీరు విమర్శిస్తారేమోనని మీ స్నేహితులు భయపడకుండా, వాళ్లు తమ మనసులోని బాధను మీతో చెప్పుకోగలిగేలా ఉండండి. వాళ్లు భయపడుతున్నామని చెప్తే, భయపడకండని ఊరికే చెప్పేయకుండా వాళ్ల భావాలను అర్థంచేసుకోండి. క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతున్న ఇలియానా ఇలా చెప్తోంది, “నా పరిస్థితి గురించి బాధపడుతూ ఏడుస్తున్నానంటే దానర్థం దేవుని మీద నాకు నమ్మకం లేదని కాదు.” వాళ్లను వాళ్లలా ఉండనివ్వండి, మీరు అనుకున్నట్టు వాళ్లు ఉండాలని ఆశించకండి. వాళ్ల పరిస్థితి ముందులా మామూలుగా ఉండదు కాబట్టి మీరనే మాటలు వాళ్లను వెంటనే బాధపెట్టవచ్చని గుర్తుంచుకోండి. వాళ్లు చెప్పిన విషయాలే చెప్తున్నా సరే ఓపికగా వినండి. (1 రాజులు 19:9, 10, 13, 14) ఎందుకంటే, వాళ్లు తమ బాధను మీతో చెప్పుకోవాలని అనుకోవచ్చు.

సహానుభూతి చూపించి, వాళ్ల అవసరాలను తెలుసుకోండి

బైబిలు సూత్రాలు:

‘సంతోషించే వాళ్లతో సంతోషించండి. ఏడ్చే వాళ్లతో ఏడ్వండి.’రోమీయులు 12:15.

‘మనుష్యులు మీకు ఏమి చేయాలని మీరు కోరుకుంటారో మీరూ వాళ్లకు అలాగే చేయండి.’మత్తయి 7:12.

▪ వాళ్ల పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఒకవేళ వాళ్లు ఆపరేషన్‌కు సిద్ధపడుతున్నా, చికిత్స పొందుతున్నా, రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నా వాళ్లు చాలా ఆందోళనతో భయపడుతూ ఉండవచ్చు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అంతేకాదు, ఉన్నట్టుండి మారిపోయే వాళ్ల మానసిక స్థితికి తగినట్టు స్పందించండి. ఇలాంటి పరిస్థితులలో వాళ్లను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయకండి, ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు అడగకండి.

ఆన కాటాలీఫాజ్‌ అనే ఒక సైకాలజిస్టు ఇలా చెప్తోంది, “రోగి తన వ్యాధి గురించి చెప్పుకోడానికి ఇష్టపడినప్పుడు అతని సొంత పద్ధతిలో అతన్ని చెప్పనివ్వండి. వాళ్లు మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు, వాళ్లు ఏ విషయాల గురించి మాట్లాడాలనుకుంటే ఆ విషయాలే వాళ్లతో మాట్లాడండి. మాట్లాడడం వాళ్లకు ఇష్టం లేకపోతే వాళ్లను మాట్లాడించకుండా మౌనంగా ఉండండి. స్నేహపూర్వకమైన స్పర్శ కొండంత ధైర్యాన్ని ఇవ్వగలదు. కొన్నిసార్లు వాళ్లు తమ దుఃఖాన్ని చెప్పుకోవడానికి ఎవరైనా ఉంటే బావుండునని అనుకుంటారు.”

వాళ్ల ఏకాంతాన్ని పాడుచేయకండి. రెండుసార్లు క్యాన్సర్‌ వ్యాధి నుండి బయటపడిన రొసాన్‌ కేలిక్‌ అనే రచయిత్రి తన పుస్తకంలో ఇలా రాసింది, “రోగికి సంబంధించిన విషయాలు అందరికీ చెప్పవచ్చని కుటుంబ సభ్యులు అంటేనే అందరికీ చెప్పండి. ఇతరులకు ఏ విషయాల గురించి చెప్పాలో, ఏ విషయాలు చెప్పకూడదో రోగిని అడగండి.” క్యాన్సర్‌ వ్యాధి నుండి బయటపడిన ఎడ్సన్‌ ఇలా చెప్తున్నాడు, “నాకు క్యాన్సర్‌ వచ్చిందని, నేను ఎక్కువ రోజులు బ్రతకనని నా స్నేహితుడు అందరికీ చాటించాడు. నిజమే, నాకు ఆ మధ్య ఆపరేషన్‌ అయింది. నాకు క్యాన్సర్‌ ఉందన్న విషయం నాకు తెలుసు. అయితే, నేను బయాప్సీ రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నాను, రిపోర్టులో నాకు క్యాన్సర్‌ శరీరంలో ఇంకా ఎక్కడా వ్యాపించలేదని వచ్చింది. అయితే, నా స్నేహితుడు చాటించిన వార్త మమ్మల్ని నిజంగా చాలా బాధపెట్టింది. వేరేవాళ్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ముందూవెనకా ఆలోచించకుండా మాట్లాడారు, ఇది నా భార్యను చాలా కృంగదీసింది.”

మీ స్నేహితులు ఏ చికిత్స చేయించుకుంటే మంచిదోనని ఆలోచిస్తున్నప్పుడు, మీరు తొందరపడి, వాళ్ల పరిస్థితుల్లో ఉంటే ఫలానా విధంగా చేస్తామని వాళ్లతో అనకండి. క్యాన్సర్‌ వ్యాధి నుండి బయటపడిన లారీ హోప్‌ అనే రచయిత్రి ఇలా చెప్తోంది, “క్యాన్సర్‌ రోగికి లేదా ఆ వ్యాధి నుండి బయటపడిన వాళ్లకు ఏవైనా ఆర్టికల్స్‌గానీ, వార్తలు గానీ పంపించాలనుకుంటే, అలాంటివి చదవడానికి వాళ్లు ఇష్టపడతారో లేదో ముందు అడిగి తెలుసుకోవడం మంచిది. లేకపోతే, మీరు మంచి ఉద్దేశంతో సహాయం చేయాలనుకున్నా అది వాళ్లను బాధ పెట్టే అవకాశముంది, ఆ విషయం ఎప్పటికీ మీ దృష్టికి రాకపోవచ్చు.” వివిధ రకాల వైద్య చికిత్సలకు సంబంధించిన ఎక్కువ సమాచారం తెలుసుకోవడం అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు.

మీకు చాలా దగ్గరి స్నేహితులైనా సరే వాళ్లతో ఎక్కువసేపు ఉండకండి. మీరు వాళ్లతో ఉండడం చాలా ముఖ్యమే అయినా, వాళ్లు మీతో సమయం గడిపే స్థితిలో ఉండకపోవచ్చు. వాళ్లు అలసిపోయివుండవచ్చు, మాట్లాడేంత శక్తి ఉండకపోవచ్చు, వాళ్లకు ఎక్కువసేపు వినే ఓపిక కూడా ఉండకపోవచ్చు. అయితే, మీరు పని తొందరలో ఉన్నట్టు కూడా చేయకండి. మీకు వాళ్ల మీద ఎంత శ్రద్ధ ఉందో వాళ్లకు తెలియాలి.

వాళ్ల పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటూ ఏమి చేయాలో నిర్ణయించుకోండి. ఉదాహరణకు, వాళ్లకు భోజనం తయారు చేసి తీసుకువెళ్లే ముందు వాళ్లు ఏమి తినవచ్చో అడిగి తెలుసుకుంటే బావుంటుంది. ఒకవేళ మీకు ఒంట్లో బాగోలేకపోతే, అంటే జలుబు లాంటివి ఉంటే, అవి తగ్గేంతవరకు వాళ్ల దగ్గరకు వెళ్లకపోతే మంచిది.

ప్రోత్సాహకరంగా మాట్లాడండి

బైబిలు సూత్రాలు:

‘జ్ఞానం గలవాళ్ల మాటలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.’సామెతలు 12:18, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

‘మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎప్పుడూ రుచిగలదిగా కృపాసహితంగా ఉండనివ్వండి.’కొలొస్సయులు 4:6.

▪ అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితుల మీద మీకు సానుకూల దృక్పథముంటే మీ మాటల్లో, పనుల్లో అది తెలుస్తుంది. మీ స్నేహితులు ఏమీ మారలేదని, ఒకప్పుడు వాళ్లలో మీకు నచ్చిన లక్షణాలే ఇప్పటికీ వాళ్లల్లో ఉన్నాయని గుర్తుంచుకోండి. వాళ్లతో వ్యాధి రాకముందు ఎలా ఉండేవాళ్లో ఇప్పుడు కూడా అలాగే ఉండండి. మీరు మీ స్నేహితులతో నిస్సహాయ వ్యక్తులతో మాట్లాడినట్లు మాట్లాడితే వాళ్లు తమ గురించి తాము అలాగే అనుకోవచ్చు. పుట్టుకతో వచ్చిన అరుదైన ఎముకల వ్యాధితో బాధపడుతున్న రాబర్టా ఇలా చెప్తోంది, “నన్ను మామూలు మనిషిగా చూడండి. నాకు ఆరోగ్యం బాగోలేదు నిజమే కానీ నాకంటూ నా సొంత అభిప్రాయాలు, కోరికలు ఉన్నాయి. దయచేసి నా మీద సానుభూతి చూపించకండి. నన్ను ఒక పిచ్చిదానిలా చూడకండి.”

మీరు చెప్పేదే కాదు, ఎలా చెప్తున్నారనేది కూడా ముఖ్యమని గుర్తుంచుకోండి. ఏ స్వరంతో చెప్తున్నారనేది కూడా చూసుకోండి. అర్నెస్టుకు క్యాన్సర్‌ ఉందని తెలిసిన కొన్నిరోజులకే వేరే దేశంలో ఉంటున్న ఒక స్నేహితుడు ఆయనకు ఫోన్‌ చేసి, “నీకు క్యాన్సర్‌ వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు!” అన్నాడు. దాని గురించి అర్నెస్టు ఇలా చెప్తున్నాడు, “‘నీకు క్యాన్సర్‌’ అన్న మాటలను ఆయన గట్టిగా నొక్కి చెప్తుంటే నాకు వెన్నులో వణుకు పుట్టింది.”

లారీ హోప్‌ అనే రచయిత్రి మరో ఉదాహరణ గురించి చెప్తోంది, “‘ఎలా ఉన్నారు?’ అనే మాటను రోగి ఎన్నో రకాలుగా అర్థం చేసుకునే అవకాశముంది. అడిగేవాళ్ల స్వరాన్నిబట్టి, వాళ్ల హావభావాలను బట్టి, వాళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని బట్టి, సాన్నిహిత్యాన్ని బట్టి, అడిగిన సమయాన్ని బట్టి ఆ ప్రశ్న ఓదార్పునివ్వవచ్చు లేదా బాధను కలిగించవచ్చు, వాళ్లలో ఉన్న భయాన్ని పెంచవచ్చు.”

అనారోగ్యంతో బాధపడుతున్న మీ స్నేహితులు తమను పట్టించుకోవాలని, తమను అర్థం చేసుకోవాలని, గౌరవించాలని కోరుకుంటారు. కాబట్టి, మీకు వాళ్ల మీద శ్రద్ధ ఉందని, వాళ్లకు అవసరమైన సహాయం చేస్తారని వాళ్లలో నమ్మకం కలిగించండి. మెదడు కంతి వచ్చిన రోజ్‌మేరీ ఇలా చెప్తోంది, “నిన్ను ప్రేమిస్తున్నామనీ ఏమి జరిగినా నీ పక్కనుంటామనీ నా స్నేహితులు చెప్పిన మాటలు నాకెంతో ధైర్యాన్నిచ్చాయి.”—సామెతలు 15:23; 25:11.

సహాయపడండి

బైబిలు సూత్రం:

‘మాటలతో, నాలుకతో కాకుండా, క్రియలతో, సత్యంతో ప్రేమిద్దాం.’1 యోహాను 3:18.

▪ వ్యాధి తెలుసుకునే దశ నుండి చికిత్స మొదలయ్యే దశకు చేరుకునే సరికి మీ స్నేహితుల అవసరాలు కూడా మారతాయి. ఈ సమయమంతటిలో ఆయనకు సహాయం అవసరం కావచ్చు. “మీకు సహాయం అవసరమైతే ఫోన్‌ చేయండి” అని చెప్పే బదులు, ఫలానా పని చేసిపెడతానని చెప్పండి. రోజువారీ పనుల్లో అంటే వంట, ఇంటి పనులు, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, సరుకులు కొనుక్కురావడం, బజారుకు వెళ్లి చేసే పనులు, మీ స్నేహితులను హాస్పిటల్‌కు తీసుకువెళ్లి, తీసుకురావడం వంటి కొన్ని పనులు చేసిపెట్టడం ద్వారా వాళ్ల పట్ల మీకు శ్రద్ధ ఉందని చూపించవచ్చు. చేస్తానని చెప్పినవి తప్పక చేయండి. వాటిని సమయానికి చేసిపెట్టండి.—మత్తయి 5:37.

రొసాన్‌ కేలిక్‌ అనే రచయిత్రి ఇలా చెప్తోంది, “రోగి కోలుకోవడానికి మనం చేసే ఏ పనైనా అది చిన్నదిగానీ పెద్దదిగానీ ఎంతో సహాయకరంగా ఉంటుంది.” రెండుసార్లు క్యాన్సర్‌ వ్యాధి నుండి బయటపడిన సిల్వియా ఆమెతో ఏకీభవిస్తూ ఇలా చెప్తోంది, “రోజుకు ఒకరు చొప్పున నా స్నేహితులు నన్ను రోజూ రేడియేషన్‌ కోసం వేరే నగరానికి తీసుకువెళ్లి తీసుకువచ్చేవాళ్లు. అది నాకు హాయినిచ్చేది, బాధను కూడా మర్చిపోయేదాన్ని! దారిలో మేము చాలా విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం, చికిత్స తర్వాత, కాఫీ తాగడానికి ఎప్పుడూ ఒక కాఫీ షాపు దగ్గర ఆగేవాళ్లం. దాంతో నేను మళ్లీ మామూలు మనిషిని అయిపోయినట్లు అనిపించేది.”

మీ స్నేహితులకు ఏమి కావాలో ఖచ్చితంగా మీకు తెలుసనుకోకండి. కాలిక్‌ ఇలా సలహా ఇస్తోంది, “అడగండి, అడగండి, అడగండి. సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ల మీద అధికారం చెలాయించకండి. అలా చేస్తే మీ ఉద్దేశం దెబ్బతినడమే కాదు, రోగికి చికాకు కూడా కలగవచ్చు. మీరు వాళ్లను ఏ పని చేయనివ్వకపోతే, వాళ్లు చేతకానివాళ్లని మీరు అనుకుంటున్నట్టు అవుతుంది. నాకు సామర్థ్యముందని నాకనిపించాలి. నేను బాధితురాలిని కాదని నాకనిపించాలి. నాకు చేతనైనవి చేయడానికి నాకు సహాయం చేయండి.”

మీ స్నేహితులు తమకు సామర్థ్యముందని అనుకోవాలి. ఎయిడ్స్‌తో బాధపడుతున్న అడిల్‌సన్‌ ఇలా చెప్తున్నాడు, “మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనమెందుకూ పనికిరాని వారమన్నట్లు లేదా ఏమీ చేయలేమన్నట్లు ఎవరైనా మనల్ని దూరంగా ఉంచాలని మనం కోరుకోం. చిన్నపనులే అయినా చేసి కొంతైనా సహాయపడాలనుకుంటాం. మనం ఇంకా ఏదైనా చేయగలుగుతున్నామంటే మనకెంతో బాగా అనిపిస్తుంది! అది బతికి ఉండడానికి కావాల్సిన ఉత్సాహాన్నిస్తుంది. నన్ను నిర్ణయాలు తీసుకోనిస్తే, నా నిర్ణయాలను గౌరవిస్తే నాకిష్టం. అనారోగ్యంతో ఉన్నా మనం తండ్రిగా, తల్లిగా లేదా మరెవరిగానైనా మన బాధ్యతలను నిర్వర్తించవచ్చు.”

టచ్‌లో ఉండండి

బైబిలు సూత్రం:

‘నిజమైన స్నేహితులు విడువక ప్రేమిస్తారు. దుర్దశలో అలాంటివాళ్లు సహోదరులుగా ఉంటారు.’సామెతలు 17:17.

▪ దూరంలో ఉన్నందుకు లేదా కొన్ని పరిస్థితుల వల్ల మీ స్నేహితుల దగ్గరకు వెళ్లలేకపోతే వాళ్లతో సరదాగా మాట్లాడడానికి ఫోన్‌ చేయవచ్చు, ఉత్తరం రాయవచ్చు లేదా ఈ-మెయిల్‌ పంపించవచ్చు. అయితే ఏ విషయాలు ప్రస్తావిస్తే బావుంటుంది? ఆలెన్‌ డి. ఉల్‌ఫెల్ట్‌ అనే సైకాలజిస్టు ఇలా సలహా ఇస్తున్నాడు, “మీరు సరదాగా గడిపిన సందర్భాలను గుర్తుచేయండి. త్వరలోనే . . . మళ్లీ రాస్తామని మాటివ్వండి. చెప్పినట్టే రాయండి.”

అనరాని మాటలేవైనా అంటామేమోననో లేదా పొరపాట్లు చేస్తామనో అనారోగ్యంతో ఉన్న మీ స్నేహితులను ప్రోత్సహించకుండా ఉండకండి. చాలా సందర్భాల్లో, మీరు వాళ్ల దగ్గర ఉండడమే వాళ్లకు ఎంతో ఓదార్పునివ్వవచ్చు. లారీ హోప్‌ తన పుస్తకంలో ఇలా రాసింది, “మనందరం వేరేవాళ్లు అపార్థం చేసుకోగల లేదా వాళ్లకు ఏవిధంగానైనా బాధ కలిగించగల మాటలు అంటుంటాం, పనులు చేస్తుంటాం. అది పెద్ద సమస్యేమీ కాదు. మనం పొరపాటు చేస్తామేమో అనే భయంతో మన అవసరం ఉన్నవాళ్ల దగ్గరకు వెళ్లకుండా ఉంటేనే అసలు సమస్య మొదలవుతుంది.”

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితులకు ముందు ఎప్పటికన్నా ఇప్పుడే మీ అవసరం ఎక్కువగా ఉంటుంది. మీరు ‘నిజమైన స్నేహితులు’ అని నిరూపించుకోండి. మీరు సహాయం చేయడానికి చేసే ప్రయత్నాలు వాళ్ల బాధను తగ్గించకపోవచ్చు. కానీ, మీరు ప్రేమిస్తున్న వాళ్లు తమ బాధను తట్టుకోవడానికి మీరు తప్పకుండా తోడ్పడగలుగుతారు. (w10-E 07/01)

[అధస్సూచి]

a అసలు పేర్లు కావు.